గ్రామ సేవకులు, అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో డిమాండ్ చేశారు.
వీఆర్‌ఏ, అంగన్‌వాడీల సమస్యల్ని సభలో ప్రస్తావించిన వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: గ్రామ సేవకులు, అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో డిమాండ్ చేశారు. మూడు నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్న గ్రామ సేవకులు తమ గోడును ప్రభుత్వానికి చెప్పుకోవడానికి చలో అసెంబ్లీ తలపెడితే అన్యాయంగా అరెస్ట్ చేశారని సభ దృష్టికి తెచ్చారు. వారి అరెస్ట్‌లను ఖండిస్తూ దీనిపై హోం మంత్రి తక్షణమే ప్రకటన చేయాలని కోరారు. వేతనాల జీవోను మార్చడం వల్ల వీఆర్‌ఏలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అసెంబ్లీ ముట్టడి తలపెడితే 3వేల మందిని అరెస్ట్ చేసి జైళ్లకు తరలించటం భావ్యం కాదన్నారు. సమస్యల పరిష్కారానికి మంగళవారం చలో అసెంబ్లీ తలపెట్టిన వేలాది మంది అంగన్‌వాడీ కార్యకర్తలను హైదరాబాద్ రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో పాటు అరెస్ట్ చేస్తున్నారని జగన్ పేర్కొన్నారు. వీరికి మద్దతుగా సీఐటీయూ నాయకురాలు పుణ్యవతి, మాజీ ఎమ్మెల్యే గఫూర్ తదితరులు నిరాహార దీక్ష చేస్తున్నారని తెలిపారు. హోం మంత్రి చిన రాజప్ప వీరి ఆందోళనను తేలిగ్గా కొట్టిపారేశారు. చలో అసెంబ్లీ అంటే పోలీసులు ఊరుకుంటారా? అరెస్టులు చేస్తారని వ్యాఖ్యానించారు.