
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు ముందు కూటమి కట్టిన బీఎల్‌ఎఫ్ ప్రభావం ఈ ఎన్నికల్లో పెద్దగా కనిపించినట్లుగా లేదు. కూటమిలో పెద్ద పార్టీ అయిన సీపీఎం 2014 ఎన్నికల్లో 37 సీట్లలో పోటీచేసి కేవలం ఒక్క సీటు మాత్రమే గెలించింది. ఈ సారి సీపీఎం పార్టీ తెలంగాణ అధ్యక్షులు తమ్మినేని వీరభద్రం బహుజన వామపక్ష కూటమి(బహజన లెఫ్ట్ ప్రంట్(బీఎల్‌ఎఫ్)) పేరుతో సీపీఎంతో పాటు చిన్నచితకా 28 పార్టీలను ఒక కూటమిగా ఏర్పాటు చేసి ఎన్నికల్లోకి దిగారు. సీపీఎం మిత్రపక్షమైన సీపీఐ మాత్రం ప్రజా కూటమితో పొత్తుపెట్టుకుని మూడు స్థానాల్లో బరిలోకి దిగింది.
కొన్ని చోట్ల టీఆర్‌ఎస్, ప్రజా కూటమి, బీజేపీ నుంచి ఎమ్మెల్యే సీటు రాని అభ్యర్థులు కొందరు బీఎల్‌ఎఫ్ పార్టీ నుంచి పోటీకి దిగారు. మొత్తంగా 109 స్థానాల్లో ఈ కూటమి పోటీ చేసింది. 26 చోట్ల సీపీఎం అభ్యర్థులు తమ పార్టీ గుర్తు సుత్తి,కొడవలి, నక్షత్రం కలిసిన గుర్తుపై పోటీ చేయగా..మిగిలిన బీఎల్‌ఎఫ్ అభ్యర్థులు రైతు నాగలి గుర్తుపై పోటీ చేశారు. మొత్తంగా 9 స్థానాల్లో బీఎల్‌ఎఫ్ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని భావించినా వారి ప్రభావం మాత్రం ఈ ఎన్నికల్లో కనపడినట్లుగా లేదు. ఒకటి రెండు చోట్ల మినహా ఎక్కడా కూడా 5 వేలకు మించి ఓట్లు బీఎల్‌ఎఫ్ అభ్యర్థులకు రాలేదు. మరి కొన్ని చోట్ల వేయి ఓట్లు కూడా రాలేదు.