లగచర్లలో కాలుష్య రహిత పరిశ్రమలే
నా నియోజకవర్గ ప్రజలను నేనే ఇబ్బందిపెడతానా?
అధికారులపై దాడి కుట్రదారులను వదలం
అమాయకులపై కేసుల రద్దును పరిశీలిస్తా
భూ సేకరణ పరిహారం పెంపుపై ఆలోచిస్తాం
వామపక్ష పార్టీల నేతలతో సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్ జిల్లా లగచర్లలో ఏర్పాటు చేయబోయేది ఫార్మా విలేజ్ కాదని.. పారిశ్రామిక పార్క్ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. అక్కడ కాలుష్య రహిత పరిశ్రమలనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. శనివారం సచివాలయంలో సీఎంను సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావుతోపాటు సీపీఐ(ఎంఎల్) ప్రతినిధులు కలిశారు.
ఇటీవల లగచర్లలో పర్యటించిన వీరు.. అధికారులపై దాడి ఘటన తర్వాత అక్కడి పరిస్థితులపై రూపొందించిన నిజనిర్దారణ నివేదికను సీఎంకు అందజేశారు. పలు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. ఈ సందర్భంగా లగచర్లలో ఏర్పాటుచేయబోయే పరిశ్రమల గురించి వారికి సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. లగచర్లలో కాలుష్య రహిత పరిశ్రమలనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. భూసేకరణ పరిహారం పెంచే విషయాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.
నా ప్రజలను నేను ఇబ్బంది పెడతానా?
తన నియోజకవర్గంలోని యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయడం తన బాధ్యత అని వామపక్ష పార్టీల నేతలతో సీఎం అన్నారు. ‘నా సొంత నియోజకవర్గ ప్రజలను నేనే ఎందుకు ఇబ్బంది పెడుతా?’అని ప్రశ్నించారు. అయితే, లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్, అధికారులపై దాడి చేసిన వారిని, అందుకు కుట్ర చేసినవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలేది లేదని స్పష్టంచేశారు. అమాయక రైతులపై కేసులు పెట్టిన అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
ప్రత్యామ్నాయంపై సమాలోచన
కాలుష్య కారక పరిశ్రమల కోసం రెండు పంటలు పండే భూములను తీసుకోవడం సరికాదని సీఎంకు సూచించినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. లగచర్లలో కాకుండా కొడంగల్‌లో మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డికి చెందిన 1,156 ఎకరాలకు పైగా ఉన్న సీలింగ్ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మంచిదని తెలిపినట్లు ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు.
అయితే ఆ భూములు కోర్టు వివాదాల్లో ఉన్నందున ఆలస్యం జరుగుతోందని సీఎం అన్నారని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ భూములుంటే సూచించాలని సీఎం అడిగారని, దీనిపై రెండుమూడుసార్లు సమావేశాలు నిర్వహించిన తరువాత నిర్ణయం తీసుకుందామని చెప్పారని తమ్మినేని వెల్లడించారు.
కాగా, లగచర్లలో వరి కోతలకు అధికారులు యంత్రాలను అనుమతించడం లేదని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, పోలీసు క్యాంపులతో నిర్భందం కొనసాగుతున్నదని సీఎం దృష్టికి తీసుకెళ్లగానే.. ఆయన వెంటనే కలెక్టర్‌కు ఫోన్ చేసి వరికోత యంత్రాలను అనుమతించాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, పోలీసు క్యాంపులను వెంటనే తొలగించాలని ఆదేశించినట్లు వివరించారు.
గిరిజనులపై కేసులు ఎత్తేయండి: కూనంనేని
లగచర్ల ఘటనలో గిరిజనులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని సీఎంను కోరినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. అందుకు సీఎం సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. పరిశ్రమలను ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేయాలని, రైతుల భూములు సేకరించి జనావాసాల మధ్య ఫార్మా పరిశ్రమలను ఏర్పాటు చేస్తామంటే వామపక్షాలు అంగీకరించబోవని సీఎంకు స్పష్టంగా చెప్పినట్లు వెల్లడించారు.
గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే.. అదికూడా రైతులను ఒప్పించి, పూర్తి నష్టపరిహారం అందించిన తరువాతే వారి భూములను సేకరించాలని సూచించినట్లు తెలిపారు. సీఎంను కలిసినవారిలో సీపీఐ రాష్ట కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ, సీపీఐ (ఎం.ఎల్) మాస్‌లైన్ నాయకులు రమ, ఎస్.ఎల్. పద్మ, ఆర్‌ఎస్‌పీ నాయకడు జానకిరాములు, ఎంసీపీఐ నాయకుడు గాదగోని రవి తదితరు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment