పరిషత్‌ ఎన్నికలకు రంగం సిద్ధం | Telangana Government Orders On Parishad Elections Reservations | Sakshi
Sakshi News home page

పరిషత్‌ ఎన్నికలకు రంగం సిద్ధం

Published Fri, Mar 1 2019 9:03 AM | Last Updated on Fri, Mar 1 2019 9:03 AM

Telangana Government Orders On Parishad Elections Reservations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు ఊపందుకున్నాయి. మార్చి 5వ తేదీ కల్లా జిల్లా, మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షులు, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్ల కోటా ఖరారు చేయాల్సిందిగా అన్ని జిల్లాల కలెక్టర్లు (హైదరాబాద్‌ జిల్లా మినహా) జిల్లా ఎన్నికల అధికారులు, జడ్పీ సీఈవోలను పంచాయతీరాజ్‌ శాఖ ఆదేశించింది. ఈ కోటా ఖరారుకు సంబంధించి ఒక షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ షెడ్యూల్‌కు అనుగుణంగా మండల, జిల్లా పరిషత్‌ రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ నీతూకుమారి ప్రసాద్‌ ఆదేశించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ మొదలు, ఎంపీపీ అధ్యక్షులు, జడ్పీటీసీ, ఎంపీటీసీలకు కేటాయించే స్థానాలు, వాటి రిజర్వేషన్ల కోటా ఎవరు ఖరారు చేయాలన్న దానిపై ప్రభుత్వం ఒక షెడ్యూల్‌ను ప్రకటించింది.  

కొత్త పంచాయతీ చట్టం ప్రకారం... 
గతేడాది ఆమోదించిన తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టంలోని ఆయా నిబంధనలకు అనుగుణంగా మండల ప్రజా పరిషత్‌లను, జిల్లా ప్రజాపరిషత్‌ స్థానాలకు రిజర్వేషన్ల కోటా ఖరారు చేయాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, జడ్పీ సీఈవోలకు పంచాయతీరాజ్‌ శాఖ సూచించింది. ఎంపీపీ, జడ్పీ ఎన్నికల్లో అమలు చేసేందుకు వీలుగా రిజర్వేషన్ల కోటా ఖరారు చేసి జిల్లా గెజిట్లలో ప్రచురించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. 

ఇదీ షెడ్యూల్‌... 
స్థానాలు                 స్థానాలు నిర్ణయించేది     రిజర్వేషన్లు చేసేది   ఎప్పటిలోగా 
ఎంపీపీ అధ్యక్షులు     పీఆర్‌ కమిషనర్‌              జిల్లా కలెక్టర్‌        మార్చి 5 
జడ్పీటీసీలు                జిల్లా కలెక్టర్‌                 జిల్లా కలెక్టర్‌       మార్చి 5 
ఎంపీటీసీలు                జిల్లా కలెక్టర్‌                     ఆర్డీవో          మార్చి 5

32 జడ్పీలు, 535 జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు, 5,984 ఎంపీటీసీ స్థానాలు
రాష్ట్రంలోని 32 జిల్లాలను (జీహెచ్‌ఎంసీ మినహాయించి) జిల్లా ప్రజా పరిషత్‌లుగా, మొత్తం 535 గ్రామీణ రెవెన్యూ మండలాలను ( 50 పట్టణ స్వభావమున్న రెవెన్యూ మండలాలు మినహాయించి) మండల ప్రజా పరిషత్‌లుగా, జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలుగా పరిగణిస్తారు. 32 జిల్లాల్లోని 535 మండలాల పరిధిలో మొత్తం 5,984 ఎంపీటీసీ స్థానాలుగా ప్రాదేశిక నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. తదనుగుణంగా 32 చొప్పున జడ్పీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, 535 జడ్పీటీసీ స్థానాలు, 535 చొప్పున ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, 5,984 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. గతంలో ఎంపీటీసీల సంఖ్య 6,473 ఉండగా, కొత్తగా 68 మున్సిపాలిటీలు ఏర్పడటం, వాటిలో ఆయా మండలాల్లోని గ్రామాలు విలీనం కావడంతో 489 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. గతంలో 9 జడ్పీలు (హైదరాబాద్‌ మినహాయించి) ఉండగా, ప్రస్తుతం జిల్లాల పునర్విభజన కారణంగా జిల్లాల సంఖ్య 32కు (జీహేచ్‌ఎంసీ) పెరిగింది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement