ప్రీప్రైమరీ స్కూళ్లలో చిన్నారుల సామర్థ్యం మదింపు! | New Reforms Wants to Improve In Pre Primary School By State Women Development | Sakshi
Sakshi News home page

ప్రీప్రైమరీ స్కూళ్లలో చిన్నారుల సామర్థ్యం మదింపు!

Published Tue, Mar 17 2020 4:20 AM | Last Updated on Tue, Mar 17 2020 4:20 AM

New Reforms Wants to Improve In Pre Primary School By State Women Development - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో మరిన్ని సంస్కరణలు తేవాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ భావిస్తోంది. ఐసీడీఎస్‌ (సమగ్ర శిశు అభివృద్ధి పథకం) కింద నడుస్తున్న ప్రీప్రైమరీ స్కూళ్లలో చిన్నారుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు సరికొత్త కార్యాచరణ రూపొందిస్తోంది. చిన్నారులకు చదువు పట్ల ఆసక్తి పెంచడం, కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా ఈ సంస్కరణలు తీసుకొస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 31,711 కేంద్రాలు ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు కాగా, 3,989 కేంద్రాలు మినీ అంగన్‌వాడీ కేంద్రాలు. ఈ కేంద్రాలన్నింట్లో ప్రీస్కూల్‌ తరగతులు నిర్వహిస్తుండగా.. ప్రాథమిక పాఠశాలల ఆవరణలో ఉన్న దాదాపు 2,450 కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్రీస్కూళ్లుగా కొనసాగుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రీస్కూళ్లకు వచ్చేవారిలో 3 ఏళ్ల నుంచి 4 ఏళ్లలోపు చిన్నారులకు ప్రీస్కూల్‌ తరగతుల్లో కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారు. ఎల్‌కేజీ పిల్లలకు తంగేడు పువ్వు పేరిట నాలుగు పుస్తకాలు, యూకేజీ పిల్లలకు పాలపిట్ట పేరిట ఐదు పుస్తకాలను ఇస్తున్నారు.

సామర్థ్యాల మదింపు.. 
ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలకు నిర్దేశించిన పాఠ్యాంశాన్ని ఏమేరకు అర్థం చేసుకున్నారనే దాన్ని తేల్చేందుకు వారి సామర్థ్యాల మదింపునకు అధికారులు చర్యలు తీసుకోనున్నారు. బడికి రావాలనే ఆసక్తిని వారిలో పెంచడంతో పాటు కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సాహాన్ని పెంచేలా వారిని ప్రోత్సహిస్తూనే చిన్నారుల సామర్థ్యాన్ని గుర్తిస్తారు. ఈమేరకు అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ తరగతులు నిర్వహించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఇందుకోసం అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా పుస్తకాలను సైతం రూపొందిస్తోంది. ఇందులో చిన్నారుల సామర్థ్యాలను గుర్తించే మెళకువలు, చిన్నారుల మానసిక స్థితి అభివృద్ధి చేసే కార్యక్రమాలపై సలహాలు, సూచనలుంటాయి. వచ్చే నెలలో అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆ శాఖ భావిస్తోంది. అయితే కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా శిక్షణ తరగతుల నిర్వహణకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నాకే తదుపరి చర్యలు చేపట్టే అవకాశముంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement