అంగన్‌వాడీల్లో రిటైర్‌మెంట్‌ లొల్లి! | TS Govt Makes Retirement Compulsory After 65 Years: Anganwadi Teachers | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల్లో రిటైర్‌మెంట్‌ లొల్లి!

Published Mon, Jul 1 2024 6:16 AM | Last Updated on Mon, Jul 1 2024 9:02 AM

TS Govt makes retirement compulsory after 65 years: Anganwadi teachers

65 ఏళ్లు దాటితే పదవీ విరమణ తప్పనిసరన్న ప్రభుత్వం 

విధులకు రావొద్దని అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు స్పష్టీకరణ 

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ 

రిటైర్మెంట్‌ ప్యాకేజీలో భాగంగా టీచర్‌కు రూ.లక్ష, 

హెల్పర్‌కు రూ. 50 వేలు ఇస్తామన్న సర్కారు 

ప్యాకేజీ పెంచకుండా రిటైర్మెంట్‌ కుదరదంటున్న సంఘాలు

సాక్షి, హైదరాబాద్‌: అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణను రాష్ట్ర ప్రభుత్వం కఠినతరం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 30 నాటికి 65 ఏళ్లు పూర్తి చేసుకున్న టీచర్లు, హెల్పర్లు తప్పకుండా రిటైరవ్వాలని ఆదేశించింది. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ సంచాలకులు నిర్మల కాంతి వెస్లీ తరఫున సంయుక్త సంచాలకులు కేఆర్‌ఎస్‌ లక్ష్మీదేవి మెమో విడుదల చేశారు. ఈ మెమోను రాష్ట్రవ్యాప్తంగా జిల్లా సంక్షేమాధికారులు, సీడీపీఓలు, ప్రాంతీయ సంయుక్త సంచాలకులకు ఆదివారం పంపించారు. 

ప్యాకేజీపై పెదవి విరుపు.. 
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రిటైర్మెంట్‌ ప్యాకేజీపై అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు పెదవి విరుస్తున్నారు. పదవీ విరమణ ప్యాకేజీ కింద అంగన్‌వాడీ టీచర్లకు రూ. లక్ష, హెల్పర్లకు రూ. 50 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు గత ప్రభుత్వం జీఓ 10ని జారీ చేసింది. అయితే దీనిపై అప్పట్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో ప్యాకేజీపై మార్పులు చేస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇవ్వడంతో నిరసన కార్యక్రమాలు సద్దుమనిగాయి. తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ప్యాకేజీ సవరణల ఊసు లేదు. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి పదవీవిరమణ ప్రక్రియ అమల్లోకి వచి్చంది.

ఈ ఏడాది ఏప్రిల్‌ 30 నాటికి 65 ఏళ్లు నిండిన వారు విధుల నుంచి తప్పుకోవాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సూచించింది. అదేవిధంగా 65 ఏళ్లు పైబడిన అంగన్‌వాడీ టీచర్, హెల్పర్‌ సమాచారాన్ని అంగన్‌వాడీల యాప్‌ (ఎన్‌హెచ్‌టీఎస్‌–ఈఎంఎస్‌) నుంచి కూడా తొలగించాలని ఆదేశించింది. దీనిపై అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిటైర్మెంట్‌ ప్యాకేజీని మార్పు చేయాలని కోరుతూ ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు విధుల నుంచి తప్పుకోబోమని చెబుతున్నారు. ఈ అంశంపై త్వరలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్‌ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించనున్నట్లు చెబుతున్నారు.

టీచర్‌కు రూ.2లక్షలు, హెల్పర్‌కు రూ.లక్ష ఇవ్వాలి 
అంగన్‌వాడీ టీచర్, హెల్పర్లు సగటున 30–40 ఏళ్లపాటు సేవలందించి 65 ఏళ్లకు పదవీ విరమణ పొందుతున్నారు. అంతకాలం సేవలందించే వారికి ప్రభుత్వం అత్తెసరు ఆర్థిక సాయం ఇవ్వాలనుకోవడం సరికాదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆర్థిక సాయంలో మార్పులు చేయాలి. కనీసం అంగన్‌వాడీ టీచర్‌కు రూ. 2 లక్షలు, హెల్పర్‌కు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించాలి. అప్పటివరకు పదవీ విరమణ పొందకుండా విధులు నిర్వహించేందుకు అంగీకరించాలి. దీనిపై ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనకు దిగుతాం. – ఎం.సాయిశ్వరి, రాష్ట్ర అధ్యక్షురాలు, అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్‌ యూనియన్‌  

నాటి హామీలు ఏమయ్యాయి? 
గౌరవవేతనం పెంపు కోసం గతేడాది మేం సమ్మె చేస్తున్న సమయంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక గౌరవ వేతనాలు పెంచడంతోపాటు పదవీ విరమణ ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తున్నా వేతన పెంపు, రిటైర్మెంట్‌ ప్యాకేజీ మాటెత్తడం లేదు.  – పి.రజిత, అంగన్‌వాడీ టీచర్, కరీంనగర్‌

ప్రభుత్వం స్పందించకుంటే తదుపరి కార్యాచరణ 
అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు మెరుగైన పదవీవిరమణ ప్యాకేజీ ఇస్తామని, వేతనాలు కూడా పెంచుతామని అప్పట్లో సమ్మె చేసిన చోటుకు వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ నేతలు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు వారు పట్టించుకోవడం లేదు. టీచర్లకు రూ. 18 వేలు జీతం ఇస్తామని, రిటైర్మెంట్‌ ప్యాకేజీ రెట్టింపు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినప్పటికీ అమల్లోకి రాలేదు.      – టేకుమల్ల సమ్మయ్య, 
రాష్ట్ర అధ్యక్షుడు, ఏఐటీయూసీ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement