కర్నాటక ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన ‘సఖి’ పోలింగ్ బూత్ (ఫైల్)
కుత్బుల్లాపూర్: ప్రతి రంగంలో మహిళల ప్రాధాన్యం రోజురోజుకు పెరుగుతోంది. ఆ రంగం.. ఈ రంగం.. అనే తేడా లేకుండా మహిళలు అన్నింట్లో సత్తా చాటుతున్నారు. చిన్న ఉద్యోగాలు మొదలు.. చట్ట సభల వరకూ మహిళల ప్రాతినిధ్యం ఉంది. ఇక ప్రజాప్రతినిధుల ఎన్నిక విషయంలో మహిళల పాత్ర ఎంత ముఖ్యమో చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మహిళా ఓటర్లను మరింత ప్రోత్సహించేందుకు, వారు సక్రమంగా, సులభతరంగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ప్రత్యేక పోలింగ్ బూత్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. అవే ‘సఖి’ (పింక్) పోలింగ్ బూత్‌లు.
మహిళలు పోలింగ్ బూత్‌లకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు ప్రత్యేకంగా సఖీ (పింక్) పోలింగ్ బూత్‌లను అందుబాటులోకి తేనున్నారు. మహిళల చేత, మహిళల కొరకు... ఈ బూత్‌లను రూపొందిస్తారు. ఇటీవల కర్నాటకలో జరిగిన ఎన్నికల్లో 224 పింక్ పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయగా... ఆయా బూత్‌లలో మహిళల ఓటింగ్ శాతం గణనీయంగా పెరగడం గుర్తించారు. ఈ ఫలితాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణలోనూ పింక్ బూత్‌లను ఏర్పాటు చేసేందుకు ఎన్నికల కమిషన్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది.
గ్రేటర్‌లో 23 బూత్‌లు...
గ్రేటర్ పరిధిలో 23 అసెంబ్లీ నియోకజవర్గాలు ఉండగా... ఒక్కో నియోజకవర్గానికి ఒక్కటి చొప్పున 23 ‘సఖి’ పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఏయే ప్రాంతాల్లో పింక్ బూత్‌లు ఏర్పాటు చేయాలో నిర్ధారించి ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలోని అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు 50శాతానికి మించి తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒక్క ఉప్పల్ నియోజకవర్గంలో మాత్రం మహిళా ఓటర్లు 58.67శాతం ఉండగా... మిగిలిన నియోజకవర్గాల్లో సగం కన్నా తక్కువగా మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అందరూ మహిళలే... అంతా పింక్‌నే...
ఈ పోలింగ్ బూత్‌లలో బందోబస్తు మొదలు ఎన్నికల అధికారి వరకు అందరూ మహిళలే విధులు నిర్వర్తిస్తారు. పోలింగ్ బూత్ మొత్తాన్ని పింక్ కలర్‌లో ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నారు. బూత్ ప్రవేశం మొదలుకొని లోపల సీలింగ్, ఫ్లోర్, టేబుళ్లతో పాటు ఆఖరికి ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది సైతం గులాబీ రంగు దుస్తులు ధరిస్తారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద ‘వీ గో పింక్.. వీ గో టు ది పోల్స్’ నినాదాలు కనిపిస్తాయి. అయితే బూత్ మొత్తం గులాబీమయంగా ఉండనుండడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. టీఆర్‌ఎస్ జెండా రంగు పింక్ కావడంతో ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. మహిళలకు ప్రత్యేక పోలింగ్ బూత్‌ల ఏర్పాటును స్వాగతిస్తున్నప్పటికీ... రంగు విషయంలోమాత్రం తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment