సాక్షి, హైదరాబాద్: కరోనా రోగులకు చికిత్స చేసే డాక్టర్లకే రక్షణ కరువైంది. కరోనా వార్డులకు వెళ్లి రోగులకు చికిత్స చేసే డాక్టర్లకు, నర్సులకు, ఇతర సిబ్బందికి అవసరమైన వ్యక్తిగత రక్షణ పరికరాల (పీపీఈ) కిట్ల కొరత వేధిస్తోంది. మాస్కులు, గ్లౌజులు, చేతి తొడుగులు, పూర్తి స్థాయి గౌను తదితరమైనవి అందుబాటులో ఉండటం లేదు. దీంతో వైద్యులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించే వరకు వెళ్లారు.
ప్రస్తుతం ఉన్నవి సరిపోవు...
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పీపీఈ కిట్లు వైద్యులకు ఏమాత్రం సరిపోవు. వైద్యుడు కరోనా వార్డుకు వెళ్లాల్సి వస్తే వీటిని ధరించాలి. లోపలకి వెళ్లి రోగులను పరీక్షించి మళ్లీ బయటకు వస్తే వాటిని తీసేస్తారు. అనంతరం వాటిని డిస్పోజ్ చేస్తారు. అయితే పీపీఈ కిట్లు చాలా పరిమితంగా ఉన్నాయని, ఒకసారి వేసుకుంటే డ్యూటీ అయిపోయేంత వరకు వాటిని ఉంచుకోవాల్సిందేనని అధికారులు ఆదేశిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఒక్కో డాక్టర్ కనీసం 12 గంటల పాటు కరోనా వార్డుల్లో సేవలందిస్తున్నారు.
కిట్ల కొరత కారణంగా ఒక్కసారి పీపీఈ ధరిస్తే 12 గంటల పాటు అలా ఉంచుకోవాల్సిందే. ఇక నర్సులు, రోగుల నుంచి నమూనాలను సేకరించే ల్యాబ్ టెక్నీషియన్లు మాత్రం తరచూ కరోనా పాజిటివ్ వార్డులకు వెళ్లడం, వారికి రోజూ బీపీ, షుగర్ పరీక్షలతో పాటు యాంటీ బయోటిక్ ఇంజక్షన్లు ఇవ్వడం, రోగి పరిస్థితిని బట్టి ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం లాంటివి చేయాల్సి ఉంటుంది. వార్డులో చికిత్స అందించే నర్సులకు ఈ పీపీఈ కిట్లు ఇవ్వడం లేదన్న ఆరోపణలున్నాయి. వారికి ఎయిడ్స్ రోగులకు చికిత్స అందించే సాధారణ ఆఫ్రాన్లను ఇస్తున్నారు. అవి ఏమాత్రం సురక్షితం కాదని వైద్యులు చెబుతున్నారు. పీపీఈ కిట్లు తమకు కూడా కావాలని నర్సులు అడిగితే అవి అందుబాటులో లేవని, ఇవి మాత్రమే ఉన్నాయని, ఆఫ్రాన్లను ధరించి సేవలందించాలని అధికారులు ఆదేశిస్తున్నారని నర్సులు వాపోతున్నారు. దీంతో వారందరికీ కరోనా భయం పట్టుకుంది.
సర్కారుకు తప్పుడు సమాచారం..
సీఎం కేసీఆర్ కరోనాపై పోరాడేందుకు కోట్ల రూపాయలు విడుదల చేశారు. వాటితో పీపీఈ కిట్లు, అవసరమైన పరికరాలు వంటివి కొనాలని ఆదేశించారు. వాటికి ఇండెంట్ పెట్టామని, కొన్ని వచ్చాయని.. కొన్ని వస్తున్నాయని అధికారులు అంటున్నారు. కానీ కొరత ఉండటంతో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ‘వెంటిలేటర్ల గురించి కొందరు మాట్లాడుతున్నారు. అసలు వాటి అవసరం కంటే ఇప్పుడు పీపీఈ కిట్ల అవసరమే ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న కరోనా రోగులెవరూ వెంటిలేటర్లపై లేరు. అలాంటిది వాటి గురించి ఆలోచించడం ఎందుకు?’అని ‘కరోనా’పై వేసిన ఓఉన్నతస్థాయి కమిటీలోని సభ్యుడు వ్యాఖ్యానించాడు. శానిటైజర్లు, మాస్కుల వంటివి కూడా లేకుండా పోయాయి.
కొందరు ఉన్నతాధికారులకు బాక్సుల కొద్దీ పంపిస్తున్నారని సమాచారం. ‘మాపై ఒత్తిడి పెరిగింది. బాక్సుల కొద్దీ శానిటైజర్లు, మాస్కులు తెప్పించాం. కానీ ఎన్నొచ్చినా సరిపోవడం లేదు. వాటిని వీఐపీలకు పంచడానికే సరిపోవడంలేద’ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కార్యాలయానికి చెందిన ఒక అధికారి తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇలా ఒకవైపు దుర్వినియోగం అవుతుంటే, పీపీఈ కిట్ల కోసం దాతలు ముందుకు రావాలని కొన్ని అసోసియేషన్లు కోరటం విచిత్రం. అసలు ఏమి కొంటున్నారు? ఎన్ని వస్తున్నాయి? వంటి వివరాలు కూడా బయటకు రావడం లేదు. దీనిపై ఎటువంటి పారదర్శకత ఉండటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారుల కార్యాలయాల్లో పదుల కొద్దీ శానిటైజర్ డబ్బాలు, మాస్కులు దర్శనమిస్తున్నాయి. కానీ కరోనా రోగులకు చికిత్స అందించే వైద్య సిబ్బంది మాత్రం దిక్కులు చూడాల్సి వస్తోంది. ముఖ్యమంత్రి రేయింబవళ్లు కృషి చేస్తూ కరోనాపై పోరాడుతుంటే, కొందరు అధికారులు మాత్రం దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment