BLF-2017
-
బీఎల్ఎఫ్ ప్రభావం అంతంత మాత్రమే!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు ముందు కూటమి కట్టిన బీఎల్ఎఫ్ ప్రభావం ఈ ఎన్నికల్లో పెద్దగా కనిపించినట్లుగా లేదు. కూటమిలో పెద్ద పార్టీ అయిన సీపీఎం 2014 ఎన్నికల్లో 37 సీట్లలో పోటీచేసి కేవలం ఒక్క సీటు మాత్రమే గెలించింది. ఈ సారి సీపీఎం పార్టీ తెలంగాణ అధ్యక్షులు తమ్మినేని వీరభద్రం బహుజన వామపక్ష కూటమి(బహజన లెఫ్ట్ ప్రంట్(బీఎల్ఎఫ్)) పేరుతో సీపీఎంతో పాటు చిన్నచితకా 28 పార్టీలను ఒక కూటమిగా ఏర్పాటు చేసి ఎన్నికల్లోకి దిగారు. సీపీఎం మిత్రపక్షమైన సీపీఐ మాత్రం ప్రజా కూటమితో పొత్తుపెట్టుకుని మూడు స్థానాల్లో బరిలోకి దిగింది. కొన్ని చోట్ల టీఆర్ఎస్, ప్రజా కూటమి, బీజేపీ నుంచి ఎమ్మెల్యే సీటు రాని అభ్యర్థులు కొందరు బీఎల్ఎఫ్ పార్టీ నుంచి పోటీకి దిగారు. మొత్తంగా 109 స్థానాల్లో ఈ కూటమి పోటీ చేసింది. 26 చోట్ల సీపీఎం అభ్యర్థులు తమ పార్టీ గుర్తు సుత్తి,కొడవలి, నక్షత్రం కలిసిన గుర్తుపై పోటీ చేయగా..మిగిలిన బీఎల్ఎఫ్ అభ్యర్థులు రైతు నాగలి గుర్తుపై పోటీ చేశారు. మొత్తంగా 9 స్థానాల్లో బీఎల్ఎఫ్ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని భావించినా వారి ప్రభావం మాత్రం ఈ ఎన్నికల్లో కనపడినట్లుగా లేదు. ఒకటి రెండు చోట్ల మినహా ఎక్కడా కూడా 5 వేలకు మించి ఓట్లు బీఎల్ఎఫ్ అభ్యర్థులకు రాలేదు. మరి కొన్ని చోట్ల వేయి ఓట్లు కూడా రాలేదు. -
'రెబల్స్' గుబులు...
సాక్షి, ఆదిలాబాద్ : అనుకున్నంతా అయిందని ఆయా పార్టీల అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. పార్టీ టికెట్టు ఆశించి భంగపడ్డ నాయకులు పార్టీ పైనే ప్రతీకారం తీర్చుకునేందుకు రెబల్స్‌గా బరిలోకి దిగారు. పార్టీ నిబంధనలకు కట్టుబడి నామినేషన్ ఉపసంహరించుకుంటారని భావించిన అభ్యర్థులకు చుక్కెదురైంది. పార్టీ టికెట్టు ఇవ్వకపోయినా... బీ–ఫారాలతో సిద్ధంగా ఉన్న ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీల నుంచి టికెట్లు తెచ్చుకొని మరీ పోటీ చేస్తూ అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నారు. ఒకటి రెండు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు ధీటుగా ప్రచారం చేస్తున్న రెబల్స్ చాలా చోట్ల విజయావకాశాలను దెబ్బతీసే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో పోటీ రసవ్తరంగా మారింది. చుక్కలు చూపిస్తున్న మాజీ మంత్రి వినోద్.. టీఆర్ఎస్ అభ్యర్థిగా చెన్నూరు నుంచి సీటు ఆశిం చి భంగపడ్డ మాజీ మంత్రి గడ్డం వినోద్ చివరికి బెల్లంపల్లి సీటైనా ఇవ్వాలని అధిష్టానాన్ని అభ్యర్థించారు. పార్టీ కాదనడంతో కాంగ్రెస్ లేదా మహాకూటమిలోని పార్టీల తరుపున బెల్లంపల్లి సీటు కోసం విఫలయత్నం చేశారు. బెల్లంపల్లి సీటును సీపీఐకి కేటాయించడంతో మాజీ ఎమ్మె ల్యే గుండ మల్లేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో వినోద్ బహుజన సమాజ్ పార్టీ నుం చి అవకాశం రావడంతో ఆ పార్టీ గుర్తుపై పోటీ పడుతున్నారు. తన సోదరుడు, టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ జి.వివేక్‌తో కూడా విభేదించి పోటీలో కొనసాగుతున్నారు. వినోద్‌కు టీఆర్ఎస్కు చెందిన బెల్లంపల్లి మున్సిపాలిటీలోని మెజారిటీ పాలకవర్గం మద్దతు తెలుపగా, నియోజకవర్గం లోని కాంగ్రెస్ నాయకుల నుంచి మండలాల వారీగా మద్దతు లభిస్తోంది. వినోద్ బీఎస్పీ నుంచి గట్టిపోటీ ఇస్తున్నట్లు తేటతెల్లమైంది. దీంతో టీఆర్ఎస్, సీపీఐ అభ్యర్థులు దుర్గం చిన్నయ్య, గుండ మల్లేష్ కూడా వినోద్‌నే టార్గెట్ చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు. ఇక్కడ బీజేపీ నుంచి కొయ్యల ఏమాజీ కూడా బరిలో దిగడంతో చతుర్ముఖ పోటీ పరిస్థితి నెలకొంది. వినోద్‌కు లభిస్తున్న ఆదరణతో మిగతా పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. ముథోల్‌లో పటేళ్ల పోరు ముథోల్‌లో కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్, ఆయనకు వరుసకు సోదరుడైన రామారావు పటేల్ పోటీపడ్డారు. రామారావు పటేల్ టికెట్టు తెచ్చుకోవడంతో నారాయణరావు పటేల్ రెబల్ అవతారం ఎత్తారు. శరద్‌పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నుంచి బీ–ఫారం తెచ్చి పోటీలో నిలిచారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి విఠల్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రామారావు పటేల్, బీజేపీ అభ్యర్థి రమాదేవిలకు ధీటుగా నారాయణరావు పటేల్ పోటీ పడుతున్నారు. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నారాయణరావు పటేల్‌కు గ్రామాల్లో ఉన్న సంబంధాలను చూసి మిగతా పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. రామారావు పటేల్‌పై కోపంతోనే పోటీలో నిల్చిన నారాయణరావు పటేల్ ఎవరి విజయావకాశాలను దెబ్బతీస్తారోనని అభ్యర్థులు భయపడుతున్నారు. గత ఎన్నికల్లో అభ్యర్థులు... ఇప్పుడు రెబల్స్‌గా.. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్టుపై పోటీ చేసి ఓడిపోయిన అనిల్ జాదవ్ (బోథ్), అజ్మీరా హరినాయక్ (ఖానాపూర్) ఇప్పుడు రెబల్స్‌గా బరిలో నిలిచారు. బోథ్ టికెట్టు సోయం బాపూరావుకు రాగా, ఖానాపూర్ సీటును రమేష్ రాథోడ్ దక్కించుకున్నారు. బోథ్‌లో ఆదివాసీ ఓట్లపై నమ్మకంతో కాంగ్రెస్ సోయం బాపూరావుకు టికెట్టు ఇవ్వగా, ఇక్కడి లంబాడాలతో పాటు గిరిజనేతర ఓట్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నంలో అనిల్ జాదవ్ ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి అనిల్ జాదవ్ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేస్తూ ప్రజల్లో సానుభూతి సంపాదించుకున్నారు. టికెట్టు రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి సవాల్ విసురుతున్నారు. ప్రచారంలో కూడా ప్రధాన పార్టీలకు ధీటుగా ప్రచారం సాగిస్తున్నారు. ఈ పరిణామం కాంగ్రెస్‌తో పాటు టీఆర్ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపూరావుకు కూడా మింగుడు పడడం లేదు. ఖానాపూర్‌లో హరినాయక్ పరిస్థితి అదే. చివరి నిమిషంలో పార్టీ మారిన రాథోడ్ రమేష్‌కు సీటివ్వడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. బీఎస్పీ అభ్యర్థిగా తన సత్తా చూపుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ బ్యాచ్ నుంచి ఇద్దరు రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి బోడ జనార్దన్ (చెన్నూరు), రావి శ్రీనివాస్ (సిర్పూరు)లకు నిరాశ ఎదురవడంతో రెబల్ అవతారం ఎత్తి ప్రధాన పార్టీలకు సవాల్‌గా మారారు. బోడ జనార్దన్ మాజీ మంత్రిగా, నాలుగుసార్లు వరుస ఎమ్మెల్యేగా ఉన్న పరిచయాలతో బీఎల్ఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను భయపెడుతున్నారు. తనకు చివరి అవకాశంగా గెలిపించాలని చేస్తున్న విజ్ఞప్తి సానుకూల ఫలితాన్నిస్తుందని భావిస్తున్నారు. రావి శ్రీనివాస్ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడాయన బీఎస్పీ తరుపున పోటీ చేస్తూ తనకు మామ అయిన టీఆర్ఎస్ అభ్యరిథ కోనేరు కోనప్పను, కాంగ్రెస్‌కు చెందిన హరీష్‌బాబును ఆందోళనకు గురి చేస్తున్నారు. ⇔మంచిర్యాలలో ఇప్పటికే టీఆర్ఎస్కు చెందిన బేర సత్యనారాయణ, ఆరె శ్రీనివాస్ బీఎస్పీ, బీఎల్ఎఫ్ నుంచి పోటీ చేస్తుండగా, చల్లగుళ్ల విజయశ్రీ ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచారు. వీరు ఎవరి ఓట్లను చీలుస్తారో తెలియక ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ⇔బోథ్ నుంచి కుమ్రం కోటేష్ పోటీ పడుతున్నారు. ఆదివాసీ వర్గానికి చెందిన కోటేష్ వల్ల ఎవరి ఓట్లు చీలుతాయో తెలియని పరిస్థితి. -
ఓట్లు రాబట్టడం ఎలా?
పల్లె పట్నం.. ఊరూవాడా.. ఎన్నికల ప్రచారంతో హోరెత్తుతున్నాయి. ప్రచారానికి మరో 12 రోజులు మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యరులను రెండున్నర నెలల కిందటే ప్రకటించినా.. మహాకూటమి అభ్యర్థుల జాబితాలో ఆలస్యమైంది. బీజేపీ సైతం ఐదు స్థానాలు మినహా అన్నింటా అభ్యర్థులను ముందుగానే ప్రకటించింది. కాంగ్రెస్, టీటీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ల కూటమి సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికలో జాప్యం కారణంగా ఆపార్టీల అభ్యర్థులు ఆలస్యంగా ప్రచారం ప్రారంభించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 166 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, ప్రధాన పోటీ టీఆర్ఎస్, మహాకూటమి, బీజేపీ అభ్యర్థుల మధ్యే నెలకొంది. అక్కడక్కడా జైభారత్ జనసేన, ఆర్పీఐ, బహుజన రాష్ట్ర సమితి, దళిత బహుజన పార్టీ, ఇండియన్ ప్రజాబంధు, తెలంగాణ కార్మిక రైతురాజ్యం, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, శివసేన, ఏఐఎఫ్బీ, బీఎల్ఎఫ్ తదితర 14 పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు ఉన్నా.. పోటీ నామమాత్రంగానే ఉంది. సాక్షి, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో మొత్తం 25,05,312 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 12,39,497 మంది పురుషులు 12,65,662 మంది మహిళా ఓటర్లు, 153 మంది ఇతరులున్నారు. నామినేషన్ల ఉపసంహరణ సైతం ముగిసి ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో ఓట్లు రాబట్టడం ఎలా? అన్న అంశంపైనే ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. సామాజిక వర్గాలు, యువత, మహిళలు, వృద్ధులు.. కేటగిరీల వారీగా ఏ వర్గాల ఓటు బ్యాంకు ఎంత? అగ్రవర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ఓట్లు ఏయే నియోజకవర్గాల్లో ఏ మేరకు ఉన్నాయి? ఉద్యోగులు, నిరుద్యోగులు, యువతను ఆకర్షించడం ఎలా? వచ్చే ఎన్నికల్లో ఏవర్గం ఓట్లు ఏ నియోజకవర్గంలో ఏమేరకు ప్రభావం చూపుతాయి? అంటూ రాజకీయ పార్టీలు ప్రస్తుతం ఓటు బ్యాంకు లెక్కల్లో పడ్డాయి. నోటిఫికేషన్ విడుదల వరకు ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ముందస్తు ఎన్నికల సందర్భంగా తాజాగా విడుదలైన ఓటర్ల జాబితా అన్ని పార్టీల్లో కలకలం రేపుతోంది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ఓట్లు రాబట్టడం ఎలా? అన్న వ్యూహాల్లో ఉన్న అభ్యర్థులు.. ప్రధాన పార్టీలు ప్రకటించిన మేనిఫెస్టోలు.. ఆయా పార్టీల అగ్రనేతల ప్రచారాలపై ఆశలు పెట్టుకున్నారు. ఎనిమిది స్థానాల్లో మహిళలే అధికం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో మొత్తం 25,05,312 మంది ఓటర్లు ఉన్నారు. 12 నియోజకవర్గాల్లో పురుషులు 12,39,497 మంది కాగా, మహిళా ఓటర్లు 12,65,662 మంది ఉన్నారు. అయితే నియోజకవర్గాల వారీగా చూస్తే మాత్రం ఆరు స్థానాల్లో మహిళలు, మూడు నియోజకవర్గాల్లో పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మరో చోట దాదాపుగా పురుష ఓటర్లతో మహిళలు సమానంగా ఉన్నారు. వేములవాడ, సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో మహిళ ఓటర్లు ఎక్కువగా ఉండగా, కరీంనగర్, రామగుండం, మంథని, పెద్దపల్లిల్లో పురుషులు ఎక్కువగా ఉన్నారు. హుజూరాబాద్‌లో పురుషులు 1,02,903 కాగా, మహిళా ఓటర్లు 1,02,919లు కాగా, మానకొండూరులో పురుషులు 99,133లు, మహిళల ఓటర్లు 99,965లుగా ఉన్నారు. మంథనిలో కూడా మహిళ ఓటర్లు 1,00,860 కాగా, పురుష ఓటర్లు 1,00,989తో స్వల్ప ఆధిక్యతలో ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన వారి ఓట్లు తమకే పడతాయనే ధీమాతో టీఆర్ఎస్ ఉండగా.. దీనిని గమనించిన కాంగ్రెస్ నేతలు జిల్లాస్థాయిలో ముఖ్యనేతలకు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ మద్దతు ఓట్లలో చీలిక తెచ్చే వ్యూహంతో ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో సైతం ప్రధాన పార్టీలు ఓటుబ్యాంక్ లక్ష్యంగా ఎత్తులు, పైఎత్తులు వేస్తుండటం, సామాజికవర్గాల వారీగా ప్రసంగాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. -
‘స్టార్స్’పైనే ఆశలు!
సాక్షి, సిరిసిల్ల : జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఆయా నియోజకవర్గాల్లో పోరులో నిలిచిన అభ్యర్థుల సంఖ్య, వారిగుర్తులు కూడా ఖరారయ్యాయి. ఇప్పటికే జిల్లాలోని ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం ఉధృతం చేశారు. ఇప్పటిదాకా ఆయా పార్టీల అభ్యర్థులు, నాయకులు తొలి విడత ప్రచారం పూర్తిచేసుకున్నారు. అభ్యర్థులు సొంతంగా లేక వారి అనునయులతో ఎన్నికల ప్రచారం నిర్వహించగా ఇకముందు వారి ప్రచారం కొత్త పుంతలు తొక్కనుంది. మిగిలిన 12రోజుల ప్రచార సమయంలో వారంతా తమ పార్టీ పెద్దలనే నమ్ముకున్నారు. ఈ మలిదశ ప్రచారమంతా వీఐపీల పర్యటనలతో సాగిపోనుంది. ఇందులో భాగంగానే ఈనెల 20న సీఎం కేసీఆర్ సిరిసిల్లలో టీఆర్ఎస్ బహిరంగ సభ ద్వారా జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో రాజకీయ వేడిని రగిలించారు. మరోవైపు కూటమి అభ్యర్థికి ప్రచారం చేయడానికి ఈనెల 26న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ జిల్లాకు రానున్నారు. మిగిలిన ప్రధాన పార్టీలు కూడా అదేబాటలో పయనిస్తూ పార్టీ పెద్దల సమయం కోసం ఎదురుచూస్తున్నాయి. అగ్రనేతలపైనే ఆశలు.. ప్రధాన పార్టీల అభ్యర్థులు నియోజకవర్గంలో తమస్థాయి ప్రచారాన్ని నిర్వహిస్తూనే వీలును బట్టి పార్టీ పెద్దల ప్రచార సమయాన్ని తమ నియోజకవర్గంలో కేటాయించుకునేలా ప్రణాళిక చేస్తున్నారు. తమ ప్రచారంతోపాటు పార్టీ పెద్దలు, స్టార్ కాంపెయినర్ల ప్రచారంతో తమకు మరింత మేలు జరుగుతుందని నమ్ముతున్నారు. వారి రాకతో బహిరంగ సభలు, ర్యాలీలకు జన సమీకరణ చేసేందుకు, అందరినీ ఆకర్షించేందుకు మంచి అవకాశంగా భావిస్తున్నారు. బీజేపీ తరఫున ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ బీజేపీ అభ్యర్థుల ప్రచారానికి రానున్నారని ప్రచారం. వీరికితోడు స్వామి పరిపూర్ణానంద కూడా విస్త్రృతంగా పర్యటించనున్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రంగా వీరంతా ప్రచారంలో పాల్గొన్నా తమకు కలిసొచ్చేలా నియోజకవర్గంనుంచి జనసమీకరణతో ఆ ప్రభావం పొందేందుకు అభ్యర్థులు వ్యూహాలు రచిస్తున్నారు. అన్ని పార్టీలదీ అదే దారి.. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎల్ఎఫ్.. ఇలా అన్ని పార్టీలు తమ అభ్యర్థుల ప్రచారానికి పార్టీ పెద్దలను, స్టార్ కాంపెయినర్లను ప్రచార రంగంలోకి దింపుతున్నాయి. కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ గౌరవాద్యక్షురాలు సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఖుష్బూ, విజయశాంతి, రేవంత్‌రెడ్డి తదితరులు ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు. వీరి ప్రచార సమయం కోసం వేచి చూస్తున్నామని, వీలును బట్టి జిల్లాలో ప్రచారం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. టీఆర్ఎస్ నుంచి అధినేత కేసీఆర్‌తోపాటు మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, మహ్మద్ అలీ తదితరులతో జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో బహిరంగ సభలతో ప్రచారాన్ని హోరెత్తించారు. మరోవైపు బీఎల్ఎఫ్ తరపున ప్రచార సారథులుగా సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, కేరళ సీఎం విజయన్, తమ్మినేని వీరభద్రం, విమలక్క, కంచె ఐలయ్య తదితరులు ప్రచారం నిర్వహిస్తుండగా వారిలో నుంచి వీలును బట్టి జిల్లాలో పర్యటించేలా బీఎల్ఎఫ్ అభ్యర్థులు ప్రణాళికలు చేసుకుంటున్నారు. వీరందరితో ఉమ్మడి జిల్లాకేంద్రంగా బహిరంగ సభలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇక మిగిలిన 12 రోజుల ప్రచార సమయంలో నియోజవర్గాల్లో ప్రచార మోత స్టార్లతో మోగిపోనుంది. -
‘కోదండరాం పార్టీతో పొత్తుకు చర్చలు’
సాక్షి, కరీంనగర్ : తెలంగాణ జేఏసీ మాజీ చైర్మన్ కోదండరాం ఆధ్యర్యంలో ఏర్పడిన తెలంగాణ సమితి పార్టీతో పొత్తుపై చర్చలు జరుగుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. సోమవారం ముకుంద లాల్ భవన్లో జరిగిన పార్లమెంటు స్థాయి సమావేశానికి తమ్మినేని, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు హాజరైయ్యారు. ఈ సమావేశంలో కరీంనగర్ సమస్యలతో పాటు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థి ఎంపికపై కూడా చర్చ జరిపారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ 119 స్థానాల్లో పోటిచేయనున్నట్టు తెలిపారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామిలలో ఏ ఒక్కటి అమలు కాలేదన్నారు. ఇక బంగారు తెలంగాణ చేసే అవకాశం లేదని ఎద్దేవా చేశారు. 2019లో టీఆర్ఎస్ను ఓడించడమే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజల బతుకులు మార్చడానికి ఏ మాత్రం కృషి చేయలేదని, కాంగ్రెస్‌తో కూడా పొత్తు పెట్టుకోమని తెలిపారు. ప్రజలను పరిపాలించే పద్దతులను మార్చే పార్టీలను ఎన్నుకోవాలని ప్రజలను కోరారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పరం చేయాలని నీతి ఆయోగ్ నిర్ణయించిందని ఆరోపించారు. రైతు బంధు పథకంపై స్పందిస్తూ.. కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వకుండా ద్రోహం చేశారని మండిపడ్డారు. వ్యవసాయం చేసేవారికే పెట్టుబడి సాయం అందించాలన్నారు. రైతు బంధు పథకాన్ని భూస్వాముల పథకంగా అభివర్ణించారు. పథకాన్ని సవరించి కౌలు, పోడు రైతులకు సాయం అందించాలని కోరారు. వనరుల ఆధారంగా పరిశ్రమలను ఏర్పాటు చేయాలని, తద్వార నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రం కాదని కేవలం ప్రభుత్వమే ధనికమని అన్నారు. -
28 పార్టీలతో బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్
సాక్షి, హైదరాబాద్: రాజ్యాధికారమే లక్ష్యంగా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికకు అంకురార్పణ జరిగింది. ఈ నెల 25న 28 పార్టీలతో కలసి బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) ప్రారంభం కానుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీ చేయాలని లెఫ్ట్, బహుజన నేతలు నిర్ణయించారు. హైదరాబాద్‌లో 25న భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసి ఈ వేదికను ప్రకటించనున్నారు. బహిరంగ సభకు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్, ఎంసీపీఐ (యూ) జాతీయ నేత ఎం.డి.గౌస్ హాజరు కానున్నారు. గురువారం హైదరాబాద్‌లో ప్రత్యామ్నాయ రాజకీయ ఫ్రంట్ ఏర్పాటుపై సన్నాహక సమావేశం జరిగింది. ప్రొఫెసర్ కంచ ఐలయ్య, కాకి మాధవరావు, పి.ఎల్. విశ్వేశ్వరరావు, సాంబ శివరావు, గద్దర్, పటేల్ వనిత, మాజిదుల్లా ఖాన్ తదితరులు సమా వేశంలో పాల్గొన్నారు. బీఎల్ఎఫ్ అధ్యక్షుడిగా నల్లా సూర్యప్రకాశ్, కన్వీనర్‌గా తమ్మినేని వీరభద్రం నియమితులయ్యారు. పూలే, అంబేడ్కర్ ఆలోచనలతో.. పూలే–అంబేడ్కర్–మార్క్స్ ఆలోచనల మేళవింపుతో ఫ్రంట్‌కు రూపకల్పన చేశామని తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఇప్పుడున్న రాజకీయాలకు ప్రత్యామ్నాయంగానే బహు జన్ లెఫ్ట్ ఫ్రంట్ రూపుదిద్దుకుందన్నారు. ఫ్రంట్‌లో ఇప్పుడున్న 28 పార్టీలతో పాటు సీపీఐ, న్యూడెమోక్రసీతో పాటు ఇతర వామ పక్ష పార్టీలను కూడా చేరాలని ఆహ్వాని స్తున్నామని తమ్మినేని తెలిపారు. -
'చంద్రబాబుకు విదేశీ పిచ్చి పట్టుకుంది'
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు విదేశీ సంస్కృతి పిచ్చి పట్టుకుందని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం సముద్ర తీరంలో డిస్కో డాన్సులు నిర్వహించాలని యోచిస్తుండడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తెలుగువారి మది నిండా ప్రేమ ఉందని, ఇప్పుడు మళ్లీ ప్రేమికుల దినోత్సవం పేరుతో ఆర్భాటాలు అవసరం లేదని స్పష్టం చేశారు. కేవలం ప్రచారం కోసమే చంద్రబాబు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. గోవా తరహాలో విశాఖ తీరంలో బీచ్ లవ్ ఉత్సవాన్ని నిర్వహించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పూనుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఫిబ్రవరి 12 నుంచి ప్రేమికుల దినమైన 14వ తేదీ వరకు మూడురోజుల పాటు బీఎల్ఎఫ్-2017 పేరిట ఉత్సవాలు జరగనున్నాయి. ఇది విదేశీ విష సంస్కృతికి బీజమంటూ మహిళా, విద్యార్థి, ప్రజా సంఘాల మండిపడుతున్నాయి.