
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్లు, హెల్పర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు. ఒకట్రెండు రోజుల్లో ఈ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్ద ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించనున్నట్లు సమాచారం.
ముఖ్యమంత్రి వద్ద కూడా ఈ ఫైలుకు వేగంగా పరిష్కారం లభిస్తుందని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ విభాగంలో మొత్తం 14,236 పోస్టులు ఖాళీగా ఉండగా వాటిలో అంగన్‌వాడీ టీచర్ పోస్టులు 6,399, అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులు 7,837 ఖాళీగా ఉన్నట్లు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ లెక్కగట్టింది.
‘కోడ్’ ముగిశాక నియామక ప్రక్రియ...
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35,700 అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా ప్రీ ప్రైమరీ విద్యను కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది. అయితే అంగన్‌వాడీల్లో ఖాళీలుంటే నిర్దేశించుకున్న లక్ష్యాల అమలు కష్టసాధ్యం అవుతుందన్న ఉద్దేశంతో ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖకు సూచించింది. దీంతో పదవీవిరమణకు అర్హత సాధించిన వారు, పదోన్నతికి అర్హత ఉన్న వారితోపాటు కేటగిరీలవారీగా ఖాళీలను లెక్కించి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది.
ప్రస్తుతం ఏడు ఉమ్మడి జిల్లాల పరిధిలో అమల్లో ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమాళి వచ్చే నెల తొలివారం వరకు కొనసాగనుంది. దీంతో కోడ్ ముగిశాక నియామక నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలవారీగా ఖాళీలను ఖరారు చేశాక వాటిని ఆయా జిల్లా కలెక్టర్లకు పంపేలా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపట్టనుంది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడతాయి. గతంలో ఈ పోస్టులను భర్తీ చేసినప్పటికీ వేల సంఖ్యలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ పోస్టులను భర్తీ చేయడం ఇదే తొలిసారి.
Comments
Please login to add a commentAdd a comment