అంగన్‌వాడీల్లో సమ్మె సైరన్‌! | Anganwadi Call For Indefinite Strike From September 11 | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల్లో సమ్మె సైరన్‌!

Published Fri, Sep 1 2023 3:08 AM | Last Updated on Fri, Sep 1 2023 3:44 AM

Anganwadi Call For Indefinite Strike From September 11  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు సమ్మెకు సిద్ధమవుతున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన రిటైర్మెంట్‌ పాలసీ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న యూనియన్‌ నేతలు... విధులు బహిష్కరించి ఉద్యమానికి ఉపక్రమిస్తున్నారు. ఈ నెల 11 నుంచి నిరవధిక సమ్మె నిర్వహించనున్నట్లు తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌కు సమ్మె నోటీసు ఇచ్చింది. సమ్మె తేదీ కంటే ముందుగానే డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ల చిట్టాను సమర్పించింది. 

చర్చలకు విరుద్ధంగా రిటైర్మెంట్‌ పాలసీ... 
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు సంబంధించి పదవీ విరమణ ప్యాకేజీని ప్రకటించింది. 65 ఏళ్ల వయసును రిటైర్మెంట్‌ ఏజ్‌గా ఖరారు చేసిన ప్రభుత్వం... పదవీ విరమణ పొందిన టీచర్‌కు రూ.లక్ష, హెల్పర్‌కు రూ.50వేలు చొప్పున ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. రిటైర్మెంట్‌ అయిన వెంటనే టీచర్‌ లేదా హెల్పర్‌కు ఆసరా పెన్షన్‌ జారీ చేయనుంది. 

ఇందుకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గతవారం సంతకం చేయగా... అతి త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల డిమాండ్‌కు పూర్తి విరుద్ధంగా ఉందంటూ అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్‌ యూనియన్లు  ధ్వజమెత్తుతున్నాయి. 

హామీలకు.. అమలుకు పొంతన లేదు 
అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల డిమాండ్లపై గత నెలలో మంత్రి సత్యవతి రాథోడ్‌ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘ నేతలు పలు డిమాండ్లు మంత్రి ముందు ఉంచారు. ఈ క్రమంలో చర్చించి కొన్ని హామీలు ఇవ్వగా... ఇటీవల సీఎం సంతకం చేసిన ఫైలులోని అంశాలపై ఏమాత్రం పొంతన లేదంటూ యూనియన్‌ నేతలు మండిపడుతున్నారు. మంత్రితో చర్చలు జరిపినప్పుడు టీచర్‌కు రూ.2లక్షలు, హెల్పర్‌కు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చెప్పారని, కానీ ఇప్పుడు అందులో సగానికి కోత పెట్టారంటూ యూనియన్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

ప్రధాన డిమాండ్లు ఇవీ... 

  • అంగన్‌వాడీ టీచర్ల వేతనం రూ.26వేలుగా నిర్ధారించాలి
  • విరమణ వయసు 60 ఏళ్లకు కుదించాలి
  • విరమణ పొందిన టీచర్‌కు రూ.10 లక్షలు, హెల్పర్‌కు రూ.5లక్షలు ఇవ్వాలి
  • రిటైర్మెంట్‌ నాటికి తీసుకునే వేతనంలో సగం మేర పెన్షన్‌గా ఇవ్వాలి
  • సీనియారిటీ ఆధారంగా వేతనాలను పెంపుతో పాటు ఇంక్రిమెంట్లు ఇవ్వాలి
  • ఐసీడీఎస్‌ పథకానికి నిధులు పెంచి మరింత బలోపేతం చేయాలి.
  • కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను యుద్దప్రాతిపదికన పరిష్కరించాలి
  • సమాచార నమోదు కోసం కేంద్ర, రాష్ట్రాలు తెచ్చిన యాప్‌ల విషయాన్ని పరిశీలించాలి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement