సాక్షి, హైదరాబాద్ : బడ్జెట్‌లో గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులు కేటాయించలేదనంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రెండోరోజు శాసనసభ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థలను అద్భుతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. పంచాయతీల నుంచి ఎలాంటి నిధులు తీసుకోలేదని, వాటి పటిష్టత కోసం కొత్త చట్టం తెచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. పంచాయతీరాజ్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పాలనపై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందని వ్యాఖ్యానించారు. జగిత్యాల మున్సిపాలిటీకి రూ.2కోట్ల బకాయిలు గత కాంగ్రెస్ ప్రభుత్వానిదేని అన్నారు. గ్రామ పంచాయతీలకు ఆర్థిక సమస్యలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
అంతకు ముందు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పంచాయతీలకు తగిన నిధులు ఇవ్వలేదని అన్నారు. వడ్డీ మాఫీ విషయంలోనూ రైతులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారన‍్నారు. రైతుబంధు పధకంతో పాటు రైతులను ఆదుకోవాలని, అలాగే ఐఆర్ కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని శ్రీధర్ బాబు సభలో ప్రస్తావించారు. మరోవైపు పంచాయతీ రాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఇవాళ సభలో పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment