సాక్షి, హైదరాబాద్: వన్‌స్టాప్ సెంటర్(సఖి) ఆపదలో ఉన్న మహిళను అన్నివిధాలా ఆదుకునే చోటు. గృహహింస, వేధింపులు, దాడులు, ప్రమాదాలకు గురైన మహిళకు తక్షణవైద్యం, న్యాయ, ఆర్థికసాయం అందించే కేంద్రం. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ఈ కేంద్రాలను మహిళలకు మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కసరత్తు చేస్తోంది.
మహిళలపై దాడులు, అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కేంద్రం ద్వారా అందించే సేవలను విస్తృతపర్చాలని అధికారులు నిర్ణయించారు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో కొనసాగే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2017లో ప్రారంభించింది. ఇందులో భాగంగా విడతలవారీగా ఈ కేంద్రాలను తెరుస్తూ 2019 చివరినాటికి అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసింది. వాస్తవానికి రాష్ట్రంలో 36 కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయగా, ఇప్పటివరకు 33 కేంద్రాలను మాత్రమే ప్రారంభించారు. మిగతా కేంద్రాల ఏర్పాటు వివిధ దశల్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఆవశ్యకతను బట్టి కొత్త కేంద్రాలు
రాష్ట్రంలో కొత్తగా సఖి కేంద్రాల ఏర్పాటుపై రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోంది. మహిళలపై దాడులు జరుగు తున్న ప్రాంతాలపై అధికారులు అధ్యయనం చేసి ఎక్కడెక్కడ మహిళలకు అవసరమైన సేవలు అందించవచ్చో పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ప్రతి జిల్లాకేంద్రంలో ఒక సఖి కేంద్రం కొనసాగుతోంది. అయితే జిల్లా కేంద్రానికి రావాలంటే ఎన్నో వ్యయప్రయాసలకు గురికావాల్సి వస్తోందని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిస్థితికి చెక్ పెడుతూ మహిళలకు చేరువలో ఈ కేంద్రాలుండే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో మరిన్ని సఖి కేంద్రాల ఏర్పాటుకు ఇటీవల కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపింది. ప్రతిజిల్లాకు మరోకేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని అందులో ప్రస్తావించింది. ఈ ప్రతిపాదనలకు కేంద్రం సైతం సుముఖత వ్యక్తం చేసింది.
ఇటీవల రాష్ట్రంలో జరిగిన కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాంతీయ సమావేశంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి సైతం ఈ అంశాన్ని అధికారులు వివరించగా ఆమె తక్షణమే సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం కోరినన్ని వన్‌స్టాప్ సెంటర్లను మంజూరు చేస్తామని, మహిళల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పక్షంరోజుల్లో పక్కా ప్రణాళికతో సఖి కేంద్రాల ఏర్పాటుపై పూర్తిస్థాయి ప్రతిపాదనలు పంపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేంద్రం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే వీటి ఏర్పాటును వేగిరం చేయాలని అధికారులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment