
టీచర్లు, హెల్పర్ల ఉద్యోగ విరమణలకు ఏడాది
ఇప్పటివరకు జాడలేని రిటైర్‌మెంట్ బెనిఫిట్ ఉత్తర్వులు
ఆర్థిక సాయం కోసం 7 వేల మందికి పైగా ఎదురుచూపులు
సాక్షి, హైదరాబాద్: అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉద్యోగ విరమణ ప్రక్రియ ఏడాది పూర్తి చేసుకుంది. 65 సంవత్సరాలు పూర్తి చేసుకున్న టీచర్లు, హెల్పర్లను విధుల నుంచి రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ గతేడాది ఏప్రిల్ నుంచి తప్పించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 61 సంవత్సరాల వరకు సర్విసులో కొనసాగుతుండగా, గౌరవ వేతనంతో విధులు నిర్వర్తిస్తు్తన్న అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు మాత్రం 65 సంవత్సరాల వరకు విధుల్లో కొనసాగే అవకాశం ప్రభుత్వం కల్పించింది. వారి సర్విసులకు గుర్తింపుగా ఉద్యోగ విరమణ సమయంలో ప్రత్యేక ప్యాకేజీని గత ప్రభుత్వం ప్రకటించింది.
విరమణ పొందే ప్రతీ అంగన్‌వాడీ టీచర్‌కు రూ.లక్ష, హెల్పర్‌కు రూ.50 వేల ఆర్థిక సాయంతో పాటు సామాజిక పింఛన్ ఇస్తామని చెప్పింది. అయితే ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని టీచర్లు, హెల్పర్లు వ్యతిరేకించారు. కనీసం టీచర్‌కు రూ.2 లక్షలు, హెల్పర్‌కు రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై అప్పట్లో మౌఖికంగా మంత్రి ప్రకటన చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆర్థిక సాయాన్ని రెట్టింపు చేస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటించింది. అయితే ఏడాది దాటినా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడలేదు. ఇదిగో..అదిగో..అంటూ అధికారులు చెబుతున్నా, ఆచరణలో సాధ్యం కాలేదు.
ఏడు వేల మందికి పైమాటే...
గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దాదాపు ఏడు వేల మంది అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు ఉద్యోగ విరమణ చేశారు. ఇందులో మెజారిటీ మంది ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందుకోలేదు. విధుల నుంచి తప్పించినా, ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పట్ల స్పష్టత లేకపోవడంతో అధికారులు సైతం చేతులెత్తేశారు. వీరంతా ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులు, సీడీపీఓలు, జిల్లా సంక్షేమాధికారుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. కనీసం సామాజిక భద్రత పింఛన్ మంజూరు చేయాలని అర్జీ పెట్టుకున్నా, చాలామందికి మంజూరు కాలేదు.
రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు, సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి 5,250 మంది టీచర్లు, 2 వేల మంది హెల్పర్లు ఉద్యోగ విరమణ పొందారు. తాజాగా అంగన్‌వాడీల్లో కొలువుల భర్తీకి సంబంధించిన ఫైల్‌పై మంత్రి సీతక్క ఇటీవల సంతకం చేసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్యాలయానికి పంపారు. సీఎంఓ నుంచి కూడా ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్ వచి్చనట్టు సమాచారం. ఈ ఫైల్‌లో పేర్కొన ఖాళీల్లో గతేడాది నుంచి ఉద్యోగ విరమణతో ఖాళీ అయిన వాటిని కూడా ప్రకటించారు. కొత్తగా ఆయా పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నా, ఉద్యోగ విరమణ పొందిన వారికి ఆర్థిక సాయం అందించకపోవడం సరికాదని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. తక్షణమే ఆర్థిక సాయం చేయాలని కోరుతోంది.