కాకినాడ: అంగన్‌వాడీ కేంద్రం నుంచి తెచ్చుకున్న ఆహారం తిని ఒక చిన్నారి మృతి చెందగా మరొకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం జి.దొంతమూరులో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. వివరాలు...జి.దొంతమూరు గ్రామానికి చెందిన శెట్టి త్రిమూర్తులు, అంబికా దేవి దంపతులకు కుమారులు అజయ్ గణేష్(4), భార్గవ్ కల్యాణ్(2) ఉన్నారు. వారు శుక్రవారం ఉదయం ఇంటి పక్కనే ఉన్న అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి అన్నం, గుడ్లు తెచ్చుకుని తిన్నారు. కొద్ది సేపటికే వాంతులు, విరేచనాలు మొదలు కావటంతో రాజానగరం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఫుడ్ పాయిజనింగ్‌గా గుర్తించారు. వారి పరిస్థితి విషమంగా మారటంతో శుక్రవారం రాత్రి కాకినాడకు తరలిస్తుండగా మార్గమధ్యంలో భార్గవ్ కల్యాణ్ మృతి చెందాడు. అజయ్ గణేష్ పరిస్థితి విషమంగా ఉంది. కాకినాడలోని జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. అయితే, అంగన్ వాడీ కేంద్రంలో ఇచ్చిన ఆహారమే కలుషితమైందా? లేక మరేదైనా కారణం ఉండవచ్చా? అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ చేస్తున్నారు.