నిర్ల‍క్ష్యానికి తప్పదు భారీ మూల్యం | Loss of negligence is a huge price | Sakshi
Sakshi News home page

నిర్ల‍క్ష్యానికి తప్పదు భారీ మూల్యం

Published Mon, Mar 4 2019 3:37 PM | Last Updated on Mon, Mar 4 2019 3:47 PM

Old Problems For New Sarpanchs - Sakshi

ఇల్లంతకుంట: ఐదేళ్ల పాటు కొనసాగే పంచాయతీ పాలకులపై పల్లె ప్రగతి ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం నిధులు కేటాయిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పించి గ్రామాల రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తామని కొత్త సర్పంచులు చెబుతున్నారు. కాని కొత్త పంచాయతీరాజ్‌ చట్టం నిబంధనలు కఠినతరంగా ఉండటంతో నిధులు, విధుల్లో ఏమాత్రం తేడా వచ్చిన, నిర్లక్ష్యం చేసినా సర్పంచ్‌తో పాటు పాలకవర్గానికి  ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలు కొత్త సర్పంచులకు స్వాగతం పలుకుతున్నాయి. ఏళ్లకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నీ కొత్త సర్పంచులు పరిష్కారం చేస్తారనే కొండంత ఆశతో గ్రామీణ ప్రజలు ఎదురుచూస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో నిధుల కొరత, కొత్త పంచాయతీరాజ్‌ చట్టంలో ఉన్న నిబంధనలు సర్పంచులకు ఐదేళ్ల పాలన సాగించాలంటే కత్తిమీద సాముల మారుతోంది.

గ్రామాల సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ.. 
2015 ఆగస్టు 17న తెలంగాణ ప్రభుత్వం గ్రామజ్యోతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో గ్రామాల సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రణాళిక తయారు చేసి సిద్ధంగా ఉంచారు. వాటి అమలుకు గ్రామస్థాయిలో వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రాధాన్యత క్రమం బట్టి గ్రామాల్లో పనులు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. కానీ నేటి వరకు గ్రామజ్యోతి అమలుకు  నోచుకోలేదు. కొత్త పంచాయతీల పాలనలోనైనా గ్రామజ్యోతి పథకాన్ని అమలు చేస్తే పల్లెల్లో ప్రగతి కాంతులు నిండే అవకాశం ఉంది. గతంలో సర్పంచులకు అధికారాలే తప్ప నిధులు, బాధ్యతలు ఆశించిన స్థాయిలో ఉండేవి కావు. 
 

సర్పంచులకు లక్ష్యాలు ఇలా..  
తెలంగాణ సర్కారు కొత్త పంచాయతీ చట్టం వచ్చిన తర్వాత అనే లక్ష్యాలను నిర్ధేశించారు. నిర్ధేశించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేకపోయినా, కేటాయించిన నిధులు నిబంధనల మేరకు సక్రమంగా ఖర్చు చేయలేకపోయినా సర్పంచ్‌ పదవి తొలగింపుతో పాటు పాలకవర్గాన్ని రద్దు చేసే అవకాశాన్ని కొత్త చట్టంలో పొందుపరిచారు. సర్పంచులకు అధికారాలతో పాటు బాధ్యతలు పెరిగాయి. సర్పంచులు, పాలకవర్గాలు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించేలా కట్టుదిట్టమైన నియమాలు రూపొందించారు. పాత చట్టం ప్రకారం ఉపసర్పంచ్‌పై నాలుగేళ్లకు పైగా అవిశ్వాసం ఉండగా ప్రస్తుతం రెండేళ్లకు కుదించారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురైనా కూడా పాలకవర్గం రద్దు చేసే పరిస్థితి ఉంది. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసినా కూడా రూ.500 జరిమానా విధించనున్నారు. 
 

గ్రామాల్లో ప్రధాన సమస్యలివి.. 
∙   కొత్త పంచాయతీల్లో కనిపించని వీధి దీపాలు 
∙   గ్రామాల్లో ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణాలు ఆయా పంచాయతీల్లో అసంపూర్తిగా నిలిచిపోయాయి. 
∙   ఇంకా ఇంటింటికి పూర్తి కాని మిషన్‌భగీరథ నల్లా కనెక్షన్లు 
∙   ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు, గ్రామాల్లో ఉప ఆరోగ్య కేంద్రాల నిర్వహణ, సమయపాలన పాటించేలా చూడడం. 
∙   పాత పంచాయతీల్లో శిథిలావస్థకు చేరిన భవనాలను తొలగించి కొత్త భవనాలు నిర్మించడం, కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో జీపీ భవనాల నిర్మాణాలు 
∙   గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి  
∙   ప్రతీ గ్రామంలో శ్మశానవాటిక నిర్మించాలి 
∙   డంపింగ్‌ యార్డులను నిర్మించాలి 
∙   గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేయాలి 

  

బాధ్యతలు పెరిగాయి 
కొత్త పంచాయతీ చట్టంతో సర్పంచులకు బాధ్యతలు పెరిగాయి. సర్పంచులు విధులు సక్రమంగా నిర్వర్తిస్తూ  నిధులను పారదర్శకంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా పాలకవర్గాలపై చర్యలు తప్పవు.   


– అమరేందర్‌రాజు, ఎంపీడీవో, ఇల్లంతకుంట  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement