సాక్షి, హైదరాబాద్ : గ్రామ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో కొన్ని సెక్షన్లను చేరుస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ శనివారం నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం 2018లో చెక్ పవర్‌కు సంబంధించిన సెక్షన్లను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఇందులో భాగంగా చట్టంలో 6(10), 34, 37(6), 43(10), 47(4), 70(4), 113(4), 114(2), 141 సెక్షన్లను నోటిఫై చేశారు. గ్రామపంచాయతీల చెక్ పవర్‌కు సంబంధించి నోటిఫికేషన్ జారీతో జాయింట్ చెక్‌పవర్‌పై ప్రభుత్వం స్పష్టతనిచ్చినట్టు అయ్యింది. సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ కల్పించడంతోపాటు, గ్రామ పంచాయతీల్లో ఆదాయ, వ్యయ సంబంధిత ఆడిటింగ్ బాధ్యతలు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు అప్పగించనున్నారు. ఈ అంశంతోపాటు గ్రామసభ నిర్వహణకు ఉండాల్సిన కోరం తదితర ఇతర అంశాలనూ పేర్కొంటూ ఉత్తర్వులిచ్చారు. సోమవారం (జూన్ 17) నుంచి కొత్త సెక్షన్లు అమల్లోకి రానున్నాయి. ఈ నోటిఫికేషన్‌ను సోమవారం నాటి గెజిట్‌లో ప్రచురించాలని వికాస్‌రాజ్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment