న్యూట్రిషన్ కిట్‌ను పంపిణీ చేస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో కేకే, మహమూద్ అలీ, విజయలక్ష్మీ, శాంతికుమారి, సునీతా లక్ష్మారెడ్డి, దానం నాగేందర్, హరీశ్‌రావు తదితరులు
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో కరోనాను మించిన వైరస్‌లు రావొచ్చని ఇద్దరు ఎంటమాలజిస్టులు తనతో చెప్పారని.. వైద్యారోగ్య వ్యవస్థ పటిష్టంగా ఉంటే అలాంటి వాటిని ధైర్యంగా ఎదుర్కోవచ్చని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేలా వైద్యారోగ్య శాఖను తీర్చిదిద్దాలని నిర్ణయించామని చెప్పారు. బడ్జెట్‌లో వైద్యారోగ్య రంగానికి కేటాయింపులు భారీగా పెంచామని.. 2014లో రూ.2,100 కోట్లు కేటాయించగా, 2023–24 నాటికి ఏకంగా రూ.12,365 కోట్లకు పెరిగాయని వివరించారు.
ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్యను 17 వేల నుంచి 50 వేలకు పెంచామని, అలాగే 50 వేల ఆక్సిజన్ బెడ్లు కూడా సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిమ్స్ ఆస్పత్రిలో కొత్తగా 2 వేల పడకలతో మరో బ్లాక్ నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడారు. సీఎం చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే..
అది వైద్యారోగ్య శాఖ ప్రాధాన్యత!
‘‘మన రాష్ట్రంలో మిడతల బెడద లేదు. కానీ మిడతల దండు హరియాణాలోకి వచ్చి అక్కడి నుంచి మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోకి ప్రవేశించి ఆదిలాబాద్ సరిహద్దు దాకా వచ్చాయి. ఆ సమయంలో కేంద్రం ఇద్దరు ఎంటామాలజిస్టులను పంపింది. అయితే మహారాష్ట్రలోనే మిడతలను మట్టుపెట్టడంతో మన వరకు రాలేదు. తర్వాత ఆ ఇద్దరు ఎంటమాలజిస్టులు నన్ను కలిశారు. సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన ఈ కాలంలోనూ మిడతల సమస్యకు పరిష్కారం కనుక్కోలేరా? అని నేను ప్రశ్నించాను.
మనిషి 4 లక్షల ఏళ్ల క్రితం పుడితే.. మిడతలు, బ్యాక్టీరియాలు అంతకన్నా ముందు 8 లక్షల ఏళ్ల క్రితమే పుట్టాయి. వాటికి వ్యతిరేకంగా మనిషి చర్యలు చేపడితే ప్రకోపం చెంది ఇబ్బందులు కలిగిస్తాయి. అందుకే మిడతలను చంపలేమని, పూర్తిగా నిర్మూలించలేమని ఎంటమాలజిస్టులు వివరించారు. కరోనా కూడా అలాంటిదేనని, భవిష్యత్తులో దానిని మించిన వైరస్‌లు రావొచ్చని నాతో అన్నారు. వైద్యారోగ్య వ్యవస్థ పటిష్టంగా ఉంటే.. నష్టం తక్కువగా ఉంటుందని, లేకుంటే నష్టాలు భారీగా ఉంటాయని హెచ్చరించారు. వైద్యారోగ్య శాఖ ప్రాధాన్యతను దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. మానవ జీవనం ఉన్నంత కాలం వైద్యం కూడా కొనసాగుతూనే ఉంటుంది.
భారీగా ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు
నిమ్స్ ఆస్పత్రి భారీ విస్తరణ పనులకు శంకుస్థాపన చేయడం దేశ వైద్యారోగ్య రంగంలోనే చారిత్రక సందర్భం. కేంద్రాన్ని ప్రాధేయపడకుండా సొంతంగా 550 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయగల ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నాం. గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు అందించాం. పుట్టే బిడ్డలు ఒడ్డూ పొడుగు బాగుండాలంటే వాళ్లు గర్భంలో ఎదిగే కాలంలో ఎలాంటి ఆటంకం ఉండకూడదు. ఒకసారి స్టంటింగ్ సమస్య ఏర్పడితే.. మళ్లీ ఎదుగుదల చూడాలంటే వంద సంవత్సరాల కాలం పడుతుంది. చాలా మందికి ఈ విషయం తెలియదు. ఈ సమస్యను అధిగమించేందుకు ఇస్తున్నవే న్యూట్రిషన్ కిట్లు.
గాంధీ ఆస్పత్రి సేవలు అమోఘం
కరోనా కాలంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ గొప్పగా పనిచేసింది. ఆ సమయంలో రోగులకు ధైర్యంగా సేవలు అందించిన గాంధీ ఆస్పత్రి వైద్యులను అభినందిస్తున్నా. అయితే ఎంత చేసినా వైద్యశాఖకు పలు దిక్కుల నుంచి విమర్శలు వస్తుంటాయి. నిరుపేదలు వైద్యం కోసం వస్తే.. బెడ్లు అందుబాటులో లేనప్పుడు వైద్యులు ఉదార హృదయంతో ఒక అరగంట ఎక్కువ పనిచేసైనా, కింద బెడ్డు వేసి అయినా వైద్యం అందిస్తారు. కానీ ఆస్పత్రిలో బెడ్లు లేవని, పేషెంట్లను కింద పడుకోబెడుతున్నారని ప్రచారం జరుగుతుంది. అందువల్ల ప్రజా సంబంధాల వ్యవస్థను మరింతగా మెరుగుపరుకోవాలి.
సేవలు మరింత పెరగాలి
వైద్యారోగ్య రంగంలో చాలా మార్పులు రావాలి. ఆస్పత్రుల నిర్మాణాలే కాదు.. ఆస్పత్రుల్లో సేవలు కూడా పెరగాలి. ఈ రోజు మనం ఏ స్టేజ్‌లో ఉన్నాం, ఇంకా ఎంత ముందుకు పోవాల్సి ఉంది? జరగాల్సిన కొత్త ఆవిష్కరణలు ఏంటి? చేపట్టాల్సిన చర్యలేమిటన్న ప్రణాళికల కోసం సమయం కేటాయించాలి. ప్రజల బాగు కోసం ఇంకా ఏం చేయాలనే తపన వైద్యాధికారులకు ఉండాలి. అపవాదులను తొలగించుకొని రాష్ట్రంలో వైద్యశాఖనే నంబర్ వన్ అని పేరొచ్చేలా కృషి చేయాలి.
భారీగా ఆస్పత్రుల నిర్మాణం
రాష్ట్రంలో గొప్పగా ఆస్పత్రులు నిర్మిస్తున్నాం. వరంగల్‌లో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి రానుంది. ఒకప్పుడు నిమ్స్‌లో 900 పడకలుంటే.. తెలంగాణ వచ్చాక 1,500 పడకలకు పెంచాం. మరో 2 వేల పడకల సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాం. హైదరాబాద్‌లో టిమ్స్ కింద నాలుగువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు కడుతున్నాం. విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అద్భుతమైన వైద్య సేవలు, టెలీ మెడిసిన్ సేవలు అందుతాయి..’’ అని కేసీఆర్ చెప్పారు.
న్యూట్రిషన్ కిట్ల పంపిణీ ప్రారంభం
నిమ్స్ కార్యక్రమం సందర్భంగా.. హైదరాబాద్‌లో గర్భిణులకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీని కూడా సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. తన చేతుల మీదుగా ఆరుగురికి న్యూట్రిషన్ కిట్లను అందచేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని, ఎంపీ కె.కేశవరావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తాతా మధు, మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నేడు నాగ్‌పూర్‌కు కేసీఆర్
– బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం
బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గురువారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు వెళ్తున్నారు. ఆయన హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12 గంటల సమయంలో నాగ్‌పూర్‌కు చేరుకుంటారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మహారాష్ట్రకు చెందిన బీఆర్‌ఎస్ ముఖ్య నేతలతో భేటీ అవుతారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొని తిరుగు ప్రయాణమవుతారు. సాయంత్రం 4 గంటల సమయంలో హైదరాబాద్‌కు చేరుకుంటారు.
హైదరాబాద్ బయట మూడో కార్యాలయం..
నాగ్‌పూర్ కార్యాలయం బీఆర్‌ఎస్ పార్టీకి హైదరాబాద్ వెలుపల మూడో కార్యాలయం కానుంది. ఇప్పటికే ఢిల్లీలోని వసంత్ విహార్‌లో పార్టీ కేంద్ర శాశ్వత కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఏపీలోనూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఓ అద్దె భవనంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. తాజాగా నాగ్‌పూర్‌లో ఏర్పాటు చేశారు. త్వరలో ఔరంగాబాద్, పుణేలోనూ బీఆర్‌ఎస్ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment