Telangana Budget 2019
-
2023 నాటికి రూ.5 లక్షల కోట్ల అప్పు
సాక్షి, హైదరాబాద్: ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పెట్టిన అంచనాలను పూర్తి స్థాయి బడ్జెట్‌కు వచ్చేసరికి రూ.36 వేల కోట్ల మేర కుదించిన ఘటన దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని కాంగ్రెస్ శాసనసభా పక్షం నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా హాల్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఆర్థిక మాంద్యం పేరుతో కేంద్రంపై నెపం నెట్టి తప్పించుకునేందుకే బడ్జెట్ అంచనాలను తగ్గించారని, వాస్తవానికి అప్పులు తెస్తేనే కానీ గండం గడవని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని చెప్పారు. అప్పులు తెస్తేనే కానీ ఉద్యోగులకు జీతాలిచ్చి, సంక్షేమ పథకాలను కొనసాగించలేని ప్రమాదస్థితి ఏర్పడిందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే 2023 నాటికి రాష్ట్రం అప్పు రూ.5 లక్షల కోట్లకు చేరుతుందని చెప్పారు. కేసీఆర్ తెస్తున్న అప్పుతో సంపద సృష్టించబడాలి కానీ పాలకుల ప్రయోజనాలకే సరిపోతోందన్నారు. రానున్న మూడేళ్లలో చెల్లించాల్సిన అప్పులు, వడ్డీలు, ఇతర ఖర్చులు కలిపి ఎంత మొత్తానికి చేరుకుంటున్నదన్న దానిపై ఆయన పవర్‌పాయిం ట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిపై రాష్ట్ర ప్రజలు, మేధావుల్లో చర్చ జరగాలని, అందుకే అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రజెంటేషన్ ఇస్తానని తెలిపారు. -
నీరసం, నిరుత్సాహం.. హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: రైతులు, పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలతో కాంగ్రెస్‌కు నీరసం, నిరుత్సాహం తప్ప మరేమీ మిగల్లేదని ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ఆర్థికమాంద్యం కారణంగా ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో డీలాపడుతుందని కాంగ్రెస్ భావించిందని, అందుకు భిన్నంగా పింఛన్లకు రూ.10 వేల కోట్లు, రైతుబంధుకు రూ.12 వేల కోట్లు, రుణమాఫీకి రూ.6 వేల కోట్లు కేటాయించడంతో కాంగ్రెస్ సభ్యులు డీలాపడిపోయారని ఎద్దేవా చేశారు. మంగళవారం అసెంబ్లీలో సాగునీటి పద్దులపై చర్చ సందర్భంగా సమాధానం ఇచ్చారు. ప్రాజెక్టులంటే కొన్ని నెలలు, ఏళ్లలోనే పూర్తిచేయొచ్చని.. దేశానికే కొత్త దిశ, దశను తెలంగాణ అందించిందని పేర్కొన్నారు.అసెంబ్లీ నుంచి సీపీఐ, సీపీఎంల అడ్రస్ గల్లంతైనట్లే తమకూ అదే పరిస్థితి పడుతుందనే భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు ప్రజాసంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అర్థం తెలుసా అంటూ ఎగతాళి చేశారు. రైతులకు పెట్టుబడి సాయం, ఇతర సంక్షేమ కార్యక్రమాలతో పాటు, దేశంలో తెలంగాణలో తప్ప మరే రాష్ట్రంలోనైనా రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చారో చెప్పాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పాలనలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తికి 40 ఏళ్లు, శ్రీశైలం 38 ఏళ్లు, జూరాలకు 26 ఏళ్లు పట్టగా, టీఆర్ఎస్ ప్రభుత్వం భక్త రామదాసు ప్రాజెక్టును 9 నెలల్లో, తుమ్మిళ్లను 9 నెలల్లో, కాళేశ్వరం మూడు బ్యారేజీలు, మూడు పంప్‌హౌజ్‌లను మూడున్నరేళ్లలోనే పూర్తిచేసి చరిత్ర తిరగరాసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును చూసి దేశం నేర్చుకోవాలని సీడబ్ల్యూసీ చైర్మన్ మసూద్ హుస్సేన్ చెప్పారని గుర్తు చేశారు. టీడీపీ, కాంగ్రెస్‌ల హయాంలో ప్రాజెక్టులకు పెండింగ్ ప్రాజెక్టులని పేరు పడిందని, వాటిని కేసీఆర్ రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చారన్నారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు కాంగ్రెస్ రూ.168 కోట్లు ఖర్చుచేసిందని, వారే వేసిన అంచనా ప్రకారం రూ.38,500 కోట్లు వ్యయం అవుతుందని అంటున్నారు. వారి కళ్లు మండుతున్నాయి.. కాంగ్రెస్‌పై హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షం విమర్శనాత్మకంగా వ్యవహరించకుండా అడ్డగోలుగా మాట్లాడి అభాసుపాలవుతోందన్నారు. తెలంగాణ గడ్డపై ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కాంగ్రెస్ నేతల కళ్లు మండుతున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో గల్లిగల్లీకి పేకాట క్లబ్‌లు, పల్లె పల్లెకూ గుడుంబా, ఇసుక మాఫియా వంటివి ఉంటే టీఆర్ఎస్ పాలనలో వాటన్నింటిని బంద్ చేయించామన్నారు. కాంగ్రెస్హయాంలో పాలమూరులో వలసలు, ఆకలిచావులు, ఆత్మహత్యలు చోటుచేసుకుంటే, ప్రాజెక్టులు చేపట్టి పసిడి పంటలుగా మార్చి, వలసదారులను వెనక్కు తీసుకొచి్చన ఘనత సాధారణంగా వలస వెళ్లిన వారిని తిరిగి తీసుకొచి్చన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని కితాబిచ్చారు. మిషన్ కాకతీయ అద్భుతమైన కార్యక్రమమని, మొత్తం 27,584 చెరువుల్లో యుద్ధప్రాతిపదికన 26,690 చెరువుల్లో పూడిక పూర్తయి, 14.15 లక్షల ఎకరాల స్థిరీకరణ కావడం పట్ల యావత్ దేశం హర్షిస్తోందన్నారు. హరీశ్ పనిరాక్షసుడు.. హరీశ్ పనిరాక్షసుడని కాంగ్రెస్ సభ్యుడు రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో కష్టించి పనిచేసే వారిలోముందు వరసలో ఉంటారని పేర్కొన్నారు. మార్చిలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలని, ముఖ్యంగా నల్లగొండ జిల్లాలోని ఉదయసముద్రంతో పాటు ఏఎంఆర్ ప్రాజెక్టు, డిండి, మూసీ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. -
ఐఆర్ లేదు.. పీఆర్సీనే!
సాక్షి, హైదరాబాద్: ‘ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి కాకుండా వేతన సవరణ (పీఆర్సీ) చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా పీఆర్సీ కమిటీ నివేదిక కోసం ఎదురుచూస్తున్నాం. అందిన వెంటనే నిర్ణయం తీసుకుని ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తాం’ అని ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. శాసనమండలిలో బడ్జెట్‌పై సమాధానం ఇచ్చిన హరీశ్.. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీపై పైవిధంగా స్పందించారు. నిరుద్యోగుల భృతిపై మార్గదర్శకాల కోసం అధికారులను ఆదేశించామని, అవి రాగానే భృతి ఇచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. మార్గదర్శకాలు రూపొందించగానే.. రైతులు తీసుకున్న పంటరుణాల మాఫీ అంశంపై మంత్రి హరీశ్ స్పందిస్తూ మరో పది, పదిహేను రోజుల్లో మార్గదర్శకాలు రూపొందించిన వెంటనే సీఎం కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిపారు. అన్ని రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయని, అప్పు చేయడం తప్పు కాదని, జీఎస్డీపీ ఆధారంగా అప్పులు చేసుకునేలా నిబంధనలున్నాయన్నారు. జీఎస్డీపీలో 20.04 శాతం మేర అప్పులు చేశామన్నారు. తెలంగాణ కంటే మరో 13 రాష్ట్రాలు జీఎస్డీపీ కంటే ఎక్కువ అప్పులు చేసినట్లు ఆ రాష్ట్రాల పేర్లను ప్రస్తావించారు. అగ్రరాజ్యమైన అమెరికా సైతం అప్పులు చేస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేసినప్పటికీ వాటిని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే వినియోగిస్తోందన్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక 1.44 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తే.. ఇప్పటివరకు 1.17 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఒక చేత్తో నిధులిస్తూ మరో చేత్తో తీసుకుంటోందన్నారు. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల్లో కేంద్ర, రాష్ట్రాల వాటాలో భారీ వ్యత్యాసం వచ్చిందన్నారు. గతంలో 80:20, 70:30గా ఉండేదని, ఇప్పుడు సగంసగం చేయడంతో రాష్ట్రాలపై మరింత భారం పడిందని చెప్పారు జాతీయ పార్టీలతో రాష్ట్రానికి నష్టం.. కేంద్రంలో అధికారం చేపట్టిన 2 జాతీయ పార్టీలు తెలంగాణకు అన్యాయం చేశాయని హరీశ్ విమర్శించారు. గత పదేళ్ల కాంగ్రెస్ పాలనలో మధ్య మానేరు ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆ పార్టీ పెట్టిన ఖర్చు రూ.10 కోట్లేనని, టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.617 కోట్లు ఖర్చు పెట్టి పనులన్నింటినీ పూర్తి చేసిందన్నారు. ప్రాజెక్టుల పట్ల కాంగ్రెస్‌కు, తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుందని చెప్పారు. ‘జీవన్‌రెడ్డి ఒకే విషయాన్ని పదే పదే చెప్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా అబద్ధం నిజమవ్వదు. మధ్య మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులు తామే కట్టామని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నా.. వారి హయాంలో కొబ్బరికాయలు మాత్రమే కొట్టారు. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పూర్తిచేసింది. కాళేశ్వరానికి జాతీయ హోదా కోరుతూ కేంద్రానికి మేం లేఖలు రాసిన మాట వాస్తవం..’అని వెల్లడించారు. ఏయే సందర్భాల్లో లేఖలు ఇచ్చిన తీరును ఆయన వివరిస్తూ లేఖల ప్రతులను సభ్యులకు ఇచ్చారు. ‘ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులకు సీఎం కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు లేఖలు రాశారు. పార్లమెంటు ఎదుట ధర్నాలు కూడా చేశారు. విద్యారంగంలో మహిళా విద్యకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాం’అని చెప్పారు. ఉద్యోగులకు త్వరలో ప్యాకేజీ.. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచాలని సభ్యులు జీవన్‌రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి తదితరులు మండలిలో లేవనెత్తిన అంశంపై హరీశ్ స్పందిస్తూ ఉద్యోగుల వయోపరిమితి పెంపు అంశం సీఎం దృష్టిలో ఉందన్నారు. ఉద్యోగుల అంశాలన్నింటిపై త్వరలో ఒక ప్యాకేజీ రూపంలో సీఎం ప్రకటిస్తారని వివరించారు. ఈనెల 22కు వాయిదా.. శాసనమండలి బడ్జెట్ సమావేశాలు ఈనెల 22కు వాయిదా పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మండలిలో సభ్యులు ప్రస్తావించిన అంశాలు, ప్రశ్నలకు మంత్రి హరీశ్ సమాధానాలిచ్చారు. అదేవిధంగా సభ్యులు ఇచ్చిన సలహాలు, సూచనలను ప్రభుత్వానికి వివరిస్తానని ఆయన చెప్పారు. అనంతరం సభను ఈనెల 22వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు. -
అప్పుడు లేని మాంద్యం ఇప్పుడెలా?
సాక్షి, హైదరాబాద్: ఆరు నెలల కింద ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమయంలో లేని మాంద్యం ఇప్పుడెలా వచ్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సైతం బడ్జెట్లో ఎక్కడా మాంద్యం గురించి ప్రస్తావించలేదని తెలిపారు. కానీ ప్రస్తుత పూర్తిస్థాయి బడ్జెట్లో మాత్రం 15 నెలల నుంచి మాంద్యం ఉందని చెప్పి బడ్జెట్‌కు కోత పెట్టారని విమర్శించారు. ఆదివారం శాసనసభలో బడ్జెట్‌పై చర్చలో ఆయన మాట్లాడారు. వాహనాలు, ట్రాక్టర్ల కొనుగోళ్లు 30 శాతం తగ్గాయని చెబుతున్నారని, కానీ మాంద్యానికి ఇది ప్రామాణికం కాదని తెలిపారు. రెవెన్యూ మిగులు ఉన్న సమయంలో రాష్ట్ర బడ్జెట్ ఎలా తగ్గిందో చెప్పాలన్నారు. గతేడాది కన్నా ఈ ఏడాది బడ్జెట్లో కీలకమైన విద్యా శాఖకు 24 శాతం, వైద్యానికి 25 శాతం, గ్రామీణాభివృద్ధికి 32 శాతం తక్కువగా కేటాయింపులు చేశారని పేర్కొన్నారు. కాళేశ్వరం చూసే చేరాం: ఎమ్మెల్యే గండ్ర టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రైతుల సంక్షే మం కోసం ప్రభుత్వం అనేక పథకాలు తెచ్చిందని, రైతు బంధుతో రైతుల్లో ధీమా పెంచారని తెలిపా రు. సీఎం కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు ఎనలేని ప్రయోజనం కలుగుతోందని, దాన్ని చూసే 12 మంది కాంగ్రెస్ సభ్యులం టీఆర్ఎస్లో చేరామన్నారు. -
అభివృద్ధి కోసమే అప్పులు.. నిజాలు తెలుసుకోండి : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు శాసనసభలో ఆదివారం ప్రసంగించారు. రాష్ట్రాభివృద్ధికోసమే అప్పులు చేస్తున్నామని స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్లో అప్పులు 40 శాతం ఉన్నాయని, అదేక్రమంలో రాష్ట్ర అప్పులు 21 శాతం ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్ర అప్పులపై ప్రతిపక్షాలు ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కాంగ్రెస్ నేతలకు కనిపించటంలేదని, కళ్లున్న కబోదుల్లా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తికాలేదని కాంగ్రెస్ నేతలు మాట్లాడటం సరైంది కాదని హితవు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టు తక్కువ సమయంలోనే కట్టి రికార్డులు నమోదు చేశామని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులేవీ కనబడటం లేదా అని ప్రశ్నించారు. బడ్జెట్‌పై సాధారణ చర్చ సందర్భంగా కాంగ్రెస్ పక్షనేత భట్టి విక్రమార్క శనివారం చేసిన విమర్శల్ని కేసీఆర్ ఆక్షేపించారు. విక్రమార్క సొంత జిల్లాలో ఏడాదికాలంలోనే భక్తరామదాసు ప్రాజెక్టు నిర్మించామని సభ దృష్టికి తెచ్చారు. ఏ అంశంపైనైనా అవగాహన పెంచుకుని మాట్లాడాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. బడ్జెట్లో ప్రతిపైసాకు లెక్కలు చెప్పామని, ఆర్థిక మాంద్యంతో తలెత్తిన ఇబ్బందులను కూడా వివరించామని చెప్పారు. ప్రస్తుతం దేశ ఆర్థికస్థితి బాగోలేదని.. ప్రతి అంశాన్ని పరిశీలించి బడ్జెట్ రూపొందించామని తెలిపారు. బడ్జెట్లో కోతపెట్టిన విషయం బడ్జెట్ ప్రసంగంలోనే చెప్పానని, ఎందుకు కోతపెట్టాల్సి వచ్చిందో కూడా వెల్లడించామన్నారు. అవాస్తవాలు, సత్యదూరమైన విమర్శలు చేయడం మానుకోవాలని అన్నారు. -
బడ్జెట్ కుదింపునకు కేంద్రమే కారణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో కోత పడేందుకు కేంద్రం విధానాలే కారణమని మజ్లిస్ పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ సహా కేంద్రం తీసుకున్న పలు విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థ చితికిపోయిందని, దాని ప్రభావం రాష్ట్రంపై పడిందన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పు ఏమాత్రం లేద ని తేల్చి చెప్పారు. శనివారం బడ్జెట్‌పై చర్చను ప్రారంభిస్తూ ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన మొత్తాలను కేంద్రం కోత పెట్టినప్పుడు చేసేదేముంటుందని ప్రశ్నించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి మందగమనంలో ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఇబ్బంది లేకుండా వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికీ ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సవాళ్లున్నాయని, వాటి నుంచి ఇబ్బంది లేకుండా బయటపడుతుందనే నమ్మకముందని ధీమా వ్యక్తం చేశారు. వివిధ శాఖల్లో పేరుకుపోయిన బకాయిలను చెల్లించిన తర్వాతనే కొత్త ప్రాజెక్టులు చేపడతామని ఇటీవల బడ్జెట్లో సీఎం పేర్కొన్న విషయాన్ని ప్రస్తుతించారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న వారు, కేంద్రంలోని తమ ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాల్సిన బాధ్యత ఉందని పరోక్షంగా బీజేపీని ప్రశ్నించారు. జాతి నిర్మాణంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన భూమికను పోషించబోతోందని, కానీ దాని గొప్పదనాన్ని జాతీయ మీడియా చూపించటం లేదన్నారు. అన్ని విషయాల్లో ఎంఐఎం పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి అం డగా ఉంటుందని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో మైనారిటీలకు రూ.6,518 కోట్లు ప్రకటిస్తే వాస్తవం గా ఖర్చు చేసింది రూ.3,899 కోట్లేనని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలతో సమానంగా మైనారిటీల సంక్షేమానికి కృషి చేస్తామన్న మాటలు నిజం కాలేదని ఆరోపించారు. నల్లమలలో యురేనియం వెలికితీత ప్రతిపాదనను తాము వ్యతిరేకమన్నారు. -
అప్పులు బీసీలకు.. సంపద అగ్రవర్ణాలకా?
నాంపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకు కోత విధించడం సరికాదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. సంక్షేమ రంగంలో 48 శాతం కోత విధించడం బాధాకరమని అన్నారు. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో బీసీలకు రూ.5,960 కోట్లు కేటాయిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.2,672 కోట్లు మాత్రమే కేటాయించారని ధ్వజమెత్తారు. బడ్జెట్లో బీసీ సబ్‌ప్లాన్ ఊసేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఆరేళ్లలో రెండు లక్షల 20 వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకువచ్చారని ఆరోపించారు. అప్పులు బీసీలకు, ఆర్థిక సంపద అగ్రవర్ణాలకా? అని నిలదీశారు. జోగు రామన్న ఏ పాపం చేశారని మంత్రివర్గంలోకి తీసుకోలేదు? సకల జనుల సమ్మెను నడిపిన స్వామిగౌడ్ ఎక్కడికి పోయారు? ఆత్మబలిదానం చేసుకున్న దాసోజు కుటుంబం ఎక్కడికి పోయింది? అని ప్రశ్నించారు. మంగళవారం నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశంలో జాజుల మాట్లాడారు. తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఇరువురు నేతలను గవర్నర్లుగా నియమించడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలకు ఆయన బీసీ సంఘాల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని పాటిస్తోందని అన్నారు. ఈ నెల 14న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఉదయం 10 గంటలకు హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లకు ఆత్మీయ సత్కార అభినందన సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తెలంగాణ ఎంబీసీ అధ్యక్షుడు బంగారు నర్సింహ సాగర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంచార జాతుల సంఘం అధ్యక్షులు పోల శ్రీనివాస్, వెంకటనారాయణ, విద్యావంతుల వేదిక ఉపాధ్యక్షుడు బండి సాయన్న, వీర భద్రయ్య సంఘం అధ్యక్షులు వీరస్వామి, ప్రొఫెసర్ ఆలెదాసు జానయ్య, విశ్వ బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి రంగాచారి, దూదేకుల సంఘం అధ్యక్షుడు షేక్ సత్తార్ సాహెబ్, గౌడ ఐక్య సాధన సమితి అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్, యాదవ సంఘం రాష్ట్ర నాయకుడు శ్రీహరి యాదవ్, కురుమ సంఘం నాయకులు సదానందం, కనకల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ‘ఐకమత్యం పెరిగింది’ వెనుకబడిన తరగతుల్లో ఐకమత్యం వచ్చిందని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. ఐకమ త్యం పెరగడంతోనే మంత్రివర్గంలోని మం త్రులకు ఉద్వాసన పలకడానికి ప్రభుత్వం వెనుకడుగు వేసిందన్నారు. బీసీలపై చర్య తీసుకుంటే పీఠాలకే ఎసరు పెట్టినట్లు అవుతుందనే భయం పాలకవర్గంలో ఉందన్నారు. తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందరరాజన్ రాష్ట్రానికి రావడం కొత్త రాజకీయ నాందికి ఆరంభమని అన్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన గవర్నర్‌గా తెలంగాణకు రావడం అదృష్టంగా భావించాలని అన్నారు. -
అంత ఖర్చు చేయడం అవసరమా?
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక క్రమశిక్షణ లోపించడం వల్లే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆర్థిక మాంద్యం ఉందన్న ముఖ్యమంత్రి కేసీఆర్ బహుమతుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఉన్న నేపథ్యంలో ఆ పరిస్థితిని తట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అంతేగానీ బడ్జెట్లో కేటాయింపులేవీ తగ్గించలేదని పేర్కొన్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం మాత్రమే బడ్జెట్ తగ్గించడానికి కారణమేమిటని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘ఆర్థిక మాంద్యం ఉందని కేసీఆర్ చెబుతున్నారు. అలాంటప్పుడు సచివాలయం కూల్చివేసి కొత్త భవనాలు నిర్మించడం అవసరమా. కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ భవనాల పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు’ అని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ మాట నిలబెట్టుకోవాలి.. తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్..తన మాట నిలబెట్టుకోవాలని కోరారు. ‘ఉత్సవాలను నిర్వహించడం కేంద్ర ప్రభుత్వంలోని అంశం కాదు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17ను అధికారికంగా జరుపుతాము అని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. -
బడ్జెట్ అంతంతమాత్రంగానే..
సాక్షి, నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు అరకొరగా కేటాయింపులు, తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి పైసా విదల్చక పోవడం వంటివి రైతులు, ఉద్యోగులు, ఇతర వర్గాలను నిరాశకు గురి చేసింది. జిల్లాకు సంబంధించి నామమాత్రంగానే నిధులు కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. రైతుబంధు, రైతుబీ మా వంటి వ్యవసాయ పథకాలకు బడ్జెట్లో తగిన ప్రాధాన్యత దక్కడం రైతాంగంలో హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలోని ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు ఇలా.. ప్రాజెక్టు కేటాయింపులు (రూ.కోట్లలో) నిజాంసాగర్ 52.20 శ్రీరాంసాగర్ ఫేస్–1 8.10 అలీసాగర్, గుత్ప 2.10 చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి 4.60 రామడుగు 1.00 పోచారం 1.00 కౌలాస్‌నాలా 2.00 లెండి 1.00 కాగా తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి పైసా కేటాయించకపోవడం.. కేవలం జీతభత్యాలు, నిర్వహణ నిధులతోనే సరిపెట్టడం ఆయా వర్గాల్లో నిరాశను నింపింది. ఇక జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు కూడా నామమాత్రం గా కేటాయింపులతో సరిపెట్టడంతో ఒకిం త అసంతృప్తి కనిపిస్తోంది. రాష్ట్రంలో రెం డోసారి అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయి బడ్జెట్‌ను సీఎం కేసీఆర్ సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను గత ఫిబ్రవరిలో రూ. 1.82 లక్షల కోట్ల అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సర్కారు.. సవరించిన అంచనాలతో రూ.1.46 లక్షల కోట్ల బడ్జెట్లో పూర్తిస్థాయి బడ్జెట్‌ను సోమవారం శాసనసభ ముందుంచింది. వ్యవసాయానికి పెద్దపీట.. వ్యవసాయ రంగానికి బడ్జెట్లో అధిక ప్రాధాన్యత దక్కడం అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. రైతుబంధు పథకానికి సర్కారు రూ.12 వేల కోట్లు కేటాయించింది. ఈ పథకం ద్వారా జిల్లాలో సుమారు 2.58 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. అలాగే, రైతుబీమా పథకానికి సంబంధించిన బీమా ప్రీమియం కోసం రూ.1,137 కోట్లు కేటాయించారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 1.48 లక్షలు మంది రైతులకు భరోసా లభిస్తుంది. రైతు రుణమాఫీ కోసం రూ.6 వేల కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించడంతో జిల్లాలో సుమారు 2 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ అయ్యే అవకాశాలున్నాయి. ఊసే లేని తెయూ అభివృద్ధి.. బడ్జెట్లో జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి నిధుల ఊసే లేకుండా పోయింది. ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణ కోసం రూ.23.76 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. వర్సిటీ అభివృద్ధి పనులకు నిధులివ్వలేదు. కొత్త కోర్సులు, నూతన భవనాల నిర్మాణం, అంతర్గత రోడ్లు వంటి వాటికి పైసా విదల్చలేదు. గతంలో వీటి కోసం ఓ బడ్జెట్లో రూ.20 కోట్లు, మరో బడ్జెట్లో రూ.10 కోట్లు కేటాయింపులు జరిపినప్పటికీ ఆ నిధులు విడుదల కాలేదు. ఈసారి కేటాయింపులు కూడా చేయకపోవడం వర్సిటీ వర్గాలను తీవ్ర నిరాశకు గురి చేసింది. జిల్లా ప్రాజెక్టులకు నిధులు.. సాగునీటి రంగానికి నిధుల కేటాయింపులు తగ్గించిన సర్కారు.. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు కూడా ఆశించిన మేరకు నిధులు కేటాయించలేదు. సాగునీటి ప్రాజెక్టులకు గత బడ్జెట్లలో రూ.25 వేల భారీ బడ్జెట్‌ను కేటాయించిన ప్రభుత్వం ఈసారి రూ.8,700 కోట్లతో సరిపెట్టింది. దీంతో జిల్లాలోని ప్రాజెక్టులకు కూటా కేటాయింపులు తగ్గాయి. దీంతో ఆయా ప్రాజెక్టుల పనులు ఆశించిన మేరకు ముందుకు సాగడం ప్రశ్నార్థకమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు 20, 21, 22 ప్యాకేజీ పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు ఈసారి రూ.1,080 కోట్ల బడ్జెట్‌ను కేటాయించిన సర్కారు.. మరిన్ని నిధుల కోసం బ్యాంకుల నుంచి రుణాలు పొందాలని భావిస్తోంది. -
నిధుల్లేవ్.. పనుల్లేవ్!
సాక్షి, మేడ్చల్ జిల్లా: ఏ ఊరికి, బస్తీకి వెళ్లినా ఎమ్మెల్యేలకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. జనం పరిష్కారం కోసం పట్టుబడుతుండడంతో ఏం చేయాలో తెలియక ప్రజాప్రతినిధులు తల పట్టుకుంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధి నిధుల (సీడీపీ)తో పల్లెల్లో ప్రగతి బాటలు వేద్దామనుకున్న ఎమ్మెల్యేల కలలు కల్లలుగానే మిగిలాయి. ఎమ్మెల్యేలకు ఏటా రూ.3 కోట్ల సీడీపీ నిధులు రావాల్సి ఉండగా... అవి ఎప్పుడు విడుదలవుతాయన్న అంశంపై స్పష్టత లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి మూడు నెలలకు రూ.75 లక్షలు విడుదల కావాల్సి ఉన్నా... ప్రభుత్వం ఇప్పటి వరకు చిల్లిగవ్వ ఇవ్వలేదు. ఈ ఏడాది ఇప్పటికే మూడు త్రైమాసికాలు పూర్తి కావస్తున్నాయి. దీంతో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు లేకపోవడంతో ప్రజలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా పనులు చేపట్టలేకపోతున్నామని కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు స్థానిక ఎమ్మెల్యేల ఎదుట వాపోతున్నారు. ఐదేళ్లకు రూ.15 కోట్లు ప్రతి ఎమ్మెల్యేకు ఏటా రూ.3 కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ.15 కోట్లు ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ సీడీపీ నిధులను ఏడాదిలో ఒక పర్యాయం కాకుండా... మూడు నెలలు లేదా ఆరు నెలలకు ఒకసారి విడుదల చేస్తుంది. ఈ నిధులను నియోజకవర్గాల పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. గ్రేటర్లో మొత్తం 24 అసెంబ్లీ స్థానాలు.. మలక్‌పేట్, చార్మినార్, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట, కార్వాన్, బహదూర్‌పురా, నాంపల్లి, గోషామహాల్, సికింద్రాబాద్, అంబర్పేట్, జుబ్లీహిల్స్, ముషీరాబాద్, కంట్మోనెంట్, ఖైరతాబాద్, సనత్‌నగర్, ఉప్పల్, మల్కాజిగిరి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం(రంగారెడ్డి జిల్లా), పటాన్చెరు(సంగారెడ్డి) ఉన్నాయి. ఈ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో కొత్త, పాత ఎమ్మెల్యేలు ఉన్నారు. గతంలో మాదిరి సీడీపీ నిధులను మూడు నెలలకు ఒక పర్యాయం చొప్పున విడుదల చేసినా... ఇప్పటి వరకు రెండు పర్యాయాలకు సంబంధించిన నిధులు రావాల్సి ఉంది. ఈ లెక్కన ప్రతి ఎమ్మెల్యేకు రూ.1.50 కోట్ల చొప్పున 24 మంది ఎమ్మెల్యేలకు రూ.36 కోట్లు రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు నయా పైసా కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్యేలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రజలను కలిసి కృతజ్ఞతలు తెలుపటానికి ఎమ్మెల్యేలు నెల రోజుల పాటు తమ నియోజకవర్గం పరిధిలోని బస్తీలు, గ్రామల్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యేలకు విన్నవించారు. వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యేలు వారికి హామీలిచ్చారు. అయితే ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవటంతో రెండోసారి తమ నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజలను కలిసేందుకు ఎమ్మెల్యేలు జంకుతున్నారు. ఎన్నికల్లో తమకు సహకరించిన స్థానిక ప్రజాప్రతినిధులకు సైతం నిధులు లేకపోవడంతో వారికి కూడా ముఖం చూపించలేక ఎమ్మెల్యేలు చాటేస్తున్నారు. పెండింగ్‌లో పనులు... సీడీపీ నిధులు విడుదల కాక ప్రస్తుత ఎమ్మెల్యేలు ప్రభుత్వం వైపు ఎదురు చూస్తుండగా... మాజీ ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు చేయలేకపోయినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యేలకు కేటాయించిన సీడీపీ నిధుల్లో 30 శాతం అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ అభివృద్ధి పనులు పూర్తి కావడానికి మరో రెండు నెలలు పట్టవచ్చునని సంబంధిత అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
పట్నానికి పైసల్లేవ్!
గ్రేటర్‌కు మళ్లీ నిరాశే మిగిలింది. ప్రభుత్వం బడ్జెట్లో మొండిచేయి చూపింది.విశ్వనగరం ఆశలపై నీళ్లు చల్లింది. ఊహకందని లెక్కలతో నగరజీవిని ఆశ్చర్యానికి గురిచేసింది. మునుపెన్నడూ లేని విధంగా అరకొర నిధులతో ఉసూరుమనిపించింది. కనీసం ఒక్క విభాగానికైనా సరిపడా నిధులు కేటాయించలేకపోవడం బాధాకరం. ఈ నేపథ్యంలో ఈ నగరం ఇలా ఉండాల్సిందేనా? అని నగరవాసులుప్రశ్నిస్తున్నారు. ఇంకెన్ని రోజులు గుంతల రోడ్లపై ప్రయాణం చేయాలని? ఉప్పొంగే నాలాలతో సహవాసం చేయాలని? ఆస్పత్రుల్లో గంటల తరబడి లైన్లలోనిలబడాలని? రహదారులపై ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకోవాలని? చాలీచాలని సౌకర్యాలతో చదువులు కొనసాగించాలని? నిలదీస్తున్నారు. రాష్ట్ర రాజధానికేఈ మేర నిధులు కేటాయిస్తే ఎలా? అని వాపోతున్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలి లాంటి కీలకమైన విభాగాలకు అరకొర నిధులే కేటాయించడంతో నగర అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపుముఖ్యమైన పోలీస్ విభాగానికి ఈసారి నిధులు గణనీయంగా తగ్గడం, గతేడాదితో పోలిస్తే 90శాతం తక్కువ ఇవ్వడంపై పెదవి విరుస్తున్నారు. ఔరా! రూ.25 కోట్లు.. రూ.20 లక్షలు నగరంలో కీలకమైన జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలకు బడ్జెట్‌లోకేటాయించిన నిధులివి. హైదరాబాద్‌ను విశ్వనగరంగాతీర్చిదిద్దాలని సంకల్పించిన ప్రభుత్వం బల్దియాకు ఇంత తక్కువ స్థాయిలో నిధులు కేటాయించడం విస్మయం కలిగిస్తోంది.మరోవైపు ఆదాయం సమకూర్చే హెచ్ఎండీఏకు ఎప్పుడూ లేని విధంగా కేవలం రూ.20 లక్షలే కేటాయిచడంపై అసంతృప్తివ్యక్తమవుతోంది. సిటీ పోలీస్‌కు ‘మమ’ సాక్షి,సిటీబ్యూరో: రాజధాని నగరంలోని మూడు కమిషనరేట్లకు బడ్జెట్ కేటాయింపులు అరకొరగానే ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే సిటీ పోలీసు కమిషనరేట్‌కు 90 శాతం మేర నిధులు తగ్గాయి. అత్యంత కీలకమైన ప్రాజెక్టులకూ అవసరమైన స్థాయిలో కేటాయింపులు లేవు. హైదరాబాద్ పోలీస్ శాఖకు రూ.56 కోట్లు, సైబరాబాద్‌కు రూ.14 కోట్లు, రాచకొండకు రూ.13 కోట్లు మాత్రమే విదిల్చారు. సిటీకి కేటాయించిన వాటిలో టెక్నాలజీ కోసమే రూ.50 లక్షల ఎలాట్మెంట్ జరిగింది. బంజారాహిల్స్‌లో నిర్మిస్తున్న సిటీ పోలీసు కమిషనరేట్ హెడ్–క్వార్టర్స్ అండ్ ఇంటిగ్రేడెట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఈ ఏడాది చివరి నాటికి దీన్ని పూర్తి చేయాలని లక్ష్యం. దీనికి 2015 బడ్జెట్లో రూ.302 కోట్లు మంజూరు చేయగా.. 2016–17 బడ్జెట్లో మరో రూ.140 కోట్లు కేటాయించారు. 2017–18లో రూ.145 కోట్లు కేటాయించింది. గత ఏడాది రూ.280.8 కోట్లు ఇవ్వగా ఈ బడ్జెట్లో దీనికి దక్కింది కేవలం రూ.10 వేలు మాత్రమే. గ్రేటర్ నగరం మొత్తాన్ని సీసీ కెమెరా నిఘాలో ఉంచడానికి ప్రభుత్వం, పోలీసు విభాగం ముమ్మర కసరత్తు చేస్తోంది. మూడు కమిషనరేట్లలోనూ కలిపి లక్ష సీసీ కెమెరాల ఏర్పాటును లక్ష్యంగా నిర్దేశించారు. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం తొలి బడ్జెట్లోనే రూ.69 కోట్లు కేటాయించగా 2017–18లో రూ.225 కోట్లు ఇచ్చింది. గత బడ్జెట్లో రూ.140 కోట్లు కేటాయించింది. ఈసారి దీనికి కూడా కేవలం రూ.10 వేలు మాత్రమే ఇచ్చారు. ఆధునిక హంగులతో ఠాణాల నిర్మాణం, ఉన్నవాటికి అదనపు సౌకర్యాల కోసం గత ఏడాది రూ.10 కోట్లు కేటాయించగా... ఈ బడ్జెట్లో అది రూ.10 వేలకే పరిమితమైంది. పోలీసు క్వార్టర్స్ నిర్మాణం, ఉన్న వాటి అభివృద్ధి, అధికారుల కార్యాలయాలు, సిబ్బందికి బ్యారెక్స్ నిర్మాణం, యంత్ర సామగ్రి కొనుగోలు కోసం రూ.50 లక్షలు మాత్రమే నగర కమిషనరేట్‌కు ఈ బడ్జెట్లో దక్కాయి. సిటిజన్ సెంట్రిక్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ పథకం కింద గత ఏడాది రూ.10 కోట్లు ఇవ్వగా ఈసారి ఆ మొత్తం రూ.10 వేలకు పరిమితమైంది. సైబర్ నేరాల కట్టడికి అవసరమైన సాఫ్ట్వేర్స్, ఇతర ఉపకరణాలు ఖరీదుతో పాటు క్రైమ్ డేటా విశ్లేషణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనికి సంబంధించిన నగర పోలీసులు పంపిన ప్రతిపాదనలపై స్పందించిన సర్కారు గత ఏడాది రూ.12 కోట్లు కేటాయించగా... ఈసారి ఆ మొత్తం రూ.50 లక్షలకు తగ్గిపోయింది. సైబరాబాద్‌లో మహిళల రక్షణకు రూ.25 లక్షలు, సైబరాబాద్ ట్రాఫిక్ వింగ్‌కు రూ.2.22 కోట్లు, ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలుకు రూ.లక్ష, సీసీ కెమెరాల కోసం మరో రూ.లక్ష కేటాయించారు. మొత్తమ్మీద టెక్నాలజీ సమకూర్చుకోవడానికి రూ.10 లక్షల లోపే విదిల్చారు. రాచకొండలో పోలీసుస్టేషన్ల అభివృద్ధికి రూ.7 లక్షలు, సీసీ కెమెరాల ప్రాజెక్టుకురూ.60 లక్షలు, కొత్త పోలీసు కమిషనరేట్ నిర్మాణానికి రూ.30 లక్షలు కేటాయించింది. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసు కమిషనరేట్ మరికొన్నాళ్లు నేరేడ్మెట్కే పరిమితం కానుంది. ఆస్పత్రులకు మొండి చేయి సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రభుత్వం బడ్జెట్లో మొండి చేయి చూపించింది. నిమ్స్, ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రులకు మినహా ఇతర ఏ ఒక్క ఆస్పత్రికీ ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇప్పటికే నిధుల లేమితో కునారిల్లుతున్న ఆయా ఆస్పత్రులకు ప్రభుత్వం ఈ సారి కూడా దయ చూపకపోవడంతో మరింత సంక్షోభంలో కూరుకపోన్నాయి. నగరంలో ఉస్మానియా, గాంధీ, ఫీవర్, నిలోఫర్, ఈఎన్టీ, సరోజినిదేవి, ఛాతి, ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం, సుల్తాన్‌బజార్, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులు సహా ఏడు ఏరియా ఆస్పత్రులు, 85 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 105 బస్తీ దవాఖానాలు ఉన్నాయి. అయితే, నిమ్స్ సిబ్బంది వేతనాల కోసం రూ.102.56 కోట్లు కేటాయించింది. ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో అభివృద్ధి పనులకు రూ.25.32 కోట్లు కేటాయించింది. ‘ఉస్మానియాకు’ పైసల్లేవ్ ప్రతిష్టాత్మక ఉస్మానియా ఆస్పత్రి భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పటికే రెండు, మూడు అంతస్తులను కూడా ఖాళీ చేయించారు. ఇక్కడ కొత్త భవనాలు నిర్మించాలని ఏడాది కాలం నుంచి వైద్యులు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం గ్రౌండ్‌ఫ్లోర్ సహా ఒకటో అంతస్తులోనే రోగులను సర్దుతున్నారు. పడకలు ఉన్నప్పటికీ.. అనువైన గదులు లేకపోవడంతో వైద్యులు కూడా ఏమీ చేయలేని దుస్థితి. దీంతో చాలా మంది రోగులను నేలపైనే పడుకోబెట్టి వైద్యం అందిస్తున్నారు. కొత్తగా రెండు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్లు నాలుగేళ్ల క్రితం ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు బడ్జెట్లో దాని ఊసే ఎత్తలేదు. ఈ బడ్జెట్లో కూడా కేటాయింపులు లేకపోవడంతో ఆస్పత్రి వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. వేతనాలతోనే సరి.. పేద రోగులకు వైద్య సేవలు అందించడంలో గాంధీ జనరల్ ఆస్పత్రి పాత్ర కీలకం. వెయ్యి పడకల సామర్థ్యం ఉన్న ఆస్పత్రిలో ప్రస్తుతం 2200 మందికి పైగా ఇన్‌పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు లేవు. క్యాజువాలిటీ పునరుద్ధరణ, అవయవ మార్పిడి చికిత్సలకు అవసరమైన ఆపరేషన్ థియేటర్లు, వైద్య పరికరాలకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇక పేట్లబురుజు, సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులు సహా కోఠి ఈఎన్టీ ఆస్పత్రి, ఛాతి, మానసిక చికిత్సాలయం ఊసెత్తకపోవడం గమనార్హం. ఆయా ఆస్పత్రులకు కేవలం వేతనాల చెల్లింపుతోనే సరిపెట్టింది. ఏరియా ఆస్పత్రులతో పాటు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల ప్రస్తావన లేకపోవడంతో భవిష్యత్‌లో అవి మరింత సంక్షోభంలో కూరుకపోయే ప్రమాదం లేకపోలేదని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జలమండలికి నిరాశే సాక్షి,సిటీబ్యూరో: తాజా రాష్ట్ర బడ్జెట్ జలమండలిని తీవ్రంగా నిరాశపరిచింది. మహానగరం పరిధిలో కీలక తాగునీరు, మురుగునీటి పారుదల మాస్టర్‌ప్లాన్‌కు భారీగా నిధులు వస్తాయని ఆశించిన బోర్డు వర్గాల ఆశలు అడియాశలయ్యాయి. ఈ సారి రూ.2300 కోట్ల అంచనాలతో రాష్ట్ర ఆర్ధికశాఖకు ప్రతిపాదనలు సమర్పిస్తే కేవలం రూ.825 కోట్ల నిధులను మాత్రమే విదిల్చారు. ఈ నిధులను కూడా జలమండలి గతంలో వివిధ ఆర్థికసంస్థల నుంచి చేసిన రుణాల వాయిదాల చెల్లింపునకు మాత్రమే ఇవ్వడం గమనార్హం. గతంలో కృష్ణా రెండు, మూడోదశ , గోదావరి మొదటి దశ పథకంతో పాటు, గ్రేటర్లో విలీనమైన శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో చేపట్టిన పట్టణ మిషన్ భగీరథ పథకానికి హడ్కో నుంచి జలమండలి తీసుకున్న సుమారు రూ.3500 కోట్ల రుణానికి వాయిదాల చెల్లింపునకే తాజా బడ్జెటరీ నిధులు కనాకష్టంగా సరిపోతాయని బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి. కేశవాపూర్ భారీ స్టోరేజి రిజర్వాయర్ నిర్మాణం, ఔటర్ చుట్టూ జలహారం, ఓఆర్ఆర్ ఫేజ్–2 తాగునీటి పథకం, రోజూ నీటి సరఫరా, సీవరేజీ మాస్టర్‌ప్లాన్ అమలు, పాతనగరంలో తాగునీటి సరఫరా వ్యవస్థ అధునికీకరణ తదితర అభివృద్ధి పథకాలకు పైసా విదిల్చకపోవడం గమనార్హం. కాగా గతేడాది జలమండలికి రూ.1420 కోట్ల మేర బడ్జెటరీ నిధులు కేటాయించినప్పటికీ ఇందులో కేవలం రూ.890 కోట్లు మాత్రమే మూడు వాయిదాలుగా విడుదల చేశారు. ఇందులోనూ రూ.690 కోట్లు రుణ వాయిదాలు చెల్లించేందుకు వినియోగించినట్లు బోర్డు వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. మరిప్పుడు కేటాయించిన రూ.825 కోట్ల నిధుల్లో ప్రభుత్వం ఎన్ని రూ.కోట్లు ఇస్తుందో వేచిచూడాలి. ఒక్క రూపాయీ లే‘దయా’ ప్రతిష్టాత్మక మెట్రో రైలు ప్రాజెక్టుకు బడ్జెట్లో నిధులు కేటాయించ లేదు. దీంతో మెట్రో రెండోదశ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ప్రాజెక్టు విస్తరణ చేపట్టేందుకు అవసరమైన ఆస్తుల సేకరణకు ఒక్క రూపాయి కూడా విదిల్చకపోవడం, ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్–రాయదుర్గం మూడు మెట్రో కారిడార్లలో స్ట్రీట్ ఫర్నిచర్ అభివృద్ధి, సుందరీకరణ పనులు, గార్డెనింగ్, ప్రజోపయోగ స్థలాలను అభివృద్ధి చేయడం వంటి పథకాలకు పైసా నిధులు కేటాయించలేదు. దీంతో ఈ పనులు ముందుకుసాగే పరిస్థితి లేదు. గతేడాది బడ్జెట్లో హైదరాబాద్ మెట్రో రైలు సంస్థకు రూ.323 కోట్ల నిధులు కేటాయించినప్పటికీ.. ఈ సారి అదేస్థాయిలోనైనా నిధులు విడుదల చేస్తారనుకున్న హెచ్ఎంఆర్ వర్గాలకు తాజా బడ్జెట్ షాక్‌నిచ్చింది. యూనివర్సిటీలకూ అరకొరే సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విశ్వవిద్యాలయాలకు అరకొర నిధులతోనే సరిపెట్టింది. కేవలం ఉద్యోగుల వేతనాల కోసమే కేటాయింపులు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూ.309 కోట్లు కేటాయించగా, జేఎన్టీయూకు రూ.16 కోట్లు, తెలుగు విశ్వవిద్యాలయానికి రూ.22 కోట్లు, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి రూ.16 కోట్ల చొప్పున కేటాయించారు. ఆయా విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులకు కొత్త హాస్టళ్ల నిర్మాణం, అదనపు తరగతులు, ఫర్నిచర్ కొనుగోలు, ప్రయోగశాలల్లో పరికరాలు, కంప్యూటర్లు, ఇతర వస్తువుల కొనుగోలుకు నిధులు కేటాయించక పోవడం గమనార్హం. ‘మహా’ ఆశలు తలకిందులు సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులపై తాజా బడ్జెట్ తీవ్ర ప్రభావం చూపించనుంది. ఓఆర్ఆర్ జైకా రుణం, ఓఆర్ఆర్ బీవోటీ అన్యూటీ చెల్లింపుల కింద గతంలో పెండింగ్‌లో ఉన్న వాటితో కలిపి రూ.1800 కోట్లు కేటాయించాలని హెచ్ఎండీఏ ప్రతిపాదనలిస్తే ప్రభుత్వం కేవలం రూ.20 లక్షలు మాత్రమే విదిల్చింది. 2019–20లో ఓఆర్ఆర్ జైకా రుణం కింద కాంట్రాక్టర్లకు రూ.70 కోట్లు, బీవోటీ అన్యూటీ పేమెంట్ కింద రూ.331.38 కోట్లు హెచ్ఎండీఏ చెల్లించాలి. ఇప్పుడు బడ్జెట్ కేటాయింపుల్లో సంస్థకు నిధులు ఇవ్వకపోవడంతో ఈ ఏడాదికి చెల్లించాల్సిన రూ.401.38 కోట్లలో రూ.401.18 కోట్లు హెచ్ఎండీఏ సమకూర్చుకోవలి. అయితే హెచ్ఎండీఏకు ఆదాయం సమకూరే ఓఆర్ఆర్ టోల్ ఫీజు ఆదాయంతో పాటు ఎల్ఆర్ఎస్ నిధులు, బిల్డింగ్, లేఅవుట్ పర్మిషన్ల రూపంలో వచ్చే రెవెన్యూతో పూడ్చాల్సి ఉంది. ఇప్పటికే హెచ్ఎండీఏకు ఎల్ఆర్ఎస్ రూపంలో సమకూర్చిన రూ.1000 కోట్లలో రూ.600 కోట్లతో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టారు. వీటిలో చాలావరకు సగంలో ఉన్నాయి. వీటికి మరిన్ని నిధులు అవసరముంది. బాలానగర్ ఫ్లైఓవర్, మంగళ్‌పల్లి, బాటాసింగారం లాజిస్టిక్ హబ్‌లు, హుస్సేన్‌సాగర్ వద్ద లేక్‌ఫ్రంట్ పార్కు, హరితహరం కింద మొక్కల పెంపకం మిగిలిన నిధులు ఖర్చుపెట్టాలనే ప్రణాళిక ఉంది. ఉప్పల్ భగాయత్ ద్వారా సమకూరిన రూ.600 కోట్లను ఓఆర్ఆర్ గ్రోత్ కారిడార్‌లోని రోడ్ల అనుసంధానం, అసంపూర్తిగా ఉన్న సర్వీసు రోడ్ల నిర్మాణం, రేడియల్ రోడ్లు, ఓఆర్ఆర్ చుట్టూ గ్రీనరీ, ఉప్పల్ భగాయత్‌లో మినీ శిల్పరామం రెండో విడత ప్రాజెక్టుకు వ్యయం చేయాలని నిర్ణయించారు. కోకాపేటలో భూముల విక్రయం ద్వారా వచ్చే వేల కోట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వానికే బదలాయించాల్సిన పరిస్థితి. ఈ లెక్కన హెచ్ఎండీఏకు వచ్చే ఆదాయాన్ని పూర్తిగా ఔటర్ రింగ్ రోడ్డు చెల్లింపులకు ఉపయోగించాల్సిందే. దీంతో ఇది అభివృద్ధి ప్రాజెక్టులపై ప్రభావం చూపుతుందని హెచ్ఎండీఏ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అవి కాగితాలకే పరిమితమా! నగరంపై పడుతున్న ట్రాఫిక్‌ను తగ్గించేందుకు మియాపూర్‌లో నిర్మించాలనుకున్న ఇంటర్సిటీ బస్ టెర్మినల్(ఐసీబీటీ) ఇప్పటికి మొదలుకాలేదు. పెద్దఅంబర్‌పేటలో ఐసీబీటీ, శంషాబాద్‌లో మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్టు, శంషాబాద్, మనోహరబాద్, పటాన్చెరు, శామీర్‌పేటలోనూ లాజిస్టిక్ హబ్‌లను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపడితే రూ.200 కోట్ల వరకు వ్యయం అవవుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుత బడ్జెట్లో నిధుల కేటాయింపు లేకపోవడంతో ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కే పరస్థితి లేదు. మినీ పట్టణాలు ఇక లేనట్టే! మాస్టర్ ప్లాన్ గ్రోత్ కారిడార్(2008) ప్రకారం దాదాపు 158 కి.మీ విస్తీర్ణంలో ఉన్న ఓఆర్ఆర్ చుట్టూ ఇరువైపులా దాదాపు 764 కిలోమీటర్ల మేర వందలాది గ్రిడ్ రోడ్లను అభివృద్ధి చేయాలని హెచ్ఎండీఏ అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం లక్ష ఎకరాలు అవసరమవుతాయి. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు, అటవీ భూములు ఇలా దాదాపు 30 వేల ఎకరాలు పోనుంది. పది వేల ఎకరాలు ప్లాటింగ్ చేసిన భూములున్నాయి. వీటిని కూడా ఏం చేసేందుకు వీలులేదు. మిగిలిగి 60 వేల ఎకరాల్లో గ్రిడ్ రోడ్లు అభివృద్ధి చేస్తే నగర శివారు ప్రాంతాలు మినీ పట్టణాలుగా అభివృద్ధి చెందడం ఖాయం. కానీ భూసేకరణ కష్టమని, వేల కోట్ల ఖర్చవుతుందని ఆ ఊసెత్తడం లేదు. ఇప్పడూ తాజా బడ్జెట్ పరిస్థితి చూశాక హెచ్‌ఎండీఏపైనే భారం పడటంతో ఈ మినీ పట్టణాలు కష్టమే కావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓఆర్ఆర్కు చెల్లించాల్సింది రూ.1,229.83 కోట్లు హెచ్ఎండీఏ సొంతంగా రుణంతీసుకొని రూ.500 కోట్లతోగచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు 24.38 కి.మీ రోడ్డును 2010 జూలై నాటికి పూర్తి చేసింది. తర్వాత బీవోటీ పద్ధతిన నార్సింగ్ నుంచి పఠాన్‌చెరు, శామీర్‌పేట నుంచి పెద్దఅంబర్‌పేట 62.30 కి.మీ 2011 ఆగస్టులో పూర్తిచేసింది. అప్పటి నుంచి ఏటా బీవోటీ అన్యూటి పేమెంట్ కింద రెండు వాయిదాల్లో రూ.331.38 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లిస్తోంది. ఈ చెల్లిపుంఉల 2022 డిసెంబర్‌తో పూర్తి చేయాలి. జైకా రుణాలతో పటార్‌చెరు నుంచి శామీర్‌పేట, శామీర్‌పేట నుంచి పెద్దఅంబర్‌పేట వరకు 71.32 కిలోమీటర్ల రోడ్డు వేశారు. ఈ పనులకు దాదాపు రూ.2,300 కోట్లను కాంట్రాక్టర్లకు చెల్లించిన జైకా తర్వాత నుంచి రీయింబర్స్మెంట్ విధానాన్ని తీసుకొచ్చింది. అంటే హెచ్ఎండీఏ కోసం కాంట్రాక్టర్లు చేసిన పనికి డబ్బులు చెల్లించి ఆ క్లైయిమ్ బిల్లులను హెచ్‌జీసీఎల్ ద్వారా జైకాకు పంపితే అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ద్వారా చెల్లింపులు చేస్తోంది. ఇలా 2016 నుంచి హెచ్ఎండీఏ కాంట్రాక్టర్లకు రూ.390 కోట్లుచెల్లించింది. 2020 డిసెంబర్ నాటికి పూర్తికానున్న ఈ జైకా రుణానికి మరో రూ.70 కోట్లు ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్‌కు చెల్లించాలి. అలాగే బీవోటీ పద్ధతిన కాంట్రాక్టర్లకు మరో ఏడు అన్యూటీలు అంటే 2022 డిసెంబర్ వరకు రూ.1,159 కోట్లు చెల్లించాల్సి ఉందని హెచ్ఎండీఏ అధికారులు అంటున్నారు. అయితే, తాజా బడ్జెట్‌తో బోర్డు ఆశలన్నీ గల్లంతయ్యాయి. -
బడ్జెట్లో కేసీఆర్ కొత్త వాదన
-
మాంద్యంలోనూ సం'క్షేమమే'
చాలా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మనకంటే మరింత అధ్వానంగా ఉందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. కర్ణాటక, పంజాబ్, హరియాణా తదితర రాష్ట్రాల వృద్ధి మైనస్‌లోకి వెళ్లగా తెలంగాణ పరిస్థితి కొంత నయంగా ఉంది. స్థిరమైన ఆర్థిక ప్రగతి, ఆర్థిక క్రమశిక్షణ పాటించిన ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన పరపతితో ఇతర ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమీకరించుకోగలుగుతోంది. ఎఫ్ఆర్బీఎం పరిమితులకు లోబడి, కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమీకరి çస్తున్నాం. భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి బడ్జెటేతర నిధులను వినియోగించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆర్థిక సంస్థలు, మూలధన వాటాను కలిపి ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని కొనసాగిస్తోంది. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, దేవాదుల తదితర భారీ ఎత్తిపోతల నిర్మాణం యథాతథంగా కొనసాగుతుంది. సాక్షి, హైదరాబాద్: ‘‘ఏడాదిన్నరగా ఆర్థిక మాంద్యం దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. దేశ జీడీపీ వృద్ధి రేటు 5%గా నమోదై కనిష్ట స్థాయికి చేరుకుంది. రాష్ట్రంపైనా దీని ప్రభావం తీవ్రంగా ఉంది. జీఎస్టీ పరిహారం అవసరం లేదనుకున్న తెలంగాణ కూడా తప్పనిసరి పరిస్థితిలో కేంద్రం నుంచి దాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆర్థిక వృద్ధి తీవ్రంగా దిగజారుతున్న ఇలాంటి పరిస్థితిలో ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి రావడానికి చింతిస్తున్నా. అయినా గుడ్డిలో మెల్లలా మనం చాలా రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్నాం. ఇంతటి తీవ్ర ఆర్థిక మాంద్యం నెలకొన్నా అత్యంత ప్రధానమైన వ్యవసాయ రంగానికి, ప్రజాసంక్షేమానికి అత్యధిక నిధులు కేటాయిస్తూ ఈ బడ్జెట్‌ను రూపొందించాం. పేదలు, రైతుల జీవితాల్లో వెలుగు తీసుకురావాలన్న చిత్తశుద్ధిని మరోసారి ఈ ప్రభుత్వం ప్రదర్శిస్తోంది. పూర్తి ఆశావహ దృక్పథంతో వాస్తవిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఎన్నికల హామీలను నెరవేరుస్తూ 2019–20 బడ్జెట్‌ను రూపొందించాం. అన్ని రంగాల్లో శీఘ్రగతి అభివృద్ధి సాధించే దిశలో ఈ బడ్జెట్ దోహదపడుతుందని ప్రభుత్వం గట్టి నమ్మకంతో ఉంది’’అని ’సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సోమవారం 2019–20 ఆర్థిక ఏడాదికిగాను మిగిలిన కాలానికి రూ. 1,46,492.3 కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి పద్దు మొత్తాన్ని భారీగా కుదించడానికి మాంద్యం ప్రభావమే కారణమంటూ సీఎం సోదాహరణం గా వివరించారు. సీఎం బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... దేశంలోనే అగ్రగామిగా నిలిచాం.. అవతరించిన ఐదేళ్లలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించింది. రాష్ట్రంలో అమలు చేసిన వినూత్న ప్రజోపయోగ పథకాలెన్నో యావత్ దేశాన్ని ఆకర్షించాయి. అన్ని రంగాల్లో సమతుల అభివృద్ధి సాధించిన రాష్ట్రం నేడు దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. రాష్ట్రం ఏర్పడిన మొద టి ఏడాది నెలకు రూ. 6,247 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టగలిగే పరిస్థితి. ఐదేళ్ల తర్వాత నెలకు రూ. 11,305 కోట్లు ఖర్చుపెట్టే స్థాయికి చేరింది. 2014కు ముందు రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) సగటు వృద్ధిరేటు కేవలం 4.2%. 2018–19లో రెండున్నర రెట్లకుపైగా పెరిగి 10.5% నమోదైంది. మూలధన వ్యయంలో అట్టడుగున ఉండే తెలంగాణ, నేడు దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఐదేళ్లలో 11.2%నుంచి గత ఆర్థిక ఏడాదిలో 16.9 శాతానికి చేరుకుంది. గత ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన మొత్తం మూలధన వ్యయం రూ. 1,65,167 కోట్లు. అన్ని రంగాల్లో సాధిస్తున్న పురోగతి ఫలితంగా గత ఐదేళ్లలో రాష్ట్రం 21.49% సగటు ఆదాయ వృద్ధిరేటు సాధించి దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. ఈ గణాంకాలన్నీ కాగ్ నిర్ధారించి అధికారికంగా ప్రకటించినవే. ఆర్థిక మాంద్యంతో అతలాకుతలం.. ఆర్థిక మాంద్యం దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. 2018–19 ఆర్థిక ఏడాది మొదటి త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి 8% నమోదైనా మూడో త్రైమాసికానికి 6.6 శాతానికి, చివరి త్రైమాసికానికి 5.8 శాతానికి పడిపోయింది. ఈ ఆర్థిక ఏడాది మొదటి త్రైమాసికంలో మరింత దిగజారి 5% కనిష్ట వృద్ధిని నమోదు చేసింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యు ఫాక్చరర్స్ వెల్లడించిన నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33% తగ్గింది. వాహన విక్రయాలు 10.65% క్షీణించాయి. ఫలితంగా ప్రముఖ కంపెనీలు ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపేయాల్సిన దుస్థితి నెలకొంది. వాహనాల అమ్మకం ద్వారా వచ్చే పన్నులు ఆగిపోయాయి. పెట్రోల్, డీజిల్, టైర్లు, ఇతర విడిభాగాల అమ్మకాలు పడిపోయి వ్యాట్ తగ్గిపోయింది. లక్షల మంది ఉపాధి కోల్పోయారు. గతేడాది విమాన ప్రయాణికుల వృద్ధి 11.6% ఉంటే ఈ ఏడాది మెనస్ 0.3 % నమోదైంది. సరుకు రవాణా వృద్ధి ఏకంగా 10.6% తగ్గింది. రైల్వే గూడ్సు వ్యాగన్ల బుకింగుల వృద్ధిరేటు 4.1% నుంచి 1.6 శాతానికి పడిపోయింది. చాలా పరిశ్రమలు మూతపడడంతో బొగ్గు ఉత్పత్తిలో వృద్ధి శాతం 10.6 నుంచి మైనస్ 5.1 శాతానికి పడిపోయింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కనిష్టంగా రూ.72.43కి పడిపోయింది. మాంద్యం వల్ల ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కేంద్రం నుంచి రూ. 175 కోట్లు, జూన్, జూలై నెలల్లో రూ. 700 కోట్లను జీఎస్టీ పరిహారంగా తీసుకోవాల్సి వచ్చింది. వాస్తవిక దృక్పథంతోనే బడ్జెట్ ప్రతిపాదనలు రాష్ట్ర ఆర్థికశాఖ తీవ్ర మేథోమధనం చేసి అనేక మంది ఆర్థిక గణాంక నిపుణులతో చర్చించి నిర్ధారణ చేసుకున్న వాస్తవిక దృక్పథంతో 2019–20 రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించింది. కేంద్రానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 22.69% వృద్ధి ఉంటుందని అంచనా వేస్తే 2019–20 తొలి త్రైమాసికంలో 1.36% మాత్రమే సాధ్యమైంది. రాష్ట్రంలో 15 % ఆదాయాభివృద్ధిని ఆశిస్తే కేవలం 5.46 శాతమే సాధ్యమైంది. గత ఐదేళ్లలో రాష్ట్రం వాణిజ్య పన్నుల విభాగంలో 13.6% సగటు వార్షిక వృద్ధిరేటు సాధిస్తే ఈ ఆర్థిక ఏడాది మొదటి 4 నెలల్లో కేవలం 6.61 శాతమే సాధించగలిగింది. ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయంలో ఈ ఏడాది మొదటి 4 నెలల్లో కేవలం 2.59 శాతమే వృద్ధిరేటు సాధ్యమైంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా గతేడాది వరకు 19.8% సగటు వార్షిక వృద్ధిరేటు సాధిస్తే ఈ ఏడాది మొదటి 4 నెలలు 17.5 శాతమే వృద్ధిరేటు నమోదైంది. మోటార్ వాహనాల పన్ను రూపంలో ఆదాయం దారుణంగా పడిపోయింది. గత ఐదేళ్లలో 19% సగటు వార్షిక వృద్ధిరేటు సాధిస్తే ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో మైనస్ 2.06 శాతానికి పడిపోయింది. పన్నేతర ఆదాయం లోనూ గత ఆర్థిక సంవత్సరం వరకు 14.9% నమోదైన సగటు వార్షిక వృద్ధిరేటు... ఈ ఏడాది గడిచిన 4 నెలల్లో మైనస్ 14.16 శాతానికి పడిపోయింది. దీనికితోడు2019–20 ఆర్థిక ఏడాదికి పన్నుల్లో వాటా కింద రాష్ట్రా నికి రావాల్సిన నిధు ల్లో కేంద్రం 4.19% కోత పెట్టింది. విద్యుత్ సంస్థలకు ఆర్థిక సహకారం.. రైతులకు ఉచిత విద్యుత్ అందించేందుకు ఇప్పటివరకు రూ. 20, 925 కోట్లను విద్యుత్ సంస్థలకు చెల్లించాం. ఉదయ్ పథకం ద్వారా డిస్కమ్‌లకు ఉన్న రూ. 9,695 కోట్ల రుణభారాన్ని ప్రభుత్వమే భరించింది. విద్యుత్ సంస్థలు సింగరేణికి బకాయిపడిన రూ. 5,772 కోట్లను ప్రభుత్వమే చెల్లించింది. గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు రూ. 42,632 కోట్ల ఆర్థిక సహాయం అందించింది. ప్రగతి సూచికల్లో తలసరి విద్యుత్ వినియోగం వృద్ధిరేటులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. బకాయిలు చెల్లించాకే కొత్త పనులు.. ఉన్నది ఉన్నట్లు చెప్పేందుకు, వాస్తవాలను జనం ముందు ఉంచే విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. ఆర్థిక మాంద్యం కారణంగా కేంద్రం, రాష్ట్రానికి ఆదాయం గణనీయంగా తగ్గిన మాట కఠిన వాస్తవం. ఈ వాస్తవాల ఆధారంగానే ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేసింది. అన్ని శాఖల్లోనూ బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం బడ్జెట్లో తగిన నిధులు కేటాయించాం. దీనికి అనుగుణంగానే ఆయా శాఖలు ప్రభుత్వ మార్గనిర్దేశాల ప్రకారం నిధులు ఖర్చు చేయాలని మంత్రులు, కార్యదర్శులకు ఆర్థికశాఖ సూచనలు చేసింది. భవిష్యత్తులో అంచనాలు సవరించొచ్చు మాంద్యం కారణంగా ఆదాయాలు తగ్గినప్పటికీ రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగుపడి ఆదాయం పెరిగితే అందుకు తగ్గట్టు అంచనాలు సవరించుకునే వెసులుబాటు మనకు ఉంది. కేంద్రం నిధులు అంతంతే.. ప్రభుత్వ పన్నుల ద్వారా రాష్ట్రం నుంచి గత ఐదేళ్లలో కేంద్రానికి రూ. 2,72,926 కోట్లు అందగా ఈ నిధుల్లో తెలంగాణ వాటాగా మనకు రూ. 31,802 కోట్లు వచ్చాయి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులను తెలంగాణకు ఇవ్వాలని పునర్విభజన చట్టంలో పేర్కొన్నా ఓ ఏడాది నిధులను కేంద్రం ఇవ్వలేదు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం కోసం గత ఐదేళ్లలో అక్షరాలా రూ. 5,37,373 కోట్లు ఖర్చు పెడితే అందులో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం రాష్ట్రానికి అందిన నిధులు రూ.31,802 కోట్లు మాత్రమే. ఐటీ ఎగుమతుల్లో మేటిగా.. ప్రభుత్వ ప్రగతికాముక విధానాల వల్ల అన్ని ప్రధాన రంగాల్లో వృద్ధిరేటు నమోదైంది. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో గత ఐదేళ్లలో 6.3% అదనపు వృద్ధితో 2018–19 ఆర్థిక ఏడాది నాటికి తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో 8.1 శాతం వృద్ధిరేటు నమోదు చేయగలిగింది. పారిశ్రామిక రంగం అదనంగా 5.4% అదనపు వృద్ధి సాధించి 2018–19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 5.8% నమోదు చేసింది. 2014–15లో తెలంగాణ ఐటీ ఎగుమతుల విలువ రూ. 52 వేల కోట్లయితే 2018–19 నాటికి రూ. 1.10 లక్షల కోట్లకు చేరుకుంది. ‘ఆయుష్మాన్’కన్నా ఆరోగ్యశ్రీ మెరుగు.. కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అవగాహనతో నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజలకు పెద్దగా ప్రయోజనం చేకూర్చని పథకాల కోసం ప్రజాధనాన్ని వృథా చేయదలచుకోలేదు. కేంద్ర పథకం ఆయుష్మాన్ భారత్ కంటే మనం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ ఎంతో మెరుగైంది, ఆరోగ్యశ్రీ కోసం ఏడాదికి రూ. 1,336 కోట్లు ఖర్చు చేస్తే ఆయుష్మాన్ భారత్ ద్వారా రాష్ట్రంలో ఏడాదికి రూ. 250 కోట్ల విలువైన వైద్య సేవలే అందుతాయి. ఆరోగ్యశ్రీ ద్వారా 85 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలిగితే ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా కేవలం 26 లక్షల కుటుంబాలకే మేలు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీ ద్వారా అందే అవయవ మార్పిడి సేవలు ఆయుష్మాన్ భారత్ ద్వారా అందవు. ఆయుష్మాన్ భారత్‌కన్నా ఆరోగ్యశ్రీ పథకం ఎన్నోరెట్లు మెరుగైనది కాబట్టి మనం కేంద్ర పథకాన్ని వద్దనుకున్నాం. పట్టణాలు, గ్రామాలకు మంచి రోజులు.. కేంద్ర ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం అందించే నిధులకు సమానంగా నిధులు జమచేస్తాం. ఈ రెండింటినీ కలిపి గ్రామ పంచాయతీలకు ప్రతి నెలా రూ. 339 కోట్లను అందించాలని నిర్ణయించాం. ఈ నెల నిధులను ఇప్పటికే గ్రామ పంచాయతీలకు విడుదల చేశాం. ఇదే తరహాలో పట్టణాలకూ నిధుల ప్రవాహం ఉంటుంది. ఆర్థిక సంఘం నిధులు, ఉపాధి హామీ పథకం నిధులు, పన్నులతోపాటు వివిధ రకాలుగా గ్రామ పంచా యతీలకు సమకూరే ఆదాయం కూడా స్థానిక సంస్థలకు ఉంటుంది. గ్రామ పంచాయతీలకు రూ. 2,714 కోట్లు, మున్సిపాలిటీలకు రూ.1,764 కోట్లను ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. సంక్షోభంలోనూ సాగుకు ఉచిత విద్యుత్.. ఆర్థిక సంక్షోభం ఉన్నా వ్యవసాయానికి ఉచిత కరెంటు యథాతథంగా కొనసాగుతుంది. నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించడానికయ్యే కరెంటు బిల్లుల భారం రైతులపై వేయ కుండా మేమే చెల్లించాలని నిర్ణయించాం. ఎన్నడూ లేనట్లు విద్యుత్ సబ్సిడీల కోసం రూ. 8 వేల కోట్లు కేటాయిస్తున్నాం. ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్స్, కళ్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, 6 కిలోల బియ్యం పథకం లాంటి వాటికి నిధుల కొరత రానీయం. రైతుబంధు పథకానికి ఈ బడ్జెట్లో రూ. 12 వేల కోట్లు, రైతు బీమా ప్రీమియం చెల్లింపులకు రూ. 1,137 కోట్లు, పంట రుణాల మాఫీకి రూ. 6 వేల కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించాం. ఆసరా పెన్షన్ల కోసం బడ్జెట్లో రూ. 9,402 కోట్లను ప్రతిపాదించాం. -
బడ్జెట్ సమగ్ర స్వరూపం
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక సంక్షోభం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో పేదలు, రైతుల సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇతర రంగాల కేటాయింపుల్లో భారీకోత విధించగా, వ్యవసాయరంగానికి మాత్రం గత ఏడాది బడ్జెట్‌తో పోలిస్తే సుమారు రూ.3,340 కోట్ల మేర పెంచారు. వ్యవసాయ అనుబంధ రంగాలైన పశుసంవర్థక, మత్స్య శాఖల నిధులు పెరిగాయి. అయితే, సహకార రంగం కేటాయింపుల్లో మాత్రం సుమారు 15 కోట్ల మేర తగ్గించారు. రూ.1.46 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా సుమారు 11.4 శాతం మేర ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెరిగినట్లు కనిపిస్తున్నా.. ప్రధానంగా రైతు సంక్షేమ పథకాలకే సింహభాగం నిధులు కేటాయించినట్లు వెల్లడవుతోంది. వ్యవసాయం, మార్కెటింగ్ రంగాలకు రూ.15,196 కోట్లు, సహకార రంగానికి రూ.92.66 కోట్లు, పశు సంవర్థక, మత్స్య శాఖలకు రూ.1,431.96 కోట్లు కేటాయించారు. జాతీయ ఆహార భద్రత మిషన్, వ్యవసాయ పారిశ్రామికీకరణ, పంట కాలనీల అభివృద్ధి, భూసార, జల సంరక్షణ, సూక్ష్మసేద్యం వంటి పలు పద్దులకు పూర్తిగా కోత విధించారు. పథకాలకు ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వ్యవసాయం, దాని అనుబంధ శాఖలతో కూడిన ప్రాథమిక రంగంలో రాష్ట్రం స్థిరమైన పురోగతి సాధిస్తూ.. 2018–19 ఆర్థిక సంవత్సరంలో 8.1 వృద్ధిరేటును సాధించింది. ఆర్థిక సంక్షోభం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో రైతుబంధు, రైతుబీమా, పంట రుణాల మాఫీ, ఉచితవిద్యుత్ వంటి రైతుసంక్షేమ కార్యక్రమాలకు బడ్జెట్ కేటాయింపుల్లో సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. రైతుబంధు పథకం కింద ఎకరాకు పెట్టుబడి ప్రోత్సాహకాన్ని రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ గతంలోనే సీఎం ప్రకటన చేశారు. దీంతో ప్రస్తుత బడ్జెట్లో రైతుబంధు పథకం కోసం రూ.12 వేల కోట్లు కేటాయించారు. దీంతో, 50 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రైతుబీమాను యథాతథంగా కొనసాగిస్తూ.. బీమా ప్రీమియం కింద రూ.1,137 కోట్లు ప్రతిపాదించగా, 57 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని అంచనా వేశారు. రూ.6 వేల కోట్ల పంటరుణాల మాఫీ ద్వారా 48 లక్షల మంది రైతులకు రుణవిముక్తి లభిస్తుంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగిస్తుండటంతో 23.04 లక్షల పంపుసెట్లకు ప్రయోజనం చేకూరుతుంది. నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ బిల్లుల కోసం రూ.8 వేల కోట్లు కేటాయించారు. వైద్యానికి 3,705 కోట్లు గత ఏడాదితో పోలిస్తే పెంచిన మొత్తం 200 కోట్లు ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. వైద్య, ఆరోగ్యశాఖకు ఈ ఏడాది బడ్జెట్లో చెప్పుకోదగ్గ స్థాయిలో కేటాయింపులు చేసింది. గతేడాదితో పోలిస్తే ఏకంగా రూ.200 కోట్లను అదనంగా వడ్డించింది. 2018–19లో రూ.3,522 కోట్లు కేటాయించగా ప్రస్తుత బడ్జెట్లో రూ.3,705 కోట్లను ప్రతిపాదించింది. పేదలకు ఆపన్నహస్తం అందించే ఆరోగ్యశ్రీ పథకానికి కూడా నిధుల కేటాయింపుల్లో ప్రాధాన్యతనిచ్చింది. గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.190 కోట్లను అధికంగా కేటాయించింది. 2018–19లో రూ.530 కోట్లు కేటాయించగా.. ఈ సారి రూ.720 కోట్లను పొందుపరిచింది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు భారీగా కత్తెర పెట్టింది. ఆయుష్మాన్ భారత్‌తో పాటు ఇతర కేంద్ర పథకాలకు గత బడ్జెట్‌తో పోలిస్తే ఏకంగా రూ.18 కోట్లను కుదించింది. ముఖ్య కేటాయింపులు ఇలా.. - ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖకు నిరుడు కంటే అధికంగా నిధులు ఇచ్చారు. గతేడాది రూ.460 కోట్లు కేటాయించగా.. ప్రస్తుత బడ్జెట్లో రూ.529 కోట్లకు పెంచారు. - వైద్యం, ప్రజారోగ్యానికి ఈ సారి రూ.340 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.ఐదు కోట్లు అధికం. - వైద్య విద్య, శిక్షణ, పరిశోధనకు రూ.111 కోట్లను ఇచ్చారు. - జాతీయ కుష్టు నివారణ పథకానికి రూ.2.32 కోట్లు, జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమానికి రూ.2.52 కోట్లు, అంటువ్యాధి నియంత్రణ కార్యక్రమానికి రూ.6.29 లక్షలను కేటాయించారు. - కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులను కోత పెట్టింది. 2018–19తో పోలిస్తే రూ.450 కోట్లు తగ్గించింది. గత బడ్జెట్లో రూ.1,216 కోట్లు కేటాయించగా.. తాజా బడ్జెట్లో రూ.766 కోట్లను మాత్రమే చూపింది. ఇందులో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం)కు రూ.175.51 కోట్లు కేటాయించింది. - ఆయుర్వేద, యునాని, యోగ, సిద్ధ, హోమియోపతి విభాగాలకు రూ.19 కోట్లు ఇచ్చింది. గతేడాది పోలిస్తే రూ.18 లక్షలు మాత్రమే అధికంగా ఇచ్చింది. - ఔషధ నియంత్రణకు రూ.16.88 కోట్లను కేటాయించింది. డిస్కంలకు ధమాకా! తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధుల కేటాయింపులను పెంచింది. 2017–18లో రూ.3,728.25 కోట్లను వ్యవసాయ విద్యుత్ రాయితీలకు కేటాయించగా, తాజా బడ్జెట్లో రూ.5,984 కోట్లకు పెంచింది. స్పిన్నింగ్ మిల్లులకు విద్యుత్ రాయితీలను రూ.35 కోట్ల నుంచి రూ.95 కోట్లకు పెంచింది. దీంతో మొత్తం విద్యుత్ రాయితీలు రూ.6,079 కోట్లకు పెరిగాయి. తెలంగాణ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థకు ఈసారి కూడా ఎలాంటి కేటాయింపులు జరపలేదు. నిర్వహణ పద్దు కింద ఇంధన శాఖకు కేటాయింపులను రూ.622.86 కోట్ల నుంచి రూ.204.45 కోట్లకు తగ్గించింది. గతేడాది విద్యుత్ ప్రాజెక్టులకు రూ.598.24 కోట్ల రుణాలు కేటాయించగా, ఈసారి రూ.197.02 కోట్లకు తగ్గించింది. ప్రతివ్యక్తిపై అప్పు..58,202 రాష్ట్ర అప్పులు 2.03 లక్షల కోట్లు.. జీఎస్డీపీలో 21% అప్పులే గ్యారంటీలు కూడా బాగానే.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులతోపాటు వివిధ కార్పొరేషన్ల రుణాలకు గ్యారంటీలను కూడా భారీగానే ఇస్తోంది. ఇప్పటివరకు రూ.77,314 కోట్లను వివిధ కార్పొరేషన్ల రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చింది. ఇందులో సాగునీటి శాఖ కోసం రూ.32,130 కోట్లు, మిషన్ భగీరథకు రూ.23,014 కోట్లు, ఇతర పథకాలకు రూ.22,170 కోట్ల రుణాలకు గ్యారంటీలు ఇచ్చింది. మరోవైపు మూలధన వ్యయంలో తగ్గుదల కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.23,902 కోట్ల మూలధన వ్యయం జరగ్గా, అది 2018–19 సంవత్సరానికి రూ.33,369 కోట్ల మేర ఉందని అంచనా. సవరించిన అంచనాల్లో అది దాదాపు రూ.7 వేల కోట్లు తగ్గి రూ.26,888 కోట్లు మాత్రమే జరిగింది. ఈసారి బడ్జెట్ అంచనాల్లోనే రూ.17,274 కోట్లను మూలధన వ్యయం కింద ప్రతిపాదించగా, అందులో ఎంతమేరకు సంపద సృష్టి కోసం జరుగుతుందనేది ఆర్థిక సంవత్సరం ముగిశాక తేలనుంది. ఓపెన్ మార్కెట్ రుణాలే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్లోనే ఎక్కువగా రుణాలు తీసుకుంటోంది. ఇప్పటివరకు బహిరంగ మార్కెట్లో రూ.1.63 లక్షల కోట్లకుపైగా రుణాలు సమీకరించగా, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.9,457 కోట్లు, స్వయంప్రతిపత్తి సంస్థల నుంచి 12,391 కోట్లు, బాండ్ల రూపంలో రూ.18,813 కోట్లు సమీకరించింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.1.29 కోట్ల అప్పు ఉంటే 2019–20 నాటికి అది 2 లక్షల కోట్లకు మించిపోవడం గమనార్హం. అంటే.. గత నాలుగేళ్లలో రూ.74 వేల కోట్ల అప్పులు పెరిగాయన్నమాట. బీసీలకు రిక్తహస్తం గత ఏడాది సవరించిన అంచనాలతో పోలిస్తే తగ్గించిన మొత్తం రూ. 2,321 కోట్లు వెనుకబడిన వర్గాలను తాజా బడ్జెట్ తీవ్ర నిరాశకు గురి చేసింది. గతేడాది బడ్జెట్‌తో పోలిస్తే దాదాపు సగం కేటాయింపులకు కోత పడింది. 2018–19 సంవత్సరంలో రూ.5,690.04 కోట్లుగా (బడ్జెట్ అంచనా) కేటాయించారు. వార్షిక సంవత్సరం చివరినాటికి సవరించిన అంచనాగా రూ.5,311.44 కోట్లు ఖరారు చేశారు. 2019–20 సంవత్సరంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.4,528.01 కోట్లు కేటాయించారు. తాజాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో రూ.2,990.04 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే బీసీలకు కేటాయింపులు 43.70 శాతం తగ్గడం గమనార్హం. ఫెడరేషన్లకు సున్నా.. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 11 ఫెడరేషన్లు ఉన్నాయి. ఆయా సామాజిక వర్గాల్లోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కార్యక్రమాల నిమిత్తం రాయితీ రుణాలను ఈ ఫెడరేషన్లు మంజూరు చేస్తాయి. తెలంగాణ నాయిబ్రాహ్మణ ఫెడరేషన్, వాషర్మెన్, వడ్డెర, కృష్ణబలిజ, వాల్మీకిబోయ, భట్రాజు, మేదర, విశ్వబ్రాహ్మణ, కుమ్మరిశాలివాహన, సగర, కల్లుగీత ఫెడరేషన్లకు తాజా బడ్జెట్లో ఒక్క పైసా కేటాయించలేదు. అదేవిధంగా బీసీ కార్పొరేషన్‌కు సైతం ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి వీటికి పెద్దగా నిధులివ్వలేదు. కులవృత్తులు, గ్రామీణ ఉపాధి పట్ల ప్రత్యేక దృష్టి పెడుతున్నామని ప్రభుత్వం పలుమార్లు పేర్కొనడంతో రాయితీ పథకాలపై నిరుద్యోగులు గంపెడాశలు పెట్టుకున్నారు. తాజా బడ్జెట్‌ను పరిశీలిస్తే స్వయం ఉపాధి పథకాలు ఈ ఏడాది అటకెక్కినట్లే తెలుస్తోంది. ఎంబీసీ కార్పొరేషన్‌కు మొండిచెయ్యి అత్యంత వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం తీసుకొచ్చిన ఎంబీసీ కార్పొరేషన్‌కు ప్రభుత్వం తాజా బడ్జెట్లో మొండిచెయ్యి చూపింది. 2017–18 సంవత్సరంలో ఎంబీసీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. తొలి ఏడాది రూ.100 కోట్లు కేటాయించగా... ఆ తర్వాత సంవత్సరం రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. గత ఫిబ్రవరిలో ప్రవేశ పెట్టిన ఓటాన్ అకౌంట్లో రూ.1,000 కోట్లు కేటాయించగా... ప్రస్తుతం పూర్తిస్థాయి బడ్జెట్లో రూ.5 కోట్లు మాత్రమే కేటాయించింది. దీంతో ఈ కార్పొరేషన్ ద్వారా ఈ ఏడాది రాయితీ పథకాలు అమలు కష్టమే. కల్యాణలక్ష్మికి రూ.1,540 కోట్లు తాజా బడ్జెట్లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు నిధుల కేటాయింపుల్లో ఎలాంటి కోత పడలేదు. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్లో కోత పడినప్పటికీ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కార్యక్రమాలు కావడంతో వీటి ప్రాధాన్యతల్లో ఏమాత్రం తగ్గలేదు. నాలుగు సంక్షేమ శాఖల ద్వారా అమలు చేస్తున్న ఈ పథకాలకు 2018–19 వార్షిక సంవత్సరంలో రూ.1,450.46 కోట్లు కేటాయించారు. 2019–20 వార్షిక సంవత్సరంలో కూడా ఇదే మొత్తంలో ప్రభుత్వం నిధులు కేటాయించింది. షాదీ ముబారక్ పథకం కింద మాత్రం అదనంగా రూ.89.99 కోట్లు కేటాయించింది. లబ్ధిదారుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు కేటాయింపులు పెంచినట్లు తెలుస్తోంది. ‘ఇంటి’కి ఇబ్బందులే... డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో మరింత జాప్యం స్పష్టంగా కనిపిస్తోంది. గతేడాది ప్రగతి పద్దుతో పోలిస్తే.. ఈసారి పగ్రతి పద్దులు పదింతలు తగ్గిపోయాయి. దీంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. 2018–19 బడ్జెట్లో గృహనిర్మాణ శాఖకు రూ.2,795.14 కేటాయించగా 2019–20లో కేవలం రూ.977.68 కోట్లు మాత్రమే కేటాయించారు. ఏ శాఖకైనా ప్రగతి పద్దులు చాలా కీలకం. గతేడాది ప్రగతి పద్దు కింద రూ.2,143.14 కోట్లు కేటాయించగా, ఈసారి వాటిని రూ.280 కోట్లకు కుదించారు. వాస్తవానికి ప్రభుత్వం 2,72,763 ఇళ్లకు ఆమోదం తెలిపింది. 2017–2018లో ఈ ఇళ్లకు రూ.1,500 కోట్లు కేటాయించింది. 2018–19లో రూ.2,795.14 కేటాయించింది. కానీ, ఈసారి ఆర్థిక మాంద్యం కారణంగా రూ.977.68 కోట్లు మాత్రమే కేటాయించింది. పురపాలికలకు కట్కటే! గత ఏడాదితో పోలిస్తే తగ్గించిన మొత్తం రూ.4,196 కోట్లు పుర ఎన్నికలకు ముందు పురపాలక శాఖకు బడ్జెట్ కేటాయింపుల్లో భారీ కోత పడింది. 2018–19 బడ్జెట్లో పురపాలక శాఖకు ప్రగతి పద్దు కింద రూ.4,680.09 కోట్లను కేటాయించగా, 2019–20 వార్షిక బడ్జెట్లో రూ.1,791.94 కోట్లకు తగ్గించింది. నిర్వహణ పద్దును సైతం రూ.2,570.46 కోట్ల నుంచి రూ.1,262.21 కోట్లకు కుదించింది. గతేడాది వరంగల్ నగరానికి రూ.226.41 కోట్లు, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం నగరాలకు కలిపి మొత్తం రూ.301.88 కోట్లను కేటాయించిన ప్రభుత్వం ఈ సారి రిక్తహస్తం చూపించింది. గత ఏడాది రూ. 7,250 కోట్లు కేటాయించగా..ఈ సారి రూ. 3054 కోట్లకు తగ్గించారు. పురపాలికలకు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులను రూ.755.20 కోట్ల నుంచి రూ.521.73 కోట్లకు తగ్గించింది. 14వ ఆర్థిక సంఘం కింద 2018–19లో ఎలాంటి కేటాయింపులు చేయకపోయినా, తాజాగా రూ.1,036.98 కోట్లు కేటాయించడం ఊరట కల్పించే అంశమని చెప్పవచ్చు. అయితే, సవరించిన అంచనాల కింద గతేడాది రూ.777.73 కోట్ల 14వ ఆర్థిక సంఘం నిధులను పురపాలికలకు ప్రభుత్వం విడుదల చేసింది. కేంద్రప్రభుత్వ అమృత్ పథకం కింద కేటాయింపులు రూ.403 కోట్ల నుంచి రూ.49.70 కోట్లకు తగ్గాయి. మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం గతేడాది రూ.230.10 కోట్లు కేటాయించగా, ఈ సారి సున్నతో సరిపెట్టింది. మున్సిపల్ కార్పొరేషన్లకు వడ్డీ లేని రుణాలను రూ.141.64 కోట్ల నుంచి రూ.75.47 కోట్లకు తగ్గించింది. పురపాలికల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రుణ సహాయం కోసం టీయూఎఫ్ఐడీసీకి కేటాయింపులను రూ.200 కోట్ల నుంచి రూ.25.94 కోట్లకు తగ్గించింది. కొత్తగా మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.50 కోట్ల నుంచి రూ.5.51 కోట్లకు తగ్గించింది. ఆలయాలకు నిధుల్లేవ్ రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు నిధుల కోత పడింది. యాదగిరిగుట్ట ఆలయాభివృద్ధి సంస్థకు గతేడాది రూ.250 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, తాజాగా రూ.50 కోట్లకు తగ్గించింది. ఆలయ నిర్మాణ పనులు దాదాపు పూర్తికావడంతో కేటాయింపులు తగ్గించినట్లు తెలుస్తుంది. వేములవాడ ఆలయాల అభివృద్ధి సంస్థకు రూ.100 కోట్ల నుంచి రూ.5 లక్షలకు తగ్గించింది. ధర్మపురి, బాసర ఆలయాభివృద్ధి సంస్థలకు గతేడాది చెరో రూ.50 కోట్లను కేటాయించగా, ఈ సారి ఎలాంటి కేటాయింపులు చేయలేదు. భద్రాచలం ఆలయాభివృద్ధి సంస్థకు రూ.100 కోట్ల నుంచి సున్నాకు కేటాయింపులు తగ్గాయి. హైదరాబాద్ నగరానికి మొండిచేయి ప్రగతి పద్దు కింద.. హైదరాబాద్ నగరంలో మూసీ నది పరీవాహక ప్రాంత అభివృద్ధికి గతేడాది రూ.377.35 కోట్లు, నగర రోడ్ల అభివృద్ధికి రూ.566.02 కోట్లు, హైదరాబాద్ మెట్రో ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్టుకు రూ.400 కోట్లు కేటాయించగా, ఈ సారి ఈ పనులకు ఎలాంటి కేటాయింపులు జరపలేదు. ఎంఎంటీఎస్‌కు గతేడాది రూ.50 కోట్లు కేటాయించగా, ఈ సారి కేటాయింపులేమీ లేవు. హైదరాబాద్ జలమండలికి రూ.670 కోట్ల నుంచి రూ.825 కోట్లకు రుణ సహాయాన్ని పెంచగా, హైదరాబాద్ మెట్రో రైలుకు రూ.200 కోట్ల నుంచి రూ.10 లక్షలకు రుణాన్ని కుదించింది. హెచ్ఎండీఏకు మూలధన రుణాన్ని రూ.250 కోట్ల నుంచి రూ.10 లక్షలకు, ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు రూ.235 కోట్ల నుంచి రూ.10 లక్షలకు రుణాలను తగ్గించింది. వడ్డీ చెల్లింపులకు 14 వేల కోట్ల పైనే గత ఏడాది కన్నా అధికంగా కేటాయించిన మొత్తం రూ.2,878కోట్లు తాజా బడ్జెట్ అంచనాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ప్రతిపాదించిన మొత్తం బడ్జెట్లో 10 శాతం నిధులు అప్పులకు వడ్డీలు చెల్లించేందుకే సరిపోనుంది. ఈ మేరకు 2019–20 బడ్జెట్ అంచనాలకు సంబంధించిన రెవెన్యూ ఖాతా వ్యయపట్టికలో రూ.14,574.73 కోట్లు వడ్డీ చెల్లింపుల కిందే చూపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వనరుల నుంచి తీసుకున్న అప్పులకు ఈ వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 22న ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో వడ్డీ చెల్లింపులకు రూ.12 వేల కోట్లకు పైగా ప్రతిపాదించగా, పూర్తిస్థాయి బడ్జెట్లో అది రూ.14,500 కోట్లు దాటిపోయింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి గాను అంచనాల బడ్జెట్లో రూ.11,691 కోట్లు అప్పులకు వడ్డీల కింద చూపెట్టగా, సవరించిన అంచనాల ప్రకారం అది మరో రూ.5 కోట్లు పెరిగింది. గతేడాదితో పోలిస్తే వడ్డీ చెల్లింపులు రూ.2,878 కోట్లు పెరగడం గమనార్హం. అదే 2017–18 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ చెల్లింపులు రూ.10,835 కోట్లు చూపెట్టారు. అంటే రెండళ్లలో దాదాపు రూ.4 వేల కోట్ల వడ్డీలు బడ్జెట్‌పై అదనపు భారంగా మారాయన్న మాట.. అప్పుల కుప్ప.. ఇక ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున రుణాలు అవసరమవుతాయని బడ్జెట్ అంచనా లెక్కలు చెబుతున్నాయి. ఏ రూపంలో అయినా రూ.33 వేల కోట్ల మేర అప్పుల ద్వారా సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అంతర్గత రుణం రూ.33,444 కోట్లుగా రాబడుల వివరణలో ప్రభుత్వం పేర్కొంది. ఇందులో ఓపెన్‌మార్కెట్ రుణాల కింద రూ.31 వేల కోట్లు సేకరించాలని, కేంద్రం నుంచి రూ.800 కోట్లు, ఇతర రుణాలు రూ.1,000 కోట్లు సమీకరించాలని ప్రతిపాదించారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.32,400 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అప్పుల రూపంలో సమీకరించగా, వచ్చే ఏడాది ప్రతిపాదిత రుణం గతేడాది కన్నా రూ.1,044 కోట్లు అధికంగా కనిపిస్తోంది. ఇదే ఆర్థిక మాంద్య పరిస్థితులు కొనసాగితే వచ్చే ఏడాది అప్పుల కింద రూ.40 వేల కోట్ల వరకు సమీకరించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రగతిలో పోలీస్టు పోలీసుశాఖ ప్రగతిపద్దు గత ఏడాదితో పోలిస్తే భారీగా తగ్గింది. 2018–19లో రూ.1,143 కోట్లుగా ఉన్న ప్రగతిపద్దు 2019–20లో కేవలం రూ.167 కోట్లకే పరిమితమైంది. రూ.4,297 కోట్ల మేరకు ఉన్న నిర్వహణ వ్యయాన్ని ఈసారి రూ.4,788 కోట్లకు పెంచారు. నిర్వహణ ఖర్చులు పెరుగుతుండటంతో రూ.500 కోట్లు అదనంగా కేటాయించారు. కొత్త జిల్లాల్లో కమిషనరేట్లు, ఎస్పీల కార్యాల యాలు, కొత్త ఠాణాలు, క్వార్టర్లు తదితర నిర్మాణాలకు అరకొర నిధులే. కమిషనరేట్ల విషయానికి వస్తే.. హైదరాబాద్ ప్రగతిపద్దుకు కోత పడింది. ప్రగతి పద్దు గతేడాది రూ.476 కోట్లు ఉండగా ఈసారి కేవలం రూ.56 కోట్లకు పరిమితం చేశారు. రాచకొండలో సగానికిపై ప్రగతి నిధుల్లోనూ కోతపడింది. గతేడాది రూ.35.36 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.13.35 కోట్లకే పరిమితమైంది. సైబరాబాద్ కమిషనరేట్‌కు గతేడాది ప్రగతినిధులు రూ.35.36 కోట్లు ఇవ్వగా.. ఈసారి రూ.14.03 కోట్లకే పరిమితం చేశారు. ఐటీ, పారిశ్రామిక రంగాలకు కోత గత ఏడాదితో పోలిస్తే తగ్గించిన మొత్తం 740 కోట్లు ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్లో పారిశ్రామిక, ఐటీ రంగాల కేటాయింపుల్లో భారీ కోత విధించారు. గతేడాదితో పోలిస్తే పారిశ్రామిక రంగానికి ఏకంగా రూ.740.12 కోట్ల మేర కేటాయింపులు తగ్గిస్తూ ప్రతిపాదనలు సమర్పించారు. నిర్వహణ పద్దులో కోత విధించే పరిస్థితి లేకపోవడంతో.. ప్రగతి పద్దులో కేటాయింపులు పూర్తిగా తగ్గించారు. గతేడాది పారిశ్రామిక రంగానికి ప్రగతి పద్దు కింద రూ.904.19 కోట్లు కేటాయించగా, ప్రస్తుతం రూ.172.28 కోట్లతో సరిపుచ్చారు. దీంతో పరిశ్రమలకు ఇచ్చే విద్యుత్, ఇతర ప్రోత్సాహకాలపై భారీగా ప్రభావం పడింది. పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా 2018–19 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం రూ.210.78 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్లో రూ.21.55 కోట్లతో సరిపెట్టారు. పారిశ్రామిక ప్రోత్సాహకాల్లో ఒకేసారి రూ.189.23 కోట్లు తగ్గించడం రాష్ట్రంలో పురోగతిపై ప్రభావం చూపనుంది. విద్యుత్ సబ్సిడీ కేటాయింపులు కూడా గతేడాదితో పోలిస్తే రూ.97.02 కోట్ల మేర కేటాయింపులు తగ్గించారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలతో పాటు ఎస్ఎస్పీ, టీఎస్పీ పథకాల ద్వారా ఇచ్చే ప్రోత్సాహక బకాయిలు ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలకు పైగా పేరుకు పోయాయి. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రోత్సాహక బకాయిలు చెల్లింపు పూర్తయ్యే పరిస్థితి కనిపించట్లేదు. జహీరాబాద్ నిమ్జ్ భూ సేకరణ కోసం గతేడాది రూ.82.29 కోట్లు ప్రకటించగా, ప్రస్తుతం రూ.9.19 కోట్లతో సరిపెట్టారు. నేత కార్మికులకు గ్రాంటు, ఇసుక అన్వేషణ పరిహారం కోసం రివాల్వింగ్ ఫండ్, చెరుకు, వాణిజ్య ఎగుమతి తదితరాలకు నామమాత్ర కేటాయింపులతో సరిపెట్టారు. ఐటీ మౌలిక సౌకర్యాల నిధుల్లోనూ.. రాష్ట్ర ఆర్థిక పురోగతిలో కీలకంగా ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖ కేటాయింపుల్లోనూ ప్రస్తుత బడ్జెట్లో కోత విధించారు. పారిశ్రామిక కేటాయింపుల తరహాలో నిర్వహణ పద్దు కింద కేటాయింపుల్లో రూ.30 లక్షలకు తగ్గిస్తూ, ప్రగతి పద్దులో రూ.181.15 కోట్లు కలుపుకొని మొత్తంగా రూ.181.45 కోట్లు తగ్గించారు. ఐటీ శాఖ పరిధిలోని అన్ని ఉప పద్దుల్లోనూ సహాయక గ్రాంట్లను తగ్గించారు. జవహార్ నాలెడ్జ్ కేంద్రాలకు గతేడాది రూ.8.22 కోట్లు కేటాయించగా, ప్రస్తుతం నయా పైసా విదల్చలేదు. ఐటీ రంగంలో మౌలిక సౌకర్యాల కల్పనకు గత బడ్జెట్లో రూ.78 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్లో రూ.10 లక్షలతో సరిపెట్టారు. పారిశ్రామిక, ఐటీ రంగాలకు చిరునామాగా ఉన్న రాష్ట్రంలో ప్రస్తుత బడ్జెట్ ప్రతిపాదనలు ఎంత మాత్రం ఆశాజనకంగా లేవని సంబంధిత వర్గాల ప్రతినిధులు వెల్లడించారు. నిరుద్యోగ భృతికి కోత నిరుద్యోగ భృతికి ఎదురుచూపులు తప్పేలా లేవు. ఎన్నికల హామీలో భాగంగా నిరుద్యోగులకు నెలవారీ భృతి ఇస్తామని ఇచ్చిన హామీ అమలుకు మరికొంత సమయం పట్టనుంది. 2019–20 ఆర్థిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్లో నిరుద్యోగుల భృతికి ప్రభుత్వం ఎలాంటి నిధులు కేటాయించలేదు. పార్లమెంట్ ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్లో నిరుద్యోగ భృతి కింద ప్రభుత్వం రూ.1,810 కోట్లు కేటాయించింది. ఈ పనులకు రూ.3,016 చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో అప్పటి లెక్కల ప్రకారం 5 లక్షల మంది నిరుద్యోగులకు భృతి అందించే వీలుంది. కానీ తాజా గణాంకాల ప్రకారం నిరుద్యోగులకు నిధులు కేటాయించకపోవడంతో వారు మరికొంత కాలం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బియ్యం సబ్సిడీకి రూ.1432 కోట్లు రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సరఫరా చేసే సబ్సిడీ బియ్యం కోసం ఈసారి బడ్జెట్లో రూ. 1432.40 కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కేటాయింపులు రూ. 1,718.33 కోట్లు కాగా ఈసారి నిధుల్లో రూ. 285.93 కోట్ల కోత పడింది. రాష్ట్రంలో అర్హులైన పేదలకు రూపాయికే కిలో బియ్యం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద మొత్తంగా 2.80 లక్షల మంది లబ్ధిదారులకు సబ్సిడీ బియ్యం అందిస్తున్నారు. -
తగ్గిన చదివింపులు
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంద్యం దెబ్బ విద్యాశాఖపైనా పడింది. పొదుపు పాటిస్తూ ప్రగతిపద్దుతోపాటు నిర్వహణ పద్దులోనూ కోత పెట్టింది. గతేడాది ప్రతిపాదిత అంచనాలతో పోల్చితే ఈసారి రూ.3,378.35 కోట్లకు కోత పెట్టగా, సవరించిన అంచనాలతో పోల్చితే రూ. 2,929.75 కోట్లకు కోత పడింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం బడ్జెట్ విద్యారంగం వాటా 7.6 శాతం ఉండగా, ఈసారి మాత్రం 6.75 శాతానికి విద్యారంగం బడ్జెట్ తగ్గిపోయింది. గతేడాది బడ్జెట్లో విద్యాశాఖకు రూ.13,278.19 కోట్లు కేటాయించిన ప్రభుత్వం దానిని రూ. 12,823.57 కోట్లకు సవరించింది. ఈసారి రూ.1,46,492 కోట్ల మొత్తం బడ్జెట్లో విద్యారంగానికి రూ.9,899.82 కోట్లు కేటాయించింది. ఇందులో పాఠశాల విద్యకు రూ.8,209.03 కోట్లు కేటాయించగా, ఉన్నత విద్యకు రూ.1,367.88 కోట్లు, సాంకేతిక విద్యకు రూ.322.91 కోట్లు కేటాయించింది. ఇవీ విభాగాల వారీగా కేటాయింపులు.. పాఠశాల విద్యకు కేటాయించిన మొత్తంలో పాఠశాలవిద్యకు రూ.7,781.5 కోట్లు, ప్రభుత్వ పరీ క్షల విభాగానికి రూ.24.62 కోట్లు, వయోజన విద్యకు రూ.22.76 కోట్లు, ప్రభుత్వ గ్రంథాలయాలకు రూ.51.35 కోట్లు, జవహర్ బాలభవన్ కు రూ.4.21 కోట్లు, ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ముద్రణాలయానికి రూ.35.9 కోట్లు, రాష్ట్ర రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు రూ.147.52 కోట్లు, సమగ్ర శిక్షా అభియాన్‌కు రూ. 135.4 కోట్లు, ఇతరాల కింద మిగతా నిధులను కేటాయించింది. ప్రగతిపద్దులో రూ.693.3 కోట్లే కేటాయించడంతో పాఠశాలల నిర్వహణ, మౌలిక వసతుల కల్పనకు ఈ కేటాయింపులు సరిపోవని విశ్లేషకులు అంటున్నారు. కేంద్ర పథకాల కేటాయింపుల్లో కోత.. గతేడాదితో పోల్చితే కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేటాయింపుల్లో భారీగా కోత విధించింది. రాష్ట్ర వాటా కింద చెల్లించాల్సిన మొత్తాల్లో భారీగా తగ్గించింది. సమగ్ర శిక్షా అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ , ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, సివిల్ వర్క్స్ వంటి వాటిల్లో కేటాయింపులను తగ్గించింది. ఈసారి ఈ పథకాల కోసం రూ.491.56 కోట్లు కేటాయించింది. వర్సిటీలకు మొండిచేయి రాష్ట్రంలో ఉన్నత విద్యకు, ముఖ్యంగా యూనివర్సిటీల వేతనాల కోసమే ప్రభుత్వం నిధులు కేటాయించింది. జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల నిర్వహణ కోసం, వాటిల్లో పనిచేసే అధ్యాపకులు, ఉద్యోగులు, సిబ్బంది వేతనాల కోసం నిర్వహణ పద్దు కింద రూ.1,312.55 కోట్లు కేటాయించింది. గతేడాది ఇందుకోసం రూ.1,663.63 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి అందులోనూ దాదాపు రూ.351 కోట్లు కోత పెట్టింది. ప్రగతి పద్దు కింద మొత్తంగా రూ.55.32 కోట్లు మాత్రమే కేటాయించిన ప్రభుత్వం యూనివర్సిటీలకు పెద్దగా నిధులను ఇవ్వలేదు. యూనివర్సిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలు, పరిశోధనలు, నిర్మాణాలు ఇతరత్రా కార్యక్రమాల నిర్వహణకు పైసా ఇవ్వలేదు. ఒక్క తెలుగు యూనివర్సిటీకి మాత్రం ఇతర సహాయక గ్రాంట్ల కింద కేవలం రూ.3 కోట్లు కేటాయించింది. మిగతా యూనివర్సిటీలకు పైసా ఇవ్వలేదు. ప్రగతిపద్దు కింద 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.420.89 కోట్లు కేటాయించిన ప్రభుత్వం దానిని రూ. 375.64 కోట్లకు సవరించింది. 2018–19 ఆర్థికసంవత్సరంలో రూ.210.42 కోట్లను కేటాయించిన ప్రభుత్వం దాన్ని రూ.173.16 కోట్లకు సవరించింది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ఎన్ఎస్ఎస్, రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ కింద రూ.14.85 కోట్లు కేటాయించింది. సాంకేతిక విద్యాభివృద్ధికి రూ. 2.62 కోట్లు సంప్రదాయ యూనివర్సిటీల తరహాలోనే సాంకేతిక విశ్వవిద్యాలయం, విశ్వ విద్యాలయాల కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలు, పరిశోధనలకు పైసా కేటాయించలేదు. యంత్రాల కొనుగోళ్ల కోసం రూ.2 కోట్లు, ఇతర చెల్లింపులకు రూ.60 లక్షలు, స్కాలర్‌షిప్‌ల కోసం రూ.2 లక్షలు కేటాయించింది. దీంతో అవి ఏ మూలకు సరిపోవని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. గతేడాది ప్రగతి పద్దు కింద రూ.60.85 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, దానిని రూ.50.07 కోట్లకు సవరించింది. ఈసారి మాత్రం రూ.2.62 కోట్లతో సరిపెట్టింది. జీతభత్యాలు, ఇతరత్రా నిర్వహణ, ప్రయాణ ఖర్చుల కింద అవసరమైన నిధులను మాత్రమే కేటాయించింది. నిర్వహణ పద్దు కింద గతేడాది రూ.361.44 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి దానిని రూ. 320.29 కోట్లకు పరిమితం చేసింది. -
గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం...
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంద్యం పంచాయతీరాజ్ శాఖను ఒడిదుడుకులకు గురిచేసింది. బడ్జెట్లో ఆ శాఖ కేటాయింపులను తీవ్రంగా ప్రభావితం చేసింది. గ్రామీణాభివృద్ధికి ఆశాజనకంగా నిధులు కేటాయించినా.. పంచాయతీరాజ్ విభాగానికి మాత్రం కోత పడింది. గ్రామీణ ప్రాంతాలకు పెద్దపీట వేస్తున్న సర్కారు.. పంచాయతీలకు ప్రతి నెలా రూ.339 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం ఈ బడ్జెట్లో హైలెట్. 14వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ నిధులతో వీటిని భర్తీ చేయనుంది. గత బడ్జెట్లో పంచాయతీరాజ్‌కు మంచి ప్రాధాన్యత దక్కింది. నీటిపారుదల శాఖ తర్వాత పీఆర్కే ఎక్కువ నిధులు కేటాయించింది. ఈసారి ఇరిగేషన్‌కు కూడా నిధుల కత్తెరపడినప్పటికీ, అదేస్థాయిలో ఈ శాఖకు నిరాశే మిగిలింది. 2018–19 బడ్జెట్లో పంచాయతీరాజ్‌కు రూ.15,562 .84 కోట్లను కేటాయించగా, తాజా బడ్జెట్లో పీఆర్, గ్రామీణాభివృద్ధికి కలిపి రూ.15,124.89 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం పెంచిన ఆసరా పింఛన్ల మొత్తానికి అనుగుణంగా నెలకు రూ.830 నుంచి రూ.850 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. లబ్దిదారులు అందుబాటులో లేకనో, ఇతరత్రా కారణాలతోనో ఇందులో 15శాతం వరకు వెనక్కు వస్తున్నాయి. ప్రస్తుతం వివిధ కేటగిరీల కింద దాదాపు 40 లక్షల మందికి ఈ పింఛన్లు అందుతున్నాయి. పింఛన్ల మొత్తాన్ని పెంచకముందు (రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తున్నపుడు) రూ. 420–450 కోట్ల వరకు వ్యయమయ్యేది. ఆసరాకు బడ్జెట్లో కేటాయించిన మొత్తం వాస్తవ లెక్కలకు అనుగుణంగా సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. వృద్ధాప్య పింఛన్ల లబ్ధిదారుల అర్హతను 60 ఏళ్ల నుంచి 57కు తగ్గిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు ఇంకా అమల్లోకి రాలేదు. హైదరాబాద్ మినహాయించి మిగతా జిల్లాల్లోనే 57 ఏళ్లకు పింఛను పొందేందుకు అర్హులైన వారి సంఖ్య ఆరున్నర లక్షలు ఉంటుందని సమాచారం. -
లక్ష కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే మరో లక్ష కోట్ల నిధుల అవసరం ఉంది. లక్ష కోట్ల మేర ఖర్చు చేస్తే ప్రభుత్వం నిర్ణయించిన 1.24 కోట్ల ఎకరాల ఆయకట్టు రాష్ట్రంలో సాగులోకి రానుంది. మొత్తంగా రాష్ట్రంలోని 38 భారీ, మధ్యతరహా ఎత్తిపోతల పథకాల పూర్తికి రూ.2.19 లక్షల కోట్ల మేర అవసరం ఉండగా, ఇందులో ప్రభుత్వం ఇప్పటికే 1.15 లక్షల కోట్ల మేర ఖర్చు చేసింది. మరో 1.04 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఇందులో అధికంగా కాళేశ్వరం ఎత్తిపోతలపైనే రూ.54 వేల కోట్ల మేర ఖర్చు చేసింది. ఈ ఏడాది నుంచి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులను వేగిరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి రోజుకు ఒక టీఎంసీ నీటిని 60 రోజుల పాటు ఎత్తిపోసేలా పనులు చేయాలని భావిస్తోంది. దీనికి అనుగుణంగా రూ.10 వేల కోట్ల రుణాలు సేకరించగా, దీని నుంచే అధికంగా ఖర్చు చేయనుంది. లక్ష్యం మేరకు పనులు పూర్తయితే ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఏడాదికే 7 లక్షల ఎకరాలకు నీళ్లందించాలన్నది లక్ష్యంగా ఉంది. రాష్ట్రంలో మొత్తంగా 1.24 కోట్ల ఎకరాలకు ఆయకట్టు వసతి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఇప్పటికే 70.1 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇందులో జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల కింద 2004 నుంచి ఇంతవరకు 16.77 లక్షల ఎకరాల మేర సాగులోకి రాగా, రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు ఏకంగా 12.9 లక్షల ఎకరాలను సాగులోకి తేగా, మరో 53.33లక్షల ఎకరాలను వృద్ధిలోకి తేవాల్సి ఉంది. రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల సమగ్ర స్వరూపం ఇలా.. - మొత్తం భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు: 38 - ప్రాజెక్టుల నిర్మాణాలకు అవసరమైన మొత్తం: రూ.2,19,513.9 కోట్లు - ఇప్పటివరకు ఖర్చు చేసిన మొత్తం: రూ.1,15,417.72 కోట్లు - ఇంకా ఖర్చు చేయాల్సిన మొత్తం: రూ.1,04,096.18 కోట్లు - రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఖర్చు చేసిన మొత్తం: రూ.80 వేల కోట్లు - ప్రాజెక్టులతో సాగులోకి రావాల్సిన ఆయకట్టు: 70.1 లక్షల ఎకరాలు - ఇప్పటివరకు సాగులోకి వచ్చిన ఆయకట్టు: 16.77 లక్షల ఎకరాలు - ఇంకా సాగులోకి రావాల్సింది: 53.33 లక్షల ఎకరాలు -
ఆరేళ్లలో విద్యకు 4.13 శాతం తగ్గిన బడ్జెట్
ఆర్థిక మాంద్యం కారణంగా ఆదాయాలు తగ్గినప్పటికీ పరిస్థితిలో తప్పక మార్పు వస్తుందనే ఆశాభావం నాకుంది. ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగింది. రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగుపడి ఆదాయం పెరిగితే అందుకు తగ్గట్టు అంచనాలు సవరించుకునే వెసులుబాటు కూడా మనకు ఉంది. – కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపులు ఏటేటా తగ్గిపోతున్నాయి. రాష్ట్రంలోని పాఠశాలలు, ఉన్నత విద్యాసంస్థలు, యూనివర్సిటీలు, సాంకేతిక విద్యాసంస్థలకు రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు క్రమంగా పడిపోతున్నాయి. రాష్ట్ర బడ్జెట్‌తో పోల్చితే విద్యారంగానికి కేటాయింపులు 4.13 శాతం మేర తగ్గిపోయాయి. ఆ ప్రభావం విద్యారంగంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపైనా పడుతోందన్న విమర్శలున్నాయి. 2014–15 ఆర్థిక సంవత్సరంలో విద్యాశాఖకు కేటాయించిన మొత్తం రాష్ట్ర బడ్జెట్లో 10.88 శాతం కాగా, ఇపుడు అది 6.75 శాతానికి పడిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి రెండు ఆర్థిక సంవత్సరాల్లో విద్యాశాఖకు రాష్ట్ర బడ్జెట్లో వాటా తగ్గినా నిధులపరంగా కొంత బాగానే ఉంది. 2016–17 ఆర్థిక సంవత్సరం వచ్చేసరికి రాష్ట్ర బడ్జెట్ పెరిగినా, విద్యాశాఖ వాటా పెరగక పోగా తగ్గింది. 2014–15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ రూ. 1,00,637 కోట్లు కాగా, విద్యాశాఖకు రూ.10,963 కోట్లు (రాష్ట్ర బడ్జెట్లో 10.88 శాతం) కేటాయించింది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ రూ.1,15,689 కోట్లు కాగా విద్యాశాఖకు రూ.11,216 కోట్లు (9.69 శాతం) కేటాయించింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ రూ.1,30,415 కోట్లకు పెరగగా, విద్యాశాఖ బడ్జెట్ మాత్రం రూ.10,738 కోట్లకు తగ్గిపోయింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలోనూ రాష్ట్ర బడ్జెట్ 1,49,453 కోట్లకు పెరిగింది. అందులో విద్యాశాఖకు నిధులు పెరిగాయి. విద్యాశాఖ బడ్జెట్ రూ.12,278 కోట్లకు పెరిగినా రాష్ట్ర బడ్జెట్లో విద్యాశాఖ వాటా చూస్తే 8.49 శాతానికే పరిమితమైంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ 1,74,453 కోట్లు కాగా విద్యాశాఖకు రూ.13,278 కోట్లు కేటాయించింది. ఈసారి ఆర్థిక మాంద్యం ప్రభావం మరింతగా తగ్గించి రూ.9,899.82 కోట్లకు పరిమితం చేసింది. -
అప్పుతోనే ‘సాగు’తుంది!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంద్యం, కేంద్రం నుంచి తగ్గిన నిధుల కేటాయింపుల నేపథ్యంలో రాష్ట్ర సాగునీటి రంగానికి భారీ కోత పడింది. గతంలో ప్రవేశపెట్టిన మూడు పూర్తిస్థాయి బడ్జెట్లలో రూ.25 వేల కోట్లకు పైగా బడ్జెట్ కేటాయింపులు చేసిన ప్రభుత్వం ఈసారి రూ.8,476.17 కోట్లకే పరిమితం చేసింది. ఇందులో మేజర్ ఇరిగేషన్‌కు రూ.7,794.3 కోట్లు కేటాయించగా, మైనర్ ఇరిగేషన్‌కు రూ.642.3 కోట్లు కేటాయించింది. సీతారామ ఎత్తిపోతల, కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకు అధిక కేటాయింపులు చేశారు. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు రుణాల ద్వారా సేకరించిన నిధులనే ఖర్చు చేయనుండగా, సీతారామ, వరద కాల్వ, దేవాదుల ప్రాజెక్టుల తెలంగాణ వాటర్ డెవలప్మెంట్ ఇరిగేషన్ కార్పొరేషన్ ద్వారా తీసుకునే రుణాలతో నెట్టుకు రానున్నారు. మొత్తంగా రూ.12,400 కోట్ల రుణాలతో ప్రాజెక్టుల పనులను వేగిరం చేసే అవకాశం ఉంది. 2016–17 ఆర్థిక సంవత్సరం నుంచి వరుసగా మూడేళ్ల పాటు రూ.25 వేల కోట్లకు తగ్గకుండా నిధులు కేటాయించింది. ఈ ఏడాది ఓట్ ఆన్ అకౌంట్లో 6 నెలలకే రూ.10 వేల కోట్ల కేటాయింపులు చేశారు. ఇందులో ఇప్పటికే రూ.3,500 కోట్ల మేర ఖర్చు జరిగింది. అయితే ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్లో మాత్రం సాగునీటికి కేటాయింపులు తగ్గాయి. ఈ బడ్జెట్లో అధికంగా సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ.1,324.02 కోట్లు కేటాయించగా, కాళేశ్వరం రూ.1,080.18 కోట్లు, పాలమూరు–రంగారెడ్డికి రూ.500 కోట్ల మేర కేటాయింపులు చేశారు. దేవాదుల ఎత్తిపోతల పథకానికి కేంద్ర పథకాల నుంచి నిధులు వచ్చే అవకాశాల నేపథ్యంలో దీనికి రూ.545 కోట్లు కేటాయించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టులకు రూ.1,200 కోట్ల మేర నిధులు కేటాయిస్తే ప్రాజెక్టులు పూర్తవుతాయని అధికారులు ప్రతిపాదనలు పంపగా, రూ.78 కోట్ల మేర మాత్రమే కేటాయింపులు చేశారు. ఇందులో కల్వకుర్తికి రూ.4 కోట్లు, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌కు చెరో రూ.25 కోట్ల మేర కేటాయింపులతో సరిపెట్టారు. మిషన్ కాకతీయ కింద చెరువుల పనులు పూర్తవడం, తూముల నిర్మాణంతో గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం మాత్రమే చేపడుతుండటంతో మైనర్ ఇరిగేషన్ బడ్జెట్‌కు కోత పడింది. గతంలో ప్రతిసారి రూ.2 వేల కోట్లకు పైగా కేటాయిస్తూ వస్తుండగా, ఈసారి రూ.643 కోట్లకు పరిమితం చేశారు. రుణాలతోనే గట్టెక్కేది.. 2018–19 వార్షిక బడ్జెట్లో సాగునీటికి రూ.25 వేల కోట్ల కేటాయింపులు చేయగా, దీన్ని ప్రస్తుతం రూ.19,985 కోట్లకు సవరించారు. ఇది కాళేశ్వరం రుణాల ద్వారా మరో రూ.15 వేల కోట్లు, దేవాదుల, సీతారామలకు సంబంధించిన కార్పొరేషన్ల ద్వారా మరో రూ.3 వేల కోట్ల మేర ఖర్చు చేశారు. రుణాలతో కలిపి ఖర్చు చేసిన మొత్తాలను చూస్తే ఈ ఏడాది రూ.35 వేల కోట్లకు పైగా ఖర్చు జరిగింది. అయితే రాష్ట్ర బడ్జెట్లో నుంచి కేటాయింపులు చేసిన పాలమూరు–రంగారెడ్డికి రూ.3 వేల కోట్లు కేటాయించగా, దాన్ని రూ.2,179 కోట్లకు సవరించారు. తుపాకులగూడేనికి రూ.700 కోట్లు కేటాయించగా, దాన్ని రూ.518 కోట్లకు సవరించారు. ఇక ఈ ఏడాది బడ్జెట్‌ను పూర్తిగా కుదించారు. రూ.8,476 కోట్లకు కుదించడంతో పూర్తిగా రుణాల ద్వారానే భారీ ప్రాజెక్టులకు నిధుల ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం మొదటి దశ పనుల పూర్తికి కార్పొరేషన్ ద్వారా రూ.45 వేల కోట్ల రుణాలు సేకరించగా, ఇందులో ఇప్పటికే రూ.38 వేల కోట్ల మేర ఖర్చు జరిగింది. మిగతా రుణాలను ఖర్చు చేసి మల్లన్నసాగర్, గంధమల, బస్వాపూర్ పనులను పూర్తి చేయనున్నారు. దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ, వరద కాల్వ ప్రాజెక్టులకు వచ్చే ఏడాది పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని భావిస్తున్నారు. వీటన్నింటినీ కలిపి ఇప్పటికే కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.17 వేల కోట్ల రుణాలు తీసుకునే నిర్ణయం జరగ్గా, ఇప్పటికే రుణాల ద్వారా సేకరించిన మొత్తంలో రూ.6 వేల కోట్ల మేర ఖర్చు జరిగింది. మిగతా రుణాలను వినియోగించుకుంటూ మొత్తం పనులు పూర్తి చేసే అవకాశం ఉంది. వీటితో పాటే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారానే రూ.10 వేల కోట్లు రుణం తీసుకుంటున్నారు. దీంట్లోంచే ఈ ప్రాజెక్టుకు రూ.3 వేల కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. మొత్తంగా అన్ని ప్రధాన ప్రాజెక్టులకు కలిపి రుణాల ద్వారానే రూ.12,400 కోట్లకు పైగా ఖర్చు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. -
వృద్ధి రేటు ‘పది’లమే
కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములను కాపాడటానికి కోర్టుల్లో చేసిన న్యాయ పోరాటాలు ఫలిస్తున్నాయి. రూ. వేల కోట్ల విలువైన భూములపై ఇప్పుడు ప్రభుత్వానికి హక్కు కలిగింది. ఈ భూములను విక్రయించడం వల్ల ఆదాయం సమకూరుతుంది. దాన్ని ప్రజల అవసరాలు తీర్చే విషయంలో ఏ శాఖలో ఇబ్బంది కలిగినా సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వృద్ధి రేటు పదిలంగానే ఉంది. ఏడాదిన్నరగా దేశం ఆర్థిక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్నా, రెండంకెల వృద్ధి రేటును రాష్ట్రం నిలబెట్టు కుంది. వరుసగా ఐదో ఏడాది జాతీయ సగటును అధిగ మించింది. మాంద్యం ప్రభావంతో 2018–19 ఆర్థిక ఏడాదిలో జాతీయ వృద్ధి రేటు 6.8 శాతానికి పతనం కాగా, తెలంగాణ వృద్ధి రేటు 10.5 శాతానికి ఎగ బాకింది. రాష్ట్రంలో పశు సంపద, మైనింగ్, తయారీ, ఆర్థిక సేవలు, స్థిరాస్తి, విద్య, వైద్యం తదితర రంగాలు ఏటేటా అభివృద్ధి పథంలో దూసుకుపోతూ రాష్ట్ర వృద్ధి రేటు పెంపుదలకు దోహదపడు తున్నాయి. 2017–18లో స్థిర ధరల వద్ద 5.6 లక్షల కోట్లున్న జీఎస్డీపీ 2018–19లో 10.5% వృద్ధి రేటుతో రూ. 6.19 లక్షల కోట్లకు పెరిగింది. 2017–18లో ప్రస్తుత ధరల వద్ద స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) విలువ రూ.7.54 లక్షల కోట్లు కాగా, 2018–19లో 14.8 శాతం వృద్ధిరేటుతో రూ.8.66 లక్షల కోట్లకు పెరిగినట్లు సీఎం తెలిపారు. -
ఆర్టీసీకి రూ.500 కోట్లే..!
సాక్షి, హైదరాబాద్: తాజా బడ్జెట్లో ఆర్టీసీకి తీవ్ర నిరాశే ఎదురైంది. వేతనాలు చెల్లించేందుకు కూడా ఇబ్బంది పడుతున్న సంస్థకు.. బడ్జెట్లో ఊరట లభించలేదు. బస్ పాస్ రాయితీలు భరించినందుకు ప్రభుత్వం రీయింబర్స్‌మెంటు చేసే మొత్తానికి సంబంధించి రూ.680 కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరగా రూ.500 కోట్లు మాత్రమే బడ్జెట్లో ప్రతిపాదించింది. ఇక బ్యాంకు రుణాలను చెల్లించేందుకు రూ.200 కోట్లు కావాలని కోరగా రూ.50 కోట్లు మాత్రమే ప్రకటించింది. కొత్త బస్సుల కొనుగోలుకు రూ.150 కోట్లు కోరగా, ప్రభుత్వం ఆ పద్దు జోలికే వెళ్లలేదు. పొరుగు రాష్ట్రం ఏపీ అక్కడి ఆర్టీసీకి రూ.1,572 కోట్ల ఆర్థిక సాయాన్ని బడ్జెట్ లో ప్రకటిస్తే ఇక్కడ రూ.550 కోట్లే ప్రతిపాదించటం సరికాదని ఎన్ఎంయూ నేత నాగేశ్వర్రావు ఓ ప్రకటనలో మండిపడ్డారు. ఆర్టీసీకి రూ.3 వేల కోట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. వీటికి కేటాయింపుల్లేవ్.. - మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు ఈసారి ప్రభుత్వం మొండిచేయి చూపింది. గత బడ్జెట్లో రూ.460 కోట్లు ప్రకటించి చివరకు రూ.378 కోట్లకు సవరించింది. తాజా బడ్జెట్లో ఆ పద్దు జాడే లేదు. - గజ్వేల్ ప్రాంత అభివృద్ధి అథారిటీకి ఈసారి నిధులు కేటాయించలేదు. గత బడ్జెట్లో రూ.80 కోట్లు ప్రతిపాదించి, రూ.66 కోట్లకు సవరించారు. - జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనాల కోసం రూ.100 కోట్లు ప్రతిపాదించింది. గత బడ్జెట్లో ఈ మొత్తం రూ.500 కోట్లుగా చూపారు. చివరకు దాన్ని రూ.411 కోట్లకు సవరించారు. తెలంగాణ కళాభారతి లాంటి ప్రతిపాదనలను కూడా పక్కనపెట్టేసింది. - పర్యాటక శాఖ, హెరిటేజ్ తెలంగాణకు జీతాల కోసం తప్ప అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేదు. -
హరీశ్.. తొలిసారి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు తొలిసారిగా శాసనమండలిలో 2019–20 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సోమవారం అసెంబ్లీ, కౌన్సిల్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా మండలిలో ఆయన బడ్జెట్ ప్రతిపాదనలను శాఖల వారీగా వివరిస్తూ ప్రసంగించారు. 2004–05లో యువజన సర్వీసులు, 2014–18 మధ్య కాలంలో నీటిపారుదల, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆర్థిక మంత్రి హోదాలో కౌన్సిల్లోనూ ఆయన బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. సభ మొదలుకాగానే చైర్మన్ స్థానంలో ఉన్న నేతి విద్యాసాగర్ వివిధ పత్రాలు సభ ముందు ఉంచినట్టుగా ప్రకటించి, బడ్జెట్ ప్రసంగం చేయాల్సిందిగా మంత్రి హరీశ్‌కు సూచించారు. ఉదయం 11.30కి బడ్జెట్ ప్రసంగపాఠాన్ని చదవడం మొదలుపెట్టిన హరీశ్ 40 నిమిషాల్లో తన ప్రసంగం ముగించారు. స్పష్టమైన ఉచ్ఛారణతో తడబాటు లేకుండా బడ్జెట్ ప్రతిపాదనలను చదివి వినిపించారు. సోమవారం సభా కార్యక్రమాలు మొదలు కావడానికి కొంత సమయం ముందే మండలి హాలులోకి అడుగుపెట్టిన హరీశ్‌ను మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరీ సుభాష్‌రెడ్డి తదితరులు అభినందించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యవతి రాథోడ్‌ను టీఆర్ఎస్ ఇతర ఎమ్మెల్సీలు అభినందించారు. తొలిసారిగా మండలికి వచ్చిన గుత్తా సుఖేందర్‌రెడ్డి, రఘోత్తంరెడ్డిలను చైర్మన్ స్థానంలో ఉన్న నేతి విద్యాసాగర్ సభకు పరిచయం చేశారు. కౌన్సిల్ సమావేశాలను 11వ తేదీ ఉదయం 11.30కి వాయిదావేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, చైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉన్నందున మండలి 11న సమావేశం కానుంది. -
22 వరకు అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 14 నుంచి 22 వరకు వరుసగా తొమ్మిది రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం అనంతరం.. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరిగింది. సీఎం కేసీఆర్, ఉపసభాపతి పద్మారావు గౌడ్, పలువురు మంత్రులు, విపక్ష ఎమ్మెల్యేలు హాజరైన ఈ సమావేశంలో శాసనసభ సమావేశాల నిర్వహణపై చర్చించారు. మొహర్రం, గణేశ్ నిమజ్జనం తదితరాల నేపథ్యంలో ఈ నెల 10 నుంచి 13 వరకు వరుసగా నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేయాలని నిర్ణయించారు. బీఏసీ సమావేశానికి శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో పా టు, మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ హాజరయ్యారు. వీరితోపాటు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి హాజరు కాగా, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ బీఏసీ సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ తర హాలో హైదరాబాద్‌లో ప్రత్యేక భవనం నిర్మించా లని భట్టి విక్రమార్క సూచించారు. నూతనంగా నిర్మించే అసెంబ్లీ భవన సముదాయంలో నిర్మిస్తా మని కేసీఆర్ తెలిపారు. అక్టోబర్‌లో రెవెన్యూ బిల్ పెట్టే అవకాశం ఉందని కేసీఆర్ వెల్లడించినట్లు తెలి సింది. కాగా వచ్చే బడ్జెట్ సమావేశాలను 21 రోజులపాటు నిర్వహించాలని కేసీఆర్ సూచించారు. 22 వరకు అసెంబ్లీ సమావేశాలు.. వాయిదా అనంతరం తిరిగి 14న ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 22న ముగుస్తాయి. 14వ తేదీ మొదలు 22వ తేదీ వరకు రోజువారీగా చేపట్టాల్సిన అంశాలపై బీఏసీ చర్చించింది. 14, 15 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ కొనసాగించి, 15న ముఖ్యమంత్రి సమాధానం ఇస్తారు. 16న హౌసింగ్, సాంఘిక, గిరిజన, మహిళా, మైనార్టీ, స్త్రీ, శిశు, వికలాంగ సంక్షేమ శాఖల పద్దులపై సభ చర్చిస్తుంది. 17న మున్సిపల్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల, విద్యుత్ అంశా లు, 18న రెవెన్యూ, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రవాణా, హోం, వ్యవసాయం, అనుబంధ శాఖలు, పౌర సరఫరాల శాఖ పద్దులపై చర్చిస్తారు. 19న పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్య, క్రీడలు, యువజన, వైద్య, ఆరోగ్య శాఖ పద్దులు, 20న కార్మిక, ఉపాధి, దేవాదాయ, అటవీ, పరిశ్రమలు, ఐటీ, ప్రభుత్వ రంగ సంస్థలపై చర్చ జరుగుతుంది. 21న పాలన, ప్రణాళిక, సమాచార శాఖ పద్దులు, సమావేశాల చివరి రోజు 22న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరుగుతుంది. 14 నుంచి 22 వరకు పలు బిల్లులను కూడా సభలో పెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 22న శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఉగాండాలో జరిగే కామన్వెల్త్ దేశాల పార్లమెంటరీ స్పీకర్ల సదస్సులో పాల్గొనేందుకు బయలుదేరి వెళతారు. నాలుగు రోజుల పాటు మండలి భేటీ.. ఈ నెల 11న శాసనమండలి స్పీకర్ ఎన్నిక తర్వాత శాసన మండలిని వాయిదా వేసి, తిరిగి 14, 15, 22 తేదీల్లో సమావేశాలు నిర్వహించాలని శాసన మండలి బీఏసీ నిర్ణయించింది. పద్దుల మీద శాసన మండలిలో చర్చ జరగనందున కేవలం నాలుగు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. -
మాంద్యం ముప్పు.. మస్తుగా అప్పు
సాక్షి, హైదరాబాద్ : బడ్జెట్ ప్రతిపాదనలనుబట్టి చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆర్థిక మాంద్యం ముంచేసిందని అర్థమవుతోంది. పన్ను రాబడుల్లో తగ్గిన వృద్ధి రేటు, ఆదాయ వనరులపై తిరోగమన ప్రభావం కారణంగా ఈ ఏడాది బడ్జెట్ లెక్కలు తారుమారయ్యాయి. ఆరు నెలలకుగాను ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్‌కన్నా రూ. 36 వేల కోట్ల మేర బడ్జెట్ ప్రతిపాదనలు తగ్గిపోవడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది. వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చిన నాటి నుంచి మొదటి ఏడాది మాత్రమే కేంద్రం నుంచి రాష్ట్రం పరిహారం తీసుకోగా ప్రస్తుత ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో ఏప్రిల్ నుంచి జూలై వరకు దాదాపు రూ. 875 కోట్లను కేంద్రం నుంచి పరిహారం కింద తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొనడం ఆర్థిక మాంద్య ప్రభావాన్ని కళ్లకు కట్టినట్టు చూపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రతిపాదనల్లో చూపిన రూ. 33 వేల కోట్లకుపైగా అప్పులు, సీఎం తన ప్రసంగంలో చెప్పినట్లు భూముల విక్రయాల ద్వారానే రాష్ట్ర మనుగడ ఆధారపడేలా కనిపిస్తోంది. మరోవైపు పన్ను రాబడిపై ప్రభుత్వం గంపెడాశలు పెట్టుకున్నా పురోగతి కనిపించే పరిస్థితి లేకపోవడంతోనే విధిలేని పరిస్థితుల్లో బడ్జెట్‌ను తగ్గించి చూపారని ఆర్థిక నిపుణులంటున్నారు. పన్ను అంచనాల్లోనూ తిరోగమనమే... ఈ ఏడాది బడ్జెట్ లెక్కలనుబట్టి చూస్తే పన్ను అంచనాలు కూడా తగ్గిపోయాయి. గతేడాది రెవెన్యూ ఆదాయం కింద రూ. 1.30 లక్షల కోట్లు చూపగా సవరించిన అంచనాల్లో అది రూ. 1.19 లక్షల కోట్లకు తగ్గింది. ఈ ఏడాది బడ్జెట్ అంచనాల్లోనే రూ. 1.13 లక్షల కోట్లను రెవెన్యూ రాబడుల కింద చూపడం గమనార్హం. ఈ ఏడాది పన్ను రాబడిలో కూడా పురోగతి ఉండదనే ఆలోచనతోనే బడ్జెట్‌ను కుదించారని అర్థమవుతోంది. గతేడాది సవరించిన అంచనాలతో పోలిస్తే అప్పులు రూ. 9 వేల కోట్లు తక్కువగా చూపగా మొత్తం బడ్జెట్ అంచనాలు రూ. 36 వేల కోట్ల మేర తగ్గిపోయాయి. అంటే పన్ను, పన్నేతర రాబడులు ఆ మేరకు తగ్గిపోవచ్చనే అంచనాతోపాటు అంతకన్నా ఎక్కువ అప్పులు కూడా లభించే పరిస్థితి లేకపోవడం, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు తగ్గుతాయనే అంచనాలతోనే బడ్జెట్‌ను తక్కువ చేసి చూపారని ఆర్థిక నిపుణులంటున్నారు. పన్ను రాబడులను పరిశీలిస్తే ఈసారి రూ. 69,328.57 కోట్ల మేర పన్నుల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గతేడాది అంచనాలతో పోలిస్తే ఇది రూ. 4 వేల కోట్లు తక్కువ. అయితే పన్నేతర రాబడులు భారీగా పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గతేడాది అంచనాల్లో పన్నేతర రాబడులను రూ. 8,973 కోట్లుగా చూపగా సవరించిన అంచనాలకు వచ్చేసరికి అది కాస్తా రూ. 6,347 కోట్లకే పరిమితమైంది. కానీ ఈసారి మాత్రం పన్నేతర రాబడుల కింద ఏకంగా రూ. 15 వేల కోట్లకుపైగా చూపడం గమనార్హం. కేంద్రం వాటా ఎక్కువే... పన్ను రాబడిలో కేంద్రం వాటా గతేడాదికన్నా ఎక్కువే వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గతేడాది రూ. 17,906 కోట్ల మేర పన్నులు, డ్యూటీల రూపంలో కేంద్రం నుంచి వాటాగా రాగా, ఈసారి రూ. 19,718 కోట్లు వస్తాయని బడ్జెట్లో ప్రతిపాదించారు. అలాగే రాష్ట్ర పన్నుల కింద గతేడాదికన్నా రూ. 3 వేల కోట్లు ఎక్కువగా రూ. 69,328 కోట్లు, విక్రయాలు, వ్యాపార పన్నుల కింద రూ. 47,789 కోట్లు, ఎక్సైజ్‌శాఖ నుంచి రూ. 10,901 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందులో ఎక్సైజ్ మినహా ప్రతి రాబడిలోనూ గతేడాదికన్నా ఎక్కువగానే వస్తుందని ప్రతిపాదించారు. రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ ద్వారా గతేడాది రూ. 10,313 కోట్ల రాబడి నమోదవగా ఈసారి అది రూ. 10,901 కోట్లకు పెరుగుతుందని బడ్జెట్ లెక్కల్లో చూపారు. ఖర్చులూ తక్కువే... రాబడులు తక్కువగా ఉంటాయనే అంచనాల నేపథ్యంలో ఈసారి రెవెన్యూ ఖర్చులను కూడా తక్కువ చూపారు. గతేడాది రూ. 1.25 లక్షల కోట్ల నికర ఖర్చును అంచనాల్లో చూపగా ఈసారి అంచనాల్లో దాన్ని రూ. 1.11 లక్షల కోట్లకు తగ్గించారు. ఇక మూలధన వ్యయంలో భారీ తగ్గుదల కనిపిస్తోంది. గతేడాది అంచనాల్లో రూ. 33 వేల కోట్లకుపైగా మూలధన వ్యయాన్ని ప్రతిపాదిస్తే ఈసారి దాన్ని దాదాపు సగం... అంటే రూ. 17,274 కోట్లకు తగ్గించడం గమనార్హం. అయితే రుణాలు, అడ్వాన్సుల కింద చెల్లింపులు, తాత్కాలిక రుణ చెల్లింపులు, ఇతర రుణ చెల్లింపులను మాత్రం గతేడాదితో పోలిస్తే ఎక్కువగా చూపెట్టారు. లోటు బడ్జెట్ రూ. 24 వేల కోట్ల పైమాటే... ఈసారి ప్రతిపాదనల్లో రూ. 24,081 కోట్లను ద్రవ్యలోటుగా చూపారు. గతేడాది ప్రతిపాదనల్లో రూ. 29 వేల కోట్లకుపైగా ద్రవ్యలోటు ఉండగా ఏడాది ముగిసేసరికి అది రూ. 28,722 కోట్లకు తగ్గింది. అయితే ఈసారి అందులో రూ. 4,700 కోట్ల మేర లోటు తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేసి ఈ మేరకు బడ్జెట్ అంచనాల్లో ప్రతిపాదించింది. ఇక రెవెన్యూ మిగులు విషయానికి వస్తే రూ. 2,044 కోట్లను మిగులు బడ్జెట్‌గా చూపింది. అప్పులు, భూముల విక్రయాలే దిక్కు... బడ్జెట్ ప్రతిపాదనలు, సీఎం ప్రసంగాన్నిబట్టి చూస్తే ఈ ఏడాది అప్పులు, భూముల విక్రయాలపైనే రాష్ట్ర ప్రభుత్వం కాలం గడపాల్సి వస్తుందని అర్థమవుతోంది. తాజా బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం ఈసారి మొత్తం బడ్జెట్లో 20 శాతానికిపైగా ఎక్కువ మొత్తాన్ని రుణాల ద్వారా సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం రూ. 33,444 కోట్ల రుణాలను ప్రతిపాదించింది. గతేడాదితో పోలిస్తే ఇది తక్కువే అయినా ఆ మేరకు మొత్తం బడ్జెట్ కూడా తగ్గిపోవడంతో గతేడాది తరహాలోనే ఈసారి కూడా అప్పులను ప్రతిపాదించింది. అదేవిధంగా రూ. వేల కోట్ల విలువైన భూముల విక్రయాల ద్వారా అదనపు ఆదాయం తీసుకొచ్చి ప్రజల అవసరాలను తీరుస్తామని, ఏ శాఖలో ఇబ్బంది కలిగినా సర్దుబాటు చేస్తామని సీఎం బడ్జెట్ ప్రసంగంలోనే చెప్పడం గమనార్హం. దీంతో అప్పులు, భూముల విక్రయాలపైనే ఆధారపడి ఈ ఆర్థిక సంవత్సరం ముందుకెళ్తుందనే భావన ఆర్థిక వర్గాల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్ర బడ్జెట్లో భారీ కోత.. ఓటాన్ అకౌంట్లో రూ. 1.82 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించగా పూర్తి స్థాయి బడ్జెట్‌కు వచ్చేసరికి అది రూ.1.46,492.3 కోట్లకు తగ్గి పోయింది. అదే 2018– 19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే అంచనాల బడ్జెట్‌లోరూ.28 వేల కోట్ల తగ్గుదల కనిపిస్తోంది. 2018– 19గాను రూ. 1.74 లక్షల కోట్ల అంచనాలను ప్రతిపాదించగా సవరించిన అంచనాల్లో అది రూ. 1.61 లక్షల కోట్లకు తగ్గింది. ఇప్పుడు ప్రతిపాదించిన రూ. 1.46 లక్షల కోట్ల ప్రతిపాదనలు కూడా సవరించిన అంచనాలకు వచ్చేసరికి ఎంత తగ్గుతుందో, పరిస్థితులు చక్కబడితే ఎంత పెరుగుతుందో అనే అంశం ఆసక్తికరం. బడ్జెట్ స్వరూపం(రూ. కోట్లలో) -
‘విక్రమ్’ జాడను కనుక్కోవచ్చేమో గానీ..: విజయశాంతి
సాక్షి, హైదరాబాద్ : గత బడ్జెట్ లెక్కలు తేలకముందే.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కొత్త బడ్జెట్ పేరుతో గారడీకి సిద్ధమయ్యారని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి అన్నారు. చంద్రయాన్-2లో ల్యాండర్ విక్రమ్ జాడను కనుక్కోవచ్చేమో గానీ.. కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో కేటాయింపులకు సంబంధించిన వాస్తవాలను కనుక్కోవడం ఎవరి తరం కాదేమోనని ఎద్దేవా చేశారు. 2019-20 సంవత్సరానికి గానూ రూ. 1, 46,492.3 కోట్లతో సీఎం కేసీఆర్ సోమవారం ప్రతిపాదించిన బడ్జెట్‌పై విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతేడాది కూడా లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా కేటాయింపులతో టీఆర్ఎస్ సర్కారు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందన్నారు. అయినప్పటికీ అక్షరాస్యతలో తెలంగాణ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అట్టడుగులో ఉందని సర్వేలో తేలిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పేదలకు వైద్యం అందించే విషయంలో కూడా కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అందరూ చూశారని విమర్శించారు. ‘విష జ్వరాలు విజృంభిస్తున్నా.. ప్రభుత్వ ఆసుపత్రులలో కనీస సదుపాయాలు లేకపోవడం..ఆరోగ్యశ్రీ బిల్లులను పెండింగ్‌లో పెట్టడం వంటి నిర్లక్ష్య ధోరణితో.. కేసీఆర్ పేద రోగుల జీవితాలతో ఏ రకంగా ఆడుకున్నారో అందరికీ అర్థమైంది. రైతులకు యూరియా అందించే విషయంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు గత బడ్జెట్లో పెద్దపీట వేశామని ప్రగల్బాలు పలికిన కేసీఆర్ ప్రభుత్వం... ప్రధాన రంగాలను ఏ రకంగా గాలికి వదిలేసిందనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించారు’ అని ప్రభుత్వ తీరును విజయశాంతి ఎండగట్టారు. గతంలో కీలక రంగాలకు కేటాయించిన బడ్జెట్ నిధులు ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు. ‘కేసీఆర్ లెక్కా- పద్దుల విషయం ఏమోగానీ... గత బడ్జెట్లో కేటాయించిన నిధుల వినియోగంలో జరిగిన అవకతవకలపై లెక్క తేల్చేందుకు బీజేపీ నేతలు సిద్ధమయ్యారని వారి ప్రకటనల ద్వారా అర్ధం అవుతోంది. మరి ఎవరి లెక్క ముందు తేలుతుందో వేచి చూడాలి’ అని విజయశాంతి పేర్కొన్నారు. -
ఆ పథకాల కోసం ప్రజాధనాన్ని వృధా చేయం!
సాక్షి, హైదరాబాద్: దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం తెలంగాణపై పడిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంపై ఆర్థిక మాంద్యం ప్రభావం ఉన్నా.. సంక్షేమ పథకాలు యథాతథంగా కొనసాగుతాయని సీఎం స్పష్టం చేశారు. గత ఐదేళ్ల స్వల్ప వ్యవధిలోనే రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించిందని, దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. 2019-20 పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో సీఎం కేసీఆర్... మండలిలో ఆర్థిక మంత్రి హరీష్‌రావు ప్రవేశపెట్టారు. అనంతరం శాసనసభ... శనివారానికి శాసనమండలి బుధవారానికి వాయిదా వేశారు. చదవండి: తెలంగాణ బడ్జెట్ హైలైట్స్ ప్రజాధనాన్ని వృధా చేయదలుచుకోలేదు కేంద్ర ప్రభుత్వ పథకాలపై తమకు పూర్తి అవగాహన వుందని, ప్రజలకు మేలు చేసే..కేంద్ర పథకాలను మాత్రమే రాష్ట్రంలో అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజలకు ప్రయోజనం కలిగించని కేంద్ర పథకాల కోసం ప్రజాధనాన్ని వృధా చేయదలుచుకోలేదని తేల్చి చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం కంటే రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకంతోనే ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతోందని, ఆరోగ్యశ్రీ ద్వారా 85 లక్షల 34వేల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుండగా.. ఆయుష్మాన్ భారత్ ద్వారా కేవలం 26 లక్షల కుటుంబాలకు మాత్రమే మేలు జరుగుతుందని కేసీఆర్ వివరించారు. ఆరోగ్య శ్రీ కోసం ప్రస్తుత బడ్జెట్లో ఏడాదికి రూ. 1,336 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. మూలధన వ్యయం పెరిగింది! తెలంగాణ ఏర్పాటు తర్వాత మూలధన వ్యయం పెరిగిందని, తమ ప్రభుత్వ విధానాలతో మూలధన వ్యయం పెరుగుతూ వస్తోందని తెలిపారు. జీడీపీ వృద్ధి రేటు 4.5 నుంచి 10.2 శాతానికి పెరిగిందన్నారు. ఐదేళ్లలో తెలంగాణ సంపద రెట్టింపు అయిందన్నారు. ఐటీ రంగంలో 11.5 శాతం, వ్యవసాయంలో 8.1 శాతం వృద్ధి నమోదయినట్టు చెప్పారు. ఐటీ ఎగుమతుల విలువ 100 శాతానికిపైగా పెరిగిందని, పారిశ్రామిక రంగంలో అదనంగా అభివృద్ధి సాధించామన్నారు. గత ఏడాదిన్నరగా దేశం తీవ్రమైన ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటోందని, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 5 శాతం అభివృద్ధి మాత్రమే నమోదైందని కేసీఆర్ తెలిపారు. ఆర్థిక మాంద్యం ఉందన్న విషయాన్ని గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయని, దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33 శాతం తగ్గిందన్నారు. రైతుబంధు యథాతథంగా కొనసాగుతుంది వాహనాల కొనుగోలులో 10.6 శాతం తగ్గుదల కనిపిస్తోందని, విమానయాన రంగంపైనా ఆర్థిక మాంద్యం ప్రభావం ఉందని వెల్లడించారు. గూడ్స్ రైళ్ల బుకింగ్ కూడా తగ్గిందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూపాయి పతనమైందని, డాలర్‌తో రూపాయి మారకం విలువ 72.40కు పడిపోయిందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు చింతిస్తున్నానని అన్నారు. మోటార్ వాహనాలు, ఎక్సైజ్ పాటు అన్ని రంగాల్లో ఆదాయం తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పన్నేతర వ్యయం 29 శాతం తగ్గిందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కేంద్రం కోత పెట్టిందని వాపోయారు. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి తెలంగాణ కంటే దారుణంగా ఉందని వెల్లడించారు. రైతు బంధు పథకం యథాతథంగా కొనసాగుతుందని కేసీఆర్ స్పష్టత నిచ్చారు. అందుకు చింతిస్తున్నాను..! కేంద్ర విధానాలనే రాష్ట్రాలు అనుసరించాలే తప్ప మరో గత్యంతరం లేదని, అందుకు తెలంగాణ కూడా అతీతం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు సంక్లిష్టంలో ఉన్న ఈ పరిస్థితిలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి వచ్చిందని చింతిస్తున్నానని అన్నారు. చేజారిపోతున్న వేల కోట్ల విలువైన భూమిపై ఇప్పుడు ప్రభుత్వానికి హక్కు వచ్చిందని, ఆ భూమిని దశల వారీగా విక్రయంచడం ద్వారా రాష్ట్రానికి అదనంగా ఆదాయం వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. -
సీఎం బడ్జెట్ ప్రసంగంలో ఆ అంశాలే లేవు : భట్టి
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఉందని కాంగ్రెస్ శాసనసభాపక్ష(సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు అయిన తర్వాత అవసరం లేకపోయినా ఆరు నెలల కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన కేసీఆర్.. ఈ సారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి చేతులు ఎత్తేశారని విమర్శించారు. ప్రపోస్డ్ బడ్జెట్‌కే రూ.36వేల కోట్లు కుదించారని, బడ్జెట్ అమలులోకి వచ్చే సరికి ఇంకా తగ్గిస్తారన్నారు. మిగులు బడ్జెట్‌తో వచ్చిన రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారని ఆరోపించారు. (చదవండి : తెలంగాణ బడ్జెట్ లైవ్ అప్డేట్స్) ‘గత ఐదేళ్ల పరిపాలన ఫలితం ఇప్పుడు కలిపిస్తోంది. సీఎం కేసీఆర్‌కు ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్లే అప్పులు పెరిగాయి. ఆయన చేతకానితనాన్ని కేంద్రం మీద రుద్దేందుకు ప్రయత్నింస్తున్నారు. మొదటగా జీఎస్టీని పొడిగిన కేసీఆర్.. ఇప్పుడు కేంద్రాన్ని తిడుతున్నారు. కేసీఆర్ పాలన ఫలితాలు బయటకు రావడంతో కేంద్రాన్ని బదనాం చేస్తున్నారు. కేసీఆర్ పాలన వల్ల రాష్ట్రం నష్టపోతుదుంది’ అని భట్టి ఆరోపించారు. సీఎం బడ్జెట్ ప్రసంగంలో డబుల్ బెడ్రూం, నిరుద్యోగ బృతి, ఉద్యోగ కల్పన మాటలే లేవని ధ్వజమెత్తారు. శ్రీపాద ఎల్లంపల్లితో హైదరాబాద్‌కు నీరు తెచ్చింది కాంగ్రెస్ అయితే... అది తన క్రెడిట్‌గా కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చేసిందేమి లేదు కానీ జలకళ మొత్తం తెచ్చింది ఆయనే అనుకుంటున్నారని విమర్శించారు. మెట్రో రైలు కూడా కేసీఆర్ తీసుకురాలేదన్నారు. గత ప్రభుత్వాల పరిపాలన వల్ల వచ్చిన ఫలితాలను కేసీఆర్ తన ఫలితాలుగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.హైదరాబాద్‌లో ప్రజల భూములు తనాఖ పెట్టి అప్పులు తెచ్చే హక్కు కేసీఆర్‌కు లేదన్నారు. మియాపూర్‌లోని 800 ఎకరాల భూముల లెక్కలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఆ భూముల్లో పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లను నిర్మించి ఇవ్వాలని లేదంటే తాము ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. -
ఢిల్లీ తరహాలో హైదరాబాద్ కాన్‌స్టిస్ట్యూషనల్ క్లబ్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 22వ తేదీ వరకు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. శాసనసభలో సీఎం కేసీఆర్, శాసనమండలిలో ఆర్థికమంత్రి హరీశ్‌రావు రాష్ట్రబడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం శాసనసభా కార్యకలాపాల సంఘం (బీఏసీ) సమావేశమైంది. 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని, ఆదివారం కూడా సమావేశాలు కొనసాగించాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. చదవండి: తెలంగాణ బడ్జెట్ హైలైట్స్ ఈ నెల 24వ తేదీన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఈ నెపథ్యంలో అక్టోబర్ మధ్యలో అసెంబ్లీలో కొత్త రెవెన్యూ బిల్లు పెట్టే అవకాశముందని తెలుస్తోంది. ఇక, టీ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క సూచించినవిధంగా ఢిల్లీలో మాదిరిగా హైదరాబాద్ కాన్సిస్ట్యూషనల్ క్లబ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక, వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాలు 21 రోజులు పెట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. ఈ నెల 14, 15 తేదీల్లో బడ్జెట్‌పై చర్చ ఉంటుందని వెల్లడించారు. ఇక, శాసన మండలిలో ఈ నెల 14న రాష్ట్ర బడ్జెట్‌పై చర్చ జరగనుంది. 15వ తేదీన బడ్జెట్‌పై ప్రభుత్వం సమాధానం ఇస్తుంది. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 10న మండలికి సెలవు కాగా, 11వ తేదీన చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఉండనుంది. మళ్లీ 12, 13 తేదీల్లో సెలవులు ఉండనున్నాయి. 14న బడ్జెట్‌పై చర్చ, 15న బడ్జెట్‌పై ప్రభుత్వ సమాధానం ఉండనున్నాయి. ఈ నెల 14వ తేదీ నుంచి 22 వరకు మండలి సమావేశాలు జరగనున్నాయి. -
ఉపాధి కల్పన, నిరుద్యోగ భృతిపై ప్రస్తావన లేదు
-
తెలంగాణ బడ్జెట్లో వ్యవసాయరంగానికి పెద్దపీట
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో వ్యవసాయరంగానికి పెద్దపీట వేసిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ అన్నారు. సోమవారం బడ్జెట్ కేటాయింపుల అనంతరం మండలి మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. కేంద్రం సహకరించకపోయినా తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ వివిధ పథకాలకు కేటాయింపులు తగ్గించలేదన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో కేటాయింపులు బాగున్నాయని అన్నారు. ఈ బడ్జెట్ ప్రజల బడ్జెట్ : నోముల నర్సింహయ్య తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల బడ్జెటని, ప్రజారంజకంగా ఉందని టీఆర్ఎస్ నేత నోముల నర్సింహయ్య కొనియాడారు. సోమవారం బడ్జెట్ కేటాయింపుల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని సంక్షేమ రంగాలకు ఉపయోగపడే విధంగా ఉందన్నారు. దేశ వ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేదలకు న్యాయం చేసే విధంగా తెలంగాణ బడ్జెట్ ఉందని పేర్కొన్నారు. -
తెలంగాణ బడ్జెట్ అంచనాలు ఇవే
సాక్షి, హైదరాబాద్: 2019–20 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ను రూ.1,46,492.3 కోట్ల అంచనాతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు(కేసీఆర్) సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్రానికి రూ.1,13,099.92 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఆదాయ వ్యయం రూ.1,11,055.84 కోట్లు, మూలధన వ్యయం రూ.17,274.67 కోట్లుగా చూపించారు. రెవెన్యూ మిగులు రూ.2,044.08 కోట్లుగా అంచనా వేశారు. ఆర్థిక లోటు రూ. 24,081.74 కోట్లుగా చూపించారు. (చదవండి: తెలంగాణ బడ్జెట్ హైలైట్స్) బడ్జెట్ అంచనాలు కేంద్ర పన్నులు, సుంకాల వచ్చే ఆదాయం రూ.19,718.57 కోట్లు రాష్ట్రం విధించే పన్నుల ద్వారా వచ్చే రాబడి రూ.69,328.57 కోట్లు పన్నులు కాకుండా వచ్చే ఆదాయం రూ.15,875.03 కోట్లు గ్రాంటుల కింద వచ్చే నిధులు రూ. 8,177.75 కోట్లు -
‘ప్రభుత్వ వైఫల్యాలకు బడ్జెట్ నిదర్శనం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం అసెంబ్లీ ప్రవేశపెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశగా ఉందన్నారు. తొమ్మిది నెలల ప్రభుత్వ వైఫల్యాలకు ఈ బడ్జెట్‌ను నిదర్శమన్నారు. బడ్జెట్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పన, నిరుద్యోగ భృతిపై ప్రస్తావన లేకపోవడం చాలా బాధాకరమన్నారు. 2019-20 సంవత్సరానికి రూ.1, 46,492.3 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీనిపై అసెంబ్లీ వద్ద మీడియా పాయింట్లో జీవన్ రెడ్డి మాట్లాడారు. ‘తెలంగాణ బడ్జెట్ ఆశ్చర్యాన్ని కలిగించింది. రుణమాఫీపై బడ్జెట్లో స్పష్టత ఇవ్వలేదు. నిరుద్యోగుల ఉపాధికల్పన, నిరుద్యోగ భృతిపై బడ్జెట్లో ప్రస్తావించకపోవటం బాధాకరం. కేసీఆర్ తన వైఫల్యాలను కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కమీషన్ల బాగోతం బయటకు వస్తోందనే.. కాళేశ్వరానికి జాతీయ హోదా అడగడం లేదు. ఆరోగ్యశ్రీ అమలు చేస్తూనే... కేంద్ర పథకం ఆయుష్మాన్ భారత్ నిధులను తీసుకోవాలి’ అని అన్నారు. చదవండి: తెలంగాణ బడ్జెట్ హైలైట్స్ ఐఆర్, పీఆర్సీ పై బడ్జెట్ ప్రస్తావనలేదు: ఎమ్మెల్సీ నర్సీరెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశగా ఉంది. ఆర్ధిక అంచనాలను అంచనా వేయడంలో ప్రభుత్వ విఫలమయ్యింది. 5 నెలల కింద ప్రవేశపెట్టిన లక్ష 80 వేల కోట్ల బడ్జెట్ ఇప్పుడు ఎందుకు తగ్గింది. రైతుబంధు డబ్బులు ఎప్పుడు ఇస్తారు. రాష్ట్రంలో 59 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీపై బడ్జెట్ ప్రస్తావనలేదు. ఆర్థిక మాంద్యంను తట్టు కునే విధంగా బడ్జెట్ రూపొందించాలి. నిరాశాజనకంగా బడ్జెట్ ఉంది: ఎమ్మెల్సీ రామచందర్ రావు రూ.36 వేలకోట్ల లోటు బడ్జెట్‌పై చర్చ జరగాలి. బడ్జెట్ నిరాశాజనకంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలను పూర్తి చేయలేక కేంద్ర ప్రభుత్వంపై నెపం నెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పును ఒప్పుకునే ప్రయత్నం చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని కేంద్రంపై నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. -
అవినీతి రహిత పాలన
-
రైతు బంధుపై కేసీఆర్ వివరణ
సాక్షి, హైదరాబాద్: దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం తెలంగాణపై పడిందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు(కేసీఆర్) వెల్లడించారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామి ఉందని అన్నారు. 2019–20 పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ఆయన ప్రవేశపెట్టారు. ఆర్థిక మాంద్యం ఉన్నా సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత మూలధన వ్యయం పెరిగిందని, తమ ప్రభుత్వ విధానాలతో మూల ధన వ్యయం పెరుగుతూ వస్తోందని తెలిపారు. జీడీపీ వృద్ధి రేటు 4.5 నుంచి 10.2 శాతానికి పెరిగిందన్నారు. ఐదేళ్లలో తెలంగాణ సంపద రెట్టింపు అయిందన్నారు. ఐటీ రంగంలో 11.5 శాతం, వ్యవసాయంలో 8.1 శాతం వృద్ధి నమోదయినట్టు చెప్పారు. ఐటీ ఎగుమతుల విలువ 100 శాతానికిపైగా పెరిగిందని, పారిశ్రామిక రంగంలో అదనంగా అభివృద్ధి సాధించామన్నారు. గత ఏడాదిన్నర దేశం తీవ్రమైన ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటోందని, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 5 శాతం అభివృద్ధి మాత్రమే నమోదైందని కేసీఆర్ తెలిపారు. ఆర్థిక మాంద్యం ఉందన్న విషయాన్ని గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయని, దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33 శాతం తగ్గిందన్నారు. వాహనాల కొనుగోలులో 10.6 శాతం తగ్గుదల కనిపిస్తోందని, విమానయాన రంగంపైనా ఆర్థిక మాంద్యం ప్రభావం ఉందని వెల్లడించారు. గూడ్స్ రైళ్ల బుకింగ్ కూడా తగ్గిందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూపాయి పతనమైందని, డాలర్‌తో రూపాయి మారకం విలువ 72.40కు పడిపోయిందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు చింతిస్తున్నానని అన్నారు. మోటార్ వాహనాలు, ఎక్సైజ్ పాటు అన్ని రంగాల్లో ఆదాయం తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పన్నేతర వ్యయం 29 శాతం తగ్గిందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కేంద్రం కోత పెట్టిందని వాపోయారు. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి తెలంగాణ కంటే దారుణంగా ఉందని వెల్లడించారు. రైతు బంధు పథకం యథాతథంగా కొనసాగుతుందని కేసీఆర్ స్పష్టత నిచ్చారు. (చదవండి: తెలంగాణ బడ్జెట్ హైలైట్స్) -
లైవ్ అప్డేట్స్: తెలంగాణ బడ్జెట్ హైలైట్స్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు (కేసీఆర్) శాసనసభలో ప్రవేశపెట్టారు. 2019-20 సంవత్సరానికి రూ. 1, 46,492.3 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను సీఎం కేసీఆర్ ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 1,11,055 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ. 17,274.67 కోట్లు.. బడ్జెట్ అంచనాల్లో మిగులు రూ. 2,044.08 కోట్లుగా సీఎం కేసీఆర్ చూపించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు గత ఫిబ్రవరిలో రూ.లక్షా 82 వేల కోట్ల అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సెప్టెంబర్ 30తో కాలపరిమితి ముగియబోతున్న నేపథ్యంలో 2019–20కు సంబంధించిన పూర్తిస్థాయి వార్షిక చిట్టాపద్దును కేసీఆర్ సభ ముందు ఉంచారు. వాస్తవిక దృక్పథంతో ఈసారి బడ్జెట్‌ను రూపొందించామని, రాష్ట్ర బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా నెలకొన్న తీవ్ర ఆర్థిక మాంద్యం ప్రభావం పడిందని సీఎం వివరించారు. దాదాపు 40 నిమిషాల పాటు సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగాన్ని చదివి వినిపించారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే సభను 14వ తేదీ(శనివారం)కి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రెకటించారు. తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ హైలైట్స్.. లైవ్ అప్డేట్స్ ఇవి.. ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్య శ్రీతోనే మేలు ఆరోగ్య శ్రీ కోసం ఏడాదికి రూ. 1,336 కోట్లు కేటాయింపు ఆరోగ్యశ్రీ ద్వారా 85 లక్షల 34వేల కుటుంబాలకు ప్రయోజనం ఆయుష్మాన్ భారత్ ద్వారా కేవలం 26లక్షల కుటుంబాలకు మాత్రమే మేలు పునర్విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాలకు రావాల్సిన రూ. 450 కోట్లను కేంద్రం ఇవ్వలేదు 43 రెవెన్యూ డివిజన్లను 69కి పెంచుకున్నాం 459 మండలాలను 584 మండలాలుగా చేసుకున్నాం గతంలో 68 మున్సిపాలిటీలు ఉంటే వాటి సంఖ్య 142కు పెంచుకున్నాం కొత్తగా ఏడు మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసుకొని.. 13కి పెంచుకున్నాం రెవెన్యూ డివిజన్లలో 28 డీఎల్పీవోల సంఖ్యను 68కి పెంచాం పోలీసు వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణకు మరింత పటిష్టమైన చర్యలు శాంతిభద్రతలను పటిష్టం చేసేందుకు పోలీసు వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాం కొత్తగా ఏడు పోలీసు కమిషనరెట్లను ఏర్పాటుచేసి.. వాటి సంఖ్యను 9కి పెంచాం పోలీసు సబ్ డివిజన్ల సంఖ్యను 163కి పెంచాం పోలీసు సర్కిళ్ల సంఖ్యను 668 నుంచి 717కి పెంచాం పోలీసు స్టేషన్ల సంఖ్యను 814కి పెంచాం అవినీతి రహిత పాలన తెలంగాణలో అవినీతి రహిత పాలన అందిస్తున్నాం కాలం చెల్లిన చట్టాల స్థానంలో కొత్త చట్టాలు తెచ్చాం అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా ప్రభుత్వ సేవలు అందిస్తున్నాం పంచాయతీరాజ్ శాఖ బలోపేతానికి ఖాళీలను భర్తీ చేస్తాం స్థానిక సంస్థలకు నిధుల కొరత రాకుండా కట్టుదిట్టమైన విధానం గ్రామపంచాయతీలకు కేంద్రం ఇచ్చే నిధులకు సమానంగా రాష్ట్రం నుంచి నిధులు ఇస్తున్నాం గ్రామపంచాయతీలకు ప్రతినెలా రూ. 339 కోట్లు అందించాలని నిర్ణయం ఆర్థిక లోటు రూ. 24,081.74 కోట్లు 2019-20 సంవత్సరానికి రూ. 1, 46,492.3 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ రెవెన్యూ వ్యయం రూ. 1,11,055 కోట్లు మూలధన వ్యయం రూ. 17,274.67 కోట్లు బడ్జెట్ అంచనాల్లో మిగులు రూ. 2,044.08 కోట్లు రాష్ట్ర ఆర్థిక లోటు రూ. 24,081.74 కోట్లు రైతుబంధు, రైతుబీమా నిరంతరం రైతుబంధు, రైతుబీమా పథకాలు నిరంతరం కొనసాగుతాయి పంట రుణ మాఫీ కోసం రూ.6వేల కోట్లు కేటాయిస్తున్నాం రైతుబంధు కోసం 12వేల కోట్లు కేటాయింపు రైతుబీమా ప్రీమియం చెల్లింపు కోసం రూ.1,137కోట్లు కేటాయింపు రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ కోసం ఇప్పటివరకు రూ. 20,925 కోట్లు ఖర్చు ఐదేళ్లలో అభివృద్ధి, సంక్షేమానికి 5.37 లక్షల కోట్ల ఖర్చు ఉదయ్ పథకం ద్వారా రుణభారం రూ. 9,695 కోట్లు ప్రభుత్వమే భరిస్తుంది విద్యుత్ సంస్థలకు సింగరేణి చెల్లించాల్సిన బకాయిలు రూ. 5,772 కోట్లు ప్రభుత్వమే చెల్లించింది గ్రామపంచాయతీలకు రూ. 2,714 కోట్లు కేటాయింపు పురపాలక సంఘాలకు రూ. 1,764 కోట్లు కేటాయింపు కొత్త పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల ద్వారా గ్రామాలు, పట్టణాల్లో ఉన్నతస్థాయి సేవలు గ్రామాలు, పట్టణాల ప్రగతి కోసం ఈ నెల 6 నుంచి 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ఆసరా పెన్షన్ల కోసం రూ. 9,402 ఓట్లు కేటాయింపు కొత్త జోనల్ వ్యవస్థతో స్థానికులకు 95శాతం ఉద్యోగాలు త్వరలోనే 57 ఏళ్లు నిండిన వారందరికీ వృద్ధాప్య పెన్షన్ బీడీ కార్మికుల పీఎఫ్ కటాఫ్ డేట్‌ను ప్రభుత్వం తొలగించింది ఇంగ్లిష్ మీడియం రెసిడెన్షియల్ పాఠశాలలను యథాతథంగా కొనసాగింపు అభివృద్ధి, సంక్షేమం కోసం ఈ ఐదేళ్లలో రూ. 5,37,373 కోట్లు ఖర్చు చేశాం కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం అందినవి కేవలం రూ. 31,802 కోట్లు మాత్రమే బకాయిలు చెల్లించాకే కొత్త పనులు ఆర్థిక మాంద్యం వల్ల ఆదాయం తగ్గింది ఆదాయం తగ్గినా పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశాభావం వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగుపడి ఆదాయం పెరుగుతుందని అంచనా బకాయిలు చెల్లించాకే కొత్త పనులు చేపట్టాలని విధాన నిర్ణయం పరిమితులకు లోబడి ప్రభుత్వ మార్గనిర్దేశాల ప్రకారం ఖర్చు నిధుల ఖర్చుపై మంత్రులు, కార్యదర్శులకు ఆర్థిక శాఖ నుంచి స్పష్టమైన సూచనలు తెలంగాణపైనా ఆర్థిక సంక్షోభ ప్రభావం భీకరమైన జీవన విధ్వంసం నుంచి తెలంగాణ కుదుటపడింది తీవ్రమైన ఆర్థిక మాంద్యం దేశంలోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33శాతం తగ్గింది వాహనాల అమ్మకాలు 10.65శాతం తగ్గాయి రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోయింది దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభ ప్రభావం తెలంగాణపై కూడా పడింది తెలంగాణకు జీఎస్టీ పరిహారం తీసుకోవాల్సిన అవసరం రాలేదు జూన్ నెలలో తీసుకున్న జీఎస్టీ పరిహారం ఏప్రిల్, మే నెలల కంటే నాలుగు రెట్లు ఎక్కువ గతంలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంచనాలకు నేటికీ చాలా వ్యత్యాసముంది కేంద్రానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 1.36శాతం వృద్ధి మాత్రమే సాధ్యమైంది. ఈ ఆర్థిక సంవత్సరం 6.61శాతం వృద్ధి మాత్రమే సాధ్యమైంది మొత్తంగా పన్నేతర ఆదాయం 29శాతం తగ్గింది ఐదేళ్లలో తెలంగాణ సంపద రెట్టింపు తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా దృఢంగా మారింది 2013-14లో జీఎస్డీపీ విలువ 4,51,581 కోట్లు ఉండగా.. ప్రస్తుతం రెట్టింపయింది రాష్ట్ర జీఎస్డీపీ (రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి) వృద్ధిరేటు 4.5శాతం నుంచి 10.2శాతానికి పెరిగింది ఐదేళ్లలో తెలంగాణ సంపద రెట్టింపు అయింది వివిధ ఆర్థిక సంస్థలిచ్చిన నిధులను మూలధన వ్యయంగా ఖర్చు చేశాం నిధులను ఖర్చు చేసే విషయంలో ప్రభుత్వం నిబద్ధతతో ఉంది గత ఐదేళ్లలో పెట్టుబడి వ్యయం ఆరురెట్లు పెరిగింది సమర్థవంతమైన ఆర్థిక విధానం వల్ల అన్ని రంగాలకు నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తున్నాం వ్యవసాయ రంగానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నాం రాష్ట్ర రైతాంగం కోసం రైతుబంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్నాం రాష్ట్రంలో 6.3శాతం అదనపు వృద్ధి రేటను సాధించాం వ్యవసాయ రంగంలో 2018-19నాటికి 8.1శాతం వృద్ధిరేటును నమోదుచేశాం ఐటీ రంగంలో 2018-19 నాటికి 11.05శాతం వృద్ధిరేటు సాధించాం 2018-19నాటికి లక్షా 10 వేల కోట్ల ఐటీ ఎగుమతులు నమోదయ్యాయి మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులను పునరుద్ధరించాం వందలాది గురుకులాల్లో లక్షలాది విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందుతోంది దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ 2014 జూన్‌లో నూతన రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది ఐదేళ్ల స్వల్ప వ్యవధిలోనే రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించింది దేశంలోనే తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా నిలిచింది వినూత్నమైన పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది రాష్ట్రం ఏర్పడినప్పుడు నిర్దిష్టమైన ప్రతిపాదికలు ఏమీ లేవు తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా దృఢంగా మారింది 2013-14లో జీఎస్డీపీ విలువ 4,51,581 కోట్లు.. రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధిరేటు 4.5శాతం నుంచి 10.2శాతానికి పెరిగింది ఐదేళ్లలో తెలంగాణ సంపద రెట్టింపు అయింది వివిధ ఆర్థిక సంస్థలిచ్చిన నిధులను మూలధన వ్యయంగా ఖర్చు చేశాం రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. ప్రముఖ కవి కాళోజీ జయంతి సందర్భంగా అసెంబ్లీ లాంజ్‌లో కాళోజీ చిత్రపటానికి నివాళులర్పించిన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు బడ్జెట్ ప్రతులను సభాపతికి అందజేసిన ఆర్థిక మంత్రి హరీశ్‌రావు -
నేడే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. దాదాపు రూ.లక్షా 65 వేల కోట్ల అంచనాలతో పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్ధం చేసిందని తెలిసింది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో ఆదివారం రాత్రి ప్రగతిభవన్‌లో సమావేశ మైన రాష్ట్ర మంత్రివర్గం కొత్త బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. దీంతోపాటే వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో కలుపుతూ నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ సోమవారం ఉదయం 11.30 గంటలకు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగించనున్నారు. ఇటు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్ట నున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు గత ఫిబ్రవరిలో రూ.లక్షా 82 వేల కోట్ల అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, సెప్టెంబర్ 30తో కాలపరిమితి ముగియబోతోంది. ఈ నేపథ్యంలో 2019–20కు సంబంధించిన పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ను సోమవారం ప్రవేశపెడుతున్నారు. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక మాంద్యం నెలకొన్న నేపథ్యంలో వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ రూపకల్పన జరుపుతున్నట్లు ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటిం చారు. ఆర్థిక మాంద్యం దేశంలోని అన్ని రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని, ప్రజల్లో వస్తు, సేవల కొనుగోళ్ల శక్తి క్షీణించి వివిధ రకాల పన్నుల రూపంలో రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయం పడిపోయిందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొ న్నాయి. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ పరిస్థితి మెరుగ్గానే ఉన్నా, ఇకపై కొంత జాగ్రత్తలు తీసుకోక తప్పదని రాష్ట్రప్రభుత్వం అభిప్రాయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో పోల్చితే పూర్తి స్థాయి బడ్జెట్లో నిధుల కేటాయింపుల్లో కోతలు తప్పవని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో పోల్చితే పూర్తి స్థాయి బడ్జెట్‌ను 8 నుంచి 12 శాతం వరకు కుదించే అవకాశాలున్నాయి. బడ్జెట్ అంకెల్లో చూస్తే రూ.14 వేల కోట్ల నుంచి రూ.22 వేల కోట్ల వరకు కేటాయింపుల్లో కోతపడవచ్చని తెలిసింది. ఎప్పటిలాగే బడ్జెట్లో వ్యవసాయం, సంక్షేమ రంగాలకు పెద్ద పీట వేయనుండగా, నీటిపారుదల రంగానికి కొంత వరకు నిధులను కత్తిరించనున్నారని చర్చ జరుగుతోంది. సీఎంకు విప్ల కృతజ్ఞతలు కొత్తగా నియమితులైన అసెంబ్లీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఇతర విప్‌లు ఆదివారం రాత్రి ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ, మండలిలో విప్ల బాధ్యతలను సీఎం వారికి వివరించారు. -
మాంద్యం ఎఫెక్ట్.. బడ్జెట్ కట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వార్షిక బడ్జెట్ తగ్గనుంది. గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో పోల్చితే త్వరలో ప్రవేశపెట్ట బోతున్న పూర్తిస్థాయి బడ్జెట్లో కేటాయింపులను 8 నుంచి 12 శాతం వరకు కుదించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. దాదాపు రూ.14 వేల కోట్ల నుంచి రూ.22 వేల కోట్ల వరకు కేటాయింపుల్లో కోత పడనుందని తెలుస్తోంది. రూ.లక్షా 82 వేల కోట్ల అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.. పూర్తిస్థాయి బడ్జెట్‌ను సుమారు రూ.లక్షా 65 వేల కోట్లకు కుదించే అవకాశాలున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా అన్ని రంగాలపై తీవ్ర ఆర్థిక మాంద్యం ప్రభావం నెలకొని ఉన్న నేపథ్యంలో రాష్ట్ర రాబడుల్లో వృద్ధి సైతం మందగించిందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడు తున్నాయి. ఆర్థిక మాంద్యానికి తోడు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధుల కేటాయింపులు కూడా తగ్గాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో వాస్తవికతతో పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో నిధుల కేటాయింపుల్లో కోతలు తప్పవని స్పష్టమవుతోంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాలపరిమితి సెప్టెంబర్ 30తో ముగియనుంది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఆరు నెలల పాటు అమలు చేయాల్సిన పూర్తిస్థాయి బడ్జెట్‌కు తుదిరూపునిచ్చే పనిలో సీఎం కేసీఆర్ తలమునకలై ఉన్నారు. గత నెలాఖ రులో తొలి దఫా కసరత్తు చేసిన ఆయన.. గత బుధ, గురువారాల్లో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై బడ్జెట్‌కు తుదిరూపునిచ్చారు. ఈ నెల 9న ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర శాసనసభను సమావేశపరిచి అదే రోజు బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. రూ.20 వేల కోట్లకు గండి! రాష్ట్ర ఆదాయం–అవసరాలను బేరీజు వేసుకుని ప్రభుత్వం బడ్జెట్‌కు తుది రూపునిస్తోంది. రోజురోజుకూ ఆర్థిక మాంద్యం తీవ్రరూపం దాల్చుతుండ డంతో లక్ష్యాలతో పోల్చితే వచ్చే ఆరేడు నెలల్లో సుమారు రూ.15వేల కోట్ల నుంచి రూ.20వేల కోట్ల ఆదాయానికి గండి పడే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనాకు వచ్చినట్లు తెలిసింది. 2018–19లో రాష్ట్రం రూ.72,777 కోట్ల సొంత రెవెన్యూ రాబడులు సాధించగా, 2019–20లో రూ.94,776 కోట్లు సాధించే అవకాశాలున్నాయని ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రభుత్వం లెక్కకట్టింది. అలాగే కేంద్రం నుంచి వివిధ గ్రాంట్ల రూపంలో రూ.28,042 కోట్లు రానున్నాయని అంచనా వేసింది. అయితే మాంద్యం తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో రాష్ట్ర సొంత రెవెన్యూ రాబడులు రూ.80వేల కోట్లకు మించే అవకాశాలు లేవని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. జీఎస్టీ ఆదాయం బాగానే ఉన్నప్పటికీ.. పెట్రోల్ ఉత్పత్తులు, రవాణా రంగాల నుంచి రావాల్సిన పన్నుల ఆదాయం కొంత తగ్గినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇక కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన కేటాయింపులు కూడా తగ్గాయి. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో తెలంగాణకు కేటాయించాల్సిన కేంద్ర ప్రన్నుల్లో రాష్ట్ర వాటాలో రూ.840 కోట్లు కోత పెట్టింది. దీంతో ఈ మేరకు రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులను సైతం ప్రభుత్వం తగ్గించనుంది. రైతుబంధు భారం తగ్గింపు దిశగా.. ఆర్ధికంగా రానున్న రోజుల్లో క్లిష్ట పరిస్థితులు ఉత్పన్నం కానున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడున్న పరిస్థితులతో పోల్చితే ప్రస్తుతం పరిస్థితులు మారినందున దాదాపు అన్ని శాఖలకు బడ్జెట్ కేటాయింపుల్లో కొంత వరకు కోతలు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అధికారవర్గాలు చెబుతున్న ప్రకారం.. సాగు, సంక్షేమం, విద్యుత్ రంగాలకు ప్రాధాన్యతను కొనసాగించి మిగిలిన రంగాలకు కోతలు పెట్టే అవకాశాలున్నట్లు తెలిసింది. ఓటాన్ అకౌంట్లో సాగునీటి రంగానికి రూ.22,500 కోట్లను కేటాయించగా, పూర్తిస్థాయి బడ్జెట్లో దాదాపు రూ.20వేల కోట్లకు తగ్గించే అవకాశాలున్నాయి. వ్యవసాయాభివృద్ధి కేటాయింపులు రూ.20,107 కోట్ల నుంచి రూ.18 వేల కోట్లకు తగ్గనున్నట్టు సమాచారం. రైతుబంధు పథకం భారాన్ని కొంత వరకు తగ్గించుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. విద్యుత్ సంస్థలు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రూ.4,650 కోట్ల విద్యుత్ సబ్సిడీని మాత్రం యథావిధిగా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్లో కొత్త పథకాలకు కేటాయింపులు, కొత్త ప్రకటనలకు ఉండే అవకాశాలు సన్నగిల్లాయి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ప్రధానమైన సామాజిక పింఛన్ల పెంపును ఇప్పటికే ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇంకా అమలు చేయాల్సిన ఇతర హామీలకు ఈ ఏడాది కేటాయింపులు ఉండే అవకాశాలు లేనట్లే. కొన్ని ప్రతిష్టాత్మక పథకాలు, ప్రాజెక్టులు మినహా మిగిలినవాటికి బడ్జెట్లో భారీగా కోతలకు అవకాశాలున్నట్లు చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది నుంచి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీరు అందించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్లు కేటాయించవచ్చని తెలిసింది. -
వారు సభలో డబ్బాలు కొట్టుకునేవారు కానీ....
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా ఉందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అరవై ఏళ్లు గోస పడ్డ తెలంగాణను ఈ అయిదేళ్లలో సీఎం కేసీఆర్ అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లారని ప్రశంసించారు. సాగు, త్రాగు నీరు, పవర్, రైతు బంధు లాంటి పథకాలు పెట్టి అభివృద్ధికి బాటలు వేస్తున్నారన్నారు. ప్రతి అంశాన్ని అవగాహన చేసుకొనిసీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రవేశ పెట్టారని చెప్పారు. గతంలో ఉన్న నేతలు సభలో ఉబ్బాలు కొట్టుకునేవారు కానీ అభివృద్ధిపై చర్చించేవారు కాదని ఆరోపించారు. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు.. ఇప్పుడున్న ప్రభుత్వం ఒక్క యూనిట్ కూడా కరెంట్ ఎక్కువగా ఉత్పత్తి చేయలేదనడం విడ్డూరంగా ఉందన్నారు. తమ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి నీరు అందుతోందని చెప్పారు. వ్యవసాయానికి కూడా సాగు నీరు పుష్కలంగా అందుతోందన్నారు. ప్రస్తుతం దేశం మొత్తం తెలంగాణను అనుకరిస్తుందన్నారునిధులు, అభివృద్ధి కావాలంటారు కానీఅప్పులు వద్దంటారు.. మరి అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని నిలదీశారు. గత ప్రభుత్వాలు అప్పులు చేయలేదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పుకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పినా.. ఇంకా మారలేదని విమర్శించారు. -
‘ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ బడ్డెట్’
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ బడ్డెట్‌ను ప్రవేశ పెట్టిందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన శాసనమండలిలో మాట్లాడుతూ.. ప్రభుత్వం సంక్షేమ పథకాలకు బడ్జెట్ తక్కువగా కేటాయించిందని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పలేదన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి కేటాయింపుపై బడ్జెట్లో ప్రస్తావన లేదన్నారు. ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్ కేటాయింపులో గత బడ్జెట్ కంటే సుమారు 100 కోట్లకుపైగా తగ్గించారని చెప్పారు. రుణమాఫీ ఏక కాలంలో చేస్తారా.. విడతల వారిగా చేస్తారా అన్న దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. మొన్నటి అకాల వర్షం వలన జరిగిన పంట నష్టానికి ఇప్పటి వరకు కనీసం పర్యవేక్షణ చేయలేదని మండిపడ్డారు. ధరణి వెబ్ సైట్ పనిచేయడం లేదని తెలిపారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు బడ్జెట్లో డబ్బులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. తండాలు గ్రామ పంచాయతీలుగా చేశారు కానీ బడ్జెట్లో డబ్బులు కేటాయించలేదన్నారు. విద్య, వైద్యానికి బడ్జెట్లో డబ్బులు తక్కువగా కేటాయించారని తెలిపారు. -
‘నిరుద్యోగ భృతి ఎలా ఇయ్యాలో మాకు తెలుసు’
హైదరాబాద్: సంకీర్ణ రాజకీయాలు రాజ్యం ఏలే సమయం వచ్చిందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ శాసన మండలిలో ఈటల మాట్లాడుతూ.. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, ఓట్ల కోసం పెట్టింది కాదని వ్యాఖ్యానించారు. పార్టీలు పనిచేసి మెప్పించాలని, తాము మెప్పించాము కాబట్టే ప్రజలు మాకు అధికారం కట్టబెట్టారని అన్నారు. కొన్ని పత్రికలు, సోషల్ మీడియాకు మాత్రమే కాంగ్రెస్ వాళ్లు పరిమితమయ్యారని అన్నారు. కానీ తాము ప్రజల మనసులో ఉన్నామని చెప్పారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు.సీడబ్ల్యూసీ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి దేశంలో అతి తొందరగా పూర్తి చేస్తున్న ప్రాజెక్టు అని వారు కితాబు ఇచ్చారని గుర్తు చేశారు. తాము కొన్ని కులాల వారి మనసులో చోటు సంపాదించుకున్నామని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పథకం ద్వారా అయినా ప్రజల మనసు దోచుకున్నారా.. వారు చేయకుండా మమ్ముల్ని అడిగితే ఎలా అని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఎలా ఇయ్యాలో తమకు తెలుసునన్నారు. ఒక్కసారి రుణమాఫీ చేసే విషయంపై ఆర్బీఐని అడిగామని, మళ్లీ అడుగుతామని..ఆర్బీఐ అనుమతి ఇస్తే మొత్తం అంతా ఒక్కసారే రుణమాఫీ చేస్తామని, లేకపోతే 4 ఏండ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచే విషయంపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని వివరించారు. -
రైతు బడ్జెట్
సాక్షి వనపర్తి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ వ్యవసాయరంగానికి ప్రాధాన్యం కల్పించేలా ఉంది. ఈ బడ్జెట్‌ను లోతుగా పరిశీలిస్తే ఇటీవల ఎన్నికల్లో ఇచ్చిన హమీలను నెరవేర్చే ప్రయత్నం చేశారని స్పష్టమవుతోంది. మొత్తం బడ్జెట్ రూ.1,82,017 లక్షల కోట్లు కాగా ఇందులో ప్రగతి పద్దు రూ.లక్ష 7 వేల 302 కోట్లు, నిర్వహణ వ్యయం రూ.74,715 కోట్లుగా కేటాయించారు. ఇప్పటికే సంక్షేమ రంగంలో రాకెట్లా దూసుకెళ్తున్న తెలంగాణ మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేయనున్నడంతో దేశంలోని అన్ని రాష్ట్రాల దృష్టి తెలంగాణపై పడింది. మరింత ఆసరా... టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడానికి ఆసరా పింఛన్లే ప్రధాన కారణమనే విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల హమీల్లో భాగంగా సీఎం కేసీఆర్ పింఛన్ డబ్బులను రెట్టింపు చేశారు. వనపర్తి జిల్లాలో 28,521 మంది వృద్ధులు, 27,705 మంది వితంతువులు, 701 మంది చేనేత కార్మికులు, 460 గీత కార్మికులు, 1004 మంది బీడీ కార్మికులు, 2,604 మంది ఒంటరి మహిళలు ఉన్నారు. వీరికి నెలకు రూ. 1,000 చొప్పున పింఛన్ అందిస్తున్నారు. 11,329 మంది వికలాంగులకు నెలకు రూ.1500 చొప్పున అందిస్తున్నారు. ఏప్రిల్ నెల నుంచి రూ.1000 ఇస్తున్న వారికి రూ. 2016, రూ. 1500 తీసుకుంటున్న వికలాంగులకు నెలకు రూ.3016 ఇవ్వనున్నారు. జిల్లాలో ప్రస్తుతం ప్రతి నెల ఆసరా ఫించన్లకు ప్రభుత్వం రూ.8 కోట్ల 33 లక్షల 78 వేలను ఖర్చు చేస్తోంది. ఇకమీదట ఇది రెట్టింపు కానుంది. పెరిగిన ‘రైతుబంధు’ సాయం తెలంగాణ ప్రభుత్వం 2018 మే నెలలో ప్రారంభించిన రైతుబంధు పథకం కేంద్రంతో పాటు పలు రాష్ట్రాల ప్రభుత్వాలను విశేషంగా ఆకట్టుకుంది. దీనిని ఆదర్శంగా తీసుకునే కేంద్రంలోని మోదీ సర్కార్ ఎకరానికి రూ.6 వేల చొప్పున ఇస్తామని కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకాన్ని రూపకల్పన చేసింది. రైతుబంధు పథకంలో జిల్లాలో రెండో విడతలో 1,30,737 మంది రైతులకు గాను 1,07,528 మంది రైతులకు రూ.117 కోట్ల 51 లక్షల 66 వేలను ఎకరానికి రూ.4 వేల చొప్పున అందించారు. రెండు పంటలకు కలిపి రూ. 8 వేలు చెల్లించారు. ప్రస్తుతం బడ్జెట్లో దానిని రూ.10 వేలకు పెంచారు. దీనివల్ల రైతులకు అదనంగా ఎకరానికి రూ. 2 వేలు అందనున్నాయి. నిరుద్యోగ యువతకు భరోసా.. ఎన్నికల్లో ఇచ్చిన మరో ప్రధానమైన హమీ నిరుద్యోగ భృతి. ఈ పథకం వల్ల డిగ్రీ చదువుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఎంతో మేలు చేకూరనుంది. ఈ పథకం అమలుకోసం ప్రభుత్వం బడ్జెట్లో రూ.1,810 కోట్లు కేటాయించింది. ఈ పథకం అమలు కోసం విధి విధానాలను రూపకల్పన చేయాల్సిందిగా అధికారులను ఆదేశించింది. వ్యవసాయరంగానికి పెద్దపీట ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందనే చెప్పాలి. రైతులను ఆదుకునేందుకు మరోసారి రుణ మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. బడ్జెట్లో రుణమాఫీ పథకానికి రూ.6000 కోట్లు కేటాయించారు. వనపర్తి జిల్లాలో 3.87 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి 1.52 లక్షల మంది రైతులు ఉన్నారు. 2018 డిసెంబర్ 11వ తేదీ నాటికి బ్యాంకులో వ్యవసాయానికి తీసుకున్న లక్ష రూపాయల వరకు రుణ మాఫీ కానుంది. ఇప్పటికే రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ప్రభుత్వం పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు నడుం బిగించింది. జిల్లాలో ఇప్పటికే వనపర్తి మండలంలోని దత్తాయిపల్లిలో వేరుశనగ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను నెలకొల్పి మహిళలకు స్వయం ఉపాధి కల్పించడంతో పాటు, స్థానికంగా ఎక్కువగా ఉత్పత్తి అయ్యే వేరుశనగకు మంచి మార్కెటింగ్ కల్పించేందుకు కలెక్టర్ శ్వేతామహంతి కృషి చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇలాంటివి మరిన్ని పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ప్రాజెక్టులకు ప్రాధాన్యం
సాక్షి, గద్వాల: కరువు, వలస ప్రాంతంగా పేరుతెచ్చుకున్న ఉమ్మడి పాలమూరు జిల్లా రూపురేఖలు మారబోతున్నాయి. ఎత్తిపోతల పథకాలు, ప్రాజెక్టులు, చెరువు పనులకు గతంలో దివంగత మహానేత వైఎస్సార్, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యం కల్పించడంతో సాగునీటి కష్టాలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. కళ్లముందు నీరు పారుతుండటంతో రైతుల్లో సాగుపై ఆశలు రేకెత్తుతున్నాయి. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. సాగులో 7.5లక్షల ఎకరాలు.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో దాదాపు 10లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. గత బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించకపోవడంతో పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జూరాల, కల్వకుర్తి, రాజీవ్‌భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, సంగంబండ, ఆర్డీఎస్, తుమ్మిళ్ల ద్వారా దాదాపు ప్రస్తుతం 7.5లక్షల ఎకరాలకు సాగునీరు అందుంతుండగా భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం ఉంది. గతేడాది బడ్జెట్లో జిల్లాలోని ప్రాజెక్టులకు 4,223.6కోట్లు కేటాయించింది. ప్రస్తుతం పనులు అసంపూర్తిగా ఉన్న ఎత్తిపోతల ప్రాజెక్టుల పనుల పూర్తి కోసం మరో రూ.1300కోట్లు ఇస్తే గాని పనులు పూర్తికాని పరిస్థితి. రాష్ట్ర బడ్జెట్లో సాగునీటి రంగానికి 22,500కోట్లు కేటాయించారు. జిల్లా ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తారనే ఆశాభావం వ్యక్తమవుతోంది. కేఎల్‌ఐకి రూ.550కోట్లు.. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి ఇప్పుడిప్పుడే ఒక రూపం వస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 4.5లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 25 టీఎంసీల నీటిని వినియోగించుకుని నాలుగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల ద్వారా నిర్ధేశిత ఆయకట్టుకు నీరు ఇవ్వాల్సి ఉంది. గత బడ్జెట్లో ఈ పథకానికి రూ.500 కోట్లు కేటాయిస్తే రూ.260.33కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ బడ్జెట్లో రూ.550కోట్లు అవసరమని సాగునీటిశాఖాధికారులు ప్రతిపాదనలు పంపారు. పూర్తిస్థాయిలో కేటాయిస్తేనే పనులు పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. జూరాలకు రూ.50కోట్లు... ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులకు కేంద్రబిందువుగా ఉన్న జూరాల ప్రాజెక్టు కోసం ఈ బడ్జెట్లో రూ.50కోట్లు అవసరమని నీటిపారుదల శాఖాధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 1.07లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.1,650కోట్లు ఖర్చు చేశారు. జూరాల ద్వారా సాగుకు నీటి విడుదల ప్రారంభమై 19ఏళ్లు గడిచినా చివరి ఆయకట్టుకు నీరు అందని పరిస్థితి ఉంది. ఇంకాలైనింగ్ పనులు, ఫీల్డ్ చాన్స్ పూర్తి చేయాల్సి ఉంది. రిజర్వాయర్లు నిర్మిస్తేనే తుమ్మిళ్లకు ప్రయోజనం.. ఆర్డీఎస్ ఆధునీకరణ పనుల్లో ఎదురవుతున్న అడ్డంకులను అదిగమించి ఆర్డీఎస్ చివరి ఆయకట్టు రైతులకు 55వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రాజోళి మండలం తుమ్మిళ్ల వద్ద తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. ఈ పనులు తొలివిడత పూర్తయ్యాయి. మొదటి లిఫ్ట్ ద్వారా సాగునీటిని కూడా విడుదల చేశారు. కానీ రెండో విడతలో చేపట్టాల్సిన రిజర్వాయర్లు పూర్తయితేనే ప్రయోజనం ఉంటుంది. గత బడ్జెట్లో ఆర్డీఎస్కు రూ.144.50కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్లో రూ.50కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారు. నెట్టెంపాడుకు రూ.160కోట్లు నడిగడ్డకు అత్యంత కీలకమైన నెట్టెంపాడు ప్రాజెక్టుకు ఈ సారి బడ్జెట్లో రూ.160కోట్లు అవసర మని అధికారులు ప్రదిపాదనలు పంపారు. ఈ ప్రాజెక్టు కింద ఏడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల ద్వారా 20 టీఎంసీల నీటిని ఉపయోగించుకొని మొత్తం 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ధేశించారు. పనులు ఇంకా కొనసాగుతున్నాయి. భూ సేకరణ కూడా పూర్తికాలేదు. గత బడ్జెట్లో నెట్టెంపాడుకు రూ.200కోట్లు కేటాయిస్తే రూ.45.92కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. బిల్లులు సకాలంలో రాకపోవడం వల్ల కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదు. ఈ సారి బడ్జెట్లో నైనా పూర్తిస్థాయిలో నిధులు కేటాయిస్తేనే పూర్తిస్థాయి ఆయకట్టు సాధ్యమవుతుంది. కోయిల్‌సాగర్‌కు రూ.43కోట్లు జిల్లాల పునర్విభజన తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాకు మిగిలిన ఏకైక ప్రాజెక్టు కోయిల్‌సాగర్. ఈ ప్రాజెక్టు ద్వారా 50వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ప్రభుత్వ లక్ష్యం. అయితే పనులు పెం డింగ్‌లో ఉన్న కారణంగా పూర్తిస్థాయి ఆయకట్టు అందుబాటులోకి రాలేదు. జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టులోకి నీటి పంపింగ్‌ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.500కోట్ల వరకు ఖర్చు చేశారు. గతేడాది రూ.120కోట్లు బడ్జెట్లో కేటాయిస్తే కేవలం రూ.16.80కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈసారి రూ.43కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారు. రాజీవ్‌భీమా ఎత్తిపోతలు.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు రాజీవ్‌భీమా ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు కింద మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాలకు సాగునీరు అందిచేందుకు ఐదే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణంతో 20 టీఎంసీల నీటిని కేటాయించారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు రూ.2,335కోట్లు ఖర్చు చేశారు. గతేడాది రూ.170 కోట్లు కేటాయిస్తే రూ.87.48కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ బడ్జెట్లో రూ.130కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారు. అదేవిధంగా భీమా పరిధిలోకి వచ్చే సంగంబండకు రూ.14కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రాజెక్టుకు గత బడ్జెట్లో రూ.9కోట్లు కేటాయించారు. ఈసారి ప్రాజెక్టుల వారీగా బడ్జెట్ వివరాలు తెలియాల్సి ఉంది. నెమ్మదిగా పాలమూరు–రంగారెడ్డి పనులు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రజలకు ఎన్నో ఆశలు ఉ న్నాయి. ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకు అత్యం త ప్రాధాన్యం ఇస్తోంది. అన్ని అనుమతులు కూడా పూర్తయ్యాయని ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ సమావేశాల్లో వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో దాదాపు 7లక్షల ఎకరాలకు సాగునీరు అందజేయాలని ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులను 18ప్యాకేజీలుగా విభజించివ పనులు చేపట్టారు. ప్రధానంగా 1 నుంచి 15 ప్యాకేజీల వరకు పనులు జరుగుతున్నాయి. ఉందండాపూర్ రిజర్వాయర్‌కు సంబంధించి భూ సేకరణ పూర్తి కాకపోవడంతో ప్యాకేజీ 16,17,18 పనులకు అడ్డంకిగా మారింది. గత బడ్జెట్లో ఈ పథకానికి రూ.3,035కోట్లను కేటా యించారు. కాని నిధులు 20శాతం నిధులు కూ డా విడదల చేయకపోవడం వల్ల పనులు వేగం గా జరగలేదు. ఈ బడ్జెట్లోనైనా ప్రాధాన్యం ఉంటుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. మొ త్తంగా సాగునీటి రంగానికి భారీగా రూ.22,500 కోట్లు కేటాయించడం విశేషం. -
సాగుకు పట్టం
సాక్షి, వికారాబాద్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలను సంతృప్తి పరిచే బడ్జెట్‌ను శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. శాసనసభలోగానీ, లోక్‌సభలోగానీ ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టాలి. అయితే ఈ శాఖ తనవద్దే ఉండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి సీఎంలుగా ఉమ్మడి రాష్ట్రంలో కాసు బ్రహ్మానందరెడ్డి, రోశయ్య మాత్రమే బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ మొదటిసారి సీఎం హోదాలో బడ్జెట్ వివరాలు చదివి వినిపించారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పలు బహిరంగ వేదికలపై ఇచ్చిన హామీలు, పార్టీ మేనిఫెస్టోలోని అంశాలను నెరవేర్చే దిశగా బడ్జెట్‌ను రూపొందించారు. తద్వారా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించేలా అన్ని వర్గాలను ఆకర్శించేందుకు ప్రయత్నించారు. రైతు రుణమాఫీ... గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నదాతలు ఎదురుచూస్తున్న రైతురుణ మాఫీపై ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్లో స్పష్టత నిచ్చారు. ఏతేదీవరకు కటాఫ్ డేట్‌గా నిర్ణయించి రుణమాఫీ చేస్తారనే విషయంలో సందేహాలను నివృత్తి చేస్తూ బడ్జెట్లో రుణమాఫీ కోసం రూ.6 వేల కోట్లు కేటాయించారు. జిల్లాలో 2,25,215 మంది రైతులుండగా, వీరిలో 1,82,600 మంది పలు బ్యాంకులలో పంట రుణాలు తీసుకున్నారు. వీరికి గాను లక్ష రూపాయలలోపు రుణాన్ని మాఫీ చేయనున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి 2018, డిసెంబరు 11వతేదీ ఎన్నికల ఫలితాల నాటికి రైతులు తీసుకున్న లక్షలోపు రుణాన్ని మాఫీ చేస్తామని ప్రకటించారు. దీంతో లోన్ కటాఫ్ డేట్‌పై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్రాప్‌కాలనీలు... రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నెలకొని ఉన్న వ్యవసాయానుకూల వాతావరణ, పర్యావరణ పరిస్థితులను పరిగణనలోనికి తీసుకొని ఆయా జిల్లాల్లో ఉండే నేల స్వభావాన్ని కూడా అంచనా వేసి దిగుబడులను పెంచడంతో పాటుగా గిట్టుబాటు ధర కల్పించడానికి పంట కాలనీల ఏర్పాటునకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఆయా జిల్లాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా పంటలు పండించే విధానమే ఈ కాలనీల ప్రధాన ఉద్దేశం. దీంతో రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కోసం రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగాబడ్జెట్లో వ్యవసాయానికి రూ.20,107 కోట్లను ప్రతిపాదించారు. వికారాబాద్ జిల్లాలోని నాలుగు సెగ్మెంట్లలో సుమారుగా 213 క్రాప్ కాలనీలను ఉద్యాన, వ్యవసాయాధికారులు ప్రతిపాదించారు. మిషన్ కాకతీయ... చెరువుల పునరుద్ధరణే ప్రధాన ధ్యేయంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకానికి బడ్జెట్లో పెద్దపీట వేశారు. 2019– 20 బడ్జెట్లో ఈ పథకానికి నీటిపారుదల శాఖకు రూ.22,500 కోట్లు వెచ్చించారు. జిల్లాలో ఈ పథకం ద్వారా ఇప్పటివరకు నాలుగు విడతల్లో 733 చెరువులను రూ.234.78 కోట్లతో అభివృద్ది చేశారు. వీటి వలన జిల్లాలోని పలు ప్రాంతాల్లో 65,724 ఎకరాలకు సాగునీరు అందుతోంది. కాగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 78 చెరువులు, కుంటల అభివృద్ధికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేయనున్నారు. ఇంటింటికీ మిషన్ భగీరథ... జిల్లాలోని 971 ఆవాసాల్లోని ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ పథకానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.1,187 కోట్లను మంజూరు చేసింది. దీంతో జిల్లాలో సుమారుగా 90శాతం పనులు పూర్తయ్యాయి. 80శాతం గ్రామాలకు ఈ నీటినే వినియోగిస్తున్నారు. మిగిలిన పనులను వచ్చేనెలాఖరులోగా పూర్తిచేసి ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా రక్షిత మంచినీటిని అందించాలని ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంది. మత్స్యకార కుటుంబాలకు చేయూత... గంగపుత్ర, ముదిరాజ్ కులాలవారితో పాటుగా బోయ, బెస్త కులస్తులకు చేపలు పట్టడమే ప్రధాన వృత్తి. ఆదాయ వనరు కూడా. ఐఎఫ్‌డీఎస్ పథకం కింద జిల్లాలోని మత్స్యకారులకు ఈ సంవత్సరం రూ.8 కోట్ల విలువచేసే 374 బైకులు, 33 ఆటోలు, 1 హైజెనిక్ ట్రాన్స్‌పోర్టు వెహికిల్, 17 మొబైల్ ఔట్లెట్స్ 75 శాతం సబ్సిడీతో లబ్ధిదారులకు అందించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో మత్స్యకారుల అభివృద్ధికి, ఉచిత చేపపిల్లల పంపిణీకి గాను ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది. ఈఎన్టీ, దంత పరీక్షలు... గత సంవత్సరం ప్రవేశపెట్టిన కంటివెలుగు తరహాలోనే చెవి, ముక్కు, గొంతు, దంత సంబంధమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక శిబిరాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో వైద్య ఆరోగ్యశాఖకు రూ.5,536 కోట్లను ప్రతిపాదించింది. జిల్లాలో ఇప్పటివరకు కంటివెలుగు కింద 3.27లక్షల మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి 52వేల మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. 2,208 మందిని శస్త్రచికిత్సలకు సిఫారసు చేశారు. పంచాయతీలకు నిధుల వరద... గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు విదిల్చింది. ఒక్కో మనిషికి ఫైనాన్స్ కమిషన్ నిధులు రూ.1,606 విడుదల అవుతాయి. దీంతో 500 జనాభా కలిగిన ప్రతి గ్రామానికి సుమారుగా రూ.8 లక్షల నిధులు అందనున్నాయి. నిరుద్యోగ భృతి.. గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు యువతను ముఖ్యంగా నిరుద్యోగులకు ఆకర్శించడంలో భాగంగా ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకున్నారు. ప్రతినెలా ఈ భృతి కింద రూ.3,016 ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పథకం అమలుకు గాను విదివిధానాలను రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించిన ప్రభుత్వం ఇందుకుగాను బడ్జెట్లో రూ. 1,810 కోట్ల రూపాయలను ప్రతిపాదించింది. కాగా పథకానికి అర్హత విషయంలో ప్రభుత్వం నియమ నిబంధనలు విడుదల చేస్తేగాని ఎంతమంది అర్హులవుతారో తేలుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఆరు కిలోల బియ్యం... జిల్లాలో 588 చౌకధరల దుకాణాలున్నాయి. వీటి ద్వారా 2.33 లక్షల కుటుంబాలకు ప్రతినెలా 5,342 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. ఇందుకు అవసరమైన సబ్సిడీ కోసం ఈ బడ్జెట్లో రూ.2,744 కోట్లు ప్రతిపాదించారు. ప్రతినెల దాదాపుగా జిల్లాలోని విద్యాసంస్థలు, సంక్షేమ హాస్టళ్లకు నెలకు 450 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందజేస్తున్నారు. ఎకరాకు రూ.10 వేలు గత సంవత్సరం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథక సహాయాన్ని బడ్జెట్లో పెంచారు. ఏటా ఖరీఫ్, రబీలో ఎకరానికి రూ.4వేలు ఉన్న పెట్టుబడి సాయాన్ని సీజన్‌కు రూ.5 వేలకు పెంచారు. దీంతో ప్రతీ రైతుకు ఎకరానికి రూ.10 వేలు అందనున్నాయి. ఇందుకుగాను బడ్జెట్లో రూ.12 వేల కోట్లు ప్రతిపాదించారు. ఈ పథకం కింద గతేడాది జిల్లాలోని 2,25,215 మంది రైతులకు రూ.244 కోట్లు అందించారు. పెరగనున్న ఆసరా పెన్షన్లు.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు,బీడీ కార్మికులు, బోదకాలు బాధితులు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇచ్చేనెలసరి పెన్షన్ రూ.1000 నుంచి రూ.2016 పెంచారు. దివ్యాంగుల పెన్షన్‌ను రూ.1,500 నుంచి రూ.3,016కు పెంచారు. వృద్ధాప్య కనీస పెన్షన్ అర్హత వయసును 65 నుంచి 57సంవత్సరాలకు తగ్గించారు. వచ్చే ఏప్రిల్ నుంచి లబ్ధిదారులకు ఈ మొత్తాన్ని అందజేస్తారు. ఆసరా పెన్షన్లకోసం బడ్జెట్లో రూ.12,067 కోట్లకు ప్రతిపాదించారు. జిల్లాలో మొత్తం ఆసరా పెన్షన్లు 1,05,516 ఉన్నాయి. వీటిలో వృద్ధాప్య పింఛన్లు 37,057, వితంతు పెన్షన్లు 49, 521, వికలాంగులు 13,039, కల్లుగీత కార్మికులు 474, వీవర్స్ 169, ఒంటరి మహిళలు 4,715,బీడీ కార్మికులు 41 మంది ఉన్నారు. వీరికి ఏప్రిల్ 1వతేదీనుంచి పెంచిన పెన్షన్లు అమలు కానున్నాయి. కల్యాణలక్ష్మికి మోక్షం.. పేద ఆడపిల్లల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదని, కొంతైనా ఆర్థిక సహకారం అందించాలని ప్రవేశపెట్టిన పథకమే కల్యాణలక్ష్మి, షాదీముబారక్. ఈ పథకం కింద మొదట్లో రూ.75,116 ఇవ్వగా, ప్రస్తుతం దీనిని రూ.1,00,116 కు పెంచారు. జిల్లాలో ఇప్పటివరకు 3,108 దరఖాస్తులు వచ్చాయి. నిధుల కొరతతో వీటిలో కేవలం 253 మంది లబ్ధిదారులకే మంజూరుచేయడం జరిగింది. దీంతో ఈ పథకం అమలుకు గాను బడ్జెట్లో 1,450 కోట్లు ప్రతిపాదించారు. -
శ్రీధర్ బాబు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు..
సాక్షి, హైదరాబాద్ : బడ్జెట్లో గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులు కేటాయించలేదనంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రెండోరోజు శాసనసభ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థలను అద్భుతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. పంచాయతీల నుంచి ఎలాంటి నిధులు తీసుకోలేదని, వాటి పటిష్టత కోసం కొత్త చట్టం తెచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. పంచాయతీరాజ్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పాలనపై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందని వ్యాఖ్యానించారు. జగిత్యాల మున్సిపాలిటీకి రూ.2కోట్ల బకాయిలు గత కాంగ్రెస్ ప్రభుత్వానిదేని అన్నారు. గ్రామ పంచాయతీలకు ఆర్థిక సమస్యలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పంచాయతీలకు తగిన నిధులు ఇవ్వలేదని అన్నారు. వడ్డీ మాఫీ విషయంలోనూ రైతులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతుబంధు పధకంతో పాటు రైతులను ఆదుకోవాలని, అలాగే ఐఆర్ కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని శ్రీధర్ బాబు సభలో ప్రస్తావించారు. మరోవైపు పంచాయతీ రాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఇవాళ సభలో పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. -
ప్రజా బడ్జెట్
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో జిల్లాకు ప్రత్యక్షంగా కేటాయింపులు లేకపోయినా, పరోక్షంగా సంక్షేమ పథకాల రూపంలో జిల్లా వాసులకు లబ్ధి చేకూరనుంది. వ్యవసాయానికి పెద్దపీట వేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నిధు ల కేటాయింపుతో ఆయా వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నా యి. నిరుద్యోగ భృతిపై స్పష్టమైన విధివిధానాలు ప్రకటించకపోవడంతో ఆయా వర్గాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. సాక్షి, వరంగల్ రూరల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం 2019–20 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో వ్యవసాయం, సంక్షేమంతోపాటు కుల వృత్తులు, ఇతర రంగాలకు సమతూకంగా ప్రాధాన్యం ఇచ్చింది. వరంగల్ రూరల్ వ్యవసాయాధరిత జిల్లా. అర్బన్ జిల్లాలో గ్రేటర్ పరిధి కాకుండా మిగతా మండలాల్లో సైతం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు. రాష్ట్ర బడ్జెట్లో రైతు బంధు సాయం పెంపు, రైతు బీమాతో అత్యధిక శాతం రైతులు ప్రయోజనం పొందనున్నారు. రూరల్ జిల్లాలో 3,00,675 ఎకరాల భూమి ఉండగా 1,50,198 మంది అన్నదాతలు రైతు బంధు సాయం పొందుతున్నారు. రైతు బీమా పథకానికి 98,490 మంది అర్హులున్నారు. అర్బన్ జిల్లాలో 1,58,950 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా రైతు బంధు సాయం 68,728 మంది పొందుతున్నారు. రైతు బీమా అర్హులు 45,284 మంది ఉన్నారు. పెరిగిన రైతు బంధు సాయం.. గత ఏడాది రైతు బంధు పథకం కింద ఏడాదిలో రెండు పంటలకు కలిపి ఎకరానికి రూ.8వేలు ఇచ్చారు, వచ్చే ఖరీఫ్ నుంచి ఆ మొత్తం రూ.10వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రూరల్ జిల్లాలో 1,50,198 మంది, వరంగల్ అర్బన్‌లో 68,728 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. రైతు బీమా కింద రూరల్ జిల్లాలో 98,490 మంది, అర్బన్ జిల్లాలో 45,284 మంది రైతులు బీమా పట్టాలను అందుకున్నారు. 2018 డిసెంబర్ 11 వరకు రైతు తీసుకున్న రూ.లక్ష వరకు బ్యాంకు రుణాలను మాఫీ చేయనున్నారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి చెందనున్న గ్రామాలు బడ్జెట్లో గ్రామీణ అభివృద్ధికి అధిక నిధులు కేటాయించారు. ప్రతి గ్రామ అభివృద్ధికి ఎడాదికి రూ.8లక్షలు కేటాయించానున్నారు. వరంగల్ రూరల్ జిల్లాలో 401 గ్రామ పంచాయతీలు, అర్బన్ జిల్లాలో 130 గ్రామ పంచాయతీలున్నాయి. గ్రామ పంచాయతీలకు ఉన్న సొంత ఆదాయ వనరులు, ఫైనాన్స్ కమిషన్, నేరుగా వచ్చే నిధులు కలిపి రాబోయే ఐదేళ్లల్లో గ్రామాల అభివృద్ధికి వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పల్లెలు మరింత అభివృద్ధిలోకి రానున్నాయి. మరింత ‘ఆసరా’ వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులు, చేనేత, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే నెలసరి ఆసరా పథకం కింద చెల్లించే పింఛన్ మొత్తాన్ని రూ.1000 నుంచి రూ.2016 కు పెంచుతున్నారు. అలాగే దివ్యాంగుల పింఛన్ రూ.1500 నుంచి రూ.3,016లకు పెంచనున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులు, చేనేత, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు మొత్తం 77,188 మంది, రూరల్‌లో 83,686, దివ్యాంగులు అర్బన్‌లో 11,484 మంది, రూరల్‌లో 13,525 మంది ఉన్నారు. అలాగే వృద్ధుల పింఛన్ అర్హతను 57 సంవత్సరాలకు కుదించడంతో మరింత మందికి ‘ఆసరా’ లభించనుంది. నిరుద్యోగులకు భృతి.. నిరుద్యోగులకు భృతి కల్పించనున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో 65,709 మంది, రూరల్‌లో 24,520 మంది నిరుద్యోగులు ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో నమోదు చేసుకున్నారు. అర్బన్‌లో డిగ్రీ ఉత్తీర్ణులు అయిన వారు 8,928, రూరల్‌లో 1,751 మంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలను ప్రకటించిన తరువాత అర్హులను ఎంపిక చేసి నిరుద్యోగ భృతి కింద ఒక్కొక్కరికి రూ.3016 అందించనున్నారు. అన్ని వర్గాలకు అనుకూలం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అన్ని వర్గాలకు అనుకూలంగా ఉంది. ప్రజల ఆశలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించారు. బంగారు తెలంగాణ ఆశయ సాధన దిశగా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ముఖ్యంగా వ్యవసాయ రంగం, భారీ నీటి పారుదల శాఖకు భారీ కేటాయింపులతో ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చినట్లైంది. అలాగే చిన్న, మధ్య తరగతి రైతుల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. టీఎస్ఐపాస్ ద్వారా రూ.1.41 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం హర్షనీయం. దీని ద్వారా 8.58 లక్షల ఉద్యోగాల కల్పన అవకాశం లభించడం అభినందించ దగిన విషయం. నూతన కంపెనీలను స్థాపించేందుకు సులువుగా టీఎస్ఐపాస్ను ఏర్పాటు చేసి విజవంతం చేయడం ఆదర్శనీయం. – టి.రాఘవరెడ్డి, చార్టర్డ్ ఎకౌంటెంట్ అన్నదాతకు వెన్నుదన్ను.. బడ్జెట్ రైతులకు రుణమాఫీ ఇతర పథకాలతో ఎంత మేలుజరగనుంది. ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంక్షేమ ఫలితాలు అందజేసేలా కేటాయింపులు జరిగాయి. పదివేల జనాభాకు ఒక ఆస్పతిని నెలకొల్పుతారు. యువతకు నిరుద్యోగ భృతి కల్పించడం కూడా యువతకు ఎంతో ఉపయోగకరం. – సురేష్‌లాల్, కేయూ ఎకనామిక్స్ ప్రొఫెసర్ రైతులను మభ్యపెట్టిన కేసీఆర్ నర్సంపేట: ఆరుకాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించకుండా మాయమాటలతో కేసీఆర్ రైతులను మభ్యపెడుతున్నారనడానికి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూస్తే అర్థమవుతుంది. ఓట్ అనే అకౌంట్ బడ్జెట్ రైతులకు ఎంతమాత్రం ప్రయోజనం కాదు. రైతులకు విత్తనాలు, ఎరువులు, సబ్సిడీపై ఇచ్చే విధంగా చర్యలకు దోహదం పడే విధంగా ఉండాలి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను గుర్తించి ఎక్స్‌గ్రేషియా చెల్లించే విధంగా బడ్జెట్లో పొందుపర్చకపోవడం బాధాకరం. –పెద్దారపు రమేష్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి విద్యపై చిన్నచూపు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వ విద్యకు చిన్నచూపుచూశారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో 6.72శాతం మాత్రమే కేటాయించారు.గత ఏడాది బడ్జెట్ కంటే ఒక శాతం తక్కువగా కేటాయించటం గమనార్హం. కోఠారి సూచనలకు అనుగుణంగా బడ్జెట్లో 30 శాతం నిధులు కెటాయించాలనే డిమాండ్‌ను పట్టించుకోవడం లేదు.నిరుద్యోగ భృతి అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ సరపడా నిధులు కేటాయించలేదు. టీపీటీఎఫ్ జిల్లా మాజీ జనరల్ సెక్రటరీ భీమళ్ల సారయ్య అన్ని వర్గాలకు పెద్ద పీట బడ్జెట్లో అన్ని వర్గాలకు పెద్ద పీట వేశారు. ఇరిగేషన్, వెల్ఫేర్ కోసమే లక్షల కోట్లు దాటుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేలా తయారు చేశారు. రైతు బంధుకు రూ.2వేల పెంపు, రుణ మాఫీ రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. గ్రామాల అభివృద్ధికి అధిక ని«ధులు రానున్నాయి. – పెద్ది సుదర్శన్ రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే రైతన్నకు భరోసా.. అన్ని వర్గాలకు అనుకులమైన ప్రజా బడ్జెట్ ఇది. రైతన్నలకు మరింత భరోసా ఇచ్చారు. ఒక్కో గ్రామానికి రూ.8లక్షలు కేటాయించడంతో మరింత అభివృద్ధి చెందనున్నాయి. పింఛన్ మొత్తం పెంచడంతో వృద్ధులు, వికలాంగులు, వృత్తిదారులు, దివ్యాంగులు తదితరులకు మరింత ‘ఆసరా’ లభించనుంది. – అరూరి రమేశ్, వర్ధన్నపేట ఎమ్మెల్యే సంక్షేమ బడ్జెట్ అన్ని రంగాల సంక్షేమమే ధ్యేయంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఉంది. ముఖ్యంగా రైతులకు పెట్టుబడి సాయం పెంపు, రుణమాఫీ, రైతు బీమా లాంటి పథకాలకు అధిక నిధులు కేటాయించడంతో అన్నదాతలకు ఎంతో మేలు జరుగుతుంది. ఆసరా పింఛన్ల పెంపుతో వారిలో ఆత్మస్థైరాన్ని నింపారు. కళ్యాణలక్ష్మి, షాదిముబాకర్ కేటాయింపులు హర్షనీయం, నీటి పారుదలకు చేసిన భారీ కేటాయింపులతో ప్రాజెక్టులు శరవేగంగా పూర్తవుతాయి. నిరుద్యోగ భృతి, అత్యంత వెనుకబడిన కులాలకు వెయ్యి కోట్లు కేటాయించడం సమర్థనీయం. ఆరోగ్య రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మొత్తంగా ఈ బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధికి ఊతం ఇచ్చేలా ఉంది. ఉద్యోగ కల్పన కోసం పథకాల రచన ఉత్తమంగా భావించవచ్చు. – పీవీ.నారాయణరావు, సీఏ, ఐసీఏఐ, వరంగల్ బ్రాంచి మాజీ చైర్మన్ -
సంక్షేమ సాగు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: సీఎం కేసీఆర్ శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో జిల్లాలో ఎంతో మందికి లబ్ధి చేకూరనుంది. ప్రధానంగా సాగు, సంక్షేమ రంగాలకు పెద్దపీట వేయడంతో జిల్లా రైతులు, ఇతర పథకాల లబ్ధిదారులకు ఎంతో మేలు కలగనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.లక్ష లోపు రుణమాఫీ, ‘ఆసరా’ రెట్టింపు, పింఛన్ల అర్హత వయో పరిమితి కుదించడం, నిరుద్యోగ భృతి తదితరాలతో జిల్లాలోని ఆయా వర్గాలకు ప్రయోజనం చేకూరనుంది. ఓటాన్ బడ్జెట్లో సంక్షేమ రంగాలకు అత్యధిక ప్రాధాన్యతమివ్వడంతో లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ‘ఆసరా’ రెట్టింపు.. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్వయంగా ప్రవేశ పెట్టిన రూ.1.82 లక్షల కోట్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో సంక్షేమ రంగానికి పెద్ద పీట వేశారు. ముఖ్యంగా ఆసరా పింఛన్ల కోసం రూ.12,067 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద జిల్లాలో ప్రస్తుతం 2.66 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. వృద్ధాప్య, బీడీ కార్మికులు, వికలాంగులు, వితంతు, ఒంటరి మహిళ, గీత, చేనేత కార్మికులు, ఎయిడ్స్, పైలేరియా వ్యాధి గ్రస్తులు, అభయహస్తం ఇలా అన్ని రకాల పింఛ న్లు కలిపి ప్రతినెలా రూ.27.44 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తోంది. ప్రస్తుతం వికలాంగులకు నెలకు రూ.1,500, మిగతా వారికి నెలకు రూ.వెయ్యి చొప్పున పింఛన్ అందుతోంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ఆసరా పింఛన్లను రూ.వెయ్యి నుంచి రూ.2,016కు, వికలాంగలు పెన్షన్లను రూ.3,016కు పెంచుతామని హామీనిచ్చింది. ఆ హామీ మేరకు పింఛన్ల మొత్తాన్ని పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వికలాంగులకు రూ. 3,016, మిగతా పింఛన్లు, జీవనభృతి మొత్తాన్ని రూ. 2,016 చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. వయస్సు కుదింపుతో మరింత లబ్ధి ఎన్నికల హామీ మేరకు వృద్ధాప్య పింఛన్ల అర్హతను 65 నుంచి 57 సంవత్సరాలకు తగ్గించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో జిల్లాలో పింఛన్ లబ్ధిదారుల సంఖ్య మరింత పెరగనుంది. అలాగే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాల అమలు కోసం రూ.1,450 కోట్లు కేటాయించారు. కల్యాణలక్ష్మి పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 5,674 మంది లబ్ధిదారులకు రూ.56.80 కోట్ల లబ్ధి కలిగింది. షాదీముబారక్ కింద 2,215 మందికి గాను రూ.22.17 కోట్లు పంపిణీ చేశారు. రానున్న రోజుల్లో మరింత మందికి లబ్ధి కలగనుంది. షెడ్యూల్డ్ కులాల ప్రగతి నిధి పేరుతో ప్రభు త్వం రూ.16 వేల కోట్లు, మైనారిటీ సంక్షేమం కోసం రూ.2004 కోట్ల నిధులు కేటాయించడంపై ఆయా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. రైతులకు భరోసా.. నిజామాబాద్ అంటేనే వ్యవసాయ జిల్లాగా పేరుంది. ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ.20,107 కోట్లు కేటాయించారు. దీంతో జిల్లా రైతాంగానికి భరోసా లభిస్తోంది. రైతుబంధు పథకం కింద జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 2.25 లక్షల రైతులకు ఎకరానికి రూ.4 వేల చొప్పున రూ.181.39 కోట్ల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. అలాగే, రైతుబీమా కింద 227 మంది రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.11.35 లక్షలను వారి ఖాతాల్లో జమ చేశారు. ఈసారి ఈ రెండు పథకాలకు కూడా నిధులు కేటాయించడంతో రైతుల్లో భరోసా పెరుగుతోంది. రుణమాఫీపై హర్షం.. రూ.లక్ష లోపు పంట రుణాలు మాఫీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి ప్రకటనతో జిల్లాలో సుమారు నాలుగు లక్షల మందికి లబ్ధి చేకూరే అవకాశముంది. గతంలో ఉమ్మడి జిల్లాలో 3.62లక్షల మందికి రుణమాఫీ వర్తించింది. నాలుగు విడతల్లో కలిపి రూ.1,790 కోట్లు మాఫీ అయ్యాయి. ఈసారి రుణ మాఫీ అర్హత పొందే రైతుల సంఖ్య ఉమ్మడి జిల్లాలో 4.20 లక్షల మంది వరకు ఉంటారని అధికారులు పేర్కొంటున్నారు. అయితే, ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాల తర్వాతే లబ్ధిదారుల సంఖ్య తేలనుంది. మరోవైపు, బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్య, వైద్య రంగాలకు స్వల్పంగానే నిధులు కేటాయించారని విద్యావేత్తలు, ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. ఇది వ్యవసాయ కేంద్రీకృత బడ్జెట్ అని, అన్ని రంగాలకు సమ స్థాయిలో కేటాయింపులు దక్కలేదని పేర్కొంటున్నారు. వ్యవసాయ కేంద్రీకృత బడ్జెట్ తెయూ(డిచ్పల్లి): సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వ్యవసాయ కేంద్రీకృత బడ్జెట్ అన్న రీతిలో ఉంది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు అగ్రస్థానాన్ని కేటాయించారు. నీటిపారుదల శాఖ, మిషన్ కాకతీయకు రూ.45 వేల కోట్లు కేటాయించడం హర్షణీయం. రైతుబంధు, రైతుబీమా, రైతులకు రూ.లక్ష లోపు రుణమాఫీ, పంటల కాలనీల అభివృద్ధికి అత్యధిక నిధులు కేటాయించారు. అయితే, నిరుద్యోగ భృతికి కేటాయించిన రూ.1800 కోట్లు ఏమాత్రం సరిపోవు. బడ్జెట్లో విద్య,వైద్య రంగాలకు నిధుల కేటాయింపులో వివక్ష కనిపిస్తోంది. ఉన్నత విద్యకు ఎక్కువ నిధులిస్తే బాగుండేది. – రవీందర్‌రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, తెయూ -
ఊరటనిస్తున్న.. బడ్జెట్
సాక్షిప్రతినిధి, నల్లగొండ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లా ప్రజానీకానికి ఊరటనిస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రాజెక్టుల వారీగా కేటాయింపుల స్పష్టత లేకున్నా.. మిగిలిన అంశాలపై హర్షం వ్యక్తం అవుతోంది. రైతుల వ్యవసాయ పెట్టుబడుల కష్టాలను తీర్చేందుకు ఉద్దేశించిన రైతుబంధు పథకానికి బడ్జెట్ కేటాయింపులు పెరిగాయి. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి ఎకరాకు అందిస్తున్న రూ.8వేల మొత్తాన్ని రూ.10వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు కేటాయింపులు కూడా చేసింది. జిల్లా విషయానికి వస్తే, రైతు బంధు ద్వారా ఇప్పటికే లబ్ధిపొందిన అన్నదాతలు 4,14,356 మంది ఉన్నారు. ఖరీఫ్, రబీ సీజన్లలో వారికి రూ.8వేలు అందగా, వచ్చే ఖరీఫ్ నుంచి రూ.10వేలు అందనున్నాయి. దీనివల్ల ఒకే ఏడాది జిల్లాలో 414కోట్ల 35లక్షల 60వేల రూపాయల మేర రైతుల ఖాతాలకు చేరనుంది. మరోవైపు రైతుల పేర బ్యాంకుల్లో ఉన్న పంట రుణాలను ప్రతి రైతుకు రూ.లక్ష చొప్పున మాఫీ కానుంది. నల్లగొండ జిల్లాలో 2014లో అప్పటి ప్రభుత్వం చేసిన రుణమాఫీ పథకంలో 2,63,309 మంది రైతులు లబ్ధిపొందారు. రూ.1328.88కోట్ల రుణమాఫీ జరిగింది. కాగా, ఈ సారి ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.రుణమాఫీకి సంబంధించి ఇంకా ఎలాంటి విధివిధానాల రూపకల్పన జరగని కారణంగా ఎంత మొత్తం రుణమాఫీ అవుతుందో అధికారులు ఇదమిద్దంగా చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం వివిధ బ్యాంకుల్లో రైతుల రుణాల రూపంలో రమారమి రూ.4వందల కోట్ల బకాయిలు ఉన్నట్లు సమాచారం. అయితే, ఇందులో రూ.లక్ష నుంచి రూ.5లక్షల దాకా రుణాలు పొందిన రైతులు ఉన్నారని అంటున్నారు. మరో వైపు ఈ ఆర్థిక సంవత్సరం నుంచి నిరుద్యోగ యువతకు భృతి అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి సంబంధించి కూడా ఇంకా విధివిధానాలు రూపొందలేని అంటున్నారు. అదేమాదిరిగా, జిల్లాలో ఎందరు నిరుద్యోగ యువత ఉన్నారు? నిరుద్యోగ యువతగా ఎవరిని భావిస్తారు? నిరుద్యోగ భృతి పొందడానికి కావాల్సిన అర్హతలు ఏమిటి .. అన్న విషయాల్లో స్పష్టత రావాల్సి ఉందని పేర్కొంటున్నారు. అనూహ్యంగా పెరుగుతున్న పెన్షన్ల మొత్తం మరో వైపు వివిధ రకాల పెన్షన్లు అందించడం ద్వారా ప్రభుత్వం నిస్సాహయులకు అండగా నిలుస్తోంది. జిల్లాలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, చేనేత, గీత కార్మికులతో పాటు దివ్యాంగులకు పెన్షన్లు అందిస్తోంది. జిల్లా వ్యాప్తంగా పెన్షన్ పొందుతున్న వారు 1,91,351 మంది ఉన్నారు. ఇదంతా పాత లెక్క. పెన్షన్‌దారుల వయస్సును తగ్గించడంతో జిల్లాలో మరో 84,515మంది కొత్తగా వచ్చి చేరారు. దీంతో మొత్తం పెన్షన్లు పొందాల్సిన వారి సంఖ్య 2,75,866 మందికి చేరింది. ప్రస్తుతం పెన్షన్ దారులకు నెలకు రూ.వెయ్యి అందిస్తుండగా, ఆ మొత్తాన్ని రూ.2116కు పెంచారు. దివ్యాంగులకు ఇప్పుడు రూ.1500పెన్షన్ అందుతుండగా ఆ మొత్తం రూ.3,116కు పెరిగింది. జిల్లాలో పెన్షన్ పొందుతున్న దివ్యాంగులు 30,455 మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.9,48,97,780 ఖర్చు కానుంది. అంటే ఏటా వీరికి రూ.113కోట్ల 87లక్షల 73వేల 360 అవుతోంది. దివ్యాంగులను మినహాయిస్తే.. అన్ని రకాల పెన్షన్ దారులు కలిసి 2,45,411 మంది ఉన్నారు. వీరికి ప్రతినెలా రూ.51,92,89,676 ఖర్చు కానుంది. ఇలా.. ఏటా ఈ మొత్తం రూ.623కోట్ల 14లక్షల 76వేల 112 కానుంది. మొత్తంగా అన్ని రకాల పెన్షన్లకే ఏటా ఖర్చు చేయనున్న బడ్జెట్ రూ.737కోట్ల 02లక్షల 49వేల 472 అవుతోంది. ఈ మేర జిల్లా వాసులు లబ్ధిపొందనున్నారు. స్పష్టత లేని సాగునీటి ప్రాజెక్టుల కేటాయింపులు రాష్ట్ర బడ్జెట్లో సాగునీటి రంగానికి అత్యధిక కేటాయింపులు జరిపినా, ప్రాజెక్టుల వారీ వివరాలను మాత్రం వెల్లడించలేదు. దీంతో జిల్లాలో ఉన్న భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులతో పాటు చిన్నతరహా ప్రాజెక్టులకు ఒక్కో దానికి ఎంత మొత్తంలో కేటాయించిన వివరాలను ప్రకటించక పోవడంతో స్పష్టతలేకుండా పోయింది. జిల్లాలో ఎస్ఎల్బీసీ సొరంగం మార్గం, డిండి ఎత్తిపోతల పథకం, బ్రాహ్మణవెల్లెంల ఎత్తిపోతల పథకం, మూసీ ప్రాజెక్టు కాల్వల ఆధునికీకరణ వంటి పనులు పురోగతిలో ఉన్నాయి. కానీ, వీటికి ఎంత మొత్తంలో ఈ సారి బడ్జెట్ కేటాయించిందీ తెలియకుండా పోయింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలోనూ కొన్ని పనులు జరగడంతో పాటు ప్రాజెక్టు యాజమాన్యానికి ఎంత కేటాయించిందీ లెక్క లేదు. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చేపడుతున్న చెరువుల మరమ్మతులు, పునరుద్ధరణ పనుల కేటాయింపు వివరాలను ప్రకటించలేదు. సాగునీటి రంగం విషయాన్ని మినహాయిస్తే.. రైతులకు, పెన్షన్ దారులకు ఈ బడ్జెట్ తీపి కబురే అందించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాట నిలుపుకున్నారు ఎన్నికల సమయంలో మాలాంటి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ బడ్జెట్లోనే రూ.1810 కోట్లు కేటాంచి తన మాట నిలుపుకున్నారు. నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. దీని ద్వార పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వీలు కలుగుతుంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఈ పథకం ద్వారా లబ్ధి పొందేలా ప్రభుత్వాధికారులు చర్యలు తీసుకోవాలి. – నాగరాజు, రావులపెంట -
ఈసారీ సింహ భాగమే!
మహానగరంలో ప్రజా భద్రతకు ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చింది. ఈ మేరకు హోంశాఖకు భారీగా నిధులు కేటాయించగా, అందులో సింహభాగం నగర పోలీస్ విభాగానికి దక్కుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి హోంశాఖకు రూ.4,540.95 కోట్లు కేటాయించగా, వీటిలో కనీసం రూ.2 వేల కోట్లు సిటీకి అందుతాయని అంచనా వేస్తున్నారు. బంజారాహిల్స్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘పోలీస్ ట్విన్ టవర్స్’ నిర్మాణమూ వేగవంతమవుతుందని పేర్కొంటున్నారు. ఇక హైదరాబాద్ విశ్వనగరం దిశగా అడుగులేస్తున్న నేపథ్యంలో మౌలిక వసతులకు ప్రాధాన్యమిస్తామని పేర్కొంది. ఈ మేరకు మంచినీటి సౌకర్యం, రహదారుల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధి, ఔటర్ రింగ్‌రోడ్‌తో రేడియల్ రహదారుల అనుసంధానం, నాలాల విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వనుంది. కేశవాపూర్ రిజర్వాయర్‌ను నిర్దేశిత సమయంలో పూర్తి చేసేందుకు కేటాయింపులు చేయనుంది. అయితే శాఖల వారీగా నిధుల కేటాయింపులు మాత్రం చేయలేదు. ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కావడంతో నిధుల కేటాయింపు జరగలేదని, ఏప్రిల్‌లో ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్లో నిధుల కేటాయింపు ఉంటుందని ఆయా విభాగాల అధికారులు పేర్కొంటున్నారు. ఇక అప్పుల ఊబిలో కూరుకుపోయిన గ్రేటర్ ఆర్టీసీ, ఉస్మానియా ట్విన్ టవర్స్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం, నిమ్స్‌లో ప్రత్యేక యూరాలజీ, నెఫ్రాలజీ టవర్స్, ఈఎన్టీ భవనం తదితర అంశాలను ఈ బడ్జెట్లో ప్రస్తావించకపోవడం గమనార్హం. సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రం ప్రభుత్వం ఏటా బడ్జెట్లో నగర పోలీసు విభాగానికి పెద్దపీట వేస్తూ వస్తోంది. గత ఏడాది హోంశాఖకు మొత్తం రూ.1389.66 కోట్లు కేటాయించగా.. ఇందులో రూ.574.2 కోట్లు (41.3 శాతం) నగర పోలీసు విభాగానికి దక్కాయి. 2017–18లో రూ.509 కోట్లు కేటాయించగా... ఈసారి కేటాయింపులు గత ఏడాది కంటే రూ.63 కోట్లు పెరిగాయి. ఓటాన్ అకౌంట్లో హోంశాఖకు రూ.4540.95 కోట్లు కేటాయించారు. దీని నుంచి కనీసం రూ.2 వేల కోట్లు సిటీకే వస్తాయని అంచనా వేస్తున్నారు. ఫలితంగా ‘ట్విన్ టవర్స్’గా పిలిచే బంజారాహిల్స్ ప్రాంతంలో నిర్మించనున్న అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు (ఐసీసీసీ) పూర్తయి, అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. ‘డేగకళ్ల’ కోసం భారీగానే.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో విస్తరించి ఉన్న నగరం మొత్తాన్ని సీసీ కెమెరా నిఘాలో ఉంచడానికి ప్రభుత్వం, పోలీసు విభాగం ముమ్మర కసరత్తు చేస్తోంది. స్మార్ట్ అండ్ సేఫ్ సిటీ ప్రాజెక్టు కింద మూడు కమిషనరేట్లలో అవసరమైన పబ్లిక్ ప్లేసుల్లో కెమెరాలు ఏర్పాటు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో వీటి కనెక్టివిటీ తదితర అవసరాల కోసం ప్రభుత్వం గత ఏడాది బడ్జెట్లో రూ.140 కోట్లు కేటాయించింది. తాజా కేటాయింపులతో ప్రాజెక్టు తుది రూపు దాలుస్తుందని తెలుస్తోంది. ఠాణాల్లో మౌలిక వసతుల కల్పనకు భారీగానే కేటాయింపులు జరిగే అవకాశముంది. సిటిజెన్ సెంట్రిక్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ పథకం కింద ఈ బడ్జెట్లో ప్రభుత్వం గత ఏడాది రూ.10 కోట్లు ఇచ్చింది. ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం (ఐటీఎంఎస్) పేరుతో అత్యాధునిక వ్యవస్థను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ఇది ట్రయల్ దశలో ఉండగా జూన్ నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు భారీ నిధులు దక్కాయని ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. తప్పని నిరీక్షణ! మహానగరంలో మౌలిక వసతుల కల్పనకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో నిధుల వరద పారిస్తారనుకున్న సర్కారు విభాగాలు ఏప్రిల్ వరకు నిరీక్షించక తప్పని పరిస్థితి నెలకొంది. గ్రేటర్ పరిధిలో బహుళ వరుసలదారులు, తాగునీటి ప్రాజెక్టులకు ఆశించిన స్థాయిలో నిధులు దక్కకపోవడం అసంతృప్తికి గురిచేసింది. గతేడాదితో పోలిస్తే ఆయా విభాగాలకు తాజా బడ్జెట్లో నిధుల కేటాయింపులపై స్పష్టత కరువైందని నిపుణులు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఓట్‌ఆన్ అకౌంట్ మాత్రమేనని ఏప్రిల్ నెలలో పూర్తిస్థాయి బడ్జెట్లో ఆయా విభాగాలకు నిధుల కేటాయింపులు ఎంత మేర ఉంటాయన్న అంశంపై స్పష్టత రానుందని ఆయా విభాగాల ఆర్థిక విభాగం అధికారులు స్పష్టంచేస్తున్నారు. మహానగర దాహార్తిని తీరుస్తోన్న జలమండలి ఈ ఏడాది రూ.4945 కోట్ల మేర ప్రతిపాదనలు ఆర్థికశాఖకు సమర్పించినప్పటికీ..ఏప్రిల్‌లో ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్ వరకు నిధుల కోసం నిరీక్షించక తప్పని పరిస్థితి నెలకొంది. గతేడాది (2017–18) ఆర్థిక సంవత్సరంలో వార్షిక బడ్జెట్లో జలమండలికి రూ.1420 కోట్లు కేటాయింపులు జరిపినప్పటికీ ఇందులో గతంలో తీసుకున్న రుణాల చెల్లింపునకు రూ.670 కోట్లు మాత్రమే చెల్లించారు. ఇతర పథకాలకు మరో రూ.187 కోట్లు మాత్రమే కేటాయింపులు జరిగాయి. మిగతా రూ.563 కోట్లు వాటర్‌బోర్డు ఖజానాకు చేరకపోవడం గమనార్హం. గ్రేటర్‌కు మణిహారంలా భాసిల్లుతున్న మెట్రో రైలు ప్రాజెక్టుకు గతేడాది వార్షిక బడ్జెట్లో రూ.600 కోట్లు కేటాయింపులు జరిపినప్పటికీ ఇందులో లోన్ల చెల్లింపునకు రూ.200 కోట్లు చెల్లించారు. మిగతా రూ.400 కోట్లు మెట్రోఖజానాకు చేరలేదు. ఏప్రిల్‌లో నిధుల విడుదలపై స్పష్టతరానుందని మెట్రోరైలు వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది సైతం మెట్రోకు రూ.600 కోట్లు కేటాయించాలని కోరుతూ ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు సమర్పించిన విషయం విదితమే. నగరంలోని ప్రభుత్వ బోధనాసుపత్రులకు ఆశించినస్థాయిలో కేటాయింపులు జరపకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరడం, ప్రత్యామ్నాయంగా రెండు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఆ భవనాలకు కేటాయింపులు లేకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. నగరానికి నలు వైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. కానీ దీనికి అవసరమైన నిధులు కేటాయించలేదు. నిలోఫర్ నవజాత శిశువుల ఆరోగ్య కేంద్రం, నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి, కోఠి ఈఎన్టీ, గాంధీ, ఫీవర్, ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం, ఛాతి ఆస్పత్రి, కంటి ఆస్పత్రి, సుల్తాన్‌బజార్, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల ప్రస్థావన లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెతుత్తతున్నాయి. గ్రేటర్ పరిధిలో ఇప్పటికే ప్రారంభించిన 40 బస్తీ దవాఖానాలను బలోపేతం చేయనున్నట్లు ప్రకటించింది. పదివేల మందికో బస్తీ దవాఖాన ఏ ర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఆశ నిరాశల ఊగిసలాట!జీహెచ్ఎంసీకి భారీ నిధులు అవసరం సాక్షి, సిటీబ్యూరో: గత బడ్జెట్లో నగరంలో రహదారుల అభివృద్ధికి రూ.566.02 కోట్లు కేటాయించిన రాష్ట్రప్రభుత్వం కొత్త బడ్జెట్లోనూ తగినన్ని నిధులు కేటాయించగలదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రహదారుల కోసం ఇచ్చే నిధులు జీహెచ్ఎంసీకి కాకుండా హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) ద్వారా ఖర్చు చేయనున్నప్పటికీ, నగరంలోని రోడ్లు బాగుపడతాయని నగర ప్రజలు భావిస్తున్నారు. గత సంవత్సరం ఎస్టాబ్లిష్మెంట్ పద్దులో భాగంగా వివిధ అంశాలకు సంబంధించి రూ. 102 కోట్లు కేటాయించారు. ఈసారి వీటిపై పెద్దగా ఆశల్లేవు. నగర రహదారులపై ప్రజల నుంచి నిత్యం విమర్శలతో పాటు వర్షం వస్తే పరిస్థితి తీవ్రంగా ఉండటంతో రోడ్లు దెబ్బతినకుండా పీరియాడికల్ మెయింటనెన్స్ కింద పనులు చేపట్టేందుకు రూ. 721 కోట్లకు గతంలోనే పరిపాలన అనుమతులిచ్చారు. హెచ్‌ఆర్‌డీసీఎల్‌కు మరో రూ.1,930 కోట్లకు పరిపాలన అనుమతులిచ్చారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం నుంచి నిధులు మాత్రం అందలేదు. దీంతో జీహె చ్ఎంసీపై అప్పు భారం పడుతోంది. నగరంలో వాన సమస్యల పరిష్కారానికి దాదాపు రూ. 4వేల కోట్లు ఖర్చు కాగలదని అంచనా. రహదారులకు పూర్తిస్థాయి మరమ్మతులయ్యేనా..? ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రోడ్లకు పూర్తిస్థాయి మరమ్మతులకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొనడంతో పాటు అన్ని రహదారుల్ని అద్దంలా తీర్చిదిద్దేందుకు మిషన్‌మోడ్‌లో ప్రభుత్వం పనిచేయనుందని ప్రస్తావించడంతో రహదారులకు భారీ నిధులు కేటాయించగలరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ఏప్రిల్ దాకా ఆగాల్సిందేనా?
సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరం దిశగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్న ప్రభుత్వం ఓటాన్ అకౌంట్లో ప్రజారవాణాపై మాత్రం ఎలాంటి ప్రస్తావన చేయలేదు. ఆర్టీసీ, ఎంఎంటీఎస్ వంటి రవాణా సదుపాయాలకు ఏ మేరకు నిధులు కేటాయించనున్నారనే అంశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికే గ్రేటర్ ఆర్టీసీ భారీ నష్టాలతో నడుస్తోంది. ఎంఎంటీఎస్ రెండో దశ కింద రైల్వే లైన్ల నిర్మాణంచేపట్టినప్పటికీ నిధుల కొరత కారణంగా కొత్త రైళ్ల కొనుగోళ్లకు అవకాశం లేకుండా పోయింది. రాష్ట్రప్రభుత్వం నుంచి నిధులు అందితే తప్ప రెండో దశ రైళ్లు పట్టాలెక్కలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రజా రవాణా కోసం నిధుల కేటాయింపుపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో వచ్చే ఏప్రిల్ వరకు ఆగాల్సిందేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు నగరంలో రవాణా సదుపాయాలను మెరుగుపర్చేందుకు, ప్రత్యేకించి పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోళ్లకు ఎలాంటి కేటాయింపులు లేకపోవడం నిరాశే మిగిల్చింది. గ్రేటర్ ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం నుంచి సాయంఅందకపోవడం పట్ల ఆర్టీసీ కార్మికులు, కార్మిక సంఘాలుతీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. గ్రేటర్ నష్టాలు రూ.372 కోట్లు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ రూ.602 కోట్ల నష్టాలను ఎదుర్కొంటుండగా, ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే రూ.372 కోట్ల మేర నష్టాలు ఉన్నాయి. గత భారీగా పెరిగిన ఇంధన ధరలు, నిర్వహణ వ్యయం ఆర్టీసీని కుంగదీస్తున్నాయి. గ్రేటర్లో ప్రతిరోజు 3,550 బస్సులు తిరుగుతున్నాయి. రోజుకు రూ.3.5 కోట్ల మేర ఆదాయం లభిస్తున్నప్పటికీ రూ.4.5 కోట్ల మేర రోజువారీ నిర్వహణ వ్యయం కారణంగా రోజుకు రూ.కోటి చొప్పున నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. రెండేళ్లుగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవడం, భారీగా నిర్వహణ వ్యయం, విడిభాగాల కొనుగోళ్లు, తదితర కారణాల దృష్ట్యా నష్టాలు అనూహ్యంగా పెరిగాయి. లైన్లు ఉన్నా.. రైళ్లు లేవు.. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా నగర శివార్లను కలుపుతూ రైల్వేలైన్లను ఏర్పాటు చేశారు. చాలా చోట్ల పనులు తుది దశకు చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇప్పటి వరకు అందకపోవడంతో కొత్త రైళ్ల కొనుగోళ్లకు బ్రేక్ పడింది. సికింద్రాబాద్–బొల్లారం, పటాన్చెరు–తెల్లాపూర్ మార్గాల్లో ఇప్పటికిప్పుడు ఎంఎంటీఎస్ రైళ్లు నడిపేందుకు అవకాశం ఉన్నప్పటికీ నిధుల కొరత సమస్యగా మారింది. సుమారు రూ.850 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో మూడొంతుల నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందజేయాల్సి ఉంది. రూ.600 కోట్లకు పైగా రాష్ట్రం ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.300 కోట్ల వరకు మాత్రమే అందజేసినట్లు అధికారులు తెలిపారు. మరో రూ.300 కోట్ల వరకు రాష్ట్రం నుంచి అందాల్సి ఉంది. -
అన్నదాతకు అండ
ఆదిలాబాద్‌టౌన్: తెలంగాణ ప్రభుత్వం రైతన్నకు అండగా నిలిచింది. వ్యవ‘సాయానికి’ బడ్జెట్లో నిధులు కేటాయించి అన్నదాతకు పెద్దపీట వేసింది. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర శాసన సభకు 2019–20 సంవత్సరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వ్యవసాయం, సాగునీరు, ప్రాజెక్టులు, పింఛన్లు, కల్యాణలక్ష్మి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ప్రగతికి ప్రత్యేక నిధిని కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని వర్గాల వారిని ఆకర్షించేలా పథకాలు ఉన్నాయి. సీఎం నిర్ణయంతో జిల్లా వాసులకు లబ్ధి చేకూరనుంది. వ్యవసాయ రంగానికి పెద్దపీట.. ఈ బడ్జెట్లో ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. రైతులకు రుణమాఫీ కోసం రూ.6కోట్లు ప్రకటించింది. జిల్లాలో లక్షా 33 వేల 797 మంది రైతులు ఉన్నారు. ఇందులో దాదాపు 50 వేల మంది రైతులకు రుణమాఫీ వర్తించనుంది. అదే విధంగా రైతుబంధు పథకం ద్వారా గత ఖరీఫ్, రబీ సీజన్లలో ఎకరానికి రూ.4 వేలు ఇవ్వగా ఇక నుంచి ఎకరానికి రూ.5 వేల చొప్పున సంవత్సరానికి 10వేలను రైతుల అకౌంట్లో జమ చేయనున్నారు. రుణమాఫీ పథకానికి జిల్లాలోని రైతులకు రూ.137.77 కోట్లు నిధులు కేటాయించే అవకాశం ఉంది. రైతు బీమా పథకానికి కూడా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించారు. జిల్లాలో కోర్టా–చనాఖా బ్యారేజ్ పనులు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు మరిన్ని నిధులు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా బోథ్ నియోజకవర్గంలో కుప్టి ప్రాజెక్టు నిర్మాణ పనులకు నిధులు విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సంక్షేమమే ధ్యేయంగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్లో అధిక నిధులు సంక్షేమానికి కేటాయించారు. ఆసరా పింఛన్లు రూ.1000 నుంచి 2016కు పెంచనున్నారు. దివ్యాంగుల పెన్షన్‌ను రూ.1500 నుంచి రూ.3016కు పెరగనుంది. అదే విధంగా ఎన్నికల ముందు సీఎం ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ వయస్సును 60 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించారు. జిల్లాలో ప్రస్తుతం 68,531 మంది పెన్షన్‌దారులు ఉన్నారు. మూడేళ్ల వయస్సు తగ్గించడంతో దాదాపు మరో 30 వేలకు పైగా లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉంది. షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాలకు నిధులు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కులాల ప్రగతి కోసం ప్రత్యేక నిధులు కేటాయించారు. రుణాలను లబ్ధిదారులకు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలకు 16,581 కోట్లు కేటాయించగా మైనార్టీల కోసం రూ.2,004 కోట్లు కేటాయించారు. జిల్లాలో 7లక్షల 10 వేల జనాభా ఉంది. దాదాపు 4 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి అద్దాలు, ఉచిత ఆపరేషన్ల కోసం ప్రభుత్వ నిధులు కేటాయించింది. అదే విధంగా చెవి, ముక్కు, గొంతు, సంబంధిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్లు, ఊరూరా శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. అదే విధంగా మిషన్ భగీరథ పనులను పూర్తి చేసేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించారు. నిరుద్యోగులకు భృతి.. జిల్లాలో 57 వేల మంది వరకు నిరుద్యోగులు ఉన్నారు. వీరికి నెలకు రూ.3016 చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించేందుకు ప్రభుత్వం విధి విధానాలను రూపకల్పన చేస్తున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. దీంతో నిరుద్యోగులకు మేలు జరగనుంది. ఈ పథకం కింద జిల్లాకు దాదాపు రూ.180 కోట్లు నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నియోజకవర్గానికి ఒకటి చొప్పున జిల్లాలో బీసీ రెసిడెన్షియల్ కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. జీపీల అభివృద్ధి కోసం నిధులు కేటాయించారు. 500 జనాభా కలిగిన గ్రామాలకు రూ.8 లక్షల చొప్పున నిధులు కేటాయించనున్నట్లు సీఎం ప్రకటించారు. జిల్లాలో 467 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాల ద్వారా నీటి సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతున్నారు. -
హామీలకు జై
సాక్షిప్రతినిధి, ఖమ్మం: బడ్జెట్లో వ్యవసాయ, సంక్షేమ రంగాలకు పెద్దపీట వేశారు. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధులను సంక్షేమ పథకాలకు కొనసాగింపుగా కేటాయించారు. దీనిని అధికార పార్టీ నాయకులు సంక్షేమ బడ్జెట్‌గా పేర్కొంటుండగా.. ప్రతిపక్షాలు మాత్రం ఇది కేవలం ఎన్నికల బడ్జెట్ అని.. ప్రధాన రంగాలకు ఇందులో నిధులు కేటాయించలేదని, ఇంకా పూర్తిస్థాయి బడ్జెట్ కేటాయించకపోవడం ఏమిటంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే ఎన్నికల హామీలనే ప్రధానాంశాలుగా పేర్కొనడంతో జిల్లాలోని ప్రజలకు లబ్ధి చేకూరనున్నది. ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కావడంతో కొత్త పథకాలు ప్రవేశపెట్టేందుకు అవకాశం లేకుండాపోయింది. ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలకే నిధులు కేటాయించడంతో జిల్లాలోని అర్హులైన లబ్ధిదారులకు మేలు జరగనున్నది. వ్యవసాయ, సంక్షేమ రంగాల కోసం నిధులు కేటాయించారు. వ్యవసాయ రంగంలో రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలకు బడ్జెట్లో ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఎన్నికల హామీలో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన ఆసరా పింఛన్లకు కూడా నిధులను కేటాయించింది. దీంతో జిల్లాలోని రైతులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు లాభం చేకూరనున్నది. ప్రధానంగా కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు ఆర్థిక పరిపుష్టి కలగనున్నది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి వ్యక్తికి ఏడాదికి రూ.806 చొప్పున కేంద్రం నుంచి నిధులు అందనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 2019–20 ఆర్థిక సంవత్సరంలో స్థానిక సంస్థలకు ఇచ్చే నిధుల విషయంలో రాష్ట్ర ఆర్థిక సంఘం ఇటీవల మధ్యంతర నివేదిక ఇచ్చిందని బడ్జెట్ ప్రసంగంలో కేసీఆర్ పేర్కొన్నారు. అయితే ఆర్థిక సంఘం సిఫార్సులకన్నా ఎక్కువ నిధులు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. దీంతోపాటు 500 జనాభా కలిగిన గ్రామానికి కూడా రూ.8లక్షల నిధులు కేటాయించనున్నారు. వీటితోపాటు జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నిధులు, పన్నుల ద్వారా వచ్చే నిధులతో గ్రామ పంచాయతీలకు మహర్దశ పట్టనున్నది. అంకెల గారడీ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీలా ఉంది. పూర్తిస్థాయిలో అన్ని వర్గాలకు న్యాయం జరగలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఈ బడ్జెట్‌తో అమలు జరిగే అవకాశం లేదు. నిరుద్యోగ భృతి ఇస్తామన్న ప్రభుత్వం నేటికీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా ఉంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సైతం ఆశించిన స్థాయిలో లబ్ధి చేకూర్చలేదు. విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం వహిస్తూ నిధుల కేటాయింపు పూర్తిస్థాయిలో లేకపోవడంతో నాణ్యమైన విద్య అందే అవకాశం కనిపించడం లేదు. – పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లెక్కలతో మోసం.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నా.. అలా చేయలేదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని చెప్పి లెక్కల గారడీ చేశారు. ఒకేసారి రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పిన సీఎం అందుకు రూ.6వేల కోట్లు కేటాయించి మోసం చేశారు. వైద్యరంగానికి రూ.5వేల కోట్లు కేటాయించామని చెప్పిన కేసీఆర్ కంటి వెలుగు, ఈఎన్టీ వంటి పథకాలు కూడా ఇందులోనే ఉంటాయని చెప్పారు. రూ.27వేల కోట్లు లోటు ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ లోటును ప్రజలపై పన్నులు వేసి భర్తీ చేస్తారా? ఏ విధంగా భర్తీ చేస్తారో సీఎం వివరించాలి. – నున్నా నాగేశ్వరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పుల్లోనే అభివృద్ధి.. రాష్ట్రం అప్పుల్లో గణనీయమైన అభివృద్ధి సాధించింది. కేసీఆర్ చెప్పిన లెక్కల్లో అంతా డొల్లతనం కనిపిస్తోంది. పంట రుణాల కేటాయింపులు గతంలోనే బాగున్నాయి. నిరుద్యోగ భృతికి సంబంధించి బడ్జెట్లో స్పష్టత లేదు. ప్రాజెక్టులకు సరైన రీతిలో కేటాయింపులు జరగలేదు. బడ్జెట్‌ను చూస్తుంటే ఆర్థిక అరాచకత్వం ప్రబలే ప్రమాదం ఉంది. సంక్షేమ పథకాల అమలుపై స్పష్టత లేదు. విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించారు. కేసీఆర్ అంకెల గారడీతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాకు సంబంధించి సీతారామ ప్రాజెక్టు కేటాయింపులపై స్పష్టత లేదు. – బాగం హేమంతరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి అన్ని వర్గాలకు అన్యాయమే.. అతి సామాన్యుడికి వరాలు ఇచ్చినట్టున్నా.. బడ్జెట్ అన్ని వర్గాలకు అన్యాయం చేసేలా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏ రంగానికి సరిపడా నిధులు కేటాయించలేదు. వ్యవసాయ రంగానికి కేటాయించిన బడ్జెట్లో ఏదైనా ఒక్క పథకానికే నిధులన్నీ సరిపోయేలా ఉన్నాయి. అతి సామాన్యుడిపై భారం తగ్గించేందుకు ఎలాంటి కేటాయింపులు జరపలేదు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఎన్ని నిధులు కేటాయిస్తున్నామన్నది బడ్జెట్లో చెప్పలేదు. వ్యవసాయం, విద్య తదితర రంగాలు ఈ బడ్జెట్ వల్ల ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. – లక్కినేని సుధీర్‌బాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మోసం చేసేందుకే.. తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసే ప్రక్రియలో భాగంగానే ఈ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కేంద్రం రూ.22వేల కోట్లు ఇస్తుందని తెలిసి కూడా పూర్తి బడ్జెట్‌ను ఎందుకు ప్రవేశపెట్టలేదో అర్థం కావడం లేదు. ఏ ఒక్క గ్రామానికి గ్రాంట్ ఇవ్వలేదు. కొత్త గ్రామ పంచాయతీలకు కేటాయింపులు లేవు. మిషన్ భగీరథ కరెంట్ బిల్లులు ఎవరు కట్టాలి. పార్లమెంట్ ఎన్నికల కోసమే తెలంగాణ ప్రజలను మభ్య పెడుతున్నారు. – తుళ్లూరి బ్రహ్మయ్య, టీడీపీ జిల్లా అధ్యక్షుడు అప్పుల ఊబిలో.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.50వేల కోట్ల రెవెన్యూ లోటు కనిపిస్తోంది. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యానికి నిదర్శనం. మిగులు రాష్ట్రం కాస్త అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా లిక్కర్ అమ్మకాల వల్ల వచ్చే ఆదాయంపై ఆధారపడుతోంది. ఏ ప్రభుత్వమైనా అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టాలి. అయితే రెవెన్యూ లోటు ఉండడం వల్ల ప్రభుత్వం అభివృద్ధిపై నిధులు కేటాయించడం లేదు. బడ్జెట్లో ఖమ్మం జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేకపోయింది. ఇది పూర్తిగా రైతు వ్యతిరేక, అభివృద్ధి వ్యతిరేక బడ్జెట్. – సన్నె ఉదయ్‌ప్రతాప్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎన్నికల బడ్జెట్.. రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రజాకర్షక పథకాలతో ప్రవేశపెట్టారు. నిరుద్యోగ భృతి, పెన్షన్, రుణమా ఫీ వంటి ఎన్నికల హామీల నేపథ్యంలో కేటా యింపులు చేయడం సమంజసమైనప్పటికీ.. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి, రైతాంగ సంక్షోభానికి కారణమైన వ్యవసాయరంగాన్ని ఆదుకోవడానికి, పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చేందుకు బడ్జెట్లో పరిష్కార మార్గాలు చూపలేదు. నీటిపారుదల రంగానికి రూ.22వేల కోట్లు కేటాయించినా.. అనేక ప్రాజెక్టులకు లక్ష కోట్లకుపైగా ఖర్చు చేస్తున్న పరిస్థితి చూస్తుంటే వాస్తవ పరిస్థితికి తగినట్లుగా లేదు. మొత్తంమీద ఇది ఎన్నికల బడ్జెట్. – పోటు రంగారావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి -
గ్రామీణాభివృద్ధికి పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసింది. పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ. 20,093 కోట్లు, పంచాయతీరాజ్ విభాగం కింద రూ. 10,716 కోట్లు కేటాయించాలని ఆయా శాఖలు ప్రభుత్వాన్ని కోరగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో భాగంగా గ్రామీణాభివృద్ధికి రూ. 5,358 కోట్లు, పంచాయతీరాజ్‌శాఖకు రూ. 4,221 కోట్లను సర్కారు ప్రతిపాదించింది. 2018–19 బడ్జెట్లో ఈ శాఖకు రూ. 15,562 కోట్లు (పీఆర్ విభాగానికి రూ. 8,929 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ. 6,633 కోట్లు) కేటాయించింది. మరోవైపు గత బడ్జెట్లో ఆసరా పింఛన్ల కింద రూ. 5,388 కోట్లు కేటాయించగా దానికంటే రెండింతలు అధికంగా తాజా బడ్జెట్లో ఈ మొత్తాన్ని రూ. 12,067 కోట్లకు ప్రభుత్వం పెంచింది. ఇక ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథకు ప్రత్యక్ష కేటాయింపులు పెద్దగా కనిపించలేదు. గతేడాది బడ్జెట్లో ప్రభుత్వం రూ. 1,803 కోట్లు కేటాయించగా ఈసారి మాత్రం స్పష్టమైన కేటాయింపులు చేసినట్లు కనబడలేదు. అయితే పీఆర్, ఆర్డీకి సంబంధించి వివిధ రంగాలు, పథకాల కింద పలు రూపాల్లో కేటాయింపులు చేసినందున వాటిలోంచి మిషన్ భగీరథకు కేటాయించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు ముగింపు దశకు చేరుకున్న దశలో బడ్జెట్ కేటాయింపులు చేయకపోవడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. 2017–18 బడ్జెట్లో ఈ పథకానికి ప్రభుత్వం రూ. 8 వేల కోట్లు కేటాయించింది. కాగా, అటవీ, పర్యావరణ, విజ్ఞానం, సాంకేతిక నైపుణ్య శాఖకు రూ. 342 కోట్లు కేటాయించాలని అధికారులు కోరగా ప్రభుత్వం మాత్రం రూ. 171 కోట్లకే బడ్జెట్ ప్రతిపాదనలు చేసింది. ‘డబుల్’ స్పీడ్ డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ అంశాన్ని ప్రజల్లో బాగా ప్రచారం చేసింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం రూ.2,643 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. పార్లమెంట్ ఎన్నికల్లోపు 80 వేల ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఈ సారి లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే 2019–20 ఆర్థిక సంవత్సరానికిగానూ బడ్జెట్లో రూ.4,709.5 కోట్లు కేటాయించింది. దీంతో ఈ సారి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో వేగం పెరగనుంది. 2019 జనవరి వరకు మొత్తం 19,195 ఇళ్లను ప్రభుత్వం పూర్తి చేయగలిగింది. వీటికి ప్రస్తుతం రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. పెళ్లికి సాయం పేదింట్లో ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఒక్కో లబ్ధిదారుకు రూ.1,00,116 ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. తాజాగా ఈ పథకాలకు 2019–20 బడ్జెట్లో రూ. 1,450 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో 1.433 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. 2018–19 వార్షిక సంవత్సరంలో ఈ రెండు పథకాలకు రూ. 1,400 కోట్లు కేటాయించింది. కాగా, ఈ పథకాలకు ఈ నెల 20 నాటికి 2.25 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో జనవరి నెలాఖరు నాటికి 1,29,742 మందికి ఆర్థిక సాయం అందించారు. 2014–15లో కల్యాణలక్ష్మి పథకాన్ని ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే అమలు చేయగా.. 2016–17 వార్షిక సంవత్సరం నుంచి బీసీ, ఈబీసీలకూ అందిస్తోంది. ఆర్టీసీకి నిరాశే.. రాష్ట్ర ఆర్టీసీ పరిస్థితి చాలా దయనీయంగా మారింది. రోజురోజుకూ పెరుగుతున్న అప్పులు, వాటి వడ్డీలతో సంస్థపై ఆర్థికభారం పెరిగిపోతోంది. అయితే ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లో సైతం ఆర్టీసీకి నిరాశే ఎదురైంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి రూ.630 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇందులో వివిధ బస్సుపాస్‌లు ఇతర రాయితీల కింద రూ.520 కోట్లు వివిధ రీయింబర్స్‌ల కింద పోను, మిగిలిన రూ.110 కోట్లను రుణాల కోసం కేటాయించారు. కొత్త బస్సుల కొనుగోలుకు ఇందులోనే సర్దుబాటు చేసే అవకాశాలున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం నుంచి బడ్జెట్లో ప్రకటించిన మొత్తాన్ని ఏనాడూ పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడం గమనార్హం. గతేడాది రూ.975 కోట్లు కేటాయించిన సర్కారు ఈ సారి ఏకంగా రూ.345 కోట్ల కోత విధించింది. -
హెల్త్‌కు లేని వెల్త్
వైద్య, ఆరోగ్య రంగంపట్ల సర్కారు ఈసారి చిన్నచూపు చూసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి ప్రతి ఏటా ఆరోగ్యానికి నిధులను పెంచుతూ వస్తున్న ప్రభుత్వం 2019–20 సంవత్సరం బడ్జెట్లో కోత పెట్టింది. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా అనేక కొత్త పథకాలను అమలు చేస్తూ వాటికి అనుగుణంగా నిధులు కేటాయిస్తోంది. కానీ, 2018–19 బడ్జెట్లో వైద్యారోగ్యానికి రూ.7,375.20 కోట్లు కేటాయించగా ఈసారి రూ.1839.2 కోట్లు తక్కువగా రూ.5,536 కోట్లు మాత్రమే కేటాయించారు. అయితే, కేసీఆర్ కిట్లు, ప్రభుత్పాస్పత్రుల్లో వైద్య పరికరాలు, మందుల కొనుగోలు, బస్తీ దవాఖానాల ఏర్పాటు, సిద్దిపేట, మహబూబ్‌నగర్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో వైద్య కళాశాలల నిర్మాణానికి ప్రముఖంగా నిధులు కేటాయించినట్టు వైద్యారోగ్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కంటి వెలుగు తరహాలోనే చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షల నిర్వహణకు ఏర్పాటు చేస్తున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించిన నేపథ్యంలో ఈ పథకానికి కేటాయింపులు పెద్ద మొత్తంలో ఉండనున్నాయి. 2018–19 బడ్జెట్లో కేటాయించిన మొత్తం రూ.7,375.20 కోట్లల్లో రూ.3522.71 కోట్లు నిర్వహణ పద్దుకాగా, రూ.3,852.49 కోట్లు ప్రగతి పద్దు. ఈ అంచనాలతో పోలిస్తే ప్రస్తుత బడ్జెట్లో నిర్వహణ పద్దు పోను మిగిలేది కేవలం రూ.2014 కోట్లు మాత్రమే. రూ.10 వేల కోట్ల ప్రతిపాదన... ప్రభుత్వం వైద్య, ఆరోగ్యశాఖలో 2017లో కేసీఆర్ కిట్‌ను ప్రవేశపెట్టింది. 2018లో కంటి వెలుగు పథకాన్ని తీసుకొచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం వివిధ పథకాలతోపాటు కొత్తగా ఏడాది చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో సూర్యాపేట, నల్లగొండ వైద్య కళాశాలలకుతోడు కొత్తగా మరో ఐదు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని గత ఎన్నికల్లో సీఎం హామీ ఇచ్చారు. ఇన్ని పథకాలు అమలు చేయాలంటే గతం కంటే ఎక్కువ బడ్జెట్ అవసరమవుతుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు 2019–20 ఆర్థిక సంవత్సరానికి రూ.10 వేల కోట్ల నిధులు అవ సరమని ప్రతిపాదించారు. కానీ అందులో సగం మాత్రమే కేటాయిపులు జరిగాయి. దేశవ్యాప్తంగా అత్యున్నత వైద్య సేవలందించే మూడు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటని ఇటీవలే కేంద్రం ప్రకటించడాన్ని బడ్జెట్ ప్రసం గంలో ముఖ్యమంత్రి ప్రస్తావించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వైద్యసేవలను మరింత విస్తరించేందుకు, పేదలందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు. నిధులు సరిపోతాయా? కేసీఆర్ కిట్ల పథకం అమలు వల్ల ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య అనుహ్యంగా 49 శాతానికి పెరిగిందని సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ పథకం కోసం గత బడ్జెట్లో రూ.560.05 కోట్లు కేటాయించారు. మాతా, శిశు సంరక్షణ కేంద్రాల్లో సౌకర్యాలు మెరుగవడం, నాణ్యమైన వైద్యం అందుతుండటంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో సుమారు 2.75 లక్షల ప్రసవాలు ప్రభుత్పాస్పత్రుల్లో జరుగుతాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు, కంటి వెలుగు కార్యక్రమం విజయవంతమవడంతో, ఈఎన్టీ పరీక్షలను సైతం అదే స్థాయిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు పథకాలుసహా రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్‌సీలు, జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో వైద్య పరికరాల కొనుగోలు, ఆరోగ్యశ్రీ, ఉస్మానియా ఆసుపత్రికి కొత్త బిల్డింగ్‌సహా పలు ఆస్పత్రుల భవనాల నిర్మాణం తదితర అవసరాల కోసం మొత్తం రూ.10 వేల కోట్లకు వైద్యారోగ్యశాఖ ప్రతిపాదనలు రూపొందించింది. కానీ, ప్రభుత్వం రూ.5,536 కోట్లతోనే సరిపెట్టడంతో ఆయా పథకాల అమలులో ఇబ్బందులు ఏర్పడే అవకాశముందని వైద్యారోగ్యశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎందుకు కోత కోశారో, ఏ పథకాలపై ప్రభావం పడుతుందో సర్కారు స్పష్టత ఇవ్వలేదని అంటున్నారు. – సాక్షి, హైదరాబాద్ -
రైతే రాజు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయశాఖకు నిధుల కేటాయింపు భారీగా పెరిగింది. నిధులు మూడేళ్లలో మూడింతలయ్యాయి. దీనిని బట్టి రైతుకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యమేంటో అర్థమవు తుంది. రైతు బంధు, రైతుబీమా, రుణమాఫీ వంటి పథకాల కారణంగా వ్యవసాయశాఖ బడ్జెట్ భారీగా పెరిగింది. 2017–18 బడ్జెట్లో రూ.6,498.15 కోట్లు కేటాయిస్తే, 2018–19 బడ్జెట్లో రూ.15,511కోట్లు కేటాయించింది. ఇప్పుడు రూ.20,107 కోట్లు కేటాయించింది. గతేడాదితో పోలిస్తే రూ.4,596 కోట్లు పెరిగినట్లయింది. ఈసారి రైతుబంధుకు రూ.12 వేల కోట్లు కేటాయించారు. రుణమాఫీకి రూ.6 వేల కోట్లు కేటాయించారు. రైతుబీమా అమలుకు రూ.650 కోట్లు కేటాయిం చారు. అంటే సింహభాగం ఈ 3 పథకాలకే ప్రభుత్వం కేటాయించింది. పంట కాలనీపై కేంద్రీకరణ... ఈసారి ప్రభుత్వం ప్రత్యేకంగా పంట కాలనీలపై దృష్టి సారించనుంది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రసంగంలోనూ ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఆయా జిల్లాల్లో ఉండే నేల స్వభావాన్ని బట్టి రాష్ట్రాన్ని పంట కాలనీలుగా చేస్తారు. ఆ దిశగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, వ్యవసా యశాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నా యి. ప్రజల అవసరాలకు అనుగుణంగా పంటలు, దేశవిదేశాల్లో డిమాండ్ ఉన్న పంటలను రైతులు పండించేలా చేయడమే ఈ పంట కాలనీల లక్ష్యం. ఈ పథకాన్ని అమలుచేసే క్రమంలో చిన్న, మధ్యతరహా భారీ ఆహారశుద్ధి కేంద్రాలను అన్ని ప్రాంతాల్లో నెలకొల్పుతారు. వీటి నిర్వహణలో ఐకేపీ ఉద్యోగులు, ఆదర్శ మహిళాసంఘాల్ని భాగస్వాములు చేయాలని ప్రభుత్వం సంక ల్పించింది. 1.61 లక్షలున్న రైతు సమితి సభ్యులకు గౌరవ వేతనమిచ్చేందుకు సర్కారు ప్రయత్నిస్తోంది. రైతులకు మద్దతు ధర, ప్రజలకు కల్తీలేని ఆహార పదార్థాలను అందించాలనే బహు ముఖ వ్యూహంతో సమితులు పనిచేస్తాయి. ఈ సమితుల వేదికగా రైతు లందరినీ సంఘటిత పర్చాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇతరత్రా పథకాలపై అస్పష్టత వ్యవసాయ శాఖ చేపడుతున్న అనేక ఇతర పథకాలు, కార్యక్రమాలకు మాత్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో స్పష్టత ఇవ్వ లేదు. వ్యవసాయ, ఉద్యానశాఖలు ఇప్ప టికే అనేక ముఖ్యమైన కార్య క్రమాలు చేపడుతు న్నాయి. గ్రీన్ హౌస్, వ్యవసాయ యాంత్రీకరణ వంటివి అమలు చేస్తున్నాయి. యాంత్రీకరణకు 2017–18 బడ్జెట్లో రూ.336.80 కోట్లు కేటాయిస్తే, 2018–19 బడ్జెట్లో రూ.522 కోట్లు కేటాయించారు. కానీ ఈసారి ఎంతనేది తెలియరాలేదు. ఉద్యాన శాఖకు 2017–18 బడ్జెట్లో రూ.207 కోట్లు కేటాయిస్తే, 2018–19 బడ్జెట్లో రూ.376 కోట్లు కేటాయించారు. ఇప్పుడు ఎంతనేది ప్రకటించలేదు. వ్యవసాయ మార్కెటింగ్‌కు గత బడ్జెట్లో రూ. 457 కోట్లు కేటాయిస్తే, 2018–19 బడ్జెట్లో కేవలం రూ.122 కోటు కేటాయిం చారు. అయితే, ఈసారి ఎంతనేది తెలియాల్సి ఉంది. రైతుబీమాతో ధీమా... రైతు ఏ కారణం వల్ల మరణించినా, ఆ రైతు కుటుంబానికి రైతుబీమా పథకం కింద రూ.5 లక్షలను కేవలం పదిరోజుల వ్యవధిలో ప్రభుత్వం అందిస్తుంది. ఇప్పటివరకు 5,675 మంది రైతుల కుటుంబాలకు రూ.283 కోట్లు అందించింది. ఈ బడ్జెట్లో రైతుబీమా పథకానికిగాను రైతుల తరఫున కిస్తీ కట్టేందుకు రూ.650 కోట్లు ప్రతిపాదించారు. ఇన్ని పథకాలు ఎక్కడా లేవు ఒక రాష్ట్రంలో వ్యవసాయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు భారీ బడ్జెట్ ప్రకటించడం దేశ చరిత్రలో ఇదే మొట్ట మొదటిసారి. దీంతో శాస్త్రీయ సాగు, రైతులకు ఆధునిక సాగు పరిజ్ఞానం, సాగులో మౌలిక వసతులు తక్షణమే అందించేందుకు వీలవుతుంది. దేశంలో రైతుబీమా, రైతుబంధు, రుణమాఫీ... ఈ మూడూ ఎక్కడా అమలు కావడంలేదు. ఏదో ఒక పథకం అమలు చేయడానికే వివిధ రాష్ట్రాలు ఇబ్బంది పడతాయి. కానీ, ఇక్కడ ఇన్ని పథకాలు అమలు చేయడం చిన్న విషయం కాదు. – పిడిగం సైదయ్య,ఉద్యాన శాస్త్రవేత్త, ఉద్యాన వర్సిటీ రుణమాఫీకి 40 లక్షల మంది అర్హులు! రుణమాఫీకి బడ్జెట్లో నిధులు కేటాయించడంతో రాష్ట్రరైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్త మవుతున్నాయి. రూ. లక్ష లోపు రుణాలున్న వారందరికీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పంట రుణా లు మాఫీ కానున్నాయి. అందుకోసం ప్రభుత్వం బడ్జెట్లో రూ. 6 వేల కోట్లు కేటాయించింది. గతేడాది డిసెంబర్ 11ని గడువుగా లెక్కించి ఆ తేదీ నాటికి రుణం తీసుకున్న రైతులకు ఈ రుణమాఫీని ప్రభు త్వం ప్రకటించింది. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) లెక్కల ప్రకారం దాదాపు 40 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులుగా తేల్చినట్లు చెబుతున్నారు. వారందరికీ రూ. లక్ష లోపున రుణా లు మాఫీ చేయాల్సి వస్తే దాదాపు రూ. 28 వేల కోట్ల వరకు నిధులు అవసరం కావచ్చని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కలపై ఇంకా స్పష్టత రాలేదు. డిసెంబర్ 31 నాటి వరకు ఎస్ఎల్బీసీ వద్ద ఉన్న స్పష్టమైన లెక్కల ప్రకారం 48 లక్షల మందికి రూ. 31 వేల కోట్లు మాఫీ చేయాల్సి ఉంటుంది. డిసెంబర్ 11కి, డిసెంబర్ 31కి మధ్య రుణాలు తీసుకున్న వారి సంఖ్యలో భారీ తేడా కనిపిస్తుంది. 2018 డిసెంబర్ 11 నాటికి రూ.లక్ష లోపు వ్యవసాయ రుణాలు మాఫీ అవుతాయి. రుణాలు తీసుకున్న రైతులు తమకు ఎప్పుడు మాఫీ చేస్తారోనని ఎదురుచూస్తున్నారు. ఈ రబీ సీజన్లో రూ. 16,998 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా, బ్యాంకులు ఇప్పటివరకు కేవలం రూ. 7,765 కోట్లు మాత్రమే ఇచ్చాయి. ఓటాన్ అకౌంట్ ఎందుకంటే.. 2019–20 ఆర్థిక సంవత్సరానికిగాను పూర్తి బడ్జెట్‌ను పెట్టకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందనే దానిపై సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో వివరణ ఇచ్చారు. ‘ప్రభుత్వం ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టేందుకు అనేక కారణాలున్నాయి. ఈసారి కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎలా ఉం టాయి? ఏయే రంగాలకు ఎలాంటి కేటాయింపులుంటాయి? ప్రాధాన్యాలేం టి? కేంద్ర ప్రాయోజిత పథకాలు ఎలా ఉండబోతున్నాయి? అనే అంశాలపై స్పష్టత లేదు. కేంద్రంలో పూర్తిస్థాయి బడ్జెట్ పెడితేనే రాష్ట్రానికి ఏ రంగంలో ఎంత మేరకు ఆర్థికసాయం అందుతుందనే దానిపై స్పష్టత వస్తుంది. తెలంగాణ ప్రభు త్వం కూడా ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడుతోంది. రాష్ట్రంలోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాబో యే ఐదేళ్ల అభివృద్ధికి సంబంధించిన కార్యాచరణ రూపొందించుకున్నామ న్నారు. -
భద్రతకు రూ. 4,540 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావం నుంచి పోలీసు శాఖకు ప్రభుత్వం పెద్దపీట వేస్తూవస్తోంది. తాజా బడ్జెట్లో హోంశాఖకు రూ.4,540 కోట్ల నిధులు కేటాయించింది. అయితే గతేడాది కంటే ఈ సారి బడ్జెట్లో భద్రతకు రూ.1,250 కోట్ల మేర కేటాయింపులు తగ్గడం గమనార్హం. గస్తీకి పెద్దపీట వేసిన ప్రభుత్వం ఇప్పటికే వేలాదిగా వాహనాలు కొనుగోలు చేసి ఇచ్చింది. ఇందులో 2014లో 3,800, 2018లో 11,500 వాహనాలు ఆ శాఖకు అందజేసింది. నాలుగున్నరేళ్లలో దాదాపుగా 15 వేల వాహనాలు (ఇందులో ఇన్నోవాలు, బస్సులు, బైకులు తదితరాలు) సమకూర్చింది. హైదరాబాద్ వ్యాప్తంగా 5 లక్షల సీసీ కెమెరాలు అమర్చింది. దశలవారీగా ఈ ప్రాజెక్టును రాష్ట్రమంతా విస్తరించే యోచనలో ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేయాలన్న పట్టుదలతో ఉంది. వాస్తవానికి ఈ నిర్మాణాన్ని డిసెంబర్లోనే ప్రారంభిస్తారని వార్తలు వచ్చినా.. అది సాకారం కాలేదు. ఇటీవల రాచకొండ కమిషనరేట్ నూతన భవనాన్ని రూ.5.1 కోట్లతో పూర్తిచేసిన విషయం తెలిసిందే. ఇక మిగిలిన కొత్త కమిషనరేట్లు సిద్దిపేట, రామగుండం నిర్మాణం కూడా వేగం పుంజుకుంది. నూతనంగా ఏర్పడిన 21 జిల్లాలతోపాటు ఇటీవల కొత్తగా ఆవిర్భవించిన ములుగు, నారాయణపేట జిల్లాల్లో ఎస్పీ కార్యాలయాలు, కొత్త మండలాల్లో మోడల్ పోలీస్ స్టేషన్లు, స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన 18,000 పోస్టుల భర్తీ చేపడితే పోలీసులపై పనిభారం కొంతమేర తగ్గనుంది. -
నిరుద్యోగ భృతికి 1,810 కోట్లు
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులకు తాజా బడ్జెట్ భారీ ఊరటనిచ్చింది. ఎన్నికల హామీలో భాగంగా నిరుద్యోగులకు నెలకు రూ.3,016 ఆర్థిక సాయం ఇస్తామని టీఆర్ఎస్ చేసిన హామీని నిలబెట్టుకుంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 2019–20 బడ్జెట్లో నిరుద్యోగుల భృతికి భారీ మొత్తంలో నిధులు కేటాయించారు. ఈ వార్షికానికి రూ.1,810 కోట్లు బడ్జెట్లో పొందుపర్చారు. ప్రస్తుత బడ్జెట్లో నిధులు కేటాయించిన ప్రభుత్వం నిరుద్యోగ భృతికి మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ఆదేశించింది. తాజాగా బడ్జెట్లో పేర్కొన్న నిధులతో ఏడాదిపాటు ఐదులక్షల మందికి నిరుద్యోగ భృతి అందించవచ్చు. నిరుద్యోగులు 13.65 లక్షలు నిరుద్యోగుల గణాంకాలపై ప్రభుత్వం వద్ద స్పష్టమైన వివరాల్లేవు. నిరుద్యోగ భృతికి ఎంప్లాయిమెంట్ ఎక్సే్చంజ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా ఎంప్లాయిమెంట్ ఎక్సే్చంజ్‌లో 13.65 లక్షల మంది నమోదయినట్లు కార్మిక, ఉపాధి కల్పన శాఖ గణాం కాలు చెబుతున్నాయి. సాధారణంగా పదోతరగతి పూర్తి చేసుకున్న ప్రతి వ్యక్తి ఎంప్లాయిమెంట్ ఎక్సే్చంజ్‌లో నమోదు చేసుకోవాలి. అలా నమోదు పత్రాన్ని చూపిన తర్వాతే ఉద్యోగాల్లో చేరేందుకు అర్హత ఇవ్వాలని ఎంప్లాయిమెంట్ ఎక్సే్చంజ్ నిబంధనలున్నాయి. కానీ వీటి అమలు పక్కాగా జరగడం లేదు. కొన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు మాత్రమే ఎంప్లాయి మెంట్ ఎక్సే్చంజి నిబంధనలు అమలు చేస్తు న్నాయి. ఈ నేపథ్యంలో సీనియార్టీ కోసమో, లేక ఇతర ఆధారాల కోసం తప్ప పేరు నమోదుపై నిరుద్యోగులు సైతం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తాజాగా ఎంప్లాయిమెంట్ ఎక్సే్చంజి ఆన్లైన్ నమోదుకు అవకాశం ఇవ్వడంతో రెండేళ్లలో అద నంగా 5లక్షల మంది నమోదు చేసుకున్నారు. మరోవైపు ఉద్యోగాల భర్తీకి సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఓటీఆర్ (ఒన్‌టైమ్ రిజిస్ట్రేషన్) నమోదుకే పరిమితం చేస్తున్నాయి. ప్రస్తుతం టీఎస్పీఎస్సీలో ఓటీఆర్ చేసుకున్న వారి సంఖ్య 20 లక్షలకు పైమాటే. నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం మార్గదర్శ కాలు రూపొందిస్తే కేటగిరీల వారీగా ఉన్న నిరు ద్యోగుల లెక్కలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
నిధుల కేటాయింపుల్లో వెనుకబాటు..
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్లో బీసీసంక్షేమానికి ప్రాధా న్యం తగ్గింది. 2019–20 వార్షిక సంవత్సరా నికి వెనుకబడిన తరగతుల సంక్షేమానికి రూ.4,528.01 కోట్లు మాత్రమే కేటాయించింది. గత కేటాయింపు లతో పోలిస్తే ఈసారి బడ్జెట్లో బీసీ సంక్షేమానికి రూ.1,391.82 కోట్లు తగ్గింది. జనాభాలో సగం ఉన్న బీసీలకు ప్రత్యేక అభివృద్ధి నిధి కేటాయించా లని గత కొంతకాలంగా డిమాండ్ వస్తుండగా 2017 డిసెంబర్ నెలలో బీసీల సంక్షేమంపై సీఎం కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో 2018– 19 వార్షిక బడ్జెట్లో బీసీ ప్రత్యేక అభివృద్ధి నిధిని అమల్లోకి తీసుకొస్తారని అంతా భావించినా బడ్జెట్ కేటాయింపుల్లో రూ. 850కోట్లు అదనంగా కేటాయించి కొంత ప్రాధాన్యమిచ్చారు. ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లో అదే తరహా ప్రాధాన్యం దక్కు తుందని భావించినా తాజా బడ్జెట్ గణాంకాలను చూస్తే పెద్ద మొత్తానికి కోత పెట్టడం గమనార్హం. అత్యంత వెనుకబడిన కులాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. 2017–18 వార్షిక సంవత్సరంలో ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించింది. అదేతరహాలో 2018–19లో రూ.వెయ్యి కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది బడ్జెట్లో కూడా రూ. 1,000 కోట్లు కేటాయించింది. తొలి ఏడాది నిధులు కేటాయించినా ఎంబీసీలపై స్పష్టత రాకపోవడంతో ఆ నిధులను ఖర్చు చేయ లేదు. ప్రస్తుత వార్షిక సంవత్సరంలో ఎంబీసీలపై ప్రభుత్వం స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు విడుదల చేసినా.. ఎంబీసీ కార్పొరేషన్ మాత్రం రూ.50కోట్లు ఖర్చు చేసి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. కానీ రాయితీ రుణాలు, స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుపై పెద్దగా స్పందన లేదు. తాజా బడ్జెట్లో రూ. 1,000 కోట్లు కేటాయించగా ఈ సారైనా పూర్తిస్థాయిలో ఖర్చు చేస్తారో లేదో చూడాలి. అయితే బీసీ కార్పొరేషన్, 12 బీసీ ఫెడరేషన్లకు బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేదు. 2019–20 వార్షిక సంవత్సరంలో రాష్ట్రంలో 119 బీసీ గురుకులాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో బీసీలకు 23 గురుకులాలే ఉండగా.. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని 2017–18 వార్షిక సంవత్సరంలో 119 గురుకులాలను ఏర్పాటు చేసింది. తాజాగా మరో 119 గురుకులాలకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఈ ఏడాది జూన్‌లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. సంక్షేమానికి తగ్గిన కేటాయింపులు గతేడాది కంటే రూ.170.58 కోట్లు తక్కువ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో మహిళాభివృద్ధి, శిశు, వికలాంగ సంక్షేమానికి ప్రాధాన్యత దక్కలేదు. 2019–20 వార్షిక సంవత్సరానికి ఈ శాఖకు రూ.1,628.24 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే తాజా కేటాయింపుల్లో రూ.170.58 కోట్లు తగ్గింది. 2018–19 వార్షిక సంవత్సరంలో ఈ శాఖకు రూ.1,798.82 కోట్లు, 2017–18లో రూ.1,731.50 కోట్లు చొప్పున ప్రభుత్వం కేటాయిం చింది. కొత్త పథకాలేవీ ప్రవేశపెట్టనప్పటికీ గతేడాది నుంచి అమల్లోకి వచ్చి న స్త్రీ శక్తి కేంద్రాలు, సఖి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకోలేదు. పశుసంవర్ధక, మత్స్యశాఖకు 1,204 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పశుసంవర్ధక, మత్స్యశాఖకు రూ.1,204.97 కోట్లు కేటాయించింది. ఇందులో పశుసంవర్థక శాఖకు రూ.650 కోట్ల నిధులు ఉన్నాయి. పశువులకు సంబంధించిన మందుల కొనుగోలు, గడ్డి విత్తనాల పంపిణీ, ఇతర పథకాల అమలు, సిబ్బంది వేతనాలకు కలిపి రూ.200 కోట్లు ప్రతిపాదించింది. విజయ డెయిరీకి పాలు పోస్తున్న పాడి రైతులకు లీటరు పాలపై రూ.4 ప్రోత్సాహకం చెల్లిస్తున్నారు. మరో 4 ప్రైవేట్ డెయిరీలకు పాలు, 2.13 లక్షల మంది రైతులకు ప్రోత్సాహకం ఇస్తున్నారు. మత్స్యశాఖకు రూ.320 కోట్లు ప్రతిపాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చేప పిల్లల పంపిణీ, రొయ్యల పెంపకానికి నిధులు ప్రతిపాదించారు. -
చదివింపులు 'అరకొర'
పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్యకు రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు తగ్గుతున్నాయి. గత రెండేళ్లలో నిధుల కేటాయింపులు ఎక్కువే అనిపించినా, పెరుగుతున్న రాష్ట్ర బడ్జెట్‌ను బట్టి చూస్తే విద్యా శాఖ వాటా తగ్గిపోతోంది. ఈ ప్రభావం అభివృద్ధి కార్యక్రమాలపై పడుతోందన్న విమర్శలున్నాయి. ఈసారైతే రాష్ట్ర బడ్జెట్లో వాటా కాదు నిధుల పరంగా చూసినా విద్యాశాఖకు బడ్జెట్ కేటాయింపులు తగ్గాయి. 2014–15 ఆర్థిక సంవత్సరంలో విద్యాశాఖకు కేటాయించిన మొత్తం.. రాష్ట్ర బడ్జెట్లో 10.88 శాతం కాగా, ఇప్పుడు 6.71 శాతానికి పడిపోయింది. పాఠశాల విద్యకు ఎక్కువ మొత్తంలో బడ్జెట్ తగ్గింది. విద్యాశాఖ అధికారులు దాదాపు రూ.15 కోట్లకు పైగా బడ్జెట్ కావాలని ప్రతిపాదిస్తే ప్రభుత్వం రూ.12,220.78 కోట్లే కేటాయించింది. ఇవి విద్యాశాఖకు ఏ మూలకూ సరిపోవని పలు ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడ్డాయి. ఏ విభాగానికి ఎంత బడ్జెట్ కేటాయించారన్న స్పష్టత లేదని చెబుతున్నారు. పాఠశాల విద్యాశాఖకు కేటాయించిన బడ్జెట్ వేతనాల చెల్లింపులు, నిర్వహణ ఖర్చులకే సరిపోతాయని అంటున్నారు. – సాక్షి, హైదరాబాద్ క్రమంగా తగ్గిపోతున్న విద్యాశాఖ వాటా.. రాష్ట్రం ఏర్పడిన తరువాత బడ్జెట్లో విద్యారంగం వాటా పరిస్థితిని పరిశీలిస్తే క్రమంగా తగ్గుతూ వస్తోంది. మొదటి రెండు ఆర్థిక సంవత్సరాల్లో విద్యాశాఖకు రాష్ట్ర బడ్జెట్లో వాటా తగ్గినా నిధులపరంగా కొంత బాగానే ఉంది. 2016–17 ఆర్థిక సంవత్సరం వచ్చే సరికి రాష్ట్ర బడ్జెట్ పెరిగినా, విద్యాశాఖ వాటా పెరగకపోగా తగ్గిపోయింది. 2014–15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ రూ. 1,00,637 కోట్లు కాగా, విద్యాశాఖకు రూ. 10,963 కోట్లు (రాష్ట్ర బడ్జెట్లో 10.88%) కేటాయించింది. 2015–16లో రాష్ట్ర బడ్జెట్ 1,15,689కోట్లు కాగా విద్యాశాఖకు రూ. 11,216 కోట్లు (9.69%) కేటాయించింది. 2016– 17లో రాష్ట్ర బడ్జెట్ రూ. 1,30,415 కోట్లు కాగా, విద్యాశాఖకు మాత్రం రూ. 10,738 కోట్లకు తగ్గిపోయింది. 2017–18లోనూ రాష్ట్ర బడ్జెట్ 1,49,453 కోట్లకు పెరిగింది. ఇందులో విద్యా శాఖ బడ్జెట్ రూ. 12,278 కోట్లకు పెరిగినా మొత్తం బడ్జెట్లో విద్యాశాఖ వాటా చూస్తే 8.49 శాతానికే పరిమితం అయింది. అంతకుముందు సంవత్స రంతో పోల్చితే 2018–19లో విద్యా శాఖ బడ్జెట్ రూ. 500 కోట్లకు పైగా పెరిగి రూ. 13,278 కోట్లకు చేరుకుంది. వాటా పరంగా చూస్తే 7.61 శాతమే. ఈసారి బడ్జెట్ కేటాయింపులు చూస్తే వాటానే కాదు.. నిధుల పరంగా చూసినా గతేడాది కంటే విద్యాశాఖకు కేటాయింపులు తగ్గిపోయాయి. 2018–19లో రాష్ట్ర బడ్జెట్ 1,74,453 కోట్లు కాగా విద్యాశాఖకు రూ. 13,278 కోట్లు కేటాయించిన ప్రభు త్వం.. ఈసారి రూ. 1,058 కోట్లు తగ్గించి రూ. 12,220.78 కోట్లకు పరిమితం చేసింది. రాష్ట్ర బడ్జెట్‌తో పోల్చితే ఈసారి విద్యాశాఖ వాటా 6.71 శాతానికి పడిపోయింది. ఉన్నత, సాంకేతిక విద్యలోనూ తగ్గిన కేటాయింపులు ఉన్నత విద్య, సాంకేతిక విద్యాశాఖలకు కేటాయించిన బడ్జెట్ గతేడాది కంటే ఈసారి రూ. 250 కోట్ల వరకు తగ్గిపోయింది. గత ఏడాది ఉన్నత విద్యకు రూ. 2,205.57 కోట్లు కేటా యించిన ప్రభుత్వం ఈసారి రూ. 1,916.85 కోట్లు కేటాయిం చింది. సాంకేతిక విద్యకు 2018–19లో రూ. 422.32 కోట్లు కేటాయించగా. ఈసారి దానిని రూ. 394.93 కోట్లకు పరిమితం చేసింది. ఉన్నత విద్యలో యూనివర్సిటీలకు కేటాయింపుల అంశంపై వివరాలు ఇవ్వకపోవడంతో తమకు ఎంత వచ్చిందన్నది తెలియని పరిస్థితి నెలకొంది. రూ. 13 వేల కోట్లు కావాలన్నా.. పాఠశాల విద్యా శాఖకు, వివిధ పథకాల నిర్వహణకు రూ. 13 వేల కోట్లు కావాలని పాఠశాల విద్యా శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. కానీ ప్రభుత్వం రూ. 9,909 కోట్లు మాత్రమే కేటాయించింది. కనీసం గతేడాది సవరించిన బడ్జెట్ ప్రకారం కూడా కేటాయింపులు జరపలేదు. 2016–17లో పాఠశాల విద్యకు రూ. 8,224.63 కోట్లు కేటాయించగా, 2017–18లో రూ. 10,215.30 కోట్లు కేటాయించి దానిని రూ. 10,197.22 కోట్లకు సవరించింది. 2018–19లో రూ. 10,830.30 కోట్లు కేటాయించగా, ఇప్పుడు రూ.9,909 కోట్లకు తగ్గింది. దీంతో పాఠశాల విద్యాశాఖకు కేటాయింపుల్లోనే భారీగా కోత పడింది. ఈ కోత నిర్వహణ వ్యయంలో పడిందా? పథకాల్లో తగ్గిందా? అన్నది తేలాల్సి ఉంది. ఈ బడ్జెట్ ఏ మూలకూ సరిపోదు విద్యాశాఖకు ఈ బడ్జెట్ ఏ మూలకూ సరిపోదు. వేతనాలు, నిర్వహణ ఖర్చులకే ఇది సరిపోతుంది. గతంలో చేసిన చేసిన కేటాయింపులకంటే తగ్గించడం దారుణం. పెరిగిన రాష్ట్ర బడ్జెట్‌కు అనుగుణంగా దీనిని పెంచా ల్సిందే. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ, ఇంగ్లిషు మీడియం విద్యా బోధనకు నిధులు లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం పునరాలోచంచి బడ్జెట్‌ను పెంచాలి. – చావ రవి, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి దక్షిణాది రాష్ట్రాల్లోనే అతి తక్కువ కేటాయింపులు ఇవీ విద్యాశాఖకు కేటాయించిన ఈ బడ్జెట్ దక్షిణాది రాష్ట్రాల్లోనే తక్కువ. ఈ రాష్ట్రంలోనూ విద్యకు ఇంత తక్కువ కేటాయింపులు లేవు. కాలేజీలు, విశ్వ విద్యాలయాల్లో ఫ్యాకల్టీ నియామకాలు, వసతుల కల్పనకు ఈ బడ్జెట్ సరిపోదు. ఇంత తక్కువ నిధులతో ప్రభుత్వ విద్యా సంస్థలు మరింత పతనమయ్యే ప్రమాదం ఉంది. – నారాయణ, తల్లిదండ్రుల సంఘం మరిన్ని నిధులను కేటాయించాలి.. పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు, నాణ్యత ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రభుత్వం మరిన్ని నిధులను విద్యాశాఖకు కేటాయించాలి. ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఎక్కువ నిధులను కేటాయించాలి. ఆ దిశగా సీఎం ఆలోచనలు చేయాలి. – గౌరు సతీష్ ప్రైవేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం పశుసంవర్ధక, మత్స్యశాఖకు 1,204 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పశుసంవర్ధక, మత్స్యశాఖకు రూ.1,204.97 కోట్లు కేటాయించింది. ఇందులో పశుసంవర్థక శాఖకు రూ.650 కోట్ల నిధులు ఉన్నాయి. పశువులకు సంబంధించిన మందుల కొనుగోలు, గడ్డి విత్తనాల పంపిణీ, ఇతర పథకాల అమలు, సిబ్బంది వేతనాలకు కలిపి రూ.200 కోట్లు ప్రతిపాదించింది. విజయ డెయిరీకి పాలు పోస్తున్న పాడి రైతులకు లీటరు పాలపై రూ.4 ప్రోత్సాహకం చెల్లిస్తున్నారు. మరో 4 ప్రైవేట్ డెయిరీలకు పాలు, 2.13 లక్షల మంది రైతులకు ప్రోత్సాహకం ఇస్తున్నారు. మత్స్యశాఖకు రూ.320 కోట్లు ప్రతిపాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చేప పిల్లల పంపిణీ, రొయ్యల పెంపకానికి నిధులు ప్రతిపాదించారు. సంక్షేమానికి తగ్గిన కేటాయింపులు గతేడాది కంటే రూ.170.58 కోట్లు తక్కువ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో మహిళాభివృద్ధి, శిశు, వికలాంగ సంక్షేమానికి ప్రాధాన్యత దక్కలేదు. 2019–20 వార్షిక సంవత్సరానికి ఈ శాఖకు రూ.1,628.24 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే తాజా కేటాయింపుల్లో రూ.170.58 కోట్లు తగ్గింది. 2018–19 వార్షిక సంవత్సరంలో ఈ శాఖకు రూ.1,798.82 కోట్లు, 2017–18లో రూ.1,731.50 కోట్లు చొప్పున ప్రభుత్వం కేటాయిం చింది. కొత్త పథకాలేవీ ప్రవేశపెట్టనప్పటికీ గతేడాది నుంచి అమల్లోకి వచ్చి న స్త్రీ శక్తి కేంద్రాలు, సఖి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకోలేదు. -
పౌరసరఫరాలకు రూ.202 కోట్లు కోత
సాక్షి, హైదరాబాద్: పౌర సరఫరాల శాఖకు ఈ యేడాది బడ్జెట్ కేటాయింపులు తగ్గాయి. గతేడాదితో పోలిస్తే ఈ యేడాది రూ.202 కోట్ల మేర బడ్జెట్లో కోత పెట్టారు. గతేడాది బడ్జెట్లో బియ్యం సబ్సిడీలు కలుపుకొని మొత్తంగా రూ.2,946 కోట్లు కేటాయించగా, ఈ యేడాది రూ.2,744 కోట్లు కేటాయించారు. జూనియర్, డిగ్రీ కళాశాలల్లో సైతం సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టాలని గత ప్రభుత్వంలో ఆలోచనలు సాగినా.. దానిపై ఎలాంటి ప్రకటన చేయలేదు, నిధులూ కేటాయించలేదు. ఎస్సీ, ఎస్టీ అభివృద్ధికిరూ.26,408 కోట్లు సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికోసం కేటాయించిన ప్రత్యేక అభివృద్ధి నిధికి రాష్ట్ర ప్రభుత్వం ఈసారీ భారీగా నిధులు కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద 2019–20లో రూ.26,408 కోట్లు చొప్పున కేటాయింపులు జరిపింది. ఇందులో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.16,581 కోట్లు, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.9,827 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఎస్సీఎస్‌డీఎఫ్‌కు అదనంగా రూ.128.21 కోట్లు, ఎస్టీ ఎస్డీఎఫ్కు అదనంగా రూ. 133.89 కోట్లు కేటాయించారు. ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టంలో పొందుపర్చిన నిబంధనల ప్రకారం మిగులు నిధులను క్యారీఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం వార్షిక సంవత్సరం ఖర్చులు తేలిన తర్వాత నిధులను క్యారీఫార్వర్డ్ చేసే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. -
సాగునీటికి నిధుల వరద
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో సాగునీటి రంగానికి ఎప్పటిలాగే అగ్రపీఠం దక్కింది. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణాలు శరవేగంగా పూర్తి చేసేలా, చిన్న నీటి వనరులకు పునరుత్తేజం ఇచ్చేలా బడ్జెట్లో రూ.22,500 కోట్ల మేర కేటాయించింది. ఇందులో భారీ, మధ్య తరహా ప్రాజెక్టులకు రూ.20,120.34 కోట్లు, మైనర్‌కు రూ.2,379.66కోట్లు కేటాయించింది. అయితే.. గత మూడేళ్ల బడ్జెట్‌తో పోలిస్తే సాగునీటిపారుదల రంగానికి ఈ ఏడాది రూ.2,250 కోట్లమేర కేటాయింపులు తగ్గాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావస్తుండటం, దీనికి ఇదివరకే ఏర్పాటు చేసిన కార్పోరేషన్ ద్వారా రుణాలు తీసుకునే వెసులుబాటు ఉన్న నేపథ్యంలో బడ్జెట్‌ను తగ్గించినట్లు నీటిపారుదల వర్గాలు వెల్లడించాయి. తగ్గిన కేటాయింపు: గతేడాది బడ్జెట్‌తో పోలిస్తే ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులు తగ్గాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో భారీ ప్రాజెక్టులకు రూ.21,890 కోట్ల మేర కేటాయింపులు చేయగా, ఈ ఏడాది దాన్ని రూ.20.120.34కోట్లకు కుదించారు. సుమారు ఇక్కడే రూ.1,770కోట్ల మేర కేటాయింపులు తగ్గాయి. మైనర్ ఇరిగేషన్ కింద గతేడాది రూ.2,743కోట్లు కేటయింపులు జరపగా, ఈ ఏడాది అవి రూ.2,371కోట్లకు తగ్గింది. ఇక్కడ రూ.364కోట్ల మేర తగ్గింది. ఇక గతేడాది 2018–19 ఏడాదిలో సాగునీటికి రూ.25వేల కోట్లు కేటాయింపులు జరగ్గా, జనవరి 31 నాటికి రూ.21,489 కోట్లు ఖర్చు చేసినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. ఇందులో ఎక్కువగా కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధుల సమీకరణ కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ద్వారా రూ.12,739.67కోట్ల మేర రుణాలు తీసుకుని బిల్లులు చెల్లించారు. ఇక సీతారామ, దేవాదుల, ఎఫ్ఎఫ్సీ, ఎస్సారెస్పీ–2లను కలిపి ఏర్పాటు చేసిన మరో కార్పొరేషన్ ద్వారా రూ.2,800 కోట్ల రుణాలు తీసుకున్నారు. మొత్తంగా సుమారు రూ.13వేల కోట్లు రుణాల ద్వారానే ఖర్చు చేసింది. ఈ ఏడాది సైతం ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో రూ.10,430కోట్ల నిధులను కార్పోరేషన్ రుణాల ద్వారానే ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్లో ప్రాజెక్టులవారీగా కేటాయింపుల వివరాలు వెల్లడించనప్పటికీ, భారీ ప్రాజెక్టులకు కేటాయించిన నిధుల్లో కాళేశ్వరం ప్రాజెక్టుకే ఎక్కువ నిధులు దక్కనున్నట్లు నీటిపారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు రూ.5,898 కోట్లతో ప్రతిపాదనలు పంపగా, రూ.5,500 కోట్ల మేర ఆర్థికశాఖ కేటాయింపులు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక తర్వాతి స్థానంలో పాలమూరు–రంగారెడ్డికి రూ.2,732 కోట్లతో ప్రతిపాదనలు చేయగా, రూ.2,500 కోట్లకు ఓకే చెప్పినట్లుగా సమాచారం. దేవాదుల, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులకు సైతం వెయ్యి కోట్లకు పైగా కేటాయింపులు ఉంటాయని ఆ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక నిర్మాణ చివరి దశలో ఉన్న పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులకు రూ.1,085కోట్ల మేర బడ్జెట్ కోరగా, వీటికి పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయింపులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో దేవాదుల, ఎస్సారెస్పీ–2, కాళేశ్వరం, వరదల కాల్వ, ఎల్లంపల్లి దిగువన మెజార్టీ ఆయకట్టుకు నీళ్లివ్వాలని ప్రభుత్వం ఇదివరకే లక్ష్యం నిర్ణయించినందున వాటికి అవసరాలకు తగ్గట్లే మొత్తం బడ్జెట్లో కేటాయింపులు జరుగనున్నాయి. గొలుసుకట్టు చెరువులకు ఊతం రాష్ట్రంలో ఇప్పటిరవకు మిషన్ కాకతీయ కింద 20,171 చెరువుల పునరుద్ధరణ పూర్తయింది. అయితే ఈ ఏడాది నుంచి కొత్తగా గొలుసుకట్టు చెరువులను అభివృధ్ది చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో గొలుసుకట్టు కింద 27,800 చెరువులున్నాయి. గొలుసుకట్టులోని మొదటి చెరువు నిండి, కింది చెరువు వరకు నీరు పారే విధంగా కాల్వలను బాగు చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది నుంచే కాల్వల ద్వారా చెరువులు నింపే కార్యాచరణ సిద్ధమవుతోంది. దీనికోసం మైనర్ ఇరిగేషన్ కింద 2,377.66 కోట్లు కేటాయించారు. ఇందులో 1,200 కోట్ల వరకు గొలుసుకట్టు చెరువుల అభివృద్ధికే కేటాయించనుండగా, మిగతా నిధులు చెక్‌డ్యామ్‌లు, ఐడీసీలోని ఎత్తిపోతల పథకాల నిర్మాణాలకు ఖర్చు చేసే అవకాశం ఉంది. -
రోడ్లకు తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: రోడ్లు, భవనాల శాఖ అద్భుతమైన పనితీరు చూపుతున్నా నిధులలేమితో ఈ ఏడాదంతా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరింత దిగజారేలా కనిపిస్తోంది. గతేడాది రూ.5,575 కోట్లు కేటాయించి ఈసారి రూ.2218.73 కోట్లతో సరిపెట్టింది. గతేడాది కాంట్రాక్టర్లకు చేసిన పనులకే బిల్లులు చెల్లించలేనంతగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. గత బడ్జెట్ లో రూ.5,575 కోట్లు కేటాయించినా వాస్తవానికి రూ.2,177 కోట్లు (ఇందులో రూ.1000 కోట్ల మేర అప్పులు) విడుదల చేసింది. మిగిలిన వాటికి అప్పు తెచ్చుకోమని చెప్పింది. మొత్తానికి ఈసారీ ఆర్ అండ్ బీకి అప్పులవేట తప్పేలా లేదు. ఈ నిధులపై ఆర్ అండ్ బీకి మరింత కష్టాలు తప్పవని శాఖ ఉద్యోగులూ వాపోతున్నారు. అద్దంలాంటి రోడ్లు ఉండాలన్న సీఎం నినాదం ఈ నిధులతో ఎలా సాకారమవుతుందన్న ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్ర అవతరణ తర్వాత 3,155 కి.మీ.ల రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించేందుకు కేంద్రం అంగీకరించింది. ఇందులో 1,388 కి.మీల మేర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించింది. మిగిలిన 1,767 కి.మీ.ల మేర రోడ్ల గుర్తింపును ఖరారు చేయాల్సి ఉంది. -
'లక్ష'మేవ జయతే!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రాష్ట్రం హక్కుగా ఉన్న నికర, మిగులు జలాల్లోని నిర్ణీత వాటాలను సంపూర్ణంగా వినియోగం లోకి తేవడం, సుమారు రూ.2లక్షల కోట్ల ఖర్చుతో.. 1.25కోట్ల ఎకరాలకు పైగా సాగునీరందించే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణం ఓ యజ్ఞంలా సాగుతోంది. నిర్మాణంలో ఉన్న భారీ, మధ్యతరహా ప్రాజెక్టులతోపాటు.. కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా నియోజకవర్గానికి లక్ష ఎకరాల భూమికి సాగు యోగ్యత కల్పించడం లక్ష్యంగా సర్కారు ముందుకు సాగుతోంది. రాష్ట్ర పరీవాహకంలో లభించే ప్రతి నీటిచుక్కనూ పరీవాహక ఆయ కట్టుకు మళ్లించడం, అవసరాలకు తగ్గట్టుగా నిల్వ, వినియోగం.. వరదలు వచ్చినపుడు గరిష్టంగా వీలైనంత నీటిని ఒడిసిపట్టు కునేందుకు చేస్తున్న భగీరథ యజ్ఞంలో ఇప్పటికే కొత్తగా 16.65లక్షల ఎకరాల మేర కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చింది. ఈ ఏడాది ఖరీఫ్ నాటికి మరో 10లక్షల ఎకరాలను సాగులోకి తేనుంది. ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టులపై లక్ష కోట్ల ఖర్చు చేయగా.. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఏకంగా రూ.70వేల కోట్ల ఖర్చు చేసి కొత్త రికార్డులు నెలకొల్పింది. మరో లక్ష కోట్లు ఖర్చు చేసైనా.. కోటికిపైగా ఎకరాలకు నీరిందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రికార్డు స్థాయిలో ఖర్చు.. రుణాలే కీలకం! మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో సాగునీటిపై ప్రభుత్వం నిధులు ఖర్చు చేసింది. ఐదేళ్లలో సాగునీటికై రూ.70వేల కోట్ల మేర ఖర్చు చేసింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.20,040కోట్ల మేర నిధులు ఖర్చు చేయగా.. 2018–19 ఆర్థిక సంవత్సరంలో జనవరి మాసాంతానికి రూ.21,489కోట్లు ఖర్చు చేశారు. ఇది మార్చి నాటికి రూ.23వేల కోట్లకు చేరే అవకాశం ఉంది. 2017–18లో కాళేశ్వరం ప్రాజెక్టుకే రూ.13,107కోట్లు మేర ఖర్చు చేయగా, కార్పొరేషన్ రుణాల ద్వారానే రూ.9,013కోట్లు ఖర్చుచేశారు. ఈ ఏడాది ఏకంగా రూ.15వేల కోట్ల మేర ఖర్చు చేయగా, ఇందులో రుణాల ద్వారా రూ.12,739కోట్లు ఖర్చుచేశారు. ఇక దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ, వరద కాల్వలకు కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేయగా, వీటి ద్వారా మరో రూ.2,800 కోట్లు ఖర్చు చేశారు. ఇక పాలమూరు–రంగారెడ్డికి సైతం ఈసారి రూ.17వేల కోట్ల రుణాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే జరిగితే మొత్తంగా ప్రభుత్వం తీసుకునే రుణాలు రూ.70వేల కోట్లను చేరనున్నాయి. నిర్వహణకే తడిసి మోపెడు! రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భారీ సాగునీటి ఎత్తిపోతల పథకాల నిర్వహణ మున్ముందు కత్తిమీద సాము కానుంది. ఎత్తిపోతల పథకాల ద్వారా నిర్ణీత ఆయకట్టుకు నీటిని మళ్లించాలంటే విద్యుత్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం)కే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి రానుంది. 2020–21 నుంచి 2024–25 వరకు రానున్న ఐదేళ్ల కాలానికి ఏకంగా విద్యుత్ అవసరాలకు వెచ్చించే ఖర్చు, నిర్వహణ భారం కలిపి ఏకంగా రూ.40,170కోట్లు ఉంటుందని నీటి పారుదల శాఖ అంచనా వేస్తోంది. ఇందులో విద్యుత్ అవసరాల ఖర్చే ఏకంగా రూ.37,796కోట్లు ఉండగా, ఓఅండ్‌ఎంకు అయ్యే వ్యయం రూ.2,374కోట్లు ఉండనుంది. ఈ ఏడాదికే కొత్తగా 4,689 మెగావాట్ల విద్యుత్ అదనంగా అవసరంగా ఉండగా, ఇప్పటికే ఉన్న అవసరంతోకలిపి అది 6,099 మెగావాట్లకు చేరనుంది. మొత్తంగా 2021–22 నాటికి మొత్తం ఎత్తిపోతల పథకాలు నిర్వహణలోకి వస్తే 11,722 మెగావాట్ల మేర విద్యుత్ అవసరం అవుతుంది. ఆయకట్టు.. పనిపట్టు! ఇక రాష్ట్రంలో మొత్తంగా 1.25 కోట్ల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఇప్పటికే 70లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇందులో జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల కింద 2004 నుంచి ఇంతవరకు 16.65లక్షల ఎకరాలమేర సాగులోకి రాగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు ఏకంగా 12.78లక్షల ఎకరాలను సాగులోకి తేగలిగింది. మరో 54లక్షల ఎకరాలను వృద్ధిలోకి తేవాల్సి ఉంది. ఇందులో ఈ ఏడాది జూన్ ఖరీఫ్ నాటికి కనిష్టంగా 12లక్షల ఎకరాలకైనా కొత్తగా నీటిని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అనుకున్న ఆయకట్టు లక్ష్యాలను చేరాలంటే భూసేకరణ అత్యంత కీలకంగా మారనుంది. ప్రాజెక్టుల పరిధిలో మరో 58వేలకు పైగా భూమి సేకరించాల్సి ఉండటం ప్రభుత్వానికి పరీక్ష పెడుతోంది. ‘కాకతీయ’కు నిధుల కరువు చిన్న నీటివనరుల పునరుద్ధరణకై చేపట్టిన మిషన్ కాకతీయ అనుకున్న లక్ష్యాలని చేరింది. మొత్తం 4 విడతల ద్వారా చేపట్టిన పనులతో 8టీఎంసీల నీటి నిల్వ పెరగడంతో పాటు 13.8లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. అయితే 3,4వ విడత పనుల పూర్తికి 800 కోట్ల మేర బిల్లుల చెల్లింపు ప్రక్రియ నిలిచిపోవడంతో ఈ పనులు పూర్తి జరగడం లేదు. కాళేశ్వరా.. కదిలిరా! ఈ ఏడాదిలో రైతుల ఆశలన్నీ కాళేశ్వరం ద్వారా మళ్లించే గోదావరి జలాలపైనే ఉన్నాయి. ఖరీఫ్ నాటికి కనిష్టంగా 100 టీఎంసీల నీటిని ఆయకట్టుకు మళ్లిస్తారని రైతులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 13 జిల్లాల్లోని 18.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, మరో 18.82 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం మేడిగడ్డ బ్యారేజీ నుంచి 195 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు ప్రణాళిక రూపొందించగా, ఇందులో ఇప్పటికే మెజార్టీ పనులు పూర్తయ్యాయి. బ్యారేజీల్లో గేట్ల బిగింపు పూర్తవుతుండగా, పంప్‌హౌజ్‌లో మోటార్ల బిగింపు ప్రక్రియలో వేగం పెరిగింది. ఎట్టిపరిస్థితుల్లో మార్చి, ఏప్రిల్ నాటికి మిడ్‌మానేరు వరకు పనులు పూర్తిచేసి కనిష్టంగా 90–100 టీఎంసీల నీటిని తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఇక మిడ్‌మానేరు కింద మల్లన్నసాగర్ రిజర్వాయర్పనులు జరుగకున్నా, ప్రత్యేకంగా నిర్మిస్తున్న ఫీడర్ ఛానల్ ద్వారా 15 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతున్న కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌కు నీటిని తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మేడిగడ్డ మొదలు కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని తరలించడం ద్వారా 8–9 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం ఏర్పడనుంది. -
వడ్డీ చెల్లింపులకు రూ.13వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది బడ్జెట్ అంచనాల్లో 7 శాతం మేర.. చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడానికి సరిపోతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ మేరకు 2019–20 బడ్జెట్ అంచనాలకు సంబంధించిన రెవెన్యూ ఖాతా వ్యయపట్టికలో రూ.12,907.99 కోట్లు వడ్డీ చెల్లింపులకు ప్రతిపాదించారు. అన్ని వనరుల నుంచి తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించేందుకుగాను ఈ మొత్తాన్ని చూపెట్టారు. 2018–19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది రూ.1,200 కోట్లు అధికం కావడం గమనార్హం. అప్పుల కుప్ప: ఇక, వచ్చే ఏడాది కూడా పెద్దఎత్తున రుణాలు అవసరమవుతాయని బడ్జెట్ అంచనా లెక్కలు చెపుతున్నాయి. ఏ రూపంలో అయినా రూ.33వేల కోట్ల మేర అప్పుల ద్వారా సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అంతర్గత రుణం రూ.32,758 కోట్లుగా రాబడుల వివరణలో ప్రభుత్వం పేర్కొంది. దీనికి తోడు ఇప్పటికే కేంద్రం నుంచి అడ్వాన్సుగా రూ.800 కోట్లు తీసుకున్న మొత్తంతో కలిపి వచ్చే ఏడాది కొత్త రుణం రూ.33,558 కోట్లుగా చూపెట్టింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో 32,400 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అప్పుల రూపంలో సమీకరించగా, వచ్చే ఏడాది ప్రతిపాదిత రుణం గత ఏడాది కన్నా రూ.1,100 కోట్లు అధికంగా కనిపిస్తోంది. గృహనిర్మాణం కింద రూ.2,550 కోట్లు, పట్టణాభివృద్ధి కింద రూ.4,800 కోట్లు, విద్యుచ్ఛక్తి ప్రాజెక్టుల పేరుతో రూ.400 కోట్లు కలిపి మరో 7,800 కోట్లను కూడా అప్పులుగా సమీకరించనుంది. దీంతో వచ్చే ఏడాది అప్పుల అంచనా లెక్క రూ.40వేల కోట్లు దాటుతుందని అంచనా. -
‘పెట్టుబడి’కి మళ్లీ రూ.12వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్ రైతుబంధు పథకం కింద లబ్ధిదారులకు అందించే ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో లాంఛనంగా పెంచింది. తద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. 2018–19 ఖరీఫ్, రబీ సీజన్లలో ఒక్కో రైతుకు ఎకరానికి రూ. 8 వేలు ఇవ్వగా 2019–20 ఖరీఫ్, రబీల నుంచి ఎకరానికి ఏటా రూ. 10 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. వచ్చే ఖరీఫ్‌లో ప్రతి రైతుకు ఎకరాకు రూ. 5 వేల చొప్పున, రబీలో ఎకరాకు మరో రూ. 5 వేల చొప్పున అందించనుంది. 2018–19 బడ్జెట్లో రైతుబంధుకు రూ. 12 వేల కోట్లు కేటాయించగా ఈసారి కూడా అంతే మొత్తం కేటాయించింది. ఎందుకంటే గత ఖరీఫ్, రబీలకు కలిపి ఇప్పటివరకు కేవలం రూ. 9,554 కోట్లు అందించగా ఇంకా కొంత మేరకు ఇవ్వాల్సి ఉంది. దీంతో ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసుకొని ప్రభుత్వం రూ. 12 వేల కోట్లు కేటాయించినట్లు అర్థమవుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం–కిసాన్ కింద ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ. 6వేలు అందించనుండగా తెలంగాణలో మాత్రం కేంద్ర పథకంతో సంబంధం లేకుండా ప్రతి రైతుకూ పెట్టుబడి సాయం అందనుంది. పీఎం–కిసాన్ పథకానికి తెలంగాణ నుంచి దాదాపు 26 లక్షల మంది అర్హులుగా తేలారు. వారు కేంద్ర పథకం ద్వారానూ, రాష్ట్ర పథకం ద్వారానూ రెండు విధాలుగా లాభం పొందనున్నారు. ఉదాహరణకు ఐదెకరాలున్న రైతు కేంద్ర పథకం ద్వారా రూ. 6 వేలు పొందితే, అదే రైతు రైతుబంధు ద్వారా వచ్చే ఏడాదికి రూ. 50 వేలు పొందుతాడు. రెండింటి ద్వారా మొత్తంగా రూ. 56 వేల ఆర్థిక సాయం అందుకుంటాడు. పూర్తిస్థాయిలో అందని రబీ సొమ్ము... గతేడాది ఖరీఫ్‌లో ప్రభుత్వం రైతుబంధు కింద చెక్కులను పంపిణీ చేసి 51.80 లక్షల మంది రైతులకు రూ. 5,280 కోట్లు అందజేసింది. అయితే ఎన్ఆర్ఐలు, ఇతరత్రా వివాదాలుగల వారు ఉండటంతో మరికొందరికి ఇవ్వలేకపోయింది. రబీలోనూ చెక్కుల ద్వారా ఇవ్వాలనుకున్నా ఎన్నికల కారణంతో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకే అందజేసింది. ఇప్పటివరకు రబీ సీజన్ కింద 43.60 లక్షల మందికి రూ. 4,724 కోట్లు రైతుబంధు సొమ్ము అందజేశారు. గతేడాది డిసెంబర్ 4 వరకు సక్రమంగానే అందజేసినా ఎన్నికల తర్వాత కొన్ని రోజులు నిధుల కొరతతో సొమ్ము ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. తర్వాత దాదాపు రూ. 700 కోట్లకుపైగా గత బిల్లులను పాస్ చేసి ట్రెజరీ అధికారులు ఎన్ఐసీకి సమాచారం ఇవ్వగా అందులో సగం సొమ్ము మాత్రమే బ్యాంకులకు వెళ్లింది. మిగిలిన సొమ్ము వెళ్లకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిధులు లేకపోవడం వల్లే ఇలా జరిగిందని అధికారులు అంటున్నారు. -
జీఎస్టీపైనే ఆశలన్నీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రాబడిపై గంపెడాశలు పెట్టుకుంది. ఈ ఏడాదికన్నా వచ్చే ఏడాది జీఎస్టీ ద్వారా గణనీయంగా పన్ను రాబడి ఉంటుందని అంచనా వేసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో 2019–20 ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తం రూ. 36,229.45 కోట్లు జీఎస్టీ ద్వారానే వస్తుందని పేర్కొన్నారు. అందులో రాష్ట్ర జీఎస్టీ (ఎస్జీఎస్టీ) ద్వారానే రూ. 30 వేల కోట్లు వస్తుందని, కేంద్ర జీఎస్టీ (సీజీఎస్టీ) ద్వారా మరో రూ. 6,229.45 కోట్లు సమకూరుతుందని అంచనా వేశారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికిగాను ఎస్జీఎస్టీ ద్వారా రూ. 26,040 కోట్లు వస్తాయని అంచనా వేసినా సవరించిన అంచనాల్లో దాన్ని రూ. 22,264 కోట్లకు తగ్గించారు. కేంద్ర జీఎస్టీని వార్షిక అంచనాల్లో ప్రతిపాదించిన రూ. 6,181.16 కోట్ల నుంచి సవరించిన అంచనాల్లో రూ. 5,145.41 కోట్లకు తగ్గించారు. గతేడాదితో పోలిస్తే ఒక్క ఎస్జీఎస్టీ ద్వారా రూ. 8 వేల కోట్ల మేర ఆదాయం ఎక్కువగా వస్తుందని ఈసారి అంచనాల్లో పేర్కొనడం గమనార్హం. కార్పొరేషన్ పన్నురూ. 5,000 కోట్ల పైమాటే ప్రభుత్వం పేర్కొన్న మిగిలిన రాబడులను పరిశీలిస్తే కార్పొరేషన్ పన్ను ద్వారా రూ. 6,665 కోట్లు, ఇతర పన్నుల ద్వారా రూ. 5,600 కోట్లు వస్తాయని అంచనా వేశారు. రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఏడాదికి ఆదాయం తగ్గుతుందనే అంచనాలతో బడ్జెట్ ప్రవేశపెట్టడం గమనార్హం.2018–19 వార్షిక అంచనాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 4,699 కోట్లు వస్తాయని అంచనా వేయగా సవరించిన అంచనాల్లో దాన్ని రూ. 6,689 కోట్లకు పెంచారు. కానీ 2019–20 ఆర్థిక సంవత్సరానికి మాత్రం స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ద్వారా రూ. 5,405 కోట్లను మాత్రమే అంచనాల్లో చూపించారు. కస్టమ్స్ ద్వారా రూ. 1,293 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ ద్వారా రూ. 794 కోట్లు వస్తుందని అంచనా వేశారు. మద్యం రాబడిరూ. 12,000 కోట్లు పన్నుల రాబడిలో భాగంగా రాష్ట్ర ఎౖMð్సజ్‌శాఖ ద్వారా రూ. 12,190 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఈ ఏడాదితో పోలిస్తే 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ ఆదాయం రూ. 2,123 కోట్లు పెరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. అమ్మకాలు, వర్తకంపై పన్నుల రూపంలో రూ. 31,504 కోట్లు, వాహనాలపై పన్నుల ద్వారా రూ. 4,542 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది. గ్రాంట్ల రూపంలోరూ. 9,000 కోట్లు వివిధ రెవెన్యూ సహాయక గ్రాంట్లు, విరాళాల ద్వారా రూ. 9,960 కోట్లు సమకూరుతుందని బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నారు. వివిధ సాధారణ సర్వీసులకు రూ. 3,270 కోట్లు, గనులు, లోహ పరిశ్రమలకు రూ. 4,800 కోట్లు గ్రాంట్ల రూపంలో వస్తుందని అంచనా వేశారు. దీనికితోడు కేంద్ర ఎక్సైజ్ సుంకంలో రాష్ట్ర వాటా కింద రూ. 22,835 కోట్లు వస్తుందని, సేవింగ్స్ రాబడి రూ. 2,994 కోట్లు ఉంటుందనే అంచనాతో రెవెన్యూ రాబడిని బడ్జెట్ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. -
మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఈటల
సాక్షి, హైదరాబాద్ : శాసనమండలిలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను శుక్రవారం ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా 5 సార్లు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఈటల.. తొలిసారి మండలిలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హోదాలో బడ్జెట్‌ను సమర్పించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆరే ఆర్థిక శాఖ నిర్వహిస్తుండటంతో శాసనసభలో స్వయంగా ఆయనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో గతంలో ఆర్థికమంత్రిగా పనిచేసిన ఈటలకు మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లభించింది. సుమారు 50 నిమిషాలపాటు బడ్జెట్ ప్రసంగ పాఠాన్ని వినిపించిన ఈటల ప్రభుత్వ ప్రాధామ్యాలతోపాటు వివిధ శాఖల పద్దులను ప్రస్తావించారు. ఈటల ప్రసంగిస్తున్న సమయంలో ప్రభుత్వ సంక్షేమ, పథకాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి అధికార టీఆర్ఎస్ సభ్యులు హర్షం ప్రకటిస్తూ బల్లలు చరిచారు. బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత ఆయన దగ్గరకు వెళ్లిన సభ్యులు ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవం ప్రసంగంలో కనిపించిందని అభినందించారు. 2018–19 సంవత్సరపు అనుబంధ వ్యయ అంచనాలను కూడా సభకు సమర్పించారు. -
పైరు.. పండుగ
శాసనసభలో శుక్రవారం సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన బడ్జెట్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలును ప్రస్ఫుటంగా ప్రతిబింబించింది. ఆసరా పింఛన్లు మొదలుకుని రైతు రుణమాఫీ దాకా ప్రతి హామీని అమలు చేసి తీరుతామన్న ప్రతిన తాత్కాలిక బడ్జెట్లో కనిపించింది. రైతన్న కోసం సాగుకు వెన్ను దన్ను, ఆపన్నుల కోసం పింఛన్లు బడ్జెట్లో ప్రత్యేకంగా నిలిచాయి. వైద్య, ఆరోగ్య రంగానికి బడ్జెట్ కొంత నిరాశ కలిగించినా, ఇతర సంక్షేమ పథకాల విషయంలో సీఎం ఉదారంగా వ్యవహరించారు. అయితే, ఉద్యోగుల పదవీ విరమణ విషయంలో ఎలాంటి ప్రకటనా చేయలేదు. రాష్ట్రం ఆర్థిక ప్రగతిలో దూసుకుపోతున్న తీరును బడ్జెట్ ఆవిష్కరించింది. గడిచిన రెండేళ్ల రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ) జాతీయ సగటు కంటే తెలంగాణ ఎక్కువ వృద్ధిరేటు సాధించిన తీరు.. రాష్ట్ర భవిష్యత్ మరింత ఆశాజనకంగా ఉంటుందని వెల్లడించింది. ఈ ఏడాది జీఎస్డీపీ రూ.8,66,875 కోట్ల మేర ఉంటుందని సీఎం బడ్జెట్ ప్రసంగంలో అంచనా వేశారు. 2017–18లో రూ.1,81,102గా ఉన్న తలసరి ఆదాయం ఈ ఏడాది రూ.2,06,107కు చేరుకోనుందని అంచనా వేశారు. వృద్ధాప్యంలో ఉన్న పేదలు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వం ఆసరాగా నిలిచింది. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌కు రూ.1,450 కోట్లు కేటాయించారు. నిరుద్యోగ భృతి కోసం రూ.1,810 కోట్లు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీల సబ్‌ప్లాన్ చట్టాన్ని అమలు చేసి తీరుతామన్న సంకేతాలిచ్చారు. సాగుకు పండగేనన్న రీతిలో సీఎం ప్రతిపాదనలుఉన్నాయి. ‘రైతు బంధు’ కింద ఎకరానికి రూ.2 వేలు పెంచుతూ బడ్జెట్లో రూ.12 వేల కోట్లు ప్రతిపాదించారు. రూ.లక్ష లోపు పంట రుణమాఫీకి మొదటి విడతలో రూ.6వేల కోట్లు కేటాయించారు. వడ్డీ సహా ఈ మొత్తాన్ని నాలుగు వాయిదాల్లో చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. రైతు బీమాకు రూ.650 కోట్లు కేటాయించారు. కోటి ఎకరాలకు సాగు నీరు అందించాలన్న లక్ష్యం మేరకు బడ్జెట్లో రూ.22,500 కోట్లు ప్రతిపాదించారు. మనం అనుసరిస్తున్న సమగ్ర ప్రగతి ప్రణాళిక దేశంలో చర్చకు కేంద్ర బిందువుగా మారింది. గతంలో దేశమంతా గుజరాత్, కేరళ రాష్ట్రాల అభివృద్ధి నమూనా గురించే చర్చ జరిగేది. కానీ ఇప్పుడు దేశమంతా తెలంగాణవైపు చూస్తోంది. దీంతో హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది. మేనిఫెస్టోలోని కార్యక్రమాలకే పరిమితం కాకుండా.. చెప్పనివి ఎన్నో అమలుచేశాం. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రగతి, సంక్షేమ కార్యక్రమాల ఫలాలు అందుకోని కుటుంబమేదీ లేదనడం అతిశయోక్తి కాదు. – కేసీఆర్ శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మనసా, వాచా, కర్మేణా.. బంగారు తెలంగాణకు పునరంకితం ►ప్రజల ఆకాంక్షలే ప్రాతిపదికగా బడ్జెట్ రూపకల్పన ►బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రజల ఆకాంక్షలు సాకారం చేసే ఉద్దేశంతో ప్రభుత్వం వినూత్న పథకాలతో ముందుకెళ్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందేలా.. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం మనసా, వాచా, కర్మేణా పునరంకితమవుతామని ఆయన ప్రకటించారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి గానూ శుక్రవారం ఆయన శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ ప్రతిపాదిత వ్యయం రూ.1,82,017 కోట్లుగా పేర్కొన్న సీఎం అందులో ప్రగతి పద్దు అంచనా వ్యయం రూ.1,07,302 కోట్లు, నిర్వహణ పద్దు వ్యయం 74,715 కోట్లుగా ప్రతిపాదించారు. బడ్జెట్‌ను సభలో ప్రవేశపెడుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. దేశానికే ఆదర్శంగా.. 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ ఒక సఫల రాష్ట్రంగా, అభివృద్ధి పథంలో పయనిస్తోంది. స్వల్ప కాలంలోనే అనేక ప్రతికూలతలను అధిగమించి, సామాజిక, ఆర్థిక పునాదిని పటిష్టపరుచుకుంటూ దేశానికి ఆదర్శంగా నిలవడం అద్భుతం. రాష్ట్రం ఆవిర్భవించినపుడు ఎటుచేసినా వెనుకబాటుతనమే కనిపించింది. ఎటువైపు చూసినా సవాళ్లే స్వాగతం పలికాయి. సమైక్యపాలన తెచ్చిన దుష్పరిణామాలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా వేధించాయి. తీవ్రమైన కరెంటు కొరత, వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, చిన్నాభిన్నమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఎక్కడికక్కడే ఆగిపోయిన నీటిపారుదల ప్రాజెక్టులు, చెదిరిపోయిన చెరువులు, వరుస కరువులు, వలసపోయే ప్రజలు, గుక్కెడు నీళ్ల కోసం అలమటించే దౌర్భాగ్యంతో తెలంగాణ సామాజిక ముఖచిత్రం ఉంది. ఈ పరిస్థితిని మార్చేందుకు పట్టుదలతో ప్రయత్నించాం. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం సాగిన ప్రయాణంలో భగవంతుడి దీవెనలు, ప్రకృతి అనుకూలతలు, ప్రజల సహకారం లభించాయి. మొదటి నాలుగున్నరేళ్లలో తలపెట్టిన కార్యక్రమాలు అనుకున్న పంథాలో సాగి అద్భుత విజయాలు సాధించాం. అతితక్కువ సమయంలోనే అభివృద్ధి దిశగా అడుగులేశాం. వినూత్నమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం ద్వారా వచ్చే ఆనందం ప్రభుత్వ సంకల్పాన్ని బలోపేతం చేస్తుంది. శక్తిసామర్థ్యాలను ఇనుమడింపచేస్తుంది . రెండు రెట్ల కన్నా ఎక్కువ జీఎస్డీపీ వృద్ధి సమైక్యపాలన చివరి రెండేళ్లలో తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధిరేటు దేశసగటు కన్నా తక్కువ ఉండేది. ఆ రెండేళ్లలో దేశసగటు వృద్ధిరేటు 5.9% ఉంటే తెలంగాణ వృద్ధి రేటు 4.2% మాత్రమే. అదే 2018–19లో వృద్ధిరేటు రెండురెట్ల కన్నా ఎక్కువగా 10.6% నమోదైంది. ప్రస్తుత ధరలలో జీఎస్డీపీ 2016–17లో 14.2% ఉంటే 2017–18లో 14.3%కు పెరిగింది. 2018–19లో 15% వృద్ధి సాధించనుంది. ఇది దేశ అభివృద్ధి రేటు 12.3% కన్నా ఎక్కువ. 2018–19లో జీఎస్డీపీ ప్రాథమిక రంగం 10.9% వృద్ధిరేటును నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నాం. విద్యుత్ పరిస్థితిలో మెరుగుదల, సాగునీటి సౌకర్యాల పునరుద్ధరణ, గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు చేపపిల్లల సరఫరా, రైతులకు పెట్టుబడి మద్దతు ద్వారా ఇది సాధ్యపడింది. పారిశ్రామిక, ఉత్పత్తి రంగాల్లోనూ చెప్పుకోదగిన మెరుగుదల కనిపించింది. ఈ రంగాల్లో 14.9% వృద్ధిరేటు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. సేవారంగంలో 15.5% పెరుగుదల నమోదవుతుందని ఆశిస్తున్నాం. ఇక, తలసరిఆదాయం 2017–18లో రూ.1,81,102 ఉంటే 2018–19లో రూ.2,06,107కు చేరుకోనుంది. బాల్యవివాహాలు తగ్గాయ్ పేద తల్లిదండ్రులకు ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదని.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కార్యక్రమాలను చేపట్టాం. ఈ పథకం పేదలకు ఆర్థిక అండనివ్వడంతో పాటు సామాజిక సంస్కరణకు దోహదపడింది. 18ఏళ్లు నిండిన వారే అర్హులనే నిబంధనతో బాల్యవివాహాలు గణనీయంగా తగ్గాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు రూ.1,450 కోట్లు కేటాయిస్తున్నాం. నిరుద్యోగభృతి ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.1,810 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. షెడ్యూల్ కులాల ప్రగతినిధికి రూ.16,851 కోట్లు, షెడ్యూల్ తెగల ప్రగతి నిధికి రూ.9,827 కోట్లు, మైనార్టీల సంక్షేమం కోసం 2,004 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. నేను దగ్గరుండి గమనించాను నా విద్యార్థి దశలో దుబ్బాకలో చేనేత, బీడీ కార్మికుల ఇళ్లలో ఉండి చదువుకున్నాను. బీడీలు చుట్టే తల్లులు అనుభవించే దుర్భర వేదనను దగ్గర్నుంచి గమనించాను. అందుకే వారి వేదనను తీర్చాలని ఎవరూ అడగకుండానే ప్రతినెలా రూ.1,000 జీవనభృతిని ప్రకటించాను. తోడులేని ఒంటరి స్త్రీ సమాజంలో పడే పాట్లు చెప్పనలవికాదు. వీరికి రూ.1,000 భృతి ఇవ్వడం కొండంత అండగా మారింది. ఆసరా పింఛన్లు అందుకుంటున్న వారంతా కేసీఆర్ మమ్మల్ని కాపాడుతున్న పెద్దకొడుకని, దేవుడిచ్చిన అన్న అని దీవించడం.. నా రాజకీయ జీవితానికి గొప్ప సార్థకతగా భావిస్తున్నాను. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఇదే నా హృదయానికి దగ్గరైన కార్యక్రమాలు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే పింఛన్‌ను నెలకు రూ.1,000 నుంచి రూ.2016కు పెంచుతున్నాం. దివ్యాంగుల పింఛన్‌ను రూ.3,016కు పెంచుతున్నాం. వృద్ధాప్య పింఛన్ కనీస వయసును 57 సంవత్సరాలకు తగ్గిస్తున్నాం. ఆసరా పింఛన్ల కోసం 12,067 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. రేషన్‌తో పాటు హాస్టళ్లు, మధ్యాహ్న భోజనంలో ఇచ్చే సన్నబియ్యం సబ్సిడీ కోసం రూ.2,744 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. తెలంగాణపైనే చర్చ మనం అనుసరిస్తున్న సమగ్ర ప్రగతి ప్రణాళిక దేశంలో చర్చకు కేంద్రబిందువుగా మారింది. గతంలో దేశమంతా గుజరాత్, కేరళ రాష్ట్రాల అభివృద్ధి నమూనా గురించే చర్చ జరిగేది. కానీ ఇప్పుడు దేశమంతా తెలంగాణ మోడల్‌పైనే చర్చ జరుగుతోంది. దీంతో హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది. మేనిఫెస్టోలోని కార్యక్రమాలకే పరిమితం కాకుండా.. చెప్పని ఎన్నో కార్యక్రమాలను అమలుచేశాం. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రగతి, సంక్షేమ కార్యక్రమాల ఫలాలు అందుకోని కుటుంబమేదీ రాష్ట్రంలో లేదనడం అతిశయోక్తి కాదు. అందుకే గత ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రభుత్వంపై తమకున్న అచంచల విశ్వాసాన్ని చాటుకున్నారు. విద్యుత్ సంక్షోభం పరిష్కారం తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ సంక్షోభాన్ని చాలా తక్కువ సమయంలో పరిష్కరించింది. రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదో నెల నుంచే నాణ్యమైన విద్యుత్‌ను 24గంటల పాటు సరఫరా చేస్తున్నది. రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు 28వేల మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం లక్ష్యంగా తలపెట్టిన కొత్త ప్లాంట్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. భద్రాద్రి పవర్‌ప్లాంటు ఈ ఏడాది నుంచే ఉత్పత్తి ప్రారంభిస్తుంది. యాదాద్రి అల్ట్రామెగా పవర్‌ప్లాంటు నిర్మాణపనులు వేగంగా సాగుతున్నాయి. 5వేల మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి లక్ష్యంగా పెట్టుకుని 3,613 మెగావాట్లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చాం. రాష్ట్రం ఏర్పడే నాటికి 7,778 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు 16,503 మెగావాట్లకు చేర్చాం. మిషన్‌భగీరథ ద్వారా రాష్ట్రంలోని 19,750 జనావాసాల్లో ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా మంచినీరిస్తున్నాం. ఏప్రిల్ నెలాఖరు కల్లా వందకు 100% పూర్తి చేసి ప్రతి ఇంటికీ నల్లా ద్వారా నీళ్లిస్తాం. ఇప్పటివరకు 2,72,763 డబుల్బెడ్రూం ఇళ్లను మంజూరు చేశాం. కొత్తగా 3,150 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను సాధించాం. హైదరాబాద్ ఔటర్రింగురోడ్డు అవతల 340 కిలోమీటర్ల రీజనల్ రింగురోడ్డును నిర్మించాలని నిర్ణయించాం. రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామపంచాయతీలకు కచ్చితంగా బీటీ రోడ్లు వేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఎన్నికల హామీలకు కట్టుబడి.. వ్యవసాయరంగ సమస్యల పరిష్కారంలో దేశానికే తెలంగాణ దిక్సూచిగా నిలిచింది. మేం ప్రవేశపెట్టిన పథకాలను యావత్భారతం వేనోళ్ల కొనియాడుతోంది. పండిన పంటకు మద్దతు ధరను సాధించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను రైతుల భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పబోతున్నాం. 2014 ఎన్నికల హామీకి కట్టుబడి 35.29లక్షల రైతుల రూ.16,124 కోట్ల రుణాలను మాఫీ చేశాం. తెలంగాణ ఏర్పడే నాటికి 4.17లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్న గోదామును 22.50లక్షల టన్నుల సామర్థ్యానికి తెచ్చాం. ఇచ్చిన మాటకు కట్టుబడి 2018 డిసెంబర్11 నాటికి లక్ష రూపాయల వరకు ఉన్న రుణాలను మాఫీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం. రైతురుణమాఫీ కోసం రూ.6వేల కోట్లు ప్రతిపాదిస్తున్నాం. రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి ప్రశంసించడం గర్వకారణం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుబంధు సాయాన్ని పెంచుతున్నాం. ఇందుకోసం బడ్జెట్లో రూ.12,000 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. రైతుబీమాతో ఇప్పటివరకు 5,675 మంది రైతు కుటుంబాలకు రూ.283 కోట్ల సాయం అందించాం. ఈ బడ్జెట్లో రైతుబీమా కిస్తీ కోసం రూ.650 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. భూరికార్డుల ప్రక్షాళన అనంతరం ఆ రికార్డులు పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉండడానికి వీలుగా కోర్‌బ్యాంకింగ్ తరహాలో ధరణి వెబ్సైట్ రూపొందించాం. క్రాప్కాలనీల్లో భాగంగా చిన్న, మధ్యతరహా, భారీ ఆహార శుద్ధి కేంద్రాలు నెలకొల్పుతాం. వీటి నిర్వహణలో ఐకేపీ ఉద్యోగులు, ఆదర్శ మహిళా సంఘాలను భాగస్వాములు చేయాలని సంకల్పిస్తున్నాం. రాష్ట్ర బడ్జెట్లో రూ.20,107 కోట్లను వ్యవసాయశాఖకు ప్రతిపాదిస్తున్నాం. నాలుగేళ్లలో 90% పూర్తి గతంలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి దశాబ్దాల కాలం పట్టేది. కానీ మేం నాలుగేళ్లలోనే 90% నిర్మాణపనులను పూర్తి చేశాం. అన్ని ప్రాజెక్టులకు అటవీ, పర్యావరణ, పరిపాలనాల అనుమతులొచ్చాయి. తెలంగాణ వరదాయని కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును కేంద్ర జలసంఘం, కేంద్ర ఆర్థిక సంఘం కొనియాడాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది వర్షాకాలంలోనే రైతులకు నీరందివ్వడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో చేపట్టిన అన్ని ప్రాజెక్టులను ఈ ఐదేళ్లకాలంలో పూర్తిచేసి సస్యశ్యామలం చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. ఈ బడ్జెట్లో నీటిపారుదల శాఖకు రూ.22,500 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. పంచాయతీలకు ప్రత్యేక ప్రణాళిక సమైక్య పాలనలో తెలంగాణ సామాజిక జీవిక చెదిరిపోయింది. ఈ పరిస్థితిలో మార్పు కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందించాం. గొర్రెల పంపిణీ ద్వారా కురుమగొల్లలకు రూ.2,600 కోట్ల సంపద సమకూరింది. పెద్దసంఖ్యలో ఉన్న పవర్‌లూమ్‌లను ఆధునీకరిస్తున్నాం. వరంగల్‌లో భారీ టెక్స్‌టైల్‌పార్కు, సిరిసిల్లలో అపరెల్ పార్కు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. సంచార జాతులను ఆదుకునేందుకు ఈ బడ్జెట్లో ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. జీవన ప్రమాణాల్లో గుణాత్మక మార్పు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, మౌలికసదుపాయాలు అందుబాటులో ఉన్నప్పుడే ప్రజల జీవన ప్రమాణాల్లో గుణాత్మక మార్పు సాధ్యమని నమ్ముతున్నాం. పేదలకు మెరుగైన వైద్యం అందించడం కోసం ఆసుపత్రి సేవలను మెరుగుపరిచాం. మందుల కోనుగోలుకు ఏటా రూ.440 కోట్లు వెచ్చిస్తున్నాం. జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో ఐసీయూ కేంద్రాల సంఖ్య పెంచాం. ప్రతి 10వేల మందికి ఒకటి చొప్పున బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నాం. కేసీఆర్ కిట్స్‌తో ఆసుపత్రుల్లో ప్రసవాలు 33 నుంచి 49%కు పెరిగాయి. తెలంగాణ ఏర్పడే నాటికి శిశుమరణాల రేటు ప్రతి వెయ్యి మందికి 39 ఉంటే అది ఇప్పుడు 28కి తగ్గింది. మాతృత్వ మరణాల రేటు కూడా 91 నుంచి 70కి తగ్గింది. కోటి 52లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి 50లక్షల మందికి కంటి అద్దాలిచ్చాం. కంటి వెలుగు తరహాలోనే చెవి, ముక్కు, గొంతు, దంత సంబంధమైన వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. వైద్యశాఖకు రూ.5,536 కోట్లు ప్రతిపాదిస్తున్నాం . విప్లవాత్మక సంస్కరణలు ప్రజలకు పాలన మరింత చేరువ చేసేందుకు జిల్లాలను 33కి, రెవెన్యూ డివిజన్లను 69కి, మండలాలను 584కు పెంచుకున్నాం. కొత్తగా 68 మున్సిపాలిటీలు, 4,383 గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసుకున్నాం. కొత్తగా 7 పోలీస్ కమిషనరేట్లు, 44 సబ్డివిజన్లు, 29 సర్కిళ్లు, 102 పీఎస్‌లను ఏర్పాటు చేశాం. 1,177 తండాలను పంచాయతీలుగా మార్చాం. గ్రామాభ్యుదయం కోసం నూతన పంచాయతీరాజ్ చట్టానికి రూపకల్పన చేసుకున్నాం. రాష్ట్ర ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.1,400 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.9,000 కోట్లు ఇవ్వాలని సిఫారసు చేసింది. అయితే గ్రామాల అభివృద్ధికి ఎక్కువ నిధులివ్వాలన్న ఆలోచనతో కేంద్ర ఆర్థిక సంఘం ఇస్తున్న రూ.1,628 కోట్లకు అదనంగా మేం మరో రూ.1,628 కోట్లు గ్రామాలకు ఇస్తాం. దీంతో 500 జనాభా ఉన్న గ్రామానికి కూడా 8లక్షల వరకు నిధులొస్తాయి. ఇప్పటివరకు రూ.1.41 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో కూడిన 8,419 పరిశ్రమలకు అనుమతులివ్వడంతో 8.58లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడింది. హైదరాబాద్‌లో త్వరలోనే అంతర్జాతీయ స్థాయి పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం కానుంది. రెవెన్యూ మిగులు రూ.6,564 కోట్లు అకౌంటెంట్ జనరల్ ధ్రువీకరించిన ప్రకారం 2017–18లో మొత్తం వ్యయం రూ.1,43,133 కోట్లు. రెవెన్యూ రాబడులు రూ.88.824 కోట్లు. రెవెన్యూ ఖర్చు 85,365 కోట్లు. మిగులు రూ.3,459 కోట్లు. మొత్తం వ్యయంలో మూలధన వ్యయం రూ.23,902 కోట్లు. సవరించిన అంచనాల ప్రకారం 2018–19 సంవత్సరానికి అంచనా వ్యయం రూ.1,61,857 కోట్లు. రెవెన్యూ వ్యయం రూ.1,19,027 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.28,053 కోట్లు. రెవెన్యూ ఖాతాలో మిగులు రూ.353 కోట్లు. ఇక, 2019–20 సంవత్సరానికి రెవెన్యూ రాబడుల ప్రతిపాదనలు రూ.94,776 కోట్లు. కేంద్ర ప్రతిపాదిత బదిలీలు రూ.22,835 కోట్లు. ప్రగతి పద్దు అంచనా వ్యయం రూ.1,07,302 కోట్లు. నిర్వహణ పద్దు అంచనా వ్యయం రూ.74,715 కోట్లు. మొత్తం ప్రతిపాదిత వ్యయం రూ.1,82,107 కోట్లు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,31,629 కోట్లు. మిగులు రూ.6,564 కోట్లు. ఆర్థికలోటు రూ.27,749 కోట్లు. అంచనావేసిన జీఎస్డీపీలో ఇది 2.81%. సుస్థిరమైన వృద్ధి మరే రాష్ట్రానికి సాధ్యంకాని రీతిలో రాష్ట్రం స్థిరమైన ఆదాయాభివృద్ధి రేటు సాధిస్తోంది. మొదటి నాలుగేళ్లలో 17.17% వార్షిక సగటువృద్ధి సాధించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాం. మూలధన వ్యయశాతంలోనూ దేశంలోనే మనమే మొదటి స్థానంలో ఉన్నాం. 2016–17 సంవత్సరంలో మొత్తం వ్యయంలో మూలధన వ్యయం 28.2% ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలకు కలిపి పదేళ్లలో మూలధన వ్యయం రూ.1,29,683 కోట్లయితే 10 జిల్లాలకు చేసిన వ్యయం రూ.54,052 కోట్ల రూపాయలే. కానీ, నాలుగున్నరేళ్లలో తెలంగాణలో రూ.1,68,913 కోట్ల మూలధన వ్యయం జరిగింది. కొత్త పథకాలు ప్రారంభం ‘రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగిస్తూనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నాం. తదేక దీక్షతో తపస్సు చేయడం వల్లే ప్రజలు గత ఎన్నికల్లో నిండు దీవెనలు అందించారు. రాబోయే కాలంలోనూ ప్రజల ఆకాంక్షలే ప్రాతిపదికగా వినూత్న పథకాలతో ముందుకెళతాం. పచ్చని పంటలతో తులతూగుతూ అన్ని వర్గాల ప్రజలు సమాన అభివృద్ధి ఫలాలు అందుకునేలా బంగారు తెలంగాణ నిర్మాణం కోసం మనసా, వాచా, కర్మణా పునరంకితమవుతామని సవినయంగా ప్రకటిస్తున్నాను’అని కేసీఆర్ బడ్జెట్‌ను ప్రతిపాదనలు సభముందుంచారు. కొత్త పథకాలు ప్రారంభం ‘రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగిస్తూనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నాం. తదేక దీక్షతో తపస్సు చేయడం వల్లే ప్రజలు గత ఎన్నికల్లో నిండు దీవెనలు అందించారు. రాబోయే కాలంలోనూ ప్రజల ఆకాంక్షలే ప్రాతిపదికగా వినూత్న పథకాలతో ముందుకెళతాం. పచ్చని పంటలతో తులతూగుతూ అన్ని వర్గాల ప్రజలు సమాన అభివృద్ధి ఫలాలు అందుకునేలా బంగారు తెలంగాణ నిర్మాణం కోసం మనసా, వాచా, కర్మణా పునరంకితమవుతామని సవినయంగా ప్రకటిస్తున్నాను’అని కేసీఆర్ బడ్జెట్‌ను ప్రతిపాదనలు సభముందుంచారు. ►రూ.1,07,302 కోట్లు 2019–20కి ప్రగతి పద్దు ►రూ.74,715 కోట్లు నిర్వహణ పద్దుకు కేటాయించింది ►రూ.6,564 కోట్లు రెవెన్యూ మిగులు ►రూ.27,749 కోట్లు ద్రవ్యలోటు ►రూ.1,74,453 కోట్లు 2018–19 ఆమోదించిన బడ్జెట్ ►రూ.1,61,857 కోట్లు సవరించిన అంచనా బడ్జెట్ -
సంక్షేమానికి అగ్రతాంబూలం
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) శుక్రవారంనాడు అసెంబ్లీలో ప్రతి పాదించిన అనామతు బడ్జెట్ ప్రతిపాదనలు రెండున్నర మాసాల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నిక లలో చేసిన వాగ్దానాలు నెరవేర్చడానికి అనువుగానే ఉన్నాయి. సమగ్రాభివృద్ధి, సామాజికన్యాయం అనే రెండు లక్ష్యాలను సాధించడానికి ఉద్దేశించిన బడ్జెట్ ప్రతిపాదనల్లో సంక్షేమానికి పెద్దపీట వేశారు. 2019–20 బడ్జెట్ వ్యయం అంచనా రూ. 1,82,017 కోట్లు. రెవెన్యూ వ్యయం రూ. 1,32,629 కోట్లు. ఎన్నికల హామీలకు అనుగుణంగా రైతులకు అగ్రతర ప్రాధాన్యం ఇచ్చారు. నిరు పేదవర్గాలకూ, నిరుద్యోగులకూ, దివ్యాంగులకూ సహాయం పెంచారు. 2018 డిసెంబర్ 11వ తేదీకి పూర్వం రైతులు తీసుకున్న లక్ష రూపాయల లోపు వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం రూ. 6,000 కోట్లు ప్రత్యేకించారు. రుణాల మొత్తాన్ని నాలుగేళ్ళలో విడతలవారీగా మాఫీ చేయాలని సంకల్పం. రైతుబంధు పథకం కింద నిరుడు ఇచ్చిన ఎకరాకు పంటకు రూ. 4,000ను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రూ. 5,000లకు పెంచాలని ప్రతి పాదించారు. ఈ పథకం కోసం రూ. 1,200 కోట్లు కేటాయించారు. ఈ పథకంతోనే టీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతుపక్షపాతిగా పేరు వచ్చింది. ఏ కారణంగానైనా రైతు మరణించినట్లయితే అతని కుటుంబానికి రైతుబీమా పథకం కింద వెంటనే అయిదు లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. ఈ పథకం కొనసాగింపునకు రూ. 650 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద ఇప్పటికే 5,678 కుటుంబాలు సహాయం పొందాయని అనేక శాఖలతోపాటు ఆర్థిక శాఖ కూడా నిర్వహిస్తున్న కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా అయిదు బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఈటల రాజేంద్ర ఈసారి శాసనమండలిలో బడ్జెట్ ప్రసంగం చదివారు. రాష్ట్రంలోని రెండు వేల పంచా యతీలకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో అన్ని వనరుల నుంచి మొత్తం రూ. 8,000 కోట్లు గ్రాంటుగా లభిస్తాయనీ, వచ్చే అయిదేళ్ళలో రూ. 40,000 గ్రాంట్లు వస్తాయనీ కేసీఆర్ చెప్పారు. నిరుద్యో గులకు చెల్లించే నెలసరి భృతిని రూ. 3,116 గా నిర్ణయించారు. ఇందుకోసం రూ. 1,810 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపు ఏ ప్రాతిపదికన చేశారో, నిరుద్యోగులను ఎట్లా గుర్తించారో, రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో, ఎంతమందికి ఈ పథకం వర్తిస్తుందో ప్రభుత్వం స్పష్టం చేయవలసి ఉన్నది. దివ్యాంగుల పింఛను మొత్తాన్ని రూ. 1,500 నుంచి 3,016 లకు పెంచా లని ప్రతిపాదించారు. వ్యవసాయరంగానికీ, నీటిపారుదల రంగానికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరవాత కేటాయింపులు గణనీయంగా పెరిగాయి. వివిధ రకాల పేదలకు ఇచ్చే ఆసరా పింఛన్ల మొత్తాన్ని వెయ్యి రూపాయల నుంచి రూ. 2,116కు పెంచారు. వృద్ధులకూ, వితంతువులకూ, బీడీ కార్మికులకూ, చేనేత కార్మికులకూ, కల్లుగీత కార్మికులకూ, బోదకాలు రోగపీడితులకూ, ఇతరులకూ వర్తించే ఆసరా పథకం అమలుకోసం రూ. 1,260 కోట్లు కేటాయించారు. దేశంలో మరే రాష్ట్రం లోనూ ఇన్ని వర్గాలకు పింఛన్లు అందుతున్న దాఖలా లేదు. సంక్షేమానికి సంవత్సరంలో రూ. 43 వేల కోట్లు ఖర్చు చేస్తున్న రాష్ట్రాలు తక్కువ. పుల్వామా ఉగ్రదాడిలో మర ణించిన జవాన్ల కుటుం బాలకు తలొక రూ. 25 లక్షల వంతున సాయం అందించాలన్న నిర్ణయం హర్షణీయమైనది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బీసీ విద్యార్థుల కోసం 119 గురుకుల పాఠశా లలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. ముస్లిం బాలలకూ, ఎస్సీ, ఎస్టీ బాల లకూ ఉద్దేశించిన గురు కుల పాఠశాలలు వెయ్యి దాకా ఉండటం విశేషం. ఆదాయవనరులు ఉన్నాయి కనుకా, పన్నుల వసూళ్ళు సక్రమంగా జరుగుతున్నాయి కనుకా ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించి చెప్పిన పనులు చేయ గలుగుతున్నది. 2018–19 బడ్జెట్ వ్యయం సవరించిన అంచనాల ప్రకారం రూ. 353 కోట్ల మిగులు తేలింది. పన్నుల నుంచి రాబడి రూ. 94,776 కోట్లు. 2018–19 కంటే ఇది రూ. 22,000 కోట్లు అధికం. రియల్ ఎస్టేట్ నుంచి ప్రభుత్వ ఆదాయం పెరుగుతోంది. సేవారంగం సంతృప్తికరంగా వృద్ధి చెందుతోంది. వ్యవసాయ ఉత్పత్తులు పెరి గాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి వేల ఎకరాలకు అదనంగా నీటి వసతి కల్పించగలిగితే వ్యవ సాయరంగం నుంచి సత్ఫలితాలు ఆశించవచ్చు. రైతుబంధు పథకంలోనే ఎక్కువ విస్తీర్ణం ఉన్న వారినీ, వ్యవసాయం చేయకుండా కౌలుకు ఇచ్చేవారినీ మినహాయించి, కౌలుదారులనూ, వ్యవసాయ కూలీలనూ ఆదుకునే ఆలోచన చేయాలి. దానివల్ల సామాజికన్యాయం అనే సూత్రం సార్థకం అవుతుంది. విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించినందుకు అభినందనీయమే. విద్యుత్తు కొను గోలు చేసే వ్యవస్థను మరింత హేతు బద్ధంగా సవరించినట్లయితే వ్యయం తగ్గించే అవకాశం ఉన్నదేమో పరిశీలించాలి. పరిశ్రమలకు ఇరవై నాలుగు గంటల విద్యుచ్ఛక్తి సరఫరా అవసరమే. వ్యవసాయరంగానికి పగలు సరఫరా చేస్తే సరిపోతుందేమో చూడాలి. ప్రభుత్వరంగంలో విద్య, వైద్య రంగాలకు ఇతోధికంగా ప్రోత్సాహం అందించి పేద ప్రజలను కార్పొరేట్ ఆసుపత్రుల బారి నుంచి రక్షించేందుకు కూడా ప్రభుత్వం పూనుకోవలసి ఉంది. ఈ రంగాలకూ ప్రాధాన్యం క్రమంగా తగ్గుతుండటం శోచనీయం. విద్యాశాఖ బడ్జెట్ 2018–19 కంటే 2019–20లో వెయ్యి కోట్ల రూపా యలు తగ్గించారు. గత అయిదేళ్ళలో మొత్తం బడ్జెట్ వ్యయంలో విద్యాశాఖకు కేటాయింపులు 10.88 శాతం నుంచి 6.78 శాతానికి తగ్గిపోవడం గమనార్హం. వైద్యశాఖకు సైతం రూ. 5,536 కోట్లు మాత్రమే ప్రత్యేకించారు. ఈ రెండు రంగాలపైనా ప్రభుత్వం దృష్టి సారించవలసిన అగత్యం ఉన్నది. కొన్ని రాష్ట్రాలలో చేసినట్టు ఎన్నికలలో విజయంకోసం సకల హామీలూ ఇచ్చి తీరా అధికా రంలోకి వచ్చిన తర్వాత లబ్దిదారుల సంఖ్య కుదించడమో, చెల్లింపుల మొత్తాలను తగ్గించడమో చేయకుండా ఎన్నికల వాగ్దానాలను ఉన్నవి ఉన్నట్టు అమలు చేయడానికి ప్రయత్నించడమే తెలం గాణ బడ్జెట్లో చెప్పుకోదగిన ప్రత్యేకత. -
రైతులకు లక్ష రుణమాఫీ ప్రకటించిన కేసీఆర్
-
సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది
-
రైతులు తీసుకున్న రూ. లక్ష రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్ : లక్ష రూపాయల వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2018 డిసెంబర్ 11లోపు రైతులు తీసుకున్న లక్ష రుపాయల రుణాలును మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. రైతుల్లో భరోసా పెంచామన్న ముఖ్యమంత్రి అన్నదాతలను అన్నవిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ బడ్జెట్లో రైతన్నలకు కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. వ్యవసాయ శాఖకు రూ.20,107 కేటాయించిన సర్కార్... రైతుబంధ పధకం కింద ఎకరానికి ఏడాదికి అందించే మొత్తాన్ని రూ.8 వేల నుంచి రూ.10వేలకు పెంచింది. అలాగే రైతు బీమాకు రూ.650 కోట్లు కేటాయించింది. (రూ.1,82,017 కోట్లతో తెలంగాణ బడ్జెట్) -
రూ.1,82,017 కోట్లతో తెలంగాణ బడ్జెట్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు శుక్రవారం శాసనసభలో 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఓ ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టనుండటం తెలంగాణలో ఇదే తొలిసారి. ఆర్థిక శాఖ కూడా కేసీఆర్ వద్ద ఉండటంతో ఆయనే సభలో 2018-19 వ్యయానికి సంబంధించి అనుబంధ పద్దులను, 2019-20 సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది 6వ బడ్జెట్ అని పేర్కొన్న కేసీఆర్ స్వల్పకాలంలోనే పురోగతి సాధించామన్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణను రోల్ మోడల్‌గా చూస్తున్నారని, రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని కుటుంబమే లేదన్నారు. అందుకే అత్యధిక మెజార్టీతో టీఆర్ఎస్ను రెండోసారి గెలిపించారని కేసీఆర్ పేర్కొన్నారు. 2018-19లో తెలంగాణ వృద్ధిరేటు 10.6 శాతంగా ఉందని ఆయన తెలిపారు. అలాగే ఆసరా పెన్షన్ల పధకం తన హృదయానికి దగ్గరైనదని అన్నారు. బడ్జెట్ సందర్భంగా ముఖ్యమంత్రి పలు హామీలు ఇచ్చారు. (అమర జవాన్లకు తెలంగాణ అసెంబ్లీ నివాళి) కాగా ఆంధ్రరాష్ట్ర మొదటి సీఎం బెజవాడ గోపాల్‌రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎంలుగా పనిచేసిన కాసు బ్రహ్మానందరెడ్డి, కొణిజేటి రోశయ్య ఆర్థికశాఖ బాధ్యతలను స్వయంగా పర్యవేక్షించడంతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వాళ్ల తర్వాత సీఎం హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టింది కేసీఆరే. అలాగే స్వరాష్ట్రంలో బడ్జెట్ ప్రసంగం చేసిన తొలి ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. మరోవైపు శాసనమండలిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. (నేడే బడ్జెట్) తెలంగాణ బడ్జెట్ ముఖ్యాంశాలు... 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,82,017 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రెవెన్యూ వ్యయం రూ. 1,31,629 కోట్లు మూలధన వ్యయం రూ. 32,815 కోట్లు రెవెన్యూ మిగులు రూ. 6,564 కోట్లు ఆర్థిక లోటు రూ. 27,749 కోట్లు ఉంటుందని అంచనా ఆసరా పెన్షన్లు వెయ్యి నుంచి రూ.2016కు పెంపు ఆసరా పింఛన్ల కోసం రూ. 12,067 కోట్లు దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్లు రూ.1500 నుంచి రూ.3016కు పెంపు దీని కోసం బడ్జెట్లో రూ.12వేల కోట్లు కేటాయింపు పెన్షన్ వయసు 60 నుంచి 57 ఏళ్లకు తగ్గింపు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కోసం రూ. 1450 కోట్లు నిరుద్యోగుల భృతి రూ.3016 (దీని కోసం విధివిధానాలను రూపకల్పన) నిరుద్యోగ భృతి కోసం రూ. 1,810 కోట్లు రైతుబంధు పథకానికి ఎకరానికి ఏడాదికి రూ.8 నుంచి రూ.10వేలు పెంపు దీని కోసం బడ్జెట్లో రూ.12వేల కోట్లు కేటాయింపు వ్యవసాయ శాఖకు రూ.20,107 కోట్లు కేటాయింపు రైతు రుణమాఫీ కోసం రూ. 6 వేల కోట్లు రైతు బీమా కోసం రూ. 650 కోట్లు బియ్యం రాయితీ కోసం రూ. 2,744 కోట్లు షెడ్యూలు కులాల ప్రగతి నిధి కోసం రూ. 16,581 కోట్లు మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2004 కోట్లు ఎంబీసీ కార్పోరేషన్‌కు రూ.1000 కోట్లు మిషన్ కాకతీయకు రూ.22,500 కేట్లు బీసీలకు మారో 119 రెసిడెన్షియల్ స్కూళ్లు పంచాయతీలకు 2 ఫైనాన్స్ కమిషన్ల కింద రూ.3,256 కోట్లు ఒక్కో మనిషికి రూ.1606 చొప్పున ఫైనాన్స్ కమిషన్ నిధులు 500 జనాభా కలిగిన గ్రామానికి రూ.8 లక్షల నిధులు టీఎస్ ఐపాస్ ద్వారా రూ.1,41 లక్షల కోట్లు పెట్టుబడులు టీఎస్ ఐపాస్ ద్వారా 8,419 పరిశ్రమలకు అనుమతులు పరిశ్రమల ద్వారా 8.58 లక్షల ఉద్యోగాలు భర్తీ ఏప్రిల్ చివరినాటికి మిషన్ భగీరధ పనులు పూర్తి మరో రెండు నెలల్లో ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీరు 2019-20లో సొంత రెవెన్యూ రాబడుల అంచనా రూ.94,776 కోట్లు 2019-20లో కేంద్రం నుంచి వచ్చే నిధుల అంచనా రూ.22,835 కోట్లు 2019-20లో ప్రగతి పద్దు రూ.1,07,302 కోట్లు నిర్వహణ పద్దు రూ.74,715 కోట్లు -
ఒక్కో జవాను కుటుంబానికి రూ.25 లక్షలు
-
ఒకో జవాను కుటుంబానికి 25 లక్షలు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : పుల్వామ ఉగ్రదాడిలో అశువులు బాసిన 40మంది జవాన్లకు తెలంగాణ అసెంబ్లీ ఘనంగా నివాళులు అర్పించింది. అంతేకాకుండా అమర జవాన్ల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఉగ్రదాడిలో మరణించిన ఒక్కొక్క అమర జవాను కుటుంబానికి రూ.25 లక్షలు అందచేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం అసెంబ్లీలో ప్రకటన చేశారు. శుక్రవారం ఉదయం తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే సీఎం కేసీఆర్ పుల్వామా అమర జవాన్లకు సంతాపం తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ...జవాన్లపై ఉగ్రదాడి హేయమైన చర్య అని, ఈ దాడి సైనికుల మీద, వ్యక్తుల మీద జరిగినది కాదని సమస్త దేశంపై జరిగిన దాడిగా అందరూ భావిస్తున్నారన్నారు. ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు మృతి చెందటం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉండటమే కాకుండా, తమవంతుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సంతాప తీర్మానానికి ఆమోదం తెలిపిన అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సమావేశాలను పది నిమిషాలు వాయిదా వేశారు. అమరులకు నివాళి అనంతరం జీఎస్టీ చట్టానికి తీసుకువచ్చిన సవరణ బిల్లును ప్రతిపాదించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ 2019-20 సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మరోవైపు శాసనమండలిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. -
నేడే బడ్జెట్
సాక్షి, హైదరాబాద్ : 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబం ధించి తెలంగాణ తాత్కాలిక బడ్జెట్ శుక్రవారం అసెంబ్లీ ముందుకు రానుంది. ఆర్థికశాఖ సైతం తనవద్దే ఉండటంతో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో బడ్జె ట్ను ప్రవేశపెట్టనున్నారు. ఓ ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టనుండటం తెలంగాణలో ఇదే తొలిసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎంలుగా పనిచేసిన కాసు బ్రహ్మానందరెడ్డి, కొణిజేటి రోశయ్య ఆర్థికశాఖ బాధ్య తలను స్వయంగా పర్యవేక్షించడంతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1964 నుంచి 1971 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాసు బ్రహ్మానందరెడ్డి తన పదవీకాలంలో ఒకసారి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టగా.. కొణిజేటి రోశయ్య 2010–11 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కాగా, వైద్య–ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్ట నున్నారు. ఉభయ సభల్లో వేర్వేరుగా శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీల అమలు దిశగా బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆర్థికశాఖ ఉన్నతాధి కారులు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న, చేయబోయే అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించేలా తాత్కాలిక బడ్జెట్ ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు ఆర్థికశాఖ అధికారులు బడ్జెట్ తుది అంకెలను గురువారం ఖరారు చేశారు. ప్రస్తుతం 4 నెలల కాలానికే బడ్జెట్ ఆమోదం తెలుపుతున్నా ఏడాది మొత్తానికి బడ్జెట్ లెక్కలను సిద్ధం చేశారు. 2018–19లో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,74,453 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది. సాధారణంగా గత బడ్జెట్‌తో పోల్చితే 15% పెంపుతో కొత్త బడ్జెట్ ఉంటుంది. ఆసరా పింఛన్లు, రైతుబంధు చెల్లింపుల పెంపు, నిరుద్యోగ భృతి, రుణమాఫీ వంటి కీలక హామీల అమలు కోసం ప్రస్తుత బడ్జెట్లో కేటాయింపులు జరగనున్నాయి. హామీల అమలుకు ప్రాధాన్యం అభివృద్ధిని కొనసాగిస్తూనే సంక్షేమ పథకాలను విస్తరిస్తామని అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పేర్కొంది. ఆసరా పింఛన్ల మొత్తాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చింది. అలాగే వికలాంగుల పింఛన్లను రూ.1,500 నుంచి రూ.3,016 వరకు పెంచడంతోపాటు మిగిలిన అన్ని రకాల ఆసరా పింఛన్లను రూ.1,000 నుంచి రూ.2,016 వరకు పెంచుతామని, బీడీ కార్మికుల పీఎఫ్ కటాఫ్ తేదీని 2018 వరకు పొడిగిస్తామని, వృద్ధాప్య పింఛన్ అర్హత వయసును 65 నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పేర్కొంది. రైతుబంధు ఆర్థిక సాయాన్ని రూ.10 వేలకు పెంచుతామని, లక్ష రూపాయల పంట రుణమాఫీ, రైతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవభృతి, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పథకాన్ని కొనసాగిస్తూనే సొంత స్థలం ఉన్న అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణానికి 5 నుంచి 6 లక్షల రూపాయల సాయం, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంపు వంటి హామీలనూ టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు హామీ వల్ల నిరుద్యోగుల్లో అసంతృప్తి తలెత్తకుండా చూసేందుకు ఉద్యోగ నియామక వయోపరిమితిని మూడేళ్లు పెంచనున్నట్లు తెలిపింది. పింఛనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు సముచితమైన రీతిలో వేతనసవరణపై నిర్ణయం తీసుకుంటామని, నిరుద్యోగ సోదరులకు నెలకు రూ.3016 భృతి చెల్లిస్తామని ప్రకటించింది. ఉద్యోగుల విషయంలో బడ్జెట్ ప్రసంగంలోనే సీఎం స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలక్పొడం, ఐకేపీ ఉద్యోగులను పర్మినెంటు చేసి, ఈ యూనిట్ల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలతో కలిపి ఐకేపీ ఉద్యోగులకు అప్పగించడం, ఎస్సీ, ఎస్టీ వర్గాల సమగ్రాభివద్ధికి ప్రత్యేక పథకాలు రూపకల్పన, రెడ్డి కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్‌తో పాటు ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల సంక్షేమం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు, వివిధ కులాల కేటగిరీ మార్పు కోసం వచ్చిన విజ్ఞాపనలను సానుభూతితో పరిశీలిన, కంటి వెలుగు పథకం తరహాలోనే ప్రజలందరికీ ఇతర ఆరోగ్య పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శిబిరాలను ఏర్పాటు. ప్రతి వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ రికార్డు చేసి, తెలంగాణ రాష్ట్ర హెల్త్ ప్రొఫైల్ రూపకల్పన తదితర అంశాలను టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచారు. వీటి అమలు దిశగా తాత్కాలిక బడ్జెట్లో కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. జీఎస్టీ బిల్లుకు ఆమోదం సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం ప్రగతిభవన్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ తాత్కాలిక బడ్జెట్‌కు ఆమోదముద్ర వేశారు. విస్తరణ తర్వాత జరిగిన మంత్రివర్గం ఈ తొలి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పద్దులకు, అనుబంధ గ్రాంట్లకు ఆమోదం తెలిపారు. వార్షిక బడ్జెట్‌తోపాటు అనుబంధ గ్రాంట్లను సభలో ప్రవేశపెట్టనున్నారు. వస్తు సేవల పన్నుల (జీఎస్టీ) చట్టానికి గతంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు. ఆర్డినెన్స్ స్థానంలో రూపొందించిన బిల్లును మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అసెంబ్లీ సమావేశాల్లోనే దీన్ని ప్రవేశపెట్టనున్నారు. కొత్త మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, సీహెచ్ మల్లారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తొలిసారి కేబినెట్ భేటీలో పాల్గొన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు మొదలుకానున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బడ్జెట్‌ను అధ్యయనం చేసేందుకు వీలుగా శనివారం ఉభయ సభలకు సెలవు ఉంటుంది. బడ్జెట్‌పై ఆదివారం ఉభయసభల్లో చర్చ జరుగుతుంది. సోమవారం ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలుపుతుంది. దీంతో అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి.