రిటైర్మెంట్ ప్యాకేజీపై త్వరలో ఉత్తర్వులు: మంత్రి సీతక్క
సాక్షి, హైదరాబాద్, రహమత్‌నగర్: పదవీ విరమణ పొందే అంగన్ వాడీ టీచర్లకు రూ. రెండు లక్షలు, ఆయాలకు (హెల్పర్లు) రూ.లక్ష రిటైర్మెంట్ ప్యాకేజీని పంచాయతీరాజ్, మహిళా సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ప్రకటించారు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ఫైల్ క్లియర్ చేసిందని, రెండు మూడు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడుతాయని చెప్పారు.
జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని రహమాత్ నగర్ డివిజన్‌లో అమ్మ మాట – అంగన్ వాడీ బాట కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మంత్రి సీతక్క ఇకపై అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆంగ్ల భాష బోధనా విధానం ప్రవేశపెడతామని వెల్లడించారు. ఆయా కేంద్రాల్లో విద్యార్ధులకు యూనిఫామ్స్, ఆట వస్తువులు అందించనున్నట్లు తెలిపారు.
కార్పొరేట్ స్కూళ్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్న అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లలను చేర్చించాలని తల్లి దండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చిన్నారుల చేత మంత్రి సీతక్క మొక్కలు నాటించారు. మై ప్లాంట్ మై ఫ్యూచర్ అని చిన్నారులతో పలికించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్ కాంతి వెస్లీ. రహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి పాల్గొన్నారు.
మహిళా రైతులకు 50 శాతం రాయితీపై పరిశీలన: సీతక్క
సాగు భూమి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీలో మహిళా రైతులకు 50 శాతం రాయితీ ఇచ్చే అంశాన్ని ప్రభు త్వం పరిశీలిస్తోందని మంత్రి ధనసరి అనసూయ సీతక్క వెల్లడించారు. మంగళవారం ప్రజా భవన్‌లో మంత్రితో మహిళా రైతుల హక్కుల సాధనకు కృషిచేస్తున్న ‘మహిళా కిసాన్ అధికార్ మంచ్’ (మకామ్) ప్రతినిధులు డా. ఉషా సీతా మహాలక్ష్మి, డా. వి రుక్మిణి రావు, ఎస్. ఆశాలత సమావేశమయ్యారు.
మహిళలకు భూ యాజ మాన్య హక్కులు కల్పించేలా చర్యలు చేపట్టాలని వారు సమర్పించిన వినతి పత్రంపై మంత్రి సానుకూలంగా స్పందించారు. రైతు భరోసా పథకాన్ని పదెకరాల వరకే అమలు చేయాలన్న డిమాండ్ ఊపందుకున్న నేపథ్యంలో.. కుటుంబ సభ్యుల మధ్య భూ పంపకాలు జరిగే అవకాశా లున్నాయని ’మకాం’ ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
పెళ్లికాని కుమార్తెలు, ఒంటరి మహిళలు, గృహిణుల పేర్లపై భూ రిజిస్ట్రేషన్లు పెంచేలా.. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీలో మహిళలకి రాయితీ ఇవ్వాలని సూచించారు. ఈ అంశాలను సీఎం, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సాగు భూమి రిజిస్ట్రేషన్ల చార్జీలో 50 శాతం రాయితీలు ఇస్తూ విధాన పరమైన నిర్ణయం తీసుకునేందుకు ప్రయ త్నిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment