సాక్షి, సిరిసిల్ల : జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఆయా నియోజకవర్గాల్లో పోరులో నిలిచిన అభ్యర్థుల సంఖ్య, వారిగుర్తులు కూడా ఖరారయ్యాయి. ఇప్పటికే జిల్లాలోని ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం ఉధృతం చేశారు. ఇప్పటిదాకా ఆయా పార్టీల అభ్యర్థులు, నాయకులు తొలి విడత ప్రచారం పూర్తిచేసుకున్నారు. అభ్యర్థులు సొంతంగా లేక వారి అనునయులతో ఎన్నికల ప్రచారం నిర్వహించగా ఇకముందు వారి ప్రచారం కొత్త పుంతలు తొక్కనుంది. మిగిలిన 12రోజుల ప్రచార సమయంలో వారంతా తమ పార్టీ పెద్దలనే నమ్ముకున్నారు.
ఈ మలిదశ ప్రచారమంతా వీఐపీల పర్యటనలతో సాగిపోనుంది. ఇందులో భాగంగానే ఈనెల 20న సీఎం కేసీఆర్ సిరిసిల్లలో టీఆర్‌ఎస్ బహిరంగ సభ ద్వారా జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో రాజకీయ వేడిని రగిలించారు. మరోవైపు కూటమి అభ్యర్థికి ప్రచారం చేయడానికి ఈనెల 26న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ జిల్లాకు రానున్నారు. మిగిలిన ప్రధాన పార్టీలు కూడా అదేబాటలో పయనిస్తూ పార్టీ పెద్దల సమయం కోసం ఎదురుచూస్తున్నాయి.
అగ్రనేతలపైనే ఆశలు..
ప్రధాన పార్టీల అభ్యర్థులు నియోజకవర్గంలో తమస్థాయి ప్రచారాన్ని నిర్వహిస్తూనే వీలును బట్టి పార్టీ పెద్దల ప్రచార సమయాన్ని తమ నియోజకవర్గంలో కేటాయించుకునేలా ప్రణాళిక చేస్తున్నారు. తమ ప్రచారంతోపాటు పార్టీ పెద్దలు, స్టార్ కాంపెయినర్ల ప్రచారంతో తమకు మరింత మేలు జరుగుతుందని నమ్ముతున్నారు. వారి రాకతో బహిరంగ సభలు, ర్యాలీలకు జన సమీకరణ చేసేందుకు, అందరినీ ఆకర్షించేందుకు మంచి అవకాశంగా భావిస్తున్నారు. బీజేపీ తరఫున ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ బీజేపీ అభ్యర్థుల ప్రచారానికి రానున్నారని ప్రచారం. వీరికితోడు స్వామి పరిపూర్ణానంద కూడా విస్త్రృతంగా పర్యటించనున్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రంగా వీరంతా ప్రచారంలో పాల్గొన్నా తమకు కలిసొచ్చేలా నియోజకవర్గంనుంచి జనసమీకరణతో ఆ ప్రభావం పొందేందుకు అభ్యర్థులు వ్యూహాలు రచిస్తున్నారు.
అన్ని పార్టీలదీ అదే దారి..
టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎల్‌ఎఫ్.. ఇలా అన్ని పార్టీలు తమ అభ్యర్థుల ప్రచారానికి పార్టీ పెద్దలను, స్టార్ కాంపెయినర్లను ప్రచార రంగంలోకి దింపుతున్నాయి. కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ గౌరవాద్యక్షురాలు సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఖుష్బూ, విజయశాంతి, రేవంత్‌రెడ్డి తదితరులు ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు. వీరి ప్రచార సమయం కోసం వేచి చూస్తున్నామని, వీలును బట్టి జిల్లాలో ప్రచారం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. టీఆర్‌ఎస్ నుంచి అధినేత కేసీఆర్‌తోపాటు మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, మహ్మద్ అలీ తదితరులతో జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో బహిరంగ సభలతో ప్రచారాన్ని హోరెత్తించారు.
మరోవైపు బీఎల్‌ఎఫ్ తరపున ప్రచార సారథులుగా సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, కేరళ సీఎం విజయన్, తమ్మినేని వీరభద్రం, విమలక్క, కంచె ఐలయ్య తదితరులు ప్రచారం నిర్వహిస్తుండగా వారిలో నుంచి వీలును బట్టి జిల్లాలో పర్యటించేలా బీఎల్‌ఎఫ్ అభ్యర్థులు ప్రణాళికలు చేసుకుంటున్నారు. వీరందరితో ఉమ్మడి జిల్లాకేంద్రంగా బహిరంగ సభలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇక మిగిలిన 12 రోజుల ప్రచార సమయంలో నియోజవర్గాల్లో ప్రచార మోత స్టార్లతో మోగిపోనుంది.
Comments
Please login to add a commentAdd a comment