Women Development and Child Welfare Department
-
పప్పు.. పాలు.. గుడ్లు.. టెండర్ల ఖరారు ఎలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాల కింద సరుకుల పంపణీకి కాంట్రాక్టర్ల ఎంపిక అధికార యంత్రాంగానికి ప్రహసనంగా మారింది. టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లను ఖరారు చేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇందుకు ప్రధాన కారణం టెండరులో పాల్గొంటున్న బిడ్డర్లు అత్యధిక ధరలు కోట్ చేయడమే. బిడ్డర్లు కుమ్మక్కై వాస్తవ ధరల కంటే అత్యధిక ధరలను కోట్ చేస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న తీరును అధికారులు గుర్తించడంతో కాంట్రాక్టరు ఎంపిక వాయిదా పడుతూ వస్తోంది. దాదాపు రెండు నెలలుగా ఒక్క టెండరు సైతం ఖరారు కాలేదు. వన్.. టూ.. త్రీ.. అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన గర్భిణులు, బాలింతలు, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు ఉన్న చిన్నారులకు ఆరోగ్యలక్ష్మి తదితర పోషకాహార కార్యక్రమాల్లో భాగంగా పాలు, కోడి గుడ్లు, కందిపప్పును వివిధ రూపాల్లో అందిస్తున్నారు. సంపూర్ణ పోషకాహారం కింద పాలను, గుడ్లను నేరుగా అందిస్తుండగా... ఫుల్ మీల్స్‌లో భాగంగా కందిపప్పుతో కూడిన కూరలతో భోజనాన్ని ఇస్తున్నారు. ఈ పథకాలకు అవసరమైన పాలు, గుడ్లు, కందిపప్పును సరఫరా చేసేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కాంట్రాక్టర్లను ఎంపిక చేస్తుంది.మూడు లేదా ఆరు నెలల పాటు ఈ కాంట్రాక్టును అప్పగించి సరుకులను స్వీకరిస్తుంది. తక్కువ ధరల కోసం.. ఈ క్రమంలో మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలో సరుకుల కొనుగోలు లక్ష్యంగా రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు చేపట్టింది. కానీ ఇందులో పాల్గొంటున్న వారంతా మార్కెట్ ధర కంటే అత్యధిక ధరలను కోట్ చేస్తూ రావడంతో సర్కారు ఖజానాకు భారీగా గండి పడుతుందన్న భావనతో ఆ శాఖ టెండర్లను రద్దు చేస్తూ వస్తోంది. ► అంగన్వాడీ కేంద్రాలకు పాల సరఫరా కోసం ఈ ఏడాది మార్చిలో మొదటిసారి, ఏప్రిల్ మొదటి వారంలో రెండోసారి టెండరు పిలిచారు. కానీ అందులో పాల్గొన్న సంస్థలు నిబంధనలకు సరితూగలేదు. దీంతో రెండు టెండర్ల ద్వారా అర్హులు ఎంపిక కాకపోవడంతో మరో టెండరు పిలవాల్సి వచి్చంది. ఈ క్రమంలో పాల పంపిణీకి ఇబ్బందులు కలగకుండా ఇప్పటివరకు పంపిణీ చేసిన సంస్థకు పాత ధరలోనే పంపిణీ చేసేలా అవకాశమిస్తూ ఆర్నెళ్లకు పొడిగిస్తూ రాష్ట్ర మహిళాభివృద్ధి,శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సెపె్టంబర్ వరకు పంపిణీకి అవకాశం దక్కినట్లయింది. ► కందిపప్పు పంపిణీకి మార్చి నెలాఖరులోనే టెండరు పిలిచింది. గత టెండరు సమయంలో కిలోకు రూ.114 చొప్పున పంపిణీ చేయగా... ఈ సారి టెండర్లు ఓ కనిష్ట ధర(ఎల్–1)ను రూ.145 కోట్ చేసింది. ఇక గరిష్ట ధర కింద ఏకంగా రూ.175 చొప్పున కోట్ చేశారు. గత ధర కంటే భారీగా ధరలు పెంచిన కారణంగా ఆ టెండరును రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రద్దు చేసింది. కొత్తగా మరో టెండరును పిలిచినప్పటికీ ధరలు ఆదే స్థాయిలో ఉండడంతో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ► కోడిగుడ్ల పంపిణీకి సంబంధించిన టెండరులో జిల్లాల వారీగా పంపిణీ దారుల ఎంపికకు టెండరు పిలిచింది. దీనిపై పలు పౌల్ట్రీ సంస్థల యజమానులు న్యాయపోరాటానికి ఉపక్రమించారు. కోర్టు కేసులు నమోదు చేయగా... కొన్నాళ్లుగా ఎంపిక ప్రక్రియ ముందుకు కదల్లేదు. తాజాగా వీటన్నింటినీ పరిష్కరించి కాంట్రాక్టర్లను ఎంపిక చేసేందుకు సీఎం కార్యాలయాధికారులతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆ పోస్టులకు ఏజ్ భారమైంది! వైద్య విద్య విభాగంలో ‘వయో పరిమితి’సంక్షోభం -
Telangana: అంగన్వాడీ పోస్టుల భర్తీలో గోల్మాల్.. ఈ ప్రశ్నలకు బదులేది?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో నిబంధనలు పాటించకుండా అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోస్టర్ పాటింపులో గందరగోళం తలెత్తిందని, మరోవైపు ఇన్స్ట్రక్టర్లకు రిజర్వ్ చేసిన పోస్టులను ఇతరులతో భర్తీ చేశారని, దివ్యాంగుల కోటాలోనూ అనర్హులను ఎంపిక చేశారంటూ అభ్యర్థులు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ ఎదుట నిరసనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇతరుల ప్రవేశానికి అనుమతి ఇవ్వకుండా కమిషనరేట్ అధికారులు సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. 434 పోస్టులకి వేలల్లో దరఖాస్తులు ►రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో 434 గ్రేడ్–2 సూపర్వైజర్(ఎక్స్టెన్షన్ ఆఫీసర్) పోస్టులకు గతేడాది సెప్టెంబర్ 30న ఆ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులను కొత్త వారితో కాకుండా ఇప్పటికే అంగన్వాడీల్లో టీచర్లుగా పనిచేస్తూ పదేళ్ల అనుభవం ఉండి పదోతరగతి ఉత్తీర్ణులైన వారికి అవకాశం కల్పించింది. ఈ పోస్టుల్లో 5 శాతం కోటాను అంగన్వాడీ ట్రైనింగ్ సెంటర్లు, మిడిల్ లెవల్ ట్రైనింగ్ సెంటర్లో పనిచేస్తున్న కోఆర్డినేటర్లు/ఇన్స్ట్రక్టర్లకు రిజర్వ్ చేయగా... మరో 15 శాతం మార్కులను ఇప్పటికే కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న సూపర్వైజర్లకు కేటాయించింది. కానీ కాంట్రా క్టు సూపర్వైజర్ ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరించడంతో వారంతా ఈ నోటిఫికేషన్ పరిధిలోకి రాకుండానే ప్రభుత్వ కొలువుల్లో చేరిపోయారు. ఇక నోటిఫికేషన్ వెలువడిన క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 23వేల మంది అంగన్వాడీ టీచర్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈ ఏడాది జనవరి రెండో తేదీన అర్హత పరీక్ష నిర్వహించిన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ... ఫిబ్రవరిలో ఫలితాలను ప్రకటించింది. ఆ తర్వాత మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాలను రూపొందించి ప్రాథమిక అర్హుల జాబితా అనంతరం... ఇటీవల తుది జాబితాను విడుదల చేసి వారికి పోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే తుది జాబితాలో నిబంధనలు పాటించకుండా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన తీరుపై విమర్శలు చెలరేగుతున్నాయి. ►మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో మొత్తం 434 పోస్టులకు హైదరాబాద్, వరంగల్ రీజియన్లు వేరువేరుగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. మొత్తం పోస్టుల్లో 427 పోస్టులు భర్తీ అయ్యాయి. 7 పోస్టులకు అభ్యర్థులు లేకపోవడంతో ఖాళీగా ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు. భర్తీ చేసిన 427 పోస్టుల్లో 15 మంది ఇన్స్ట్రక్టర్లకు అవకాశం కల్పించారు. ►5 శాతం పోస్టులను ఇన్స్ట్రక్టర్లు/కోఆర్డినేటర్లకు అవకాశం కల్పిస్తున్నట్లు నోటిఫికేషన్లో ప్రకటించారు. ఈ క్రమంలో సగటున 22 పోస్టులు ఇన్స్ట్రక్టర్లు/కోఆర్డినేటర్లకు దక్కాల్సి ఉండగా... కేవలం 15 పోస్టులతోనే సరిపెట్టారు. అయితే రిజర్వ్ చేసిన పోస్టులను కమ్యూనిటీ రిజర్వేషన్లతో భర్తీ చేయడం.. పలు అనుమానాలకు తావిచ్చినట్లయింది. ►కొన్నిచోట్ల కమ్యూనిటీ రిజర్వేషన్ల వారీగా మెరిట్‌ను పరిశీలిస్తే తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థి అర్హత సాధించగా... అదే కేటగిరీకి చెందిన మరో అభ్యర్థికి ఎక్కువ మార్కులు వచ్చినా ఉద్యోగం రాలేదు. ఉదాహరణకు జోన్–7 పరిధిలో ఎస్సీ కేటగిరీకి చెందిన అభ్యర్థికి 10.125 మార్కులు వచ్చినప్పటికీ ఉద్యోగం వచ్చింది. కానీ అదే ఎస్సీ కేటగిరీకి చెందిన అభ్యర్థికి 13.125 మార్కులు వచ్చినా కొలువు దక్కలేదు. ►ఇక ఖమ్మం జిల్లాలోని ఓ అభ్యర్థి దరఖాస్తులో వైకల్యం లేదని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ సదరు అభ్యర్థికి దివ్యాంగుల కోటాలో ఉద్యోగం దక్కింది. వాస్తవానికి వైకల్యం ఉన్న అభ్యర్థికి కొలువు రాలేదు. మహబూబ్‌నగర్, వికారాబాద్ తదితర జిల్లాల్లో కూడా దివ్యాంగులైన అభ్యర్థులకు అవకాశం రాలేదంటూ లబోదిబోమంటున్నారు. ►కాగా నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగానే పోస్టుల భర్తీ జరిగిందని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
గ్రేడ్–2 సూపర్వైజర్లు వచ్చేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో గ్రేడ్–2 సూపర్ వైజర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. అర్హత పరీక్ష ఫలితాల విడుదల తర్వాత కోర్టు కేసులతో వివిధ దశల్లో నిలిచి తీవ్ర ఉత్కంఠకు గురి చేసిన నియామకాల ప్రక్రియ సుఖాంతమైంది. నోటిఫికేషన్లో నిర్దేశించిన కోటాలో నూరుశాతం కొలువులు భర్తీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 426 మంది గ్రేడ్–2 సూపర్వైజర్ పోస్టులు దక్కించుకోగా... ఆదివారం సెలవు రోజైనప్పటికీ పలువురికి నియామక పత్రాలు జారీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో సూపర్వైజర్ల పాత్ర అత్యంత కీలకం. కేంద్రాల నిర్వహణలో అటు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ఇటు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు మధ్య వారధి పాత్రను పోషిస్తారు. ఎనిమిది నెలల జాప్యానికి తెర గతేడాది నవంబర్‌లో రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు, సంక్షేమ శాఖ పరిధిలో 426 అంగన్వాడీ సూపర్వైజర్ కొలువులకు ఆ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టుల్లో కొత్త అభ్యర్థులను కాకుండా ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లుగా పనిచేస్తున్న వారికే అవకాశం కల్పించింది. పదోతరగతి అర్హత, పదేళ్ల సర్వీసు ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించిన ఆ శాఖ... ఈ ఏడాది జనవరి మొదటి వారంలో అర్హత పరీక్ష నిర్వహించింది. ఫిబ్రవరిలో ఫలితాలు విడుదల చేసి ప్రాథమిక ఎంపిక జాబితాలను రూపొందించిన యంత్రాంగం.. చివరకు 1:2నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి ఆయా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన తదితర కార్యకలాపాలను పూర్తి చేసింది. అయితే నియామకాల విషయంలో తమకు అన్యాయం జరిగిందని కొందరు, పనిచేస్తున్న జోన్లోనే పోస్టింగ్ ఇవ్వాలని మరికొందరు న్యాయ పోరాటానికి దిగారు. దీంతో ఈ ఏడాది మార్చిలో పూర్తి కావాల్సిన నియామకాల ప్రక్రియలో ఏకంగా ఎనిమిది నెలల పాటు జాప్యం జరిగింది. నేటి నుంచే విధుల్లోకి తాజాగా కోర్టు తీర్పు ఇవ్వడంతో అందుకు లోబడి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నియామకాల ప్రక్రియను పూర్తి చేసింది. శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎంపికైన అభ్యర్థుల జాబితాలను అధికారులు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వెబ్సైట్లో అందుబాటులో పెట్టారు. ఈ క్రమంలో ఆదివారం పలువురు అభ్యర్థులు పోస్టింగ్ ఉత్తర్వులు అందుకున్నారు. వీరంతా సోమవారం విధుల్లో చేరిపోనున్నారు. -
మహిళలకు మరింత చేరువగా ‘సఖి’
సాక్షి, హైదరాబాద్: వన్‌స్టాప్ సెంటర్(సఖి) ఆపదలో ఉన్న మహిళను అన్నివిధాలా ఆదుకునే చోటు. గృహహింస, వేధింపులు, దాడులు, ప్రమాదాలకు గురైన మహిళకు తక్షణవైద్యం, న్యాయ, ఆర్థికసాయం అందించే కేంద్రం. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ఈ కేంద్రాలను మహిళలకు మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కసరత్తు చేస్తోంది. మహిళలపై దాడులు, అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కేంద్రం ద్వారా అందించే సేవలను విస్తృతపర్చాలని అధికారులు నిర్ణయించారు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో కొనసాగే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2017లో ప్రారంభించింది. ఇందులో భాగంగా విడతలవారీగా ఈ కేంద్రాలను తెరుస్తూ 2019 చివరినాటికి అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసింది. వాస్తవానికి రాష్ట్రంలో 36 కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయగా, ఇప్పటివరకు 33 కేంద్రాలను మాత్రమే ప్రారంభించారు. మిగతా కేంద్రాల ఏర్పాటు వివిధ దశల్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆవశ్యకతను బట్టి కొత్త కేంద్రాలు రాష్ట్రంలో కొత్తగా సఖి కేంద్రాల ఏర్పాటుపై రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోంది. మహిళలపై దాడులు జరుగు తున్న ప్రాంతాలపై అధికారులు అధ్యయనం చేసి ఎక్కడెక్కడ మహిళలకు అవసరమైన సేవలు అందించవచ్చో పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ప్రతి జిల్లాకేంద్రంలో ఒక సఖి కేంద్రం కొనసాగుతోంది. అయితే జిల్లా కేంద్రానికి రావాలంటే ఎన్నో వ్యయప్రయాసలకు గురికావాల్సి వస్తోందని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ మహిళలకు చేరువలో ఈ కేంద్రాలుండే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో మరిన్ని సఖి కేంద్రాల ఏర్పాటుకు ఇటీవల కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపింది. ప్రతిజిల్లాకు మరోకేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని అందులో ప్రస్తావించింది. ఈ ప్రతిపాదనలకు కేంద్రం సైతం సుముఖత వ్యక్తం చేసింది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాంతీయ సమావేశంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి సైతం ఈ అంశాన్ని అధికారులు వివరించగా ఆమె తక్షణమే సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం కోరినన్ని వన్‌స్టాప్ సెంటర్లను మంజూరు చేస్తామని, మహిళల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పక్షంరోజుల్లో పక్కా ప్రణాళికతో సఖి కేంద్రాల ఏర్పాటుపై పూర్తిస్థాయి ప్రతిపాదనలు పంపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేంద్రం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే వీటి ఏర్పాటును వేగిరం చేయాలని అధికారులు భావిస్తున్నారు. -
TS: రాష్ట్రంలో అనాథ వసతిగృహాలెన్ని?
సాక్షి, హైదరాబాద్: అనాథల సంరక్షణ, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక పాలసీని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సుదీర్ఘ అధ్యయనం చేసి సలహాలు, సూచనలతో కూడిన నివేదిక ఇవ్వాలంటూ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో అనాథల వసతిగృహాలు, అనాథల లెక్క తేల్చే పనిలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నిమగ్నమైంది. అధికారిక లెక్కల ప్రకారంరాష్ట్రవ్యాప్తంగా 57 అనాథ వసతిగృహాలు నమోదయ్యాయి. మరో 2 వందల వరకు అనధికారికంగా కొనసాగుతున్నట్లు అధికారుల అంచనా. వీటి పరిధిలో దాదాపు 34 వేల మంది పిల్లలున్నారు. అయితే వీరిలో పాక్షిక, పూర్తి అనాథులున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో వసతిగృహాల గుర్తింపు, పిల్లల లెక్కలను కచ్చితంగా తేల్చేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కమిటీ వసతిగృహాలను సందర్శించి పిల్లల సంఖ్యను నిర్ధారించనుంది. ఇలా గుర్తించిన పిల్లలకు స్మార్ట్‌కార్డులు ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వనికి సూచించింది. పట్టణ ప్రాంతాల్లోనే అత్యధికం... రాష్ట్రంలో కొనసాగుతున్న అనాథ వసతిగృహాలు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. స్వచ్ఛందసంస్థలు నిర్వహించే వసతిగృహాలకు ప్రభుత్వ గుర్తింపు ఉండగా, స్వతంత్రులు నిర్వహించేవాటికి మాత్రం గుర్తింపు లేదు. రాష్ట్రంలోని అనాథ వసతిగృహాల్లో 80 శాతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చ ల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చేవారంలో మార్గదర్శకాలు జారీ చేసిన తర్వాత జిల్లాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసి అనాథల లెక్కింపు ప్రక్రియను వేగవంతం చేసేలా రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది. అనాథ వసతిగృహాలను సందర్శించి తనిఖీలు చేసే కమిటీలు వసతిగృహం నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలు(ట్రాక్ రికార్డు)ను క్షుణ్ణంగా పరిశీలించనుంది. వసతిగృహం నిర్వహణకు వచ్చే నిధులు, విరాళాలను సైతం పరిశీలించి వసతిగృహాల వారీ గా నివేదికలను ప్రభుత్వానికి సమర్పించనుంది. -
లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్‌తో తెలంగాణలో సాధికారత సాధించిన 5 లక్షల మంది బాలికలు
కవితతో(పేరు మార్చడం జరిగింది) కలిపి ఆ కుటుంబంలో ముగ్గురు అక్కాచెల్లెలు. అక్కాచెల్లెళ్లలో కవితనే పెద్ద. కవిత 12వ తరగతి చదవుతున్నప్పుడే ఆమె తల్లి, ఇతర కుటుంబ సభ్యులు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చారు. కవిత తండ్రి ఇటీవల మరణించడంతో.. తల్లి ఆమెకు పెళ్లి చేయాలనే నిర్ణయానికి వచ్చింది. కవిత చదువుపై డబ్బులు ఖర్చు చేయకుండా.. ఆ డబ్బుతో పెళ్లి చేసి అత్తగారింటికి పంపించాలని భావించారు. అయితే కవితకు మాత్రం అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. తన చదువును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. అయితే కుటుంబ సభ్యుల ఒత్తిడిని ఎదుర్కొంటున్న కవిత.. ఈ విషయాన్ని తన ఉపాధ్యాయులకు తెలియజేశారు. దీంతో వారు తక్షణమే కవిత కోరికకు మద్దుతుగా నిలిచారు. కవిత తల్లితో మాట్లాడారు. చివరకు కవిత చదువును కొనసాగించడానికి ఆమె తల్లిని విజయవంతంగా ఒప్పించగలిగారు. ఈ ఘటన కవితలో సంతోషాన్ని నింపింది. తన స్కూల్లో రూమ్ టు రీడ్ కార్యక్రమం లో భాగంగా తనకు లభించిన ‘జీవణ నైపుణ్య పాఠాల’ వల్ల కుటుంబ ఒత్తిడిని తట్టుకుని నిలబడే ధైర్యం వచ్చిందని కవిత చెప్పారు. అక్కడ తాను జెండర్ సమస్యల పై అవగాహన పొందానని, ఉపాధ్యాయులపై నమ్మకం పెంచుకున్నానని తెలిపారు. తన అభిప్రాయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేయడానికి, చర్చలు జరపడానికి విశ్వాసం ఇచ్చారని పేర్కొన్నారు. కవిత లాగే.. కరోనా మహమ్మారి సమయంలో చాలా మంది అమ్మాయిలు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు.. పిల్లలను స్కూల్ మాన్పించే పరిస్థితులకు దారితీశాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాల్లో చాలా వరకు ముఖ్యంగా బాలికను పాఠశాలలకు దూరం చేయాలనే మార్గాన్ని ఎంచుకున్నారు. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ అధ్యయనం ప్రకారం.. దేశంలో దాదాపు 321 మిలియన్ల మంది పిల్లలు పాఠశాలకు దూరంగా ఉన్నారు. ఇది భారీ లెర్నింగ్ గ్యాప్‌కు దారితీయడంతో పాటుగా వివిధ రక్షణ సంబంధిత సమస్యలకు కారణమైంది. కొన్ని కుటుంబాలు బాలికలను పాఠశాలలకు పంపడం అదనపు భారంగా భావించడం వల్ల వారు అధిక దుర్భలత్వాన్ని ఎదుర్కొంటున్నారు. తెలంగాణ విషయానికి వస్తే.. దేశంలో ప్రముఖ బాలల హక్కుల సంస్థ- CRY తాజా అధ్యయనం ప్రకారం.. సర్వే చేసిన 52 గ్రామాల్లో బాల్య వివాహాలు రెట్టింపు అయ్యాయి. కోవిడ్ సమయంలో తెలంగాణలో బాల్య వివాహాలు పెరిగినట్టుగా ఆ నివేదిక పేర్కొంది. ఈ సంఘటనలను పరిశీలించిన రూమ్ టు రీడ్ (Room to Read).. తెలంగాణలో యుక్త వయస్సులో ఉన్న బాలికల విద్య, వారి రక్షణను కొనసాగింపుకు ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రభుత్వంతో బహుళ స్థాయి సహకార విధానాన్ని అమలు చేయడానికి ముందుకు సాగింది. ఈ లక్ష్యాన్ని సాధించే వ్యుహాంలో.. బాలికల విద్యకు మద్దతుగా సమాజాన్ని సమీకరించడం, జీవన నైపుణ్యాల విద్యను ప్రోత్సహించడం, బాలికలు వారి మాధ్యమిక విద్యను పూర్తి చేయడానికి వారికి అందుతున్న సహాయ సాకారాలను బలోపేతం చేయడం వంటివి ఉన్నాయి. బాలికలు బడి మానేయకుండా నిరోధించే అంశంపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు తెలంగాణ మహిళా అభివృద్ది, శిశు సంక్షేమ శాఖ సహకారంతో 33 జిల్లాల్లోని 14,000 గ్రామాల్లో 3 లక్షల పోస్టర్లు పంపిణీ చేశారు. క్షేత్ర స్థాయిలో ప్రచారం నిర్వహించడం, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్థానిక కళారూపాల ద్వారా స్కూల్ డ్రాప్ అవుట్ రేటు గురించి ప్రజలకు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా మారుమూల గ్రామాలకు చేరుకోవడానికి రేడియో, టీవీ, డిజిటల్ మీడియాతో సహా ఇతర ప్రత్యామ్నాయ మధ్యమాలను కూడా ఉపయోగించడమైనది. రాష్ట్ర విద్యాశాఖ మద్దతుతో ఈ సమస్యను మరింత విస్తృతంగా అందరికి వివరించేలా సహకార విధానం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి 7245 మంది జిల్లా అధికారులు వర్చువల్ గా జిల్లా స్థాయి సమన్వయ సమావేశాలలో పాల్గొన్నారు. బాలికల విద్యపై మహమ్మారి ప్రభావం, డిజిటల్ విభజనకు(డిజిటల్ కంప్యూటర్లు, ఇంటర్నెట్కు అందుబాటులో ఉన్న వారికి, లేని వారికి మధ్య అగాధం) సంబంధించిన సవాళ్లపై రాష్ట్ర స్థాయి వర్చువల్ కార్యక్రమానికి రాష్ట్ర కమీషన్ ఫర్ ప్రోటెక్షన్ ఆఫ్ చైల్డ్ చైర్పర్సన్ జే శ్రీనివాస్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుత సమయంలో బాలికలకు రిమోట్విధానంలో మద్దతునిచ్చే విధంగా ముఖ్యమైన జీవన నైపుణ్యాల విద్య ప్రణాళిక చేయబడింది. ఈ ప్రోగ్రామ్‌లలో వ్యక్తిగత అభివృద్ధి, ఆర్థిక ప్రణాళిక, ఆరోగ్యం, పరిశుభ్రత నిర్వహణ, భావోద్వేగ శ్రేయస్సు చుట్టూ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం వంటివి ఉన్నాయి. అయితే ప్రస్తుత డిజిటల్ విభజన ఈ లక్షాలను సాధించడంలో పెద్ద అవరోధంగా నిలిచింది. అయితే రేడియో.. విస్తృతమైన పరిధిని అందించడం ద్వారా ఈ సవాలును అధిగమించడానికి ఉపయోగపడింది. 32 జీవన నైపుణ్యాల ఎపిసోడ్లు రూపొందించి..వాటిని రేడియో, దూరదర్శన్, ఇతర ప్రైవేట్ ఛానెలల్స్ ద్వారా ప్రసారం చేయడం జరిగింది . గద్వాల్ జిల్లా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV) లో 8వ తరగతి చదువుతున్న శ్రుతి మాట్లాడుతూ.. ‘నేను ప్రతిరోజూ ఈ రేడియో ప్రోగ్రామ్ కోసం ఎదురు చూస్తుండేదానిని . ఎందుకంటే.. పాఠశాలలు మూసివేయబడి, లాక్‌డౌన్‌తో నేను ఎక్కడికి వెళ్ళలేక ఇంట్లోనే ఉండి, ఇంటి పనుల్లో కుటుంబానికి సహాయం చేసిన తర్వాత.. నన్ను నేను మరింతగా అర్థం చేసుకోవడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగ పడ్డాయి. ప్రోగ్రామ్‌లోని కథనాలు చాలావరకు సందర్భానుసారంగా ఉండి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవటానికి దోహదపడ్డాయి ’ అని తెలిపారు. బాలికలు తమ విద్యను పూర్తి చేసేలా ప్రోత్సహించడం, డ్రాపౌట్స్ ను తగ్గించడం, బాల్య వివాహాలకు సంబంధించిన సామాజిక ఒత్తిడిని నిరోధించడం అనేది లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ అందించడం వెనక ఉన్న లక్ష్యం. కవిత, శ్రుతి మాదిరిగానే తెలంగాణలో చాలా మంది అమ్మాయిలు జీవన నైపుణ్యాల పాఠాల వల్ల ప్రయోజనం పొందారు. కరోనా మహమ్మారి సమయంలో.. కౌమరదశలో ఉన్న బాలికలు మద్దతు కోసం టీచర్లను, సోషల్ మొబిలైజర్లను సంప్రదించిన సంఖ్యను బట్టి చూస్తే రూమ్ టు రీడ్ మద్దతు కలిగించే వ్యవస్థల యొక్క సమర్థవంతమైన నెట్‌వర్క్‌ను విజయవంతంగా సృష్టించగలిగినట్లు కనిపిస్తోంది. 72 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలకు చెందిన ఉపాధ్యాయులు, సిబ్బంది.. పాఠశాల నుండి డ్రాప్ అవుట్స్ ని నిరోధించేందుకు బాలికలకు అవసరమైన ప్రాక్టికల్ సపోర్ట్‌ను అందించడానికి సమర్థతతో కూడిన శిక్షణ పొందారు. బాలికలకు సురక్షితమైన ప్రదేశాన్ని ఇవ్వడానికి, వారు ఎదుర్కొంటున్న సవాళ్లను చర్చించడానికి దాదాపు 54 మోడల్ లైఫ్ స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. రూమ్ టు రీడ్ 'లైఫ్ స్కిల్స్ ఇన్ ఎ బాక్స్' అనే ‘‘సెల్ప్ లెర్నింగ్’’ కిట్‌ను కూడా రూపొందించింది. ఇది బాలికల విద్యను కొనసాగించడంలో సహాయపడింది. ఇలాంటి విధానాల ద్వారా రూమ్ టు రీడ్ .. 14,000 గ్రామాలకు చేరుకొని రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది బాలికలకు మద్దతునిచ్చింది. తెలంగాణ పాఠశాల విద్యా శాఖ నిరంతర సహకారంతో ఈ విస్తృతమైన ప్రాజెక్ట్ ని అమలు చేయడానికి సాధ్యమైంది. బాలికలు సెకండరీ విద్యను పూర్తి చేయడానికి, భవిష్యత్తులో కీలకమైన జీవిత నిర్ణయాలను చర్చించే నైపుణ్యాలను కలిగి ఉండటానికి మద్దతు ఇవ్వాలనే దానిపై దృష్టిని సారించడానికి RtR ప్రయత్నిస్తోంది. మా కార్యక్రమాల గురించి మరింతగా తెలుసుకోవడానికి సందర్శించండి (www.roomtoread.org). (అడ్వటోరియల్) -
బాల్యం.. బలహీనం
సాక్షి, హైదరాబాద్: ‘తిండి కలిగితే కండ కల దోయ్.. కండ కలవాడేను మనిషోయ్’అన్నాడు కవి గురజాడ. సమయానుకూలంగా ఆహారం తీసుకోక పోవడంతో అనర్థాలు తలెత్తుతాయి. గర్భిణులు, బాలింతలు సరైన ఆహారం తీసుకోక పోవడం పుట్టబోయే, పుట్టిన పిల్లల ఎదుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. పుట్టినప్పటి నుంచి ఆర్నెల్ల వరకు పిల్లలు తల్లిపాల పైనే ఆధారపడతారు. తల్లి సరైన ఆహారం తీసుకోకుంటే పిల్లలకు సరిపడా పాలు అందక సమస్యల బారినపడే ప్రమాదం ఉం టుంది. అంగన్వాడీల్లో నమోదైన ప్రతి 100 మంది చిన్నారుల్లో 15 మంది పౌష్టికాహార లోపంతో సతమతమవుతున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిశీలన చెబుతోంది. 2.16 లక్షల మంది చిన్నారుల పరిశీలన రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన చిన్నా రుల ఆరోగ్య స్థితిని వారి బరువు ఆధారంగా నిర్ధారిస్తున్నారు. ఈ క్రమంలో పక్షం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు వయసున్న 2,16,044 మంది చిన్నారుల బరువును కొలిచారు. వీరిలో 1,34,429 మంది చిన్నారులు సాధారణ బరువుతో ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారించారు. మరో 33,034 మంది చిన్నారులు సాధారణ బరువు కంటే 15– 25 శాతం తక్కువగా ఉన్నారు. వీరిలో 8,191 మంది చిన్నారులు 35 శాతం కంటే తక్కువ బరువున్నట్లు తేల్చారు. ఆరోగ్యంగా ఉన్న చిన్నా రుల విషయంలో తల్లిదండ్రులకు సలహాలు, సూచ నలు ఇచ్చి సరిపెట్టగా... బరువు తక్కువున్న చిన్నా రుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని నిర్ణ యించారు. అదేవిధంగా ఆ పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే సాధారణ ఆహారంతో పాటు మరింత పోషకాలు అందే విధంగా అదనపు కోటా కింద ఆహార పంపిణీ చేయనున్నారు. ఈ రకం పిల్లలను ప్రతివారం పరిశీలించి ఆరోగ్య స్థితిని అంచనా వేయనున్నారు. మరో 48,581 మంది చిన్నారులు నిర్ణీత బరువు కంటే అధికంగా (ఓవర్ వెయిట్) ఉన్నట్లు గుర్తించారు. ఈ పిల్లల తల్లులకు సరైన జాగ్రత్తలు పాటించాలని, లేకుంటే ఊబకాయం బారినపడే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా పిల్లలకు ఇచ్చే ఆహారం క్రమపద్దతిలో ఉండాలని సూచిస్తూ మెనూను రూపొందించి ఇస్తున్నారు. పౌష్టిక పునరావాసానికి 1.2 శాతం పిల్లలు బరువును అంచనా వేస్తూ పిల్లల ఆరోగ్యస్థితిని గుర్తిస్తున్న అధికారులు... ప్రమాదకరంగా ఉన్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. ప్రస్తుతం బరువును పరిశీలించిన వారిలో 2,658 మంది చిన్నారులు తీవ్ర పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. వీరిని ఎన్ఆర్సీ (న్యూట్రీషియన్ రిహాబిలిటేషన్ సెంటర్)కి రిఫర్ చేస్తూ కొంతకాలం అక్కడే ఉండేలా అడ్మిట్‌కు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా 23,917 పిల్లల ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించనున్నారు. ఈ చిన్నారుల కోసం ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించి ఆరోగ్య స్థితిని నమోదు చేయాల్సిందిగా ఉన్నతాధికారులు వైద్యశాఖ సిబ్బందిని ఆదేశించారు. విటమిన్లు, మినరల్స్‌పై దృష్టి పెట్టాలి పిల్లలకు ఆహారాన్ని ఇచ్చే విషయంలో చాలామంది పరిమాణం (క్వాంటిటీ) పైనే ఎక్కువ దృష్టి పెడతారు. ఈ సమయంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని అందిస్తుంటారు. విటమిన్లు, మినరల్స్ ఉండే ఆహారాన్ని పెద్దగా పట్టించుకోరు. పిల్లలకు ఐరన్, కాల్షియం ఉన్న ఆహారం సమపాళ్లలో ఇస్తేనే వారి ఎదుగుదల ఆశాజనకంగా ఉంటుంది. ఏడాది దాటిన చిన్నారులకు అన్నిరకాల ఆహారాన్ని ఇవ్వొచ్చు. బలవర్ధకమైన ఆహారం పేరిట మార్కెట్లో దొరికే డబ్బాల కంటే ఇంట్లో తయారు చేసే ఉగ్గు శ్రేష్టమైనది. ఈ ఉగ్గులో తృణదాణ్యాలను కలిపి తయారు చేస్తే మంచిది. - డాక్టర్ స్పందన, న్యూట్రిషనిస్ట్ -
అనాథ బాలురకూ ఆశ్రయం!
సాక్షి, హైదరాబాద్: అనాథలు, వసతి కోసం ఎదురు చూసే బాలుర కోసం రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సరికొత్త కార్యాచరణ చేపట్టింది. ఇప్పటివరకు అనాథ బాలికలు, మహిళల కోసమే షెల్టర్ హోంలు నిర్వహిస్తున్న ఆ శాఖ.. ఇక బాలుర కోసం ప్రత్యేకంగా వీటిని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ప్రస్తుతం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రానికి ఒక షెల్టర్ హోంను ఏర్పాటు చేశారు. వీటిలో అనాథ బాలికలను నేరుగా చేర్చుకుని ఆశ్రయమిస్తారు. అలాగే ఆపదలో ఉన్న మహిళలు, ఇతరత్రా కారణాలతో హింసకు, దాడులకు గురైన వారిని సైతం షెల్టర్ హోంలు అక్కున చేర్చుకుని ఆశ్రయం ఇస్తాయి. బాలికలు, మహిళల కోసం నిర్వహించే ఈ హోంలకు ఆ శాఖ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి నిర్వహిస్తోంది. పూర్తిగా మహిళల ఆధ్వర్యంలోనే ఈ హోంలు కొనసాగుతున్నాయి. అయితే బాలుర కోసం ఇప్పటివరకు ప్రత్యేకించి హోంలు లేవు. బాలల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆరు వసతి గృహాలున్నప్పటికీ.. ఇందులో మెజార్టీ పిల్లలు సమాజంలో పొరపాట్లను చేసి వస్తున్న వారే.. మరోవైపు ప్రతి ఆర్నెల్లకోసారి నిర్వహించే ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముష్కాన్ కార్యక్రమాల ద్వారా గుర్తిస్తున్న బాలుర సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ఇలా గుర్తించిన వారిని ఎక్కడ వసతి కలి్పంచాలనేది అధికారులకు సమస్యగా మారింది. బాలల సంక్షేమ శాఖ పరిధిలోని హోంలకు పంపిస్తున్నప్పటికీ అనాథ బాలలకు ప్రత్యేక హోం అంటూ లేదు. మరోవైపు సింగిల్ పేరెంట్ సంరక్షణ నుంచి బయటపడే వారు, తల్లిదండ్రులున్నప్పటికీ ప్రత్యేక పరిస్థితుల్లో వసతి కోసం నిరీక్షిస్తున్న వారిలో బాలుర సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోంలను తెరిచే అంశంపై ఆ శాఖ దృష్టి సారించింది. నెలాఖరుకు కొలిక్కి... అనాథ బాలుర కోసం ప్రత్యేకంగా షెల్టర్ హోంలు తెరిచే అంశంపై రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. ఇక్కడ కేవలం వసతితో పాటు ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం బాలల సంక్షేమ శాఖ పరిధిలోని హోంలకు అనుబంధంగా పాఠశాలలు నిర్వహిస్తున్నారు. షెల్టర్ హోంకు వచ్చే పిల్లల వయసుకు తగిన కార్యక్రమాలు అమలు చేసేలా కొత్త హోంల కార్యాచరణ ఉండనుంది. గత నెల రెండో వారంలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బాలురకు షెల్టర్ హోం అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పాత జిల్లా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఆ మేరకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రతిపాదనల రూపకల్పనకు చర్యలు చేపట్టారు. ఈ నెలాఖరులోగా 10 బాలుర షెల్టర్‌హోంల ఏర్పాటుపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. వీటిని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. -
ఆరోగ్య సలహానా... ట్వీట్ చెయ్!
‘‘పాఠశాలల మూసివేతతో పిల్లల దినచర్య గాడి తప్పింది. వారి అల్లరిని అదుపులో పెట్టే, క్రమ పద్ధతిలోకి తీసుకొచ్చేందుకు వారు చేయాలనుకునే పనులతో ప్రణాళిక తయారు చేయండి. ఇంట్లో పనులు చేసేందుకు అనుమతివ్వం డి. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చే పనుల్లో సాయం చేస్తే వారికి అలవాటవుతుంది.’’ ‘‘కోపాన్ని తగ్గించుకోవాలా? వెంటనే లోతైన శ్వాస తీసుకొండి. పది సెకన్లపాటు ఊపిరి బిగపట్టి వదిలేయండి. ఇలా ఐదు సార్లు చేస్తే చికాకు, కోపం తగ్గి సాధారణ స్థితికి చేరుకుంటారు’’ ‘‘చిన్నారుల మెదడు అభివృద్ధి కావాలంటే అయోడైజ్డ్ ఉప్పును వాడండి. అయోడిన్ శిశువు మెదడు అభివృద్ధికి సాయపడుతుంది, గర్భస్రావాల నుంచి రక్షిస్తుంది. తల్లి, పిల్లల క్షేమం కోసం అయోడైజ్డ్ ఉప్పును మాత్రమే వాడాలి’’ సాక్షి, హైదరాబాద్: ఈ సూచనలేమిటనుకుంటున్నారా...? అవేనండీ.. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ట్విట్టర్, ఫేస్బుక్ పేజీలో ఇస్తున్న సందేశాలు, సూచనలివి. మహిళలు, శిశువుల ఆరోగ్యం ప్రచారానికి సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంది. ఈ దిశగా ఆ శాఖ వినూత్న ప్రచారానికి తెరలేపింది. అంగన్వాడీ కేంద్రాల్లో నేరుగా ఇచ్చే సలహాలు, సూచనలతోపాటు సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం కల్పిస్తోంది. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు ప్రత్యేక పేజీలున్నాయి. వీటికి వేలసంఖ్యలో ఫాలోవర్లూ ఉన్నారు. స్మార్ట్‌గా సలహాలు... స్మార్ట్ఫోన్ల వాడకం పెరుగుతుండటంతో అందుకు తగినట్లుగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అవగాహన కార్యక్రమాలను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల ద్వారా కార్యక్రమాలు ప్రారంభించింది. రెండేళ్ల క్రితమే ఈ ఖాతాలు తెరిచినప్పటికీ... లాక్డౌన్, అనంతర పరిస్థితుల నేపథ్యంలో వీటిపై విస్తృత ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించిన అంశాలే లక్ష్యంగా ఈ ప్రచారం చేపట్టింది. మహిళలు తీసుకునే ఆహారం మొదలు, ఆరోగ్య స్థితి, సమస్యలు, వాటికి సమాధానాలు ఇస్తూ ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో అంగన్వాడీలకు వచ్చే లబ్ధిదారులతో సలహా లిప్పిస్తున్నారు. వారి వ్యక్తిగత అనుభవాలతో కూడా వీడియోలు తీసి ట్విట్టర్లో అప్లోడ్ చేస్తున్నారు. ఫాలోవర్స్ లిస్టులో నీతి ఆయోగ్... రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. తాజాగా ప్రతి జిల్లాలో జిల్లా సంక్షేమాధికారి ట్విట్టర్, ఫేస్బుక్ ఖాతాను తెరిచారు. ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో సీడీపీవోలు కూడా ఇదే తరహాలో ఖాతాలు తెరిచి ఫాలో అవుతున్నారు. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఖా తాను కేంద్ర మహిళాభివృద్ధి శాఖ, నీతి ఆయోగ్ సైతం ఫాలో అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పోస్టులకు అవి లైక్ కొట్టడం, షేర్ చేయడంతోపాటు అభినందిస్తుండటం గమనార్హం. -
సంక్షేమ డిప్యుటేషన్లకు.. సవా‘లక్ష’ మార్గాలు..!
సాక్షి, హైదరాబాద్: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగుల డిప్యుటేషన్లపై పైరవీలు జోరందుకున్నాయి.సీడీపీఓ(శిశు అభివృద్ధి ప్రాజెక్టు) కార్యాలయాల్లో పనిచేస్తున్న సీనియర్ , జూనియర్ అసిస్టెంట్లతో పాటు టైపిస్టులు దాదాపు 110 మందికి గతేడాది డిసెంబర్లో డిప్యుటేషన్లు ఇచ్చారు. క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణను జిల్లా కేంద్రంగా నిర్వహించాలని నిర్ణయించడంతో సీడీపీఓ కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్య కుదించారు. నిర్దేశించిన సంఖ్యకు మించి ఉన్న సిబ్బందిని సంబంధిత జిల్లా సంక్షేమాధికారి(డీడబ్ల్యూఓ) కార్యాలయాలకు డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి పనిచేయిస్తున్నారు. ఇలా వచ్చిన వారి సమ్మతి ఆధారంగా స్థాన మార్పిడి చేసేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ తాజాగా నిర్ణయించింది.అనారోగ్య సమస్యలు, స్పౌజ్ వంటి కారణాలతో పాటు సిబ్బంది ఆవశ్యకత ఆధారంగా డిప్యుటేషన్లు ఇవ్వాలని భావిస్తోంది.ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రాంతీయ సంయుక్త సంచాలకులను ఆదేశించింది. దీంతో హైదరాబాద్, వరంగల్ ఆర్జేడీ పరిధిలో ఈమేరకు దరఖాస్తుల స్వీకరణకు నిర్ణయించారు. ఇదే అదనుగా కొందరు పైరవీకారులు తమవారికి కోరిన చోట పోస్టింగ్ ఇప్పించేందుకు రంగంలోకి దిగారు.తన అనుయాయులకు అనువైన చోట పోస్టింగ్ ఇప్పించేందుకు వారు నడుంకట్టారు. ‘లక్ష’ణమైన డిప్యుటేషన్...! సీడీపీఓ కార్యాలయాల్లో పనిచేస్తున్న సీనియర్, జూనియర్ అసిస్టెంట్లతో పాటు టైపిస్టుల్లో ఇప్పటివరకు 110 మంది జిల్లా కార్యాలయాలకు డిప్యుటేషన్‌పై వెళ్లారు. వారంతా డీడబ్ల్యూఓలో విధుల్లో చేరారు. తాజాగా వీరి పరిస్థితి ఆధారంగా మార్పులు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో కుటుంబ అవసరాలు, అనారోగ్య సమస్యలు, భార్యాభర్తలు తదితర అంశాల ఆధారంగా ప్రాంతీయ సంయుక్త సంచాలకులకు వినతులు సమర్పిస్తున్నారు. వాటికి సంబంధిత సీడీపీఓ లేదా డీడబ్ల్యూఓ అంగీకారం ఉండాలనే నిబంధన ఉంది. దీంతో కొందరు కోరిన చోట పోస్టింగ్ కోసం సీడీపీఓలు, డీడబ్ల్యూఓలపై ఒత్తిడి తెస్తున్నారు. కొందరు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తూ ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ ఆర్జేడీ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తనకు సన్నిహితుడైన ఉద్యోగికి అనువైన చోట పోస్టింగ్‌కు పైరవీ ముమ్మరంగా చేస్తున్నారు. దీనికోసం కొందరు రూ.లక్ష వరకు ముట్టజెపుతున్నట్లు ఉద్యోగ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై ఒకరిద్దరు అధికారులకు ఫిర్యాదులు సైతం చేసినట్లు తెలుస్తోంది. -
గృహ హింసా.. ఫోన్ చేస్తే రక్షణ
సాక్షి, అమరావతి: దీర్ఘకాల లాక్డౌన్ నేపథ్యంలో గృహహింసను ఎదుర్కొంటున్న మహిళలు ఒక్క ఫోన్ చేస్తే పూర్తి రక్షణ చర్యలు తీసుకుంటామని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. ఉచిత మహిళా సహాయతా నెంబరు 181 కు బాధితులు ఫోన్ చేసి సహాయం పొందవచ్చునని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. గృహహింస బాధితుల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను ఆమె వివరించారు. ► ఇప్పటికే పని చేస్తున్న దిశ వన్‌స్టాఫ్ కేంద్రాల్లో 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. బాధిత మహిళలకు ఈ కేంద్రాల్లో ఆరోగ్య, వైద్య, మానసిక, న్యాయ సహాయాలను నిపుణుల ద్వారా అందిస్తాం. ఈ కేంద్రాల్లో అందించే సేవలన్నీ ఉచితమే. ► అవసరమైన వారికి అత్యవసర వసతిని ఒకే చోట కల్పిస్తాం. అలాగే రాష్ట్రంలోని 23 స్వధార్ గృహాల్లో సైతం వసతి, రక్షణ కల్పిస్తాం. ► బాధితులకు సహాయం అందించేందుకు జిల్లాల వారీగా అధికారులను నియమించాం. వారి నెంబర్లకు ఫోన్ చేసి తక్షణ సహాయం పొందవచ్చు. -
ప్రీప్రైమరీ స్కూళ్లలో చిన్నారుల సామర్థ్యం మదింపు!
సాక్షి, హైదరాబాద్: పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో మరిన్ని సంస్కరణలు తేవాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ భావిస్తోంది. ఐసీడీఎస్ (సమగ్ర శిశు అభివృద్ధి పథకం) కింద నడుస్తున్న ప్రీప్రైమరీ స్కూళ్లలో చిన్నారుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు సరికొత్త కార్యాచరణ రూపొందిస్తోంది. చిన్నారులకు చదువు పట్ల ఆసక్తి పెంచడం, కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా ఈ సంస్కరణలు తీసుకొస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 31,711 కేంద్రాలు ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు కాగా, 3,989 కేంద్రాలు మినీ అంగన్వాడీ కేంద్రాలు. ఈ కేంద్రాలన్నింట్లో ప్రీస్కూల్ తరగతులు నిర్వహిస్తుండగా.. ప్రాథమిక పాఠశాలల ఆవరణలో ఉన్న దాదాపు 2,450 కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్రీస్కూళ్లుగా కొనసాగుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాలు, ప్రీస్కూళ్లకు వచ్చేవారిలో 3 ఏళ్ల నుంచి 4 ఏళ్లలోపు చిన్నారులకు ప్రీస్కూల్ తరగతుల్లో కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారు. ఎల్కేజీ పిల్లలకు తంగేడు పువ్వు పేరిట నాలుగు పుస్తకాలు, యూకేజీ పిల్లలకు పాలపిట్ట పేరిట ఐదు పుస్తకాలను ఇస్తున్నారు. సామర్థ్యాల మదింపు.. ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు నిర్దేశించిన పాఠ్యాంశాన్ని ఏమేరకు అర్థం చేసుకున్నారనే దాన్ని తేల్చేందుకు వారి సామర్థ్యాల మదింపునకు అధికారులు చర్యలు తీసుకోనున్నారు. బడికి రావాలనే ఆసక్తిని వారిలో పెంచడంతో పాటు కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సాహాన్ని పెంచేలా వారిని ప్రోత్సహిస్తూనే చిన్నారుల సామర్థ్యాన్ని గుర్తిస్తారు. ఈమేరకు అంగన్వాడీ టీచర్లకు శిక్షణ తరగతులు నిర్వహించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఇందుకోసం అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా పుస్తకాలను సైతం రూపొందిస్తోంది. ఇందులో చిన్నారుల సామర్థ్యాలను గుర్తించే మెళకువలు, చిన్నారుల మానసిక స్థితి అభివృద్ధి చేసే కార్యక్రమాలపై సలహాలు, సూచనలుంటాయి. వచ్చే నెలలో అంగన్వాడీ టీచర్లకు శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆ శాఖ భావిస్తోంది. అయితే కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా శిక్షణ తరగతుల నిర్వహణకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నాకే తదుపరి చర్యలు చేపట్టే అవకాశముంది. -
డుమ్మా కుదరదిక
సిబ్బంది పని తీరుపై డేగకన్ను అమలైతే డుమ్మా కొట్టే వారి ఆటకట్టు కసరత్తు చేస్తున్న స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆ శాఖ లక్ష్యం ఉన్నతం.. తల్లీబిడ్డల క్షేమం కోరి పలు పథకాలు అమలు చేసింది. క్షేత్రస్థాయిలో మాతా శిశువులకు అందలేదు. కారణం అంగన్వాడీ కార్యకర్తలు విధులకు డుమ్మా కొట్టడమేనని ప్రభుత్వ సర్వేలో తేలింది. కేంద్రాలు నడపకుండా డుమ్మా కొట్టే అంగన్వాడీ కార్యకర్తలకు చెక్ పెట్టేందుకు స్త్రీ శిశుసంక్షేమ శాఖ బయోమెట్రిక్ అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ విధానం అమలైతే విధులకు గైర్హాజరయ్యే అంగన్వాడీ కార్యకర్తలు, ఇతర సిబ్బంది ఆటలకు చెక్ పెట్టినట్టే. చిత్తూరు(గిరింపేట): జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్తల సమయపాలన కోసం బయోమెట్రిక్ ఏర్పాటు చేయనున్నారు. తల్లీ బిడ్డ సంక్షేమం కోసం రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ పలు పథకాలను అమలు చేస్తోంది. ఇందులో గర్భిణుల్లో రక్తహీనత, మాతాశిశు మరణాలను నివారణ, కిశోర బాలికలకు పౌష్టికాహారం, నిరుపేద చిన్నారులకు పౌష్టికాహారంతోపాటు పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టింది.ఈ పథకాల అమలు కోసం ప్రభుత్వం ఏటా రూ.వేలాది కోట్లు విడుదల చేస్తోంది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆశించిన ప్రగతి కనిపించలేదు. ఇందుకు గల కారణాలను గుర్తించగా క్షేత్ర స్థాయిలోని సిబ్బంది సక్రమంగా పని చేయడం లేదని తేలింది. దీంతో క్షేత్రస్థాయి సిబ్బందితో పనిచేయించడం, సమయపాలనకు అంగన్వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. ఆ దిశ గా చర్యలు చేపడుతోంది. త్వరలో ఈ విధానం జిల్లాలో అమలుకానుంది. ఈ విధానం అమలైతే ఇప్పటివరకు యూనియన్ సమావేశాలు, ఆ పనులూ, ఈ పనులూ అంటూ తమ విధులకు డుమ్మా కొట్టేవారిని గుర్తించి కొరడా ఝళిపించనుంది. వేలలో సిబ్బంది జిల్లాలో 3640 అంగనవాడీ కేంద్రాలున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు - 3640, మినీ అంగన్వాడీ కేంద్రాలు 1128 ఉన్నాయి. వీటిలో ఓ కార్యకర్త, ఓ ఆయా వంతున 9,536 మంది పనిచేస్తున్నారు. వీటిని పాలనా సౌలభ్యం కోసం మొత్తం 21 ప్రాజెక్టులుగా విభజించారు. ఆయా ప్రాజెక్టులో కేంద్రాల పర్యవేక్షణకు 21 మంది చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్లు( సీపీడీఓ), 10 మంది అడిషనల్ చైల్డు డెవలప్మెంట్ ఆఫీసర్లు(ఏసీడీపీవో), రోజు వారీ తనిఖీల నిమిత్తం సూపర్వైజర్లు గ్రేడ్-1లో 51 మంది. గ్రేడ్-2లో 65 మంది పనిచేస్తున్నారు. లక్షలాది మందికి లబ్ధి అంగన్వాడీ కేంద్రాల ద్వారా దారిద్య్రరేఖకు దిగువనున్న బాలింతలకు, గర్భిణులు, మురికివాడలలో నివసిస్తున్న 6 నుంచి 72 నెలలు, 6 సంవత్సరాలలోపు పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహార పథకం అమలు చేస్తున్నారు. 3 నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులకు ఆకు కూరతో భోజనం, బాలింతలు, గర్భిణులకు టేక్ హోమ్ రేషన్(టీహెచ్ఆర్) ఇస్తున్నారు. ఈ పథకాల ద్వారా సుమారు 85 వేల మంది గర్భిణులు, బాలింతలు, 3 నుంచి 6 ఏళ్లలోపు ఉన్న 1,00,850 మంది పిల్లలకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నారు. ఒక్కో కేంద్రం లో 30 నుంచి 40 మంది దాకా పిల్లలు ఆ కేంద్రాల్లోనే భోజనం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆయా కేంద్రాలు సక్రమం గా పనిచేయకపోవడంతో లబ్ధిదారులకు పౌష్టికాహారం, టేక్‌హోమ్ రేషన్ అందడం లేదు. దీంతో నిధులు దుర్వినియోగమై పక్కదారి పడుతున్నాయి. ఈ క్రమంలో పథకాన్ని పక్కా అమలు చేసి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ లక్ష్యం సాధించాలన్న ఆలోచనతో బయోమెట్రిక్‌ను ప్రవేశపెడుతున్నారు. బయోమెట్రిక్‌తో సిబ్బంది హాజరుపై ప్రత్యేక దృష్టి పెట్టి, కేంద్రాలకు సక్రమంగా రాని సిబ్బందిపై చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నారు.