మహిళ వివరాలను తెలుసుకుంటున్న జిల్లా లీగల్‌సెల్ అధారిటీ సెక్రటరీ శ్రీనివాసరావు
సాక్షి, కాకినాడ(తూర్పు గోదావరి): వర్షంలో తడుస్తూ దీనస్థితిలో ఉన్న మహిళను చూసి జిల్లా లీగల్‌సెల్ అథారిటీ సెక్రటరీ వీబీఎస్ శ్రీనివాసరావు చలించి పోయారు. స్థానిక రామారావుపేట సఖి కేంద్రం, నైట్ షెల్టర్‌ను, రికార్డులను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సఖి కేంద్రానికి వచ్చిన సమయంలో ఒక మహిళ వర్షంలో తడుస్తూ ఉండడాన్ని ఆయన గమనించారు. ఆమెను అక్కడున్న ఉద్యోగులు, సిబ్బంది పట్టించుకోకపోవడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి ఆ మహిళను లోపలకి రప్పించి సిబ్బందితో స్నానం చేయించి, దుస్తులు ధరింపజేయించారు. అనంతరం మహిళకు భోజనం పెట్టాలని సఖి సిబ్బందికి శ్రీనివాసరావు డబ్బులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బందితో ఆయన మాట్లాడుతూ ‘సఖి’ అంటే మహిళలకు రక్షణ కల్పించడం, ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలిచి వారికి సహాయం చేయడం, దారితప్పి వచ్చిన మహిళలకు షెల్టర్ ఇచ్చి వారికి కౌన్సెలింగ్ ఇచ్చి బంధువులకు అప్పగించడం ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని, ఇక్కడ ఉద్యోగులు, సిబ్బందిలో అటువంటి సేవాదృక్పథం కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని, లేదంటే ఉద్యోగులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment