
సెల్ టవరెక్కిన వీఆర్‌ఏలు
సహనం నశించి ఆందోళన
బలవంతంగా అరెస్టులు
విజయవాడ (మధురానగర్) : డిమాండ్ల సాధన కోసం 45 రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వీఆర్‌ఏలు బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో తమ సమస్యలపై చర్చించలేదని తెలియడంతో సహనం కోల్పోయారు. రాత్రి ఏడు గంటల సమయంలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వీఆర్‌ఏలు గుణదల పవర్‌హౌస్ సమీపంలో ఏలూరు రోడ్డులో ఉన్న సెల్ టవర్ వద్దకు చేరుకున్నారు. వారిలో ఆరుగురు టవర్ ఎక్కడంతో ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యమంత్రి లేదా కలెక్టర్ స్వయంగా వచ్చి తమ సమస్యలపై చర్చించాలని నినాదాలు చేశారు. మహిళా వీఆర్‌ఏలు సైతం సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు.
వారిని బలవంతంగా అక్కడ నుంచి తొలగించేందుకు పోలీసులు ప్రయత్నించారు. వీఆర్‌ఏలు ప్రతిఘటించడంతో సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. అనంతరం ఏసీపీ టి.ప్రభాకర్‌బాబు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. టవర్ దిగిరావాలని పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులు కోరినా వీఆర్‌ఏలు నిరాకరించారు. ముఖ్యమంత్రి, కలెక్టర్ అందుబాటులో లేరని, ఆందోళన విరమించి సహకరించాలని పోలీసులు కోరారు.
వీఆర్‌ఏలు ససేమిరా అనడంతో పోలీసులు వారిని బలవంతంగా వ్యానుల్లోకి ఎక్కించారు. పోలీ సులు ఆందోళనకారులను ఈడ్చుకెళ్లడంతో ఇద్దరు వీఆర్‌ఏలు స్పృహకోల్పోయారు. ఒక వ్యక్తి యూజీడీ హోల్‌లో పడిపోవడంతో పోలీ సులకు, వీఆర్‌ఏలకు వాగ్వాదం జరిగింది. మహిళలను సైతం మగ పోలీసులు తరలించేం దుకు ప్రయత్నించగా ‘ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే మర్యాద’ అంటూ ఆందోళనకారులు రోడ్డుపై పడుకుని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో మహిళా పోలీసులను పిలిపించి వారిని అరెస్టుచేసి వ్యాన్లలోకి ఎక్కించారు.