Sakhi Center
-
పెళ్లి చేస్తారా? చస్తారా : 13ఏళ్ల బాలిక గలాటా
బషీరాబాద్: పదహారేళ్ల బాలిక తాను ప్రేమించిన యువకుడితో వివాహం చేయాలని తల్లితో గొడవకు దిగింది. ఇప్పుడే పెళ్లి ఏంటని తల్లి మందలించడంతో.. నేరుగా తాను ఇష్టపడ్డ యువకుడి ఇంటికి వెళ్లింది. వివరాలు ఇలా ఉన్నాయి.. బషీరాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఎనిమిదో తరగతి చదివి, ప్రస్తుతం టైలరింగ్ చేస్తోంది. ఇదే ఊరికి చెందిన ప్రశాంత్(21) అనే యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని సదరు బాలిక గత మంగళవారం తల్లి లక్ష్మికి తెలియజేసింది. దీంతో ‘తండ్రిలేని బిడ్డవు.. ఇంకా నీకు పెళ్లి వయసు రాలేదు.. కొంత కాలం ఆగు బిడ్డా’ అని సముదాయించింది. ఇది నచ్చని బాలిక తల్లితో వాగ్వాదానికి దిగింది. నువ్వు చేయకపోతే నేనే చేసుకుంటా అని చెప్పి ప్రశాంత్ ఇంటికి వెళ్లింది. ఈ ఘటనతో అబ్బాయి కుటుంబ సభ్యులు సైతం నిర్ఘాంతపోయారు. బాలిక తల్లి చైల్డ్‌లైన్ 1098కు కాల్ చేసి జరిగిన విషయం చెప్పింది. బుధవారం ఉధయం బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కూతురు పెళ్లిని అడ్డుకోవాలని కోరింది. తన బిడ్డను మందలిస్తే ప్రశాంత్ తనను బెదిరించాడని ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై జిల్లా బాలల హక్కుల పరిరక్షణ విభాగం లీగల్ అధికారి నరేష్, ఎస్ఐ గఫార్ సిబ్బందితో యువకుడి ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. అనంతరం పోలీసులు ప్రశాంత్‌ను పీఎస్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. బాల్య వివాహం చెల్లదని, చట్టప్రకారం శిక్షార్హులవుతారని హెచ్చరించారు. పద్దెనిమిదేళ్లు ఏళ్లు నిండిన తర్వాత అదే యువకుడితో పెళ్లి చేస్తామని బాలికకు భరోసా ఇచ్చారు. అప్పటి వరకు చదువుకోవాలని వికారాబాద్‌లోని సఖి కేంద్రానికి తరలించారు. -
మహిళలకు మరింత చేరువగా ‘సఖి’
సాక్షి, హైదరాబాద్: వన్‌స్టాప్ సెంటర్(సఖి) ఆపదలో ఉన్న మహిళను అన్నివిధాలా ఆదుకునే చోటు. గృహహింస, వేధింపులు, దాడులు, ప్రమాదాలకు గురైన మహిళకు తక్షణవైద్యం, న్యాయ, ఆర్థికసాయం అందించే కేంద్రం. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ఈ కేంద్రాలను మహిళలకు మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కసరత్తు చేస్తోంది. మహిళలపై దాడులు, అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కేంద్రం ద్వారా అందించే సేవలను విస్తృతపర్చాలని అధికారులు నిర్ణయించారు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో కొనసాగే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2017లో ప్రారంభించింది. ఇందులో భాగంగా విడతలవారీగా ఈ కేంద్రాలను తెరుస్తూ 2019 చివరినాటికి అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసింది. వాస్తవానికి రాష్ట్రంలో 36 కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయగా, ఇప్పటివరకు 33 కేంద్రాలను మాత్రమే ప్రారంభించారు. మిగతా కేంద్రాల ఏర్పాటు వివిధ దశల్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆవశ్యకతను బట్టి కొత్త కేంద్రాలు రాష్ట్రంలో కొత్తగా సఖి కేంద్రాల ఏర్పాటుపై రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోంది. మహిళలపై దాడులు జరుగు తున్న ప్రాంతాలపై అధికారులు అధ్యయనం చేసి ఎక్కడెక్కడ మహిళలకు అవసరమైన సేవలు అందించవచ్చో పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ప్రతి జిల్లాకేంద్రంలో ఒక సఖి కేంద్రం కొనసాగుతోంది. అయితే జిల్లా కేంద్రానికి రావాలంటే ఎన్నో వ్యయప్రయాసలకు గురికావాల్సి వస్తోందని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ మహిళలకు చేరువలో ఈ కేంద్రాలుండే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో మరిన్ని సఖి కేంద్రాల ఏర్పాటుకు ఇటీవల కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపింది. ప్రతిజిల్లాకు మరోకేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని అందులో ప్రస్తావించింది. ఈ ప్రతిపాదనలకు కేంద్రం సైతం సుముఖత వ్యక్తం చేసింది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాంతీయ సమావేశంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి సైతం ఈ అంశాన్ని అధికారులు వివరించగా ఆమె తక్షణమే సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం కోరినన్ని వన్‌స్టాప్ సెంటర్లను మంజూరు చేస్తామని, మహిళల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పక్షంరోజుల్లో పక్కా ప్రణాళికతో సఖి కేంద్రాల ఏర్పాటుపై పూర్తిస్థాయి ప్రతిపాదనలు పంపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేంద్రం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే వీటి ఏర్పాటును వేగిరం చేయాలని అధికారులు భావిస్తున్నారు. -
సఖి కేంద్రంలోనే రాత్రి నిద్ర.. మహిళా సిబ్బందితో అసభ్యంగా..
సాక్షి, సూర్యాపేట: ఆపదలో చిక్కుకున్న మహిళలకు ఆశ్రయమిచ్చి భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఎన్జీఓల ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రతి జిల్లాలో సఖి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవి పూర్తిగా ఎన్జీఓల పర్యవేక్షణలో నడుస్తుండటంతో పలు వివాదాలకు నిలయాలుగా మారాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో గల సఖీ కేంద్రం డైరెక్టర్ వెంకట్‌రెడ్డి వ్యవహార శైలి పలు అనుమానాలకు తావిస్తోంది. సఖి కేంద్రాన్ని నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నాడని, నిధులను దుర్వినియోగం చేస్తున్నాడని, మహిళా సిబ్బందితో అసభ్యంగా మాట్లాడుతాడనే ఆరోపణలు వెంకట్‌రెడ్డిపై ఉన్నాయి. రాత్రివేళ వెంకట్‌రెడ్డి సఖి కేంద్రంలోనే నిద్రిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. సోమవారం రాత్రి సఖి కేంద్రంలో వెంకట్‌రెడ్డి ఎంజాయ్ చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో రాత్రి 12గంటలకు పోలీసులు వెళ్లి తనిఖీ చేయగా వెంకట్‌రెడ్డి అక్కడే ఉండటంతో విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. నిబంధనల మేరకు పురుషులు రాత్రి సమయంలో అక్కడ ఉండటం నిశిద్ధం. అక్కడ పనిచేసే మహిళా సిబ్బందితో చనువుగా ఉండటం కోసమే వెంకట్‌రెడ్డి తరచూ అక్కడ బస చేస్తాడని గుసగుసలు వినపడుతున్నాయి. దీనిపై వెంకట్‌రెడ్డిని వివరణ కోరగా.. విధుల్లో భాగంగానే రాత్రివేళ సఖి కేంద్రంలో ఉన్నానే తప్ప.. తనకు మరో ఉద్ధేశం లేదని తెలిపాడు. చదవండి: అయ్యో! ఎంత ఘోరం.. అనారోగ్యంతో బాబు, ఆవేదనతో తల్లి.. -
Ranga Reddy: బాలికను కిడ్నాప్ చేసి.. పెళ్లి చేసుకున్నాడు
సాక్షి, వికారాబాద్(రంగారెడ్డి): బాలికను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న ఘటన కుల్కచర్ల మండల పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కుల్కచర్లకు చెందిన బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 12న ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. బాలిక తండ్రి గ్రామంలో, చుట్టుపక్కల వెతికినా ఆచూకి లభించకపోవడంతో గురువారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదే గ్రామానికి చెందిన శ్రీనుపై అనుమానం ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు శ్రీను బాలికను పెళ్లిచేసుకున్నట్లుగా గుర్తించారు. బాలికను సఖి సెంటర్‌కు తరలించి నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: నల్గొండ మున్సిపాలిటీ అవినీతి కేసు: కదులుతున్నడొంక.. -
Child Marriages: 43 పెళ్లిళ్లకు అడ్డుకట్ట
సాక్షి, యాదాద్రి: చట్టవిరుద్ధమని తెలిసినా తల్లిదండ్రులు తమ పిల్లలకు పసిప్రాయంలోనే పెళ్లి చేస్తున్నారు. మంచి సంబంధం వచ్చిందని, కట్నకానుకలు లేకుండా దొరికడాని, మేనరికం ఓ కారణమైతే నిరక్షరాస్యత, ఆర్థిక ఇబ్బందులు, ఆడపిల్లంటే అభద్రతాభావం, సెల్‌ఫోన్ చాటింగ్‌లు, టీనేజ్‌లో ప్రేమ మరో కారణంగా తెలుస్తోంది. అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా నిత్యం ఏదో ఒక మూలన బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి. రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో గడిచిన నాలుగేళ్లలో అధికారులు 100 బాల్యవివాహాలను అడ్డుకోగా అందులో యాదాద్రి భువనగిరి జిల్లాలోనే 43 ఉన్నాయి. కరోనా వేళ కొన్నిచోట్ల గుట్టచప్పుడు కాకుండా బాల్యవివాహాలు జరిగిపోయినట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇలా.. జిల్లాలోని తుర్కపల్లి, బొమ్మలరామారం, బీబీనగర్, రాజాపేట, ఆలేరు, ఆత్మకూర్ (ఎం), భువనగిరి, సంస్థాన్ నారాయణపురం, మోత్కూరు, చౌటుప్పల్, భూదాన్‌పోచంపల్లి మండలాల్లో బాల్య వివాహాలు గుట్టుచప్పుడు కాకుండా బాల్యవివాహాలు జరుగుతున్నాయి. హైసూ్కల్ స్థాయిలోనే బాలికలకు పెళ్లి చేస్తున్నారు. లో కం తెలియని వయసులో పెళ్లి చేయడం ద్వారా భార్యభర్త మధ్య వివాదాలు తలెత్తి విడాకులకు దారి తీస్తు న్నాయి. దీంతో మైనార్టీ వయస్సులోనే పెళ్లి పెటా కులవుతున్నాయి. బాల్య వివాహాలను అరికట్టేందుకు పోలీ స్, రెవెన్యూ, ఐసీడీఎస్, విద్యాశాఖ, బాలల పరిరక్షణ విభాగం, టీషీం అధికారులు విశేష కృషి చేస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు మరింత పెంచాల్సి ఉంది. బాల్య వివాహాలకు కారణం బాల్య వివాహాలు జరుగడం వెనక పలుకారణాలు వెలుగు చూస్తున్నాయి. కుటుంబ సభ్యుల్లో కోవిడ్ మరణాల భయం, మంచి సంబంధాల నెపం, మేనరికం, లైంగికదాడులు, ప్రేమ వివాహాలు, మంచి సంబంధాలు పోతే దొరకవన్న ఆతృత, పేదరికం, నిరక్షరాస్యత కారణంగా చిన్నతనంలోనే తమ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. గతంలో గిరిజన తండాల్లో ఎక్కువగా బాల్యవివాహాలు జరగగా ఇప్పుడు ఇతర ప్రాంతాల్లోనూ జరుగుతున్నాయి. అధికారుల అనుమతితో! కోవిడ్ సమయంలో గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు వద్ద తీసుకుంటున్న అనుమతితోనే వివాహం చేస్తున్నారు. ఎవరైనా బాల్య వివాహం ఎలా చేస్తున్నారంటే అనుమతిపత్రం చూపుతున్నారు. శుభలేఖ ఆధా రంగా అధికారులు అనుమతులు ఇస్తున్నారు. అయితే ఆధార్‌కార్డు, పాఠశాల బోనాఫైడ్ సర్టిఫికేట్ ఆధారం చూపితే చాల వివాహాలను అడ్డుకోవచ్చు. అయితే అన్ని అనుమతులతోనే వివాహాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. బాల్య వివాహాలను అరికట్టడానికి ఏర్పాటు చేసిన చైల్డ్ మారేజ్ ప్రొటక్షన్ కమిటీలు నామమాత్రంగా మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. గ్రామాల్లో జరగుతున్న బాల్య వివాహాల గురించి సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ టీచర్, ఆయాలకు తెలిసినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సమాచారం చెబితే ఎక్కడ గొడవలు జరుగుతాయోనన్న భయం వారిలో వ్యక్తమవుతోంది. అందుబాటులో హెల్ప్‌లైన్ నంబర్లు బాల్య వివాహాలను అడ్డుకోవడానికి ప్రభుత్వం హెల్ప్‌లైన్ నెంబర్లను అందుబాటులో ఉంచింది. ఎలాంటి బిల్లు లేకుండా ఫోన్ చేస్తే అధికారులు వచ్చి బాల్యవివాహాన్ని అడ్డుకొని కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్ ఇస్తారు. చైల్డ్‌లైన్ నంబర్ 1098, పోలీస్ 100, సఖి సెంటర్ 181కు ఫోన్ చేస్తే వెంటనే అధికారులు స్పందిస్తారు. వివాహం జరిపిన కుటుంబ పెద్దలు, పెళ్లి పెద్ద, పురోహితుడు, వివాహానికి హాజరైన బంధువులు, స్నేహితులు, వివాహానికి సహకరిస్తున్న వారందరిపై కేసులు నమోదు చేస్తారు. బాల్య వివాహాలు నేరం 10 తరగతి పూర్తికా గానే వివాహం చేస్తున్న ఘట నలు వెలుగు చూస్తున్నాయి. బాల్యవివాహాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తే వెంటనే అక్కడికి వెళ్లి అడ్డుకుంటున్నాం. సఖి కేంద్రానికి రప్పించి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. బాల్య వివాహాలు, అక్రమ దత్తతపై సమాచారం ఇవ్వాలని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలను జూమ్ మీటింగ్ ద్వారా కోరాం. హెల్ప్‌లైన్ నంబర్లను కూడా అందుబాటులో ఉంచాం. బాల్య వివాహాలు చేస్తే చర్యరీత్యా నేరం. - బండారు జయశ్రీ, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ సమాచారం ఇవ్వాలి ఎక్కడైనా బాల్యవివాహా లు చేస్తున్నా, అందుకు ప్రయత్నం జరుగుతున్నా వెంటనే సమాచారం ఇవ్వాలి. షీటీం, బాలల పరిరక్షణ విభాగం వెంటనే అక్కడికి చేరుకుంటుంది. బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం చిన్నతనంలో పెళ్లి చేయడం నేరం. కోవిడ్ సమయంలో బాల్య వివాహాలు గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్నారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ అధికారులను జూమ్ మీటింగ్ ద్వారా కోరాం. జిల్లాలో బాల్య వివాహాలపై నిరంతర నిఘా కొనసాగుతోంది. - పి.సైదులు, డీసీపీఓ -
సఖి సెంటర్లో నవ వధువు ఆత్మహత్య
సాక్షి, జనగామ: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంటను వారి కుటుంబాలు కాదు పొమ్మనడంతో.. ప్రేమికురాలు ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన ఆదివారం జనగామ జిల్లా కేంద్రం సఖి సెంటర్లో చోటు చేసుకుంది. జనగామ సీఐ మల్లేశ్ కథనం ప్రకారం.. కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామానికి చెందిన మద్దెబోయిన నర్సయ్య కూతురు శ్రీలేఖ(20), అదే గ్రామానికి చెందిన దేశబోయిన మనోహర్ (20) ప్రేమించుకున్నారు. ఈనెల 16న ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. హైదరాబాద్‌లో ఈ నెల 22న శ్రీలేఖ, మనోహర్ ప్రేమ వివాహం చేసుకుని, రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు. ఇరువురి కుటుంబాలకు పోలీసులు సమాచారం అందించగా కొత్త జంటను తీసుకువెళ్లేందుకు నిరాకరించారు. దీంతో శ్రీలేఖను రక్షణ కోసం జనగామలోని సఖి సెంటర్‌కు పంపించారు. సఖి సెంటర్లో మానసిక వేదనకు గురైన శ్రీలేఖ.. టాయిలెట్ డోర్‌కు చున్నీతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. -
'సఖి'లోనే'దిశ'
దిశ చట్టం అమలుకు ప్రత్యేకంగా దిశ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.దీంతో కలెక్టర్ శేషగిరిబాబు, ఎస్పీ భాస్కర్‌భూషణ్ సఖి సెంటర్ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో దిశ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అటు పోలీసులు, ఇటు సఖి సెంటర్ ఉద్యోగులు సమన్వయంతో మహిళలపై జరుగుతున్న నేరాలను నియంత్రించిబాధితులకు సత్వర న్యాయం అందించేలా చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా దిశ చట్టం కింద నిందితులపై 21 రోజుల్లో చార్జిషీటు దాఖలు చేయడం ద్వారా శిక్ష పడే అవకాశం ఉంటుంది. బాధిత మహిళలకు సత్వర న్యాయం జరుగుతుంది. సాక్షి, నెల్లూరు: పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై అఘాయిత్యం జరిగినా, లైంగిక వేధింపులు, కుటుంబంలో గృహహింసకు గురైనా, అక్రమరవాణా, సైబర్ నేరగాళ్ల బారిన పడడం, ఈవ్‌టీజింగ్ తదితర సమస్యల నుంచి వారికి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వారికి ఓదార్పుతోపాటు కౌన్సెలింగ్, ట్రీట్మెంట్, ఎఫ్ఐఆర్, కోర్టులో న్యాయం జరిగేలా చూసేందుకు సఖి(వన్‌స్టాప్ క్రైసిస్ సెంటర్)ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలోనే నిర్భయ చట్టంతోపాటు దిశ చట్టం అమలు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అన్యాయానికి గురైన బాధిత మహిళలకు 21 రోజుల్లో న్యాయం జరిగి నిందితులకు శిక్ష పడేలా చేయడం దిశ చట్టం ఉద్దేశం. జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ సెంటర్ పర్యవేక్షణ ఉంటుంది. ఇందులో 18 మంది ఉద్యోగులు వివిధ విభాగాల్లో 24 గంటలపాటు సేవలు అందించనున్నారు. దిశ చట్టం అమలుకు ప్రత్యేకంగా పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు, ఎస్సీ భాస్కర్‌భూషణ్ సఖి సెంటర్ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో దిశ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఐదు రకాల సేవలు బాధిత మహిళలు నేరుగా సఖి సెంటర్‌కు వచ్చిన వెంటనే వారికి భరోసా కల్పిస్తారు. ఆపై కౌన్సెలింగ్ ఇచ్చి వైద్య చికిత్సలు అందజేస్తారు. అనంతరం వారికి జరిగిన అన్యాయంపై పోలీసులతో ఎఫ్ఐఆర్ నమోదు చేయిస్తారు. బాధిత మహిళలకు సఖి సెంటర్లోనే ఐదు రోజులపాటు ఉండేందుకు అవసరమైన సదుపాయాలు సమకూర్చుతారు. దిశ చట్టం పరిధిలోకి వస్తే 21 రోజుల్లో విచారణ, చార్జీషీట్ దాఖలు, ట్రయల్ రన్ పూర్తి చేసి కోర్టుకు సమర్పిస్తారు. తద్వారా వెంటనే నిందితులకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. బాధితులకు న్యాయం జరిగేలా మహిళా న్యాయవాదులను కూడా వీరే ఏర్పాటు చేస్తారు. నూతన భవనం మంజూరు వన్ స్టాప్ సెంటర్‌కు అవసరమైన నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఆ భవన నిర్మాణానికి గాను రూ.48.69 లక్షల కేటాయింపులు జరిగాయి. ఆ భవన నిర్మాణ బాధ్యతను కలెక్టర్ ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీకి అప్పగించారు. భవనంతోపాటు చుట్టూ ప్రహరీ కూడా నిర్మించాల్సి ఉంటుంది. ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోనే తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. మూడేళ్లలో 543 కేసులు నమోదు 2017 జూన్‌లో సఖి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి జిల్లాలో మహిళలపై జరిగిన అఘాయిత్యాలకు సంబంధించి బాధితుల నుంచి 543 ఫిర్యాదులు అందాయి. అందులో 167 కేసుల్లో పోలీస్ కేసులు నమోదయ్యాయి. 265 కేసుల్లో మహిళలకు న్యాయసేవలు అందాయి. 59 కేసుల్లో అవసరమైన వైద్య సహాయం అందించారు. 73 కేసుల విషయంలో సమర్థులైన న్యాయకోవిధులు, సమాజంలో ప్రతిభావంతులైన వారి ద్వారా కౌన్సెలింగ్ ఇప్పించి సమస్యలను పరిష్కరించారు. 181 హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు ఎక్కడైనా మహిళలపై అఘాయిత్యాలు, అన్యాయం జరిగినా వెంటనే 181 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేస్తే వెంటనే స్పందన ఉంటుంది. అక్కడి సిబ్బంది వెంటనే పోలీసులను అలర్ట్ చేస్తారు. ఆపై బాధితురాలిని సఖి సెంటర్‌కు పిలిపించి వారికి సేవలు అందించే ప్రయత్నాలు చేస్తారు. 24 గంటలూ ఎప్పుడైనా కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి సేవలు పొందవచ్చు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం సమాజంలో అన్యాయానికి గురైన మహిళలకు సత్వర న్యాయం జరిగేలా సఖి సెంటర్ నిర్వహణ ఉంటుంది. ఈ సెంటర్లోనే దిశ చట్టం కూడా అమలు చేస్తున్నాం. దీంతో బాధిత మహిళలకు న్యాయం జరుగుతుంది. సఖి సెంటర్లో ఐదు రకాల సేవలతో స్వాంతన చేకూర్చి బాధితులకు అండగా ఉంటాం. దిశ చట్టం అమలుతో 21 రోజుల్లోనే వారికి న్యాయం జరుగుతుంది. సఖి సెంటర్లో హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేశాం. ముఖ్యంగా మహిళలకు అవగాహన కల్పిస్తున్నాం.– సుధాభారతి, ఐసీడీఎస్ పీడీ లైంగికదాడికి గురైన వారికి ఆసరా జిల్లా పరిధిలో లైంగికదాడికి గురైన మహిళలకు వైద్య, న్యాయ, మానసిక పరమైన సేవలందించేందుకు ఏర్పాటైన ఒన్ స్టాప్ సెంటర్(సఖి) ఆసరాగా ఉంటుంది. ఇలాంటి సెంటర్లను ఒక్క నెల్లూరు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ప్రాంగణంలోనే కాకుండా కావలి, గూడూరు తదితర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తే లైంగికదాడికి గురైన మహిళలకు సత్వర సేవలు అందే అవకాశం ఉంటుంది. – ఈదల ధనూజారెడ్డి, గృహిణి, నజీర్తోట, నెల్లూరు నగరం సఖి సెంటర్ ఏర్పాటు అభినందనీయం లైంగికదాడికి గురైన మహిళలు, బాలికలకు ప్రత్యేక చికిత్స కోసం ఒన్ స్టాప్ సెంటర్(సఖి)ను ఏర్పాటు చేయడం అభినందనీయం. లైంగికదాడికి గురైన మహిళలు, యువతులు, చిన్నారులు శారీరకంగా అనేక రుగ్మతలకు గురువుతున్నారు. బయటకు చెప్పుకోలేక మానసికంగా కృంగిపోతున్నారు. ఇలాంటి బాధితులకు సఖి సెంటర్లు ఎంతగానో ఉపయోగపడతాయి.– కె.శారద, గృహిణి, నాలుగో మైలు,నవలాకులతోట, నెల్లూరు రూరల్ అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం జిల్లాలో దిశ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మహిళా పోలీస్‌స్టేషన్‌నే దిశ పోలీస్‌స్టేషన్‌గా అప్‌గ్రేడ్ చేస్తున్నాం. íఅదనపు సిబ్బందిని కేటాయిస్తున్నాం. మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకున్నాం. డ్రైవర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సైబర్ నిపుణుల నియామకాలు చేపట్టాల్సిఉంది. – భాస్కర్‌భూషణ్, ఎస్పీ -
‘సఖి’ ఇక కలెక్టరేట్లో!
సాక్షి, హైదరాబాద్: మహిళలకు ఆపద సమయంలో సత్వర సేవలను ఒకే గొడుగు కింద అందించే సఖి (వన్ స్టాప్) సెంటర్లను ప్రభుత్వ భవనాల్లో నిర్వహించే అంశాన్ని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిశీలిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లా కేంద్రాల్లో సఖి కేంద్రాలున్నాయి. వీటిలో దాదాపు అన్ని కేంద్రాలు ప్రైవేటు భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో భద్రత ప్రమాణాల దృష్ట్యా ప్రభుత్వ కార్యాలయాలున్న చోట వీటిని ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆ శాఖ ఈ మేరకు యోచిస్తోంది. ప్రస్తుతం అన్ని కొత్త జిల్లాల్లో కలెక్టరేట్లను నిర్మిస్తుండగా.. ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటికే కలెక్టరేట్ భవనం విశాలమైన ప్రాంతంలో ఉంది. ఈ క్రమంలో కలెక్టరేట్ క్యాంపస్‌లోనే సఖి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ విస్తృత ప్రచారంతో పాటు సేవల కల్పన సులభతరమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. పాత పది జిల్లాల్లో... రాష్ట్రంలో 33 జిల్లాలుండగా.. 26 జిల్లాల్లో మాత్రమే సఖి కేంద్రాలున్నాయి. ఇందులో పాత పది జిల్లాల్లో సఖి కేంద్రాలను ఏర్పాటు చేసి దాదాపు రెండేళ్లవుతోంది. కొత్తగా 23 జిల్లాలు ఏర్పాటైతే అందులో 16 జిల్లాలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం సఖి కేంద్రాలను మంజూరు చేసింది. మిగతా జిల్లాల్లో ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా అవి పెండింగ్‌లో ఉన్నాయి. పండుగ తర్వాత ఈ అంశంపై మంత్రి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. -
'సఖి' పేర గ్రామాల్లో బ్యాంకు సేవలు
సాక్షి, నల్లగొండ: మారుమూల గ్రామాలకు బ్యాంకుసేవలు అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. బ్యాంకు సేవలు అందుబాటులో లేక ఎంతోమంది ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సంబంధిత గ్రామాల్లో మహిళా సంఘాల ద్వారా బ్యాంకుసేవలను అందించేందుకు ఆర్బీఐ నిర్ణయించింది. సఖి పేర సేవలు అందించేందుకు మహిళా సంఘాలను గుర్తించి, బిజినెస్ కరస్పాండెంట్లుగా బాధ్యతలు అప్పజెప్పాలని డీఆర్డీఏకు సూచించింది. వీరి సేవలు అందుబాటులోకి వస్తే ఇకనుంచి గ్రామీణ ప్రాంతాల ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆర్థిక లావాదేవీలు గ్రామాల్లోనే నిర్వహించేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో అడుగు ముందుకేస్తోంది. బిజినెస్ కరస్పాండెంట్లుగా ఆయా గ్రామాల్లో ఎంపిక చేసి వారి ద్వారా బ్యాంకు సేవలను అందించనున్నారు. ఆ గ్రామ మహిళా సమాఖ్య సభ్యుల్లో అక్షరాస్యులైన వా రిని ఎంపిక చేయాల్సి ఉంటుందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. బ్యాంకుసేవలు లేని గ్రామాల్లోనే .. బ్యాంకులు, పల్లె సమగ్ర కేంద్రాలు, సర్వీస్ పాయింట్లు లేని గ్రామాలకు బిజినెస్ కరస్పాండెంట్లను నియమించాల్సి ఉంది. ఆయా గ్రామాల్లోని గ్రామ సమాఖ్య సభ్యుల్లో చదువుకున్న మహిళను గుర్తించాలి. ఈ బిజినెస్స్ కరస్పాండెంట్ సేవలు అందించేందుకు అవసరమైన పరికరాలు కొనుగోలు చేసేందుకు కూడా బ్యాంకు రుణాలు అందించనున్నారు. గ్రామాల్లో సఖి కేంద్రాన్ని డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి బిజినెస్ కరస్పాండెంట్‌ను కూడా ఎంపిక చేస్తారు. వీటన్నింటి నిర్వహణకు సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, తదితర వస్తువులను కొనేందుకు రూ. 50వేలు రుణం కూడా అందించనున్నారు. వీరికి నెలకు రూ. 4వేల చొప్పున వేతనంతో పాటు కమీషన్‌ను కూడా ఇచ్చేం దుకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెలలోనే బిజినెస్ కరస్పాండెంట్ల ఎంపిక డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఈనెలాఖరుకల్లా ఏ గ్రామాల్లోనైతే సఖి ద్వారా బ్యాంకుసేవలు అందించాలని నిర్ణయించారో, ఆ గ్రామాల్లోని మహిళా సమాఖ్య సభ్యుల్లో విద్యావంతులైన వారిని ఎంపిక చేసి బిజినెస్ కరస్పాండెంట్‌గా నియమించనున్నారు. బిజినెస్ కరస్పాండెంట్ (బీసీ)గా అవకాశం దక్కాలంటే సదరు మహిళ 10వ తరగతి చదివిన వారై, అదే గ్రామానికి చెందిన వారై ఉండాలి. అంతే కాకుండా.. స్మార్ట్ ఫోన్ వాడడం కూడా వచ్చి ఉండాలి. ఎంపికైన తర్వాత ఎనిమిది రోజుల పాటు శిక్షణ కూడా అందిస్తారు. బీసీలుగా నియమితులైన వారు బ్యాంకుల్లో రూ. 25వేలు డిపాజిట్ చేసి ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కలిగి ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు చెప్పారు. గ్రామీణ ప్రజలకు తప్పనున్న బాధలు గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకుసేవలు లేక ప్రజలు మండల కేంద్రాలకు రాక తప్పని పరిస్థితి. బ్యాంకులో డబ్బులు వేయాలన్నా, తీయాలన్నా అదే పరిస్థితి. ఆర్బీఐ తీసుకొచ్చిన ఈ నూతన విధానం వల్ల ఏ గ్రామంలోని మహిళా సంఘాలు ఆ గ్రామంలోనే బ్యాంకు సేవలను అందిస్తూ ఆర్థిక లావాదేవీలు జరుపుతూ ఆ గ్రామ ప్రజలకు సేవలు అందించనున్నారు. బిజినెస్ కరస్పాండెంట్లను గుర్తిస్తున్నాం బిజినెస్ కరస్పాడెంట్ల ని యామకానికి ఇప్పటికే మండలాలకు ఆదేశాలు అందాయి. ఆయాగ్రామాల వారీగా ప్రక్రియ ప్రారంభమైంది. నెలలోగా బిజినెస్ కరస్పాండెంట్లను గుర్తిస్తాం. – రామలింగం, డీపీఎం -
మానవత్వం పరిమళించిన వేళ..
సాక్షి, కాకినాడ(తూర్పు గోదావరి): వర్షంలో తడుస్తూ దీనస్థితిలో ఉన్న మహిళను చూసి జిల్లా లీగల్‌సెల్ అథారిటీ సెక్రటరీ వీబీఎస్ శ్రీనివాసరావు చలించి పోయారు. స్థానిక రామారావుపేట సఖి కేంద్రం, నైట్ షెల్టర్‌ను, రికార్డులను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సఖి కేంద్రానికి వచ్చిన సమయంలో ఒక మహిళ వర్షంలో తడుస్తూ ఉండడాన్ని ఆయన గమనించారు. ఆమెను అక్కడున్న ఉద్యోగులు, సిబ్బంది పట్టించుకోకపోవడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి ఆ మహిళను లోపలకి రప్పించి సిబ్బందితో స్నానం చేయించి, దుస్తులు ధరింపజేయించారు. అనంతరం మహిళకు భోజనం పెట్టాలని సఖి సిబ్బందికి శ్రీనివాసరావు డబ్బులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బందితో ఆయన మాట్లాడుతూ ‘సఖి’ అంటే మహిళలకు రక్షణ కల్పించడం, ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలిచి వారికి సహాయం చేయడం, దారితప్పి వచ్చిన మహిళలకు షెల్టర్ ఇచ్చి వారికి కౌన్సెలింగ్ ఇచ్చి బంధువులకు అప్పగించడం ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని, ఇక్కడ ఉద్యోగులు, సిబ్బందిలో అటువంటి సేవాదృక్పథం కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని, లేదంటే ఉద్యోగులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
పరిమళించిన మానవత్వం
సాక్షి, ధర్మపురి : మతిస్థిమితం సరిగా లేక కష్టాల్లో ఉన్న బాలికను చేరదీసి మానవత్వమింకా బతికే ఉందని నిరూపించారు. అభం శుభం తెలియని అనాథ యువతిని ఐసీడీఎస్ అధికారులు చేరదీసి తమ ఆధీనంలోకి తీసుకున్న సంఘటన మండలంలోని కమలాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఒడ్డేటి శంకరయ్య–గంగవ్వ దంపతులకు సుమలత, మంజుల సంతానం. పదేళ్ల క్రితం తల్లిదండ్రులిద్దరూ మరణించారు. దీంతో సుమలత, మంజుల అనాథలయ్యారు. పెద్ద కూతురు సుమలత మతిస్థిమితం సరిగా లేక మంచానికే పరిమితమైంది. అక్క భారమంతా చెల్లె మంజులపై పడింది. అక్కను సాకడానికి చెల్లి కూలీ పని చేస్తూ నెట్టుకొస్తుంది. పెళ్లీడుకొచ్చిన చెల్లెకు ఇటీవల గ్రామస్తులు చందాలు పోగుచేసి పెళ్లిచేసి అత్తారింటికి పంపించారు. దీంతో అక్క ఒంటరిగా మిగిలిపోయింది. మతిస్థిమితం సరిగా లేని అక్క సుమలతకు నా అనేవారు కరువయ్యారు. ఒక వైపు తల్లిదండ్రులు లేక మరోవైపు చెల్లె పెళ్లి చేసుకొని వెళ్లగా ఒంటరిగా ఉండిపోయింది. చిప్పిరి జుట్టు, చినిగిన దుస్తులతో కడుపుకు అన్నం లేక బాధితురాలి బతుకు అగమ్యగోచరంగా తయారైంది. చేరదీసిన ఐసీడీఎస్ అధికారులు.. ఐసీడీఎస్ సీడీపీవో అధికారులకు సుమలత దీనగాథను సర్పంచ్ లక్ష్మి తెలియజేసింది. డీడబ్ల్యూవో నరేందర్, పీడీల ఆదేశాలతో సూపర్వైజర్ జయప్రద సోమవారం గ్రామాన్ని సందర్శించి అనాథ యువతిని చేరదీశారు. చిప్పిరి జుట్టును కత్తిరించి, స్నానం చేయించి శుభ్రం చేయించారు. బాధితురాలి ఆరోగ్యపరిస్థితిపై ప్రత్యేక దృష్టి సారించి మందులు అందించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. సుమలత బాగుకోసం గ్రామస్తుల సహకారంతో హైదరాబాద్‌లోని సఖీ కేంద్రానికి తరలించే ఏర్పాట్లు చేస్తామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్ నరేశ్, నాయకులు ప్రసాద్, నాగరాజు గ్రామస్తులు తదితరులున్నారు. యువతిని చేరదీస్తున్న ఐసీడీఎస్ అధికారి. -
మహిళలకు ‘సఖి’ భరోసా
సాక్షి, హైదరాబాద్: కుటుంబం, పనిచేసే ప్రదేశం సహా పలు చోట్ల మహిళలు, బాలికలు మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురవుతున్నారు. అలాంటి బాధిత మహిళలకు మేమున్నామంటూ సఖి కేంద్రాలు భరోసా ఇస్తున్నాయి. అతివలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తూ అండగా నిలుస్తున్నాయి. వేధింపులకు గురై బయటకు చెప్పుకోలేని మహిళలు, బాలికలకు మనోధైర్యం కల్పించేందుకు ప్రభుత్వం సైతం చేయూత అందిస్తుంది. దీనిలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సఖి కేంద్రాలను ఏర్పాటు చేసింది. వ్యక్తిగత సమస్యలతో వచ్చేవారికి న్యాయపరమైన çసూచనలు ఇవ్వడంతో పాటు అన్ని రకాల సేవలను అందిస్తున్నాయి. న్యాయ, వైద్య, పోలీసుశాఖల సమన్వయంతో ఈ సేవలను ఉచితంగా అందిస్తున్నాయి. సలహా, సాంత్వన, రక్షణే లక్ష్యంగా కౌన్సెలింగ్, న్యాయసేవలు, కేసు నమోదు, పోలీసుల సహాయం, వైద్య సేవలు, తాత్కాలిక వసతి వంటి సేవలను అందిస్తున్నాయి. మహిళలకు 181 హెల్ప్‌లైన్..: సఖీ కేంద్రాలకు రాలేని మహిళల కోసం హెల్ప్‌లైన్‌ను సైతం ఏర్పాటు చేశాయి. సమస్యల్లో ఉన్న మహిళలు టోల్‌ఫ్రీ నంబర్ 181ను సంప్రదించవచ్చు. ఇది 24్ఠ7 అందుబాటులో ఉంటుంది. ఏ సమయం లోనైనా బాధితులు ఫోన్ ద్వారా సంప్రదిస్తే ఓ వాహనం వారు ఉన్న ప్రదేశానికి వస్తుంది. ఈ వాహనంలో ఒక మహిళా కానిస్టేబుల్‌తో పాటు సైక్రియాటిస్ట్ ఉంటారు. వీరు బాధితురాలికి భరోసా ఇస్తూ సఖి కేంద్రాలకు తీసుకెళ్తారు. సఖి సెంటర్లో లభించే సేవలు.. హింస, వేధింపుల బారినపడ్డ వారికి నేషనల్ హెల్త్ మిషన్, 108, పోలీసులతో అత్యవసర సేవలందిం చడం, వారిని కాపాడిన తర్వాత ఆశ్రయం కల్పించ డం కోసం సమీపంలోని హోమ్‌లకు తరలించడం, బాధితులకు వైద్య సేవలందించేందుకు సమీప దవాఖాన్లకు పంపించడం వంటి సేవలను సఖి కేంద్రాలు అందిస్తాయి. వారికి అవసరమయ్యే పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తారు. తాత్కాలికంగా మహిళా హోమ్‌లలో ఆశ్రయం కల్పించి, కనీసం ఐదు రోజులకు తక్కువ కాకుండా వసతి కల్పిస్తారు. బాధితులు కోర్టు ప్రొసీడింగ్స్‌కు హాజరుకాలేని పరిస్థితుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో తమ వాదనలు వినిపించే సౌకర్యాన్ని సైతం కల్పిస్తారు. మహిళలకు అండగా.. వేధింపులకు గురైన బాధిత మహిళలకు అండగా నిలవడానికి సఖీ కేంద్రాలు నిరంతరం పనిచేస్తున్నాయి. మహిళలకు రక్షణ కల్పించేలా అన్ని రకాల సేవలు సఖి కేంద్రాల్లో అందుబా టులో ఉన్నాయి. అవగాహనా రాహిత్యంతో చాలామంది సఖి కేంద్రాలకు రాలేకపోతున్నా రు. ఎన్జీవోలు, పోలీసు శాఖల సహకారంతో అలాంటి వారిని గుర్తించి సఖి కేంద్రాలకు తరలిస్తున్నారు. మహిళలు, బాలికలు, చిన్నారు లు తమ సమస్యలు చెప్పుకునేలా ఎన్జీవోల సహకారంతో పలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – విజయేందిర బోయి, మహిళా శిశు సంక్షేమ శాఖ సంచాలకులు -
సఖి.. మహిళా ప్రత్యేకం!
కుత్బుల్లాపూర్: ప్రతి రంగంలో మహిళల ప్రాధాన్యం రోజురోజుకు పెరుగుతోంది. ఆ రంగం.. ఈ రంగం.. అనే తేడా లేకుండా మహిళలు అన్నింట్లో సత్తా చాటుతున్నారు. చిన్న ఉద్యోగాలు మొదలు.. చట్ట సభల వరకూ మహిళల ప్రాతినిధ్యం ఉంది. ఇక ప్రజాప్రతినిధుల ఎన్నిక విషయంలో మహిళల పాత్ర ఎంత ముఖ్యమో చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మహిళా ఓటర్లను మరింత ప్రోత్సహించేందుకు, వారు సక్రమంగా, సులభతరంగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ప్రత్యేక పోలింగ్ బూత్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. అవే ‘సఖి’ (పింక్) పోలింగ్ బూత్‌లు. మహిళలు పోలింగ్ బూత్‌లకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు ప్రత్యేకంగా సఖీ (పింక్) పోలింగ్ బూత్‌లను అందుబాటులోకి తేనున్నారు. మహిళల చేత, మహిళల కొరకు... ఈ బూత్‌లను రూపొందిస్తారు. ఇటీవల కర్నాటకలో జరిగిన ఎన్నికల్లో 224 పింక్ పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయగా... ఆయా బూత్‌లలో మహిళల ఓటింగ్ శాతం గణనీయంగా పెరగడం గుర్తించారు. ఈ ఫలితాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణలోనూ పింక్ బూత్‌లను ఏర్పాటు చేసేందుకు ఎన్నికల కమిషన్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. గ్రేటర్లో 23 బూత్‌లు... గ్రేటర్ పరిధిలో 23 అసెంబ్లీ నియోకజవర్గాలు ఉండగా... ఒక్కో నియోజకవర్గానికి ఒక్కటి చొప్పున 23 ‘సఖి’ పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఏయే ప్రాంతాల్లో పింక్ బూత్‌లు ఏర్పాటు చేయాలో నిర్ధారించి ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలోని అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు 50శాతానికి మించి తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒక్క ఉప్పల్ నియోజకవర్గంలో మాత్రం మహిళా ఓటర్లు 58.67శాతం ఉండగా... మిగిలిన నియోజకవర్గాల్లో సగం కన్నా తక్కువగా మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరూ మహిళలే... అంతా పింక్నే... ఈ పోలింగ్ బూత్‌లలో బందోబస్తు మొదలు ఎన్నికల అధికారి వరకు అందరూ మహిళలే విధులు నిర్వర్తిస్తారు. పోలింగ్ బూత్ మొత్తాన్ని పింక్ కలర్లో ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నారు. బూత్ ప్రవేశం మొదలుకొని లోపల సీలింగ్, ఫ్లోర్, టేబుళ్లతో పాటు ఆఖరికి ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది సైతం గులాబీ రంగు దుస్తులు ధరిస్తారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద ‘వీ గో పింక్.. వీ గో టు ది పోల్స్’ నినాదాలు కనిపిస్తాయి. అయితే బూత్ మొత్తం గులాబీమయంగా ఉండనుండడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. టీఆర్ఎస్ జెండా రంగు పింక్ కావడంతో ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. మహిళలకు ప్రత్యేక పోలింగ్ బూత్‌ల ఏర్పాటును స్వాగతిస్తున్నప్పటికీ... రంగు విషయంలోమాత్రం తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు. -
కనికరించని ‘సఖి’
సాక్షి, హైదరాబాద్: పదిహేడేళ్ల బాలిక.. పైగా గర్భవతి. నా అనేవారు లేరు.. ఓ కామాంధుడి మాయమాటలు నమ్మి మోసపోయి గర్భం దాల్చింది. తలదాచుకునే చోటు లేదు. ఆశ్రయం కోసం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సఖి కేంద్రానికి వెళ్లగా సిబ్బంది కనికరించలేదు. క్లిష్టపరిస్థితుల నుంచి వచ్చిన బాలికలు, మహిళలను ఎలాంటి సిఫారసు లేకుండా ఆశ్రయం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సఖి(ఒన్ స్టాప్ సెంటర్) కేంద్రం మానవత్వం మరిచింది. సిబ్బంది ఉదాసీన వైఖరితో ఏడు నెలల గర్భవతి అయిన బాలిక ఘోర అవమానం ఎదుర్కొంది. వివరాలు... మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఏడు నెలల గర్భంతో ఉన్న పదిహేడేళ్ల అనాథ బాలిక ఆశ్రయం కోసం ఈ నెల 20న పోలీస్ స్టేషన్లో సంప్రదించింది. తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు వివరించి ఆశ్రయం కల్పించి న్యాయం చేయాలని వేడుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆశ్రయం కోసం ఉమ్మడి జిల్లాలో ఉన్న సఖి కేంద్రం నిర్వాహకులను సంప్రదించారు. సీడబ్ల్యూసీ(చైల్డ్ వెల్ఫేర్ కమిటీ) ఆమోదం ఉంటేనే ఆశ్రయం కల్పిస్తామని, వారిని సంప్రదించాలని నిర్వాహకులు సలహా ఇచ్చారు. దీంతో సదరు పోలీసు అధికారి సీడబ్ల్యూసీ చైర్మన్‌ను ఫోనులో సంప్రదించగా వెల్ఫేర్ కమిటీ ఆమోదంతో కూడిన లేఖను మరుసటి రోజు ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. సీడబ్ల్యూసీ సిఫారసు లేఖ లేకపోవడంతో ఆ బాలికకు సఖి నిర్వాహకులు ఆశ్రయం ఇవ్వలేదు. దీంతో ఆ పోలీసు అధికారి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ అధికారులను సంప్రదించారు. చివరగా ఉప్పల్ సమీపంలోని ఓ చోట ఆశ్రయం కల్పించారు. ప్రమాదానికి గురైన బాధిత మహిళ/బాలిక సఖి కేంద్రానికి వస్తే తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స ఇవ్వాలి. ఇందుకు సఖి కేంద్రంలో ప్రత్యేక వ్యవస్థ ఉంది. ఆ తర్వాత బాధితురాలికి ఆశ్రయం ఇవ్వడంతోపాటు కౌన్సెలింగ్ నిర్వహించాలి. తర్వాత వసతులు కల్పించి న్యాయసహకారం అందించాలి. -
‘సఖి’.. ప్రైవేటు పరం!
సాక్షి, హైదరాబాద్: సఖి.. దాడులు, వేధింపులకు గురైన ఆడబిడ్డకు అండగా ఉండి అన్ని రకాల సేవలు అందించే భరోసా కేంద్రం. నిర్భయ చట్టం, పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం, పొక్సో చట్టంతో పాటు మహిళల పట్ల అసభ్య ప్రవర్తనపై క్రిమినల్ కేసుల నమోదు బాధ్యతంతా ఈ కేంద్రాలదే. ఒక మహిళ తనపై దాడి జరిగిందని సఖి కేంద్రాన్ని సంప్రదిస్తే ఆమెకు తక్షణ వైద్య సాయంతో పాటు బాధ్యులపై కేసు నమోదు చేయించడం, బాధితురాలికి అండగా న్యాయ సాయం అందించడం, కౌన్సెలింగ్, ఆర్థిక చేయూత, వసతి వంటి చర్యలన్నీ అందిస్తారు. ఇలాంటి కీలక సఖి కేంద్రాలు స్వచ్ఛంద సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. ప్రభుత్వ శాఖలు నిర్వహించాల్సిన ఈ బాధ్యతలు కాస్తా ప్రైవేటు వ్యక్తుల పాలవుతున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ శాఖలతోనే.. మహిళల కోసం ప్రత్యేకంగా ఉన్న చట్టాల అమలుకు కేంద్ర ప్రభుత్వం సఖి కేంద్రాలను జిల్లాకొకటి చొప్పున మంజూరు చేసింది. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా ఉమ్మడి 9 జిల్లాలకు సఖి కేంద్రాలను తొలివిడతగా మంజూరు చేసింది. రెండోవిడతలో తాజాగా మరో 8 కొత్త జిల్లాల్లోనూ ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. తొలివిడతలోని కేంద్రాల్లో ఒక్కోదాని ఏర్పాటుకు రూ.48 లక్షల చొప్పున మంజూరు చేసిన కేంద్రం.. నిర్వహణ కోసం రూ.20 లక్షలు విడుదల చేసింది. అయితే ఆ సఖి కేంద్రాల నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఏకంగా స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో)లకు కట్టబెట్టింది. వాస్తవానికి ఈ కేంద్రాల నిర్వహణ, పర్యవేక్షణ అంతా ప్రభుత్వ శాఖలే నిర్వహించాలి. అప్పుడే చట్టాల అమలు, నిఘా సమర్థవంతంగా ఉంటుంది. ఈ సఖి కేంద్రాల నిర్వహణ పొరుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ శాఖలే నిర్వహిస్తుండగా, ఇక్కడ మాత్రం ఎన్జీవోలకు అప్పగించడం పట్ల తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అంతా రహస్యమే... సఖి కేంద్రాల నిర్వహణ బాధ్యతల అప్పగింత ప్రక్రియ రహస్యంగా జరిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలను ప్రైవేటుకు అప్పగించాల్సి వస్తే నోటిఫికేషన్ ఇవ్వడం, దరఖాస్తుల ఆధారంగా పరిశీలించి బాధ్యతల్ని అప్పగిస్తారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా, కనీసం జిల్లా సంక్షేమాధికారికి కూడా సమాచారం లేకుండా ఎన్జీఓల ఎంపిక జరిగిందని సమాచారం. ఈ వ్యవహారం మొత్తం ఓ ఉన్నతాధికారి వెనకుండి నడిపించారనే ఆరోపణలన్నాయి. సఖి కేంద్రాల నిర్వహణ బాధ్యతలను దక్కించుకున్న ఎన్జీవోలు.. వాటిలో పనిచేసే సిబ్బంది ఎంపిక ప్రక్రియ ముమ్మరం చేశాయి. ఇప్పటికే మెజార్టీ సంస్థలు నియామకాల ప్రక్రియను పూర్తిచేశాయి. ఈ చట్టాల అమలుకు సంబంధించి నిపుణులనూ ఏకపక్షంగా ఎంపిక చేశారని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రతి ఫిర్యాదును తప్పకుండా పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే బాధ్యతల నుంచి ఎన్జీఓలను తప్పిస్తామని అధికారులు చెబుతున్నారు. -
మహిళల రక్షణకు.. సఖి
♦ అఘాయిత్యాలకు గురైన మహిళకు ప్రత్యేక చికిత్స ♦ ఒకేచోట అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ♦ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే పాలమూరు : వివిధ రూపాల్లో అఘాయిత్యాలకు గురై ఇబ్బంది పడుతున్న మహిళలు, యువతులు, బాలికలకు సఖి కేంద్రంలో ప్రత్యేక చికిత్స అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రి ఆవరణలో రూ.42లక్షల వ్యయంతో నిర్మించనున్న సఖి భవన నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళలపై అఘాయిత్యాలు తగ్గించేలా చూడడంతో పాటు బాధితులకు ‘సఖి’ ద్వారా అండగా వైద్యుడు, పోలీస్ అధికారులు, న్యాయవాదులు, మానసిక వ్యక్తిత్వ వికాస నిపుణులు.. అందరూ సఖి కేంద్రంలో ఉంటారని చెప్పారు. కాగా, మూడు అంతస్తులతో భవనం నిర్మిస్తుండగా.. మూడు నెలల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ రాధ, శిశు సంక్షేమ అధికారి గోవిందరాజులు, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకిషన్, గైనిక్ హెచ్ఓడీ రాధ పాల్గొన్నారు.