సాక్షి, కరీంనగర్ : తెలంగాణ జేఏసీ మాజీ చైర్మన్ కోదండరాం ఆధ్యర్యంలో ఏర్పడిన తెలంగాణ సమితి పార్టీతో పొత్తుపై చర్చలు జరుగుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. సోమవారం ముకుంద లాల్ భవన్‌లో జరిగిన పార్లమెంటు స్థాయి సమావేశానికి తమ్మినేని, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు హాజరైయ్యారు. ఈ సమావేశంలో కరీంనగర్ సమస్యలతో పాటు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థి ఎంపికపై కూడా చర్చ జరిపారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ 119 స్థానాల్లో పోటిచేయనున్నట్టు తెలిపారు. టీఆర్‌ఎస్ ఇచ్చిన హామిలలో ఏ ఒక్కటి అమలు కాలేదన్నారు. ఇక బంగారు తెలంగాణ చేసే అవకాశం లేదని ఎద్దేవా చేశారు.
2019లో టీఆర్‌ఎస్‌ను ఓడించడమే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజల బతుకులు మార్చడానికి ఏ మాత్రం కృషి చేయలేదని, కాంగ్రెస్‌తో కూడా పొత్తు పెట్టుకోమని తెలిపారు. ప్రజలను పరిపాలించే పద్దతులను మార్చే పార్టీలను ఎన్నుకోవాలని ప్రజలను కోరారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పరం చేయాలని నీతి ఆయోగ్ నిర్ణయించిందని ఆరోపించారు. రైతు బంధు పథకంపై స్పందిస్తూ.. కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వకుండా ద్రోహం చేశారని మండిపడ్డారు. వ్యవసాయం చేసేవారికే పెట్టుబడి సాయం అందించాలన్నారు. రైతు బంధు పథకాన్ని భూస్వాముల పథకంగా అభివర్ణించారు. పథకాన్ని సవరించి కౌలు, పోడు రైతులకు సాయం అందించాలని కోరారు. వనరుల ఆధారంగా పరిశ్రమలను ఏర్పాటు చేయాలని, తద్వార నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రం కాదని కేవలం ప్రభుత్వమే ధనికమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment