pre primary school
-
విద్యా పునాదులు మరింత పటిష్టం
సాక్షి, అమరావతి: విద్యారంగంలో సమూల మార్పుల దిశగా సంస్కరణలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రీప్రైమరీ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించి సిలబస్, పుస్తకాలను రూపొందించింది. అంగన్వాడీ కేంద్రాల్లో వైఎస్సార్ ప్రీప్రైమరీ తరగతులను ప్రారంభించనుంది. ఇటీవల జగనన్న విద్యాకానుక పథకం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. పిల్లలకు ఆరేళ్ల వయసు వచ్చేనాటికి 85 శాతం మెదడు అభివృద్ధి చెందుతుందని వివిధ అధ్యయనాలు పేర్కొంటున్నందున ఆ దశలోనే వారిలో చదువుకు సంబంధించిన ప్రాథమిక నైపుణ్యాలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 55 వేల అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో దశలవారీగా ప్రీప్రైమరీ విధానానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రీప్రైమరీ కింద మూడేళ్ల పిల్లలకు పీపీ1, నాలుగేళ్ల పిల్లలకు పీపీ2 ఉంటాయి. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల సమయాల్లోనే ఈ పీపీ1, పీపీ2 తరగతులు కొనసాగనున్నాయి. ఇందుకు సంబంధించిన సిలబస్‌ను రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) రూపొందించింది. జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) రూపొందించిన కరిక్యులమ్‌ను అనుసరించి ఈ పీపీ1, పీపీ2 పుస్తకాలు ఉండనున్నాయి. బోధన, క్లాసులు ఇలా.. ⇔ టీచర్లకు హా్యండ్బుక్తో పాటు పిల్లలకు నాలుగేసి బొమ్మల పుస్తకాలను ఎస్సీఈఆర్టీ రూపొందించింది. ⇔ 3 సెమిస్టర్లుగా ఇవి ఉంటాయి. జూన్-సెప్టెంబర్, అక్టోబర్-డిసెంబర్, జనవరి-మార్చిగా విభజించి ఆ మేరకు హ్యాండ్‌బుక్‌ను రూపొందించారు. ⇔ పీపీ1, పీపీ2 పిల్లల కోసం వేర్వేరుగా బొమ్మల రూపంలో ఉన్న ఫన్‌బుక్, రైమ్స్ బుక్, స్టోరీ బుక్, వర్క్ బుక్ తయారుచేస్తున్నారు. ⇔ టీచర్లకు ఇచ్చే హ్యాండ్‌బుక్‌లో పాఠ్యాంశాలు పిల్లలకు ఎలా చెప్పాలో సూచనలు ఇస్తారు. ⇔ ఇంగ్లిష్, తెలుగు అక్షరమాల, అంకెలతో పాఠ్యపుస్తకాలు ఉంటాయి. పీపీ1లో పరిచయం చేసిన వాటినే పీపీ2లో కొంచెం వివరంగా చూపిస్తూ నేర్పిస్తారు. ⇔ పదినెలల బోధనా కాలంలో నెలకో అంశాన్ని బోధించేలా పుస్తకాలు రూపొందించారు. ⇔ టీచర్లు ఆ అంశాల గురించి చెబుతున్నపుడు వర్కుబుక్లో పిల్లలతో వాటిని గుర్తు పట్టేలా చేస్తారు. ⇔ పీపీ1 పిల్లలకు మౌఖికంగా తరగతులుంటాయి. పీపీ2లో రాతకు సంబంధించిన నైపుణ్యాన్ని అలవడేలా చేస్తారు. ⇔ ఉదయం 9-15కి తరగతులు ప్రారంభమవుతాయి. ఒక్కోటి అరగంట సేపు చొప్పున మొత్తం 6 పీరియడ్లుంటాయి. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు భోజనం, విశ్రాంతికి సమయం ఇస్తారు. ⇔ తరువాత 2 నుంచి 3 వరకు క్లాసులు కొనసాగించి 3.10కి ఇళ్లకు పంపిస్తారు. ఆటపాటలతో విద్యాబోధన: అరగంట కొక అంశాన్ని ఆటపాటలతో నేర్పించేలా కరిక్యులమ్ ఉంటుంది. ఆయా పీరియడ్లలో ఏం చెప్పాలో ఎన్సీఈఆర్టీ ఫ్రేమ్‌వర్క్‌ను అనుసరించి ఎస్సీఈఆర్టీ ఈ కరిక్యులమ్‌ను రూపొందించింది. అంగన్వాడీ టీచర్లకు వీటిపై శిక్షణ ఉంటుంది. దీనికి సంబంధించిన అంశాలను యూట్యూబ్‌లో పెట్టి అంగన్వాడీ టీచర్లు నేర్చుకొనేలా చేయనున్నారు.- ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి -
ప్రీప్రైమరీ స్కూళ్లలో చిన్నారుల సామర్థ్యం మదింపు!
సాక్షి, హైదరాబాద్: పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో మరిన్ని సంస్కరణలు తేవాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ భావిస్తోంది. ఐసీడీఎస్ (సమగ్ర శిశు అభివృద్ధి పథకం) కింద నడుస్తున్న ప్రీప్రైమరీ స్కూళ్లలో చిన్నారుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు సరికొత్త కార్యాచరణ రూపొందిస్తోంది. చిన్నారులకు చదువు పట్ల ఆసక్తి పెంచడం, కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా ఈ సంస్కరణలు తీసుకొస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 31,711 కేంద్రాలు ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు కాగా, 3,989 కేంద్రాలు మినీ అంగన్వాడీ కేంద్రాలు. ఈ కేంద్రాలన్నింట్లో ప్రీస్కూల్ తరగతులు నిర్వహిస్తుండగా.. ప్రాథమిక పాఠశాలల ఆవరణలో ఉన్న దాదాపు 2,450 కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్రీస్కూళ్లుగా కొనసాగుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాలు, ప్రీస్కూళ్లకు వచ్చేవారిలో 3 ఏళ్ల నుంచి 4 ఏళ్లలోపు చిన్నారులకు ప్రీస్కూల్ తరగతుల్లో కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారు. ఎల్కేజీ పిల్లలకు తంగేడు పువ్వు పేరిట నాలుగు పుస్తకాలు, యూకేజీ పిల్లలకు పాలపిట్ట పేరిట ఐదు పుస్తకాలను ఇస్తున్నారు. సామర్థ్యాల మదింపు.. ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు నిర్దేశించిన పాఠ్యాంశాన్ని ఏమేరకు అర్థం చేసుకున్నారనే దాన్ని తేల్చేందుకు వారి సామర్థ్యాల మదింపునకు అధికారులు చర్యలు తీసుకోనున్నారు. బడికి రావాలనే ఆసక్తిని వారిలో పెంచడంతో పాటు కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సాహాన్ని పెంచేలా వారిని ప్రోత్సహిస్తూనే చిన్నారుల సామర్థ్యాన్ని గుర్తిస్తారు. ఈమేరకు అంగన్వాడీ టీచర్లకు శిక్షణ తరగతులు నిర్వహించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఇందుకోసం అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా పుస్తకాలను సైతం రూపొందిస్తోంది. ఇందులో చిన్నారుల సామర్థ్యాలను గుర్తించే మెళకువలు, చిన్నారుల మానసిక స్థితి అభివృద్ధి చేసే కార్యక్రమాలపై సలహాలు, సూచనలుంటాయి. వచ్చే నెలలో అంగన్వాడీ టీచర్లకు శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆ శాఖ భావిస్తోంది. అయితే కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా శిక్షణ తరగతుల నిర్వహణకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నాకే తదుపరి చర్యలు చేపట్టే అవకాశముంది. -
అంగన్వాడీలో ఆహారం తిని చిన్నారి మృతి?
కాకినాడ: అంగన్వాడీ కేంద్రం నుంచి తెచ్చుకున్న ఆహారం తిని ఒక చిన్నారి మృతి చెందగా మరొకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం జి.దొంతమూరులో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. వివరాలు...జి.దొంతమూరు గ్రామానికి చెందిన శెట్టి త్రిమూర్తులు, అంబికా దేవి దంపతులకు కుమారులు అజయ్ గణేష్(4), భార్గవ్ కల్యాణ్(2) ఉన్నారు. వారు శుక్రవారం ఉదయం ఇంటి పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి అన్నం, గుడ్లు తెచ్చుకుని తిన్నారు. కొద్ది సేపటికే వాంతులు, విరేచనాలు మొదలు కావటంతో రాజానగరం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఫుడ్ పాయిజనింగ్‌గా గుర్తించారు. వారి పరిస్థితి విషమంగా మారటంతో శుక్రవారం రాత్రి కాకినాడకు తరలిస్తుండగా మార్గమధ్యంలో భార్గవ్ కల్యాణ్ మృతి చెందాడు. అజయ్ గణేష్ పరిస్థితి విషమంగా ఉంది. కాకినాడలోని జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. అయితే, అంగన్ వాడీ కేంద్రంలో ఇచ్చిన ఆహారమే కలుషితమైందా? లేక మరేదైనా కారణం ఉండవచ్చా? అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ చేస్తున్నారు.