panchayat raj act
-
గ్రామ కంఠాల్లోని ఆస్తులకు మహర్దశ
బ్యాంకులో లోను తీసుకుని ఓ చిన్న సూపర్ మార్కెట్ ప్రారంభించాలని కలలుకంటున్న రామకోటేశ్వరరావు కల త్వరలో నేరవేరబోతోంది. బ్యాంకు లోను కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా తనఖా ఏం పెడతావ్ అంటూ బ్యాంకు వాళ్లు అడిగే ప్రశ్నకు జవాబు చెప్పలేక ఎప్పటికప్పుడు తన ఆశను చంపుకుంటూ వచ్చాడు. ఊళ్లో నాలుగు సెంట్ల స్థలంలో తల్లిదండ్రులు ఎప్పుడో కట్టిన దాదాపు రూ.20 లక్షలు విలువ చేసే ఇల్లు తప్ప అతనికి మరే ఆస్తిపాస్తుల్లేవు. ఆ ఇంటిని చూసి లోను ఇవ్వమని అడిగితే దస్తావేజులు తెమ్మమనేవారు. ఊళ్లో గ్రామకంఠం కింద ఉండే ఇళ్లకు ఎలాంటి దస్తావేజులు ఉండవని తెలిసి రామ కోటేశ్వరరావు ఆ ప్రయత్నాలు విరమించుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఇలాంటి ఆస్తులకూ ఆస్తి సర్టిఫికెటును మంజూరు చేయబోతుందని తెలిసి రామకోటేశ్వరరావు ఆనందానికి అవధుల్లేవు. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి దస్తావేజుల్లేని ఆస్తుల యజమానులకు ఇది గొప్ప ఊరట. వీరి కష్టాలకు తెరదించుతూ గ్రామకంఠాల పరిధిలోని ఆస్తులకు కొత్తగా యాజమాన్య హక్కు (ఆస్తి సర్టిఫికెట్లు)ను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేసేందుకు ఇటీవల సమావేశమైన కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. దీంతో ఇన్నాళ్లూ అవకాశం లేకుండాపోయిన క్రయవిక్రయాలను ఇప్పుడు అధికారికంగా ఎంతో ధీమాగా చేసుకోవచ్చు. పూర్వం ఎప్పుడో గ్రామ కంఠాలుగా వర్గీకరణ చేసిన ప్రాంతంలో ఇళ్లు, ఇతర ఖాళీ స్థలాలున్న వారికి ఇప్పటివరకు వాటిని ఉపయోగించుకోవడమే కానీ, మరే విధంగా అవి అక్కరకు రాని ఆస్తిగా తయారయ్యాయి. దీంతో అవి రూ.లక్షల విలువ చేసినా అవసరమైనప్పుడు వాటి ద్వారా ఒక్క రూపాయి కూడా రుణం పొందే అవకాశంలేదు. వాటిని అమ్మినా, కొన్నా అవన్నీ అనధికారికంగా జరిగే లావాదేవీలే. 90 లక్షల ఇళ్లు.. 30 లక్షల స్థలాలు రాష్ట్రంలో 17,950 రెవెన్యూ గ్రామాలున్నాయి. వీటిల్లో గ్రామ కంఠాల పరిధిలో ఇళ్లు, స్థలాలున్న వారికి రెవెన్యూ శాఖ యజమాన్య హక్కు ఇచ్చే విధానంలేదు. వీటికి సంబంధించి రెవెన్యూ లేదా పంచాయతీల వద్ద ఎలాంటి ప్రత్యేక రిజిస్టర్లు లేవు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి గ్రామ కంఠాల పరిధిలో 90 లక్షల ఇళ్లు, మరో 30 లక్షల సంఖ్యలో ఇతర ఖాళీ స్థలాలు ఉంటాయని పంచాయతీరాజ్ శాఖ అధికారుల అంచనా. వీటన్నింటి విలువను లెక్కిస్తే రూ.10 లక్షల కోట్లు ఉంటుందని అధికారుల అంచనా. చట్ట సవరణ తర్వాత ప్రతి ఆస్తికీ సర్టిఫికెట్ ఈ నేపథ్యంలో.. గ్రామ కంఠం పరిధిలో ప్రతి ఇల్లు, ఖాళీ స్థలానికి వేర్వేరుగా సంబంధిత యజమానులకు ఆస్తి సర్టిఫికెట్ల జారీకి వీలు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ చట్టానికి సవరణలు చేస్తోంది. అసెంబ్లీలో ఈ చట్ట సవరణకు ఆమోదం లభించాకే ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో అమలులోకి వస్తుందని అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత ప్రతి ఆస్తిని యజమాని పేరుతో రెవెన్యూ, గ్రామ పంచాయతీ రికార్డులలో నమోదు చేస్తారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు–భూ రక్ష పథకంలో గ్రామ కంఠంలో ఉండే ఆస్తులకూ డ్రోన్ల సహాయంతో సర్వే నిర్వహిస్తారు. ఒక్కొక్క దానికి ప్రత్యేక నెంబరును కేటాయించి ఆ మేరకు యజమానికి క్యూఆర్ కోడ్‌తో కూడిన ఆస్తి సర్టిఫికెట్‌ను జారీచేస్తారు. కాగా, రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టుగా కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామంలో ఈ సర్వే ప్రక్రియ పూర్తవగా.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఒకటి చొప్పున 51 గ్రామాలలో సర్వే కొనసాగుతోంది. ఇళ్ల విలువ పెరిగే అవకాశం ఇదిలా ఉంటే.. ఆస్తి సర్టిఫికెట్ జారీతో యజమానికి పూర్తి ఆర్థిక భరోసా లభించినట్లవుతుంది. ఆ ఆస్తిని తాకట్టు పెట్టి బ్యాంకు లోన్లు పొందే వీలుంటుంది. క్రయవిక్రయాలు లేదా ఆస్తి పంపకాలు సులభంగా జరుపుకోవచ్చు. ఇదే సమయంలో ఆ ఆస్తులకు ప్రస్తుతమున్న ధర కంటే భారీగా రేటు పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. -
ఇది కేవలం ఫార్మాలిటీ మాత్రమే: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ‘‘పంచాయతీరాజ్ చట్టసవరణ బిల్లుపై ఇంతకు ముందే సవివరంగా చర్చ జరిగింది. అసెంబ్లీలో చర్చ పూర్తయ్యాకే బిల్లును మండలికి పంపించారు. అక్కడ కొన్ని సవరణలతో ఆమోదం పొంది బిల్లు మళ్లీ శాసన సభకు వచ్చింది. ఈ బిల్లుపై ఇప్పటికే సుదీర్ఘ చర్చ జరిగినందున, మళ్లీ చర్చ జరపాలని ప్రతిపక్షం కోరడం సరైంది కాదు’’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టీడీపీ సభ్యులకు హితవు పలికారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా పంచాయతీరాజ్ చట్టసవరణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసన సభ సోమవారం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో చర్చ జరగకుండానే బిల్లును ఎలా ఆమోదిస్తారంటూ ప్రతిపక్ష టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. (చదవండి: ఏపీ అసెంబ్లీ, మండలి: లైవ్ అప్డేట్స్) ఈ క్రమంలో సీఎం జగన్ జోక్యం చేసుకుని ఈ మేరకు సభకు వివరణ ఇచ్చారు. ‘ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి ఉంది. పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించి గతంలోనే సభలో చర్చ జరిగింది. ఇంతకు ముందే ఈ బిల్లు తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఆమోదం పొందిన తర్వాత మండలికి పంపిస్తే, వారు దాన్ని వెనక్కి పంపించారు. ఆ తర్వాత మళ్లీ వారు నో చెప్పడానికి వీలు లేదు. ఇక్కడ 151 మంది శాసనసభ్యులు ఉన్న ఇదే సభలో ప్రభుత్వం గతంలో ఏమనుకుందో, దాన్నే తిరిగి ఆమోదిస్తున్నాం. ఇది కేవలం ఫార్మాలిటీ మాత్రమే. అయితే ఇది కొత్తగా పెడుతున్నట్లు, వారికి ఏమీ తెలియనట్లు విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా బిల్లు పెడతున్నట్లు అభ్యంతరం చెబుతున్నారు. ఎన్నికల్లో ఎవరైనా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా డబ్బు ఖర్చు పెడితే, ఆ తర్వాత వారిపై చర్య తీసుకునే విధంగా వినూత్నంగా ఈ చట్టం చేస్తున్నాం. ఎన్నికల్లో ఎవరూ డబ్బు ఖర్చు పెట్టకుండా చేయడం కోసమే ఈ చట్ట సవరణ. అదే విధంగా ఏ రకంగా ఎన్నికల ప్రక్రియ ఆలస్యం లేకుండా త్వరితగతిన పూర్తయ్యేలా మార్పులు చేస్తున్నాం. దీనిపై గతంలోనే విస్తృత చర్చ జరిగింది. ఇక్కడ ఆమోదించి మండలికి పంపిస్తే, వారు వెనక్కి పంపారు. కాబట్టి ఫార్మాలిటీగా ఇప్పుడు బిల్లును ప్రవేశపెట్టాం. అంతే తప్ప, ఆయన (చంద్రబాబు) ఏం మాట్లాడుతున్నాడో అర్ధం కావడం లేదు’’ అని స్పష్టం చేశారు. ఈ క్రమంలో బిల్లుపై చర్చ జరుగకుండానే ఆమోదం తెలిపారంటూ టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. వ్యవసాయంపై చర్చ కావాలని వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ.. అదే అంశంపై చర్చ జరుగుతుంటే సభ నుంచి నిష్క్రమించడం గమనార్హం. కాగా అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలి రోజున శాసనసభ వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశం తర్వాత సభ తిరిగి ప్రారంభం కాగానే, ఏపీ పంచాయతీ రాజ్ చట్టం సవరణ బిల్లు–2020ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది.(చదవండి: చంద్రబాబుది బషీర్‌బాగ్ కాల్పుల చరిత్ర) -
ప్రలోభపెట్టే అభ్యర్థులకు ఇది షాకే!
సాక్షి, అమరావతి : గ్రామ పంచాయతీ, ఇతర పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టే అభ్యర్థులకు ఇది షాకే! ఏ రకంగానైనా వారు ఈ చర్యలకు పాల్పడి.. ఆ తర్వాత అది రుజువైతే వారు గెలిచినా ఆయా పదవుల్లో కొనసాగటానికి వీల్లేకుండా అనర్హులుగా పరిగణించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. గ్రామ పంచాయతీలకు మరిన్ని అధికారాలు కల్పించడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో సంస్కరణలే ప్రధాన అంశంగా ఏపీ పంచాయతీరాజ్ చట్టానికి పలు సవరణలు చేస్తూ ఇటీవలి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ప్రభుత్వం గురువారం ఈ ఆర్డినెన్స్ రూపంలో ఉత్తర్వులు వెలువరించింది. పంచాయతీరాజ్ సంస్థల ద్వారా ప్రజలకు మెరుగైన పరిపాలనను అందించటానికి, సంస్థల్లో జవాబుదారీతనాన్ని పెంపొందించటానికి రాష్ట్ర ప్రభుత్వం ‘ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం–1994’కు సవరణలను ప్రతిపాదిస్తూ ఆ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించటానికి, ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నిరోధించటానికి, మద్యం పంపిణీని అరికట్టాలని సర్కారు సంకల్పించింది. ప్రస్తుతం ఎంతో సుదీర్ఘంగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ కాలపరిమితిని తగ్గించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువరించిన రోజు నుంచి 18 రోజుల్లో.. గ్రామ పంచాయతీ ఎన్నికలు 13 రోజుల్లో పూర్తిచేయాలని నిర్ణయించారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, మొక్కల పెంపకం, వాటి సంరక్షణ ద్వారా పర్యావరణ పరిరక్షణలో సర్పంచ్‌లకు పూర్తి అధికారాలను కల్పించారు. సర్పంచ్ సంబంధిత గ్రామంలోనే నివసించాలని.. పంచాయతీ కార్యాలయానికి క్రమం తప్పకుండా హాజరుకావాలని నిబంధన విధించారు. వంద శాతం గిరిజన జనాభా కలిగిన పంచాయతీల్లో సర్పంచ్ సహా వార్డు సభ్యుల పదవులన్నీ గిరిజనులకు రిజర్వు చేస్తూ నిబంధనను తీసుకొచ్చింది. గ్రామసభలను నిర్వహించటంలో సర్పంచ్ విఫలమైనా.. గ్రామ పంచాయతీ అకౌంట్లను సకాలంలో ఆడిట్ చేయించకపోయినా సర్పంచ్, ఉపసర్పంచ్‌లను తొలగించే వీలు కల్పించారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఓటర్లను ప్రలోభపరచటం, ఎన్నికల ప్రక్రియలో వారిని పాల్గొనకుండా చేయటం వంటి నేరాలకు అభ్యర్థులు పాల్పడినట్లు తేలితే వారికి మూడేళ్ల వరకు జైలుశిక్షతో పాటు రూ.వెయ్యి వరకు జరిమానా విధిస్తూ చట్టంలో మార్పులు చేశారు.అధికారుల అలసత్వం లేదా విధి నిర్వహణలో లోపాలుంటే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు. -
ఇక అంతా.. ఈ–పాలన
సాక్షి, పెద్దశంకరంపేట(మెదక్) : ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ –2018 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ చట్టం ప్రకారం ప్రతీ గ్రామంలో ప్రజలకు మెరుగైన వసతుల కల్పనతో పాటు గ్రామాభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలపై గ్రామ కార్యదర్శులు, సర్పంచ్‌లు, అధికారులకు పలు మార్గదర్శకాలను రూపొందించింది. ఇందులో భాగంగా ఆయా గ్రామ పంచాయతీల్లో ఈ–పాలన ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. గత నెలలో జిల్లాస్థాయి అధికారులతో పాటు డీపీఎంలకు పంచాయతీరాజ్ చట్టంపై శిక్షణ కల్పించింది. వీరు ఆయా మండలాల్లో పనిచేస్తున్న గ్రామ కార్యదర్శులకు శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతీ గ్రామాన్ని ఇక ఈ–పంచాయతీ దిశగా మార్చేందుకు అధికారులు అడుగులు వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 469 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో 157 కొత్తగా ఏర్పాటయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు ఆయా గ్రామ పంచాయతీల్లో క్లస్టర్ల వారీగా విధులు నిర్వర్తించే వారు. వీరికి గతంలో 171 వరకు కంప్యూటర్లను అందించారు. మూడు, నాలుగు పంచాయతీలకు చొప్పున క్లస్టర్లను ఏర్పాటు చేయడంతో పాటు అక్కడే కంప్యూటర్ ఆపరేటర్లను నియమించి ప్రజలకు సేవలందించారు. సరైన వేతనాలు లేక పోవడం, శిక్షణ ఇవ్వకపోవడం, జీతాలు సక్రమంగా రాకపోవడంతో చాలా చోట్ల కంప్యూటర్ ఆపరేటర్లు అందుబాటులో లేరు. దీంతో ఆయా పంచాయతీలకు మంజూరైన కంప్యూటర్లు మూలనపడ్డాయి. మండల కార్యాలయాల్లోనే ఒక గదిని ఏర్పాటు చేసి ఉన్న కొంత మంది ఆపరేటర్లతోనే ఆయా పంచాయతీలకు సంబంధించిన రికార్డులను ఆన్లైన్ చేస్తున్నారు. గ్రామ కార్యదర్శులు పంచాయతీల్లో ఉండలేక మండల కార్యాలయాల నుంచి విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం జిల్లాలో నూతనంగా ప్రతీ గ్రామ పంచాయతీకి గ్రామ కార్యదర్శిని నియమించారు. విధుల్లో చేరిన వారికి కంప్యూటర్లపై అవగాహన ఉంది. వీరికి కంప్యూటర్లను అందుబాటులోకి తెస్తే గ్రామాల్లోనే పారదర్శకమైన పాలన అందించే అవకాశం ఉంది. కొనసాగుతున్న శిక్షణ శిబిరాలు జిల్లాలోని పాపన్నపేట, పెద్దశంకరంపేట, చిన్నశంకరంపేట, రామాయంపేట, తూప్రాన్, చేగుంట, నర్సాపూర్, అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్, కౌడిపల్లి, శివ్వంపేట, వెల్దుర్తి మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, నిర్మాణాలు, బిల్లులు, లేఅవుట్స్, ట్రేడ్‌లైసెన్స్ మంజూరు, రెన్యూవల్స్, ఇతర సిటిజన్ సర్సీసులను ఇకపై ఆన్లైన్ ద్వారానే చేపట్టడంపై నూతన గ్రామ కార్యదర్శులకు ఈ–పంచాయతీలపై శిక్షణ కల్పించారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి ఈ–పంచాయతీపై జిల్లాలోని ఆయా మండలాల్లో పాత, కొత్త గ్రామ కార్యదర్శులకు కలిపి ప్రొజెక్టర్ ద్వారా శిక్షణ కల్పిస్తున్నాం. ఈ–పంచాయతీ ద్వారానే రాబోయే రోజుల్లో పాలన కొనసాగనుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అవగాహన కల్పిస్తున్నాం. త్వరలో ఆయా పంచాయతీలకు కంప్యూటర్లు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గ్రామకార్యదర్శులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. – భానుప్రకాష్, డీపీఎం, మెదక్ -
పంచాయతీలకు ‘కో ఆప్షన్’
సాక్షి, సంగెం: గ్రామ పంచాయతీల్లో ఇక కో ఆప్షన్ సభ్యులను నియమించబోతున్నారు. నూతన పంచాయతీరాజ్ చట్టం 2018 ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని రాజకీయ నిరుద్యోగులకు కొంత ఊరట లభించనున్నది. గతంలో కనీవిని ఎరుగని విధంగా ప్రతి పంచాయతీ పాలకవర్గంలో కోఆప్షన్ సభ్యులను నియమించుకునేందుకు చట్టంలో వెసులుబాటు కల్పించింది. మండల పరిషత్, జిల్లా పరిషత్‌ల మాధిరిగా గ్రామపంచాయతీలకు సైతం కోఆప్షన్ సభ్యుల నియామకాన్ని పొందుపరిచారు. దీంతో నూతన పంచాయతీ పాలక వర్గాలు కొలువుదీరి ఆరు నెలలు కావస్తున్నది. పంచాయతీ పాలనపై నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు నిధులు, విధులపై శిక్షణ తరగతులను నిర్వహించారు. కొత్త చట్టం ప్రకారం ఇక కో ఆప్షన్ సభ్యుల నియామక ప్రక్రియ మిగిలింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కోఆప్షన్ సభ్యుల ఎంపిక విధానంపై మార్గదర్శకాలు జారీ చేస్తే ఆయా పంచాయతీల పాలకవర్గం అభిప్రాయం మేరకు సర్పంచ్ సన్నిహితులు, విధేయులకు అవకాశం లభించనుంది. సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులతో పాటుగా గ్రామానికి చెందిన ముగ్గురిని కోఆప్షన్ సభ్యులుగా ఎంపిక చేసుకుంటే వారి విలువైన సలహాలను గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం కొంత మేరకు తోడ్పాటు లభించినట్లవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. నూతనంగా ఎంపిక కాబోయే కో ఆప్షన్ సభ్యులకు వార్డు సభ్యులతో సమాన హోదా లభించనుంది. గ్రామపంచాయతీల్లో తీర్మాణం చేసే సమయంలో చేసే చర్చలో వారు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మండల, జిల్లా పరిషత్ స్థాయిలో కో ఆప్షన్ సభ్యులను నామినేట్ చేసినట్లుగా గ్రామపంచాయతీల్లోను ముగ్గురిని నామినేట్ చేసి వారి ద్వారా గ్రామాభివృద్ధికి అవసరమైన సలహాలు, సూచనలు తీసుకునోవాలనేది ప్రభుత్వ వ్యూహం. అందులో భాగంగా ప్రతి పంచాయతీకి ముగ్గురు కోఆప్షన్ సభ్యులను నియమించేందుకు కార్యాచరణ రూపొందించారు. వీరికే అవకాశం.. ప్రతి గ్రామపంచాయతీలో ముగ్గురు చొప్పున కోఆప్షన్ సభ్యులను పంచాయతీ పాలకవర్గం నిర్ణయం మేరకు అధికారులు నియమిస్తారు. గ్రామాల్లో విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, మహిళా సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగులు, సంఘ సంస్కర్తలు, గ్రామాభివృద్ధికి కోసం ఇదివరకే కృషిచేసేవారిలో వంటి వారి నుంచి ముగ్గురిని పంచాయతీకి నియమించనున్నారు. ఈ ముగ్గురు గ్రామాల్లో నివసిస్తున్నవారు అయి ఉండాలి. వీరిలో ఒక మహిళ తప్పనిసరిగా ఉంటారు. జిల్లాలో 401 గ్రామపంచాయతీలున్నాయి. ప్రతి పంచాయతీకి ముగ్గురి చొప్పున 1,203 మంది కోఆప్షన్ సభ్యులను నియమించనున్నారు. దీంతో గ్రామాల్లో కొంతమేరకు రాజకీయ నిరుద్యోగులకు ఊరట కలగనుంది. ఈ కోఆప్షన్ సభ్యులను నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంపిక చేసి మండల అధికారులకు జాబితా అందిస్తారు. జాబితా అందిన తర్వాత మండల అధికారి సభ్యులను ప్రకటించే అవకాశం ఉంది. పలువురు ఆశావాహులు మండలస్థాయి నాయకులతో కలిసి ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలను కలిసి గ్రామ కోఆప్షన్‌గా అవకాశం కల్పించాలని మంతనాలు జరుపుతున్నారు. -
పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామసీమలను పచ్చదనం, పరిశుభ్రతకు కేంద్రాలుగా మార్చేందుకు ప్రభుత్వపరంగా కార్యాచరణ సిద్ధమైంది. గ్రామపంచాయతీల్లో పచ్చదనం, పరిశుభ్రత ప్రధాన అంశాలుగా విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలతోపాటు వాటి అమలుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. నగరాల్లో పౌరులకు అందుబాటులోకి వచ్చే సౌకర్యాలన్నీ కూడా పల్లె ప్రజలకు కూడా అందేలా మార్పు తీసుకురావాలని నిర్ణయించింది. గ్రామాల్లోనూ పూర్తిస్థాయిలో పారిశుధ్యం, వీధి దీపాలు, ఇతర మౌలిక సౌకర్యాల కల్పనకు కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం.. దీనిని పకడ్బందీగా అమలు చేసేందుకు కార్యక్రమాలను రూపొందించింది. పంచాయతీల్లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రచార కార్యక్రమాలకు సంబంధించి గతంలోనే సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారు. వీటిని తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, జెడ్పీపీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులకు పీఆర్ శాఖ కొన్ని రోజుల క్రితం ఒక మెమోను కూడా జారీ చేసింది. పచ్చదనం, పరిశుభ్రతకు సంబంధించిన పనుల పర్యవేక్షణను గ్రామపంచాయతీ, సర్పంచ్‌లతోపాటు ఈవోపీఆర్డీ, ఎంపీడీవోలు చేపట్టాలని సూచించింది. అన్ని గ్రామాల్లో ఎంపీడీవోలు, ఈవోపీఆర్లు, డీపీవోలు, డీఎల్పీవోలు విస్తృతంగా పర్యటించి ప్రభుత్వం నిర్ణయించిన కార్యక్రమాలు పక్కాగా అమలయ్యేలా చూడాలని ఆదేశించింది. పంచాయతీల్లో ’డ్రై డే’.. గ్రామ పంచాయతీల్లో దోమల వృద్ధి లేకుండా నిరోధించేందుకు వారానికి ఒకరోజు ’డ్రై డే’నిర్వహించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా పంచాయతీ సిబ్బంది వారానికి ఒకరోజు ఇంటింటికి వెళ్లి డ్రై డే పాటించాల్సిన ప్రాముఖ్యతను వివరిస్తారు. ఇళ్లు, వాటి చుట్టూ ఉన్న పరిసరాల్లోని గుంటలు, తొట్టెలు, పాత టైర్లు తదితరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసేలా ప్రజల్లో చైతన్యం కల్పిస్తారు. రాష్ట్రంలోని అన్ని పల్లెలను పచ్చదనం, పరిశుభ్రతతో కూడిన గ్రామాలుగా తీర్చిదిద్దడంలో భాగంగా వివిధ రూపాల్లో విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఇదివరకే పీఆర్ శాఖ సూచించింది. ఈ–పంచాయతీలు... ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకుని గ్రామ పంచాయతీలను ఈ–పంచాయతీలుగా మార్చే క్రమంలో సాంకేతికంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరులు, సామగ్రిని ఉపయోగించుకోవడంతోపాటు మెరుగైన సాంకేతికతలను అనుసరించే దిశలో చర్యలు చేపట్టనున్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఆన్లైన్లో వివిధ కార్యకలాపాల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. పంచాయతీల్లో ఆన్లైన్ డేటా ఎంట్రీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పంచాయతీ మాడ్యుల్స్‌ను అప్లోడ్ చేయడం వంటివి పూర్తిచేయాలని జిల్లా పంచాయతీ అధికారుల (డీపీవో)ను పీఆర్ శాఖ ఆదేశించింది. భవన నిర్మాణ అనుమతులు, లే అవుట్ల పర్మిషన్లను ఆన్లైన్లోనే జారీ చేసేందుకు వీలుగా సాంకేతిక పరమైన వసతులు సమకూర్చుకోవాలని సూచించింది. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, భూరికార్డుల మ్యుటేషన్లు, ట్రేడ్ లైసెన్స్‌ల జారీ వంటి వాటిని ఆన్లైన్లోనే అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంది. గ్రామ పంచాయతీల పరిధిలో జరిగే వివాహాలను తప్పనిసరిగా అక్కడే రిజిష్టర్ చేసేలా చూడాలని సూచించింది. పంచాయతీ కార్యదర్శులకు పనితీరు సూచికలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. -
శిక్షణ లేకుండానే విధుల్లోకి
సాక్షి, నల్లగొండ : శిక్షణ లేకుండానే జూనియర్ పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరారు. తెలంగాణ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాతే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించింది. అంతకు ముందే పంచాయతీ కార్యదర్శులకు టీఎస్పీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించారు. ఎన్నికల కోడ్‌తోనియామకాలు ఆగిపోయాయి. ఎన్నికలు పూర్తయితన తర్వాత విధుల్లో చేరారు. వారికి ఎలాంటి శిక్షణ లేకపోవడంతో గ్రామాల్లో కొత్త పంచాయతీ చట్టం ప్రకారం విధులు ఎలా నిర్వహించాలో పూర్తి స్థాయిలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నో సందేహాలతో చేరే ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా నియామకం కాగానే శిక్షణ ఇస్తారు. వీరికి ఎలాంటి శిక్షణ లేకపోవడంతో ఇబ్బందులు చోటు చేసుకుంటున్నాయి. జిల్లాలో మొత్తం 844 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 837 పంచాయతీలకు గత జనవరి మాసంలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అనంతరం టీఎస్పీఎస్సీ ద్వారా ఎంపికైన పంచాయతీ కార్యదర్శులను జిల్లాకు అలాట్ చేయడంతో వారికి జిల్లా పంచాయతీ అధికారి జాయినింగ్ ఉత్తర్వులు అందజేయడం.. వెంటనే వారు విధుల్లో చేరిపోవడం చకచకా జరిగిపోయాయి. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం కాకముందు గతంలో రెండు మూడు పంచాయతీలకు ఒక కార్యదర్శి ఉండేవారు. ప్రస్తుతం కొత్త నియామకాల కారణంగా ప్రతి గ్రామానికి పంచాయతీ కార్యదర్శి ఏర్పాటయ్యాడు. కొత్త పంచాయతీ చట్టం ప్రకారం ప్రతి పంచాయతీకి నర్సరీని ఏర్పాటు చేస్తున్నారు. దాని బాధ్యత పంచాయతీ కార్యదర్శిదే. చట్టం అమలులో భా గంగా సర్పంచ్‌కు, ఉపసర్పంచ్‌కు ఇటీవల ప్రభుత్వం చెక్ పవర్‌ను అందించింది. గతంలో సర్పం చ్‌కు, కార్యదర్శికి చెక్ పవర్ ఉండేది. నిధుల విని యోగానికి సంబంధించిన ఆడిట్ మాత్రం సర్పం చ్, కార్యదర్శే చేయాల్సి ఉంది. ఇందులో తప్పిదాలు చోటు చేసుకున్నా ఇబ్బందులు తప్పవు. కార్యదర్శుల విధులు కొత్తచట్టం ప్రకారం పనితీరును ప్రతినెలా వెబ్సైట్లో పొందుపర్చాలి. లే అవుట్లు, భవన నిర్మాణాలు, అందుకు సంబంధించిన అనుమతుల కోసం గ్రామపంచాయతీలకు అనుసంధానంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఆ సాఫ్ట్ వేర్ కూడా ఇప్పటికే జిల్లాకు చేరింది. గ్రామాల్లో ఉపాధి హామీతోపాటు జనన, మరణ, ఇతర గ్రామానికి సంబంధించిన సమాచారానికి సంబంధించి ప్రతి ఒక్క విషయానికి పంచాయతీ కార్యదర్శే ప్రముఖ పాత్ర వహించాలి. విధులు సరిగా నిర్వహించిన కార్యదర్శిపై చర్యలు తీసుకునేందుకు కూడా చట్టంలో ఉంది. తొలగింపు కోసం ప్రత్యేక ట్రిబ్యునల్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. శిక్షణ లేకపోవడంతో ఇబ్బందులు ఏప్రిల్ 12న పంచాయతీ కార్యదర్శులు నియామకాలు తీసుకొని అదే రోజు విధుల్లో చేరాలని ఆదేశాలు ఉండడంతో వెంటనే చేరారు. మరుసటి రోజు నుంచే పంచాయతీలకు వారిని కేటాయిం చారు. ప్రస్తుతం కొత్త చట్టం గ్రామంలోని ప్రతి పనికి సంబంధించి కార్యదర్శే బాధ్యత వహించాలి. అది కూడా ఆన్లైన్ ద్వారానే చేయాల్సి ఉంది. దీంతో ఇబ్బందులు పడుతున్నారు. -
సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు జాయింట్ చెక్‌పవర్
సాక్షి, హైదరాబాద్ : గ్రామ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో కొన్ని సెక్షన్లను చేరుస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ శనివారం నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం 2018లో చెక్ పవర్‌కు సంబంధించిన సెక్షన్లను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఇందులో భాగంగా చట్టంలో 6(10), 34, 37(6), 43(10), 47(4), 70(4), 113(4), 114(2), 141 సెక్షన్లను నోటిఫై చేశారు. గ్రామపంచాయతీల చెక్ పవర్‌కు సంబంధించి నోటిఫికేషన్ జారీతో జాయింట్ చెక్‌పవర్‌పై ప్రభుత్వం స్పష్టతనిచ్చినట్టు అయ్యింది. సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ కల్పించడంతోపాటు, గ్రామ పంచాయతీల్లో ఆదాయ, వ్యయ సంబంధిత ఆడిటింగ్ బాధ్యతలు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు అప్పగించనున్నారు. ఈ అంశంతోపాటు గ్రామసభ నిర్వహణకు ఉండాల్సిన కోరం తదితర ఇతర అంశాలనూ పేర్కొంటూ ఉత్తర్వులిచ్చారు. సోమవారం (జూన్ 17) నుంచి కొత్త సెక్షన్లు అమల్లోకి రానున్నాయి. ఈ నోటిఫికేషన్‌ను సోమవారం నాటి గెజిట్‌లో ప్రచురించాలని వికాస్‌రాజ్ ఆదేశించారు. -
ఆర్నెల్లలో పల్లెలన్నీ మారాలి
గ్రామ పంచాయతీలకు కార్యదర్శులను నియమించాం. పంచాయతీరాజ్ చట్టం చాలా కఠినంగా ఉంది. కార్యదర్శి చక్కగా పనిచేసి అనుకున్న ఫలితాలను సాధిస్తేనే మూడేళ్ల తరువాత ఆయన సేవలను క్రమబద్ధీకరిస్తాం. పంచాయతీ కార్యదర్శులపై పూర్తి నియంత్రణ మీదే. అలాగే డీపీవో, డీఎల్పీవో, ఈవోఆర్డీ, ఎంపీడీవోతో బాగా పనిచేయించాలి. దీనికి సంబంధించిన ఆర్థిక, పరిపాలన, అజమాయిషీ అధికారాలను త్వరలోనే నిర్ణయిస్తాం. ఆరు నెలల్లో పూర్తి మార్పు కనబడాలి. సాక్షి, హైదరాబాద్ : ‘‘స్థానిక సంస్థలు చాలా కాలం పంచాయతీరాజ్ ఉద్యమ స్ఫూర్తితో పనిచేశాయి. పారిశుద్ధ్య కార్యక్రమం బ్రహ్మాండంగా ఉండేది. దురదృష్టవశాత్తు ఆ స్ఫూర్తి ఇప్పుడు కొరవడింది. 70 సంవత్సరాల స్వాతంత్య్రం తరువాత కూడా ఏ గ్రామానికి పోయినా అపరిశుభ్ర వాతావరణం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. గ్రామాల్లో మంచిగా ఏదీ జరగడం లేదు. పల్లెలు పెంటకుప్పల్లాగా తయారయ్యాయి. ఎందుకీ క్షీణత? మంచినీళ్లకు గోస ఎందుకు? తెలంగాణ ఎక్కడో లేదు....గ్రామాల్లోనే ఉంది. గ్రామాలను మనం అద్భుతంగా చేసుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది. మీరంతా విద్యాధికులు. పరిస్థితులను అర్థం చేసుకోండి. మీరు గ్రామాలను అభివృద్ధి చేస్తామని ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. భయంకరమైన గ్రామాల పరిస్థితులలో ఆరు నెలల్లో మార్పు రావాలి. అది గుణాత్మకమైన మార్పు కావాలి’’అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లతో సీఎం కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను, ప్రజాప్రతినిధుల బాధ్యతలను ముఖ్యమంత్రి కూలంకషంగా వివరించారు. మంగళవారం ప్రగతి భవన్లో కొత్తగా ఎన్నికైన జెడ్పీ చైర్పర్సన్లతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గ్రామాలు పచ్చదనంతో, పరిశుభ్రతతో వర్ధిల్లాలనే ప్రధాన లక్ష్యంతో రూపొందించిన కొత్త పంచాయతీరాజ్ చట్టం అమల్లో క్రియాశీల పాత్ర పోషించాలని కోరారు. ‘‘నేను స్వయంగా పంచాయితీరాజ్ విషయంలో అవగాహనకు రావడానికి, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ఐఆర్డీలో శిక్షణకు వెళ్లా. అక్కడే హాస్టల్లో ఆరు రోజులుండి ఏడు రోజుల శిక్షణా కార్యక్రమానికి హాజరయ్యా. అప్పుడు నాకు పూర్తి అవగాహన వచ్చింది. మీరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీరంతా జూలైలో పదవీబాధ్యతలు స్వీకరించేలోగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థలో శిక్షణ తీసుకోవాలి. ఇందుకోసం అధికారులు ఒక కోర్సు తయారు చేస్తారు’’అని సీఎం తెలిపారు. కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లకు త్వరలోనే హైదరాబాద్‌లో శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. సమావేశం ప్రారంభం కావడానికి ముందు సీఎం కేసీఆర్... జెడ్పీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లను వారి స్థానాల దగ్గరకు వెళ్లి ప్రతి ఒక్కరినీ పేరుపేరునా అభినందించారు. వారితో కలసి భోజనం చేశారు. సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, జగదీశ్‌రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సునీతా మహేందర్‌రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎ. జీవన్‌రెడ్డి, పైలట్ రోహిత్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, షకీల్, మాజీ ఎమ్మెల్యేలు ఎం. సుధీర్‌రెడ్డి, నల్లాల ఓదేలు, ఉమా మాధవరెడ్డి, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లతో భేటీలో కేసీఆర్ ప్రస్తావించిన అంశాలు ఆయన మాటల్లోనే... బాగా పనిచేస్తేనే క్రమబద్ధీకరణ... గ్రామ పంచాయితీలకు కార్యదర్శులను నియమించాం. పంచాయతీరాజ్ చట్టం చాలా కఠినంగా ఉంది. కార్యదర్శి చక్కగా పనిచేసి అనుకున్న ఫలితాలను సాధిస్తేనే మూడేళ్ల తరువాత ఆయన సేవలను క్రమబద్ధీకరిస్తాం. పంచాయతీ కార్యదర్శులపై పూర్తి నియంత్రణ మీదే. అలాగే డీపీవో, డీఎల్పీవో, ఈవోఆర్డీ, ఎంపీడీవోలతో బాగా పని చేయించాలి. దీనికి సంబంధించిన ఆర్థిక, పరిపాలన, యాజమాయిషీ అధికారాలను త్వరలోనే నిర్ణయిస్తాం. ఆరు నెలల్లో పూర్తి మార్పు కనబడాలి. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు గంగదేవిపల్లి, ముల్కనూర్, అంకాపూర్ లాంటి ఆదర్శ గ్రామాల మాదిరిగా మారాలి. ఏ జిల్లా పరిషత్ అగ్రభాగాన నిలిస్తే ఆ జిల్లాకు ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల నుంచి రూ. 10 కోట్లు మంజూరు చేస్తాం. ఒకటి కంటే ఎక్కువ పరిషత్‌లు ముందు నిలిస్తే వాళ్లకూ మంజూరు చేస్తాం. 32 జిల్లాలు కూడా అగ్రభాగాన నిలిచి మొత్తం అందరూ కలసి రూ. 320 కోట్లు పొందాలని నా కోరిక. జిల్లా పరిషత్ చైర్పర్సన్లకు కొత్త కార్లు కొనిస్తాం. మీరు చాలా మంచి మార్పు తీసుకు రాగలమని ప్రజల్లో భావన తీసుకు రాగలిగితే అంతకన్నా గొప్ప లేదు. ప్రజల్లో బాగా తిరిగి పంచాయతీరాజ్ సంస్థను బలోపేతం చేయాలి. క్రియాశీలకంగా ఏ గ్రామానికి ఆ గ్రామమే అభివృద్ధి జరగాలంటే మీరు బాధ్యత తీసుకోవాలి. మీరు నాయకత్వం వహించాలి. మీ కింది వారికి స్ఫూర్తి కావాలి. ఎలాగైతే తెలంగాణ సాధించామో అలాగే గ్రామాల అభివృద్ధి జరగాలి. లేనిపోని దర్పం తెచ్చుకోకండి... జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లుగా ఏకపక్ష విజయం సాధించినందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, శుభాకాంక్షలు తెలియచేస్తున్నా. మీరు పనిచేయబోయే ఈ ఐదేళ్ల కాలంలో మంచి పేరు తెచ్చుకోవాలి. మీకు పనిచేసే ధైర్యాన్ని, అభినివేశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా. మీరింకా ఉన్నత పదవులు అధిష్టించాలని ఆకాంక్షిస్తున్నా. మీకు లభించిన పదవిని ఎంత గొప్పగా నిలబెట్టుకుంటే అంత మంచిది. ఎవరూ పుట్టినప్పుడు అన్నీ నేర్చుకోలేదు. పరిస్థితులను బట్టి నేర్చుకుంటూ పోతారు. మనిషి చివరి శ్వాస విడిచే వరకు జ్ఞాన సముపార్జన చేసుకుంటూ పోవాలి. మన జీవితం చాలా చిన్నది. ఆ కాస్త సమయంలోనే మంచి పేరు తెచ్చుకోవాలి. అజ్ఞాని ఏ రోజైనా జ్ఞాని కాగలుగుతాడు. కానీ మూర్ఖుడు జ్ఞాని కాలేడు. వాడు తనకే అన్నీ తెలుసు అనుకుంటాడు. అలా కాకుండా అన్ని విషయాలపై అవగాహన పెంచుకున్న వారే ఎంచుకున్న రంగంలో ముందడుగు వేయగలరు. అన్ని విషయాల్లాగానే పంచాయతీరాజ్ విషయాలను కూడా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. పదవి వచ్చిన తరువాత మన సహజత్వాన్ని కోల్పోకూడదు. అలా చేస్తే జనం నవ్వుతారు. లేనిపోని దర్పం తెచ్చుకోకూడదు. పదవి రాగానే మీరు మారిపోకూడదు. మనకు రావాల్సిన, దక్కాల్సిన గౌరవం ఆటోమేటిక్‌గా అదే వస్తుంది. పెట్టుడు గుణాల కంటే పుట్టుడు గుణం మంచిది అంటారు పెద్దలు. మన వ్యవహార శైలే మనకు లాభం చేకూరుస్తుంది. ప్రజలకు అనేక సమస్యలుంటాయి. వారు ఆ సమస్యల పరిష్కారం కోసం మీ దగ్గరికి వస్తారు. నాయకుల మంచి లక్షణం ఒకరు చెప్పింది వినడం. అదే మీరు చేయండి. ఓపికగా వారి సమస్యలను సావధానంగా వినండి. వాళ్లను కూర్చోబెట్టి మర్యాద చేయండి. అప్పుడే వాళ్లకు రిలీఫ్ వస్తుంది. ఆ తరువాత వారి సమస్యలను ఎలా పరిష్కరించాలో ప్రయత్నం చేయండి. సహజత్వాన్ని కోల్పోకుండా ప్రవర్తిస్తే మంచి పేరు వస్తుంది. మంచిపేరుతోనే ఉన్నతస్థాయి వస్తుంది. మీరంతా మీ సామర్థ్యాన్ని, అదృష్టాన్నిబట్టి ఈ పదవుల్లోకి వచ్చారు. ఇదంతా మీ సత్త్రవర్తన వల్లే. మంచి పనులు చేయడానికి పెట్టుబడులు అవసరం లేదు. సరళంగా మాట్లాడటమే ఏ రోజునైనా మనకు పెట్టని కోట. ప్రజాసమస్యలపట్ల ప్రజాప్రతినిధులు ఎంతటి శ్రద్ధ కనబరుస్తున్నారో ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారు. దీనివల్ల మనకు ఇంకా ఉన్నతావకాశాలు వస్తాయి. విజయాలు, అపజయాలు సర్వసాధారణం. కానీ రాజకీయాల్లో ఉన్న వారు ప్రజలతో నిత్య సంబంధాలు కలిగి ఉండటం ప్రాథమిక లక్షణం. జెడ్పీలకు రాజ్యాంగబద్ధ అధికారాలన్నీ కట్టబెట్టుతాం... గతంలో జెడ్పీ చైర్పర్సన్లకు పెద్దగా పనిలేదు. ఇటీవల కేంద్ర ఆర్థిక సంఘాన్ని కలిసినప్పుడు మన వ్యవస్థ గురించి వివరించా. ఇక్కడ జెడ్పీ చైర్పర్సన్లకు మినిస్టర్ ఆఫ్ స్టేట్ రాంక్ ఇచ్చామని చెప్పా. వాళ్లు ఇక ముందు క్రియాశీలకంగా పని చేస్తారని కూడా చెప్పా. అవసరమైన సాయం చేస్తామని ఆర్థిక సంఘం అధ్యక్షుడు మాట ఇచ్చారు. ఏ విధంగానైనా మీ వ్యవస్థను పటిష్టం చేయాలని ఆలోచన చేస్తున్నాం. రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన అన్ని అధికారాలు సంక్రమింప చేస్తాం. ఇంత ఏకపక్షంగా 32 జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలు ఎప్పుడూ రాలేదు. దాంతోపాటే మీకు బరువు, బాధ్యతలు పెరిగాయి. మీ పాత్ర ఉన్నతంగా ఉండాలి. జిల్లా పరిషత్‌లు క్రియాశీలకం కావాలి. మీ విధులు, బాధ్యతలు పటిష్టం కావాలి. పంచాయతీరాజ్ ఉద్యమం అలా మొదలైంది... పంచాయతీరాజ్ ఒక అద్భుతమైన ఉద్యమం. స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో దీనికి రూపకల్పన చేశారు. రాష్ట్రాలకు పాలనలో స్వతంత్రత ఉండాలని, అది వికేంద్రీకరణ జరగాలని స్థానిక స్వపరిపాలనకు శ్రీకారం చుట్టారు. కేంద్రీకృత పాలన క్షేత్రస్థాయిలో ఫలితాలు రాబట్టలేదు. ఎక్కడికక్కడే అభివృద్ధి జరగాలని ఒక అద్భుతమైన ఉద్యమానికి ప్రాణం పోశారు. దీని మొట్టమొదటి పేరు కమ్యూనిటీ డెవలప్మెంట్. జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న తొలినాళ్లలో అమెరికా వెళ్లినప్పుడు ఆ దేశాధ్యక్షుడు ఐసన్ హోవర్ ఆయనకు ఎస్కే డేను పరిచయం చేశారు. ఆయన భారతీయుడని, గ్రామీణ అమెరికా అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారని, అవి అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయని నెహ్రూకు ఐసన్ హోవర్ చెప్పారు. ఆయన్ను అమెరికా అధ్యక్షుడు పొగడటంపట్ల సంతోషం వ్యక్తం చేసిన నెహ్రూ... భారత్‌కు రమ్మని ఎస్కే డేను ఆహ్వానించారు. ప్రథమ పంచవర్ష ప్రణాళికలో దేశ అవసరాలకు భిన్నంగా సత్వర పారిశ్రామీకరణకు ప్రాధాన్యత ఇవ్వడం తనకు అభ్యంతరమని, అది తప్పని, మొదలు సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆహార రంగంలో స్వయం సమృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని డే సూచించారు. నెహ్రూ ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించారు. నెహ్రూ స్వదేశానికి వచ్చాక మంత్రి మండలిలో, పార్టీలో ఎస్కే డే సలహాపై చర్చించారు. ఫలితంగా రెండో పంచవర్ష ప్రణాళికలో ప్రాధాన్యతాక్రమం మారింది. ఆధునిక దేవాలయాల పేరిట భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. అప్పటి ఆ మార్పు వల్ల ఈ రోజున ఆహార రంగంలో స్వావలంబన వచ్చింది. నెహ్రూ తీసుకువచ్చిన మార్పు వల్ల సంతోషించిన ఎస్కే డే భారత్ రాగా ఆయన్ను తక్షణమే రాజ్యసభ సభ్యుడిని చేసి కేబినెట్ మంత్రిగా నెహ్రూ నియమించారు. ఆయనకు కమ్యూనిటీ డెవలప్మెంట్ శాఖను కేటాయించారు. గ్రామీణ భారతాన్ని ఆయన చేతుల్లో పెట్టారు. ఆయన వెంటనే కార్యక్రమం మొదలుపెట్టారు. సరాసరి హైదరాబాద్ వచ్చి ఎన్ఐఆర్డీలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్ నుంచే యావత్ భారత దేశానికి పంచాయతీరాజ్ ఉద్యమాన్ని విస్తరింప చేశారు. అప్పట్లో ఆయన దేశంలోనే మొట్టమొదటి సమితి (పటాన్చెరు) అధ్యక్షుడిగా పి. రామచంద్రారెడ్డిని నియమించారు. అలా మొదలైంది పంచాయితీరాజ్ ఉద్యమం. గ్రామీణ తెలంగాణ బాగు కోసం పనిచేయండి... మన ప్రభుత్వం మానవీయ కోణంలో ప్రవేశపెట్టిన పింఛన్, రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు ప్రజాదరణ పొంది ఎన్నికల్లో పార్టీ విజయానికి కారణమయ్యాయి. అందుకే వాళ్ల రుణం మనం తీర్చుకోవాలి. దీనికి పాత్రధారులు మీరే. మండలాధ్యక్షులను మీలాగే తయారు చేయండి. నాలాగా మీరు కూడా వారికి అవగాహన కలిగించాలి. మీరు సందేశాత్మకంగా మాట్లాడాలి. ఆ స్థాయి రావడానికే మీకు శిక్షణ ఇప్పిస్తున్నాం. ఏ ఉద్యమ స్ఫూర్తితో ఎస్కే డే పంచాయతీరాజ్‌ను ప్రారంభించారో దాన్ని మనం ముందుకు తీసుకు పోవాలి. 60 శాతం జనాభా ఉన్న గ్రామీణ ప్రజలకు మీరు నాయకత్వం వహించాలి. గ్రామాలను పట్టుకొమ్మల్లాగా చేయడంలో నిమగ్నం కావాలి. అలా చేసి మీ జీవితాలను ధన్యం చేసుకోండి. గొప్ప పేరు సంపాదించుకోండి. అందులో ఉన్న తృప్తి మరెందులోనూ లేదు. గ్రామీణ తెలంగాణను అన్ని రకాలా బాగు చేయడానికి మీ శక్తియుక్తులను ఉపయోగించండి. -
పంచాయతీ ని‘బంధనాలు’
సాక్షి, అల్గునూర్: పంచాయతీ పాలకవర్గాలు ఇకపై లేఅవుట్ల అనుమతి విషయంలో ఆచితూచి వ్యవహించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం లేని లేఅవుట్లను సరిచూసుకోకుండా మామూళ్లు తీ సుకుని ఎవరికైనా అనుమతి ఇస్తే ఆ గ్రాపంచాయ తీ పాలకవర్గం రద్దయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టంలో కఠినమైన నిబంధనలు చేర్చి పకడ్బందీగా అమలు చేస్తోంది. నగరాలు, పట్టణాల శివారు గ్రామాల్లోని అక్ర మ లేఅవుట్లు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం నిబంధనలు కఠినం చేసింది. ఇవీ నిబంధనలు అమల్లోకి వచ్చిన కొత్త చట్టం ప్రకారం 2018 మా ర్చి 18 వరకు ఉన్న లేఅవుట్ల జాబితాలను కొత్త పాలకవర్గాలు ప్రకటించిన అనంతరం వాటిపై చర్యలు తీసుకోవాలి. గ్రామాల్లోని వ్యవసాయ భూమిని ఇళ్లస్థలాలుగా మార్చేందుకు ముందుగా వ్య వసాయ భూమి చట్టం కింద రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఇలా భూ మార్పిడి ప్రక్రియ తర్వాతే లేఅవుట్ ప్రతిపాదన దరఖాస్తును గ్రామపంచాయతీలకు ఇవ్వాలి. వాటిని ఏడురోజుల్లో జిల్లా టౌన్, కంట్రీ ప్లానింగ్(డీటీసీపీ) అనుమతి జారీచేసే సంస్థలకు పంపాలి. ఈ గడువులోపు గ్రామపంచాయతీ నిర్ణయం తీసుకోకున్నా అనుమతి ఇచ్చినట్లుగానే పరిగణించాల్సి ఉంటుందని చట్టంలో ఉంది. లే అవుట్లలో డ్రెయినేజీ, రోడ్డు, వీధిదీపాలు, తాగునీటి వ్యవస్థ ఏర్పాటుచేయాలని సాంకేతిక కమిటీ లేఅవుట్ నిర్వాహకులకు సూచిస్తోంది. లేఅవుట్ పరిధిలోని సామూహిక స్థలాలు, రోడ్లను పంచాయతీపేరుతో రిజిస్ట్రేషన్ చేయించాలి. అన్నింటినీ పరిశీలించిన డీటీసీపీ నెలలోపు ఆమోదించాల్సి ఉంటుంది. లేఅవుట్ నిర్వాహకులు విక్రయానికి ప్రతిపాదించే మొత్తం స్థలంలో 15 శాతాన్ని గ్రామపంచాయతీకి తనఖా పెట్టాలి. అయితే గ్రామకంఠం స్థలానికి ఈ నిబంధనలు వర్తించవు. లేవుట్‌లో ప్రజావసరాలకు కేటాయించిన స్థలాన్ని ఎవరికైనా విక్రయిస్తే మూడేళ్లవరకు జైలుశిక్ష ఉంటుంది. డీటీసీపీ కమిటీ ఆదేశాలు లేకుండా లేఅవుట్‌కు అనుమతి ఇస్తే గ్రామపంచాయతీ పాలకవవర్గం రద్దవుతుంది. చట్టం క్రమబద్దీకరణ అంశం అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణ అంశాన్ని చట్టం లో పొందుపరిచారు. లేఅవుట్లలో నిర్దేశిత అవసరాలకు అనుగుణంగా అనుమతులు లేనప్పుడే అది అక్రమం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వసతుల కల్పనకు అవకాశం కల్పిస్తారు. నిబంధనలకు అనుగుణంగా వసతులు కల్పించిన తర్వాతే లే అవుట్‌ను క్రమబద్దీరిస్తారు. అయితే లేఅవుట్‌కు వినియోగించే స్థలానికి అప్పటి మార్కెట్ విలువ తో పోలిస్తే పదిశాతం మొత్తాన్ని గ్రామపంచాయతీకి చెల్లిస్తే క్రమబద్దీకరించేందుకు అవకాశం ఉంటుంది. అక్రమ లే అవుట్లో వసతులు కల్పించే విషయంలో విఫలమైతే దాన్ని అక్రమంగానే నిర్ధారిస్తారు. ఎంతమొత్తం చెలిచినా దీని క్రమబద్దీకరించే అవకాశం ఉండదు. ఇవి పాటించాల్సిందే కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఇప్పటి నుంచి అనుమతులు ఉన్నవాటినే కొనసాగిస్తారు. వ్యవసాయ భూమిని కమర్షియల్ భూమిగా మా ర్చేందుకు మొదటగా ఆర్డీఓకు దరఖాస్తు చేసుకోవాలి. అనతరం. రికార్డులను గ్రామపంచాయతీలకు అప్పగించాలి. వాటిని గ్రామపంచాయతీ అధికారులు సాంకేతిక నిర్ణయం కోసం టౌన్‌ప్లానింగ్ అధికారులకు పంపుతారు. రెండున్నర ఎకరాలకు జిల్లాస్థాయి, ఐదు ఎకరాలలోపు రీజియన్ స్థాయి, ఆపై దాటితే రాష్ట్రస్థాయి టౌన్ ప్లానింగ్ అధికారుల సర్వేచేసి అనుమతులు ఇస్తారు. నివేదికను రెవెన్యూ, గ్రామపంచాయతీ అధికారులకు పంపుతారు. దీనిపై పంచాయతీ వారు గ్రామసభలో తీ ర్మాణిస్తారు. దరఖాస్తుదారులు 15శాతం భూమిని ప్రజాప్రయోజనాల కోసం ఖాళీగా వదిలేయాలి. వ్యవసాయ భూమిని కమర్షియల్ భూమిగా మా ర్చేందుకు మార్కెట్ విలువ ప్రకారం(రిజిస్ట్రేషన్ లెక్క ప్రకారం) ఎకరా లక్ష ఉంటే అందులో రూ. 10వేల ఫీజు రెవెన్యూ అధికారులు వసూలు చేసి అనంతరం లేఅవుట్ మంజూరుచేస్తారు. లేఅవుట్ ఉంటే సబ్ రిజిస్ట్రార్ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలి. -
నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం
ఇల్లంతకుంట: ఐదేళ్ల పాటు కొనసాగే పంచాయతీ పాలకులపై పల్లె ప్రగతి ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం నిధులు కేటాయిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పించి గ్రామాల రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తామని కొత్త సర్పంచులు చెబుతున్నారు. కాని కొత్త పంచాయతీరాజ్ చట్టం నిబంధనలు కఠినతరంగా ఉండటంతో నిధులు, విధుల్లో ఏమాత్రం తేడా వచ్చిన, నిర్లక్ష్యం చేసినా సర్పంచ్‌తో పాటు పాలకవర్గానికి ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలు కొత్త సర్పంచులకు స్వాగతం పలుకుతున్నాయి. ఏళ్లకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నీ కొత్త సర్పంచులు పరిష్కారం చేస్తారనే కొండంత ఆశతో గ్రామీణ ప్రజలు ఎదురుచూస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో నిధుల కొరత, కొత్త పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న నిబంధనలు సర్పంచులకు ఐదేళ్ల పాలన సాగించాలంటే కత్తిమీద సాముల మారుతోంది. గ్రామాల సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ.. 2015 ఆగస్టు 17న తెలంగాణ ప్రభుత్వం గ్రామజ్యోతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో గ్రామాల సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రణాళిక తయారు చేసి సిద్ధంగా ఉంచారు. వాటి అమలుకు గ్రామస్థాయిలో వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రాధాన్యత క్రమం బట్టి గ్రామాల్లో పనులు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. కానీ నేటి వరకు గ్రామజ్యోతి అమలుకు నోచుకోలేదు. కొత్త పంచాయతీల పాలనలోనైనా గ్రామజ్యోతి పథకాన్ని అమలు చేస్తే పల్లెల్లో ప్రగతి కాంతులు నిండే అవకాశం ఉంది. గతంలో సర్పంచులకు అధికారాలే తప్ప నిధులు, బాధ్యతలు ఆశించిన స్థాయిలో ఉండేవి కావు. సర్పంచులకు లక్ష్యాలు ఇలా.. తెలంగాణ సర్కారు కొత్త పంచాయతీ చట్టం వచ్చిన తర్వాత అనే లక్ష్యాలను నిర్ధేశించారు. నిర్ధేశించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేకపోయినా, కేటాయించిన నిధులు నిబంధనల మేరకు సక్రమంగా ఖర్చు చేయలేకపోయినా సర్పంచ్ పదవి తొలగింపుతో పాటు పాలకవర్గాన్ని రద్దు చేసే అవకాశాన్ని కొత్త చట్టంలో పొందుపరిచారు. సర్పంచులకు అధికారాలతో పాటు బాధ్యతలు పెరిగాయి. సర్పంచులు, పాలకవర్గాలు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించేలా కట్టుదిట్టమైన నియమాలు రూపొందించారు. పాత చట్టం ప్రకారం ఉపసర్పంచ్‌పై నాలుగేళ్లకు పైగా అవిశ్వాసం ఉండగా ప్రస్తుతం రెండేళ్లకు కుదించారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురైనా కూడా పాలకవర్గం రద్దు చేసే పరిస్థితి ఉంది. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసినా కూడా రూ.500 జరిమానా విధించనున్నారు. గ్రామాల్లో ప్రధాన సమస్యలివి.. ∙ కొత్త పంచాయతీల్లో కనిపించని వీధి దీపాలు ∙ గ్రామాల్లో ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణాలు ఆయా పంచాయతీల్లో అసంపూర్తిగా నిలిచిపోయాయి. ∙ ఇంకా ఇంటింటికి పూర్తి కాని మిషన్‌భగీరథ నల్లా కనెక్షన్లు ∙ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు, గ్రామాల్లో ఉప ఆరోగ్య కేంద్రాల నిర్వహణ, సమయపాలన పాటించేలా చూడడం. ∙ పాత పంచాయతీల్లో శిథిలావస్థకు చేరిన భవనాలను తొలగించి కొత్త భవనాలు నిర్మించడం, కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో జీపీ భవనాల నిర్మాణాలు ∙ గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి ∙ ప్రతీ గ్రామంలో శ్మశానవాటిక నిర్మించాలి ∙ డంపింగ్ యార్డులను నిర్మించాలి ∙ గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేయాలి బాధ్యతలు పెరిగాయి కొత్త పంచాయతీ చట్టంతో సర్పంచులకు బాధ్యతలు పెరిగాయి. సర్పంచులు విధులు సక్రమంగా నిర్వర్తిస్తూ నిధులను పారదర్శకంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా పాలకవర్గాలపై చర్యలు తప్పవు. – అమరేందర్‌రాజు, ఎంపీడీవో, ఇల్లంతకుంట -
పరిషత్ ఎన్నికలకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు ఊపందుకున్నాయి. మార్చి 5వ తేదీ కల్లా జిల్లా, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్ల కోటా ఖరారు చేయాల్సిందిగా అన్ని జిల్లాల కలెక్టర్లు (హైదరాబాద్ జిల్లా మినహా) జిల్లా ఎన్నికల అధికారులు, జడ్పీ సీఈవోలను పంచాయతీరాజ్ శాఖ ఆదేశించింది. ఈ కోటా ఖరారుకు సంబంధించి ఒక షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ షెడ్యూల్‌కు అనుగుణంగా మండల, జిల్లా పరిషత్ రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నీతూకుమారి ప్రసాద్ ఆదేశించారు. జడ్పీ చైర్పర్సన్ మొదలు, ఎంపీపీ అధ్యక్షులు, జడ్పీటీసీ, ఎంపీటీసీలకు కేటాయించే స్థానాలు, వాటి రిజర్వేషన్ల కోటా ఎవరు ఖరారు చేయాలన్న దానిపై ప్రభుత్వం ఒక షెడ్యూల్‌ను ప్రకటించింది. కొత్త పంచాయతీ చట్టం ప్రకారం... గతేడాది ఆమోదించిన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని ఆయా నిబంధనలకు అనుగుణంగా మండల ప్రజా పరిషత్‌లను, జిల్లా ప్రజాపరిషత్ స్థానాలకు రిజర్వేషన్ల కోటా ఖరారు చేయాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, జడ్పీ సీఈవోలకు పంచాయతీరాజ్ శాఖ సూచించింది. ఎంపీపీ, జడ్పీ ఎన్నికల్లో అమలు చేసేందుకు వీలుగా రిజర్వేషన్ల కోటా ఖరారు చేసి జిల్లా గెజిట్లలో ప్రచురించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ఇదీ షెడ్యూల్... స్థానాలు స్థానాలు నిర్ణయించేది రిజర్వేషన్లు చేసేది ఎప్పటిలోగా ఎంపీపీ అధ్యక్షులు పీఆర్ కమిషనర్ జిల్లా కలెక్టర్ మార్చి 5 జడ్పీటీసీలు జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ మార్చి 5 ఎంపీటీసీలు జిల్లా కలెక్టర్ ఆర్డీవో మార్చి 5 32 జడ్పీలు, 535 జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు, 5,984 ఎంపీటీసీ స్థానాలు రాష్ట్రంలోని 32 జిల్లాలను (జీహెచ్ఎంసీ మినహాయించి) జిల్లా ప్రజా పరిషత్‌లుగా, మొత్తం 535 గ్రామీణ రెవెన్యూ మండలాలను ( 50 పట్టణ స్వభావమున్న రెవెన్యూ మండలాలు మినహాయించి) మండల ప్రజా పరిషత్‌లుగా, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలుగా పరిగణిస్తారు. 32 జిల్లాల్లోని 535 మండలాల పరిధిలో మొత్తం 5,984 ఎంపీటీసీ స్థానాలుగా ప్రాదేశిక నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. తదనుగుణంగా 32 చొప్పున జడ్పీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, 535 జడ్పీటీసీ స్థానాలు, 535 చొప్పున ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, 5,984 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. గతంలో ఎంపీటీసీల సంఖ్య 6,473 ఉండగా, కొత్తగా 68 మున్సిపాలిటీలు ఏర్పడటం, వాటిలో ఆయా మండలాల్లోని గ్రామాలు విలీనం కావడంతో 489 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. గతంలో 9 జడ్పీలు (హైదరాబాద్ మినహాయించి) ఉండగా, ప్రస్తుతం జిల్లాల పునర్విభజన కారణంగా జిల్లాల సంఖ్య 32కు (జీహేచ్ఎంసీ) పెరిగింది. -
శ్రీధర్ బాబు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు..
సాక్షి, హైదరాబాద్ : బడ్జెట్లో గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులు కేటాయించలేదనంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రెండోరోజు శాసనసభ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థలను అద్భుతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. పంచాయతీల నుంచి ఎలాంటి నిధులు తీసుకోలేదని, వాటి పటిష్టత కోసం కొత్త చట్టం తెచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. పంచాయతీరాజ్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పాలనపై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందని వ్యాఖ్యానించారు. జగిత్యాల మున్సిపాలిటీకి రూ.2కోట్ల బకాయిలు గత కాంగ్రెస్ ప్రభుత్వానిదేని అన్నారు. గ్రామ పంచాయతీలకు ఆర్థిక సమస్యలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పంచాయతీలకు తగిన నిధులు ఇవ్వలేదని అన్నారు. వడ్డీ మాఫీ విషయంలోనూ రైతులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతుబంధు పధకంతో పాటు రైతులను ఆదుకోవాలని, అలాగే ఐఆర్ కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని శ్రీధర్ బాబు సభలో ప్రస్తావించారు. మరోవైపు పంచాయతీ రాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఇవాళ సభలో పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. -
గ్రామీణ వికాసానికి గాలి వీస్తోంది
రైతు కేంద్రంగా పాలకుల విధానాలు మారుతున్నాయి. తెలంగాణలో కేసీఆర్ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతుబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మి వంటి పథకాలతో ప్రజానుకూల ప్రభుత్వ విధానాలు, నేరుగా ప్రజలకు ఫలాలు అందించడం అనే పద్ధతికే ప్రాధాన్యత ఇచ్చారు. ఏపీలో అన్ని వ్యవహారాలు పార్టీ కార్యకర్తల కనుసన్నల్లో సాగించే పంథాను బాబు ఎంచుకున్నారు. పార్టీ శ్రేణుల్ని పాలనలో దొడ్డిదారి భాగస్వాముల్ని చేయడం ద్వారా, స్థానిక పంచాయతీ పాలనా వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఈ చీకటిని తొలగించే కొత్త వెలుగు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిరీక్షిస్తున్నారు. మార్పు కోసం ఏపీలోని 12,918 గ్రామ పంచాయతీలు ఎదురుచూస్తున్నాయి. పల్లెకు మంచి రోజులొస్తున్నాయి. సానుకూల వాతావరణం పెరుగుతోంది. ఇక ‘కనిపించని కుట్రల’ను ఛేదించే చొరవ గ్రామస్తులే తీసుకోవాలి. పల్లె కన్నీరు తుడవాలి. సుదీర్ఘకాలం వ్యవసాయం కుదేలవటం వల్ల గ్రామ స్వరూపం మారింది. చేతి వృత్తులు భంగపడి గ్రామం బోసి పోయింది. ఉద్యోగ–ఉపాధి అవకాశాలు సన్నగిల్లి పట్టణాలు, నగరాలకు వలసలు పెరిగాయి. పాలకుల నిర్లక్ష్యమూ తోడై చాన్నాళ్లుగా పల్లె కళ తప్పింది. నిన్నా, ఇవాల్టి వరకు ఏ ఊరు చూసినా జీవం కోల్పోయిన అచే తన కొట్టొచ్చినట్టు కనిపించేది. పరిస్థితులు మెలమెల్లగా మారుతు న్నాయి. పట్టణ, నగర జీవుల్లోనూ పుట్టినూరుపై మమకారం పెరుగు తోంది. చుట్టపు చూపుగానైనా సాగే సొంతూరు పర్యటనలు పెరుగుతున్నాయి. పల్లెతో బంధాన్ని పెనవేస్తున్నారు. పెరిగిన శాస్త్రసాంకేతిక పుణ్యమా అని గ్రామాల్లోనే ఏదైనా సమకూర్చుకునే వెసలుబాటొచ్చింది. నగర జీవనంపై మొహం మొత్తిన సంపన్నులూ, విడిదిలానైనా బాగుంటుందని ఊరితో బంధం పునరుద్దరిస్తున్నారు. పాలకుల విధానాల్లో, రాజకీయ దృక్కోణంలోనూ గ్రామీణ భారతానికి ప్రాధాన్యత పెరుగు తోంది. నాయకుల ఓట్ల గురి కావచ్చు, సంక్షోభం నుంచి రైతును గట్టె క్కించే సర్కార్ల చేయూత కావచ్చు, మారిన పరిస్థితుల్లో గ్రామాలకు నేరుగా నిధులు రావడం కావచ్చు.. కారణం ఏమైతేనేం పల్లెకు ప్రాధా న్యత లభిస్తోంది. కేంద్రం ప్రకటించిన పలు అభివృద్ధి–సంక్షేమ కార్యక్ర మాల్లోనూ గ్రామం కేంద్రబిందువుగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనూ పరిస్థితులు ఆశావహంగా కనిపిస్తు న్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలై తాజా సర్కారు ఏర్పడ్డ క్రమం లోనే పంచాయతీ ఎన్నికలూ ముగిసి గ్రామాలకు కొత్త పాలకులొచ్చారు. పంచాయతీరాజ్ కొత్త చట్టం విస్తృతాధికారాలు కల్పించడంతో పాటు స్థానిక పాలకుల బాధ్యతల్నీ పెంచింది. ఏపీ రాష్ట్రం ఇపుడు శాసనసభ ఎన్నికల ముంగిట్లో నిలిచింది. గ్రామీణ పాలనా విధానం సమూల మార్పు సంకేతాలు వెలువడుతున్నాయి. కొత్త వెలుగుకోసం జనం నిరీ క్షిస్తున్నారు. పల్లెల పునరుద్ధరణకు తెలుగునాట ఇది మంచి తరుణం. విభజనతో రెండు నమూనాలు విభజన తర్వాత ఏర్పడ్డ తెలంగాణ, ఏపీల్లో రెండు వేర్వేరు గ్రామీణ పాలనా నమూనాలు ఆవిష్కృతమయ్యాయి. తెలంగాణలో ముఖ్య మంత్రి చంద్రశేఖరరావు ఒక నమూనా అమలు చేస్తే, ఏపీలో సీఎం చంద్రబాబునాయుడు మరో నమూనాతో వెళ్లారు. ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల లబ్దిదారుల ఎంపిక నుంచి అన్ని వ్యవహారాలు పార్టీ కార్యకర్తల కనుసన్నల్లో సాగించే పంథాను బాబు ఎంచుకున్నారు. పార్టీ శ్రేణుల్ని పాలనలో దొడ్డిదారి భాగస్వాముల్ని చేశారు. స్థానిక పంచాయతీ పాలనా వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఈ దేశంలో బహుళ ప్రచారంలో ఉన్న కమ్యూనిస్టు పాలకుల ‘పశ్చిమ బెంగాల్’ నమూనానే ఆయన నమ్ముకున్నారు. తద్వారా సుదీర్ఘకాలం అప్రతిహతంగా రాజ్యం చేయాలనుకున్నారు. పార్టీ శ్రేణులతో జన్మభూమి కమిటీల ఏర్పాటు చేసి పాలన సాగిస్తున్నారు. కానీ, అదొక విఫల నమూనాగా ధ్రువపడిన విష యాన్ని ఆయన పరిగణనలోకి తీసుకోలేదు. తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ కూడా బెంగాల్లో అదే నమూనాతో ‘పార్టీ శ్రేణుల’ కేంద్రకంగా సాగిస్తున్న పాలన క్రమంగా బెడిసికొడుతోంది. ఆంధ్రప్రదేశ్ లోనూ అవే సంకేతాలు, అవినీతి ప్రజల కళ్లకు కట్టినట్టు కనిపించడం ఈ నమూనాలో బహిరంగ రహస్యం! దీనిపై పూర్తి అవగాహన ఉన్న కేసీఆర్ భిన్నమైన పంథాలో పాలనసాగించారు. ప్రజానుకూల ప్రభుత్వ విధానాలు, అధికార యంత్రాంగంపై సరైన అజమాయిషీ, నేరుగా ప్రజలకు ఫలాలు అందించడం.. అనే పద్ధతికే ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతుబంధు, రైతుబీమా, కళ్యాణ లక్ష్మి.. ఇవన్నీ ఇటువంటివే! పార్టీ శ్రేణుల్ని పాలనలోకి జొరనివ్వలేదు. అందుకే, తమ వ్యక్తిగత అవసరాలు తీర్చలేదని స్థానిక నాయకత్వంపైన, ప్రజాప్రతినిధులపైన ప్రజల్లో బలమైన అసంతృప్తి ఉన్నా, వ్యతిరేకత వెల్లువెత్తినా... ఇటీవలి ఎన్నికల్లో కేసీఆర్ అన్నీ తానై ప్రచారం చేసి ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా మలిచారు. ఘన విజయం సాధించారు. ఇటీవలి కాలంలో పాలకపక్ష శ్రేణులు ప్రజాభిప్రాయాన్ని సర్కా రుకు అనుకూలంగా మలచలేకపోతున్నాయనే ఒక అధ్యయన నివేదిక కేసీఆర్‌ను బాగా ప్రభావితం చేసినట్టుంది. అందుకే ఆయన తొలి నుంచి జాగ్రత్త పడ్డారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పుష్కరకాలం పైగా ఉద్యమించిన పార్టీ అయినా, అధికారంలోకి వచ్చాక పార్టీ శ్రేణుల విచ్చలవిడితనాన్ని ఆయన ప్రోత్సహించలేదు. అట్టడుగుస్థాయిలో జనాభిప్రాయాన్ని పాలక పక్ష శ్రేణులు ఓటుగా మలిచే ప్రభావం క్రమంగా సన్నగిల్లుతోందని ‘అభి వృద్ధి సమాజాల అధ్యయన కేంద్రం’(సీఎస్డీఎస్) పరిశీలనలో వెల్లడైంది. పార్టీలకతీతంగా గ్రామాలు ఎదగాలి తెలంగాణలో కొత్త పంచాయతీ చట్టం అమల్లోకి వచ్చింది. వారం కిందటి నుంచి కొత్త సర్పంచులు, పాలకమండళ్ల పాలన మొదలయింది. పార్టీలతో నిమిత్తం లేకుండా జరిగిన ఈ ఎన్నికల్లో యువతరం ఉత్సాహం పతాకస్థాయికి చేరింది. పెద్ద సంఖ్యలో యువత సర్పం చులుగా, వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారు. ప్రధాన పార్టీలు కూడా పెద్దగా పట్టింపులకు వెళ్లలేదు. ఒక పార్టీకే చెందిన ఇద్దరు, ముగ్గురు కూడా పోటీ చేశారు. పదేళ్లపాటు రిజర్వేషన్లు మారవనేది ప్రభావం చూపింది. బాగా పనిచేస్తే మరో దఫా ఎన్నికవొచ్చన్న భరోసా కలిగింది. ఈ సారి పట్టణాలు, నగరాల్లోని వ్యాపార–వాణిజ్య వేత్తలు, సంప న్నులు, మేధావులు తమ సొంతూళ్ల పంచాయతీ ఎన్నికల పట్ల ఆసక్తి చూపారు. అక్కడక్కడ తమ వారనుకునే అభ్యర్థులకు మద్దతో, సహాయ సహకారాలో అందించారు. పలుచోట్ల పట్టుబట్టి గెలిపించుకున్నారు. ఇదొక ప్రగతి సంకేతం! గ్రామ పంచాయతీలను పరిపుష్టం చేయడంలో, నిధుల్ని సక్రమంగా వినియోగించి గ్రామాభివృద్ధి సాధించడంలోనూ ఈ సహకారం కొనసాగాలి. పల్లె పట్టణం పెనవేయాలి. త్వరలో పంచాయతీ ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇవ్వనున్న శిక్షకులను చైతన్యపరుస్తూ మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీయార్ ప్రభుత్వ సంకల్పాన్ని విస్పష్టంగా చెప్పారు. గ్రామాభివృద్ధికి గ్రామస్తులే బాధ్యత వహించాలన్నారు. పాల కమండళ్లు నిబద్దతతో, లక్ష్యసాధనపై గురి–జవాబుదారితనంతో పనిచే యాలని పిలుపునిచ్చారు. 15వ ఆర్థిక సంఘం, కేంద్ర–రాష్ట్ర పథకాలు, ఎమ్మెల్యే–ఎమ్మెల్సీ–ఎంపీల అభివృద్ధి నిధులు.. ఇలా వివిధ పద్దతుల్లో గ్రామాలకు రాబోయే అయిదేళ్లలో నలబై వేల కోట్ల రూపాయలు రాను న్నాయని చెప్పారు. తెలంగాణలో 12,751 గ్రామ పంచాయతీలు న్నాయి. ఇదొక సువర్ణావకాశం. కొత్త చట్టం ఎన్నో అవకాశాల్ని కల్పి స్తోంది. ప్రతి రెండు నెలలకోసారి జరిగే గ్రామ సభలో గ్రామస్థులు విధిగా పాల్గొని, అభివృద్ది–సంక్షేమాన్ని గరిష్టంగా సాధించుకోవాలి. అధికారాలే కాకుండా వైఫల్యాలకు ప్రజాప్రతినిధుల్ని బాధ్యుల్ని చేసే, అవసరమైతే సర్పంచ్‌ను కలెక్టర్ సస్పెండ్ చేసే నిబంధనలు కూడా చట్టంలో ఉన్నాయి. అలా అని, పాలకపక్షం తన రాజకీయ ప్రయోజ నాలు నెరవేర్చుకునే సాధనంగా, దీన్ని సర్పంచుల ‘తలపై నిరంతరం వేలాడే కత్తి’ చేయకుండా ప్రజలే ప్రతిఘటించాలి. అవినీతిని అడ్డగించి, మంచిని సాధించుకునేలా నిఘావేయాలి. రాజ్యాంగేతర శక్తులకు చరమగీతం విభజన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి అవకాశాలు క్రమంగా సన్నగిల్లాయి. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది దారుల ఎంపికలో ఏ రాజ్యాంగబద్దత లేని జన్మభూమి కమిటీలకు ప్రాధాన్యతనివ్వటంతో అవినీతి రాజ్యమేలుతోంది. ఈ చీకటిని తొల గించే కొత్త వెలుగు కోసం ఏపీ ప్రజలు నిరీక్షిస్తున్నారు. చట్టబద్దమైన గ్రామసచివాలయాన్ని కేంద్రబిందువుగా చేసి, గ్రామీణ వికాసానికి బాటలు పరుస్తామని విపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెబుతున్న మాటలు ఇక్కడి ప్రజల్లో కొత్త ఆశలు రేపుతున్నాయి. దానికి కారణం, గ్రామీణ పాలనా వ్యవస్థను ఏపీలో బాబు ప్రభుత్వం బలహీనపరచడమే! ప్రజలతో ఎన్నికైన సర్పంచులు, పాలక మండళ్లను నిర్వీర్యం చేసి, పార్టీ కార్యకర్తలు కీలకంగా ఉండే జన్మభూమి కమిటీలకు పెత్తనం అప్పగించింది. రేషన్‌కార్డులు, ఇళ్లు, పెన్షన్లు... ఇలా ఏ ప్రయో జన లబ్దిదారుల ఎంపికలోనైనా వారిదే కీలక భూమిక! కేంద్ర ప్రభుత్వ నిధుల్ని కూడా రాష్ట్ర కేంద్రీకృత పథకాలకు దారి మళ్లించడం ఇక్కడ రివాజయింది. 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిదులకు కూడా దిక్కులేని పరిస్థితి! రెండు వేల జనాభా ఉన్న గ్రామాలకు కూడా ఏటా 9 లక్షల రూపాయలకు తగ్గని నిధులు వస్తున్నా, అవి నేరుగా గ్రామాభివృద్ధికి దక్కడం లేదు. చంద్రన్న బాట, సాలిడ్‌వేస్ట్ మేనేజ్మెంట్.. ఇలా ఏవేవో పథకాల్లోకి మళ్లించి వ్యయం చేస్తున్నారు. స్థానికంగా పన్నులు విధిం చడం ద్వారా ఏటా లభించే దాదాపు 500 కోట్ల రూపాయల్నీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కేంద్రీకృత కార్యక్రమాల్లో వ్యయం చేస్తున్నారు. గ్రామాల స్థానిక పరిస్థితిని బట్టి, అక్కడి అవసరాలు తీర్చుకునే వెసు లుబాటు కూడా వారికి లేకుండా చేస్తున్నారు. త్వరలోనే రాష్ట్ర శాసన సభకు ఎన్నికలు జరుగనున్న వేళ, ఈ దుస్థితిని తప్పించే అవకాశం కోసం ఏపీలోని 12,918 గ్రామ పంచాయతీలు నిరీక్షిస్తున్నాయి. ఇదే మంచి తరుణం గ్రామీణ వికాసానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నట్టు ఇటీవలి బడ్జెట్ స్పష్టం చేసింది. రైతుకు పెట్టుబడి, అసంఘటిత కార్మికులకు పెన్షన్, వైద్య పథకం విస్తరణ, గ్రామీణ రోడ్లు 3 రెట్లు పెంచడం, ‘గ్రామ్ జ్యోతి’ ప్రాధాన్యత, లక్ష గ్రామాల డిజిటలైజేషన్, ఉపాధిహామీకి నిధుల పెంపు... వంటివన్నీ గ్రామీణ వికాసానికి సానుకూల చర్యలే! కేంద్ర రాష్ట్రాలు కలిసి గ్రామాలను ఆర్థిక, ఉత్పత్తి కేంద్రాలుగా చేయాలి. గ్రామీణ గ్రోత్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. వ్యవసాయ మార్కెట్ సదు పాయాలు పెంచాలి. స్థానికంగా ఉద్యోగ–ఉపాధి అవకాశాల్ని మరింత మెరుగుపరచాలి. ఇదొక మంచి తరుణం. గ్రామీణ ప్రజానీకం, ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండి ప్రతి అవకాశాన్ని అందిపుచ్చు కోవాలి, సానుకూలంగా మలచుకోవాలి. ప్రగతి పల్లవించాలి, మళ్లీ పల్లెలు వికసించాలి. గడపగడపన ఆనందం వెల్లివిరియాలి. పూజ్య బాపూజీ కలలుకన్న ‘గ్రామస్వరాజ్యం’ విరాజిల్లాలి. దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
పోలింగ్ రోజే ఉపసర్పంచ్ ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలుచేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామపంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితా, ఎన్నికల ప్రక్రియలకు కొత్త చట్టంలోని నిబంధనలను వర్తింపజేస్తూ ప్రభుత్వం శనివారం 4 ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్, జిల్లా ప్రజాపరిషత్ వైస్ చైర్పర్సన్, మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు, మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షుడు, కో ఆప్షన్ సభ్యుడు, ఉప సర్పంచ్ ఎన్నికల నిర్వహణ విషయంలో కొత్త చట్టం లోని నిబంధనలు అమల్లోకి తెస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. ఏ ఎన్నిక విషయంలోనూ మార్పులు లేకుండా నిబంధనలు ఉన్నాయి. గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగిన రోజే ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించాలి. ఫలితాలు వెల్లడించిన తర్వాత సమావేశం నిర్వహించి ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. మొత్తం వార్డు సభ్యులో సగం మంది హాజరు కావాలి. సమావేశం మొదలైన గంటలోపు కోరం సరిపడా సభ్యులు పాల్గొనాల్సి ఉంటుంది. -
గ్రామ స్వరాజ్యమే లక్ష్యం: జూపల్లి
సాక్షి, హైదరాబాద్: గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చిందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాజేంద్రనగర్‌లోని టీఎస్ఐపార్డ్లో గురువారం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారులు, మండల విస్తరణ అధికారులకు నూతన పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పంచాయతీరాజ్ చట్టం 25 ఏళ్ల కిందటే రూపొందించినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వాటిల్లో మార్పులు చేశామని తెలిపారు. కొత్త పంచాయతీరాజ్ చట్టంపై అధికారులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ చట్టం ద్వారా సర్పంచులు, పాలక వర్గాలకు పూర్తి అధికారాలు ఇస్తున్నామని, గ్రామాలకు నిధులు కూడా పెంచుతున్నామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. పంచాయతీరాజ్ చట్టాన్ని మార్పులు చేసి అమలు చేసుకున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపారు. ఇప్పటికే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, టీఎస్ఐపాస్ లాంటి సరికొత్త పథకాలతో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ పేరొందిందని అన్నారు. -
అతిక్రమణకు ‘పంచాయతీ’ జరిమానా
సాక్షి, హైదరాబాద్ : కొత్త పంచాయతీరాజ్ చట్టంలో పారిశుధ్య చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించింది. ఈ మేరకు చట్టంలో పలు నిబంధనలను పొందుపరిచింది. అనుమతి లేకుండా మాంసం విక్రయించినవారికి రూ.200, జంతువధశాల బయట గొర్రెలు, మేకలు, పశువులను వధిస్తే రూ.2 వేలు జరిమానా విధిస్తారు. తాగునీటి వనరులకు రెండు వందల మీటర్ల లోపు జంతు కళేబరాన్ని పారవేసినా, పాతిపెట్టినా.. రోడ్డుపై, మార్కెట్ వద్ద, బావుల దగ్గర, చెరువుల వద్ద వినోద కార్యక్రమాలను నిర్వహించినా రూ.వెయ్యి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కడపడితే అక్కడ దుకాణాలు ప్రారంభించకుండా నిబంధనలను కఠినతరం చేశారు. ప్రభుత్వస్థలంలోగానీ, రోడ్డుపైనగానీ ప్రైవేటు మార్కెట్‌ను నిర్వహిస్తే రూ.5 వేలు జరిమానా విధిస్తారు. పంచాయతీ పాలక వర్గానికి అధికారం పర్యావరణ పరిరక్షణ విషయంలోనూ నిబంధలను కఠినతరం చేశారు. అనుమతి లేకుండా చెట్టు నరికితే ఏకంగా రూ.2 వేలు జరిమానా కట్టాల్సి ఉంటుంది. పంచాయతీ ఆస్తులు ఆక్రమించితే చర్యలతోపాటు ఇదే మొత్తంలో అపరాధ రుసుమును విధించే అధికారం గ్రామపంచాయతీకి ఉంటుంది. రోడ్డు నిర్మాణాలు, ఇతర తవ్వకాల సమయంలో మట్టిని, రాళ్లను అక్కడి నుంచి తరలించే విషయంలో జాప్యం చేసినా రూ.2 వేలు జరిమానా ఉం టుంది. రోడ్డుపై, ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా ఎడ్ల బండ్లను నిలిపినా ఇదే రకమైన చర్యలు ఉంటాయి. అనధికారికంగా ఇంటి నంబరు మార్చినా, కనిపించకుండా చెరిపేసినా రూ.50 జరిమానా ఉంటుంది. పంచాయతీరాజ్ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించే అధికారం పూర్తిగా గ్రామ పంచాయతీ పాలకవర్గానికి ఉంటుంది. గ్రామ పంచాయతీ తరఫున కార్యదర్శి నిర్ణయాలను అమలు చేస్తారని చట్టంలో పేర్కొన్నారు. -
ఎంపీటీసీ జెడ్పీటీసీలకూ పదేళ్ల రిజర్వేషన్
సాక్షి, హైదరాబాద్ : కొత్త పంచాయతీరాజ్ చట్టంలో స్థానిక సంస్థల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. గ్రామ పంచాయతీల తరహాలోనే మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ పాలకవర్గాల రిజర్వేషన్ల కేటాయింపును మార్చింది. రెండు వరుస ఎన్నికల్లోనూ ఒకే రిజర్వేషన్లు ఉంటాయని స్పష్టం చేసింది. జెడ్పీటీసీ సభ్యుడు, ఎంపీటీసీ సభ్యుడు, జిల్లా పరిషత్ చైర్మన్, మండల పరిషత్ చైర్మన్ ఎన్నికల విషయంలో పదేళ్లు ఒకే కేటగిరీకి కేటాయించనుంది. సర్పంచ్ల తరహాలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు పోటీ విషయంలో ఎలాంటి విద్యార్హతలు ఉండవని చట్టంలో పేర్కొంది. పాలకవర్గం ముగియగానే... రాష్ట్ర ప్రభుత్వం గతేడాది చేపట్టిన జిల్లాలు, మండలాల పునర్విభజన ప్రకారం కొత్త జిల్లా ప్రజా పరిషత్‌లు, మండల ప్రజా పరిషత్‌లు ఏర్పాటవుతాయని చట్టంలో పేర్కొన్నారు. ప్రస్తుత జెడ్పీలు, ఎంపీపీల పాలకవర్గాల పదవీకాలం ముగియగానే కొత్త జిల్లాలు, మండలాలను ప్రత్యేక యూనిట్‌గా మారుతాయి. తెలంగాణ జిల్లాల ఏర్పాటు చట్టం–1974 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లాల యూనిట్‌గా జిల్లా ప్రజా పరిషత్ ఏర్పాటవుతుంది. అలాగే కొత్త మండలం యూనిట్‌గా మండల ప్రజా పరిషత్ ఏర్పడుతుంది. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం 2019 జూలైతో ముగిశాక కొత్త జెడ్పీలు, మండలాలు ఏర్పాటైనట్లుగానే భావించాల్సి ఉంటుంది. 30కి పెరగనున్న జెడ్పీలు... రాష్ట్ర ప్రభుత్వం 2016 అక్టోబర్‌లో చేపట్టిన జిల్లాల పునర్విభజనలో జిల్లాల సంఖ్య 10 నుంచి 31కి పెరిగింది. హైదరాబాద్ పూర్తిగా నగరపాలక సంస్థ పరిధిలో ఉండటంతో దీనికి జిల్లా ప్రజా పరిషత్ లేదు. ప్రస్తుతం తొమ్మిది జిల్లా ప్రజా పరిషత్‌లు ఉన్నాయి. వాటి పదవీకాలం ముగియగానే 30 జిల్లా ప్రజా పరిషత్‌లు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 438 మండల ప్రజా పరిషత్‌లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాలు, మండలాల పునర్విభజనలో 96 గ్రామీణ మండలాలు ఏర్పడ్డాయి. కొత్తగా ఏర్పడిన గ్రామీణ మండలాల సంఖ్యతో కలిపితే మండల ప్రజా పరిషత్‌ల సంఖ్య 534కు పెరగనుంది. అలాగే ప్రతి గ్రామీణ మండలం యూనిట్‌గా జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (జెడ్పీటీసీ) ఉంటుంది. ఈ లెక్కన జెడ్పీటీసీ సభ్యుల సంఖ్య సైతం 534కు పెరగనుంది. ప్రస్తుత విధానమే... జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్‌లకు ప్రస్తుతం ఉన్న విధానంలోనే ఎన్నికలు జరగనున్నాయి. మండలంలోని మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం(ఎంపీటీసీ) సభ్యులు ప్రత్యక్షంగా ఎన్నికవుతారు. ఎంపీటీసీ సభ్యులు కలసి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఎంపీటీసీ సభ్యుల్లో ఒకరిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. అలాగే జెడ్పీటీసీ సభ్యులను మండలంలోని ఓటర్లు ఎన్నుకుంటారు. జెడ్పీటీసీ సభ్యులు జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. జెడ్పీటీసీ సభ్యుల్లో ఒకరిని జెడ్పీ వైస్ చైర్మన్‌గా ఎన్నుకుంటారు. ఎప్పటిలాగే పదవీకాలం ఐదేళ్లు ఉంటుంది. పదేళ్లకోసారి రిజర్వేషన్లు మారుతాయి. రొటేషన్ విధానం అమలు చేస్తారు. రాజకీయ పార్టీల గుర్తులతోనే ఎన్నికలు జరుగుతాయి. పార్టీల తరఫున ఎన్నికైన వారికి ఎంపీపీ, జెడ్పీ చైర్పర్సన్ ఎన్నికల్లో ఆయా పార్టీలు విప్ జారీ చేస్తాయి. ఎన్నికల సంఘం కమిషనర్‌గా ఐఏఎస్... కొత్త పంచాయతీరాజ్ చట్టంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహణ ప్రక్రియను మార్చారు. దీని ప్రకారం ముఖ్య కార్యదర్శి హోదాగల ఐఏఎస్ అధికారిని మాత్రమే రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నియమించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు గవర్నర్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ను నియమిస్తారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలన్నీ రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోనే ఉంటాయి. పంచాయతీరాజ్ సంస్థలకు గడువులోగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ప్రక్రియలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు పూర్తి చేయాల్సి ఉంటుంది. -
మొక్క ఎండిందా.. పదవి గోవిందా!
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ చట్టం మరింత పదునుగా రూపొందుతోంది. హరితహారానికి రక్షణగా నిలవబోతోంది. హరితహారం మొక్కలు 75 శాతం బతక్కపోతే సర్పంచ్‌ని డిస్మిస్ చేసేలా పంచాయతీరాజ్ చట్టం రాబోతుందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శనివారం ఆయన జిల్లా వ్యవసాయాధికారుల (డీఏవో)తో సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ చట్టంలో అనేక ప్రతిపాదనలు రూపొందిస్తున్నారని పోచారం చెప్పారు. వ్యవసాయాధికారుల సాగు లెక్కలు, వాస్తవాలకు దూరంగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. ‘అవును... మేం ఇచ్చిన నివేదికల కంటే క్షేత్రస్థాయిలో ఎక్కువగానే సాగైనట్లుగా ఉంద’ని నిజామాబాద్ అధికారి ఒప్పుకోవడంతో మంత్రి ఇంకాస్త మండిపడ్డారు. తక్కువ సాగు చూపిస్తే ఆహార పంటల ఉత్పత్తులు కూడా అదేస్థాయిలో తక్కువగా నమోదవుతాయని పేర్కొ న్నారు. ఈ రబీలో సాధారణంగా 32 లక్షల ఎకరాలు మాత్రమే సాగవుతాయని చెబుతున్నారని, అది 40 లక్షల ఎకరాలకు మించి ఉంటుందని మంత్రి అంచనా వేశారు. వారం రోజుల్లో కొత్త లెక్కలు నమోదు చేయాలని ఆదేశించారు. వారం రోజుల్లో కొత్తగా 851 మంది వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈవో)లు రాబోతున్నారని, మొత్తం వారి సంఖ్య 2,638 అవుతుందన్నారు. దీర్ఘకాలంగా ఒకేచోట ఉద్యోగం చేస్తున్న ఏఈవోలకు స్థానచలనం చేసి కొత్తవారిని నియమించాలని ఉన్నతాధికారులకు సూచించారు. రుణాలు తీసుకునే రైతులందరి నుంచీ బీమా చేయించాలన్నారు. ట్రాక్టర్ల కోసం నా వద్దకు పంపుతారా? సబ్సిడీ ట్రాక్టర్ల కోసం ఎమ్మెల్యేలను తన వద్దకు డీఏవోలు పంపుతుండటంపై పోచారం ఆగ్రహం వ్యక్తంచేశారు. వారంతా వచ్చి ప్రత్యేక కోటా కింద ట్రాక్టర్లు అడుగుతున్నారని, ఫలితంగా తాను హైదరాబాద్ రావడానికే జంకాల్సి వస్తోందన్నారు. పూర్వ జిల్లాల ప్రకారం ట్రాక్టర్ల మేళా పెడితే బాగుంటుందని, ఒకేచోట ట్రాక్టర్లను పంపిణీ చేయాలన్నారు. ఖమ్మంలో ఒకేసారి వెయ్యి ట్రాక్టర్లు పంచుతున్నామని చెప్పారు. ఈసారి వ్యవసాయశాఖకు ప్రత్యేక బడ్జెట్ పెట్టబోతున్నామని, వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ సొమ్ము రూ.5 వేల కోట్లు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా పలువురు ఉత్తమ డీఏవోలను మంత్రి సన్మానించారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి, కమిషనర్ డాక్టర్ జగన్మోహన్, అడిషనల్ డైరెక్టర్ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గాంధీభవన్‌లో టీపీసీసీ ముఖ్యనేతల భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు గురువారం గాంధీభవన్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. బేటీలో తెలంగాణలో నూతన పంచాయితీ రాజ్ చట్ట సవరణ వ్యవహారంపై చర్చించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కొత్త పంచాయితీ రాజ్ చట్టం తీసుకురావాలని యత్నిస్తున్న నేపధ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించామన్నారు. సీఎం కేసీఆర్ మూడేళ్ళ పాలనలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులే కానీ .. రాష్ట్ర నిధులు ఒక్క రూపాయికూడా ఇవ్వలేదన్నారు. పంచాయితీ రాజ్ చట్టంలో తీసుకొస్తున్న మార్పులపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్ చేశారు. సర్పంచ్‌లకు నేరుగానే ఎన్నికలు జరగాలని.. పరోక్ష ఎన్నికలకు తాము ఒప్పుకోబోమన్నారు. వార్డ్ మెంబర్స్ ను కొనుగోలు చేసేందుకే టీఆర్ఎస్ పరోక్ష ఎన్నికలంటోందన్నారు. ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేయడంలో టీఆర్ఎస్ బాగా ఆరితేరిందని విమర్శించారు. ఈ నెల 23 న అన్ని గ్రామ పంచాయతీలలో సమావేశాలు నిర్వహణ, 27న అన్నినియోజకవర్గాల్లో సమావేశాలు పెట్టి తహసీల్దార్లకు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. ఈ నెల 30 న ఉమ్మడి జిల్లాల కలెక్టర్స్ కు వినతిపత్రాలు అందజేస్తామన్నారు. డిసెంబర్ లో ప్రచురించాల్సిన ఓటర్ల జాబితా ఇంతవరకు ప్రచురించలేదని.. దాని వెనుక ఉన్న మతలబు ఏమిటీ .. ఈ జాప్యం వెనుక ఎవరున్నారని ఉత్తమ్ ప్రశ్నించారు. కొత్తగా ఏర్పాటు కాబోతున్న గ్రామపంచాయతీలకు మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం యాభై లక్షలు ఇవ్వాలన్నారు. ముందస్తు సర్పంచ్ ఎన్నికలు అంటే ప్రస్తుత సర్పంచులను అవమానించడమేనని తెలిపారు. రైతుల పాస్ పుస్తకాలు బ్యాంకుల నుంచి ఇప్పించిన తర్వాతే కొత్త పాస్ బుక్స్ ఇవ్వాలని ఉత్తమ్ తెలిపారు. -
ప్రత్యక్ష ఎన్నికలే మేలు: చాడ
సాక్షి, హైదరాబాద్: పంచాయతీల్లో ప్రత్యక్ష ఎన్నికల విధానమే సరైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. వార్డు సభ్యుల ద్వారా సర్పంచ్‌ను ఎన్నుకోవడమంటే గ్రామాల్లో కక్షలకు బీజం వేయడమేనని ఆయన హెచ్చరించారు. పంచాయతీరాజ్ చట్ట సవరణపై తొందరపాటు నిర్ణయాలు వద్దన్నారు. దీనిపై అన్ని పార్టీలతో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని మంగళవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. పదవీకాలం పూర్తయిన సహకార సంఘాలకు ఎన్నికలను నిర్వహించకుండా గడువు ఉన్న పంచాయతీలకు ఎన్నికలంటూ హడావుడి చేయడం సరికాదన్నారు. -
పంచాయతీరాజ్ చట్టంపై సబ్‌కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో నూతన పంచాయతీరాజ్ చట్టం రూపకల్పనపై మంగళవారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కేటీఆర్, తుమ్మల నాగేశ్వర్రావు, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు సంబధిత అధికారులు హాజరయ్యారు. కాగా,రాష్ట్రంలో నూతన పంచాయతీరాజ్ చట్టం తీసుకురావాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం అందుకోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. -
కొత్త పంచాయతీరాజ్ చట్టం రావాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొత్త పంచాయతీరాజ్ చట్టం రూపకల్పన జరగాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అమలులో ఉన్న పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించినప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవని, మారిన పరిస్థితులను బేరీజు వేసుకుని కొత్త చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం రూపకల్పన, గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే అంశంపై శనివారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం అమల్లోఉన్న చట్టం తయారు చేసినప్పుడు గ్రామ పంచాయతీలు ఎలాంటి విధులు నిర్వహించాలనే విషయంపై అనేక విధివిధానాలు, మార్గదర్శకాలు రూపొందించారన్నారు. తదనంతర కాలంలో అనేక మార్పులు వచ్చాయని, గ్రామ పంచాయతీలకు కొన్ని బాధ్యతలు తొలిగాయని, మరికొన్ని బాధ్యతలు పెరిగాయని సీఎం అన్నారు. గతంలో మంచినీటి సరఫరా గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేదని, ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకుంటున్నదని సీఎం చెప్పారు. ప్రజావైద్యం, రహదారుల నిర్మాణం, చెరువుల నిర్వహణ, మంచినీటి సరఫరా తదితర అంశాలు ఇప్పుడు ఆయా శాఖల పరిధిలోకి వెళ్లాయని చెప్పారు. పచ్చదనం అభివృద్ధి, పరిశుభ్రతను కాపాడటం, జనన–మరణ–వివాహ రిజి స్ట్రేషన్లు చేయడం, శ్మశాన వాటికల నిర్వహణ, డంప్ యార్డుల ఏర్పాటు, గ్రామ ప్రణాళికల తయారీ లాంటి కొత్త బాధ్యతలు వచ్చి చేరాయని సీఎం అన్నారు. ఆదాయ వనరుల్లోనూ వ్యత్యాసం గతంలో గ్రామ పంచాయతీలకు ఉన్న ఆదాయ వనరులకు, ఇప్పుడున్న మార్గాలకు వ్యత్యాసం ఉందని, దానికి అనుగుణంగా గ్రామ పంచాయితీలు చేయాల్సిన పనులుంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గ్రామ పంచాయతీలకు నిర్ధిష్టమైన విధులు–నిధులు–బాధ్యతలు అప్పగించాలని, పని చేసే పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకురావాలని, ఇందుకు అనుగుణంగా కొత్త చట్టం రూపకల్పన జరగాలని సీఎం ఆకాంక్షించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సలహాదారు చెల్లప్ప, ఎంపీ వినోద్‌కుమార్, పంచాయతీ రాజ్ కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, డిప్యూటీ కమిషనర్లు పి.రామారావు, కె. సుధాకర్, రంగారెడ్డి డీపీఓ కె.పద్మజా రాణి, మెదక్ డీపీవో సురేశ్ మోహన్, పంచాయతీరాజ్ – గ్రామీణాభివృద్ధి సంస్థ కన్సల్టెంట్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
500 జనాభా.. 2 కి.మీ. దూరం
సాక్షి, హైదరాబాద్: కనీసం 500 జనాభా.. ప్రధాన గ్రామం నుంచి 2 కిలోమీటర్ల దూరం.. ప్రత్యేక భౌగోళిక పరిస్థితులు.. కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటులో ఈ అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా మరో నాలుగు వేలకు పైగా గ్రామ పంచాయతీలు ఏర్పడతాయని ప్రాథమికంగా అంచనా వేస్తోంది. కొత్త పంచాయతీరాజ్ చట్టంలో భాగంగా గిరిజన తండాలు, కోయ, గోండు గూడేలు, చెంచు పల్లెలను, ప్రధాన పంచాయతీలకు దూరంగా ఉన్న శివారు గ్రామాలను కొత్త గ్రామ పంచాయతీలుగా మార్చాలని మంత్రివర్గం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం వెంటనే కసరత్తు ప్రారంభించింది. జనాభా, దూరం వివరాలతో.. ప్రతిపాదనల తయారీకి సదరు ఆవాసం (పల్లె, తండా, గూడెం)లో ఉన్న జనాభా, ప్రస్తుతమున్న పంచాయతీకి ఎంత దూరంలో ఉందనేది కీలకంగా పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం కలెక్టర్లకు సూచించింది. 500, ఆపై జనాభా ఉన్న ఆవాసాలు, ప్రస్తుతం పంచాయతీకి కనీసం రెండు కిలోమీటర్ల దూరం ఉన్న వాటి సమాచారం వెంటనే పంపించాలని కోరింది. అనంతరం మరిన్ని వివరాలతో మరో విడత సమాచారం పంపించాలని సూచించింది. అందులో ప్రధాన పంచాయతీకి కనీసం రెండు కిలోమీటర్ల దూరం ఉండి.. 600కు పైగా, 750కు పైగా, 1000కిపైగా జనాభా ఉన్న ఆవాసాల వివరాలను మూడు వేర్వేరు కేటగిరీలుగా పంపించాలని స్పష్టం చేసింది. వీటితోపాటు ప్రస్తుత పంచాయతీకి 3, 4, 5 కిలోమీటర్లకు మించి దూరమున్న ఆవాసాల జాబితాలను విడిగా పంపించాలని సూచించింది. ఇప్పుడున్నవి 8,685 గ్రామాలు ప్రస్తుతం రాష్ట్రంలో 8,685 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటి పరిధిలో మొత్తంగా 21,768 జనావాసాలు (హ్యాబిటేషన్లు) ఉన్నాయి. కొన్ని గ్రామ పంచాయతీల పరిధిలో రెండు, మూడు ఆవాసాలుండగా... ఆదిలాబాద్ జిల్లా వంటి ప్రాంతాల్లో పలుచోట్ల ఒకే పంచాయతీ పరిధిలో ఇరవై నుంచి 30 వరకు ఆవాసాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భౌగోళికంగా ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఎక్కడికక్కడ కనీసం 50, 60కిపైగా ఇళ్లున్న ఆవాసాలను సైతం గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. చిన్న రాష్ట్రాల తరహాలో చిన్న గ్రామాలుంటేనే పల్లెల సమగ్ర అభివృద్ధి సాధ్యమవు తుందని.. బాధ్యతాయుతమైన స్థానిక సంస్థల పాలన ప్రజల చెంతకు చేరుతుందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో వీలైనన్ని అం శాల ఆధారంగా కొత్త పంచాయతీల ప్రతిపాద నలు తయారు చేస్తామని అధికారులు చెబుతు న్నారు. ప్రస్తుత అంచ నాల ప్రకారమైతే మరో నాలుగు వేలకుపైగా కొత్త పంచాయతీలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని... దీంతో రాష్ట్రంలో గ్రామపంచాయతీల సంఖ్య దాదాపు 13 వేలకు చేరుతుందని పంచాయతీరాజ్ వర్గాలు లెక్కలేస్తున్నాయి. మూడు అంశాలతో.. కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసేందుకు మూడు అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఆ జనావాసం ప్రధాన గ్రామం నుంచి ఎంత దూరంలో ఉంది, ఆవాసంలో ఉన్న జనాభా ఎంత, అక్కడి భౌగోళిక పరిస్థితులు ఏమిటనేది పరిశీలించనుంది. ఇక కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు సమయంలో తరహాలోనే.. ఇప్పుడు కూడా ప్రజల అవసరాన్ని బట్టి కోరినన్ని కొత్త పంచాయతీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులకు సూచించారు. దీంతో ఆగమేఘాలపై ప్రతిపాదనల తయారీకి పంచాయతీరాజ్ శాఖ చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు అవసరమైన సమాచారం కోరుతూ అన్ని జిల్లాల కలెక్టర్లకు మంగళవారం సర్క్యులర్ జారీ చేసింది. స్థానిక సంస్థల సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం కొత్త పంచాయతీలను ఏర్పాటు చేస్తున్నట్లు అందులో పేర్కొంది. ఒక రోజు వ్యవధిలోనే ఆయా సమాచారం పంపించాలని పంచాయతీరాజ్ కమిషనర్ అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల వారీగా పక్కాగా ప్రతిపాదనలు తయారు చేసేందుకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకావాలని సూచించారు. -
పంచాయతీరాజ్ చట్టంలో సమూల మార్పులు
సవరణకు సర్కారు యోచన పనిచేయని సర్పంచులు, కార్యదర్శుల తొలగింపు వందశాతం పన్నులు వసూలు చేస్తే ప్రోత్సాహకాలు పంచాయతీలకు ర్యాంకింగ్‌లు, నిధుల వ్యయంపై సామాజిక తనిఖీ తండాలను పంచాయతీలుగా మార్చడంపై ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్లకు ఆదేశం బ్రాడ్‌బ్యాండ్ వసతి ఉన్న గ్రామాల్లో నెట్ కనెక్షన్లు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రామ పంచాయతీలకు విశేష అధికారాలు కల్పించడంతోపాటు, పనితీరు సరిగాలేని పంచాయతీలపై చర్యలు తీసుకోవడానికి వీలుగా చట్ట సవరణ చేయాలని రాష్ట్రప్రభుత్వం ఆలోచిస్తోంది. గ్రామ పంచాయతీలు వందశాతం పన్నులు వసూలు చేస్తే..వాటికి ర్యాంకింగ్‌లు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలని, అలాగే ఏమాత్రం పనిచేయని సర్పంచులు, కార్యదర్శులకు ఉద్వాసన పలికే విధంగా చట్టంలో మార్పు చేయాలని ఆలోచిస్తున్నట్లు ఉన్నతస్థాయివర్గాలు వివరించాయి. ప్రభుత్వం నుంచి పంచాయతీలకు ఇచ్చే గ్రాంట్లలోనూ ఆయా పంచాయతీల పనితీరు ఆధారంగా నిధులు విడుదల చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఒకసారి ఎన్నికైతే ఐదేళ్లు నిశ్చింతంగా ఉండొచ్చనే అలసత్వ ధోరణి వల్లే పంచాయతీల అభివృద్ధి జరగడం లేదని, అన్నింటికీ ప్రభుత్వం వైపు చూడడం స్థానిక సంస్థలకు తగదన్న సందేశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక వృద్ధి, స్వయం పాలన దిశగా స్థానిక సంస్థలు ఎదగాలన్న నిర్ణయం మేరకు పంచాయతీరాజ్ చట్టాన్ని పూర్తిగా సవరించనున్నట్లు తెలిసింది. గ్రామ పంచాయతీలు అధికారాలు కావాలని కోరుతున్నాయని, వాటితోపాటు జవాబుదారీతనం కూడా ఉండాలన్నది ప్రభుత్వ అభిప్రాయంగా కనిపిస్తోంది. గ్రామ పంచాయతీలే ఇకపై ఉపాధి హామీ పథకంలో పనులు గుర్తించడం, అమలు చేయడం, కూలీలకు వందరోజుల పనిదినాలు కల్పించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయడంతోపాటు, ఉపాధి హామీ, పెన్షన్ల పంపిణీ, వ్యవసాయం తదితర అంశాలను గ్రామ పంచాయతీలకు అప్పగించనున్నారు. గ్రామ పంచాయతీల్లో పనిచేసే సిబ్బందికి ఆయా పంచాయతీలే వేతనాలు చెల్లించుకునేలా స్వయం సమృద్ధి సాధించాల్సి ఉంటుంది. కేవలం గ్రామ కార్యదర్శులకు మాత్రమే ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తుంది. ప్రస్తుతం నగరాలు, పట్టణాల్లో అందిస్తున్న అన్నిరకాల సేవలను గ్రామ పంచాయతీల్లోని ప్రజలకు కూడా అందించడానికి వీలుగా వాటిని బలోపేతం చేయనున్నారు. పంచాయతీల్లో వినియోగించే నిధులకు సంబంధించి సామాజిక తనిఖీ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంచాయతీలుగా మారనున్న 1,193 తండాలు 500 జనాభా దాటిన తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్పు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిన మేరకు.. కొత్తగా 1,193 తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు కానున్నాయి. జిల్లాల నుంచి ఆయా పంచాయతీల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు పంపించాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. పంచాయతీల మ్యాపులతో సహా, అక్కడి జనాభా తదితర వివరాలను పంపించాలని కోరింది. పంచాయతీలే.. ఈ-సేవ కేంద్రాలు దాదాపు 2,400 గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే కంప్యూటర్లు ఉన్నాయి. వాటికి బ్రాడ్ బ్యాండ్ నెట్వర్క్ ఉన్నచోట నెట్ కనెక్షన్లు ఇవ్వడంతోపాటు ఆన్లైన్ వ్యవస్థ ఏర్పాటు చే యనున్నారు. బీఎస్ఎన్ఎల్ సంస్థను బ్రాడ్‌బ్యాండ్ నెట్వర్క్ ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కోరింది. రెండు నెలల్లోగా ఈ పంచాయతీలన్నిటిలో ఈ-పంచాయతీ విధానం అమలు చేయాలని పట్టుదలతో ఉంది. పట్టణాలు, నగరాల్లో మీ-సేవ కేంద్రాలు అందిస్తున్న పలు రకాల సేవల కంటే మెరుగైన సేవలను గ్రామ పంచాయతీల్లో అందుబాటులోకి తేనున్నారు. కాగా, పంచాయతీలే స్వయంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తే.. అవినీతిని అరికడతాయన్న అభిప్రాయం ప్రభుత్వంలో ఉంది.