మహిళ పరిపూర్ణ ఆరోగ్యమే ధ్యేయంగా ‘శుక్రవారం సభ’
కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి వినూత్న కార్యక్రమం
పిల్లల మానసిక వికాసానికి అంగన్‌వాడీల బలోపేతంపై దృష్టి
నేటి కాలంలో ఆడపిల్ల కడుపున పడినప్పటి నుంచీ కష్టాలే. ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్లు చేయించుకోవడం నుంచి కిశోర బాలికలకు, బాలింతలకు పోషకాహారం అందకపోవడం దాకా ఎన్నో సమస్యలు. మహిళలు కేన్సర్లు సహా ఎన్నో శారీరక రుగ్మతలకు లోనైనా కప్పిపుచ్చుకుంటూ జీవిస్తున్న పరిస్థితి. పిల్లలను అంగన్‌వాడీలకు పంపడం లేదు. తెలియక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు.
వారు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు. ఈ సమస్యలను పరిష్కరించేలా, మహిళల్లో అవగాహన కల్పించేలా కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, ప్రభుత్వ ఆస్పత్రులు, స్వయం సహాయక సంఘాలను ఒకే తాటిపై తీసుకువచ్చారు. ‘శుక్రవారం సభ’పేరిట ప్రభుత్వ సేవలపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, కరీంనగర్
ముందు మా సేవలు చూడండి
నేటి కాలంలో మహిళలు కూడా ఏదో ఒక పనిచేస్తున్నారు. పిల్లలను ప్రైవేటు బడులకు పంపుతున్నారు. అనారోగ్యమొస్తే ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు. ఈ క్రమంలో ‘ప్రభుత్వ పథకాలను ఆసరాగా చేసుకుని ఎదగండి. చిన్నారులకు అంగన్‌వాడీలలో అందించే బాలామృతం, కిశోర బాలికలకు రక్తహీనతను తగ్గించే పోషకాహారం, బాలింతలకు బలవర్ధకమైన ఆహారం, మధ్య వయసు స్త్రీలకు ప్రతీ 3 నెలలకోసారి ప్రభుత్వ ఆస్పత్రిలో ‘ఆరోగ్య మహిళ’ పేరిట లభించే 52 ఉచిత పరీక్షల వివరాలు తెలుసుకోండి.
ఈ సేవలన్నీ ప్రభుత్వం వద్ద ఉచితంగా అందుతాయి..’అంటూ ‘శుక్రవారం సభ’పేరిట వారానికి ఒక మండలంలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అక్కడే గర్భవతులకు సీమంతం, బాలింతలకు పోషకాహార పంపిణీ వంటివాటిని కలెక్టర్ స్వయంగా చేపడుతుండటం గమనార్హం.
పీసీవోడీ, కేన్సర్, భ్రూణహత్యలపైనా..
నడి వయసు మహిళలకు ఆరోగ్య మహిళా పథకం ద్వారా పీసీవోడీ (గర్భాశయంలో కణతులు), కేన్సర్ నిర్ధారిత పరీక్షలు నిర్వహిస్తారు. వాటి ముప్పును ముందుగా గుర్తించడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చని.. అవే పరీక్షలు, చికిత్సలు ప్రైవేటులో చేస్తే రూ.లక్షల ఖర్చు అవుతుందని, ప్రభుత్వం ఉచితంగా చేయిస్తుందని కలెక్టర్ సత్పతి మహిళలకు భరోసా కల్పిస్తున్నారు. మహిళలు తీవ్ర అనారోగ్యాల పాలైతే వారి కుటుంబాలు ఆగమవుతాయని సూచిస్తున్నారు.
పిల్లల మానసిక వికాసానికి వీలుగా అంగన్‌వాడీలను ఆహ్లాద వాతావరణం ఉండేలా మారుస్తున్నారు. భ్రూణహత్యలను అరికట్టేలా మహిళల్లో చైతన్యం కల్పిస్తున్నారు.
పోషకాహారం ప్రాధాన్యం తెలిసింది..
కలెక్టర్ సత్పతి మేడం మొదలుపెట్టిన శుక్రవారం సభ మాలో చైతన్యం తెచ్చింది. బాలింతలకు, గర్భవతుల సంక్షేమం కోసం మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. మాలో రక్తహీనత నివారించేలా అవగాహన కల్పించారు. తల్లి పాల ప్రాముఖ్యత, అంగన్‌వాడీలలో లభించే సేవల గురించి చక్కగా వివరించారు. –అనిత, గృహిణి, వెంకట్రావుపల్లి, హుజూరాబాద్
కేన్సర్ ముప్పు గురించి చెప్పారు
కలెక్టర్ మేడం పీసీవోడీ, కేన్సర్ ఎలా వస్తాయో వివరించారు. మా ముందు తరాల వారు పనిలో పడి ఎలాంటి పరీక్షలు చేయించుకోకుండా ప్రాణాలు పొగొట్టుకున్నారు. కలెక్టర్ మేడం తల్లిలా మాపై శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆడపిల్లల ప్రాధాన్యం వివరించి భ్రూణహత్యల నివారణపైనా అవగాహన కల్పించారు. – అఖిల, గృహిణి, వెంకట్రావుపల్లి, హుజూరాబాద్
Comments
Please login to add a commentAdd a comment