హెల్త్‌కు లేని వెల్త్‌ | Cuts in funding to the Medical and Health Department | Sakshi
Sakshi News home page

హెల్త్‌కు లేని వెల్త్‌

Feb 23 2019 5:06 AM | Updated on Feb 23 2019 5:06 AM

Cuts in funding to the Medical and Health Department - Sakshi

వైద్య, ఆరోగ్య రంగంపట్ల సర్కారు ఈసారి చిన్నచూపు చూసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి ప్రతి ఏటా ఆరోగ్యానికి నిధులను పెంచుతూ వస్తున్న ప్రభుత్వం 2019–20 సంవత్సరం బడ్జెట్‌లో కోత పెట్టింది. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా అనేక కొత్త పథకాలను అమలు చేస్తూ వాటికి అనుగుణంగా నిధులు కేటాయిస్తోంది. కానీ, 2018–19 బడ్జెట్లో వైద్యారోగ్యానికి రూ.7,375.20 కోట్లు కేటాయించగా ఈసారి రూ.1839.2 కోట్లు తక్కువగా రూ.5,536 కోట్లు మాత్రమే కేటాయించారు. అయితే, కేసీఆర్‌ కిట్లు, ప్రభుత్పాస్పత్రుల్లో వైద్య పరికరాలు, మందుల కొనుగోలు, బస్తీ దవాఖానాల ఏర్పాటు, సిద్దిపేట, మహబూబ్‌నగర్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో వైద్య కళాశాలల నిర్మాణానికి ప్రముఖంగా నిధులు కేటాయించినట్టు వైద్యారోగ్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కంటి వెలుగు తరహాలోనే చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షల నిర్వహణకు ఏర్పాటు చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ వెల్లడించిన నేపథ్యంలో ఈ పథకానికి కేటాయింపులు పెద్ద మొత్తంలో ఉండనున్నాయి. 2018–19 బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం రూ.7,375.20 కోట్లల్లో రూ.3522.71 కోట్లు నిర్వహణ పద్దుకాగా, రూ.3,852.49 కోట్లు ప్రగతి పద్దు. ఈ అంచనాలతో పోలిస్తే ప్రస్తుత బడ్జెట్‌లో నిర్వహణ పద్దు పోను మిగిలేది కేవలం రూ.2014 కోట్లు మాత్రమే.    

రూ.10 వేల కోట్ల ప్రతిపాదన... 
ప్రభుత్వం వైద్య, ఆరోగ్యశాఖలో 2017లో కేసీఆర్‌ కిట్‌ను ప్రవేశపెట్టింది. 2018లో కంటి వెలుగు పథకాన్ని తీసుకొచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం వివిధ పథకాలతోపాటు కొత్తగా ఏడాది చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో సూర్యాపేట, నల్లగొండ వైద్య కళాశాలలకుతోడు కొత్తగా మరో ఐదు మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తామని గత ఎన్నికల్లో సీఎం హామీ ఇచ్చారు. ఇన్ని పథకాలు అమలు చేయాలంటే గతం కంటే ఎక్కువ బడ్జెట్‌ అవసరమవుతుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు 2019–20 ఆర్థిక సంవత్సరానికి రూ.10 వేల కోట్ల నిధులు అవ సరమని ప్రతిపాదించారు. కానీ అందులో సగం మాత్రమే కేటాయిపులు జరిగాయి. దేశవ్యాప్తంగా అత్యున్నత వైద్య సేవలందించే మూడు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటని ఇటీవలే కేంద్రం ప్రకటించడాన్ని బడ్జెట్‌ ప్రసం గంలో ముఖ్యమంత్రి ప్రస్తావించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వైద్యసేవలను మరింత విస్తరించేందుకు, పేదలందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు.  

నిధులు సరిపోతాయా?
కేసీఆర్‌ కిట్ల పథకం అమలు వల్ల ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య అనుహ్యంగా 49 శాతానికి పెరిగిందని సీఎం కేసీఆర్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ పథకం కోసం గత బడ్జెట్‌లో రూ.560.05 కోట్లు కేటాయించారు. మాతా, శిశు సంరక్షణ కేంద్రాల్లో సౌకర్యాలు మెరుగవడం, నాణ్యమైన వైద్యం అందుతుండటంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో సుమారు 2.75 లక్షల ప్రసవాలు ప్రభుత్పాస్పత్రుల్లో జరుగుతాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు, కంటి వెలుగు కార్యక్రమం విజయవంతమవడంతో, ఈఎన్‌టీ పరీక్షలను సైతం అదే స్థాయిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు పథకాలుసహా రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్‌సీలు, జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో వైద్య పరికరాల కొనుగోలు, ఆరోగ్యశ్రీ, ఉస్మానియా ఆసుపత్రికి కొత్త బిల్డింగ్‌సహా పలు ఆస్పత్రుల భవనాల నిర్మాణం తదితర అవసరాల కోసం మొత్తం రూ.10 వేల కోట్లకు వైద్యారోగ్యశాఖ ప్రతిపాదనలు రూపొందించింది. కానీ, ప్రభుత్వం రూ.5,536 కోట్లతోనే సరిపెట్టడంతో ఆయా పథకాల అమలులో ఇబ్బందులు ఏర్పడే అవకాశముందని వైద్యారోగ్యశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎందుకు కోత కోశారో, ఏ పథకాలపై ప్రభావం పడుతుందో సర్కారు స్పష్టత ఇవ్వలేదని అంటున్నారు.
 – సాక్షి, హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement