karimnaagr
-
కొందరు ఉపాధ్యాయుల వికృత చేష్టలు, బిక్కుబిక్కుమంటున్న అమ్మాయిలు
సిరిసిల్ల కల్చరల్: పాఠశాలల్లో కొందరు టీచర్లు కీచకులుగా మారుతున్నారు. మాస్టార్లు చెప్పే పాఠాల కోసం బడులకు వస్తున్న విద్యార్థినులపై వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. చట్టాలు ఎంత పదునుగా తయారవుతున్నా వేధింపులు మాత్రం ఆగడం లేదు. అయితే వారి దుశ్చర్యల గురించి ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక చాలా మంది బాధితులు లోలోపల కుమిలి పోతున్నారు. వెలుగులోకి రానివెన్నో.. బ్యాడ్ టచ్ బారిన పడుతున్న పిల్లలు ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. తల్లిదండ్రులకు సైతం చెప్పే స్వేచ్ఛ కొన్ని కుటుంబాల్లో లేకపోవడంతో మానసికంగా కుంగిపోతున్నారు. ఇటీవల షీటీమ్స్ నిర్వహిస్తున్న అవగాహన సదస్సులు కొంతమేర సత్ఫలితాలిస్తున్నాయి. అయినా పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదులు రావడం తక్కువే. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు రాజన్న సిరిసిల్ల జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధి కొత్తపల్లి నివాసి, ప్రభుత్వ ఉపాధ్యా యుడు నామని సత్యనారాయణ అదే కాలనీకి చెందిన ఓ బాలికను జామకాయ కోసి ఇస్తానంటూ తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత బాలిక చేతులు పట్టుకొని, అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేశారు. వీర్నపల్లి మండలంలోని మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహించిన ఓ ప్రబుద్ధుడు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడు. గత నెల 21న జిల్లా కేంద్రంలోని గీతానగర్ జెడ్పీ హైస్కూల్లో ఉద్యోగ విరమణకు చేరువైన కె.నరేందర్‌తోపాటు మరో టీచర్ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించి పోలీస్ రికార్డుల్లోకి ఎక్కారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేడ్కర్‌నగర్ జెడ్పీ హైసూ్కల్లో రఘునందన్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించాడనే కారణంతో కేసు నమోదు చేశారు. కొద్ది వారాల క్రితం గంభీరావుపేట మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఓ లెక్చరర్ అదే కళాశాల విద్యార్థిని విషయంలో అనుచితంగా వ్యవహరించాడని కేసు నమోదైంది. ఇప్పటి వరకు నమోదైన కేసులు రాజన్నసిరిసిల్లా జిల్లాలో మహిళలు, విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తున్న పోకిరీలపై ఇప్పటి వరకు 38 కేసులు నమోదైనట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వీటిలో టీచర్లపైనే ఐదు కేసులు నమోదయ్యాయి. ఎవరైనా వేధింపులకు గురైతే 87126 56425 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. పోక్సో చట్టం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్(పోక్సో). ఇది లైంగిక వేధింపుల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే చట్టం. లైంగికదాడి నేరాలకు పాల్పడిన నిందితులకు ఈ చట్టంతో జీవితఖైదీగా 7 నుంచి 10 ఏళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు. 16 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారం జరిగితే కనీసం 10 నుంచి 20 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది. రెండు నెలల్లోపే కేసు దర్యాప్తు జరగాలని నూతన చట్టం నిబంధన విధించింది. -
రసవత్తరంగా ఉమ్మడి కరీంనగర్ పోరు
సాక్షి, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొన్ని సెగ్మెంట్లలో ఆపరేషన్ ఆకర్ష జోరుగా సాగుతోంది. అటు అధికార పార్టీ నుంచి ఇటు కాంగ్రెస్ నుంచి జంపింగ్ జపాంగ్‌లు అటు ఇటూ గెంతుతున్నారు. చేరికల కారణంగా రాజకీయ వాతావరణం జిల్లాలో రసవత్తరంగా మారుతోంది. అయితే ఈ దూకుళ్ళు..చేరికల వల్ల లాభం ఎవరికి? నష్టం ఎవరికి? లేదంటే లాభనష్టాలు లేని చేరికలా? అసలు కరీంనగర్లో ఏంజరుగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కారు స్పీడ్‌కు బ్రేకులు వేసి మంథని నియోజకవర్గంలో హస్తం పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు. కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీధర్‌బాబు నియోజకవర్గంలో ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లోకి వస్తున్నారు. మంథని నియోజకవర్గంలోని ఏదో ఒక మండలం నుంచి నిత్యం కనీసం రెండొందల మంది నుంచి వెయ్యి మంది వరకూ కార్యకర్తలు చేరుతుండటంతో.. కాంగ్రెస్ లో సమరోత్సాహం కనిపిస్తోంది. ముఖ్యంగా గతంలో శ్రీధర్‌బాబు మీద ఒకింత అలకతో వెళ్లిపోయిన నేతలు సైతం తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతుండటంతో.. మంథని కాంగ్రెస్ లో సందడి వాతావరణం కనిపిస్తోంది. అయితే, మంథని నియోజకవర్గ అభ్యర్థిగా శ్రీధర్ బాబు ప్రచారంలో లేకపోయినా.. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా బిజీబిజీగా హైదరాబాద్, ఢిల్లీ, ఒక్కోసారి బెంగళూరు వంటి చోట్లకు తిరుగుతున్నా.. మంథనిలోని ఇతర ముఖ్య నాయకుల సమక్షంలో..ముఖ్యంగా శ్రీధర్ బాబు సోదరుడైన శ్రీనుబాబు సమక్షంలో ఈ చేరిక ప్రక్రియ ఓ నిరంతర కార్యక్రమంలా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తున్న హవా.. ప్రజలందరికీ అనుకూలంగా కనిపిస్తున్న మేనిఫెస్టోతోనే కాంగ్రెస్ లోకి పెద్దఎత్తున చేరికలు జరుగుతున్నాయని నాయకులు చెబుతున్నారు. అయితే, ఇదే పెద్దపెల్లి జిల్లాలోని పెద్దపెల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పుంజుకుంటుందన్న ప్రచారం ఇప్పటివరకూ జరిగినా.. కాంగ్రెస్ లోకి వెళ్లిన కీలక నేతలుగా ఇప్పుడు తిరిగి బీఆర్ఎస్ బాట పడుతున్నారు. ఇప్పటికే సత్యనారాయణ రెడ్డితో పాటు.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ వేముల రామ్మూర్తి వంటివారంతా తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకుంటున్నారు. దీంతో మంథనికి భిన్నంగా ఇక్కడ బీఆర్ఎస్ లోకి చేరికలు కనిపించడం.. కాంగ్రెస్ లో అసమ్మతి జ్వాలలతో కొందరు బీఆర్ఎస్ తో పాటు.. బీజేపీ బాట పడుతుండటం వంటివి తమకు కలిసొచ్చే అంశాలుగా అధికార బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. మరొకవైపు గులాబీబాస్ ఫోకస్డ్ గా ఉన్న ప్రధాన నియోజకవర్గాల్లో ఒకటైన హుజూరాబాద్ లోనూ పాడి కౌశిక్ రెడ్డి పగ్గాలు చేపట్టాక... పెద్దఎత్తున బీఆర్ఎస్ లోకి చేరికల పర్వం కొనసాగుతోంది. మరోవైపు ఇప్పటి నుంచే ఏ గ్రామంలో, ఏ తాండాలో, ఏ హ్యామ్లెట్ విలేజ్ లో ఎంత మంది ఓటర్స్ ఉన్నారు.. వారికి బీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఎలా వివరించాలన్న పక్కా లెక్కలతో కౌశిక్ రెడ్డి ఉదయం నుంచీ రాత్రి వరకూ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ తో పనిచేస్తుండటంతో.. హుజూరాబాద్ లో బీఆర్ఎస్ లో ఇప్పుడు కొత్త జోష్ కనిపిస్తోంది. గత ఉపఎన్నికల్లో వర్కౌటైన సెంటిమెంట్ ఈసారి కూడా వర్కౌట్ అయ్యే పరిస్థితులుంటాయా అన్న చర్చ నేపథ్యంలో.. ఇప్పుడు కౌశిక్ దూకుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఈటలతో పాటు.. కొత్తగా కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగబోతున్న ఒడితెల ప్రణవ్ బాబుకు కూడా ఓ సవాల్ వంటిదే. ఇక కరీంనగర్ లోనూ గంగుల కమలాకర్ తిరుగులేని నేతగా ఎదిగిన క్రమంలో.. నిత్యం చేరికల పర్వం కనిపిస్తోంది. కరీంనగర్ కార్పోరేషన్ లో ఐదుగురు కార్పోరేటర్లు బీజేపీకీ గుడ్ బై చెప్పి.. గంగుల నేతృత్వంలో కారెక్కేందుకు సిద్ధం అయ్యారు. ఈనేపథ్యంలో కరీంనగర్ లో కొత్తగా వచ్చి చేరేవారితో కారు ఫుల్లైపోతోంది. అయితే దీంతో బీఆర్ఎస్ లో కొత్త జోష్ కనిపిస్తుండగా.. వెళ్లిపోతున్నవారిని ఎలా అడ్డుకోవాలో తెలియక బీజేపీ సతమతమవుతోంది. ఇంకా అభ్యర్థినే ప్రకటించని నేపథ్యంలో.. ఇక కాంగ్రెస్ గురించి పెద్దగా ఇప్పటికైతే చెప్పుకోవాల్సిన పనే లేకుండా పోయింది. ఇక ఇదే పరిస్థితి చొప్పదండిలోనూ మనకు కళ్లకు కడుతోంది. బీఆర్ఎస్ పథకాలు.. నియోజకవర్గంలో ఇప్పటివరకూ ఖర్చు ఎంత పెట్టామో చెబుతూ స్థానికంగా తయారుచేసిన మేనిఫెస్టోలో 18 వందల కోట్ల రూపాయల నిధుల వెచ్చింపుపై జనం ఆకర్షితులవుతున్నారు. గతంలో కనివినీ ఎరుగని రీతిలో చొప్పదండి నియోజకవర్గంలో మోతె వాగు ద్వారా 30 వేల ఎకరాలకు నీరందుతుండటం.. అభివృద్ధి కళ్లకు కడుతుండటంతో ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ నుంచి కార్యకర్తల వలసలు పెరిగి బీఆర్ఎస్ కేడర్‌లో నూతనోత్సాహం వెల్లి విరుస్తోంది. మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు సెగ్మెంట్లలో సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలే.. ఇతర పార్టీల నేతలను, కార్యకర్తలను ఆయా పార్టీల్లోకి తీసుకువస్తున్నాయనే టాక్ నడుస్తోంది. అయితే, ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేసుకోవాలా అన్న యోచనలో నష్టపోతున్న పార్టీలు పట్టించుకోకపోవడం, లైట్ గా తీస్కుంటుండటంతో.. ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించక తప్పదనే చర్చ ఆయా పార్టీల్లోనే అంతర్గతంగా జరుగుతోంది. -
‘బండి’ నెట్టుకొస్తారా..?
సాక్షి, హైదరాబాద్ : కమలదళం రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పార్టీని పరుగులు పెట్టించారు. కాని బీజేపీ హైకమాండ్ బండిని పక్కకు జరిపి.. ఆతర్వాత చేతులు కాల్చుకుంది. జరగాల్సిన నష్టం జరిగాక దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. రెండో స్థానం అనుకున్న పార్టీ మూడో స్థానానికి వెళ్ళిపోవడంతో..మళ్ళీ రెండో స్థానం కోసం పోరాడుతోంది. అందులో భాగంగానే బండి సంజయ్‌ను ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా ప్రకటించింది. ఆయనకు ఓ హెలికాప్టర్‌ను కూడా రెడీ చేసింది. స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర మంతటా తిరగాల్సిన బండి తాను పోటీ చేస్తున్న కరీంనగర్‌కు న్యాయం చేయగలరా? కరీంనగర్లో బీజేపీ పరిస్థితి ఏంటి? కరీంనగర్ ఎంపీగా ఉన్న, బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్..అసెంబ్లీ బరిలో దిగేందుకు అంత ఆసక్తి చూపడంలేదు. అయితే పార్టీ హైకమాండ్ ఆయన పేరు ప్రకటించడంతో పోటీ చేయక తప్పడంలేదు. గతంలో అసెంబ్లీలో ఓడినా...ఎంపీగా విజయం సాధించారు. బండికి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం అసలు ఇష్టం లేదంటూ కరీంనగర్ పార్టీ సర్కిల్స్‌లో చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. ఇందుకు చాలా కారణాలు చెబుతున్నారు. బండి సంజయ్ కి, సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూ మధ్య కుటుంబాల పరంగా మంచి సంబంధాలున్నాయి. ఈసారి ఇద్దరి మధ్యా కుదిరిన లోపాయికారీ ఒప్పందాల ప్రకారం ఒకరు ఎమ్మెల్యేగా, మరొకరు ఎంపీగా బరిలో ఉండాలనుకున్నారంటూ జనంలో బాగా ప్రచారంలోకి వచ్చాయి. ఇదేకాకుండా..ఇప్పటికిప్పుడు బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే నమ్మకం లేకపోవడం.. ఎమ్మెల్యేగా కష్టపడి గెల్చినా ప్రతిపక్ష పాత్రకు పరిమితం కావడమే తప్ప ఒరిగేదేమీ లేదనే బండి అసెంబ్లీ బరిలో దిగేందుకు ఆసక్తి చూపడంలేదు. పైగా ప్రధాని మోదీ హవాతో రెండోసారి ఎంపీగా గెలవడం తేలికగా ఉంటుందని కూడా బండి సంజయ్ భావిస్తున్నారు. ఎన్నికల ఖర్చులు తడిసి మోపెడవుతున్న తరుణంలో గంగుల కమలాకర్‌ను తట్టుకోవడం సాధ్యమా అనే ఆందోళన కూడా బండిని వెంటాడుతోంది. ఇప్పుడు ఎమ్మెల్యేగా బరిలో ఉండి, ఆ తర్వాత మళ్లీ ఎంపీగా పోటీ చేయాల్సి వస్తే ఖర్చులు భారీగా చేయాల్సి వస్తుందని కూడా ఆయన ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఎమ్మెల్యేగా ఓటమిపాలైతే.. రాష్ట్ర అధ్యక్షుడిగా చేసి, ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తన ఉనికికి ఏమైనా ప్రమాదమా అనే సందేహాలు ఆయనకు కలుగుతున్నాయి. నేరుగా ఎంపీగా బరిలోకి దిగి గెలిస్తే ఇప్పటికే తనకు వచ్చిన ఇమేజ్ తో కేంద్రమంత్రి కావచ్చని కూడా బండి సంజయ్ ఆశిస్తున్నారు. తాననుకున్నంత బలంగా కరీంనగర్ లో క్యాడర్ క్షేత్రస్థాయిలో ఉందో, లేదోనన్న అనుమానం..ఇప్పటికే కొందరు పార్టీ కార్పొరేటర్లు కారెక్కేయడం వంటి అనేక కారణాలు.. బండిని అసెంబ్లీ బరిలో నిలవడానికి వెనుకంజ వేసేలా చేస్తోందనే చర్చ జరుగుతోంది. కరీంనగర్ అసెంబ్లీ బరిలో నిలవడానికి పలు కారణాలతో వెనుకాముందవుతున్న బండి.. స్టార్ క్యాంపెయినర్ గా బీజేపీ పెద్దలు ఏర్పాటు చేసిన హెలిక్యాప్టర్ సుడిగాలి పర్యటనలు చేయడం వల్ల..మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ ఏమైనా బలపడుతుందా..? బీజేపీ కచ్చితంగా ఆశలు పెట్టుకున్న నియోజకవర్గాల్లోనైనా గెలిచే అవకాశాలుంటాయా..? అనే చర్చ జరుగుతోంది. ఎన్నికల సమయంలో బండిని రాష్ట్రాధ్యక్షుడి బాధ్యతల నుంచి పక్కకు జరిపిన ఎఫెక్ట్.. స్టార్ క్యాంపెయినర్ గా బండి పర్యటనలపై ఉంటుందా..? రాష్ట్రాధ్యక్షుడి స్థాయిలో కేడర్‌ను, ప్రజల్ని ప్రభావితం చేసినంతగా.. స్టార్ క్యాంపెయినర్ గా బండి సంజయ్ చేయగలరా..? హెలికాప్టర్లో సుడిగాలి పర్యటనలతో స్టార్ క్యాంపెయినర్ పాత్ర పోషించనున్న బండి సంజయ్.. తాను నిల్చునే నియోజకవర్గంపై ఎంత వరకు ఫోకస్ చేయగలరు..? బండి కాలికి బలపం కట్టుకుని తిరిగినా..మంత్రి గంగుల కమలాకర్‌పై గెలవడమంటే సవాలే. తాను రాష్ట్రమంతా తిరగడం వల్లే కరీంనగర్ లో కాన్సంట్రేట్ చేయలేకపోయానని ఆ తర్వాత చెప్పుకోవడానికి ఈ స్టార్ క్యాంపెయినర్ పదవి ఉపయోగపడుతుందా..? అంటే అనేక ప్రశ్నలతో కూడిన విశ్లేషణలు కరీంనగర్లో జరుగుతున్నాయి. తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నపుడు పార్టీని పరుగులు తీయించిన బండి...స్టార్ క్యాంపెయినర్‌గా కూడా ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేరుస్తారా? అసలు కరీంనగర్లో స్వయంగా ఆయన గెలుస్తారా? అనే చర్చ కమలదళంలో ఆసక్తికరంగా చర్చలు సాగుతున్నాయి. అటు రాష్ట్ర పార్టీ విషయంలో...ఇటు స్వంత నియోజకవర్గంలో ఎదురయ్యే సవాళ్ళను బండి ఎలా ఎదుర్కొంటారనే డిస్కషన్ కూడా జరుగుతోంది. -
తిరగబడతా.. పోరాటం చేస్తా.. ఎమ్మెల్యే చెన్నమనేని మరోసారి హాట్ కామెంట్స్
సాక్షి, కరీంనగర్ జిల్లా: వేములవాడ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. వేములవాడ అర్బన్ మండలం అనుపురంలో.. వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహరావుతో కలిసి గ్రామపంచాయితీ భవన ప్రారంభోత్సవంలో మిడ్ మానేరు ముంపు గ్రామాలనుద్ధేశించి తన మనసులో మాటలన్నీ వెళ్లగక్కారు. మిడ్ మానేరు ప్రాజెక్ట్ ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం కాకుంటే తానే తిరగబడి పోరాటం చేస్తానంటూ తనదైన ధిక్కారస్వరాన్ని వినిపించిన చెన్నమనేని.. ముంపు గ్రామాలు సిరిసిల్ల నియోజకవర్గంలో ఉండి ఉంటే ఎప్పుడో సమస్యలు పరిష్కారం అయ్యేవన్నారు. ఆ విషయాన్ని సూటిగా కేటీఆర్‌తో కూడా ప్రస్తావించినట్టు చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో ముంపు గ్రామాల సమస్యలపై అధికార పక్షంలాగా కాకుండా.. ఓ ప్రతిపక్ష నేతగా పోరాటం చేశానన్న చెన్నమనేని రమేష్ బాబు.. తాను మంత్రినైనా బాగుండేదేమో, ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం సులభమయ్యేదేమోనన్నారు. మిడ్ మానేరు ముంపు గ్రామాల సమస్యలపై నేను ప్రశ్నించానన్న విషయాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టే చెబుతున్నానన్న చెన్నమనేని.. ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం కోసం ఎక్కని గడప, దిగని గడప లేదన్నారు. కాళ్లు పట్టుకోవడం తప్ప అన్నీ చేశానని.. చెన్నమనేని రాజేశ్వరరావు కూమారుడిని కాబట్టి, ఆత్మగౌరవం ఉంది కాబట్టి, ఆ పని చేయలేకపోయానన్నారు. సమస్యలు పరిష్కారం కాకుంటే మళ్లీ పోరాటం చేస్తానన్న రమేష్‌బాబు.. మిడ్ మానేరు ముంపు నిర్వాసితుల విషాదగాథల నుండి పాఠాలు నేర్చుకోవాలని తమ అభ్యర్థి చల్మెడకు సూచిస్తున్నానన్నారు. రమేష్ బాబు షాకింగ్ కామెంట్స్‌తో బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ నిశ్ఛేష్ఠుడై చూస్తూ కూర్చుండిపోయారు. మరోవైపు ముఖ్యమంత్రి వ్యవసాయ సలహాదారుగా చెన్నమనేనిని నియమించాక.. చెన్నమనేని, చల్మెడ మధ్య సయోధ్య కుదిరిందనుకుంటున్న తరుణంలోనూ ఎమ్మెల్యే రమేష్‌బాబు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. చదవండి: కాంగ్రెస్ కీలక నిర్ణయం!.. అక్కడి నుంచి బరిలో బండ్ల గణేష్? -
టెన్షన్.. టెన్షన్.. హన్మకొండ కోర్టుకు బండి సంజయ్
-
జగిత్యాలలో హై టెన్షన్.. బండి సంజయ్ అరెస్ట్
సాక్షి, జగిత్యాల: తెలంగాణలో మరోసారి రాజకీయం హీటెక్కింది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో, ఒక్కసారిగా పొలిటికల్ హీట్ చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నిర్మల్ వెళ్తుండగా జగిత్యాల జిల్లాలోని తాటిపల్లి వద్ద బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా బండి సంజయ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ముందు పాదయాత్రకు అనుమతి ఇచ్చి లాస్ట్ మినెట్‌లో ఎందుకు నిరాకరించారని డిమాండ్ చేశారు. అయితే, రేపటి భైంసా పాదయాత్రకు పోలీసుల అనుమతి లేకపోవడంతో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. శాంతి భద్రతల కారణంగా పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. ఇక, బండి సంజయ్‌ను జగిత్యాల పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో బీజేపీ శ్రేణులు ధర్నాకు దిగారు. దీంతో, వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, ఈ ఘటనపై బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తట్టుకోలేక బీజేపీని ఇలా అడ్డుకుంటున్నారు. ఇది సూర్యుడికి చేయి అడ్డుపెట్టే విధంగానే భావించాల్సి వస్తుంది. బండి సంజయ్ యాత్ర ప్రజల కోసం చేస్తున్న యాత్ర. ఇది ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలిపే యాత్ర అని అన్నారు. -
ED Raids Telangana: గ్రానైట్ కంపెనీల్లో సోదాలపై ఈడీ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: గ్రానైట్ కంపెనీల్లో సోదాలపై ఈడీ కీలక ప్రకటన చేసింది. శ్వేత గ్రానైట్స్, శ్వేత ఏజెన్సీస్, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్, పీఎస్ఆర్ గ్రానైట్స్, అరవింద్ గ్రానైట్స్, గిరిరాజ్ షిప్పింగ్ ఏజెన్సీస్‌లో రెండు రోజులు సోదాలు జరిపినట్లు వెల్లడించింది. హైదరాబాద్, కరీంనగర్‌లోని పలుచోట్ల సోదాలు చేసినట్లు పేర్కొంది. ఫెమా నిబంధనల ఉల్లంఘనపై ఈడీ సోదాలు నిర్వహించింది. రాయల్టీ చెల్లించిన దానికంటే ఎక్కువ గ్రానైట్‌ను విదేశాలకు ఎగుమతి చేసినట్టు ఈడీ గుర్తించింది. సోదాల్లో రూ.1.8 కోట్ల నగదు ఈడీ సీజ్ చేసింది. ఉద్యోగులతో బినామీ అకౌంట్లు తెరిచినట్లు అధికారులు గుర్తించారు. పదేళ్లుగా భారీగా హవాలా లావాదేవీలు జరిపినట్లు తేలింది. చైనా, హాంకాంగ్‌కు చెందిన కంపెనీల పాత్రపై ఈడీ ఆరాతీసింది. ఎలాంటి పత్రాలు లేకుండా చైనా సంస్థల నుంచి నగదు మళ్లించడాన్ని గుర్తించినట్టు ఈడీ వెల్లడించింది. చదవండి: మంత్రి గంగులపై ఫిర్యాదు చేసింది నేనే -
జగిత్యాల: వరద కాల్వలోకి దూకి తల్లి కుమార్తెల ఆత్మహత్య
సాక్షి, కరీంగనర్: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మనగర్‌లో విషాదం నెలకొంది. ఏం కష్టం వచ్చిందో .. ఏమో కానీ కుమార్తెతో కలిసి ఓ మహిళ వరద కాల్వలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతులు వనజ(28), శాన్వి(6)గా గుర్తించారు. ఇంట్లో గొడవ జరగడంతో వనజ కుమార్తెను తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. (చదవండి: కనురెప్పకు ఏ కష్టమొచ్చిందో..!?) అనంతరం వీర్దిదరు ఆత్మనగర్ వద్ద ఉన్న వరద కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం వీరి మృతదేహాలను గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. చదవండి: ‘నా చావుకి ఎవరూ బాధ్యులు కారు’ -
పోరాటల పురిటి గడ్డ.. వీర బైరాన్‌పల్లి
మద్దూరు(హుస్నాబాద్): నిజాం రజాకార్ల ఆగడాలకు ఎదురొడ్డి నిలిచిన గ్రామంగా మద్దూరు మండలం బైరాన్‌పల్లి కీర్తి గడించింది. రజాకార్ల అన్యాయాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో అనేక మంది వీర మరణం పొందారు. మద్దూరు, లద్నూర్, సలాఖపూర్, రేబర్తి, మర్మాముల గ్రామాలను రజాకార్లు తమ స్థావరాలుగా చేసుకొని దాడులు చేస్తుండే వారు. ఈ క్రమంలో బైరాన్‌పల్లి గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని రజాకార్ల దాడులను తిప్పి కొట్టడంలో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు వీరోచిత పోరాటాలు చేశారు. ఈ గ్రామ చరిత్రను ఒకసారి చూస్తే.. గ్రామ ర క్షక దళాలు: రజాకార్ల అరాచకాలను ఎదురించేందుకు గ్రామాల్లోని యువకులంత కలిసి రక్షణ దళాలుగా ఏర్పడ్డారు. బైరాన్‌పల్లి, కూటిగల్, లింగాపూర్, దూల్మిట్ట గ్రామాలలో ఏర్పడిన రక్షణ దళాలు బైరాన్‌పల్లిని కేంద్రంగా చేసుకొని నిరంతరం రజాకార్ల దాడులను తిప్పి కొట్టేవి. దీనితో రజాకార్లు 1948లో దూల్మిట్ట, లింగాపూర్ గ్రామాలపై దాడులు చేసి దొరికిన వారిని దొరికినట్లు చంపడంతో పాటు ఆయా గ్రామాలను తగుల బెట్టారు. ఆపై తిరిగి వస్తున్న రజాకార్లపై బైరాన్‌పల్లి వద్ద రక్షణ దళాలల నాయకులు దువ్వురి రాంరెడి,్డ మురిళిధర్రావు, ముకుందర్ రెడి నాయకత్వంలో కాపు కాచి గేరిల్లా దాడులు చేశారు. లింగాపూర్ దూల్మిట్ట గ్రామాలలో దోచుకున్న సంపదను స్వాదీనం చేసుకున్నారు. బైరాన్‌పల్లి దిగ్బందం: బైరాన్‌పల్లి గ్రామ రక్షక దళాలు దాడులు చేయడంపై రజాకార్లు అగ్రహించుకొని ఆ గ్రామంపై రజాకార్లు మూడు సార్లు దాడులు చేసి విఫలం అయ్యారు. ఈ క్రమంలో 1948 ఆగస్లు 27వ తేది అర్థరాత్రి ఖాసీం రజ్వీ నాయకత్వంలో రజాకార్లు జనగామ నుండి 10 ట్రక్‌లతో బయలుదేరి రాత్రి 2 గంటల ప్రాంతలో తమకు అడ్డాగా ఉన్న లద్నూర్ గ్రామానికి రజాకార్లు చేరుకున్నారు. తెల్లవరుజాము 3 గంటల సమయంలో బైరాన్‌పల్లి గ్రామాన్ని మందుగుండు సామాగ్రితో 12 వందల మంది సైనికులు దిగ్భందించారు. బహిర్బూమికి వెళ్ళిన ఉల్లెంగల(వడ్ల) నర్సయ్యను పట్టుకొని గ్రామంలో ఉన్న బురుజు వద్దకు దారి చూపించమని తీసుకు వెళ్ళారు. అదే సమయంలో నర్సయ్య వారిని నెట్టివేస్తు రజాకార్లు గ్రామంలోకి వచ్చారని కేకలు వేస్తు పరుగులు తీశాడు. దీనితో బురుజుపై ఉన్న కాపాల దారుడు నగార మోగించారు. దీనితో రజాకార్లు కాల్పులు ప్రారంబించడంతో బురుజుపై ఉన్న మోటం రామయ్య, పోచయ్య, బలిజ భూమయ్యలు మృతి చెందారు. కాల్పులు జరుగుతుండగా బురుజుపై ఉన్న మందు గుండు సామాగ్రిపై నిప్పు రవ్వలు ఎగిసి పడటంతో ఒక్కసారిగా బురుజుపైభాగం పేలిపోయింది. దీనితో రజాకార్లు గ్రామంలోకి చొరబడి దొరికిన వారిని దొరికినట్లు కాల్చి చంపారు. ఈలా ఒకే రోజు బైరాన్‌పల్లి గ్రామంలో 96మందిని చంపి శవాల చుట్టు మహిళలతో బతుక్మ ఆటలాడించారు. కూటిగల్‌పై దాడి: బైరాన్‌పల్లి గ్రామ రక్షక దళాలకు కూటిగల్ ప్రజలు సహయ సహకారులు అందిచడంతో మూడు సార్లు దాడిని బైరాన్‌పల్లి గ్రామస్తులు తిప్పి కొట్టారని కోపంతో 1948 ఆగస్టు27న బైరాన్‌పల్లి దాడి తర్వత కొంత మంది రజాకార్లు కూటిగల్ గ్రామంపై దాడి చేసి బురుజుపై ఉన్న వారిని కిందకు దింపి తూటల మర్రి వరకు తీసుక వచ్చి రెక్కలు కట్టి నిల్చొబెట్టి 22 మందిని కాల్చి చంపి రజాకార్లు పైచాచిక ఆనందం పొందారు. రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన బైరాన్‌పల్లి గ్రామ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని స్థానికంగా డిమాండ్ వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలించాలని కోరుతున్నారు. -
మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భూకంపం..
-
చావనైనా చస్తా.. కేసీఆర్‌కు లొంగను
ఇల్లందకుంట(హుజూరాబాద్): ‘చావనైనా చస్తా గానీ, సీఎం కేసీఆర్‌కు మాత్రం లొంగేది లేదు’అని మాజీమంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. ‘మా ఓటు మా వాడికే వేయాల’ని ప్రతి గ్రామంలోని ప్రజలు నినదిస్తున్నారని పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పరిధిలోని రామన్నపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో ఈటల ప్రచారం నిర్వహించారు. ఆయనకు బతుకమ్మలు, మంగళహారతులతో మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. ఈటల మాట్లాడుతూ తాను జీవించి ఉన్నంతకాలం కేసీఆర్‌పై పోరాటం చేస్తానని, డబ్బుకు ఓట్లు వేస్తారనే చిల్లర ఆలోచనతో కేసీఆర్ ఉన్నారని, ప్రజలు ఈ నెల 30న ఆయనకు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ప్రజలకు కేసీఆర్ ఇస్తున్న సొమ్ము భూమి అమ్మినవో.. చెమటోడ్చి సంపాందించినవో కావని, అదంతా ప్రజాధనమేనని అన్నారు. బండి నీడన వెళ్తున్న కుక్క.. తానే బండిని లాగుతున్నట్లు భావిస్తుందని, కేసీఆర్ కూడా అదే భ్రమలో ఉన్నారని ధ్వజమెత్తారు. ఈటల రాజేందర్ హుజూరాబాద్‌లో గెలిస్తే కేసీఆర్ నిరంకుశత్వం, అహంకారం నాశనమవుతుందని పేర్కొన్నారు. ప్రజల వల్లే కేసీఆర్ బతుకుతున్నారని, ఆయన మాత్రం ప్రజలను బతికిస్తున్నాననే భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు. మంత్రి హరీశ్‌రావు తనపై కరపత్రాలు, పోస్టర్లు ముద్రించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు తెలంగాణలో ఎంతపేరు ఉందో తాను కూడా ఆ స్థాయిలో కష్టపడి పేరు సంపాదించుకున్న బిడ్డనని, తెలంగాణ చిత్రపటంపై ముద్ర వేసుకున్నానని, అందుకే దానిని పీకేద్దామని కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఎర్రం రాజు సురేందర్ రాజు, శీలం శ్రీనివాస్‌తోపాటు తదితరులు పాల్గొన్నారు. -
Huzurabad Bypoll 2021: బరిలో 30 మంది..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. బీజేపీ నుంచి ఈటల జమున, కాంగ్రెస్ నుంచి ఒంటెల లింగారెడ్డితోపాటు మొత్తం 12 మంది అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక 30 మంది మాత్రమే తుదిపోరులో నిలిచారు. బరిలో ఉన్న అభ్యర్థులందరికీ గుర్తులు కేటాయించామని హుజూ రాబాద్ ఆర్డీవో రవీందర్‌రెడ్డి ప్రకటించారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి నామినేషన్ల స్వీకరణ, స్రూ్కటినీ, ఉపసంహరణ కార్యక్రమాలు పూర్తిచేశామని తెలిపారు. రెండు ఈవీఎం(ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషీన్)లతోనే ఓటింగ్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఉపపోరులో ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లు దాదాపు వెయ్యిమంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపఎన్నికలో పోటీ చేయాలని అనుకున్నారు. నామినేషన్ల దాఖలుకు దాదాపు అన్ని జిల్లాల నుంచి వారు భారీగా తరలివచ్చారు. అయితే ఎన్నికల నిబంధనల పేరిట అధికారులు వారిని వెనక్కి పంపారు. చివరిరోజు 12 మంది మాత్రమే నామినేషన్లు వేయగలిగారు. వీరిలోనూ తొమ్మిది మంది నామినేషన్లను వివిధ కారణాలతో అధికారులు తిరస్కరించారు. కమలాపూర్‌కు చెందిన గుర్రం కిరణ్ అనే ఫీల్డ్ అసిస్టెంట్ బుధవారం నామినేషన్ ఉపసంహరించుకోవడంతో కరీంనగర్ జిల్లా సైదాపూర్‌కు చెందిన తిరుపతి నాయక్ (గౌను గుర్తు), వరంగల్ జిల్లా పర్వతగిరికి చెందిన గంజి యుగంధర్ (కుండ గుర్తు) మాత్రమే తుదిపోరులో నిలిచారు. వీరు త్వరలోనే హుజూరాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. గుర్తుల కేటాయింపు ఇలా.. ప్రధానపార్టీల నుంచి ఈటల రాజేందర్ (బీజేపీ), గెల్లు శ్రీనివాస్ యాదవ్ (టీఆర్ఎస్), బల్మూరి వెంకట్ (కాంగ్రెస్) బరిలో నిలిచారు. మిగిలిన ఏడుగురు రిజిస్టర్డ్ పార్టీలవారు కాగా, మరో 20 మంది ఇండిపెండెంట్లు. వీరికి ఎన్నికల సంఘం బుధవారం గుర్తులు కేటాయించింది. స్వతంత్రులకు కేటాయించిన కాలీఫ్లవర్, పెన్నుపాళీ గుర్తులు కమలం గుర్తును పోలి ఉన్నాయని, దీంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశాలున్నాయని బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బరి నుంచి తప్పుకున్నది వీరే 1.ఈటల జమన(బీజేపీ) 2. ఒంటెల లింగారెడ్డి (కాంగ్రెస్) 3.కొలుగూరి రాజ్‌కుమార్ 4.ఎమ్మడి రవి 5.అంగోత్ వినోద్‌కుమార్ 6.రేకల సైదులు 7.కౌటం రవీందర్ 8. ఎనగందుల వెంకటేశ్వర్లు 9.నూర్జహాన్ బేగం 10. వరికోలు శ్రీనివాస్ 11.పెట్టెం మల్లిఖార్జున్ 12 గుర్రం కిరణ్ -
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ.. బద్వేలు బరిలో 15 మంది
సాక్షి, వైఎస్సార్ కడప: బద్వేలు ఉపఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. బద్వేలు బరిలో నామినేషన్ వేసిన పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను బుధవారం ఉపసంహరించుకున్నారు. పలువురు అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ అనంతరం పోటీలో 15 మంది అభ్యర్థులు నిలిచారు. ఈ రోజు ముగ్గురు స్వతంత్ర అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నుంచి నామినేషన్ గడువు వరకూ 27 మంది నామినేషన్ వేశారు. నామినేషన్ల పరిశీలనలో 9 మంది తిరస్కరణకు గురయ్యారు. చివరగా నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 15 మంది అభ్యర్థులు బద్వేల్ ఉపఎన్నిక పోటీలో నిలిచారు. హుజూరాబాద్ బరిలో 30 మంది అభ్యర్థులు సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఉప ఎన్నిక పోటీ నుంచి 12 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. హుజూరాబాద్ బరిలో 30 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. హుజురాబాద్‌లో నామినేషన్ వేసిన మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ సతీమణి జమున తన నామినేషన్‌ను విత్ డ్రా చేసుకున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి ఒంటెల లింగారెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్తులు సుమన్ నాయక్, వినోద్ కుమార్, రాజ్ కుమార్, నూర్జహాన్ బేగం, మల్లికార్జున్ తదితరులు తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. దీంతో 30 మంది అభ్యర్థులకు గాను రెండు ఈవీఎంలతో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగనుంది. -
Huzurabad Bypoll 2021: బరిలో ఉండే వారేవరో తేలేది నేడే..
సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో ఉండే వారెవరో తేలేది నేడే. నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం చివరి రోజు. మొత్తం 61 మంది నామినేషన్ వేయగా.. స్క్రూటినీ తర్వాత 42 మంది మిగిలారు. బుధవారం 3 గంటల వరకూ నామినేషన్ ఉపసంహరణకు అవకాశం ఉంది. ఇప్పటివరకూ నామినేషన్ వేసిన వారిలో మూడు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు.. ఏడు ఇతర పార్టీల నుంచి 32 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. (చదవండి: ఒక్క వాహనం కూడా లేదు..‘ఈటల’ స్కూటర్లు ఏమైనట్టు..?) ఒక్కో ఈవీఎంలో 16 మంది వివరాలు మాత్రమే పొందు పరిచే అవకాశం ఉంది. ఆ లెక్కన 42 మందిలో సగం మంది వైదొలగినా 21 మంది ఉన్నా కూడా రెండు ఈవీఎంలు తప్పనిసరిగా వినియోగించాల్సి వస్తుంది. ఒకవేళ 32 మంది పోటీలో ఉంటే నోటాతో కలిపి మూడు ఈవీఎంలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బుధవారం సాయంత్రం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం అధికారులు అభ్యర్థులకు గుర్తులు కేటాయించనున్నారు. చదవండి: తెలంగాణ: 7 జాతీయ, 4 ప్రాంతీయ పార్టీలు -
వేడెక్కిన రాజకీయం: హుజూరా‘బాద్షా’ ఎవరో?
సాక్షిప్రతినిధి, వరంగల్/కరీంనగర్: హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. హనుమకొండ, కరీంనగర్ జిల్లాల పరిధిలోని ఈ నియోజకవర్గం ఎన్నికల షెడ్యూల్‌ను మంగళవారం సీఈసీ విడుదల చేసింది. భూకబ్జా వివాదం కేసులో బర్తరఫ్కు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. జూన్ 12న ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా, దాదాపు 16 వారాల తరువాత ఈ స్థానానికి నోటిఫికేషన్ రావడం గమనార్హం. ఇప్పటికే అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య నువ్వా–నేనా అన్నట్లుగా రాజకీయ సమరం సాగింది. ఇప్పుడు ఉప ఎన్నిక నగారాతో ఎన్నికల వేడి మరింత పెరగనుంది. వేడెక్కిన హుజూరాబాద్... ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలతో హుజూరాబాద్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈటల బర్తరఫ్, రాజీనామా నుంచే రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు మొదలయ్యాయి. చివరకు ఈ పోటీ మంత్రి హరీశ్, ఈటల రాజేందర్ మధ్యనే అన్నట్లు మారింది. ఒకరు తన గెలుపు కోసం కసరత్తు చేస్తుంటే.. మరొకరు ప్రత్యర్థి విజయావకాశాల్ని దెబ్బతీసే వ్యూహరచనలో తలమునకలయ్యారు. ఈటల బీజేపీలో చేరడంతోటీఆర్‌ఎస్ అధినేత ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే.. చాలాకాలంగా చెబుతున్న దళితబంధు పథకాన్ని తొలుత హుజూరాబాద్‌లో ప్రవేశపెట్టారు. సీఎం కేసీఆర్ తనకు అప్పగించిన బాధ్యతల్ని కొంతకాలం తెరవెనుక ఉండి నడిపించిన హరీశ్.. తర్వాత నేరుగా నియోజకవర్గంలో అడుగుపెట్టారు. ట్రబుల్ షూటర్‌గా పేరొందిన మంత్రి.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోసం పావులు కదుపుతున్నారు. ఇక, 2009, 2010, 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి విజయం సాధించిన ఈటల రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేశారు. ఈ నియోజకవర్గంలో ఇంతవరకూ ఆయనను ఢీకొట్టే నేతలెవరూ లేకుండాపోయారు. ఈసారి గెలిచి తీరాల్సిందేనన్న పట్టుదలతో ఆయన ముందుకుసాగుతున్నారు. నిన్నమొన్నటి వరకు మోస్తరు నుంచి ముమ్మరంగా సాగిన ప్రచారం.. షెడ్యూల్ ప్రకటనతో ఊపందుకుంది. ఇక టీఆర్ఎస్, బీజేపీ నేతల ప్రచారాలతో హుజూరాబాద్ హోరెత్తనుంది. కాంగ్రెస్ అభ్యర్థిపై సస్పెన్స్..: ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు బీజేపీ నుంచి ఈటల సిద్ధమయ్యారు. తమ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికే చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను టీఆర్ఎస్ ఇదివరకే ప్రకటించింది. కేవలం ఇన్‌చార్జ్‌లను నియమించిన కాంగ్రెస్.. అభ్యర్థి విషయంలో ఇంకా సస్పెన్సే కొనసాగిస్తోంది. రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక జరుగుతున్న తొలి ఉప ఎన్నిక ఇదే కావడం గమనార్హం. పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ, దొమ్మాటి సాంబయ్య పేర్లు ప్రచారంలో ఉన్నా.. ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో షెడ్యూల్ విడుదల కావడంతో ఒక్కసారి అప్రమత్తమైన ప్రధాన పార్టీలు వ్యూహాలకు మరింత పదును పెట్టే పనిలో పడ్డాయి. -
తల్లిదండ్రులే కూతురిని చంపారంటూ పుకార్లు..
సాక్షి, మల్యాల(కరీంనగర్): తమ కూతురు చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భార్యాభర్తలు పోలీస్‌స్టేషన్ ఎదుట భైఠాయించిన సంఘటన మల్యాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మల్యాల మండలకేంద్రానికి చెందిన సంగ శ్రీనివాస్–మంజుల కుమార్తె తేజస్విని గతేడాది సెప్టెంబర్ 3న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా స్థానికుల సమాచారం మేరకు అప్పటి సీఐ కిశోర్ శవయాత్రను మధ్యలో నిలిపివేసి పోస్టుమార్టంకు తరలించారు. తల్లిదండ్రులే కూతురిని చంపారంటూ పుకార్లు పుట్టాయి. తమ కూతురు చావుకు తాము కారణం కాదని నిరూపించుకునేందుకు తేజస్విని మృతికి కారణాలు కనుగొనాలని పోలీసుల చుట్టూ తిరుగుతున్నామని శ్రీనివాస్ మంజుల ఆవేదన వ్యక్తం చేశారు. తమ బంధువుల అబ్బాయి ప్రేమపేరుతో వంచించడంతోనే కూతురు మృతిచెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. సీఐ రమణమూర్తి బాధితులతో మాట్లాడి కేసు విచారణ చేపడతామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. -
పాపం.. ఏం కష్టమొచ్చిందో కొడుకులతో కలిసి మహిళ
సాక్షి, జగిత్యాల: ఉమ్మడి కరీంగనర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ ఇద్దరు కుమారులతో కలిసి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. జగిత్యాల జిల్ల రాయికల్ మండటం కిష్టంపేటలో ఈ విషాదం చోటు చేసుకుంది. లావణ్య అనే మహిళ ఇద్దరు కుమారులతో కలిసి బావిలోకి దూకింది. ఈ ఘటనలో లావణ్య, ఆమె పెద్ద కుమారుడు మరణించగా.. చిన్న కుమారుడ హర్షవర్థన్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
నాన్నా.. అమ్మ, తాతను చంపొద్దు
మానకొండూర్: కుటుంబ కలహాలు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. అమ్మను, తాతను చంపొద్దని చిన్నారులు వేడుకున్నా..నాన్న, చిన్నాన్నల మనసు కరగలేదు. పోలీసుల కౌన్సెలింగ్ అనంతరం ఆటోలో ఇంటికి వెళ్తున్న సమయంలో భార్యను, మామను అల్లుడు, అతడి సోదరుడు దారుణంగా హత్య చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలోని శ్రీనివాస్‌నగర్ గ్రామ శివారులో సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. మానకొండూర్ మండలం వెల్ది గ్రామానికి చెందిన లావణ్య(34)కు ఇదే మండలం అన్నారం గ్రామానికి చెందిన రమేశ్‌తో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. రమేశ్ ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. దంపతులకు అజిత్, అక్షిత సంతానం. ఈ నేపథ్యంలో భార్యపై రమేశ్ అనుమానం పెంచుకోగా, మనస్పర్థలు వచ్చి కొద్దిరోజులుగా ఇద్దరికీ మధ్య గొడవలు జరుగుతున్నాయి. లావణ్య పిల్లలతో కలసి తల్లి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో సోమవారం కరీంనగర్‌లోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో దంపతులకు కౌన్సెలింగ్ చేసి, మళ్లీ రెండ్రోజులకు రావాలని సూచించారు. దీంతో లావణ్య, పిల్లలతోపాటు తండ్రి బాలసాని ఓదెలు(60) ఆటోలో వెల్దికి బయల్దేరారు. మార్గమధ్యంలోని శ్రీనివాస్‌నగర్ గ్రామ శివారులో బైక్‌పై వచ్చిన రమేశ్ అతడి తమ్ముడు అనిల్ ఆటోను అడ్డగించి దాడికి పాల్పడ్డారు. కత్తితో లావణ్య, ఓదెలు గొంతు కోసి వెళ్లిపోయారు. అడ్డగించిన చిన్నారులకు కూడా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
కరోనా వేళ ఫైనాన్స్ దందా.. 5నుంచి 10శాతం వరకు అధికంగా..
కరీంనగరానికి చెందిన రాజు ప్రయివేటు లెక్చరర్. కరోనా కారణంగా రెండేళ్లుగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. పనిచేస్తున్న సంస్థ జీతాలు ఇవ్వడం లేదు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. తెలిసినవారిని అడిగితే.. డబ్బు సాయం చేయలేదు. తప్పనిసరి పరిస్థితిలో 5శాతం ఫైనాన్స్ వడ్డీకి రూ.2లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అసలు కన్నా వడ్డీనే ఎక్కువ కావడంతో చివరికి భార్య బంగారం తాకట్టుపెట్టి తీర్చాడు. కరీంనగర్‌కు చెందిన మల్లేశ్ ప్రయివేటు ఉద్యోగి.10వేల జీతంతో భార్యా, పిల్లలను పోషించుకుంటున్నాడు. ఇటీవల తన భార్యకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆస్పత్రిలో చూపించగా.. డబ్బులు చాలా వరకు ఖర్చయ్యాయి. కోలుకుని ఇంటికి రాగా.. మందులకు కూడా డబ్బులు లేని పరిస్థితి. తెలిసినవారికి అడిగినా.. ఇవ్వలేదు. దీంతో దూరపు స్నేహితుడి సాయంతో 10శాతం వడ్డీకి రూ.30 వేలు అప్పు తీసుకున్నాడు. వచ్చే జీతంలో నెలకు రూ.3వేలు వడ్డీనే కడుతున్నాడు. సాక్షి, కరీంనగర్: కరోనా విజృంభణతో ప్రతీఒక్కరి ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఉద్యోగాలు పోయి.. ఉపాధి కరువై చేతిలో చిల్లిగవ్వలేని దుస్థితి నెలకొంది. లాక్డౌన్ అనంతరం పనులు ప్రారంభం అయినా.. కుటుంబాన్ని పోషించేందుకు అప్పులే దిక్కయ్యాయి. అందిన చోటల్లా అప్పులు చేస్తుండగా.. ఫైనాన్స్ వ్యాపారులు ఇదే అదనుగా రెచ్చిపోతున్నారు. లాక్‌డౌన్‌ను ఆసరాగా చేసుకుని ఇబ్బడిముబ్బడిగా వడ్డీలు వసూలు చేస్తున్నారు. అత్యవసరం ఉన్న సమయంలో 5నుంచి 10శాతం వరకు వడ్డీకి ఇస్తూ.. సామాన్యుల నడ్డీ విరుస్తున్నారు. జిల్లావ్యాప్తంగా లైసెన్స్ ఉన్న ఫైనాన్స్ కంపెనీలు పదుల సంఖ్యలోనే కొనసాగుతుండగా.. అనుమతి లేకుండా వందల సంఖ్యలో వడ్డీ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అవసరాన్ని ఆసరాగా.. ►2020 మార్చి నుంచి జిల్లాలో కరోనా తన ప్రతాపాన్ని చూపుతోంది. ఆ సమయంలో విధించిన లాక్‌డౌన్‌తో చాలా వరకు ప్రయివేటు సంస్థల్లో ఉద్యోగులను తొలగించారు. చిరువ్యాపారులు, కూలీపని చేసుకునేవాళ్లకు ఉపాధి కరువైంది. ►ఈ క్రమంలో కుటుంబాన్ని పోషించేందుకు అప్పులే దిక్కయ్యాయి. ఏడాది క్రితం 3శాతం నుంచి 5శాతం వరకు వడ్డీలకు ఇచ్చిన నిర్వాహకులు సెకండ్ వేవ్ నేపథ్యంలో అందినకాడికి దండుకుంటున్నారు. ► సెకండ్‌వేవ్ ప్రభావం జిల్లాపై తీవ్రంగానే ఉండగా.. చాలా మంది వైరస్ బారిన పడి ఆస్పత్రి పాలయ్యారు. అప్పులు చేసి మరీ బిల్లులు కట్టగా.. కొందరి ప్రాణాలు సైతం పోయాయి. ► ఈ క్రమంలో ఫైనాన్సర్లు తమదందాను పెంచుకునే పనిలో పడ్డారు. అవసరం ఉన్నవారికి అప్పులిస్తూ.. 10శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నారు. నడ్డి విరుస్తున్న వడ్డీ వ్యాపారులు జిల్లాలో పదుల సంఖ్యలో అనుమతి ఉన్న ఫైనా న్స్ కంపెనీలు ఉండగా.. కొందరు మాత్రమే నిబంధనలకు అనుగుణంగా అప్పులు ఇస్తుంటారు. అత్యవసరం ఉన్నవారు కంపెనీలను ఆశ్రయించేంత సమయం లేకపోవడంతో వడ్డీవ్యాపారుల వద్ద అప్పు తీసుకుంటున్నారు. వారు అవతలి వ్యక్తి అవసరాన్ని ఆసరాగా తీసుకుని.. 10నుంచి 15శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నారు. అది కూడా కేవలం రెండు, మూడుమాసాల్లో చెల్లించాల్సిందే. లేకుంటే ఏదైనా వస్తువు కుదవపెట్టాల్సిందే. అప్పు కట్టలేని పరిస్థితుల్లో ప్రామిసరీ నోట్లపై సంతకాలు, బంగారం, వస్తువులు తీసుకుంటున్నారు. ఏవైనా భూములు ఉంటే.. పేపర్లు రాయించుకుని దగ్గరుంచుకుంటున్నారు. కొన్నాళ్లకు ఇతరులకు సదరు భూమిని అమ్మేస్తుంటారు. కుటుంబ పోషణకే అప్పు.. ► జిల్లావ్యాప్తంగా పేద, మధ్యతరగతి ప్రజలు ఇల్లుగడవని పరిస్థితిలో వడ్డీ వ్యాపారులు, ఫైనాన్స్‌లను ఆశ్రయిస్తున్నారు. ► వారి అవసరాన్ని క్యాష్ చేసుకునేందుకు పెద్దఎత్తున వడ్డీలకు అప్పులు ఇస్తూ జిల్లావ్యాప్తంగా చాలా మంది అందినకాడికి దండుకుంటున్నారు. ► ప్రయివేటు గోల్డ్‌లోన్ కంపెనీలను పరిశీలిస్తే.. సాధారణ పరిస్థితుల్లో కన్నా 20శాతం రుణాలు పెరిగాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ► అనుమతి ఉన్న కంపెనీలు నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరిస్తుండగా.. అనుమతి లేని ఫైనాన్సియర్లు అడ్డూఅదుపు లేకుండా వ్యవహరిస్తున్నారు. చెప్పిన సమయానికి అందివ్వని పరిస్థితిలో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ► ఇంత జరుగుతున్నా.. వడ్డీవ్యాపారులపై పోలీసుల నిఘా కరువైందని ప్ర జలు అంటున్నారు. నిలువరించాల్సినవారు వత్తాసు పలుకుతున్నారని చెబు తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అధికవడ్డీలు వసూలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. -
పూజకు వేళాయే.. తరలివచ్చిన భక్తజనం.. లఘు దర్శనాలకే అనుమతి
సాక్షి, వేములవాడ: ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేయడంతో 40 రోజులుగా మూసి ఉంచిన వేములవాడ రాజన్న ఆలయాన్ని ఆదివారం ఉదయం ఆలయ అధికారులు తెరిచారు. దీంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం కేవలం స్వామివారి లఘు దర్శనం, కల్యాణకట్టలో తలనీలాల సమర్పణ, స్వామివారి ప్రసాదాలను మాత్రమే అనుమతించారు. గర్భగుడి దర్శనాలు, ధర్మగుండం ప్రవేశం నిలిపివేశారు. కోడె మొక్కులు చెల్లించుకునే అంశంపై తుదినిర్ణయం తీసుకుంటామని ఆలయ ఏఈవో హరికిషన్ తెలిపారు. జోరందుకున్న పుట్టువెంట్రుకలు ప్రభుత్వం అన్‌లాక్ ప్రకటించడంతో పాటు ఆదివారం మంచిరోజు కావడంతో చిన్నారుల పుట్టు వెంట్రుకలు తీసేందుకు కుటుంబాలతో వచ్చిన వారితో ఆలయ ఆవరణ కిటకిటలాడింది. అలాగే కల్యాణకట్టలోనూ మొక్కులు చెల్లించుకున్నారు. కొత్త పెళ్లి జంటలు సైతం తమ ఇలవేల్పు రాజన్నను కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. చాలా రోజుల తరువాత రాజన్నను దర్శించుకున్నామంటూ జనం సంబరపడిపోయారు. స్థానికుల దర్శనాలు మూడు మాసాలుగా రాజన్న గుడి మెట్లు ఎక్కని స్థానికులు ఆదివారం వేకువజాము నుంచే స్వామి సన్నిధికి చేరుకుని దర్శించుకున్నారు. మే 12 ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌కు ముందునుంచే రాజన్న ఆలయాన్ని అధికారులు సెల్ఫ్ లాక్డౌన్ ప్రకటించడం, సెకండ్ వేవ్‌తో చాలా మంది మృతిచెందడంతో స్థానికులు రాజన్న గుడివైపు వెళ్లలేకపోయారు. పాజిటివ్ కేసులు తగ్గడం, ప్రభుత్వం అన్‌లాక్ ప్రకటించడంతో పురప్రముఖులు, స్థానికులు దర్శనం కోసం క్యూ కట్టారు. పోలీసులు, ఎస్పీఎఫ్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. చదవండి: సప్త మాతృకలకు బంగారు బోనం.. -
ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. 6 గంటల పాటు అలాగే..
సాక్షి, కరీంనగర్ టౌన్: కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఐసోలేషన్ సెంటర్లో దారుణం చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా వెంకట్రావుపేటకు చెందిన ఓ వ్యక్తి ఆదివారం ఉదయం కరోనాతో మృతిచెందగా మృతదేహాన్ని వైద్య సిబ్బంది మార్చురీకి తరలించకుండా 6 గంటలపాటు వార్డులోనే ఉంచారని మృతుడి బంధువులు ఆరోపించారు. అంబులెన్స్‌లు లేవని వచ్చే వరకు వేచిచూడాలంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని తెలిపారు. ఆస్పత్రి కరోనా పేషెంట్లతో నిండుతుండగా మృతదేహాలను ఇలా గంటల తరబడి వార్డులోనే ఉంచడంతో చికిత్స పొందుతున్న రోగులు ఆందోళనకు గురయ్యారు. -
కరీంనగర్లో తీగ... ఫలక్‌నుమాలో డొంక
చంద్రాయణగుట్ట: దీపావళి టపాసులు తయారు చేయడానికి వినియోగించి గన్‌పౌడర్‌తో తక్కువ సామర్థ్యం కలిగిన డిటొనేటర్లు తయారు చేస్తున్న ముఠా గుట్టును దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. కరీంనగర్లో పట్టుబడిన ఇద్దరి విచారణలో వీటి మూలాలు ఫలక్‌నుమాలో ఉన్నట్లు తేలాయి. సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈది బజార్‌కు చెందిన మహ్మద్ జైనుల్లా హబీబ్ అలియాస్ షబ్బీర్‌కు గతంలో గన్‌పౌడర్ తయారీకి సంబంధించి లైసెన్స్ ఉండేది. బొగ్గు, అమ్మోనియం నైట్రేట్, సోడియం సల్ఫేట్ తదితరాలను కలిపి దీనిని తయారు చేసే అతగాడు టపాసుల తయారీదారులకు విక్రయించేవాడు. రెయిన్‌బజార్ కేంద్రంగా ఈ వ్యాపారం చేయడానికి కంట్రోలర్ ఆఫ్ ఎక్స్‌ప్లోజివ్స్ జారీ చేసిన దీని కాల పరిమితి 2018లో ముగిసింది. ఆ తర్వాత దాన్ని షబ్బీర్ రెన్యువల్ చేయించుకోలేదు. అయితే అప్పటికే అతడి వద్ద కొంత ముడిసరుకు మిగిలిపోయింది. ఫాతీమానగర్‌లో బొగ్గు విక్రయానికి లైసెన్స్ కలిగిన హమీద్ ఖాన్‌తో కలిసి ఆ ప్రాంతంలోనే దీన్ని అక్రమంగా తయారు చేయడం మొదలెట్టాడు. నిర్మాణ రంగంలో అక్రమ పేలుళ్ల కోసం డిటొనేటర్లకు భారీ డిమాండ్ ఉందని తెలుసుకున్న షబ్బీర్ గన్‌పౌడర్ వినియోగించి తక్కువ సామర్థ్యం కలిగిన డిటోనేటర్లను తయారు చేస్తున్నాడు. వివిధ జిల్లాలకు పాలిష్ పౌడర్ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ రవాణా చేస్తున్నాడు. ఇతడి వద్ద వీటిని ఖరీదు చేస్తున్న వారిలో కరీంనగర్‌కు చెందిన సతీష్, విష్ణువర్థన్‌రెడ్డి సైతం ఉన్నారు. గురువారం ఉదయం వీరిద్దరినీ పట్టుకున్న అక్కడి పోలీసులు వారి నుంచి భారీ మొత్తంలో డిటొనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణ నేపథ్యంలో తమకు వీటిని హైదరాబాద్ నుంచి షబ్బీర్ సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. రంగంలోకి దిగిన దక్షిణ మండల టాస్‌్కఫోర్స్ పోలీసులు ఫాతీమానగర్‌లోని స్థావరంపై దాడి చేసి షబ్బీర్‌తో పాటు హమీద్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి దాదాపు టన్ను గన్‌పౌడర్ స్వాధీనం చేసుకున్నారు -
ఇంజినీర్లు.. ప్రజాధనం లూటీ!
సాక్షి, కరీంనగర్: ‘పట్టణ ప్రగతి’ పనుల పేరిట ప్రజల సొమ్ము కాజేసేందుకు కరీంనగర్ కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారులు స్కెచ్ వేశారు. ఇందుకోసం వాహనాల నంబర్లనే తారుమారు చేశారు. జేసీబీ నంబర్ల స్థానంలో తమకు తోచిన ద్విచక్రవాహనాల నంబర్లు.. ట్రాక్టర్ల నంబర్ల స్థానంలో కనిపించిన ఆటో నంబర్ రాసి బిల్లుల కోసం ఫైళ్లు పెట్టారు. అన్నీ సరిచూసుకుని సంతకం చేయాల్సిన కమిషనర్ ఏమీ పట్టించుకోకుండా సంతకం చేసేశారు. చివరకు ఆడిటింగ్ అధికారుల వద్ద అసలు బాగోతం బయటపడింది. ఖాళీ స్థలాల చదును పేరిట.. పట్టణాల్లోని మురికివాడలు, వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రతీ మున్సిపాలిటీకి ప్రతీనెల నిధులు కేటాయిస్తోంది. పట్టణప్రగతి కార్యక్రమం ప్రారంభానికి ముందు సీఎం కేసీఆర్ కలెక్టర్లతో సమావేశం నిర్వహించి పట్టణాల్లో దీర్ఘకాలిక సమస్యలన్నీ పరిష్కారం కావాలని, పారిశుధ్యం మెరుగుపడాలని ఆదేశించారు. 5.9 ఎకరాలు శుభ్రం చేశామని.. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని 2020, ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో పలు సమస్యలు గుర్తించారు. పరిష్కారానికి ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా చెత్త, మురికినీరు నిలిచిన ఖాళీ స్థలాలను శుభ్రం చేయాలని నిర్ణయించారు. ఈమేరకు 60 డివిజన్లలో కలిపి 5.9 ఎకరాల విస్తీర్ణంలోని మూడువేలకుపైగా ఖాళీ స్థలాలను గుర్తించినట్లు ఇంజినీరింగ్ అధికారులు పేర్కొన్నారు. వీటిని శుభ్రం చేసేందుకు నిత్యం 25పైగా జేసీబీలు, 40కుపైగా బ్లేడ్ ట్రాక్టర్లు, లోడింగ్ ట్రాక్టర్లు వినియోగించామని రికార్డులు నమోదు చేశారు. జేసీబీ స్థానంలో బైక్.. ట్రాక్టర్ల స్థానంలో ఆటోల నంబర్లు.. పది రోజులు నిర్వహించిన పట్టణ ప్రగతిలో ఖాళీ స్థలాలు శుభ్రం చేసేందుకు 150 జేసీబీలు, 200 ట్రా క్టర్లు ఉపయోగించినట్లు లెక్క తేల్చారు. 60 డివిజన్లలో 5.96 ఎకరాల ఖాళీ స్థలాల క్లీనింగ్‌కు రూ.40 లక్షలు ఖర్చయినట్లు లెక్కలు వేశారు. వాహనాల బిల్లుల కోసం రూ.5 లక్షలకు ఒక ఫైల్ చొప్పన 8 ఫైళ్లు సిద్ధం చేశారు. ఇందులో జేసీబీలు, బ్లేడ్ ట్రాక్టర్లు, లోడింగ్ ట్రాక్టర్లు ఏ రోజు ఎన్ని వినియోగించారు. ఎక్కడెక్కడ పనులు చేయించారు. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లతో వివరాలు నమోదు చేశారు. ఇక్కడే అధికారులు ‘తప్పు’లో కాలేశారు. జేసీబీ, ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ నంబర్ల స్థానంలో తమ కంటికి కనిపించిన బైకులు, ఆటోలు నంబర్లు నమోదు చేశారు. 150 జేసీబీల స్థానంలో 10 బైక్ నంబర్లు నమోదు చేసి వాటితో మళ్లీమళ్లీ పనులు చేయించినట్లు రికార్డులు రూపొందించారు. అలాగే 200 బ్లేడ్, లోడింగ్ ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ నంబర్ల స్థానంలో సుమారు 25 ఆటోలు, బైక్ రిజిస్ట్రేషన్ నంబర్లు వేశారు. విధుల్లో లేని అధికారుల సంతకాలు.. ఖాళీ స్థలాలు శుభ్రం చేసే పనులు నిర్వహించే సమయంలో అసలు విధుల్లో లేని ఇద్దరు అధికారులు రూ.40 లక్షల బిల్లులకు సబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారు. పట్టణ ప్రగతి సమయంలో సంతకాలు చేసిన ఏఈలు ఇతర మున్సిపాలిటీల్లో ఇన్‌చార్జీలుగా విధులు నిర్వర్తించారు. అయినా బిల్లుల ఫైళ్లపై సదరు ఏఈలతో సంతకాలు చేయించారు. నగర పాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులు అంతా తామై నడిపించారని తెలిసింది. తర్వాత వివరాలు సరిచూసుకోకుండానే డీఈలు, ఈఈలు సంతకాలు చేసి ఫైళ్లను కమిషనర్‌కు పంపించారు. గుడ్డిగా సంతకం చేసిన కమిషనర్.. ‘పట్టణ ప్రగతి’లో భాగంగా చేపట్టిన పనులకు నిధుల కొరత ఉండొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం కరీంనగర్ కార్పొరేషన్‌కు నెలకు రూ.2.44 కోట్లు మంజూరు చేస్తోంది. ఇలా ఇప్పటి వరకు రూ.17.09 కోట్లు మంజూరు చేసింది. ఈక్రమంలో 5.96 ఏకరాల్లోని ఖాళీ స్థలాలను శుభ్రం చేసినందుకు ఈ నిధుల నుంచి రూ.40 లక్షల బిల్లులు మంజూరు చేయాలని వచ్చిన 8 ఫైళ్లను కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎన్ని వాహనాలు వాడారు. ఎన్ని గంటలు పనిచేశాయి. వాహనాలు ఎక్కడెక్కడి నుంచి తెప్పించారు. నమోదు చేసిన వివరాలన్నీ సరైనవా కావా అని క్రాస్ చెక్ చేయాలి. అనుమానం వస్తే క్షేత్రస్థాయిలో కూడా పరిశీ లించాలి. కానీ కరీంనగర్ కమిషనర్ ఇవేవీ పట్టించుకోలేదు. గుడ్డిగా బిల్లుల మంజూరుకు వచ్చిన ఫైళ్లపై వేగంగా సంతకం చేసి బిల్లుల మంజూరుకు అకౌంట్ అధికారులకు అటునుంచి ఆడిటింగ్ అధికారులకు పంపించారు. ఆడిటింగ్‌లో గుట్టు రట్టు.. ఆడిటింగ్ సమయంలో ఫైళ్లు తనిఖీ చేస్తున్న అధికారులకు వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లపై అనుమానం వచ్చింది. దీంతో విచారణ చేపట్టారు. రవాణా శాఖ పోర్టల్‌లో జేసీబీ, ట్రాక్టర్ల నంబర్లు సరిచూసుకుని కంగుతిన్నారు. జేసీబీ, బ్లేడ్, లోడింగ్ ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ల నంబర్ల స్థానంలో బైక్, ఆటోల నంబర్లు దర్శనం ఇచ్చాయి. బైకులు, ఆటోలతో పనిచేయించారా అని ఆడిటింగ్ అధికారులు అవాక్కయ్యారు. వెంటనే ఈ విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించి న కమిషనర్ ఫైళ్లను తిప్పి పంపమని సూచించడంతో ఆడిటింగ్ అధికారులు అకౌంట్ అధికారులకు అటు నుంచి ఇంజినీరింగ్ విభాగానికి ఫైళ్లు రిటర్న్ చేశారు. ఆ ఫైళ్లు.. ఆగమేఘాలపై.. కరీంనగర్ కార్పొరేషన్లో సుమారు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల బిల్లులకు సబంధించిన ఫైళ్లు నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. వీటిలో చాలా వరకూ చిన్నచిన్న కారణాలతో పెండింగ్‌లో పెట్టారని సమాచారం. పట్టణ ప్రగతిలో పనిచేసిన వాహనాల బిల్లుల ఫైళ్లు మాత్రం ఆగమేఘాలపై రూపొందించారు. అంతే వేగంగా ఏఈలు, డీఈలు, ఈఈలు ఫైళ్లపై సంతకాలు చేశారు. కమిషనర్ కూడా ఎలాంటి క్రాస్ చెక్ చేసుకోకుండా సంతకం చేసి అకౌంటింగ్, ఆడిటింగ్ అధికారులకు పంపించారు. చిన్నచిన్న కారణాలతో కోట్లలో బిల్లులు ఉన్న ఫైళ్లు పెండింగ్‌లో ఉండగా, రూ.40 లక్షల బిల్లుల ఫైల్ వేగంగా కదలడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే ఫైళ్లు వేగంగా అకౌంటింగ్ అధికారుల వరకు చేరినట్లు తెలుస్తోంది. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లే తప్పుగా నమోదు చేసి తప్పుడు ఫైలింగ్ చేసినా ఇప్పటి వరకు కనీసం విచారణ చేపట్టకపోవడం ఇందుకు బలం చేకూరుస్తోంది. కాగా సదరు ఫైళ్లలో తప్పులను సరిచేసి మళ్లీ బిల్లులు డ్రా చేసే ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం. -
కరీంనగర్లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, కరీంనగర్: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదాన్ని ఇంకా మరవక ముందే రాష్ట్రంలో మరో విద్యుత్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు.. కరీంనగర్‌లోని ఎన్పీడీసీఎల్ కార్యాలయం సమీపంలోని ఎలక్ట్రిసిటీ స్టోర్‌లో శనివారం భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. పదుల సంఖ్యలో ఉన్న కొత్త ట్రాన్స్ఫార్మర్లు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదానికి కల కారణాలు స్పష్టంగా తెలియకపోయినప్పటికీ కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకొని ఉవ్వెత్తున ఎగిసిపడిన మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. (ట్విస్ట్ : శ్రీశైలం అగ్ని ప్రమాదంలో కొత్త కోణం) ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ శశాంక, సిపి కమలాసన్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి ప్రమాదంపై ఆరా తీశారు. ఎలక్ట్రిసిటీ స్టోర్ రూమ్ ప్రక్కనే ఉన్న విద్యుత్ వైర్లు తగిలి షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించారు. -
పోలీసు శాఖపై కరోనా పంజా
సాక్షి, కరీంనగర్: ఫ్రంట్‌లైన్ వారియర్స్ అయిన పోలీస్‌లపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. మహమ్మారి విజృంభిస్తుండడంతో రోజురోజుకు కరోనా బారిన పడుతున్న పోలీసుల సంఖ్య పెరుగుతోంది. వైరస్ కట్టడికి ఆది నుంచి నిద్రాహారాలు మాని రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్న పోలీసులకే మహమ్మారి సోకడంతో వారిలో ఆందోళన మొదలైంది. కమిషనరేట్ వ్యాప్తంగా ఆదివారం వరకు 118 మంది పోలీసులు కరోనాబారిన పడ్డారు. వారితో కలిసి విధులు నిర్వహించిన వారు సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నారు. ఈ క్రమంలో శనివారం నుంచి గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయాలు, ప్రముఖ ప్రాంతాల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో భక్తుల నియంత్రణ, వైరస్ వ్యాప్తిని అరికట్టే విధులనూ పోలీసులే నిర్వహించాల్సి ఉంది. పెరుగుతున్న కేసులు పోలీస్‌శాఖలో కరోనా సోకుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కమిషనరేట్ వ్యాప్తంగా మొదట్లో కేవలం శిక్షణ కానిస్టేబుళ్లు 39 మందికి వైరస్ సోకగా, ఆదివారం వరకు కమిషనరేట్ పరిధిలో 118 మంది పోలీసులకు వైరస్ సోకింది. ఇందులో నగరానికి చెందిన ఒక సీఐ, ఎస్సై, కార్పొరేషన్ పరిధిలోని ఒక సీఐతో పాటు స్పెషల్ బ్రాంచిలో ఐదుగురు, బ్లూకోల్ట్స్ సిబ్బంది 30, హోంగార్డులు 25 మంది, డ్రైవర్లు 15 మందితోపాటు శిక్షణ కానిస్టేబుళ్లు, వివిధ స్థాయిలకు చెందిన పోలీసు అ«ధికారులు, సిబ్బంది వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారిని ఆసుపత్రిలో, ఇళ్లలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి ప్రత్యేకంగా ఒక ఏసీపీ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించి ఎప్పటికప్పుడు వైరస్ సోకిన పోలీసుల ఆరోగ్య పరిస్థితిపై సమీక్షిస్తున్నారు. ఉత్సవాల్లో జాగ్రత్త .. కరోనా కమ్యూనిటీ వ్యాప్తి నేపథ్యంలో పండుగలు, ఉత్సవాలు, పూజలు, ప్రార్థన వేళల్లో భౌతికదూరం పాటిస్తే అందరికీ క్షేమమని సీపీ కమలాసన్‌రెడ్డి సూచించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 641 వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారని తెలిపా రు. ఆలయాలు, వివిధ ప్రార్థన మందిరాల్లో 561 విగ్రహాలు, మిగతావి వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అందరూ నిబంధనల ప్రకారం మూడు నుంచి ఐదు రోజుల్లోనే నిమజ్జనం చేయడానికి సన్నాహా లు చేస్తున్నారని, వేడుకలు నిర్వహించే రోజుల్లో భక్తులు కూడా సామూహిక పూజలకు దూరంగా ఉండాలని పేర్కొంటున్నారు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ, మున్సిపాలిటీ ఉద్యోగులు, అధికారులు విధుల్లో బిజీగా ఉంటున్నారని, పోలీసులు కూడా మహమ్మారి బారిన పడి ఐసోలేషన్, క్వారంటైన్లో ఉన్నారని వివరించారు. -
మానేరు నదికి పర్యాటక శోభ : మంత్రి గంగుల
సాక్షి, కరీంనగర్ : చెక్ డ్యామ్ ల నిర్మాణంతో మానేరు నదికి పర్యాటక శోభ లభిస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. రాబోయే రోజుల్లో మానేర్ నది 365 రోజులు జలకళతో పర్యాటకులను ఆకర్షించనున్నదని చెప్పారు. కరీంనగర్ సమీపంలోని ఎల్ఎండీ దిగువన మానేరు నది పై 87.90 లక్షలతో నిర్మిస్తున్న 5 చెక్ డ్యామ్ ల నిర్మాణానికి తీగలవంతెన వద్ద మంత్రి గంగుల కమలాకర్ శంఖుస్థాపన చేశారు. చెక్ డ్యామ్ ల నిర్మాణంతో రాబోయే రోజుల్లో కరీంనగర్ ప్రజలకు తాగు.. సాగు నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని అన్నారు. చెక్ డ్యాంల నిర్మాణం వల్ల వృధాగా గోదావరిలో కలిసే నీటిని అరికట్ట వచ్చని తెలిపారు. అలాగే ఏడాది పొడవున మానేరు నదిలో 10 కిలో మీటర్ల వరకు నీరు నిల్వ ఉంటుందని.. తద్వారా భూగర్భ జలాలు పెరిగి తాగు, సాగు నీటి సమస్య తీరుతుందని తెలిపారు. ఈ ఐదు చెక్ డ్యాంలతో పాటు ఇరుకుల్ల వాగు పై మరో మూడు చెక్ డ్యాంలు కరీంనగర్ నియోజకవర్గంలో నిర్మిస్తున్నామని చెప్పారు. వాగులో నీళ్లు నిలపడం వల్ల కేబుల్ బ్రిడ్జి చుట్టూ పర్యాటక ప్రాంతంగా మారడంతో పాటు శివారు కాలనీల్లో, చుట్టూ పక్కల గ్రామాలకు భూగర్బ జలాలు పుష్కలంగా పెరుగుతాయని తెలిపారు. సాగు ,తాగు నీటి కోసం ఇబ్బందులు పడ్డ గ్రామాల ప్రజల్లో ఆనందం వ్యక్తం అవుతుందన్నారు. చెక్ డ్యామ్ ల నిర్మాణం పూర్తిఅయితే రేటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రోపోజల్ పంపిస్తామని తెలిపారు. చెక్ డ్యాం ల నిర్మాణం తో మానెరు రివర్ ఫ్రంట్ కు తొలి అడుగు పడిందని రానున్న రోజుల్లో మానేరు నది పర్యాటక రంగంగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. -
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి: పొన్నం ప్రభాకర్
సాక్షి, కరీంనగర్: జీవో నంబర్ 64ను తక్షణమే రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఇలాంటి జీవో తెచ్చి ప్రతిపక్షాలను అడ్డుకోవాలని ప్రభుత్వం ఆలోచించడం దుర్మార్గం అని ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ప్రభుత్వం గగ్గోలు పెడుతోందని విమర్శించారు. రైతు కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతులను పరామర్శిస్తే కేసులు నమోదు చేస్తామని జీవో 64 తీసుకొచ్చారని మండిపడ్డారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల కుల, చేతి వృత్తులకు ఆర్థిక సాయం అందించిందని, తెలంగాణలో ఎంతమందికి కుల వృత్తుల వారికి సాయం చేశారో పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాలను చూసైనా సీఎం కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని ఆయన హితవు పలికారు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల కుల ,చేతి వృత్తులకు ఆర్థిక సహాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశాల్లో సీఎం కేసీఆర్ గొప్పలు చెప్పడం తప్ప..చేసేదేమీ కనిపించడం లేదని విమర్శలు గుప్పించారు. జిల్లాలో నలుగురు మంత్రులు ఉన్నా ధాన్యం కొనుగోళ్లు ఎందుకు వేగవంతం కావడం లేదని ప్రశ్నించారు. రైస్ మిల్లర్లకు సమస్యలు ఉంటే ప్రభుత్వ పెద్దలతో చర్చించుకోవాలి కానీ, రైతులను ఇబ్బందులు పెట్టడం సబబు కాదన్నారు. నల్గొండ జిల్లాలో 100 శాతం కొనుగోళ్లు జరిగితే ఎందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరగడం లేదని ప్రశ్నించారు. తాను చెప్పిన పంట వేస్తేనే రైతుబంధు ఇస్తామని సీఎం కేసీఆర్ అనడం సిగ్గుచేటన్నారు. సీఎం కేసీఆర్‌ను మాట మీద నిలబడని ఏకైక రాజకీయ వేత్తగా పొన్నం ప్రభాకర్ అభివర్ణించారు. ఫ్యూడల్ మనస్తత్వంతో తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. -
కరీంనగర్ జిల్లాలో మాస్కుల కొరత
-
దారుణం: నిండు గర్భిణిపై అత్యాచారం
సాక్షి, కమాన్‌చౌరస్తా: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి నిండు గర్భిణిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రూరల్ సీఐ శ్రీనివాసరావు కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా రామడుగు మండలానికి చెందిన మహిళ కుటుంబం కొన్నేళ్లుగా కరీంనగర్ మండలం బొమ్మకల్ గ్రామంలో నివాసం ఉంటోంది. ఆమె భర్త సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 9వ మధ్యాహ్నం డిష్ రిపేర్ పేరిట ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి వచ్చిన కనపర్తి రామకృష్ణ తొమ్మిది నెలల గర్భిణిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఆమె మెడలోని పుస్తెల తాడు తెగిపోయింది. కొద్దిసేపటి తర్వాత సదరు మహిళ భర్త ఇంటికి రాగానే పుస్తెలు మళ్లీ కట్టుకుంటూ, బట్టలు చిందరవందరగా పడి ఉండటంతో అనుమానం వచ్చి అడుగగా జరిగిన అఘాయిత్యం గురించి వివరించింది. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని ఆలోచించారు. చివరకు సోమవారం కరీంనగర్ రూరల్ పోలీసులకు మహిళ భర్త ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితుడు కనపర్తి రామకృష్ణపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అత్యాచారం చేసిన సమయంలో నిందితుడు తన సెల్‌ఫోన్ ద్వారా వీడియో చిత్రీకరించాడని మహిళ కుటుంబ సభ్యులు ఆరోపించారు. -
మెట్పల్లిలో జోరుగా అక్రమ నిర్మాణాలు
‘పట్టణ శివారులో జాతీయ రహదారి పక్కన నిర్మిస్తున్న ఈ భవనాలకు మున్సిపల్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్లతో పాటు రెండు అంతస్తులకు మాత్రమే అనుమతులు తీసుకున్నారు. కానీ అదనంగా మరో అంతస్తును నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారు.’ మెట్పల్లి (కరీంనగర్) : మెట్పల్లి మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మా ణాలు జోరుగా సాగుతున్నా యి. టౌన్‌ప్లానింగ్ వి భాగం అధికారుల అం డతో నిబంధనలకు విరుద్ధంగా సా గుతున్న నిర్మాణాలతో మున్సిపల్ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. మున్సిపల్ నుంచి అనుమతులు పొందకపోయిన అనుమతి తీసుకొని అంతకుమించి అంతస్తులు నిర్మిస్తున్నారు. అయినా అధికారులు వాటి వైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. పట్టణంలోని వెల్లుల్లరోడ్లో ఓ వ్యక్తికి మొదట జీ+1 భవనానికి అనుమతి ఇచ్చిన అధికారులు.. తర్వాత భవనం నిర్మాణంలో ఉండగా పాత అనుమతిని పరిగణనలోకి తీసుకోకుండా కొత్తగా జీ+2 నిర్మాణానికి అనుమతులు జారీ చేశారు. పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన ఈ అనుమతి వ్యవహారా>న్ని ‘సాక్షి’ ఇటీవల బయటపెట్టింది. ఆ తర్వాత పలు కాలనీల్లో ఇలాంటి అక్రమాలను స్థానికులు ‘సాక్షి’ దృష్టికి తీసుకొస్తున్నారు. వీటిపై పరిశీలన జరుపగా, అధికారులు మున్సిపల్ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారనే విషయం తేటతెల్లమైంది. కాసులిస్తేనే అనుమతులు ! టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు ముడుపులిస్తేనే అనుమతులు జారీ చేస్తారనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. నిర్మాణాలకు సంబంధించిన అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ లంచం ఇస్తేనే అనుమతులు జారీ చేస్తున్నారని.. లేనిపక్షంలో దానిని షార్ట్‌ఫాల్ కింద పెండింగ్‌లో పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో తప్పనిసరిగా అనుమతులు జారీచేయాలనే నిబంధనను ప్రభుత్వం విధించింది. లేనిపక్షంలో అధికారులే జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని అధికారులు నిర్ధేశిత సమయంలోపు తమ చేతికి ముడుపులు అందింతే అనుమతులు జారీ చేస్తున్నారు. లేకుంటే ఏదో ఒకటి కారణాన్ని సాకుగా చూపుతూ సంబంధిత ఫైళ్లను పెండింగ్‌లో పెడుతూ వస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు కొన్ని దరఖాస్తుల విషయంలో మున్సిపల్‌కు ఫీజు రాకుండా అడ్డుపడుతున్నారనే ప్రచారం ఉంది. రూ.లక్షల్లో ఫీజు అవుతుందని దరఖాస్తుదారులకు చెబుతూ అనుమతులకు బదులు తమ జేబులు నింపుకుంటూ అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే... టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు భారీగా అక్రమాలకు పాల్పడుతున్న విషయం ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే బయటపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థానికంగా కొత్తగా నిర్మిస్తున్న భవనాల్లో 90 శాతం మేర నిబంధనలకు విరుద్ధంగానే సాగుతున్నాయి. ఇందులో కొన్ని భవనాల్లో తీసుకున్న అనుమతుల కంటే అదనంగా అంతస్తులు నిర్మించడం, మరికొన్ని అనుమతులు తీసుకోకుండానే నిర్మిస్తున్నవి ఉండడం గమనార్హం. ఇష్టారాజ్యానికి నిదర్శనమిదిగో.. పట్టణంలోని వెల్లుల్ల రోడ్లో జీ+1 అనుమతి తీసుకొని అదనంగా మరో రెండు అంతస్తులు నిర్మించిన ఇంటికి అధికారులు కొత్తగా జీ+2 అనుమతులిచ్చారు. పాత అనుమతిని పక్కనపెట్టి కొత్తగా అనుమతులివ్వడం నిబంధనలకు పూర్తి విరుద్ధం. ఇదిలా ఉంటే.. శివాజీనగర్‌లో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయంలో అధికారులు జాప్యం చేయడంతో అతడు పనులు మొదలుపెట్టాడు. అనంతరం అనుమతిపత్రాల కోసం వెళితే పనులు మొదలుపెట్టిన ఇంటికివ్వడం కుదరదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో నిబంధనల ప్రకారం నడుచుకున్నారు. కానీ వెల్లుల్ల రోడ్లో భవనానికి పాత అనుమతిని పక్కన బెట్టి కొత్తగా అనుమతులివ్వరాదు. అధికారులు అనుమతుల జారీ విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారడానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. టీపీబీఓ తిరుపతమ్మకు మెమో పట్టణంలోని వెల్లుల్లరోడ్లో నిబంధనలకు విరుద్ధంగా ఓ భవనానికి అనుమతులు ఇచ్చిన వ్యవహారంపై ‘సాక్షి’లో ఈ నెల 18న ‘సక్రమం పేరుతో అక్రమం’ శీర్షికన వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. దీంతోపాటు స్థానికంగా జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై టీపీబీవో తిరుపతమ్మను సంజాయిషీ అడుగుతూ మెమో ఇవ్వాలని నిర్ణయించినట్లు కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్ తెలిపారు. ప్రస్తుతం ఆమె సెలవులో ఉన్నారని, వచ్చిన వెంటనే మెమో జారీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. అక్రమమైతే కూల్చివేస్తాం నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మిస్తే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. త్వరలోనే నూతన మున్సిపల్ చట్టం అమలులోకి రాబోతుంది. దీని ప్రకారం అక్రమంగా నిర్మాణాలు చేపడితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తాం. దరఖాస్తుదారులు మున్సిపల్ నుంచి అనుమతులు తీసుకొని దాని ప్రకారమే భవనాలు నిర్మించుకోవాలి. అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించాం. ఎక్కడైన అలాంటివి ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – జగదీశ్వర్‌గౌడ్, కమిషనర్ -
12వ రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె
సాక్షి హైదరాబాద్ : తమ డిమాండ్లను నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె 12వ రోజు నిరవరధికంగా కొనసాగుతోంది. ఈ సమ్మెకు మద్దతుగా రాష్ట్రంలోని పలు చోట్లలో ప్రతిపక్షాలు, వివిధ సంఘాల నాయకులు ర్యాలీలు, వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓయూలో తెలంగాణ విద్యార్థి ఫెడరేషన్(టీఎస్ఎఫ్) భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆర్.కృష్ణయ్య, ప్రజా సంఘాల నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా : ఆర్టీసీ సమ్మెలో భాగంగా కరీంనగర్ బస్‌స్టాండ్ చౌరస్తాలో కార్మికుల రాస్తారోకో. నిర్వహించారు. ఈ క్రమంలో ఇద్దరు కార్మికులు బిక్షాటన చేపట్టారు. కార్మికుల నిరసన ఆందోళనలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. వేములవాడ బస్టాండ్ ముందు కార్మికులు మానవహారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఓ ఆర్టీసీ ఉద్యోగి శిరోమండనం చేసుకొని మూల వాగులో కేసీఆర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి పిండ ప్రదానం చేశారు. సమ్మెకు మద్దతుగా అడ్వకేట్లు జేఏసీ ఉపాద్యాయులు, జేఏసీ నాయకుల సంఘీభావం తెలిపారు. మరోవైపు సిరిసిల్ల డిపో నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు విద్యార్థి సంఘాల నాయకులు, ఆర్టీసి కార్మికులు ర్యాలీ నిర్వహించారు. గోదావరిఖని డిపో ముందు కార్మికుల నిరసన వ్యక్తం చేశరు. దీనికి సీపీఐ, సీపీఎం, అఖిలపక్ష నాయకులు మద్దతు తెలిపారు. వేములవాడ పరిధిలోని నాంపల్లి వద్ద ప్రమాదం తప్పింది. అదే విధంగా కరీంనగర్ నుంచి వేములవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్ స్టీరింగ్ రాడ్ ఊడిపోయింది దీంతో డ్రైవర్ అప్రమవ్వడంతో 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఖమ్మం జిల్లా : ఆర్టీసీ కార్మికులు సమ్మెలో భాగంగా 12వ రోజు వినూత్నంగా ఖమ్మం నగరంలోని అన్ని షాపుల ముందు కార్మికులు అర్ధనగ్నంగా భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు. ఖమ్మం డిపో ముందు ధర్నాలో మాజీ పార్లమెంటు సభ్యురాలు రేణుకా చౌదరి పాల్గొని ఆర్టీసీ కార్మికులకు తమ మద్దతు తెలిపారు. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను తయారుచేసి శవయాత్ర నిర్వహించారు. పాఠశాల తెరిపించి సమ్మెను విరమింప చేయాలని డిమాండ్ చేశారు. .కేసీఆర్ దిష్టిబొమ్మను కాల్చే కార్యక్రమంలో పోలీసులకు విద్యార్థి సంఘాల మరియు కార్మికుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అదే విధంగా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముదిగొండ లో రాస్తారోకో చేపట్టారు. దీంతోపాటు కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ప్రధాన సెంటర్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెకు బూర్గంపాడు మండలం అఖిలపక్ష నాయకులు తమ మద్దతు తెలిపారు. మహబూబ్ నగర్ : జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల భారీ ర్యాలీ చేప్టారు ఈ ర్యాలీకి ఉపాద్యాయులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు పలికారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు రోడ్డుపై క్షవరం చేసుకుంటూ నిరసన వ్యక్తం చేశారు. మెదక్ : బస్టాండ్ నుంచి వెల్కమ్ బోర్డ్ వరకు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బీజేపీ, ఉపాధ్యాయ సంఘలు బైక్ ర్యాలీ నిర్వహించారు. దుబ్బాక బస్సు డిపో వద్ద ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ తరపున టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, ఉపాధ్యాయ సంఘం టిపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపతి రెడ్డి మద్దతు ప్రకటించారు. పెద్ద శంకరంపేట్ అక్కోలా రహదారిపై ఆర్టీసీ కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. -
చెప్పిన రూట్లలో కాకుండా నచ్చిన రూట్లలోనే బస్సులు..!
సాక్షి, కరీంనగర్/ మెదక్: దసరా పండుగ ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకుంటున్న ప్రయాణికుల జేబుకు బస్ చార్జీల రూపంలో చిల్లులు పడుతున్నాయి. ఒక వైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సుల్లేక ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు ప్రైవేటు బస్సులు, ఆర్టీసీ బస్సులను తిప్పే ప్రైవేట్ సిబ్బంది ఇష్టారీతిన దోచుకుంటున్నారు. రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. అధిక చార్జీలు వసూలు చేయొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ ప్రయోజనం ఉంటడం లేదు. చార్జీల దోపిడీ ఎప్పుడు ఆగుతుందోనని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక ఛార్జీలు వసూళ్లు చేస్తే కేసులు.. ఆర్టీసీ బస్సుల్లో తనిఖీలు నిర్వహిస్తామని..గతంలో ఉన్న బస్సు ఛార్జీ కంటే ఎక్కువ వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అన్ని రూట్లలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ బృందాలను ఏర్పాటు చేశామని కరీంనగర్ డిటీసీ శ్రీనివాస్ తెలిపారు. ఆర్టీసీ అద్దె బస్సులకు కండక్టర్లను, డిపో మేనేజర్ కేటాయిస్తామని వెల్లడించారు. కండక్టర్లకు టిమ్ మిషన్లు అందజేస్తామన్నారు. అన్ని బస్సుల్లో రాయితీ బస్‌పాస్‌లకు అనుమతి ఇచ్చామన్నారు. ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే 100కు లేదా..ఆర్టీవో హెల్ఫ్ లైన్ 9391578144 నెంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చన్నారు. ప్రైవేట్ బస్సుల నిర్వాహకుల చేతివాటం.. మెదక్‌లో ప్రైవేట్ బస్సుల నిర్వాహకులు చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. అధికారులు చెప్పిన రూట్లలో కాకుండా..వారికి నచ్చిన మార్గాల్లో నడిపిస్తూ ప్రయాణికుల వద్ద అధిక డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డికి ఫిర్యాదు చేశారు. బస్సుల యాజమానులను కలెక్టర్ పిలిచి మందలించారు. ఆర్టీసీ అధికారులు చూపిన రూట్లలో మాత్రమే నడపాలని ఆదేశించారు. -
ఆఫీసర్.. నేను ఎమ్మెల్యేనయ్యా
సాక్షి, కరీంనగర్ : ‘ఆఫీసర్ నేను ఎమ్మెల్యేను.. కార్యక్రమ ఆహ్వానితుడను..’ అంటూ తన ను అడ్డుకున్న పోలీస్ అధికారికి చొప్పదండి ఎమ్మెల్యే చెప్పుకోవాల్సి వచ్చింది. స్వాత్రంత్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వేడుకలకు పోలీసులు భారీ బందోబస్తు కల్పించారు. జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులుకు ఆహ్వాన లేఖలు పంపిం చారు. గురువారం వేడుకలకు హాజరయ్యేం దుకు వచ్చిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను వారికి కేటాయించిన ప్రాంతంలోకి రాగా ఓ సీఐ అనుమతించలేదు. దీం తో ఆఫీసర్ నేను చొప్పదండి ఎమ్మెల్యేనంటూ తనను తాను చెప్పుకోవాల్సి వచ్చింది. తర్వాత సదరు అధికారి లోనికి అనుమతించారు. ప్రధాన గేట్ వద్ద ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ గార్డ్ కార్యక్రమానికి వస్తున్న పలువురిపై దురుసుగా మాట్లాడుతూ నెట్టివేయడం కనిపించింది. ఈవిషయం అధికారుల దృష్టికి తీసుకపోయినా స్పందన కరువైంది. -
అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు
సాక్షి, కరీంనగర్: ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీపై కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. కోర్టు ఆదేశాలతో ఆయనపై సీఆర్పీసీ 153ఏ, 153బీ, 506, 156(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ సీఐ విజయ్ కుమార్ తెలిపారు. కాగా జూలై 24న కరీంనగర్లో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఒవైసీ మాట్లాడుతూ.. వివాదాస్పద రీతిలో వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనపై కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు పలువురు పెద్ద ఎత్తున ఆందోళనలు, డిమాండ్ చేశారు. అయితే అక్బరుద్దీన్ ప్రసంగం రెచ్చగొట్టేలా లేదని వారం రోజుల క్రితం నగర సీపీ కమలాసన్ రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చారు. సీపీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. బీజేపీ నగర అధ్యక్షుడు, న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఒవైసీ వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని ఆయన కోర్టును కోరారు. దీంతో ఆయన పిటిషన్‌ను పరిశీలించిన కరీంనగర్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సాయిసుధ ఘటనపై విచారణ జరపాలని పోలీసులను ఆదేశించారు. కోర్టు ఆదేశంతో క్రైమ్ నంబర్ 182/2019 ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టినట్టు త్రీటౌన్ పోలీసులు తెలిపారు. కాగా ఒవైసీ వ్యవహారం గతకొంత కాలంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. బీజేపీని కించపరిచే విధంగా, ముస్లింలను రెచ్చగొట్టేలా ఆయన మాట్లాడారని కమళం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనపై కేసు నమోదు కావడం ఆసక్తికరంగా మారింది. -
కరీంనగర్ కింగ్ ఎవరు..?
సాక్షి, కరీంనగర్ : ఉత్తర తెలంగాణలో కీలక నియోజకవర్గంగా కరీంనగర్ లోక్‌సభ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. డిసెంబర్ 7న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తికాగా సరిగ్గా 125 రోజులకు అంటే ఏప్రిల్ 11న లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయదుందుభి మోగించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీతో పోలిస్తే లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ సరళిలో లేదా ఓటర్ల తీర్పులో మార్పు ఉంటుందా? రాష్ట్ర, జాతీయ రాజకీయాలకు, సీఎంను ఎన్నుకునే విషయంలో ఒక విధంగా, ప్రధానిని ఎన్నుకునే విషయంలో మరోలా ప్రజలు స్పందిస్తారా అనేది ఇప్పుడు కరీంనగర్ విషయంలో ఆసక్తికరంగా మారింది. అదీగాకుండా ఇటీవల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు రావడంతో, మొత్తం మూడు ఎమ్మెల్సీ సీట్లలో రెండు కరీంనగర్ పరిధిలో ఉండడంతో లోక్‌సభ ఎన్నికలపై ఈ ఫలితాల ప్రభావం ఏ మేరకు ఉంటుందన్నది చర్చనీయాంశమైంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ముఖ్యంగా కరీంనగర్ లోక్‌సభ స్థానంలో భారీ మెజారిటీ సాధించాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ ప్రచార పర్వాన్ని కొనసాగిస్తోంది. టీఆర్ఎస్ పక్షాన ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్‌కుమార్ బరిలో నిలిచారు. ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికల్లో వీరి మధ్య త్రిముఖపోరు నెలకొంటుందా లేక టీఆర్ఎస్–కాంగ్రెస్ లేదా టీఆర్ఎస్–బీజేపీ మధ్య ద్విముఖ పోటీగా మారుతుందా అనేది వేచిచూడాలి. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో గతంతో పోలిస్తే తమ జీవితాలు మెరుగ్గానే ఉన్నాయని, ఉద్యోగ, ఉపాధి కల్పనతో పాటు, రైతులను ఆదుకునేందుకు మరిన్ని చర్యలు కావాలని ప్రజలు కోరుతున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఇదీ పరిస్థితి సిరిసిల్ల: ఇది టీఆర్ఎస్కు పెట్టని కోట. సంస్థాగతం గా బలంగా ఉంది. గతంలో సిరిసిల్ల నుంచి గెలిచిన వారెవరూ మంత్రిగా బాధ్యతలు నిర్వహించలేదు. 2014లో గెలిచి కేటీఆర్ మంత్రి అయ్యాక విస్తృతం గా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. రోడ్లు, వంతెనలు, ఇతర పనుల రూపంలో గత ఐదేళ్లలో రూ. వేలాది కోట్ల మేర నిధులు ఖర్చుచేశారు. చేనేత కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకున్నారు. ఇక్క డ కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకులు కరువయ్యా రు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడు కేకే మహేందర్‌రెడ్డి నిరుత్సాహంతో ఉన్నారు. బీజేపీ పరిస్థితీ ఏమంత మెరుగ్గా లేదు. వేములవాడ: ఇది టీఆర్ఎస్కు బలమైన సెగ్మెంట్. గతంతో పోలిస్తే ఇక్కడ మంచినీటి సరఫరా మెరుగుపడింది. వేసవిలో తరచుగా ఎదురయ్యే సమస్యలు అంతగా లేవని స్థానికులు చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సిరిసిల్ల, వేములవాడ ఇతర నియోజకవర్గాలు ప్రయోజనం పొందనున్నాయి. మిషన్ భగీరథ ద్వారా ఇప్పటికే 60 నుంచి 70 శాతం దాకా తాగునీరు సరఫరా అవుతోంది. ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ఇప్పుడు అందుబాటులో ఉంటున్నారని ప్రజలు అంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభావం కొంత ఉంటుంది. లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌కు ఇక్కడి వారితో అనుబంధం ఉంది. బీజేపీ ప్రభావం అంతంత మాత్రమే. హుజూరాబాద్: రాజకీయంగా టీఆర్ఎస్ బలంగానే ఉంది. మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సెగ్మెంట్లో అభివృద్ధి పనులు బాగానే చేపట్టారు. 2014తో పోలిస్తే గత ఎన్నికల్లో తన మెజారి టీ కొంత మేర తగ్గడంపై ఇటీవల కార్యకర్తల సమావేశంలో ఈటల అసంతృప్తి వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ నుంచి లక్ష మెజా రిటీని సాధించడం ద్వారా దానిని భర్తీచేయాలని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలున్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీకి కొంత మేర మద్దతు దొరికే అవకాశాలున్నాయి. ఆ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ సామాజిక వర్గం వారు ఇక్కడ ఎక్కువమంది ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశం. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ నుంచి జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీచైర్మన్ తుమ్మిడి సమ్మిరెడ్డి, వి.రవీందర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. ఇక్కడి యువకులు కొందరిపై వీహెచ్‌పీ, బజ్రంగ్దళ్ ప్రభావం ఉండటంతో సామాజిక మాధ్యమాల్లో లోక్‌సభ అభ్యర్థి సంజయ్ కుమార్‌కు అనుకూల ప్రచారం సాగుతోంది. చొప్పదండి: అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ ఇక్కడ పటిష్టంగానే ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో భారీ గా చేరికలు సాగాయి. కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయి లో పుంజుకోవాల్సి ఉంది. ప్రధాని మోదీ ప్రభావం యువతపై కొంత మేర ఉండే అవకాశాలున్నాయి. హిందుత్వ భావజాలం కారణంగా బీజేపీ అభ్యర్థిపై ఇక్కడి యువకులు ఆకర్షితులవుతున్నట్టు చెబుతున్నారు. కరీంనగర్: ఇక్కడ టీఆర్ఎస్కు సానుకూలత ఉంది. కాంగ్రెస్, బీజేపీ కంటే టీఆర్ఎస్ ఆశీర్వాద సభలు, రోడ్‌షోలు, కుల సంఘాల సమావేశాలతో ప్రచారం లో ముందుంది. వరస విజయాలతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు స్థానికంగా సంబంధాలు మరింత మెరుగయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేసిన బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ రెండు, మూడు స్థానాలకు పరిమితమయ్యారు. వీరిద్దరూ కూడా కరీంనగర్ పట్టణవాసు లు కావడంతో వారి మద్దతుదారులు పెద్దసంఖ్య లోనే ఉన్నారు. వీరికి బీసీ సామాజికవర్గాల ఓట్లు పడే అవకాశాలున్నాయి. సంస్థాగతంగా కాంగ్రెస్ ఇక్కడ బలంగానే ఉంది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలొచ్చాక కాంగ్రెస్ నుంచి ఐదుగురు కార్పొరేటర్లు టీఆర్ఎస్లో చేరారు. ఇది కాంగ్రెస్‌కు ప్రతికూలం కావచ్చు. హిందూ అనుకూల ఓటుబ్యాంక్‌తో అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన సంజయ్ లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగిస్తారా అనేది చర్చనీయాంశమైంది. మానకొండూరు: ఇక్కడి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు ప్రజలతో సంబంధాలు బాగానే ఉన్నాయి. టీఆర్ఎస్ కేడర్ బలంగానే ఉంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిన సీనియర్ నేత ఆరేపల్లి మోహన్ తాజాగా టీఆర్ఎస్ లో చేరడం కాంగ్రెస్ పార్టీపై కొంత మేర ప్రభావం చూపొచ్చునని చెబుతున్నారు. సీనియర్‌నేత కవ్వం పల్లి సత్యనారాయణకు సముచిత స్థానం కల్పించడం ద్వారా ఆ నష్టం భర్తీకి పొన్నం చర్యలు తీసుకుంటున్నారు. హిందువుల కోసం పోరాడే వ్యక్తిగా సంజయ్‌కు ఇక్కడి యువతలో గుర్తింపు ఉంది. ఇక్కడ టీఆర్ఎస్–కాంగ్రెస్–బీజేపీల మధ్య పోటా పోటీగా ఉండొచ్చునని అంచనావేస్తున్నారు. హుస్నాబాద్: ఈ నియోజకవర్గాన్ని అన్నీ తానై మా జీ మంత్రి టి.హరీశ్‌రావు నడిపించారు. ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌తో పాటు తాను జవాబుదారీగా ఉం టూ ఇక్కడి ప్రజల్లో నమ్మకం కలిగించారు. ప్రస్తుతం ఈ సెగ్మెంట్లోని కొంత భాగం కొత్తగా ఏర్పడిన సిద్దిపేట జిల్లాలో ఉంది. టీఆర్ఎస్కు స్థానిక నాయకులు, కార్యకర్తల మద్దతుంది. కాంగ్రెస్‌కు ఇక్కడ మద్దతుదారులున్నా పార్టీని చురుకుగా నడిపించే నాయకులు లేరు. ఇక్కడ కొంతమేర సీపీఐ ప్రభావం ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ పెద్దగా కేడర్ లేదు. అభివృద్ధే ఎజెండా రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో అభివృద్ధి ప్రధాన ఎజెండాగా ముందు కెళుతున్నాం. ప్రచారానికి వెళ్లినపుడు ప్రజల్లో స్పందన బాగుంటోంది. ఓటర్లు స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో జాతీయస్థాయిలో తమ ఎంపీ ఉండాలని కరీంనగర్ ప్రజలు కోరుకుంటున్నారు. ఐదేళ్లలో రాష్ట్ర ఎంపీలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలిగాం. నీటిపారుదల ప్రాజెక్టులు, ఇతర కార్యక్రమాలకు అనుమతులు, మంజూర్లు పొందగలిగాం. కేంద్ర ప్రభుత్వంలో కూడా టీఆర్ఎస్కు పాత్ర ఉంటే ఇంకా సాధిస్తాం. విభజన చట్టంలో పేర్కొన్న తెలంగాణలోని ఒక ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడంలో కాంగ్రెస్, బీజేపీ విఫలమయ్యాయి. ఈసారి దానిని సాధించేందుకు కృషి చేస్తాం. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ప్రసక్తే లేదు. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి 4,5 వార్డుల్లో ప్రభావం చూపగలుగుతారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కూడా ఆ పార్టీకి రావు. అందువల్ల కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులెవరూ నాకు పోటీ కాదు. – బోయినపల్లి వినోద్‌కుమార్, టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ ఆయన ఓడినా నష్టమేం లేదు.. స్థానికుడిని. ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటాను. 2009–14 మధ్యకాలంలో ఎంపీగా సాధించిన అభివృద్ధి, తెలంగాణ రాష్ట్ర సాధనకు ఢిల్లీలో పోషించిన కీలకపాత్ర నన్ను గెలిపిస్తాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఓడినా ప్రజలకొచ్చే పెన్షన్లు, రైతుబంధు ఇతర సంక్షేమ పథకాలు ఆగిపోవు. రాష్ట్ర ప్రభుత్వంపై ఏ ప్రభావం పడదు. హిందూ–ముస్లింల మధ్య వైషమ్యాలు పెంచడం ద్వారా ఇక్కడ రాజకీయంగా లాభపడాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలు ఫలించవు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నేను పోటీ చేయడం పొరబాటు. కరీంనగర్ లోక్‌సభ పరిధిలోని మిగతా 6 నియోజకవర్గాలను కవర్ చేశాక, చివరకు కరీంనగర్ అసెంబ్లీపై దృష్టి పెడదామనుకున్నా. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు రావడంతో అధిష్టానం ఆదేశాలతో పోటీ చేయాల్సి వచ్చింది. పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకగా, కరీంనగర్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేసే వ్యక్తిగా ప్రజలు ఈసారి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్, ఇతర జిల్లాల బుద్ధిజీవులు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పే ఎంపీ ఎన్నికలపుడు కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఇస్తారని ఆశిస్తున్నాను. – పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ అభ్యర్థి నన్ను గెలిపించే ఆలోచనలో ఉన్నారు.. మరోసారి నరేంద్రమోదీని ప్రధానిని చేసేందుకు ఇక్కడి నుంచి బీజేపీ ఎంపీగా నన్ను పంపించాలనే అభిప్రాయంతో ఇక్కడి ప్రజలున్నారు. నేను గెలిస్తే స్వయంగా ప్రధానిని, కేంద్రమంత్రులను కలిసి, నియోజకవర్గ అభివృద్ధికి నేరుగా నిధులు తెచ్చే అవకాశం ఉంది. అదే టీఆర్ఎస్ నాయకుల విషయానికొస్తే వారు సీఎం కేసీఆర్‌నే కలిసే పరిస్థితే ఉండదు. లోక్‌సభ ఎన్నికలు జాతీయ రాజకీయాలకు సంబంధించినవి కాబట్టి ప్రజలు భిన్నమైన తీర్పునిస్తారనే నమ్మకముంది. ఇక్కడ టీఆర్ఎస్కు ఓటేసినా ఎంఐఎంకు వేసినట్టే. కాంగ్రెస్‌కు వేస్తే టీఆర్ఎస్కు వేసినట్లే. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత బయటపడింది. బీజేపీకి గెలుపు అవకాశాలు మెరుగయ్యాయని భావిస్తున్నాను. రెండు సార్లు అసెంబ్లీకి పోటీచేసి ఓటమి చెందాననే సానుభూతి ప్రజల్లో ఉంది. ఏడు సెగ్మెంట్లలో బీజేపీకి ఆదరణ పెరుగుతోంది. గతంలో కాంగ్రెస్, టీఆర్ఎస్కు అవకాశమిచ్చినందున ఈసారి నన్ను గెలిపిద్దామనే ఆలోచనతో ప్రజలున్నారు. మాకు సైలెంట్ ఓటింగ్ పడుతుంది. – బండి సంజయ్‌కుమార్, బీజేపీ అభ్యర్థి లోక్‌సభ ఓటర్లు పురుషులు :8,07,233 మహిళలు : 8,25,565 ఇతరులు : 26 మొత్తం ఓటర్లు : 16,32,824 2018 అసెంబ్లీ ఎన్నికలు లోక్‌సభ పరిధిలో పార్టీలకు పోలైన ఓట్లు టీఆర్ఎస్ 6,91,885 కాంగ్రెస్ 3,45,149 బీజేపీ 1,02,014 మొత్తం పోలైన ఓట్లు 15,42,685 -
కారెక్కనున్న ఆరెపల్లి?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పార్లమెంట్ అభ్యర్థుల తొలిజాబితా విడుదల చేసిన కొన్ని గంటల్లోనే కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పెద్దపల్లి టికెట్ ఆశించిన మానకొండూరు మాజీ ఎమ్మెల్యే, కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్మన్ ఆరెపల్లి మోహన్ తిరుగుబావుటా ఎగరేశారు. ఆయన కాంగ్రెస్‌ను వీడి, అధికార టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన జిల్లాకుచెందిన మంత్రులతో ఇప్పటికే మాట్లాడినట్లు తెలిసింది. కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కూడా భేటీ అయి.. భేషరతుగా టీఆర్ఎస్లో చేరి మద్దతిచ్చేందుకు ముందుకొచ్చినట్లు సమాచారం. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు మీడియా సమావేశంలోనే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. టీఆర్ఎస్లో చేరే విషయాన్ని ప్రకటించాలని భావించారు. ఈ మేరకు మీడియాను కూడా ఆహ్వానించారు. అయితే ఈ విషయం తెలిసి కాంగ్రెస్ నాయకులు ఆరెపల్లి మోహన్ నివాసానికి రావడంతో సమావేశాన్ని రద్దు చేసుకుని హైదరాబాద్ వెళ్లారు. ఆదివారం కరీంనగర్లో జరిగే కేసీఆర్ బహిరంగసభలోనే పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే వ్యూహాత్మకంగా పెద్దపల్లి సభలో పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఎవరీ చంద్రశేఖర్..? అభ్యర్థులే కరువయ్యారా? పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కోసం కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి పలువురు నాయకులు టికెట్ ఆశించారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు గణనీయంగా ఓట్లు పోలు కావడం.. పార్లమెంట్ పరిధిలోని మంథని, రామగుండంలో టీఆర్ఎస్ సిట్టింగులు ఓడిపోవడంతో రాష్ట్రంలోని పలువురు నాయకులు ఈ సీటుపై కన్నేశారు. 32 మంది నాయకులు ఈ సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో గతంలో రాష్ట్రంలో కీలకమైన పదవులు నిర్వహించిన వారూ ఉన్నారు. ఎస్సీల్లోని సామాజిక సమీకరణాల నేపథ్యంలో పెద్దపల్లి సీటును మాదిగకు కేటాయించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో మాదిగ వర్గానికి చెందిన ఆరెపల్లి మోహన్, కవ్వంపల్లి సత్యనారాయణ టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే పీసీసీ నేతలతో ఉన్న సంబంధాలతో వికారాబాద్‌కు చెందిన మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్ ఢిల్లీ స్థాయిలో పైరవీ నడిపి టికెట్ తెచ్చుకున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన చంద్రశేఖర్ ఎవరో పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో సీనియర్ రాజకీయ నాయకులకు తప్ప ఇప్పుడెవరికీ తెలియదు. ప్రజలతోగానీ.. ఈ ప్రాంతంతోగానీ సంబంధాలే లేవు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి కాంగ్రెస్ తొలి జాబితాలో చంద్రశేఖర్ పేరు చోటుచేసుకోవడం కాంగ్రెస్ నేతల ఆగ్రహానికి కారణమైంది. ఈ క్రమంలోనే జిల్లా పరిషత్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా పనిచేసిన తనను కాదని రంగారెడ్డి జిల్లాకు చెందిన నాయకుడికి సీటివ్వడాన్ని ఆరెపల్లి మోహన్ జీర్ణించుకోలేకపోయారు. పార్టీని వదలాలని నిర్ణయించుకున్నారు. ఫలించని జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు రాయభారం కరీంనగర్ ప్రెస్‌భవన్‌లో ఆదివారం పట్టణ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఎమ్మెల్సీగా పోటీచేస్తున్న టి.జీవన్‌రెడ్డికి మద్దతుగా ఏర్పాటుచేసిన సమావేశానికి మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం తది తరులు హాజరయ్యారు. సమావేశానికి ఆరెపల్లి మోహ న్ కూడా వస్తారని భావించినా ఆయన రాలేదు. సమావేశం జరుగుతున్న సమయంలోనే సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు విలేకరులకు సమాచారం వచ్చింది. విషయం తెలుసుకున్న జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు హుటాహుటిన ఆరెపల్లి మోహ న్ ఇంటికి వెళ్లారు. ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అప్పటికప్పుడు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్కతో ఫోన్లో మాట్లాడించారు. ‘ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు. నీకు ఏం చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుంది’ అని సముదాయించారు. అవేమీ పట్టించుకోని మోహన్ విలేకరుల సమావేశాన్ని రద్దు చేసినట్లు చెబుతూ హైదరాబాద్ వెళ్లారు. శుక్రవారం రాత్రి ఎ.చంద్రశేఖర్‌కు సీటు ఖరారైన తరువాత టీఆర్ఎస్ నేతలు మోహన్‌తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎంపీ వినోద్, ఓ మంత్రితో సమావేశమై కార్యాచరణ రూపొందించుకున్నారు. ఆదివారం నాటి కేసీఆర్ సభలో మోహన్ పార్టీలో చేరబోరని, విడిగా ప్రత్యేక కార్యక్రమంలో పార్టీ కండువా కప్పుకుంటారని జిల్లాకు చెంది న ఓ టీఆర్ఎస్ ప్రముఖుడు తెలిపారు. మోహన్ బాట లోనే పెద్దపల్లి లోక్‌సభకు చెందిన పలువురు నాయకులు టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందని సమాచారం. -
బ్రిడ్జి ప్రారంభించేదెప్పుడో..?
సాక్షి, మానకొండూర్: మండలంలోని వేగురుపల్లి సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామాల వద్ద మానేరు వాగుపై నిర్మించిన బ్రిడ్జి నిర్మాణం పూర్తయి ఏడాది గడుస్తున్న ప్రారంభానికి మాత్రం నోచుకోవడం లేదు. ఈ వంతెనకు ఇరువైపుల భూ సేకరణ చేపట్టి రహదారి నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకూ అ«ధికారులు భూ సేకరణ చేపట్టలేదు. వంతెనకు ఒక వైపే భూ సేకరణ పనులు నామమాత్రంగా చేపట్టినట్లు స్థానిక రైతులు వాపోతున్నారు. వంతెనకు మరోవైపు భూ సేకరణ చేపట్టాల్సి ఉండగా, అ«ధికారులు మాత్రం అటువైపుగా దృష్టి సారించక పోవడంతో బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన ప్రారంభానికి నోచుకోలేక పోతోందని వాహనదారులు ఇరు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏడాది క్రితమే బ్రిడ్జి పనులు పూర్తి వేగురుపల్లి–నీరుకుల మధ్య మానేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణం లేక అనేక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాగులో మట్టి పోసి వాగును దాటే వారు. వర్షాకాలంలో మట్టి కొట్టుకుపోవడం వలన మళ్లీ అక్కడక్కడ మట్టి పోసి అనేక ఇబ్బందుల మధ్య రాకపోకలు సాగించేవారు. తొలిసారి ఎమ్మెల్యే ఎలక్షన్లలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మానేరు వాగుపై వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చి మాట నిలుపుకున్నారు. వంతెన నిర్మాణానికి రూ.40 కోట్లు మంజూరు చేయించారు. 2016 జనవరి 2న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఈ పనులకు శంకుస్థాపన చేశారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టరు పనులు వేగవంతంగా చేశారు. 15 ఫిల్లర్లు, 2 అపార్టుమెంట్లు ప్రధాన పనులను త్వరితగతిన పూర్తి చేశారు. ఫిల్లర్లపై గడ్డర్స్, డక్ స్లాబ్ పనులు కూడా చేశారు. 640 మీటర్ల మేర చేపట్టే ఈ పనులు చేపట్టిన కొద్ది నెలల్లోనే పూర్తి చేశారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయి ఉపయోగంలోకి రాకపోవడంతో అలంకారప్రాయంగా మారింది. భూ సేకరణలో జాప్యం వంతెనకు ఇరువైపుల రైతుల నుంచి భూ సేకరణ చేపట్టి రెండు కిలోమీటర్లకు పైగా కాంట్రాక్టర్ తారు రోడ్డు వేయాల్సి ఉంది. మానకొండూర్ మండలం వేగురుపల్లి వైపు అధికారులు భూ సేకరణ చేపట్టిన పూర్తిస్థాయిలో జరుపలేదని తెలుస్తోంది. కొద్దిదూరం మాత్రమే భూ సేకరణ చేపట్టి మట్టి పనులు చేశారు. పంట పొలాల్లో మట్టి పోసి రహదారి ఏర్పాటు చేసి తారు వేయాల్సి ఉంది. ప్రస్తుతం పంట పొలాలే దర్శనమిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఇరుకుల్ల వైపు భూ సేకరణ పనులు ఇంత వరకూ చేపట్టనేలేదు. వేగురుపల్లి వైపు కిలోమీటరు మేర పనులు చేపట్టాల్సి ఉండగా, ఇరుకుల్ల వైపు కిలోమీటరుపైగా పనులు చేపట్టాల్సి ఉంది. భూ సేకరణ త్వరగా చేపట్టితేనే ఇరువైపుల తారు రోడ్డు పనులు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది. వంతెనకు ఇరువైపుల తారు రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేసి వంతెనపై రాకపోకలను ప్రారంభించాలని ప్రయాణికులు, వాహనదారులు గ్రామస్తులు కోరుతున్నారు. -
‘గంగవ్వ’ ఎరుకనే కదా..!
సాక్షి, మల్యాల(పెద్దపల్లి): అచ్చమైన తెలంగాణభాష ఆమె సొంతం. అమాయకమైన చూపులు.. శివాలెత్తే మాటలకు కేరాఫ్‌గా నిలుస్తోంది మై విలేజ్ షో ఫేం గంగవ్వ. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని లంబాడిపల్లి గ్రామానికి చెందిన గంగవ్వ దినసరి కూలీ. తనకు రాని నటనతోనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. మై విలేజ్‌షో అనే ఛానల్‌తో యూ ట్యూబ్ ఐకాన్‌గా మారింది. గంగవ్వ కనపడితే చాలు ఒక్క సెల్ఫీ అంటూ యువత పోటీ పడుతున్నారు. నటనతెలియని గంగవ్వకు ఏకంగా పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్లు ఆఫర్ ఇవ్వడం ఆమె ప్రతిభకు నిదర్శనం. వ్యవసాయ కూలీనుంచి.. మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామానికి చెందిన మిల్కూరి గంగవ్వ ఉరఫ్ మై విలేజ్ షో గంగవ్వ వ్యవసాయ కూలీ. డిజిటల్ ఎలక్ట్రానిక్స్‌లో ఎంటెక్ పట్టా పొందిన అదే గ్రామానికి చెందిన శ్రీరాం శ్రీకాంత్ పల్లెటూరి సంస్కృతిని చాటిచెప్పేందుకు మై విలేజ్ షో అనే యూట్యూబ్ఛానల్ను దాదాపు ఐదేళ్లక్రితం ప్రారంభించాడు. తమ ఇంటి సమీపంలో ఉండే గంగవ్వ హుషారుతనం.. చలాకీ మాటలు.. అచ్చ తెలంగాణభాషను గుర్తించాడు. తన ఛానల్లో నటించడానికి అవకాశం ఇచ్చాడు. అలా సాగిన తన ఐదేళ్ల ప్రస్థానంలో ఇప్పుడు గంగవ్వ లేనిదే మై విలేజ్‌షో లేదు అనేంతగా ఫేమస్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు.. గంగవ్వ మై విలేజ్ షో షార్ట్ ఫిల్మ్స్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ ఛానల్లో ఇప్పటి వరకు 100కు పైగా షార్ట్‌ఫిల్మ్‌ల్లో నటించింది. ప్రతీ వీడియోలో తన ప్రత్యేకతను చాటుకుంది. మొన్నటి సంకాంత్రికి భీమవరంలో కోడిపందాలకు పోటీలు, తరువాత వచ్చిన ఎన్నికల్లో తీరును విశ్లేషిస్తూ ‘సెటైరికల్‌గా సర్పంచ్ గంగవ్వ’, నిన్నటి శివరాత్రి మహాత్యం వివరించే శివరాత్రి జాగారణ పేరుతో యూట్యూబ్ వీడియోలు తీస్తూ తన యాస,మాట తీరుతో గుర్తింపు పొందింది. ఓ వార్తాఛానల్లోని ప్రోగ్రాంలో ఏడాదిపాటు నటించింది. మరో వార్తాఛానల్లో రెండు పండుగ ఎపిసోడ్లు చేసింది. ఇటీవల హైదరాబాద్ రవీంద్రభారతిలో శనివారం నాడు ఏర్పాటుచేసే ‘సినీవారం’లో సత్కారం పొందింది. సినీ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరోయిన్ సమంతను కలిసింది. వాళ్లే గంగవ్వ నటనను యూట్యూబ్‌లో చూసి ఆహ్వానించడం విశేషం. గంగవ్వతో ఒక్క సెల్ఫీ.. ఒక్కసారి నీ తిట్లతో దీవించు అంటూ గంగవ్వను వెతుక్కుంటూ వెళ్లి, గంగవ్వ మాటలు, తిట్లకు సంబరపడిపోతున్నారు యువత. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు గంగవ్వతో సెల్ఫీ దిగేందుకు పోటీ పడుతున్నారు. పల్లెటూరి యాసతోపాటు మాటతో ఆకట్టుకుంటోంది. పల్లెటూరి నుండి పట్నం దాకా ఎక్కడికివెళ్లినా గంగవ్వ ఒక్క సెల్ఫీ అంటూ ఎగబడుతున్నారు. చెప్పింది చేసుడే తెలుసు.. వ్యవసాయ పనికి పోయేదాన్ని. పని లేనప్పుడు బీడీలు చేసేదాన్ని. శ్రీకాంత్ మా వీడియోలో నటిస్తవా అని అడిగిండు. నాకు నటించుడు రాదు..నువ్వు చెప్పింది సేత్త అన్న. శ్రీకాంత్ చెప్పింది చెప్పినట్లు చేస్త గంతే. ఎవుసం పనిచేసుకునేదాన్ని తీసుకువచ్చి ప్రపంచానికి పరిచయం చేసిండు శ్రీకాంత్. సినిమాల్లో నటించు అంటే నా ఊరిని ఇడిసి ఎక్కడికి రాను అని చెప్పిన. మొన్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ నన్ను పిలిచి సినిమాల నటించుమంటే నటించుడు రాదు సారు..మీరు చెప్పింది చెప్పినట్లు సేత్తా అంటే కొద్దిసేపు ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తీసుకున్నడు. మన మీద మనకు నమ్మకం ఉంటే ఏ పనిచేసిన మంచిగనే ఉంటాం. – గంగవ్వ -
బాబోయ్...సెల్ టవర్ మాకొద్దు
సాక్షి, టవర్‌సర్కిల్: నగరంలోని శ్రీరాంనగర్‌కాలనీలో జనావాసాల మధ్య సెల్‌టవర్‌ను నెలకొల్పడాన్ని నిరసిస్తూ తెలుగు యువత నగర అధ్యక్షుడు జెల్లో జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్శిటీ చౌరస్తా వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం రాస్తోరోకో చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సెల్‌టవర్ ఏర్పాటు చేయడం వల్ల రేడియేషన్‌తోపాటు కాలనీవాసులు అనారోగ్యం బారినపడతారన్నారు. అనుమతిని నగరపాలక సంస్థ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జనావాసాల మధ్య టవర్‌ను ఎత్తేసి ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని కోరారు. లేని పక్షంలో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెల్లోజి శ్రీనివాస్, ఎర్రబెల్లి వినీత్, బీరెడ్డి కరుణాకర్‌రెడ్డి, సాయిల్ల రాజమల్లయ్య, ఎర్రబెల్లి రవీందర్, బసాలత్‌ఖాన్, గొల్లె అమర్నాథ్, జావీద్, నర్సయ్యలతోపాటు తదితరులు పాల్గొన్నారు. -
మట్టిలో మాణిక్యానికి కావాలి చేయూత
సాక్షి, కమాన్‌చౌరస్తా: తనొక సాధారణ కుటుంబానికి చెందిన యువతి కాని కరాటే, కిక్ బాక్సింగ్ క్రీడల్లో అసాధారణ ప్రతిభ ఆమె సొంతం. కాని ఆర్థిక ఇబ్బందులు ఆమెను కలవరపెడుతున్నాయి. తనలోని టాలెంట్‌ను గుర్తించిన సన్నిధి ఫౌండేషన్ తమ వంతు చేయూతనిచ్చింది. కరీంనగర్ పట్టణానికి చెందిన కరాటే, కిక్‌బాక్సింగ్ క్రీడాకారిణి కందుల మౌనికకు సన్నిధి ఫౌండేషన్ బాధ్యులు అండగా నిలిచారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన ఆమెకు ఏషియన్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనే అవకాశం రాగా.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ విషయం తెలుసుకున్న సన్నిధి ఫౌండేషన్ బాధ్యులు మంగళవారం రూ.5 వేలు అందజేశారు. క్రీడల్లో రాణించి, తనకు సహకరిస్తోన్న వారి నమ్మకాన్ని నిలబెడతానని మౌనిక తెలిపింది. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు రాధారపు సూర్యప్రకాశ్, ఉపాధ్యక్షుడు అంబాల ప్రదీప్‌రెడ్డి, పృధ్యున్నత్ తదితరులు పాల్గొన్నారు. -
అటవీ చట్ట ఉల్లంఘనలకు చీతా చెక్
కాగజ్‌నగర్: డివిజన్ పరిధిలో ఎవరైనా అటవీ చట్ట ఉల్లంఘనలకు చీతా చెక్ పెట్టనుంది. చీతా అనే పేరు గల జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన స్నిప్ ఫర్ డాగ్‌ను డివిజన్‌కు కేటాయించారనీ, దీంతో చట్టవ్యతిరేక కార్యకలా పాలకు పాల్పడే నిందితులను త్వరగా పట్టుకోవచ్చని కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో రాజారమణరెడ్డి హెచ్చరించారు. మంగళవారం కాగజ్‌నగర్ డివిజన్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి జన్నారం నుంచి వచ్చిన డాగ్ స్క్వాడ్ బృందం గురించి వివరించారు. ఈ డాగ్ పేరు చీతా అని ఇప్పటికే పలు కేసుల్లో నిందితులను దీని సాయంతో పట్టుకున్నట్లు పేర్కొన్నారు. చీతా చాలా చురుకైన డాగ్ అనీ, నేరస్థులతోపాటు అక్రమ వేట సామగ్రిని కూడా గుర్తిస్తుందన్నారు. గత చట్టంలో నిందితులు బెయిల్‌పై వచ్చేవారని, కొత్త చట్టంలో అలాంటి వీల్లేదని ఎఫ్‌డీవో స్పష్టం చేశారు. అడవులను నరికినా, వన్యప్రాణులను వేటాడినా నాన్ బెయిలేబుల్ కేసు నమోదు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎప్ఆర్వో అనిత, ఎఫ్ఎస్వో యోగేష్, బీట్ ఆఫీసర్ బానయ్య, డాగ్ స్క్వాడ్ సభ్యులు సత్యనారాయణ, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం
ఇల్లంతకుంట: ఐదేళ్ల పాటు కొనసాగే పంచాయతీ పాలకులపై పల్లె ప్రగతి ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం నిధులు కేటాయిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పించి గ్రామాల రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తామని కొత్త సర్పంచులు చెబుతున్నారు. కాని కొత్త పంచాయతీరాజ్ చట్టం నిబంధనలు కఠినతరంగా ఉండటంతో నిధులు, విధుల్లో ఏమాత్రం తేడా వచ్చిన, నిర్లక్ష్యం చేసినా సర్పంచ్‌తో పాటు పాలకవర్గానికి ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలు కొత్త సర్పంచులకు స్వాగతం పలుకుతున్నాయి. ఏళ్లకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నీ కొత్త సర్పంచులు పరిష్కారం చేస్తారనే కొండంత ఆశతో గ్రామీణ ప్రజలు ఎదురుచూస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో నిధుల కొరత, కొత్త పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న నిబంధనలు సర్పంచులకు ఐదేళ్ల పాలన సాగించాలంటే కత్తిమీద సాముల మారుతోంది. గ్రామాల సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ.. 2015 ఆగస్టు 17న తెలంగాణ ప్రభుత్వం గ్రామజ్యోతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో గ్రామాల సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రణాళిక తయారు చేసి సిద్ధంగా ఉంచారు. వాటి అమలుకు గ్రామస్థాయిలో వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రాధాన్యత క్రమం బట్టి గ్రామాల్లో పనులు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. కానీ నేటి వరకు గ్రామజ్యోతి అమలుకు నోచుకోలేదు. కొత్త పంచాయతీల పాలనలోనైనా గ్రామజ్యోతి పథకాన్ని అమలు చేస్తే పల్లెల్లో ప్రగతి కాంతులు నిండే అవకాశం ఉంది. గతంలో సర్పంచులకు అధికారాలే తప్ప నిధులు, బాధ్యతలు ఆశించిన స్థాయిలో ఉండేవి కావు. సర్పంచులకు లక్ష్యాలు ఇలా.. తెలంగాణ సర్కారు కొత్త పంచాయతీ చట్టం వచ్చిన తర్వాత అనే లక్ష్యాలను నిర్ధేశించారు. నిర్ధేశించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేకపోయినా, కేటాయించిన నిధులు నిబంధనల మేరకు సక్రమంగా ఖర్చు చేయలేకపోయినా సర్పంచ్ పదవి తొలగింపుతో పాటు పాలకవర్గాన్ని రద్దు చేసే అవకాశాన్ని కొత్త చట్టంలో పొందుపరిచారు. సర్పంచులకు అధికారాలతో పాటు బాధ్యతలు పెరిగాయి. సర్పంచులు, పాలకవర్గాలు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించేలా కట్టుదిట్టమైన నియమాలు రూపొందించారు. పాత చట్టం ప్రకారం ఉపసర్పంచ్‌పై నాలుగేళ్లకు పైగా అవిశ్వాసం ఉండగా ప్రస్తుతం రెండేళ్లకు కుదించారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురైనా కూడా పాలకవర్గం రద్దు చేసే పరిస్థితి ఉంది. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసినా కూడా రూ.500 జరిమానా విధించనున్నారు. గ్రామాల్లో ప్రధాన సమస్యలివి.. ∙ కొత్త పంచాయతీల్లో కనిపించని వీధి దీపాలు ∙ గ్రామాల్లో ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణాలు ఆయా పంచాయతీల్లో అసంపూర్తిగా నిలిచిపోయాయి. ∙ ఇంకా ఇంటింటికి పూర్తి కాని మిషన్‌భగీరథ నల్లా కనెక్షన్లు ∙ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు, గ్రామాల్లో ఉప ఆరోగ్య కేంద్రాల నిర్వహణ, సమయపాలన పాటించేలా చూడడం. ∙ పాత పంచాయతీల్లో శిథిలావస్థకు చేరిన భవనాలను తొలగించి కొత్త భవనాలు నిర్మించడం, కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో జీపీ భవనాల నిర్మాణాలు ∙ గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి ∙ ప్రతీ గ్రామంలో శ్మశానవాటిక నిర్మించాలి ∙ డంపింగ్ యార్డులను నిర్మించాలి ∙ గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేయాలి బాధ్యతలు పెరిగాయి కొత్త పంచాయతీ చట్టంతో సర్పంచులకు బాధ్యతలు పెరిగాయి. సర్పంచులు విధులు సక్రమంగా నిర్వర్తిస్తూ నిధులను పారదర్శకంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా పాలకవర్గాలపై చర్యలు తప్పవు. – అమరేందర్‌రాజు, ఎంపీడీవో, ఇల్లంతకుంట -
గోదావరిఖని: నిరుద్యోగ యువతకు ఉపాధి
సాక్షి, గోదావరిఖని: ఈనెల 7న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలు చూపిస్తానని కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ హామీ ఇచ్చారు. బుధవారం గోదావరిఖని రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. సింగరేణి కార్మికులు, కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈనెల 7న జరిగే ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఫైవింక్లయిన్ మీదుగా తిలక్‌నగర్, జవహర్‌నగర్, లక్ష్మీనగర్, మెయిన్ చౌరస్తా, ఎన్టీపీసీ మీదుగా రామగుండం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే జీఎంకాలనీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్‌సింగ్‌ను గెలిపించాలని గాదం విజయ ఆధ్వర్యంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మక్కాన్‌సింగ్ కూతురు మానసఠాకూర్, నాయకులు పున్నం స్వరూప, భైరి లావణ్య, రజిత, మౌనిక, శ్రీలత, స్వరూప, స్వప్న, తిరుమల, ఈశ్వరమ్మ పాల్గొన్నారు. జ్యోతినగర్: కాంగ్రెస్ పార్టీ విజయంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రామగుండం అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ అన్నారు. బుధవారం రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టు లేబర్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు పేదలకు అందేవిధంగా మీకు సేవ చేస్తానని ప్రకటించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేలా యాజమాన్యంతో చర్చించనున్నట్లు వెల్లడించారు. చేతి గుర్తుకు ఓటు వేసి గెలించాలని అభ్యర్థించారు. కార్పొరేటర్లు కొలిపాక సుజాత, కవితారెడ్డి, పద్మలత, బాబర్ సలీంపాషా, బండి తిరుపతి, జిమ్మి బాబు, కళ్యాణ్, అరుణ్‌కుమార్, సంపత్‌రావు పాల్గొన్నారు. -
సిరిసిల్ల: ఎన్నికలకు సర్వం సిద్ధం
సాక్షి, సిరిసిల్ల: జిల్లాలో శాసనసభ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే రెండు దఫాలుగా ఎన్నికల సిబ్బందికి శిక్షణ పూర్తిచేయగా.. ఈవీఎంలలో బ్యాలెట్ పత్రాల కమిషనింగ్ సైతం కొలిక్కి వచ్చింది. జిల్లావ్యాప్తంగా 505 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు 2,910 మంది సిబ్బందిని సిద్ధంచేశారు. జిల్లాలో 4,10,999 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా దివ్యాంగుల కోసం సిరిసిల్ల బాలికల హైస్కూల్, వేములవాడ మండలం కోనాయిపల్లి పాఠశాలలో దివ్యాంగుల కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. మహిళల కోసం మొత్తం మహిళా పోలింగ్ సిబ్బందితో సిరిసిల్ల గీతానగర్ స్కూల్, వేములవాడ సాంస్కృతిక డిగ్రీ కళాశాలలో ప్రత్యేక మహిళా కేంద్రాలు ఏర్పాటుచేయనున్నారు. పోలింగ్ సిబ్బంది నియామకం.. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణ కోసం 2,910 మంది సిబ్బందిని నియమించారు. వేములవాడ నియోజకవర్గంలో 235 పోలింగ్ కేంద్రాలు ఉండగా 15శాతం అదనపు సిబ్బందితో కలిపి 271 మంది పోలింగ్ అధికారులను, మరో 271 మంది ఏపీవోలను, 542 మంది అదనపు పోలింగ్ సిబ్బందిని నియమించారు. మరో 271 మందిని ఎన్నికల నిర్వహణకు ఎంపికచేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలో 270 పోలింగ్ కేంద్రాలు ఉండగా 311 మంది పోలింగ్ అధికారులు, మరో 311 మంది ఏపీవోలు, 622 మంది ఓపీవోలను, 311 మంది అదనపు సిబ్బందిని నియమించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను కలెక్టర్ వెంకట్రామరెడ్డి పూర్తిచేశారు. ఫొటో పోల్ చిట్టీల పంపిణీ జిల్లా వ్యాప్తంగా ఓటర్లకు ఫొటో పోల్ చిట్టీలను బూత్ లెవల్ అధికారుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజే 62వేల మందికి ఈ చిట్టీలను పంపిణీ చేశారు. వీటితోపాటు కొత్తగా ఓటర్లుగా నమోదైన యువకులకు ఓటరు గుర్తింపుకార్డులను జారీచేస్తున్నారు. మూడురోజల కిందటే జిల్లాకు కొత్త ఓటరు గుర్తింపుకార్డులు వచ్చాయి. వీటిని జిల్లావ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో ఎన్నారై ఓటర్లు ఇద్దరు ఉండగా సర్వీసు ఓటర్లు 93 మంది ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన పనులు చురుకుగా సాగుతున్నాయి. వెబ్ కెమెరాలకు ఏర్పాట్లు జిల్లావ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ కోసం వెబ్కెమెరాలను ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికే లాప్‌ట్యాప్‌లు ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థులను ఎంపిక చేసి వెబ్‌కాస్టింగ్‌పై శిక్షణ ఇచ్చారు. హై ఫ్రీక్వెన్సీ ఉన్న కెమెరాలను కొనుగోలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 69 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వి«ధిగా కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తెలంగాణ ఎన్నికలు 2018 మరిన్ని వార్తలకు... -
సిరిసిల్ల: ‘మూడు వెంచర్లు.. ఆరు ప్లాట్లు’గా రియల్ దందా..!
వ్యవసాయ భూములను కొందరు లేఅవుట్లుగా మార్చుతున్నారు.. అధికారుల నుంచి అనుమతి తీసుకోకుండానే విక్రయిస్తున్నారు.. ఒకటికాదు.. రెండుకాదు.. నెలలో ఏకంగా నాలుగు సార్లు ఒకేప్లాటు విక్రయిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. సర్కారు ఆదాయానికి గండికొడుతున్నారు.. అయినా వీరి ఆగడాలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. ఎల్లారెడ్డిపేటతోపాటు సమీప గ్రామాల్లో జోరుగా సాగుతున్న రియల్ ఎస్టేట్ దందాపై ప్రత్యేక కథనం.. సాక్షి, ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అక్రమ లే అవుట్లతో అమ్మిన భూముల్లో స్థానిక గ్రామపంచాయతీ సిబ్బంది హద్దురాళ్లు తొలగిస్తున్నారు. అయినా, రియల్ వ్యాపారులు తమ దందా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. తక్కువ ధరలకు వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన రియల్టర్లు.. వాటిని ప్లాట్లుగా మార్చి క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ, రాచర్ల బొప్పాపూర్, రాచర్ల గొల్లపల్లి, కిష్టంపల్లి పరిధిలో ఈదందా ‘మూడు వెంచర్లు.. ఆరు ప్లాట్లు’గా సాగుతోంది. అనుమతులు లేకుండానే లే అవుట్లు గ్రామపంచాయతీ నుంచి అనుమతి పొందకుండానే కొందరు వ్యవసాయ భూములను ప్లాట్లుగా ఏర్పాటు చేసి అమ్మకాలు చేస్తున్నారు. తక్కువ ధరకు ఎకరాల కొద్దిభూములను కొనుగోలు చేసి వాటిని ప్లాట్లుగా విభజించి అమ్మడంతో రూ.లక్షలు రియల్ ఎస్టేట్ వ్యాపారుల జేబుల్లోకి వెళ్తున్నాయి. అమాయకులను నమ్మిస్తూ లేఅవుట్లు లేకుండానే వారికి ప్లాట్లను అంటగడుతున్నారు. అనుమతులు లేవని గ్రామపంచాయతీ సిబ్బంది దాడులు చేస్తుండడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆందోళనకు గురవుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులపై అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయడంతోనే అక్రమ లేఅవుట్లతో రూ.కోట్లు ఆర్జిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామపంచాయతీ ఆదాయానికి గండి గ్రామపంచాయతీ నుంచి లేఅవుట్లు పొందడానికి రూ.వేలల్లో రుసుం చెల్లించాల్సి ఉంది. కానీ, రియల్ వ్యాపారులు రుసుం చెల్లించకుండానే తమ ఇష్టానుసారంగా లేఅవుట్లను తయారుచేసి ప్లాట్లను విక్రయిస్తున్నారు. దీంతో గ్రామపంచాయతీకి రావాల్సిన ఆదాయం రావడం లేదు. ఫలితంగా గ్రామపంచాయతీల నిర్వాహణ భారంగా మారుతోంది. ఒకవ్యక్తి ప్లాట్లను తీసుకున్న వారం రోజుల్లోనే మరోవ్యక్తికి రూ.లక్షల్లో ధర ఎక్కువచేసి ఇంకొకరికి అమ్ముతున్నారు. ఇలా నెలరోజుల్లో ఒక్కో భూమి నలుగురి చేతులు మారుతున్నాయి. ఫోర్లేన్తో రూ.కోట్లకు చేరిన ప్లాట్ల ధరలు ఎల్లారెడ్డిపేట– డాక్టర్ కేవీఆర్ పాఠశాల నుంచి రాచర్ల గొల్లపల్లి – పెట్రోల్ బంకు వరకు ఫోర్‌లేన్ రోడ్డు నిర్మిస్తున్నారు. దీం తో ఈరోడ్డువెంట ఉన్న భూముల ధరలకు రెక్కలొచ్చాయి. మొన్నటివరకు రూ.లక్షల్లో ధర పలుకగా రోడ్డు నిర్మాణంతో అ మాంతం ఆ ధరలు రూ.కోట్లకు చేరాయి. రోడ్డు నిర్మాణం జ రుగుతున్న మూడున్నర కిలోమీటర్ల దూరం వరకు రో డ్డుకిరువైపులా ఉన్న ప్లాట్ల కొనుగోలుకు చేయడానికి రియల్టర్లు పోటీ పడుతున్నారు. రాత్రి చూసిన ప్లాట్లు తెల్లవారేసరికి అ మ్ముడు పోతున్నాయి. ఒకరకంగా ఫోర్‌లేన్ రోడ్డు నిర్మాణం రి యల్టర్లకు కలిసి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్లాటు ఏర్పాటుకు నిబంధనలు ఇవీ.. వ్యవసాయేతర భూమిగా మార్చడానికి జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారికి దరఖాస్తు చేయాలి. దీంతోపాటు ఆర్డీవో ప్రొసీడింగ్ ముఖ్యం. 67 జీవో ప్రకారం..వ్యవసాయేతర భూమిగా మార్చుకోవడానికి వారు ఇచ్చే అనుమతి కాపీని గ్రామపంచాయతీకి అప్పగించాలి. గ్రామపంచాయతీ పరిశీలిస్తుంది. నిబంధనల ప్రకారం ప్లాట్ల మధ్య 30 అడుగుల రోడ్డు కోసం స్థలం వదిలిపెట్టాలి. గ్రామపంచాయతీ అనుమతి కోసం కనీస రుసుం చెల్లించాలి. ప్లాటు మధ్య 12 అడుగులకు మించి స్థలం లేకుండానే వ్యాపారులు విక్రయిస్తున్నారు. దీంతో నిబంధనల మేరకు వ్యవసాయేతర భూమిగా మార్చుకోకుండా, కనీసం ముప్ఫయి అడుగుల మధ్య రోడ్లు లేనందున జీవో 67ను అనుసరించి అనుమతిలేని లేఅవుట్ల హద్దురాళ్లను అధికారులు తొలగించారు. ఎల్లారెడ్డిపేట నుంచి రాచర్లగొల్లపల్లి వరకు చేపట్టిన అనుమతిలేని సుమారు 300 ప్లాట్ల హద్దురాళ్లను గ్రామపంచాయతీ అధికారులు గత మే, జూన్‌లో తొలగించారు. పంచాయతీలకు ఆదాయం.. రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీకి ఏడాదికి రూ.9.80 లక్షలు, రాచర్లగొల్లపల్లికి రూ.4.85 లక్షల ఆదాయం సమకూరింది. దీంతోపాటు ప్లాట్ల రిజిస్ట్రేషన్ ద్వారా ప్లాటు ధరలో 4శాతం వరకు స్టాంప్ డ్యూటీ పేరిట ఏడాదికి రూ.10 లక్షల – రూ.12 లక్షల వరకు ఆదాయం వస్తోంది. ఈ నిబంధనల మేరకు ఈ ఆదాయం చాలా తక్కువ. అనుమతులు లేని ప్లాట్లు కొనుగోలు చేయవద్దు గ్రామపంచాయతీ పరిధిలో అనుమతులు లేని ప్లాట్లను ప్రజలు కొనుగోలు చేయవద్దు. అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకుంటున్నాం. కొనుగోలు చేసిన భూములకు సంబంధించి నోటీసులు జారీచేశాం. వ్యాపారులు చదును చేసిన భూములలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి లేఅవుట్లపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. వ్యవసాయ భూముల్లో ప్లాట్లను ఏర్పాటు చేసి అమ్ముకోవడం వ్యాపారులు మానుకోవాలి. -బాబు, ఇన్చార్జి ఈవో, ఎల్లారెడ్డిపేట -
‘టీఆర్ఎస్తోనే అన్నివర్గాల అభ్యున్నతి’
సాక్షి,కొత్తపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేసిందని కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. కొత్తపల్లి మండలం రేకుర్తిలోని సాలెహ్నగర్, హనుమాన్‌నగర్, ద్వారకానగర్, గౌడ కాలనీ, షేకాబీకాలనీల్లో మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్, మాజీ ఉపసర్పంచ్ సుదగోని కృష్ణ కుమార్ గౌడ్ల ఆధ్వర్యంలో శుక్రవారం కమలాకర్‌కు డప్పు చప్పుళ్లు, మంగళహారతులు, పూలతో స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ పలు మసీదుల్లో ముస్లింను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఆయా కాలనీల్లో ఏర్పాటు చేసిన సభల్లో గంగుల మాట్లాడుతూ ఐదేళ్లుగా కనిపించని కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ఎందుకు పట్టించుకోలేదో నిలదీయాలని కోరారు. మహాకూటమి రూపంలో చంద్రబాబు తెలంగాణ గడ్డపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తోందని అన్నారు. తెచ్చుకున్న తెలంగాణలో ఆంధ్రా దొంగలు పడేందుకు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కొనసాగాలంటే ఇంటిపార్టీ టీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, ఎంపీపీ వాసాల రమేష్, జెడ్పీటీసీ ఎడ్ల శ్రీనివాస్, జెడ్పీ కోఆప్షన్ జమీలొద్దీన్, ఎంపీటీసీ శేఖర్, టీఆర్ఎస్వీ నాయకుడు పొన్నం అనీల్‌గౌడ్, మాజీ వార్డుసభ్యులు ఎస్.నారాయణగౌడ్, మాజీద్, రహీం, రాచకొండ నరేశ్, పొన్నాల తిరుపతి, అస్తపురం నర్సయ పాల్గొన్నారు. పలువురి చేరిక రేకుర్తికి చెందిన కాంగ్రెస్, టీడీపీ సీనియర్ సీనియ ర్ నాయకులు అస్తపురం అంజయ్య, నెల్లి చంద్ర య్య, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రవీందర్‌లు గంగుల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. -
జగిత్యాల: పేరుకే పంచాయతీలు..!
సాక్షి, సారంగాపూర్(జగిత్యాల): నిధులు లేక పంచాయతీలు నీరసించిపోతున్నాయి. తండాల నుంచి పంచాయతీలుగా మారినా.. అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. పంచాయతీలుగా గుర్తించి ఆర్నెళ్లయినా.. ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదంటే అతిశయోక్తికాదు. పంచాయతీల్లో పారిశుధ్యం పడకేసింది. ప్రత్యేక అధికారులకు పాలనపగ్గాలు అందించడం.. అదనపు బాధ్యతలతో వారు సరిగా విధులు నిర్వర్తించకపోవడంతో గ్రామాల్లో పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. 500 జనాభా దాటిన తండాలను చాయతీలుగా చేస్తామని 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసింది. కొన్నిచోట్ల ప్రస్తుతం ఉన్న పంచాయతీలు గిరిజన తండాలకు, గిరిజనేతర శివారు గ్రామాలకు దూరంగా ఉండి, తక్కువ జనాభా కలిగి ఉన్నా అట్టి తండాలను, శివారు గ్రామాలను ప్రభుత్వం గ్రామపంచాయతీలుగా ప్రకటించి, రాష్ట్ర అవతరణ రోజైన జూన్ రెండు నుంచి తండాల్లో ప్రత్యేక పంచాయతీల పాలన ఆరంభించింది. పంచాయతీలు 21 జిల్లాలో మొత్తం 380 గ్రామపంచాయతీలు ఉన్నాయి. జూన్ 2న జిల్లాలో గిరిజన, గిరజనేతర జనాభా ప్రాతిపదికన కొత్తగా 60 గ్రామపంచాయతీలను ఏర్పాటుచేశారు. గతంలోనే రాయికల్ మండలం జగన్నాథపూర్ గిరిజన గ్రామపంచాయతీగా ఉండగా.. కొత్తగా 20 తండాలను గ్రామపంచాయతీలుగా ప్రకటించగా..ఇక్కడ 100 శాతం గిరిజనులే ఉన్నారు. మండలాల వారీగా గిరిజన గ్రామపంచాయతీలు సారంగాపూర్ మండలంలో భీంరెడ్డిగూడెం, ధర్మనాయక్తండా, మ్యాడారం తండా, లచ్చనాయక్‌తండా, నాయికపుగూడెం బీర్పూర్ మండలంలో చిన్నకొల్వాయి, చిత్రవేణిగూడెం, కందెనకుంట, రాయికల్ మండలం అలియనాయక్తండా, జగన్నాథపూర్, కైరిగూడెం, మంత్యనాయక్తండా, లొక్యనాయక్తండా, వాల్మీకితండా, మల్లాపూర్ మండలంలో ఓబులాపూర్ తండా, వాల్గొండతం డా, మెట్పల్లి మండలంలో ఏఎస్ఆర్ తండా, కేసీఆర్ తండా, పటిమిడి తండా, ఇబ్రహీంపట్నంలో తిమ్మాపూర్ తండా, కథలాపూర్‌లో రాజారంతండాలు కొడిమ్యాల మండలంలో గంగారాంతండా గిరిజన గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేశారు. నెలలు గడుస్తున్నా అభివృద్ధి లేదు గ్రామపంచాయతీలు ఏర్పాటు జరిగినా తండా పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నిధులు మినహాయించి ప్రభుత్వం నుంచి ఇతర అభివృద్ధి పనులకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలే దు. దీంతో పంచాయతీల ఏర్పాటు ద్వారా పెద్దగా ఒరిగిన ప్రయోజనం ఏమిలేదని గిరిజనులు పేర్కొంటున్నారు. జూన్ 2న పంచాయతీలను ఏర్పాటు చేసిన సమయంలో పంచాయతీ కార్యాలయాల కోసం తాత్కాలికంగా అందుబాటులో ఉన్న కమ్యూనిటీ భవనాలు, పాఠశాల భవనాలు, కొన్ని గ్రామాల్లో ఇళ్లను అద్దెకు తీసుకుని పంచా యతీ కార్యాలయాలను ప్రారంభించారు. పంచా యతీలు ఏర్పాటు జరిగినా, ఇప్పటి వరకు ఆయా పంచాయతీ కార్యాలయాల్లో సరిౖయెన ఫర్నిచర్ కూడా అందుబాటులో లేదు. కొత్తగా నిధులు లేవు గ్రామపంచాయతీలకు కేంద్రం నుంచి జనాభా ప్రాతిపదికన వచ్చిన 14వ ఆర్థిక సంఘం నిధులను జనాభా నిష్పత్తి ప్రకారం విభజించి ఆయా గ్రామపంచాయతీల ఖాతాల్లో పంచాయతీ ప్రత్యేకాధికారి, ఇన్చార్జి కార్యదర్శి పేరును జమ చేశారు. ఈ నిధులను తండాలోని వీధిదీపాల ఏర్పా టు, బావుల్లో క్లోరినేషన్ నిర్వహించడంతోపాటు, మురికి కాల్వలను శుభ్రం చేయడానికి వినియోగించారు. ఇతరనిధులు మంజూరు కాకపోవడంతో గ్రామాల్లో కొత్తగా ఎలాంటి అభివృద్ధి పనులూ చేపట్టలేదు. అధికారుల హాజరు చుట్టచూపే ప్రత్యేకాధికారులు వారికి కేటాయించిన గ్రామాలకు ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తున్నారే తప్ప, గిరి జనులతో ఎలాంటి ప్రత్యేక సమావేశాలు జరప డం లేదని సమాచారం. చుట్టపుచూపుగా గ్రామాలకు వస్తున్నారని, తండాల్లోని సమస్యలపై చర్చలు నిర్వహించడం లేదని పేర్కొంటున్నారు. -
జగిత్యాల: బరిలో విద్యావంతులు
సాక్షి, జగిత్యాల : జిల్లాలో అసెంబ్లీ పోరు రసదాయకంగా మారింది. ప్రజల ప్రాణాలు కాపాడే పవిత్ర వృత్తిలో ఉన్న డాక్టర్లు... రాజ్యంగ హక్కులను కాపాడేలా పేద, ధనిక తారతమ్యలకు తావు లేకుండా అన్నివర్గాలకు న్యాయం చేస్తూ రాజ్యాంగాన్ని కాపాడుతున్న న్యాయవాదులు.. నవభారత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న ఇంజినీర్లు.. ఉన్నత విద్యావంతులు చట్ట సభల్లో అడుగు పెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఒకప్పుడు రాజకీయాలను మురికికూపంలా భావించే విద్యావంతులు ఇప్పుడు అందులో ప్రవేశించి స్వచ్ఛమైన పాలన అందించేందుకు నడుం బిగించారు. జనం నాడి పట్టుకుని... రాజకీయాల్లో తమ భవితవ్యాన్ని పరీక్షించుకునేందుకు తహతహలాడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా నుంచి ఈ సారి ఉన్నత విద్యావంతులందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తమ వృత్తితోపాటు సమాజ సేవ చేయాలని కొందరు... తమకున్న రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలని కొందరు ఎన్నికల వైపు మెుగ్గు చూపుతున్నారు. రాజకీయ అండదండలతో ప్రధాన పార్టీల టిక్కెట్లు సాధించుకుని బరిలో దిగారు. వృత్తుల్లో ఏర్పడ్డ పరిచయాలు, ఇంతకాలం తమ సేవలకు లభించిన గుర్తింపు తమకు కలిసొస్తుందనే ధీమాతో ఉన్నారు. అందుకు ప్రధాన పార్టీల నుంచి రేసులో ఉన్నవారు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. జగిత్యాల నియోజకవర్గం నుండే ఆరుగురు విద్యావంతులు బరిలో ఉన్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో జగిత్యాల సెగ్మెంట్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన డాక్టర్ సంజయ్‌కుమార్ ఈసారి మళ్లీ అదే పార్టీ నుంచి బరిలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి గెలుపొందినా.. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుండే సంజయ్‌కుమార్ ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. నాలుగేళ్లలో పార్టీనే నమ్ముకుని పని చేసిన ఆయనకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆశీర్వాదంతో గులాబీ బాస్ కేసీఆర్ మళ్లీ టిక్కెట్ కేటాయించారు. దీంతో సంజయ్‌కుమార్ రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మెట్‌పల్లికి చెందిన డాక్టర్ జేఎన్.వెంకట్ ఏడాది క్రితం వరకు వైద్య సేవలందించారు. ప్రస్తుతం కోరుట్ల స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మొదట్నుంచే కాంగ్రెస్‌లో కొనసాగిన వెంకట్ 2009లో పీఆర్పీలో చేరారు. అప్పటి ఎన్నికల్లో తన భార్య సునీతను పీఆర్పీ నుంచి కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దింపారు. అయితే ఆమె ఓడిపోయారు. తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లో చేరిన వెంకట్ రెండు నెలల క్రితం వరకు పార్టీలోపీసీసీ కార్యదర్శిగా పని చేశారు. తర్వాత బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. జగిత్యాల పట్టణానికి చెందిన సిరికొండ రవిశంకర్ ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. జగిత్యాలకు మెడికల్ కాలేజీ సాధన.. నియోజకవర్గంలో నెలకొన్న అపరిష్కృత సమస్యల సాధనే ప్రధాన ఎజెండాగా చేసుకున్న రవిశంకర్ ఏడాది క్రితమే తన ఆస్పత్రిని సైతం మూసేసి జనం మద్యలో తిరుగుతున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గమంతా పాదయాత్ర చేపట్టారు. అన్నివర్గాలను కలుస్తూ తనను గెలిపించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున జగిత్యాల ఎమ్మెల్యే అభ్యర్ధిగా డాక్టర్ సత్యనారాయణమూర్తి బరిలో ఉన్నారు. ఆయన జగిత్యాల స్ధానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఇది రెండోసారి. 2014లోనూ అదే పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పట్టణంలో ఆయనకు మంచి వైద్యుడిగా పేరుంది. జగిత్యాల నియోజకవర్గం నుండి మహాకూటమీ అభ్యర్థిగా బరిలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తాజామాజీ ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి న్యాయవాది. ఇప్పటికీ ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయనకు జననేతగా పేరుంది. ఇప్పటి వరకు తొమ్మిది పర్యాయాలు పోటీ చేసి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా మళ్లీ బరిలో ఉన్నారు. ధర్మపురి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నం అంజయ్య న్యాయవాది. ఆయనా రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే 2014లో కమలం పార్టీ నుంచి పోటీ చేసిన ఆయన 13,267 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. ఈసారి మళ్లీ అదే పార్టీ నుంచి బరిలో ఉన్నారు. -
శభాష్ రాజేశ్వరి
సాక్షి, సరిసిల్ల: చేతులు పని చేయకున్నా ఆమె చెరగని ఆత్మవిశ్వాసానికి ప్రతీక. కాలుతోనే కవిత్వాన్నిరాస్తూ.. శభాష్ అనిపించుకుంటుంది. సిరిసిల్ల సాయినగర్‌కు చెందిన బూర రాజేశ్వరి దివ్యాంగురాలు. ఎన్నికల నేపథ్యంలో రాజేశ్వరి కాలుతో అక్షరాలను లిఖించి.. మంగళవారం ‘సాక్షి’కి పంపించారు. నోటు మాటున ఓటేయకు.. ప్రజాస్వామ్యాన్ని కాటేయకు.. విక్రమార్కునిలా ఓటు వెయ్యి.. అక్రమార్కుల తాట తియ్యి.. అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు. ఏ పాటి వాడో చూడు.. ఎన్నుకుంటే వెలగబెట్టడం కాదు.. ఇప్పటి దాక ఏం చేశాడో చూడు.. పెట్టుకొనే టోపి కాదు.. పెట్టిన టోపి చూడు.. -
కుల సంఘాల ఓట్లు రాలేనా..?
సాక్షి, సిరిసిల్ల/వేములవాడరూరల్ : జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులు తమదైన ప్రచారంతోపాటు వివిధ వర్గాల ఓట్లు గంపగుత్తగా పొందే ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నారు. అందులో భాగంగా కుల సంఘాలను ప్రసన్నం చేసుకోవడానికి వారితో ప్రత్యేకంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు కులాల వారీగా ఆత్మీయ సభల పేరిట సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పటికే రెండు నియోజకవర్గాల్లో పలు కులసంఘాలతో సమావేశాలు పూర్తిచేసుకొని మరోసారి సమావేశమవడానికి అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. నేరుగా అభ్యర్థులే రంగంలోకి దిగకుండా పార్టీలోని నాయకుల ద్వారా సంప్రదింపులు నెరపుతున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో పద్మశాలీల ఓట్లు అత్యంత కీలకం కానున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ జిల్లాకేంద్రంలో పద్మశాలీలతో కృతజ్ఙత సభ నిర్వహించి వారిని ఆకర్షించే ప్రయత్నం చేసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కార్మిక క్షేత్రంలోని నేతన్నల సామాజిక వర్గంపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. వారినే లక్ష్యంగా చేసుకుని ప్రచారశైలిని కొనసాగిస్తున్నారు. మరోవైపు వేములవాడ నియోజకవర్గంలో మున్నూరు కాపు వర్గం ఓ ట్లు అత్యంత కీలకంగా మారనున్నాయి. ఈఓటర్లను ఆకర్షించేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పోటా పోటీగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాయి. కుల సంఘాలపైనే గురి.. వేములవాడ నియోజకవర్గంలో కులసంఘాల వైపు అభ్యర్థులు దృష్టి సారించారు. ఇప్పటికే కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు కుల సంఘాలపై దృష్టి సారించి వారికి మొదటి దఫా విందులతో సమావేశాలు నిర్వహించారు. రెండో విడత కూడా మళ్లీ కుల సంఘాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడానికి ఆయా పార్టీలకు చెందిన నాయకులు కసరత్తు మొదలుపెట్టారు. వేములవాడ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 1,92,669 మంది ఉండగా అందులో బీసీలు 1,37,372 మంది ఉన్నారు. వీరిలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు సుమారు 40 వేల వరకు ఉన్నారు. ఎన్నికల్లో ఈ వర్గం ఓటర్లు ప్రభావం చూపనున్నారు. అయితే వీరంతా ఎటువైపు మొగ్గనున్నారో మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. వేములవాడ టీఆర్ఎస్ అభ్యర్థి రమేశ్‌బాబు మొదటి నుంచే నియోజకవర్గంలోని మున్నూరుకాపు సంఘంపై ప్రత్యేక దృష్టి పెట్టి స మావేశాన్ని నిర్వహించారు. కిందిస్థాయి నేతలతో మళ్లీమళ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. టీఆర్ఎస్లోని మున్నూరుకాపు నేతలతో సంఘ నేతల మద్దతు పొందేలా పావులు కదుపుతున్నారు. మరోవైపు తాను మున్నూరుకాపు కులానికి చెందిన వ్యక్తినంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్.. వేములవాడ మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య, మున్నూరు కాపు సత్రం గౌరవ అధ్యక్షుడు, మాజీ ఎమ్మె ల్యే బొమ్మ వెంకన్నతోపాటు మున్నూరుకాపు కుటుంబాలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిం చారు. మూడుసార్లు ఓటమి పాలయ్యానని, మీ వాడిగా, కుల సభ్యునిగా ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటున్నారు. మనలో ఒకరికి ఈ అవకాశం వచ్చిందని, దీన్ని సద్వినియోగం చేసుకుందామని విజ్ఙప్తి చేస్తున్నారు. ఈసమయంలో కులబంధువులు అండగా ఉండాలని కోరుతున్నారు. రోజూవారీగా ప్రత్యేక సమావేశాలు.. టీఆర్ఎస్లో ఉన్న మున్నూరుకాపు సభ్యులు కొం దరు వేములవాడ మున్నూరుకాపు సంఘంలో ఉన్న సభ్యులతో సంప్రదింపులు జరుపుతూ రెగ్యులర్‌గా ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నా రు. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా పోటాపోటీగా రోజూవారీగా మీటింగ్‌లతో వారిని తమవైపుకు తిప్పుకుంటున్నారు. కులసంఘ సభ్యులను తమ వైపు తిప్పుకోవడానికి ఒక పార్టీ ప్రయత్నిస్తుంటే మరో పార్టీలో ఉన్న మున్నూరు కాపు సభ్యులు కులం పేరుతో సంఘంను వాడుకోవడం సరికాదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో వేములవాడ నియోజకవర్గంలోని మున్నూరుకాపు సంఘ సభ్యులు, కులస్తులు అయోమయానికి గురవుతున్నారు. ఈనేపథ్యంలో వారంతా కలసి చర్చించుకోవడానికి నియోజకవర్గస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ చర్చల తర్వాతే ఏ గట్టున ఉండాలో తేల్చుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా నియోజకవర్గంలోని ఓటర్లలో వేములవాడ మున్నూరుకాపు సంఘంలో అత్యధిక ఓటర్లు ఎవరివైపు నిలబడనున్నరోనని ఆసక్తి నెలకొంది. ఈ సంఘ సభ్యులు ఎటువైపు మొగ్గుచూపితే అటువైపే గెలుపుకు అవకాశాలుంటాయని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. అయితే కులసంఘాల నాయకుల వెంటే కులస్తులు ఉంటారా? వారి మాటకు కట్టుబడి వారి చెప్పిన వారికే మొగ్గు చూపుతారా అన్నది మరికొద్దిరోజులు వేచి చూడాల్సిందే. -
‘స్టార్స్’పైనే ఆశలు!
సాక్షి, సిరిసిల్ల : జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఆయా నియోజకవర్గాల్లో పోరులో నిలిచిన అభ్యర్థుల సంఖ్య, వారిగుర్తులు కూడా ఖరారయ్యాయి. ఇప్పటికే జిల్లాలోని ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం ఉధృతం చేశారు. ఇప్పటిదాకా ఆయా పార్టీల అభ్యర్థులు, నాయకులు తొలి విడత ప్రచారం పూర్తిచేసుకున్నారు. అభ్యర్థులు సొంతంగా లేక వారి అనునయులతో ఎన్నికల ప్రచారం నిర్వహించగా ఇకముందు వారి ప్రచారం కొత్త పుంతలు తొక్కనుంది. మిగిలిన 12రోజుల ప్రచార సమయంలో వారంతా తమ పార్టీ పెద్దలనే నమ్ముకున్నారు. ఈ మలిదశ ప్రచారమంతా వీఐపీల పర్యటనలతో సాగిపోనుంది. ఇందులో భాగంగానే ఈనెల 20న సీఎం కేసీఆర్ సిరిసిల్లలో టీఆర్ఎస్ బహిరంగ సభ ద్వారా జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో రాజకీయ వేడిని రగిలించారు. మరోవైపు కూటమి అభ్యర్థికి ప్రచారం చేయడానికి ఈనెల 26న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ జిల్లాకు రానున్నారు. మిగిలిన ప్రధాన పార్టీలు కూడా అదేబాటలో పయనిస్తూ పార్టీ పెద్దల సమయం కోసం ఎదురుచూస్తున్నాయి. అగ్రనేతలపైనే ఆశలు.. ప్రధాన పార్టీల అభ్యర్థులు నియోజకవర్గంలో తమస్థాయి ప్రచారాన్ని నిర్వహిస్తూనే వీలును బట్టి పార్టీ పెద్దల ప్రచార సమయాన్ని తమ నియోజకవర్గంలో కేటాయించుకునేలా ప్రణాళిక చేస్తున్నారు. తమ ప్రచారంతోపాటు పార్టీ పెద్దలు, స్టార్ కాంపెయినర్ల ప్రచారంతో తమకు మరింత మేలు జరుగుతుందని నమ్ముతున్నారు. వారి రాకతో బహిరంగ సభలు, ర్యాలీలకు జన సమీకరణ చేసేందుకు, అందరినీ ఆకర్షించేందుకు మంచి అవకాశంగా భావిస్తున్నారు. బీజేపీ తరఫున ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ బీజేపీ అభ్యర్థుల ప్రచారానికి రానున్నారని ప్రచారం. వీరికితోడు స్వామి పరిపూర్ణానంద కూడా విస్త్రృతంగా పర్యటించనున్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రంగా వీరంతా ప్రచారంలో పాల్గొన్నా తమకు కలిసొచ్చేలా నియోజకవర్గంనుంచి జనసమీకరణతో ఆ ప్రభావం పొందేందుకు అభ్యర్థులు వ్యూహాలు రచిస్తున్నారు. అన్ని పార్టీలదీ అదే దారి.. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎల్ఎఫ్.. ఇలా అన్ని పార్టీలు తమ అభ్యర్థుల ప్రచారానికి పార్టీ పెద్దలను, స్టార్ కాంపెయినర్లను ప్రచార రంగంలోకి దింపుతున్నాయి. కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ గౌరవాద్యక్షురాలు సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఖుష్బూ, విజయశాంతి, రేవంత్‌రెడ్డి తదితరులు ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు. వీరి ప్రచార సమయం కోసం వేచి చూస్తున్నామని, వీలును బట్టి జిల్లాలో ప్రచారం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. టీఆర్ఎస్ నుంచి అధినేత కేసీఆర్‌తోపాటు మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, మహ్మద్ అలీ తదితరులతో జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో బహిరంగ సభలతో ప్రచారాన్ని హోరెత్తించారు. మరోవైపు బీఎల్ఎఫ్ తరపున ప్రచార సారథులుగా సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, కేరళ సీఎం విజయన్, తమ్మినేని వీరభద్రం, విమలక్క, కంచె ఐలయ్య తదితరులు ప్రచారం నిర్వహిస్తుండగా వారిలో నుంచి వీలును బట్టి జిల్లాలో పర్యటించేలా బీఎల్ఎఫ్ అభ్యర్థులు ప్రణాళికలు చేసుకుంటున్నారు. వీరందరితో ఉమ్మడి జిల్లాకేంద్రంగా బహిరంగ సభలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇక మిగిలిన 12 రోజుల ప్రచార సమయంలో నియోజవర్గాల్లో ప్రచార మోత స్టార్లతో మోగిపోనుంది. -
పల్లెకురాని వెలుగు
కమాన్‌పూర్: గ్రామగ్రామానికి పల్లె వెలుగు... పత్రి గ్రామానికి ఆర్టీసీ సేవలు అందిస్తామని చెబుతున్న ఆర్టీసీ అధికారులు పల్లెవెలుగు సేవలను గ్రామ ప్రజలకు అందించడంలో పూర్తిగా విఫలం చెందుతున్నారు. కోట్ల రూపాయాలతో ప్రభుత్వం తారురోడ్లు వేసిన ఆ రూట్లలో ఆర్టీసీ బస్సులు నడవక పోవడంతో ప్రజలు, విద్యార్థులు, చిరువ్యాపారులకు ఇబ్బందులు తప్పడం లేదు. నిత్యం ఆ గ్రామాల నుంచి విద్యార్థులు, చిరువ్యాపారులు, ప్రజలు పారిశ్రామిక ప్రాంతం గోదావరిఖని, ఎన్టీపీసీ, ఎఫ్‌సీఐ, జిల్లా కేంద్రం పెద్దపల్లికి వివిధ పనుల నిమిత్తం వెళుతుంటారు. గతంలో ఆర్టీసీ బస్సు సౌకర్యాం ఉన్న కొద్ది నెలల నుంచి బస్సు సర్వీస్‌ను నిలిపివేయడంతో ప్రజలు, విద్యార్థులు అధిక చార్జీలతో ప్రయివేటు వాహనాల్లో ప్రయాణం చేయాల్సిన దుస్థితి నెలకొంది. గోదవరిఖని టూ పెద్దపల్లి గోదావరిఖని డిపో నుంచి పెద్దపల్లి వరకు బస్సు సౌకర్యాం ఏర్పాటు చేశారు. గత నెల రోజుల నుంచి ఆ గ్రామాలకు పల్లెవెలుగు సేవలు నిలిచిపోవడంతో విద్యార్థులు, చిరువ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధిక చార్జీలతో ప్రవేటు వాహనాల్లో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ప్రజలు వాపోతున్నారు.. గతంలో గోదావరిఖని నుంచి పెద్దపల్లి వరకు ప్రవేటు బస్సు సౌకర్యాం ఉండేది. రొంపికుంట మీదుగా పెద్దపల్లి వరకు బస్సు సౌకర్యం కల్పించాలని పలు మార్లు డిపో మేనేజర్‌కు వినతి పత్రం అందజేశారు. రూట్ సర్వే చేసిన ఆర్టీసీ ఆధికారులు గోదావరిఖని ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఎఫ్‌సీఐ, రొంపికుంట, పేరపల్లి గ్రామాల మీదుగా బస్సు నడిపించారు. నాగారం గ్రామంలో పోలీసులు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో నాగారం లింగాల మీదుగా ఆర్టీసీ బస్సును నడిపించాలని కోరగా ప్రతి గోదావరిఖని నుంచి వచ్చే బస్సును ఎల్కలపల్లి, రేపల్లెవాడ నాగారం, లింగాల, రొంపికుంట, పేరపల్లి గ్రామాల మీదుగా ప్రతి ,రోజు ఉదయం, సాయంత్రం రోజుకు రెండు ట్రిప్పుల బస్సు సౌకర్యాం కల్పించారు. బస్సు సౌకర్యంతో విద్యార్థులు, చిరు వ్యాపారులకు సైతం ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకున్నారు. పలు కారణాలతో గత నెల రోజుల నుంచి ఆర్టీసీ బస్సును రద్దు చేయడంతో ఆయా గ్రామాల ప్రజలు, విద్యార్థులకు, చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రవేటు వాహనాలే దిక్కు.. ప్రస్తుతం ఆర్టీసీ బస్సు సౌకర్యం రద్దు కావడంతో విద్యార్థులు, ప్రజలు గోదావరిఖని, పెద్దపల్లి పట్టణాలకు వెళ్లాలంటే వారికి ప్రవేటు వాహనాల్లోను ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. భద్రత లేని ప్రవేటు వాహనాల్లో అధిక చార్జీలతో ప్రయాణం చేయాల్సి వస్తుందని ఆవేదన చెందున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని పునర్థిరించాలని విద్యార్థులు, ప్రజలు కోరతున్నారు.గోదావరిఖని నుంచి పెద్దపల్లి వరకు నడిచే బస్సు నెల రోజుల నుంచి బందు కావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బస్సు రాకపోవడంతో ప్రజలు కాలినడకన ప్రధాన రహదారి వరకు నడిచి వెళ్లీ అక్కడి నుంచి ఆటోల్లో ప్రయాణం చేస్తున్నారు. -
మహనేతల మంత్రపురి
మంథని.. మంత్రపురిగా పిలుచుకున్న తూర్పు ప్రాంతం. ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. గోదావరి పరవళ్లు.. త్రివేణి సంగమ అందాలు... ముక్తీశ్వరుడి దీవెనలు మంథని వాసుల సొంతం.మహామహులు ఏలిన నియోజకవర్గం. ఇక్కడి ప్రజలు ఆదరించిన నేతలు ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారు. అంతటి పేరున్న మంథని కల్లోల ప్రాంతంగా కూడా ఉంది. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న తూర్పుప్రాంతం ఎన్నికల సమయంలో సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించారు. తెలంగాణలోనే విస్తీర్ణంలో అతిపెద్ద నియోజకవర్గంగా మంథనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 1952 నుంచి 2014 వరకు ఈ ప్రాంతాన్ని కేవలం ఏడుగురు ఎమ్మెల్యేలే పాలించారు. ఒకరికి నాలుగుసార్లు పట్టం కట్టగా.. ఇద్దరు హ్యాట్రిక్ సాధించారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఏళ్లకాలం పాటు మంథనిని పరిపాలించడం కొసమెరుపు. – మంథని మంథని భౌగోళిక చరిత్ర... మంథని 1952లో ఏర్పడింది. మొదటి నుంచి జనరల్ నియోజకవర్గంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 13సార్లు ఎన్నికలు జరిగాయి. ఏడు మండలాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. విస్తీర్ణంలో తెలంగాణలోనే అతిపెద్ద నియోజకవర్గంగా 180కిలోమీటర్ల మేర ఉంది. జిల్లాల పునర్విభజన తరువాత నియోజకవర్గాన్ని రెండుగా చీల్చారు. పెద్దపల్లి జిల్లా పరిధిలో మంథని, కమాన్‌పూర్, ముత్తారం, రామగిరి(కొత్త మండలం),పాలకుర్తి(2గ్రామాలు) ఉండగా... జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో కాటారం, మహాదేవపూర్, మహాముత్తారం, మల్హర్, పలిమెల(కొత్త మండలం)ను కలిపారు.ఈ ఎన్నికల్లో రెండు జిల్లాల పరిధిలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2లక్షల మంది ఓటర్లు... మంథని నియోజకవర్గంలో 2,1,870 మంది ఓటర్లు ఉన్నారు. 1,00,989 పురుషులు ఉన్నారు. 1,00,860 మంది మహిళలు ఉన్నారు. 21 మంది ఇతర ఓటర్లు నియోజకవర్గంలో ఈ సారి ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. నియోజకవర్గంలో ఎక్కువగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉండగా... తరువాత పద్మశాలీలు ఉన్నారు. కాపు ఓట్లు ఓటర్లు కూడా ఎక్కువగానే ఉన్నారు. అయినా ఇక్కడ బీసీ ఓటర్ల ఆధిపత్యమే కనిపిస్తుంది. నియోజకవర్గంలో 13 సార్లు ఎన్నికలు జరగగా... 12 పర్యాయాల్లో బ్రాహ్మణ, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 2014 మొదటిసారిగా బీసీ సామాజికవర్గం నుంచి పుట్ట మధు శాసనసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌కు కంచుకోట... 1952లో మంథని నియోజకవర్గం ఏర్పడింది. పదమూడు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ పదిసార్లు సత్తాచాటింది. 1952లో సోషలిస్టు పార్టీ అభ్యర్థి గులికోట శ్రీరాములు, 1994లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చందుపట్ల రాంరెడ్డిలు మాత్రమే కాంగ్రెస్ పార్టీని ఓడించి రికార్డు సాధించారు. మిగతా పది పర్యాయాల్లో మంథని ‘హస్త’గతం అయ్యింది. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ మంథని ఓటర్లు కాంగ్రెస్‌కే పట్టం కట్టారు. 1999 నుంచి 2009 వరకు మూడు పర్యాయాలు గెలుపొంది హ్యాట్రిక్ సాధించిన మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి పుట్టమధు ఓడించి కాంగ్రెస్ జోరుకు బ్రేకులు వేశారు. శ్రీపాద ‘హ్యాట్రిక్’... పీవీ. తరువాత 1978లో సి. నారాయణరెడ్డి కాంగ్రెస్(ఐ) నుంచి గెలుపొందారు. తరువాత కాటారం మండలం దన్వాడకు చెందిన దుద్దిళ్ల శ్రీపాదరావు కాంగ్రెస్ కంచుకోటను పదిలం చేశారు. ఎన్టీఆర్ ప్రభజనంలోనూ మంథని ప్రజలు శ్రీపాదరావుకే పట్టం కట్టారు. 1983 నుంచి 1994 వరకు ఎమ్మెల్యేగా పాలించి హ్యాట్రిక్ నమోదు చేశారు. 1991 నుంచి నాలుగేళ్లు శాసనసభాపతిగా పని చేశారు. 1999 ఏప్రిల్13న మహదేవ్పూర్ మండలం అన్నారం అటవీప్రాతం వద్ద శ్రీపాదరావును మావోయిస్టులు కాల్చి చంపారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచనలం సృష్టించింది. పీవీ... మంథని టు ఢిల్లీ... అపర చాణక్యుడు, ఆర్థిక సంస్కరణల సృష్టికర్తగా పేరుగాంచిన పీవీ. సర్సింహారావు స్వస్థలం ఉమ్మడి జిల్లాలోని భీమదేవపల్లి మండలం మండలం వంగర అయితే రాజకీయంగా ఓనమాలు దిద్దింది మాత్రం మంథనిలోనే అని చెప్పవచ్చు. 1957 నుంచి 1972వరకు నాలుగు పర్యాయాలు మంథని ఎమ్మెల్యేగా ఇక్కడి ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆయన రాష్ట్రమంత్రి వర్గంలో కీలక పదవుల్లో పని చేయడమే కాకుండా 1971లో పీవీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తరువాత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల నుంచి ఎంపీగా ఎన్నికై దేశ ప్రధానిగా సేవలందించారు. వారసుడొచ్చాడు... 1994లో చంద్రుపట్ల రాంరెడ్డి టీడీపీ నుంచి గెలుపొందారు. 1999లో శ్రీపాదరావు హత్య తరువాత అతడి వారసుడిగా శ్రీధర్‌బాబు రాజకీయాల్లోకి వచ్చారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి వరుసగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించి ఎదురు లేని నేతగా ఎదిగారు. దివంగత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి కేబినెట్లో ప్రభుత్వ విప్, ఉన్నతవిద్య, పౌరసరఫరాల శాఖ మంత్రిగా పని చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పుట్టమధు గెలుపొంది కాంగ్రెస్ కంచుకోటకు బీటలు వేశారు. ద్విముఖ పోరు.. ఈ ఎన్నికల్లో మంథని నియోజకవర్గంలో ద్విముఖపోరు ఉండనుందని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి పుట్టమధు, కాంగ్రెస్ నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బరిలో దిగనున్నారు. ఇద్దరి మధ్య హేమాహేమి పోరు జరగనుంది. ఇప్పటికే ఒకరికి మించి ఒకరు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అయితే పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఇమిడి ఉన్న మంథని నియోజకవర్గం ఎన్నికల విధులన్నీ పెద్దపల్లి జిల్లా అధికారులే నిర్వహించడం విశేషం. కేవలం భూపాలపల్లి నుంచి పోలీసు బలగాలను వినియోగించుకోనున్నట్లు సమాచారం. ద్విముఖ పోరు.. ఈ ఎన్నికల్లో మంథని నియోజకవర్గంలో ద్విముఖపోరు ఉండనుందని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి పుట్టమధు, కాంగ్రెస్ నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బరిలో దిగనున్నారు. ఇద్దరి మధ్య హేమాహేమి పోరు జరగనుంది. ఇప్పటికే ఒకరికి మించి ఒకరు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అయితే పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఇమిడి ఉన్న మంథని నియోజకవర్గం ఎన్నికల విధులన్నీ పెద్దపల్లి జిల్లా అధికారులే నిర్వహించడం విశేషం. కేవలం భూపాలపల్లి నుంచి పోలీసు బలగాలను వినియోగించుకోనున్నట్లు సమాచారం. కల్లోల ప్రాంతంగా... మంథని నియోజకవర్గం ఎక్కువశాతం అటవీవిస్తీర్ణం కలిగి ఉంటుంది. మొదటి నుంచి నక్సలైట్ల ప్రభావిత ప్రాంతంగా పేరుంది. మావోయిస్టు ప్రాబల్యం ఉధృతంగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో ఎన్నికలంటే.. అధికారులు.. పోలీసులు చాలా అప్రమత్తంగా ఉండేవారు. జీ నక్సల్స్ పహారా మధ్య ఎన్నికల నిర్వహణ జరిగింది. కేంద్ర పారామిలటరీ, సీఆర్పీఎఫ్ దళాలు రంగంలో దిగేవి. ఈవీఎంలు, బ్యాలెట్‌బాక్సులను హెలిక్యాప్టర్‌లో చేరవేసేవారు. ఎన్నికల విధులకు వెళ్లిన అధికారులు తిరిగి వచ్చే వరకు అందరిలోనూ ఉత్కంఠ ఉండేది. ఎన్నికలను బహిష్కరించాలనే నక్సల్స్ ఎన్నికల సిబ్బంది సైతం అడ్డుకున్న సందర్బాలు అనేకం. అయితే ప్రస్తుత పరిస్థితులు మారాయి. మావోయిస్టు ప్రాబల్యం తగ్గిపోయింది. కానీ పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌లో అన్నల ప్రభావం ఉండడంతో స్థానికంగా పోలీసులు చర్యలకు పూనుకుంటున్నారు. ఈ సారి నియోజకవర్గంలోని 64మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బలగాలను దింపేందుకు ఏర్పాటు చేశారు. రోడ్డు వచ్చింది.. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో గ్రామాల్లో రోడ్డు సౌకర్యం మొరుగుపడింది. తాడిచర్ల మానేరు నుంచి పెదతూండ్ల కిషన్‌రావుపల్లి వరకు డబుల్ రోడ్డు, చినతూండ్ల నుంచి శాత్రాజ్పల్లి వరకు లింక్ రోడ్డులను, బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టి గ్రామస్తులకు దూర భారాన్ని తగ్గించింది. ప్రజల చిరకాలవాంచ అయిన ఖమ్మరవపల్లి బిడ్జి మంజూరు చేసి పనులు ప్రారంభించింది. తాడిచర్ల నాగులమ్మ వరకు డబుల్ రోడ్డు నిర్మించారు. – రామిడి సురేశ్, తాడిచర్ల అభివృద్ధి జరిగింది.. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆసరా పించన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంటు అందిస్తున్నారు. రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా పోయింది. మహదేవ్పూర్– పలిమెల మండలాలకు బీటీరోడ్డు వేయడంతో పాటు వాగులపైన వంతెనలు నిర్మిస్తున్నారు. దీంతో ప్రతిపల్లెకు ఆర్టీసీ బస్సు వెళ్తోంది. – చాగర్ల రవీందర్, మహదేవపూర్ పథకాలు అమలు కాలేదు.. పథకాల అమలులో అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మారుమూల పల్లెల్లో పూర్తిస్థాయిలోచేరలేదు. దీంతో సమాన్యుడు ఇబ్బంది పడాల్సి వస్తోంది. తెలంగాణ సర్కారు అందించిన వివిధ రకాల పథకాలు సామాన్యుడికి చేరకపోవడంతో ఇబ్బందులు పడాల్సివస్తోంది. – రాజునాయక్, ప్రేమ్‌నగర్, మంథని -
విభజించి గెలిచారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజనకు ఆమోదముద్ర పడి సరిగ్గా దశాబ్దకాలం అయ్యింది. 2008లో పార్లమెంటు ఆమోదించగా.. 2009 ఎన్నికల సందర్భంగా మారిన నియోజకవర్గాల హద్దులతో పలువరి నే‘తలరాతలు’ కూడా మారాయి. నియోజవర్గాల రిజర్వేషన్లలో స్వల్ప మార్పులు జరగడంతో ఆయా కేటగిరికి చెందిన నేతలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. పాత 13 నియోజకవర్గాల్లో ఏడు పాతవి ఉండగా... మరో ఆరింటిని మార్పు చేసి కొత్తవి ఏర్పాటు చేశారు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయ సమీకరణాల్లో పెద్ద ఎత్తున మార్పులు.. చేర్పులకు తావిచ్చింది. కోరుట్ల: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజనకు ఆమోదముద్ర పడి సరిగ్గా పదేళ్లు అవుతోంది. మారిన సెగ్మెంట్ల హద్దులతో నేతల తలరాతలు మారిపోయాయి. కొంత మంది నేతలు కొత్తగా ఏర్పాటైన అసెంబ్లీ నియోజకవర్గాలకు మారిపోవాల్సి వచ్చింది. నియోజవర్గాల రిజర్వేషన్లలో స్వల్ప మార్పులు జరగడంతో ఆయా కేటగిరికి చెందిన నేతలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. విభజన ఫలితంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అంతకుముందున్న 13నియోజకవర్గాల్లో ఆరు సెగ్మెంట్లు కనుమరుగయ్యాయి. ఆ స్థానంలో మరో ఆరు కొత్తవి అవిర్భవించాయి. ఏడు పాతవే ఉన్నాయి. మొత్తం మీద నియోజకవర్గాల పునర్విభజన ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయ సమీకరణాల్లో పెద్ద ఎత్తున మార్పులు.. చేర్పులకు తావిచ్చింది. 2008లో విభజనకు ఆమోదం.. 2001 జనాభా లెక్కల ఆధారంగా అప్పటికి ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కోసం 2002లో రిటైర్డు సుప్రీం కోర్టు జడ్జి కుల్దీప్సింగ్ చైర్మన్‌గా కమిటీని ఏర్పాటు చేశారు. 2004–05 సంవత్సరాల్లో ఈ కమిటీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించింది. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల హద్దుల మార్పులు.. పరిపాలన సౌలభ్యత.. ప్రజల అనుకూలత వంటి అన్ని అంశాలపై కూలకుశంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. 2006లో హైదరాబాద్‌లో నియోజకవర్గాల పునర్విభజన కమిటీ రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించింది. అన్ని వర్గాల నుంచి వచ్చిన వినతులు..అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న కమిటీ 2007సంవత్సరంలో తాము రూపొందించిన నివేదికను పార్లమెంట్‌కు సమర్పించింది. కమిటీ సిపార్సులకు 2008 ఫిబ్రవరిలో రాష్ట్రపతి ప్రతిభా భారతి ఆమోద ముద్ర వేశారు. ఆ తరువాత వచ్చిన 2009అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త నియోజకవర్గాల వారీగా ఎన్నికలు నిర్వహించారు. ఆరు నియోజకర్గాలు కనుమరుగు నియోజకవర్గాల పునర్విభజనకు ఆమోదముద్ర పడిన నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో ఉన్న ఆరు సెగ్మెంట్లు కనుమరుగయ్యాయి. అసెంబ్లీ నియోజకవర్గాల హద్దులు మారడంతో ఆయా సెగ్మెంట్లలో చేరిన కొత్త మండలాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ జనాభా పాత్రిపదికన రిజర్వేషన్లు మారిపోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2009 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు కేవలం ఒక ఎస్సీ(మేడారం), ఒక ఎస్టీ(నేరెళ్ల)అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఉండగా ఆ తరువాత కొత్తగా మూడు ఎస్సీ నియోజకవర్గాలు చొప్పదండి, ధర్మపురి, మానకొండూరు ఏర్పాటయ్యాయి. విభజనలో మెట్పల్లి, మేడారం, నేరెళ్ల, కమలాపూర్, బుగ్గారం, ఇందుర్తి నియోజకవర్గాలు కనుమరుగయ్యాయి. వీటి స్థానంలో కోరుట్ల, రామగుండం, వేములవాడ, ధర్మపురి, మానకొండూర్, హుస్నాబాద్ నియోజకవర్గాలు ఏర్పాటయ్యాయి. మారిన నే‘తలరాతలు’ నియోజకవర్గాల పునర్విజనతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొందరి నేతల రాతలు తారుమారయ్యాయి. సెగ్మెంట్ల మార్పుతో పాటు గతంలో ఉన్న మండలాల్లోనూ మార్పులు జరగడంతో కొంత మంది నాయకులు తమ పట్టును కోల్పోగా.. మరికొంత మందికి కలిసొచ్చింది. బుగ్గారం, మెట్పల్లి నియోజకవర్గాలు కలిసిపోయి కోరుట్ల ఏర్పాటు కావడం మెట్పల్లి ప్రాంత నేతలకు కలిసొచ్చింది. బుగ్గారంకు చెందిన నాయకులు ఉనికి కోసం తిప్పలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కమలాపూర్, ఇందుర్తి, నేరెళ్ల ప్రాంతాలకు చెందిన నేతలు కొంతమంది పట్టు ఉన్న ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. గతంలో మెట్పల్లి నియోజకవర్గంలో ఉన్న మేడిపల్లి, కథలాపూర్ మండలాలు వేములవాడలో కలియడంతో ఆ ప్రాంతంలోని నేతలకు ఇప్పటికీ ఇక్కడ పూర్తిస్థాయిలో పట్టు దొరకడం లేదు. పెద్దపల్లి, మేడారం నియోజవర్గం పరిధిలోనూ కొంతమంది నేతలకు వలసల ఇబ్బంది తప్పలేదు. పాత మేడారం నియోజకవర్గంలో కీలక నేతలుగా ఉన్న కొంత మంది ధర్మపురి, చొప్పదండి సెగ్మెంట్లలో పాగా వేశారు. ఇలా సెగ్మెంట్ల పునర్విభజన ఉమ్మడి జిల్లాలోని నేతలపైన ప్రభావం చూపడమే కాకుండా రాజకీయ సమీకరణాల్లో ఎన్నో మార్పులకు తావిచ్చింది. 2009కు ముందు నియోజకవర్గాలు బుగ్గారం మెట్పల్లి జగిత్యాల మేడారం హుజూరాబాద్ కమలాపూర్ కరీంనగర్ మంథని నేరెల్ల(ఎస్టీ) సిరిసిల్ల ఇందుర్తి చొప్పదండి పెద్దపల్లి 2009తరువాత నియోజకవర్గాలు కరీంనగర్ మానకొండూర్(ఎస్సీ) హుజూరాబాద్ హుస్నాబాద్ చొప్పదండి(ఎస్సీ) వేములవాడ సిరిసిల్ల కోరుట్ల జగిత్యాల ధర్మపురి(ఎస్సీ) పెద్దపల్లి రామగుండం మంథని -
బైక్ అదుపుతప్పి యువకుడు..
సైదాపూర్(హుస్నాబాద్): మండలంలోని గుజ్జులపల్లి గ్రామానికి చెందిన గొర్రెలకాపరి నేరెల్ల రమేశ్(40) మంగళవారం అనుమానాస్పదంగా మృతి చెందినట్లు గ్రామస్తులు,పోలీసులు తెలిపారు. రమేశ్ గొడిశాలకు చెందిన నెల్లి రవి వద్ద గొర్రెల కాపరిగా పని చేస్తున్నాడు. సోమవారం గొర్రెలను పక్కగ్రామం నల్లరామయ్యపల్లి వద్ద మేపుతూ.. అక్కడే ఒక పశువుల పాకలో మంద పెట్టారు. ఇతడితో మరో వ్యక్తి ఉన్నాడు. మంగళవారం వేకువజామున మరో వ్యక్తి ఇంటికి వెళ్లాడు. ఉదయన్నే లేచిన రమేశ్ కాలకృత్యాలు తీర్చుకుని మళ్లీ నిద్రించాడు. గంట తర్వాత తోటి గొర్రెలకాపరి వచ్చిచూసేసరికి చనిపోయి ఉన్నాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం చేరవేశాడు. మృతుడి భార్య తిరుమల ఫిర్యాదుతో ఎస్సై నూతి శ్రీనివాస్ కేసు నమోదు చేశారు. బైక్ అదుపుతప్పి యువకుడు.. మేడిపెల్లి(వేములవాడ): మేడిపెల్లి మండలంలోని భీమారం గ్రామానికి చెందిన లింగాల తుక్కయ్య(26) మంగళవారం బైక్ అదుపు తప్పి మృతి చెందినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. తుక్కయ్య ఆరు సంవత్సరాల నుంచి సౌదీ వెళ్లివస్తున్నాడు. నెల రోజుల క్రితమే చుట్టిపై వచ్చాడు. మంగళవారం తన అత్తగారిల్లు అయిన జగిత్యాల మండలం గోపాల్‌రావుపేటకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గ్రామ శివారులో వెంకట్రావుపేట– కాచారం వెళ్లే బైపాస్ రోడ్డు మూలమలుపు వద్ద అదుపుతప్పి పడిపోయాడు. తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై సంఘటన స్థలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి నర్సయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. తుక్కయ్యకు భార్య సంధ్య, ఏడాది కూతురు ఉన్నారు. -
పేదోడి గుండెల్లో దేవుడిలా నిలిచిన వైఎస్సార్
మంథని: పేదవాడికి ఉపయోగపడే అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి గుండెల్లో దేవుడిగా నిలిచిన మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కొనియాడారు. వైఎస్సార్ 69 వ జయంతి సంందర్భంగా మంథనిలోని ఆయన నివాసంలో వైఎస్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడిగా గొప్ప నాయకత్వాన్ని ప్రదర్శించారని, దేశంలో గొప్పవ్యక్తిగా పేరుపొందారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పేద విద్యార్థులంతా నేడు ఉన్నత చదువులు చదువుతున్నారంటే ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం చలవే అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శాతావాహన యూనివర్శిటీ, శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్‌మానేరుతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఊతమిచ్చిన మహానాయకుడన్నారు. మంథని నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని గుర్తు చేశారు. మంథనికి జేఎన్టీయూ కళాశాల, డిగ్రీ కళాశాలలో సైన్స్ విభాగం, మహదేవపూర్‌లో డిగ్రీ, పాలిటెక్నిక్ కశాశాలలు, ఐటీఐ కళాశాలతో పాటు అనేక రకాల ప్రొత్సాహం అందించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, టూ టీఎంసీ నిర్మాణాలకు 2008 శ్రీకారం చుట్టి సాగునీటి సమస్యకు సహకరించారన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్, నాయకులు సెగ్గెం రాజేశ్, మంథని సత్యం, ఆజీంఖాన్, పోలు శివ, గోటికార్ కిషన్ తదితరులు పాల్గొన్నారు. -
ఫసల్ బీమా సద్వినియోగం చేసుకోవాలి
పెద్దపల్లిరూరల్: పంటలు సాగుచేసిన రైతులు వాటికి బీమా చేసుకుంటే ఆర్థికంగా నష్టపోయే అవకాశముండదని జిల్లా వ్యవసాయాధికారి తిరుమలప్రసాద్ అన్నారు. పెద్దపల్లి మండలం కాసులపల్లిలో శనివారం రైతులకు పంటల బీమా పథకాలపై అవగాహన కల్పించారు. అంతకు ముందు రైతుసమన్వయ సమితి జిల్లా సభ్యుడు ఇనుగాల తిరుపతిరెడ్డి, ఏడీఏ కృష్ణారెడ్డి తదితరులు పోస్టర్‌ను ఆవిష్కరించారు. బ్యాంకు ద్వారా పంటరుణాలు పొందని రైతులు తప్పనిసరిగా బీమా చేయించుకోవాలన్నారు. వాతావరణ ఆధారిత బీమా కింద పత్తి పంటకు ఈనెల 15 వరకు గడువు ఉందన్నారు. మొక్కజొన్న పంటకు ఈనెలాఖరు, వరిపంటకు ఆగస్టు 31 వరకు గడువు ఉందన్నారు. పూర్తి వివరాలకు వ్యవసాయ విస్తీర్ణాధికారులు, మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ తిరుపతిరెడ్డి, ఏవో ప్రకాశ్‌రావుతో పాటు రైతు సమన్వయసమితి సభ్యులు, రైతులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల్లో.. కాల్వశ్రీరాంపూర్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకం సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీటీసీ లంక సదయ్య, ఏవో కమలాకర్ రైతులను కోరారు. బీమాపై మండలంలోని వివిధ గ్రామాల్లో శనివారం వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ విస్తర్ణాధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు సమన్వయ సమితి గ్రామ శాఖ అధ్యక్షులు, రైతులు పాల్గొన్నారు. గర్రెపల్లిలో.. గర్రెపల్లి: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం రైతులకు ఆపద కాలంలో వరం లాంటిదని సుల్తానాబాద్ మండల వ్యవసాయాధికారి సురేందర్ తెలిపారు. గర్రెపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో అవగాహన సదస్సు నిర్వహించారు. అతి తక్కువ ప్రీమియంతో పంటలకు బీమా సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోందని అన్నారు. సర్పంచ్ పడాల అజయ్, ఈవోపీఆర్డీ చంద్రప్రకాష్, కార్యదర్శి రమేశ్‌బాబు, మల్లికార్జున్, భిక్షపతి, కనుకయ్య, జొన్నకోటి అంజయ్య, ముత్తునూరి రాజేశం పాల్గొన్నారు. ఎలిగేడు మండలంలో.. ఎలిగేడు: రైతులు ఫసల్ బీమా పథకం సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి డేవిడ్ రాజు అన్నారు. ఎలిగేడు మండలంలోని ధూళికట్ట, ర్యాకల్‌దేవుపల్లి, శివుపల్లి, బుర్హాన్మియాపేట, ఎలిగేడు గ్రామాల్లో శనివారం బీమాపై రైతులకు వివరించారు. ఏఈవోలు పద్మ, రమేశ్, అనిల్ పాల్గొన్నారు. -
ప్రియుడికోసం కొనసాగుతున్న ఆందోళన
చందుర్తి(వేములవాడ): ప్రేమించిన వాడితో పెళ్లి చేయాలని గత నెల 30న వాటర్‌ట్యాంకు ఎక్కి ఆందోళన చేసిన యువతి శుక్రవారం మండలంలోని మరిగడ్డ గ్రామపంచాయతీ వద్ద మౌనదీక్షకు దిగింది. బాధితురాలు మానుక సత్య వివరాల ప్రకారం.. మరిగడ్డకు చెందిన ఏరెడ్డి ప్రశాంత్‌రెడ్డి, సత్య ప్రేమించకున్నారు. పెళ్లి సమయానికి ప్రియుడు ముఖం చాటేశాడు. దీంతో జూన్ 21న పోలీసులను ఆశ్రయించింది. విషయాన్ని పోలీసులు కాలయాపన చేస్తున్నారని అదేనెల 26న ఠాణాలోనే నిద్రమాత్రలు మింగింది. పోలీసులు నిర్ధిష్ట గడువు విధించి న్యాయం చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో జూన్30 ట్యాంకెక్కి ఆందోళన చేసింది. అదే సమయంలో ప్రియుడు ప్రశాంత్‌రెడ్డి పురుగుల మందు తాగగా.. విషయం తెలిసిన సత్య నిద్రమాత్రలు మింగింది. ఇద్దరినీ పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు తనకు ఎలాంటి న్యాయం చేయం లేదని శుక్రవారం మరిగడ్డకు వచ్చింది. గ్రామపంచాయతీ ఎదుట మౌన పోరాటానికి దిగింది. కాగా ప్రశాంత్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని రాగానే మాట్లాడతామని పోలీసులు సత్యకు సూచించారు. అయినా వినకుండా దీక్షకు పూనుకుంది. -
గ‘మ్మత్తు’గా..
కరీంనగర్‌క్రైం : బంగారు కలలతో కరీం‘నగరం’లో అడుగుపెడుతున్న యువత అడ్డదారులు తొక్కుతున్నారు. మత్తుపదార్థాలకు బానిసవుతున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడంతో సరదాగా మొదలై వ్యసనపరులుగా మారుతున్నారు. జల్సాలకు అలవాటుపడి గంజాయిని నగరాలకు తరలిస్తున్నారు. పోలీసులకు చిక్కడంతో ఉన్నతమైన భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. సరిహద్దు ప్రాంతాల నుంచి.. ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్ జిల్లాల సరిహద్దు ప్రాంతాలనుంచి గంజాయిని పట్టణాలను తీసుకొస్తున్నారు. జగిత్యాల, మంథని, సిరిసిల్ల, గోదావరిఖని, మంచిర్యాల డివిజన్లలో గంజాయి జోరుగా సాగవుతున్నట్లు సమాచారం. దీనిని కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, హుజురా బాద్, గోదావరిఖని డివిజన్లలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. అక్కడ వాటిని చిన్నచిన్న పొట్లాలుగా మార్చి అమ్ముతున్నారు. హుక్కాకు అలవాటు పడిన వారుసైతం గంజాయికి ఆకర్షితులవుతున్నారు. గంజాయితో సిగరేట్లు తయారు చేసి పలు దుకాణాల్లో కోడ్ పేర్లతో విక్రయిస్తున్నట్లు తెలిసింది. నగరంలో విస్తరిస్తున్న గంజాయి కరీంనగర్ నగరంలోని పలు ప్రాంతాల్లో గంజాయి విచ్చలవిడిగా విస్తరిస్తున్నట్లు సమాచారం. తిరుమలనగర్, శేషామహల్, కమాన్ ప్రాంతం, హౌసింగ్‌బోర్డు కాలనీ, అంబేద్కర్‌స్టేడియం, డ్యాం పరిసరాల్లో, బైపాస్ రోడ్డుల్లో కొందరు కొందరు ముఠాగా ఏర్పడి ప్యాకెట్లుగా మార్చి గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం. వీరికి విద్యార్థులు చిక్కుకుంటున్నారని తెలిసింది. ఈ మధ్య ఓ విద్యార్థి తరచు అనారోగ్యానికి గురి కావడంతో వైద్యపరీక్షలు చేయగా గంజాయికి అలవాటు పడినట్లు తెలిసింది. ఇతడి మిత్రులు సుమారు 20 మందికి గంజాయి అలవాటు ఉందని సదరు విద్యార్థి తెలపడంతో తల్లిదండ్రులు అవాక్కయ్యారు. గంజాయి అమ్మకం దారులు 100 గ్రాముల ప్యాకెట్‌ను రూ. 5000కు విక్రయిస్తున్నట్లు సమచారం. ఇలా నిత్యం రూ. 50వేల వరకు వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది. టాస్క్‌ఫోర్స్ దాడులు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసిన నాటి నుంచి మత్తు పదార్థాల అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతోంది. సుమారు 250 మంది విద్యార్ధులు గంజాయికి అలవాటు పడ్డారని గుర్తించి వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. తాజాగా వారంక్రితం 8, 9వ తరగతి విద్యార్ధులు కూడా గంజాయికి అలవాటు పడ్డారని గుర్తించారు. వీరికి వెంటనే కౌన్సెలింగ్ నిర్వహించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. మొదట గంజాయికి అలవాటు పడి అమ్మకందారుడిగా అవతామెత్తిన ఇంటర్ విద్యార్థిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఒక పక్క టాస్క్ఫొర్స్ దాడులు చేస్తుండడంతో కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లి గంజాయి సేవిస్తున్నారని సమాచారం. దీనిపై దృష్టి సారించాల్సిన అవసరముంది. డ్రగ్స్ కూడా... జిల్లాలో డ్రగ్స్ మూలాలు బయటపడడం ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. నగరంలో 2012 ఆగస్టు 2న కొకైన్ సరఫరా చేస్తూ ముగ్గురు విద్యార్థులు దొరికిన సంఘటన తెలిసిందె. భాగ్యనగర్‌కు చెందిన పల్లె ప్రశాంత్(20), జ్యోతినగర్‌కు చెందిన న్యాలకొండ దీక్షిత్(19), పెద్ది నవీన్(17) అనే విద్యార్థులు 2 గ్రా. కొకైన్‌తో పట్టుబడ్డారు. రాష్ట్ర రాజధానిలో పోలీసుల నిఘా పెరగడంతో కరీంనగర్ కేంద్రంగా అమ్మకాలు చేసేందుకు డ్రగ్స్మాఫియా ప్రణాళికలు సిద్ధం చేసిందని సమాచారం. ఈ మధ్యకాలంలో హైదారాబాద్‌లో డ్రగ్స్ ముఠాలను ఎక్సైజ్ ఎన్‌ఫొర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్న వారిలో కొందరు కరీంనగర్‌కు చెందిన వారు కూడా ఉన్నారని తెలిసింది. ప్రకటనకే పరిమితమైన అవగాహన గతంలో డ్రగ్స్ ఆనవాల్లు బయటపడినప్పుడు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్న పలువురి వ్యాఖ్యలు ప్రకటనకే పరిమతమయ్యాయి. కాలేజీల్లో పెడదోవ పడుతున్న వారికి కౌన్సెలింగ్ నిర్వహిం చాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కొన్ని లక్షణాలు... వీటికి అలవాటు పడిన వారు నరాల బలహీనత, మెదడు మొద్దుబారడం, ఇతర వ్యవస్థలు నియంత్రణలో ఉండకపోవడం, శరీరం తేలికపడినట్లు అయి కొద్ది సమయం వరకూ తెలియని కొత్తశక్తి వచ్చినట్లు అవుతుంది. మొదట నాడి వ్యవస్థ, మెదడు, కండరాల వ్యవస్థలపై ప్రభావం చూపి తర్వాత మనిషి తన ఆధీనం కోల్పోయి వెలుగును చూడలేడు, అధిక శబ్ధాలను వినలేడు. తరచూ మత్తు పదార్థాలు తీసుకునేందు కు ప్రయత్నిస్తారు. ఎక్కువగా ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు, ఎవరితో సరిగా మాట్లాడడు తనకు కావాల్సిన డ్రగ్స్, గంజాయి లభించకపోతే సైకోలాగా తయారువుతా రు. ఇంట్లోవారు లేదా మిత్రులు వీరిని గమనిస్తే చాలా తేడాలు కనిపిస్తాయి. వెంటనే వైద్యం సహాయం అందిస్తే త్వరగా బయటపడే అవకాశాలుంటాయి సీపీ కమలాసన్‌రెడ్డి గంజాయి అమ్మకాలు చేసే వారిపై నిరంతరం నిఘా కొనసాగుతోంది. అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. గతంలో పట్టుబడ్డ వారికి వారి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చాం. మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రప్రభావం, నష్టాలపై అవగాహక సదస్సులు ఏర్పాటు చేస్తాం. -
163 పాడిగేదెలకు పునర్జీవనం
సిరిసిల్ల : అదో మారుమూల పల్లె. జిల్లా సరిహద్దులోని అటవీ గ్రామం. వ్యవసాయ ఆధారమైన ఆ పల్లెకు పాడి పరిశ్రమ ఓ ఉపాధిమార్గం. వ్యవసాయ అనుబంధంగా పాలతో ఆ పల్లె ప్రజలు జీవనం సాగిస్తారు. అలాంటి ఊరిలో 178 బర్రెలు ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లి.. 15 బర్రెలు మరణించాయి. కళ్ల ముందే గేదెలు చనిపోతుండడంతో రైతుల గుండెలు అవిసిపోయాయి. కన్నీరు మున్నీరుగా విలపించారు. మహిళా రైతులు గుండెలు బాదుకుంటూ.. రోధిస్తున్నారు. ఆ గ్రామస్తులు సెల్ఫోన్లో బర్రెల ఫొటోలు కలెక్టర్ కృష్ణభాస్కర్, జేసీ యాస్మిన్‌బాషా, పశువైద్యులకు పంపించారు. అంతే జిల్లా నలుమూలన ఉన్న పశువుల డాక్టర్లు మరిమడ్ల బాట పట్టారు. ఉన్న పళంగా అందుబాటులో ఉన్న మందులను, ప్రైవేటుగా అత్యవసరమైన మందులను కొనుగోలు చేసి మూడు అంబులెన్స్‌లు మరిమడ్ల చేరాయి. ఐదుగంటల పాటు శ్రమించారు. 163 బర్రెలను బతింకించారు. వంద మంది రైతులకు దీర్ఘకాలిక మేలు చేశారు. పాడికి ప్రాణం పోశారు. ఏం జరిగిందంటే.. మరిమడ్లలో గేదెలను ఒకరిద్దరు కాపరులు కాస్తుంటారు. బర్రెలన్నీ ఎప్పటిలాగే సమీప అడవుల్లోకి మేతకు వెళ్లాయి. పక్కనే లూటీ అయిన పొలాలున్నాయి. ఎర్రజొన్న పంటను కోశారు. పక్షంరోజుల కిందట కురిసిన అకాల వర్షాలకు జొన్న కొయ్యలు(మోడులు) చిగురించాయి. చిగురించిన లేత జొన్న ఆకులను బర్రెలు మేశాయి. ఎక్కువగా లేత ఆకులు తినడంతో నాము వచ్చింది. దీంతో బర్రెలన్నీ సొమ్మ సిల్లాయి. అందులో 13 మరణించాయి. వెంటనే గ్రామస్తులు స్పందించి జిల్లా యంత్రాంగానికి సమాచారం ఇవ్వడంతో సకాలంలో పశువైద్యులు చేరుకుని వైద్యం చేశారు. చికిత్స పొందుతుండగానే మరో రెండు బర్రెలు మరణించాయి. ఎనిమిది కొన ఊపిరితో ఉండగా.. సెలైన్లు ఎక్కించి బతికించారు. జేసీ పర్యవేక్షణలో వైద్య సేవలు.. జాయింట్ కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా పర్యవేక్షణలో మరిమడ్లలో పశువైద్య శిబిరం సాగింది. యుద్ధ ప్రాతిపదికన సిబ్బంది కదిలివెళ్లారు. ఐదురుగు డాక్టర్లు అంజిరెడ్డి, ప్రశాంత్, కార్తీక, సాయిమాధవి, చందన, 14 మంది పారామెడికల్ సిబ్బంది, 1962 అంబులెన్స్ సిబ్బంది, మరోవైపు కరీంనగర్ డెయిరీ డాక్టర్లు, సిబ్బంది, మందులతో అక్కడికి చేరుకున్నారు. వైద్యం అందుతున్న తీరుపై జేసీ యాస్మిన్‌బాషా సిరిసిల్ల నుంచి ఫోన్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేశారు. మొత్తంగా జిల్లా పశువైద్యుల సమష్టి కృషితో 163 బర్రెలకు ఊపిరి పోశారు. పశువైద్యుల సేవలను వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు శుక్రవారం అభినందించారు. వైద్యులు సకాలంలో రాకుంటే మరిన్ని చనిపోయేవని గ్రామస్తులు ఎమ్మెల్యేకు చెప్పడం కొసమెరుపు. అందరూ టీం వర్క్ చేశారు మా డాక్టర్లు అందరూ మరిమడ్లలో టీం వర్క్ చేశారు. ఎవరికి వారు బర్రెలను రక్షించే పనిలో నిమగ్నమయ్యారు. లేత జొన్న ఎక్కువగా మేయడంతో గేదెలు అస్వస్థతకు గురయ్యాయి. రైతులు ఇంకా ముందుగా గుర్తిస్తే నష్టం జరిగేది కాదు. మేమంతా బాధ్యతగా ఎవరికి వారు పని చేయడం కొత్త అనుభూతిని ఇచ్చింది. – డాక్టర్ కె .కొమురయ్య, అసిస్టెంట్ డైరెక్టర్ -
దసరాలోగా ‘డబుల్ బెడ్రూం’
సాక్షి,హుజూరాబాద్: దసరా పండగ లోగా డబుల్ బెడ్రూం పనులను పూర్తి చేయాలని, నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచాలని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పట్టణంలోని మోడల్ చెరువు వద్ద మినీ ట్యాంక్‌బండ్, డబుల్ బెడ్రూం పనులను సోమవారం మంత్రి పరిశీలించారు. జూన్ లోపు ట్యాంక్‌బండ్ పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, ట్యాంక్ బండ్ చుట్టూ 4 ప్రాంతాల్లో పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సారెస్పీ కెనాల్ సమీపంలోని 10 ఎకరాల ప్రభుత్వ భూమిని పార్కుగా చేయాలని అధికారులను ఆదేశించారు. వాకింగ్ ట్రాక్‌ను 30 మీటర్లు వెడల్పుగా చేయాలని సూచించారు. ట్యాంక్‌బండ్ సుందరీకరణ పనులకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీ అధికారులను ఆదేశించారు. గణేశ్‌నగర్‌లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల పనులను పరిశీలించారు. నగర పంచాయతీ చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్, మార్కెట్ చైర్మన్ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, సీఈ శ్యాంసుందర్, ఎస్ఈ వెంకటకృష్ణ, ఈఈ శ్రీనివాస్‌రావు గుప్తా, డీఈ శ్రీనివాసులు, ఏఈ సంజీవ, ఆర్అండ్బీ డీఈ కృష్ణారెడ్డి, ఏఈ రాజునాయక్, టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాస్, మండల, పట్టణాధ్యక్షులు కొంరారెడ్డి, శ్రీనివాస్, నాయకులు రమేశ్‌గౌడ్, శ్రీనివాస్, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, పంజాల రాంశంకర్‌గౌడ్, పోతుల సంజీవ్, ముక్క రమేశ్, కన్నెబోయిన శ్రీనివాస్, మారపల్లి సుశీల, ఇమ్రాన్, బాలరాజు పాల్గొన్నారు. మానవ కల్యాణ వేదికగా నాయిని చెరువు జమ్మికుంట(హుజూరాబాద్): దర్గంధానికి కేంద్రమైన నాయిని చెరువును మానవ కల్యాణానికి వేదికగా మారుస్తానని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. జమ్మికుంట పట్టణంలోని నాయిని చెరువు మినీ ట్యాంక్‌బాండ్ పనులను పర్యవేక్షించారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. విలేకరులతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని నక్లెస్ రోడ్డును తలపించేలా జమ్మికుంట నాయిని చెరువు రూపురేఖలు మారుస్తానని అన్నారు. నగర పంచాయతీ చైర్మన్ పోడేటి రామస్వామి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పింగిళి రమేశ్, వైస్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, తహసీల్దార్ బావ్‌సింగ్, పోనగంటి మల్లయ్య పాల్గొన్నారు. -
యువతి ఆత్మహత్య
రామగుండం: అంతర్గాం మండల పరిధి లోని గోలివాడ గ్రామానికి చెందిన యువతి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంది. అంతర్గాం ఎస్సై శీలం ప్రమోద్‌రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ధర్ని కిషన్ కూతురు మమత(20)కు ఇష్టం లేని పెళ్లి సంబంధం కుదిర్చారని బుధవారం మనస్తాపంతో ఇంట్లో పురుగుల మందు తాగింది. స్థానికులు గమనించి ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
నాయకత్వ లక్షణాలు తప్పనిసరి
సప్తగిరికాలనీ(కరీంనగర్): యువత నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలని జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి జి.అశోక్‌కుమార్ అన్నారు. నెహ్రు యువ కేంద్ర కార్యాలయంలో మూడు రోజులపాటు నిర్వహించే ‘యూత్ అండర్షిప్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్’ కార్యక్రమ ప్రారంభోత్సవంలో గురువారం స్వామి వివేకానంద చిత్రపటానికి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రత్యేక ఆహ్వానితుడు కె.మురళి మాట్లాడుతూ యువత బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుందని అన్నారు. కుటుంబ సంబంధాలపై వివరించారు. ఎన్‌వైకే సహాయకుడు బి.రవీందర్, నాయకులు మురళీకృష్ణ, కళింగ శేఖర్, కిరణ్‌కుమార్, కోండ రవి, సత్తినేని శ్రీనివాస్, బందారపు అజయ్, మంజులత, కాసిపాక రాజేశ్, వోడ్నాల రాజు, ముత్యాల రమేశ్, ఎన్‌వైకే వలంటీర్లు,, వివిధ యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు -
అవకాశాలు అందిపుచ్చుకోవాలి
జమ్మికుంటరూరల్(హుజూరాబాద్): యువత సంక్షేమం కోసం ప్రభుత్వం జాబ్‌మేళా కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారిలో చైతన్యం నింపుతోందని, మేళాల్లో లభించే ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని డీఆర్డీవో వెంకటేశ్వర్రావు అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(టీ సెర్ప్) ఆధ్వర్యంలో గురువారం జాబ్‌మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత పలు రకాల శిక్షణలు పొంది వారి కాళ్లపై వారు నిలబడేలా ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులకు భారం కావద్దని, ఎంచుకున్న రంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పేర్కొన్నారు. హెటోరో డ్రగ్స్, జీ4ఎస్, అపోలో ఫార్మసీ, ఇంటలెనెట్ గ్లోబల్ సర్వీస్, రిలయన్స్ ఫౌండేషన్, సుభగృహ ప్రాజెక్టు, బిగ్ బాస్కెట్, వరుణ్ మోటార్స్, నవత రోడ్ ట్రాన్స్‌పోర్టు, టాటా సర్వీస్ ప్రైవేటు సంస్థలకు ఇంటర్వ్యూ లు నిర్వహించారు. జమ్మికుంట, హుజూరాబాద్, వీణవంక, ఇల్లందకుంట మండలాల నుంచి 550 మంది యువతీయువకులు హాజరయ్యారు. 240 మంది ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగం, 250 మంది వివిధ రంగాల్లో శిక్షణకు ఎంపికయ్యారు. ఎంపీపీ గంగారపు లత, నగర పంచాయతీ చైర్మన్ పోడేటి రామస్వామి, ఆర్థిక మంత్రి ఓఎస్డీ ప్రసాద్, ఐకేపీ ఏరియా కోఆర్డినేటర్ నిర్మల, ఎంపీడీవో రమేశ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు యుగేందర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు లింగారావు, కౌన్సిలర్ శీలం శ్రీనివాస్, ఏపీఎంలు రమాదేవి, శ్రీనివాస్, తిరుపతి, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. -
మార్చిలో భగీరథ
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : జిల్లాలోని అన్ని గ్రామాలకుమార్చి మొదటివారంలో మిషన్ భగీరథ నీరు అందిస్తామని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. దసరాలోగా రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం పూర్తిచేయడం లక్ష్యంగా అధికారులు పనిచేయాలన్నారు. మార్చి 11న పండగ వాతావరణంలా పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో మిషన్ భగీరథ, డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణ ప్రగతి, భూరికార్డుల శుద్ధీకరణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ భగీరథపై ప్రతి 15రోజులకోసారి సమీక్షిస్తున్నారని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో జనవరి 31లోగా అన్ని గ్రామాలకు బల్క్‌వాటర్ సరఫరా చేయాలని నిర్ణయించామని, ఈ మేరకు ఎందుకు గ్రామాలకు నీరు సరఫరా చేయడం లేదని మంత్రి మిషన్ భగీరథ ఇంజినీర్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో ఇంకా 160 కిలోమీటర్ల పైపులైన్ వేయాల్సి ఉందని, ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలని మంత్రి ఎస్ఈ అమరేంద్రను ప్రశ్నించారు. పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, మిషన్లను ఏర్పాటు చేసి 24 గంటలు పనులు చేయించాలని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయించాలని ఆదేశించారు. ఏజెన్సీలు పనులు వేగవంతంగా చేయకుంటే తమకు తెలపాలని, వారిపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని అన్నారు. నియోజకవర్గస్థాయిలో ఎమ్మెల్యేలు సంబంధిత డీఈలు, ఏజెన్సీలతో సమీక్షించాలని ఆదేశించారు. 15రోజులకోసారి పనులను సమీక్షించాలని, వారంవారం పర్యవేక్షించాలని కలెక్టర్‌కు సూచించారు. పనుల్లో నాణ్యతప్రమాణాలు పాటించాలని ఏజెన్సీలను ఆదేశించారు. దసరాలోపు ‘డబుల్’ పూర్తి చేయాలి జిల్లాకు మంజూరైన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలన్నింటిని దసరా పండుగ లోపు పూర్తి చేయాలని మంత్రి సూచించారు. జిల్లాకు 6,454 ఇళ్లకు మంజూరువచ్చిందన్నారు. ఒక గ్రామంలో ఒకేచోట కాకుండా భూమి లభ్యత ప్రకారం కాలనీలవారీగా 5 నుంచి10 ఇళ్లను మంజూరు చేయాలని అదేశించారు. ఎమ్మెల్యేలు నెలకోమారు పనుల ప్రగతిని సమీక్షించాలన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన సిమెంట్, ఐరన్ తక్కువ ధరకు ఇప్పించే ఏర్పాట్లు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పండుగ వాతావరణంలో పాస్‌పుస్తకాల పంపిణీ మార్చి 11న రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీకి తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆర్డీవోలు, తహసీల్దార్లను ఆదేశించారు. పట్టాదారు పాస్‌పుస్తకాలలో తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలన్నారు. జిల్లాలో వివిధ పాఠశాలలు, కళాశాలలకు మంజూరైన ప్రహరీలు, టాయిలెట్ల మరమ్మతు, అదనపు తరగతి గదుల భవన నిర్మాణాలను పూర్తి చేయాలని ఈఈ షఫీమియాను ఆదేశించారు. భవన నిర్మాణాలకు ఏమైనా భూసమస్య ఉంటే సంబంధిత తహసీల్దార్ పరిష్కరించి, హద్దులు నిర్ణయించాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, రాష్ట్ర సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మ ణ్‌రావు, చొప్పదండి, హుస్నాబాద్ ఎమ్మెల్యేలు బొడిగే శోభ, వొడితెల సతీష్‌కుమార్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్ హుస్సేన్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రావీణ్య, మిషన్ భగీరథ ఎస్ఈ అమరేంద్ర, ఆర్అండ్బీ ఈఈ రాఘవాచారి, కరీంనగర్, హుజూరాబాద్ ఆర్డీవోలు రాజాగౌడ్, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు
కరీంనగర్‌క్రైం : కొన్నేళ్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అధిక ధరలున్న బియ్యాన్ని నమూనాగా చూపించి రేషన్‌బియ్యం అంటగడుతున్న ముఠాను సోమవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కరీంనగర్ హెడ్‌క్వార్టర్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో సీఐలు మాధవి, కిరణ్ విలేకరులతో వివరాలు తెలిపారు. ఖమ్మం జిల్లా తల్లడ మండలం అన్నారుగూడెంకు చెందిన సుంకర కనకరావు(42), సోదా వెంకటేశ్వర్లు(35), నర్సింహరావుపేటకు చెందిన గోపిశెట్టి నాగేశ్వర్రావు(35) ముఠాగా ఏర్పడ్డారు. ఆటోలో తిరుగుతూ రేషన్ బియ్యాన్ని సేకరిస్తున్నారు. వీటినే ఇంటివద్ద 25 కిలోల బస్తాల్లో నింపి ఊరూరా తిరుగుతూ సన్నబియ్యమని విక్రయిస్తున్నారు. తక్కువ ధరకే సన్నబియ్యం వస్తుండడంతో జనం కూడా కొనుగోలు చేస్తున్నారు. తీరా ఇంటికెళ్లి చూసేలోగానే వారు అక్కడి నుంచి పరారయ్యేవారు. ఇలా పలు జిల్లాల్లో పదేళ్లుగా మోసాలకు పాల్పడుతున్నారు. వీరిపై ఆయా ప్రాంతాల్లో కేసులు సైతం నమోదయ్యాయి. కరీంనగర్‌లోని తిరుమల్‌నగర్‌కు చెందిన అజ్మీరా రాజు గత నెల 31న ఆటోలో వచ్చిన వీరి నుంచి సన్నబియ్యం మూడు క్వింటాళ్లు కొనుగోలు చేశారు. ఇంటికెళ్లి చూడగా రేషన్‌బియ్యంగా గుర్తించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వన్‌టౌన్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. సోమవారం తిరుమల్‌నగర్‌కు వచ్చిన వారిని అదుపులోకి తీసుకుని.. వారి నుంచి రూ.10,500, ఆటో, బియ్యంబస్తాలు, మెషిన్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. -
జయజయ.. జనగణమన
కొత్తపల్లి(కరీంనగర్): విద్యార్థులు, యువకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, ప్రయాణికులు కొత్తపల్లి మండలకేంద్రంలోని బస్టాండ్‌లో కరీంనగర్–జగిత్యాల రహదారిపై సోమవారం నిత్య జాతీయ గీతాలాపనకు శ్రీకారం చుట్టారు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు గీతాలాపన చేపడతారు. మై విలేజ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ గీతాలాపన కార్యక్రమానికి కరీంనగర్ రూరల్ ఏసీపీ టి.ఉషారాణి, కరీంనగర్ ఎంపీపీ వాసాల రమేశ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి జాతీయ జెండా ఎగరేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ నిత్య గీతాలాపనతో సోదరభావం, ఐక్యత పెంపొందుతుందని చెప్పారు. ఎంపీపీ మాట్లాడుతూ జాతీయతను పెంపొందించేందుకు గీతాలాపన దోహదపడుతుందన్నారు. సర్పంచ్ వాసాల అ ంబికాదేవి, హైస్కూల్ హెచ్ఎం మంజుల, ఎస్సై పి.నాగరాజు, గ్రామస్తులు బండ గోపాల్‌రెడ్డి, గున్నాల రమేశ్, రుద్ర రాజు, స్వర్గం నర్సయ్య, ఫ క్రొద్దీన్, సాయిలు, మై విలేజ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు పెంటి నవీ న్, సభ్యులు శివగణేశ్, రామకృష్ణ, వెంకటేష్, శ్రీనాథ్, కొత్తపల్లి హైస్కూల్, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కార్డెన్ సర్చ్... 20 వాహనాలు స్వాధీనం
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరలో అదనపు డీసీపీ సంజీవకుమార్, రూరల్ ఏసీపీ ఉషారాణి ఆధ్వర్యంలో సోమవారం వేకువజామున కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన ధృవపత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలు, ఒక టవేరా వాహనం, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. రూ.లక్ష రూపాయల విలువచేసే గుట్కా ప్యాకెట్లను, మిఠాయి దుకాణంలో కల్తీ ఆయిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. -
ఈ–పరేషాన్!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రజలు ‘రేషన్’ సమస్యలతో సతమతం అవుతున్నారు. ఈనెల నుంచి ప్రభుత్వం రేషన్ సరుకుల పంపిణీకి ఈ–పాస్ (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్) విధానాన్ని అమలు చేసింది. ఇందులో భాగంగా ఆయా రేషన్ దుకాణాలకు ఈపాస్ మిషన్లను అందజేసింది. లబ్ధిదారులు ఈపాస్ మిషన్‌పై వేలిముద్ర వేస్తేనే సరుకులను అందజేస్తారు. సర్వర్ సమస్యతో మూడురోజులుగా ఈపాస్ మిషన్లు మొరాయిస్తుండటంతో లబ్ధిదారులు పండగపూట రేషన్ దుకాణాల చుట్టూ తిరుగుతూ అవస్థలు పడుతుండగా.. అటు డీలర్లు మొరాయిస్తున్న మిషన్లతో గడువులోగా సరుకులు పంపిణీ చేయక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సరుకుల పంపిణీలో ఆలస్యం అవుతోంది. సాక్షిప్రతినిధి, కరీంనగర్: పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం నెలనెలా పౌరసరఫరాల దుకాణాల ద్వారా రూపాయికే కిలో బియ్యాన్ని ఒక్కొక్కరికీ (కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి) ఆరు కిలోల చొప్పున పంపిణీ చేస్తోంది. బియ్యం పంపిణీ ఎంతగా పెరిగిందో.. అదేస్థాయిలో అక్రమాలకూ తావు ఏర్పడింది. రేషన్ దుకాణాలకు బియ్యం పూర్తిగా చేరకుండానే.. మిల్లర్లు, వ్యాపారుల దరి చేరుతున్నాయి. ఇలా ప్రతినెలా లారీల కొద్ది బియ్యం పక్కదారి పడుతున్నాయి. బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అయినా అక్రమాలను మాత్రం అడ్డుకోలేకపోయింది. చివరకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, కమిషనర్, ఐపీఎస్ అధికారి సీవీ.ఆనంద్ నియంత్రణపై దృష్టి సారించారు. హైదరాబాద్ నగరంలో ఈ–రేషన్ ప్రక్రియకు ఈ ఏడాది మార్చి నుంచి శ్రీకారం చుట్టి.. రేషన్ దుకాణాల్లో వేలిముద్రల (ఈ–పాస్) యంత్రాలను ఏర్పాటు చేశారు. తద్వారా రేషన్ సరుకుల్లో అక్రమాలను అరికట్టగలిగారు. ఈ ప్రక్రియ అక్కడ విజయవంతం కావడంతో ఇతర జిల్లాలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా అన్ని జిల్లాల్లో కసరత్తు ప్రారంభించింది. మొరాయిస్తున్న ఈ–పాస్ యంత్రాలు.. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికీ 48 శాతమే.. ఉమ్మడి జిల్లాల్లోని రేషన్ దుకాణాలలో బయోమెట్రిక్ యంత్రాలు, ఈపాస్ విధానాన్ని ప్రభుత్వం టెండర్ల ద్వారా ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు అన్ని దుకాణాలలో యంత్రాలను ఏర్పాటు చేస్తారు. డిసెంబర్ నుంచి యంత్రాలు వినియోగంలోకి తేవాలనుకున్నా... ఈనెలనుంచే అమలు చేస్తున్నారు. ఈ విధానం ద్వారా ఆహారభద్రత కార్డులోని కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు రేషన్ దుకాణానికి వచ్చి వేలిముద్ర వేస్తేనే రేషన్ సరుకులు ఇస్తారు. తద్వారా బోగస్ కార్డులను ఏరివేయవచ్చని, నెలనెలా బియ్యం తీసుకోని కార్డుదారుల బియ్యాన్ని డీలర్లు స్వాహా చేయకుండా అడ్డుకోవచ్చనేది ప్రభుత్వ ఆలోచన. దీనికితోడు నిజమైన కార్డుదారులకే సరుకులు అందుతాయని భావించారు. అయితే ఈ విధానంలో సాంకేతిక అంతరాయాలు కలుగుతున్నాయి. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో 16 మండలాల లెవెల్ స్టాక్ పాయింట్ల (ఎంఎల్ఎస్) నుంచి 1,880 రేషన్ దుకాణాల ద్వారా ప్రతినెలా 16,644 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇందులో 1,460 రేషన్ దుకాణాల్లో ఈ–పాస్ విధానం అమలవుతోంది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 94,1948 కార్డులు 27,73,996 యూనిట్లపై 16,643.976 టన్నుల బియ్యానికి గాను ఇప్పటివరకు 7,989.108 (48 శాతం) టన్నుల బియ్యం మాత్రమే పంపిణీ చేశారు. సర్వర్ సమస్యతో కొద్దిరోజులుగా ఈ–పాస్ మిషన్లు మొరాయిస్తుండటమే ఇందుకు కారణంగా అధికారులు చెప్తుండగా.. లబ్ధిదారులు పండగపూట రేషన్ దుకాణాల చుట్టూ తిరుగుతూ అవస్థలు పడుతున్నారు. -
సర్వే పేరుతో ఇంట్లోకి వచ్చి.!
కరీంనగర్: సర్వే చేస్తున్నామంటూ ఇంట్లోకి వచ్చిన ఓ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి కళ్లలో కారం కొట్టి ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసు లాక్కెళ్లింది. ఈ సంఘటన ముస్తాబాద్‌లో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న కస్తూరి వెంకటరత్నమ్మ(60) ఇంటికి ఈ రోజు మధ్యాహ్నం ఓ మహిళ సర్వే చేస్తున్నామంటూ వచ్చింది. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఫోన్ నెంబర్ వివరాలు తీసుకుంది. ఈ క్రమంలో వృద్ధురాలు ఒంటరిగా ఉంటోందని గమనించి ఆమె కళ్లలో కారం కొట్టి ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కెళ్లింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పెనుగులాట జరగడంతో కింద పడ్డ వెంకటరత్నమ్మ గట్టిగా కేకలు వేసింది. ఆమె అరుపులు విన్న పక్కింటి స్వరూప మహిళా దొంగను అడ్డుకోవడానికి యత్నించగా.. ఆమె పై దాడి చేసి అక్కడి నుంచి పరారైంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కట్నం కోసం కడతేర్చారు
నార్నూర్(ఆసిఫాబాద్) : మండలంలోని ఉమ్రి గ్రామంలో జాదవ్ మమత (వందనబాయి) (25)ను వరకట్నం కోసం వేధించి భర్త, అత్త మరో ఇద్దరితో కలిసి హత్య చేసిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఉట్నూర్ సీఐ జాదవ్ గణపతి తెలిపిన వివరాల ప్రకా రం.. బేల మండలం సాంగ్వి గ్రామ పం చా యతీ పరిధిలోని సైద్పూర్ శాసాతండాకు చె ందిన రాథోడ్ ప్రేందాస్, పూలబాయి దంపతు ల కూతురు మమతను ఉమ్రి గ్రామానికి చెం దిన జాదవ్ సుధామ్కు ఇచ్చి 2010 మే నెలలో పెళ్లి జరిపించారు. సుధామ్ వ్యవసాయం చేసు ్తండగా.. కొన్నాళ్లు కుటుంబంలో అందరూ కలిసిమెలసి ఉన్నారు. గతకొన్నేళ్లుగా అత్త కాశీ బాయి, భర్త అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పదిహేను రో జుల క్రితమే గ్రామపెద్దల సమక్షంలో పంచాయి తీ నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా దంపతులకు కౌన్సెలింగ్ ఇ చ్చారు. అయినా వారిలో మార్పు రాలేదు. ఇదే క్రమంలో గురువారం రాత్రి మమతను భర్త సుధామ్, అత్త కాశీబాయి అదే గ్రామానికి చెం దిన కిషన్, మానిక్రావులతో కలిసి పథకం ప్ర కారం ఇంట్లో నిద్రిస్తుండగా హత్య చేశారని సీఐ తెలిపారు. కత్తితో గొంతుకోసి, రోకలితో తలపై మోదారు. తీవ్ర రక్తస్రావం కావడంతో మమత అక్కడికక్కడే మృతి చెందింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, సీఐ, ఎస్ఐ తమ సిబ్బందితో వెంటనే సంç œుటన స్థలానికి చేరుకున్నారు. నలుగురు నింది తులను అదుపులోకి తీసుకున్నారు. ఆగ్రహంతో ఉన్న మృత్యురాలి బంధువులు మమతను దా రుణంగా హత్య చేసిన వారిని శిక్షించాలని డిమా ండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. సీఐ జాదవ్ గ ణపతి వారితో మాట్లాడి శాంతింపచేశారు. శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమి త ్తం ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు రెండేళ్ల కూతురు, ఆరునెలల కుమారు డున్నారు. ఆమె తండ్రి ప్రేందాస్ ఫిర్యాదు మే రకు కేసు దర్యాప్తు చేస్తుననట్లు సీఐ తెలిపారు. -
ఇండోర్ ‘స్మార్ట్’ టూర్
కరీంనగర్ కార్పొరేషన్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్‌సిటీల అభివృద్ధి పథకంలో ప్రథమ స్థానంలో నిలిచి మొదటి విడతలోనే స్మార్ట్ సిటీ హోదా దక్కించుకున్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగర సందర్శనకు ప్రజాప్రతినిధులు Ðð ళ్లనున్నారు. ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్, డెప్యూటీ మేయర్ గుగ్గిల్లపు రమేశ్, కమిషనర్ కష్ణభాస్కర్తో కూడిన బృందం శుక్రవారం బయలుదేరి వెళ్లనుంది. శని, ఆదివారాలలో అక్కడ పర్యటించి స్మార్ట్ సిటీ సాధన కోసం వారు చేపట్టిన డీపీఆర్‌ను పరిశీలించనున్నారు. అక్కడ జరుగుతున్న అభివద్ధిని పర్యవేక్షించనున్నారు. కరీంనగర్ స్మార్ట్‌సిటీల జాబితాలో చోటు సంపాదించుకున్నప్పటికీ డీపీఆర్ తయారీలో ఇప్పటికీ ఒక స్పష్టతరాలేదు. స్మార్ట్‌సిటీ జాబితాలో స్కోరుబోర్డును పెంచుకుని మూడో జాబితాలో చోటు దక్కించుకోవాలంటే ఇండోర్ అవలంబించిన విధానాలను అధ్యయనం చేయాల్సిన అవసరముఉంది. కాగా ఇండోర్ జిల్లా కలెక్టర్‌గా కరీంనగర్ జిల్లాకు చెందిన నరహరి ఉండడం.. ఇప్పటికే ఆయన పలుమార్లు వీరిని ఆహ్వానించారు. ఇండోర్ పర్యటన నగరం స్మార్ట్ హోదా దక్కించుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రజాప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.