NIMS Hospital
-
ఆందోళన చెందొద్దు..ఆరోగ్యంగానే ఉన్నా: ఆర్.నారాయణ మూర్తి
‘పీపుల్ స్టార్’ ఆర్. నారాయణ మూర్తి ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్వల్ప అస్వస్థతకు గురికావడంతో.. బుధవారం హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆయన ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు సైతం నారాయణ మూర్తి ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. దీంతో స్వయంగా ఆర్. నారాయణ మూర్తే తన ఆరోగ్యంపై స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం తాను నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నానని..దేవుడి దయతో బాగానే కోలుకుంటున్నానని చెప్పారు. పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చి.. అన్ని వివరాలు చెబుతానన్నారు.కాగా, నారాయణ మూర్తి ఆరోగ్యంపై నిమ్స్ వైద్యులు సైతం స్పందించారు. నారాయణమూర్తి స్వల్పంగానే అస్వస్థతకు లోనయ్యారని, చికిత్సతో క్రమంగా కోలుకుంటున్నారని, ఆయనకు నిర్వహించినవి కూడా సాధారణ టెస్టులేనని నిమ్స్ వైద్యులు ప్రకటించారు. -
ఆస్పత్రిలో ఆర్. నారాయణ మూర్తి.. ఏమైంది?
ప్రముఖ నటుడు, దర్శకనిర్మాత ఆర్ నారాయణమూర్తి స్వల్ప అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆయనకు ఏమైందో? అనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. అయితే.. ఆయనది స్వల్ప అస్వస్థతేనని వైద్యులు ప్రకటించారు. ప్రసాద్ ల్యాబ్‌లో ఉండగానే నీరసంగా ఉండడంతో ఆయన నేరుగా నిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ డాక్టర్ బీరప్ప ఆధ్వర్యంలో ఆయనకు వైద్య పరీక్షలు జరిగాయి. అయితే నారాయణమూర్తి స్వల్పంగానే అస్వస్థతకు లోనయ్యారని, చికిత్సతో క్రమంగా కోలుకుంటున్నారని, ఆయనకు నిర్వహించినవి కూడా సాధారణ టెస్టులేనని నిమ్స్ వైద్యులు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. రెండు నెలల క్రితం నారాయణమూర్తి బైపాస్ చేయించుకున్నారు. (చదవండి: గాయం వల్ల షూటింగ్స్‌కు దూరం.. క్షమించండంటూ జాతిరత్నాలు హీరో పోస్ట్)ఒకప్పుడు వరుస విప్లవ సినిమాలను తెరకెక్కిస్తూ..‘పీపుల్ స్టార్’గా ఎదిగారు నారాయణ మూర్తి. అప్పట్లో ఆయన నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచాయి. కేవలం సినిమాల్లో నటించడమే కాదు..కథ- కథనం, దర్శకత్వం, సంగీతం, గానం.. ఇలా 24 శాఖల్లో పని చేస్తూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. (చదవండి: సర్దార్ 2 సెట్స్‌లో ప్రమాదం.. ఒకరి మృతి)అయితే గత కొంతకాలంగా నారాయణ మూర్తి తెరకెక్కించిన చిత్రాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. చాలా గ్యాప్ తర్వాత ఆయన హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ‘యూనివర్సీటీ’ గతేడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ చిత్రం కూడా విజయం సాధించలేదు. ప్రస్తుతం ఆయన ‘ఉక్కు సత్యాగ్రహం’ అనే సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా పనుల్లో బిజీగా ఉండడంతో ఆరోగ్యం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు నిమ్స్‌లో డాక్టర్ బీరప్ప పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ఆర్. నారాయణ మూర్తి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిన ఆయన అభిమానులు ఆవేదన చెందుతున్నారు. త్వరగా కోలుకొని మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. -
నిమ్స్ అడిషనల్ ప్రొఫెసర్ బలవన్మరణం
సనత్‌నగర్/లక్డీకాపూల్: నిమ్స్ ఆస్పత్రిలో అనస్థీషియా విభాగంలో అడిషనల్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రాచీకార్ (46) బలవన్మరణానికి పాల్పడ్డారు. నెల రోజుల క్రితమే ఖాళీ చేసిన ఇంటికి ఒంటరిగా వచ్చిన ఆమె అధిక మోతాదులో అనస్థీషియా ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన ప్రాచీకార్, దీపక్‌లు దంపతులు. ప్రాచీకార్ నిమ్స్‌లో ఎనస్థీషియా విభాగంలో అడిషనల్ ప్రొఫెసర్‌గా పనిచేస్తుండగా, భర్త దీపక్ మరో ఆస్పత్రిలో కార్డియాలజిస్ట్‌గా ఉన్నారు. వీరికి ఒక కుమారుడు. గత నెల రోజుల క్రితం వరకు బేగంపేట బ్రాహ్మణవాడిలో ఉన్న వీరి కుటుంబం..మూసాపేటలో కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యారు. అప్పటి నుంచి బేగంపేటలోని ఇల్లు ఖాళీగా ఉంది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం పాత ఇంటికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి ప్రాచీకార్ వెళ్లారు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో భర్త దీపక్ ఫోన్ చేయగా స్పందన లేదు. దీంతో అక్కడికి వచి్చన భర్తకు ఇంటి లోపలి గడియ వేసుకుని ఉండడంతో పాటు ఎంతకీ తలుపు తీయకపోవడంతో స్థానికుల సహాయంతో పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అపస్మారక స్థితిలో కనిపించిన ప్రాచీకార్ను హుటాహుటిన నిమ్స్ ఆస్పత్రికి తరలించగా..పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. కాగా ప్రాచీకర్ అధిక మోతాదులో మత్తు మందు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి గాం«దీలో పోస్టుమార్టం నిర్వహించి..నిమ్స్ మార్చురీలో భద్రపరిచారు. అయితే ప్రాచీకార్ ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచి్చందనేది అంతుపట్టడం లేదు. ఆర్థికంగా, వృత్తిపరంగా మంచి స్థితిలో ఉన్న ప్రాచీకార్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారో తెలియడం లేదని పోలీసులు పేర్కొన్నారు. అయితే కుటుంబపరమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేక విధి నిర్వహణలో ఏదైనా ఇబ్బంది ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రాచీకర్ ఆత్మహత్య విషయం తెలిసి నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఇతర ఉద్యోగులు అర్ధరాత్రి నిమ్స్‌కు వచ్చారు. ప్రాచీకర్ మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయంత్రం 6.30 గంటల వరకు ఆమె విధుల్లో ఉన్నారని, రెండేళ్ల బాలుడి సర్జరీకి సహకరించారని కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ అమరేష్ తెలిపారు. -
మైనర్‌ను గర్భవతిని చేసి నిమ్స్‌లో వదిలేశాడు!
లక్డీకాపూల్ (హైదరాబాద్): నల్లగొండ జిల్లాకు చెందిన ఓ యువకుడు.. మాయమాటలు చెప్పి ఓ మైనర్ బాలికను లోబర్చుకున్నాడు.. ఆమె గర్భం దాల్చడంతో గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్‌లోని ‘నిమ్స్ (నిజాం వైద్య విజ్ఞాన సంస్థ)’ఆస్పత్రికి తీసుకువచ్చాడు.. తనకు పరిచయం ఉన్న ఓ ఉద్యోగి సాయంతో నిమ్స్ అధికారిని కలిశాడు.. ఆ అధికారి సహకారంతో మైనర్ గర్భిణిని నిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ చేయించాడు. కానీ ఈ విషయం బయటికి లీకైంది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగి సమగ్ర దర్యాప్తు చేపట్టారు. మూడు రోజులుగా ఆస్పత్రిలో.. నల్లగొండ జిల్లా నకిరేకల్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక (16 ఏళ్లు) కడుపులో నొప్పితో బాధపడుతోందని చెప్తూ.. ఒక యువకుడు మూడు రోజుల క్రితం నిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. అప్పటికే ఆమె నాలుగు నెలల గర్భవతి అని, ఆమెను వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే తీసుకువచ్చాడని సమాచారం. ఈ విషయం వెలుగులోకి రాకుండా ఉంచేందుకు నిమ్స్‌లో తనకు తెలిసినవారితో కలసి ప్రయత్నించాడ ని తెలిసింది.వైద్యులు బాలికకు వైద్య పరీక్షలు చేసినప్పుడు.. ఆమె గర్భవతి అని గుర్తించినా, కప్పిపుచ్చే ప్రయ త్నం జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి ఆమెకు చికిత్స ఏదీ అవసరం లేకున్నా.. ఆశ్రయం ఇచ్చే ఉద్దేశంతో మిలీనియం బ్లాక్ రూమ్ నంబర్ 322లో ఇన్‌పేషెంట్‌గా చేర్చుకున్నట్టు తెలిసింది. వారు ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ విషయం బయటికి పొక్కింది. విషయం సీరియస్‌గా మారుతోందని గుర్తించిన నిమ్స్ వర్గాలు.. బుధవారం బాలికను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి చేతులు దులుపుకొనేందుకు ప్రయత్నించాయని సమాచారం. అయితే పోలీసులు నిమ్స్‌కు చేరుకుని బాలికను నల్లగొండకు తరలించినట్టు ప్రచారం జరుగుతోంది. బాలికను మోసం చేసిన సదరు యువకుడు ఆమెకు బావ అవుతాడని ఓవైపు.. ఓ మాజీ ప్రజాప్రతినిధి కుమారుడే కారణమని మరోవైపు ప్రచారం జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఈ వ్యవహా రంపై మౌనం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.మెడికో లీగల్ కేసు కిందే వైద్యం చేశాంసదరు బాలిక కడుపులో నొప్పితో బాధపడుతూ నిమ్స్‌కు వచ్చింది. ఆమెకు వైద్య పరీక్షలు చేయించిన తర్వాతే గర్భవతి అని తేలింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాం. మెడికో లీగల్ కేసు (ఎంఎల్సీ)గా పరిగణించే, ఆ తరహాలో నమోదు చేశాకే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. – ప్రొఫెసర్ నగరి బీరప్ప, నిమ్స్ డైరెక్టర్ -
నిమ్స్‌లో చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు
లక్డీకాపూల్: గుండె సమస్యలతో బాధపడే చిన్నారులకు నిమ్స్‌లో ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు ఆస్పత్రి డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప తెలిపారు. నవజాత శిశువులు మొదలు ఐదేళ్లలోపు చిన్నారుల గుండె వ్యాధులకు చికిత్స అందిస్తామని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్రిటన్‌లోని ఆల్డర్ హే చిల్డ్రన్స్ హాస్పిటల్ కార్డియాక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ రమణ దన్నపునేని ఆధ్వర్యంలోని 10 మంది సర్జన్ల బృందం నిలోఫర్ సర్జన్లు, నిమ్స్ కార్డియోథొరాసిక్ విభాగాధిపతి డాక్టర్ అమరేశ్వరరావు, ఇతర వైద్య బృందంతో కలసి నిమ్స్‌లో ఈ శస్త్రచికిత్సలు చేపట్టనున్నట్లు వివరించారు. ‘హీలింగ్ లిటిల్ హార్ట్స్ చార్లీస్ హార్ట్ హీరోస్ క్యాంప్’లో భాగంగా ఉచిత శస్త్రచికిత్సలు జరగనున్నాయని బీరప్ప పేర్కొన్నారు. తమ చిన్నారులకు ఆపరేషన్లు అవసరమైన తల్లిదండ్రులు మరిన్ని వివరాలకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య 040–23489025 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
‘నిమ్స్ ది గ్రేట్’ : మంత్రి హరీష్‌రావు ప్రశంసలు..!
హైదరాబాద్: అవయవ మార్పిడి ఆపరేషన్లలో నిజాం వైద్య విజ్ఞాన సంస్ధ(నిమ్స్) తన ప్రత్యేకతను మరోసారి చాటి చెప్పింది. గతంలో ఎన్నో విజయాలను పదిలపర్చుకున్న నిమ్స్ తాజాగా మారో అరుదైన రికార్డు సృష్టించి వైద్య రంగాలలోనే సంచలనం సృష్టించింది. ఈ ఏడాది ఎనిమిది నెలల్లోనే 100 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లను విజయవంతంగా చేసి అరుదైన రికార్డును వైద్యులు సొంతం చేసుకున్నారు. ఇందులో 61 లైవ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయగా, 39 దాతల ద్వారా సేకరించినవి.. గ్రహీతల్లో 11, 12 ఏళ్ల వయసువారు కూడా ఉండడం చెప్పుకోదగ్గ అంశం. శుక్రవారం వందో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసిన వైద్య బృందంలో యూరాలజీ వైద్యనిపుణులు ప్రొఫెసర్ రామ్‌రెడ్డి, విద్యాసాగర్, రామచంద్రయ్య, తదితరులు ఉన్నారు. వీరంతా యూరాలజీ హెచ్ఓడీ డాక్టర్ రాహుల్ దేవరాజ్ ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స మార్పిడిలు చేస్తున్నారు. గత నెలలో రూ.32 కోట్లతో సమకూర్చుకున్న అడ్వాన్స్డ్ పరిజ్ఞానం ఉన్న రోబోటిక్స్ సాయంతో యూరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాల్లో అత్యంత సంక్లిష్టమైన నెల రోజుల వ్యవధిలోనే 30 అపరేషన్లను చేశారు. గాల్‌బ్లాడర్, హెర్నియా, ఆచలాసియా కార్డియా సర్జరీలను చిన్న రంధ్రంతో సులువుగా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేస్తున్నారు. సాధారణ పద్దతుల్లో చేసే సర్జరీలతో పోల్చితే రోబోటిక్ సర్జరీలు కూడా చాలా కచ్చితంగా జరుగుతున్నాయి. ఆపరేషన్ జరిగిన మూడు రోజుల్లోనే రోగి డిశ్చార్జి కావడం విశేషం. హరీష్‌రావు మంత్రి ప్రశంసలు.. అత్యధిక మార్పిడి ఆపరేషన్లు చేసి నిమ్స్ వైద్యులు చెప్పుకోదగ్గ రికార్డును నెలకొల్పారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు ప్రశంసించారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ల్లో రికార్డు బ్రేక్ చేసి యూరాలజీ వైద్యులను మంత్రి ఎక్స్(ట్విట్టర్)లో అభినందించారు. ఈ అసాధారణ అవయవ మార్పిడి ద్వారా ప్రాణాలను కాపాడాలనే తమ అచంచలమైన నిబద్ధతను హైలైట్ చేస్తోందన్నారు. ఎంత పెద్ద శస్త్రచికిత్స అయినా.. ఎంత పెద్ద శస్త్రచికిత్సనైనా సులువుగా చేయవచ్చు. రోబోటిక్ సర్జరీలను ప్రారంభించిన అనతికాలంలోనే పెద్ద సంఖ్యలో విజయవంతంగా ఆపరేషన్లు చేయడం నిమ్స్ వైద్యుల ప్రతిభకు తార్కాణం. ఇప్పడు ఆస్పత్రిలో నొప్పి తక్కువతో.. ఇన్ఫెక్షన్లకు తావులేకుండా చేస్తున్నాం. – ప్రొఫెసర్ నగరి బీరప్ప, సంచాలకులు, నిమ్స్ -
నిమ్స్‌లో రోబోటిక్ సర్జరీలు
లక్డీకాపూల్ (హైదరాబాద్): నిమ్స్ ఆస్పత్రిలో సోమవారం నుంచి రోబోటిక్ సర్జరీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రూ.31.50 కోట్లతో నిమ్స్ కొనుగోలు చేసిన డావెన్నీ ఎక్స్ఐ రోబో యంత్రాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. రోబోటిక్ సర్జరీల నిర్వహణకు నిమ్స్ యాజమాన్యం ఇప్పటికే సీనియర్ ప్రొఫెసర్లకు శిక్షణ ఇచ్చింది. ఇందులో వివిధ విభాగాలకు చెందిన 15 మంది వైద్యులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రోబోటిక్ సర్జరీ సిస్టంతో పాటుగా స్పెషా లిటీ బ్లాక్‌లోని ఆపరేషన్ థియేటర్లలో యూరాలజీ, న్యూరో సర్జరీ విభాగాలకు సంబంధించిన ఆధునిక వైద్య పరికరాలనూ మంత్రి ప్రారంభించనున్నారు. ఇవీ ప్రయోజనాలు.. కార్పొరేట్ ఆస్పత్రులలో సుమారు రూ.1.75 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్న ఈ రోబోటిక్ సర్జరీలను నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేయనున్నారు. రోబోటిక్ శస్త్రచికిత్స వల్ల రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆపరేషన్ సక్సెస్ రేట్ కూడా నూటికి నూరు శాతం ఉంటుంది. క్లిష్టమైన మూత్రాశయం, పెద్దపేగు, చిన్న పేగు, క్లోమం, కాలేయం, గర్భసంచి, అన్నవాహిక.. తదితర సర్జరీలను రోబో విధానంలో మరింత మెరుగ్గా నిర్వహించవచ్చు. అతి సూక్ష్మమైన కేన్సర్ కణతులను సైతం తొలగించడానికి వీలుంటుంది. ముఖ్యంగా సర్జికల్ ఆంకాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, యూరాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, గైనకాజీ విభాగాల్లో మరింత మెరుగైన శస్త్ర చికిత్సలు చేయడానికి వీలుంటుంది. వైద్య సేవల్లో దేశానికే రోల్‌మోడల్ : నిమ్స్ డైరెక్టర్ బీరప్ప వైద్య సేవల్లో నిమ్స్ ఆస్పత్రి దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప అన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షలు ఖర్చయ్యే శస్త్రచికిత్సలను నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగానే చేస్తున్నామన్నారు. ఎంత పెద్ద ఆపరేషన్ చేయించుకున్నా రోగి మూడో రోజునే ఇంటికి వెళ్లే విధంగా దోహదపడే రోబోటిక్ సిస్టంను సమకూర్చుకున్నామన్నారు. స్పెషాలిటీ బ్లాక్‌లోని ఆపరేషన్ థియేటర్లలో ఏర్పాటు చేసిన ఈ రోబోటిక్ సర్జరీ సిస్టంను ప్రస్తుతానికి సర్జికల్ ఆంకాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, యూరాలజీ విభాగాలలో అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు డాక్టర్ బీరప్ప తెలిపారు. -
ఏ వైరస్ వచ్చినా ఎదుర్కొనేలా..
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో కరోనాను మించిన వైరస్లు రావొచ్చని ఇద్దరు ఎంటమాలజిస్టులు తనతో చెప్పారని.. వైద్యారోగ్య వ్యవస్థ పటిష్టంగా ఉంటే అలాంటి వాటిని ధైర్యంగా ఎదుర్కోవచ్చని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేలా వైద్యారోగ్య శాఖను తీర్చిదిద్దాలని నిర్ణయించామని చెప్పారు. బడ్జెట్లో వైద్యారోగ్య రంగానికి కేటాయింపులు భారీగా పెంచామని.. 2014లో రూ.2,100 కోట్లు కేటాయించగా, 2023–24 నాటికి ఏకంగా రూ.12,365 కోట్లకు పెరిగాయని వివరించారు. ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్యను 17 వేల నుంచి 50 వేలకు పెంచామని, అలాగే 50 వేల ఆక్సిజన్ బెడ్లు కూడా సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిమ్స్ ఆస్పత్రిలో కొత్తగా 2 వేల పడకలతో మరో బ్లాక్ నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడారు. సీఎం చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. అది వైద్యారోగ్య శాఖ ప్రాధాన్యత! ‘‘మన రాష్ట్రంలో మిడతల బెడద లేదు. కానీ మిడతల దండు హరియాణాలోకి వచ్చి అక్కడి నుంచి మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోకి ప్రవేశించి ఆదిలాబాద్ సరిహద్దు దాకా వచ్చాయి. ఆ సమయంలో కేంద్రం ఇద్దరు ఎంటామాలజిస్టులను పంపింది. అయితే మహారాష్ట్రలోనే మిడతలను మట్టుపెట్టడంతో మన వరకు రాలేదు. తర్వాత ఆ ఇద్దరు ఎంటమాలజిస్టులు నన్ను కలిశారు. సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన ఈ కాలంలోనూ మిడతల సమస్యకు పరిష్కారం కనుక్కోలేరా? అని నేను ప్రశ్నించాను. మనిషి 4 లక్షల ఏళ్ల క్రితం పుడితే.. మిడతలు, బ్యాక్టీరియాలు అంతకన్నా ముందు 8 లక్షల ఏళ్ల క్రితమే పుట్టాయి. వాటికి వ్యతిరేకంగా మనిషి చర్యలు చేపడితే ప్రకోపం చెంది ఇబ్బందులు కలిగిస్తాయి. అందుకే మిడతలను చంపలేమని, పూర్తిగా నిర్మూలించలేమని ఎంటమాలజిస్టులు వివరించారు. కరోనా కూడా అలాంటిదేనని, భవిష్యత్తులో దానిని మించిన వైరస్లు రావొచ్చని నాతో అన్నారు. వైద్యారోగ్య వ్యవస్థ పటిష్టంగా ఉంటే.. నష్టం తక్కువగా ఉంటుందని, లేకుంటే నష్టాలు భారీగా ఉంటాయని హెచ్చరించారు. వైద్యారోగ్య శాఖ ప్రాధాన్యతను దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. మానవ జీవనం ఉన్నంత కాలం వైద్యం కూడా కొనసాగుతూనే ఉంటుంది. భారీగా ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు నిమ్స్ ఆస్పత్రి భారీ విస్తరణ పనులకు శంకుస్థాపన చేయడం దేశ వైద్యారోగ్య రంగంలోనే చారిత్రక సందర్భం. కేంద్రాన్ని ప్రాధేయపడకుండా సొంతంగా 550 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయగల ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నాం. గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు అందించాం. పుట్టే బిడ్డలు ఒడ్డూ పొడుగు బాగుండాలంటే వాళ్లు గర్భంలో ఎదిగే కాలంలో ఎలాంటి ఆటంకం ఉండకూడదు. ఒకసారి స్టంటింగ్ సమస్య ఏర్పడితే.. మళ్లీ ఎదుగుదల చూడాలంటే వంద సంవత్సరాల కాలం పడుతుంది. చాలా మందికి ఈ విషయం తెలియదు. ఈ సమస్యను అధిగమించేందుకు ఇస్తున్నవే న్యూట్రిషన్ కిట్లు. గాంధీ ఆస్పత్రి సేవలు అమోఘం కరోనా కాలంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ గొప్పగా పనిచేసింది. ఆ సమయంలో రోగులకు ధైర్యంగా సేవలు అందించిన గాంధీ ఆస్పత్రి వైద్యులను అభినందిస్తున్నా. అయితే ఎంత చేసినా వైద్యశాఖకు పలు దిక్కుల నుంచి విమర్శలు వస్తుంటాయి. నిరుపేదలు వైద్యం కోసం వస్తే.. బెడ్లు అందుబాటులో లేనప్పుడు వైద్యులు ఉదార హృదయంతో ఒక అరగంట ఎక్కువ పనిచేసైనా, కింద బెడ్డు వేసి అయినా వైద్యం అందిస్తారు. కానీ ఆస్పత్రిలో బెడ్లు లేవని, పేషెంట్లను కింద పడుకోబెడుతున్నారని ప్రచారం జరుగుతుంది. అందువల్ల ప్రజా సంబంధాల వ్యవస్థను మరింతగా మెరుగుపరుకోవాలి. సేవలు మరింత పెరగాలి వైద్యారోగ్య రంగంలో చాలా మార్పులు రావాలి. ఆస్పత్రుల నిర్మాణాలే కాదు.. ఆస్పత్రుల్లో సేవలు కూడా పెరగాలి. ఈ రోజు మనం ఏ స్టేజ్‌లో ఉన్నాం, ఇంకా ఎంత ముందుకు పోవాల్సి ఉంది? జరగాల్సిన కొత్త ఆవిష్కరణలు ఏంటి? చేపట్టాల్సిన చర్యలేమిటన్న ప్రణాళికల కోసం సమయం కేటాయించాలి. ప్రజల బాగు కోసం ఇంకా ఏం చేయాలనే తపన వైద్యాధికారులకు ఉండాలి. అపవాదులను తొలగించుకొని రాష్ట్రంలో వైద్యశాఖనే నంబర్ వన్ అని పేరొచ్చేలా కృషి చేయాలి. భారీగా ఆస్పత్రుల నిర్మాణం రాష్ట్రంలో గొప్పగా ఆస్పత్రులు నిర్మిస్తున్నాం. వరంగల్‌లో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి రానుంది. ఒకప్పుడు నిమ్స్‌లో 900 పడకలుంటే.. తెలంగాణ వచ్చాక 1,500 పడకలకు పెంచాం. మరో 2 వేల పడకల సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాం. హైదరాబాద్‌లో టిమ్స్ కింద నాలుగువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు కడుతున్నాం. విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అద్భుతమైన వైద్య సేవలు, టెలీ మెడిసిన్ సేవలు అందుతాయి..’’ అని కేసీఆర్ చెప్పారు. న్యూట్రిషన్ కిట్ల పంపిణీ ప్రారంభం నిమ్స్ కార్యక్రమం సందర్భంగా.. హైదరాబాద్‌లో గర్భిణులకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీని కూడా సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. తన చేతుల మీదుగా ఆరుగురికి న్యూట్రిషన్ కిట్లను అందచేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని, ఎంపీ కె.కేశవరావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తాతా మధు, మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నేడు నాగ్‌పూర్‌కు కేసీఆర్ – బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గురువారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు వెళ్తున్నారు. ఆయన హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12 గంటల సమయంలో నాగ్‌పూర్‌కు చేరుకుంటారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మహారాష్ట్రకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో భేటీ అవుతారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొని తిరుగు ప్రయాణమవుతారు. సాయంత్రం 4 గంటల సమయంలో హైదరాబాద్‌కు చేరుకుంటారు. హైదరాబాద్ బయట మూడో కార్యాలయం.. నాగ్‌పూర్ కార్యాలయం బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ వెలుపల మూడో కార్యాలయం కానుంది. ఇప్పటికే ఢిల్లీలోని వసంత్ విహార్‌లో పార్టీ కేంద్ర శాశ్వత కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఏపీలోనూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఓ అద్దె భవనంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. తాజాగా నాగ్‌పూర్‌లో ఏర్పాటు చేశారు. త్వరలో ఔరంగాబాద్, పుణేలోనూ బీఆర్ఎస్ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది. -
దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రుల్లో ఒకటిగా నిమ్స్: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: నిమ్స్ దవాఖాన విస్తరణ పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం భూమిపూజ చేశారు. మొత్తం 33 ఎకరాల్లో చేపడుతున్న నిమ్స్ విస్తరణ పనులకు ప్రభుత్వం రూ. 1,571 కోట్లు కేటాయింది. అదే విధంగా నిమ్స్‌లో.. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకొని నిర్మిస్తున్న దశాబ్ధి బ్లాక్‌కు నూతన భవనం ‘దశాబ్ది టవర్’కు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. కాగా కొత్త భవనం నిర్మాణంలో 4వేల పడకలతో దేశంలోనే అతిపెద్ద హాస్పిటళ్ల జాబితాలోకి నిమ్స్ చేరనుంది. కొత్త బ్లాక్ నిర్మాణంతో 38 విభాగాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా 2 వేల పడకలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం మూడు బ్లాక్‌లుగా దశాబ్ది టవర్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఓపీ,ఏపీ, ఎమర్జెన్సీ సేవల కోసం ప్రత్యేక బ్లాక్‌లు నిర్మిస్తున్నారు. ప్రత్యేకంగా ఓపీ సేవల కోసం 8 అంతస్తుల్లో ఓ బ్లాక్, ఎమర్జెన్సీ సేవల కోసం 8 అంతస్తులతో ఓ బ్లాక్ నిర్మాణం చేస్తున్నారు. ఇన్ పేషంట్ల కోసం 13 అంతస్తులతో మరో బ్లాక్ నిర్మిస్తున్నారు. కొత్త భవనంలో మొత్తం 30 ఆపరేషన్ ధియేటర్లు ఉండనున్నాయి. ప్రతి రోజు నిమ్స్‌కు రోజుకు 2000-3000 ఔట్ పేషెంట్లు వస్తుంటారు. న్యూట్రిషన్ కిట్ల పంపిణీ నిమ్స్‌లో న్యూట్రిషన్ కిట్ల పంపిణీని కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆరుగురు గర్భిణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి న్యూట్రిషన్ కిట్ల పంపిణీ జరగుతుండగా.. తెలంగాణలో 6.8 లక్షల మంది గర్భిణులకు ప్రయోజనం చేకూరనుంది. ఇందులో మొత్తం 8 రకాల వస్తువులు కిట్‌లో అందిస్తున్నారు. ఇందుకోసం బడ్జెట్లో రూ.250 కోట్లు కేటాయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. బడ్జెట్లో ఆరోగ్య రంగానికి ఎక్కువ నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. నిమ్స్‌ను 17 వేల పడకల నుంచి 50 వేల పడకలకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. 550 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 4 వేల పడకలతో దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రుల్లో ఒకటిగా నిమ్స్ ఉండనుందని అన్నారు. చదవండి: సీడబ్ల్యూసీకి కొత్త టీమ్! తెలంగాణ నుంచి ఒకరికి చాన్స్? -
వైఎస్ భాస్కర్ రెడ్డి నిమ్స్‌కు తరలింపు..
సాక్షి, హైదరాబాద్: వైఎస్ భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంచల్‌గూడ జైలు అధికారులు శనివారం ఉదయం భాస్కర్ రెడ్డిని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిమ్స్‌లో వైద్య చికిత్సలు, యాంజియోగ్రామ్ చేయనున్నారు వైద్యులు. కాగా, వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా చంచల్‌గూడ సెంట్రల్ జైల్లో ఉన్న వైఎస్ భాస్కర్‌రెడ్డి శుక్రవారం ఉదయం అస్వస్థతకు గురవడంతో జైలు అధికారులు ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు. భాస్కర్‌రెడ్డికి బీపీ లెవల్స్ తగ్గడంతో జైలు అధికారులు ఆయనను ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. చికిత్స అనంతరం తిరిగి జైలుకు తరలించారు. భాస్కర్‌రెడ్డికి హృదయ సంబంధ సమస్యలు ఉన్నట్టు గుర్తించిన డాక్టర్లు ఆయనకు యాంజియోగ్రామ్ చేయించాలని సూచించినట్లు తెలిసింది. వైద్యుల సూచన మేరకు భాస్కర్‌రెడ్డిని నిమ్స్‌కు తీసుకువచ్చారు. ఇది కూడా చదవండి: ఎంపీ అవినాష్ రెడ్డి తల్లిదండ్రులిద్దరికీ అస్వస్థత -
నిమ్స్‌లో 2 వేల పడకల భవనం
సాక్షి, హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రి విస్తరణలో భాగంగా నిర్మించ తలపెట్టిన 2,000 పడకల నూతన భవనానికి త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా భూమి పూజ చేయనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. దీనికోసం సత్వరమే ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న జనాభా అవసరాల నేపథ్యంలో హైదరాబాద్ నలువైపులా ఒక్కోటి వెయ్యి పడకలు కలిగి ఉండే టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణంతోపాటు, నిమ్స్ విస్తరణకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. మొత్తం మూడు బ్లాకుల్లో ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ సేవలు అందించేలా నిర్మాణానికి అనుమతులు తీసుకోవాలన్నారు. మంగళవారం సచివాలయంలో వైద్య ఉన్నతాధికారులతో నిర్వహించిన తొలి సమీక్షలో హరీశ్‌రావు మాట్లాడారు. 8 అంతస్తుల్లో నిర్మించే నూతన భవనం అందుబాటులోకి వస్తే, పడకల సంఖ్య 3,500కు చేరుతుందన్నారు. అంతేగాక, సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ నిర్మాణం పూర్తయితే మరో 200 పడకలు అందుబాటులోకి వస్తాయని, దీంతో ఒక్క నిమ్స్‌లోనే మొత్తం 3,700 పడకలు ఉంటాయన్నారు. అలాగే, గాంధీ ఆసుపత్రిలో నిర్మిస్తున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలని హరీశ్‌రావు ఆదేశించారు. ఇదే దేశంలో తొలి సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ అవుతుందని చెప్పారు. సంతాన సాఫల్య కేంద్రం పనుల వేగం పెంచండి గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటుచేస్తున్న సంతాన సాఫల్య, అవయవ మార్పిడి కేంద్రాల పనులు వేగవంతం చేయాలని హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. నిమ్స్ ఆసుపత్రిలో ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు చేస్తున్నట్లుగా, గాంధీలోనూ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌ను నిర్దేశించారు. బ్రెయిన్‌డెడ్ డిక్లరేషన్లు జరిపి, అవసరమైన వారికి అవయవాలు అందించి పునర్జన్మ పొందేలా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లు సరఫరా చేయకున్నా, రాష్ట్ర ప్రభుత్వం సమీకరించి పీహెచ్సీ, బస్తీ దవాఖానా, సీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కోవిడ్ సహా అన్ని రకాల వ్యాక్సినేషన్లో తెలంగాణ మొదటిస్థానంలో ఉండేలా కృషి చేయాలని సంబంధిత విభాగానికి ఆదేశించారు. ఆదర్శప్రాయంగా ఉండాలి ఆసుపత్రికి అందరికంటే ముందుగా వచ్చి, అందరి తర్వాత వెళ్లే డైరెక్టర్లు, సూపరింటెండెంట్లు ఆదర్శప్రాయులని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. ప్రతి రోజూ రెండు గంటలపాటు ఆసుపత్రుల్లో రౌండ్లు వేస్తూ, అన్ని విభాగాలు సందర్శిస్తే మెజార్టీ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. బాధ్యతగా పని చేసి ప్రజల మన్ననలు పొంది, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఆరోగ్య రంగంలో దేశంలోనే తెలంగాణను మొదటిస్థానంలో నిలిపేందుకు సీఎం కేసీఆర్ రూ.12 వేల కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించినట్లు చెప్పారు. సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య శ్రీ సీఈవో విశాలాచ్చి, డీఎంఈ రమేష్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాసరావు, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, సీఎం ఓఎస్డీ గంగాధర్, నిమ్స్ ఇంచార్జి డైరెక్టర్ బీరప్ప తదితరులు పాల్గొన్నారు. -
కారేపల్లి ఘటనలో కుట్ర కోణం.. కేటీఆర్ ఏమన్నారంటే!
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా కారేపల్లి అగ్నిప్రమాద బాధితులను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన నలుగురు బాధితులు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి నిమ్స్‌కు చేరుకున్న మంత్రి కేటీఆర్.. బాధితులను పరామర్శించారు. నలుగురి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించాలని ఆదేశించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. కారేపల్లి ఘటన దురదృష్టకరమని అన్నారు. ప్రమాదంలో కుట్ర కోణం ఉందో లేదో దర్యాప్తులో తేలుతుందన్నారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు రూ 10 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు వెల్లడించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని వైదులను కోరినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తాము అండగా ఉంటామన్నారు. చదవండి: కాళ్లు తెగి ముక్కలై.. బతుకుల్లో నిప్పు పెట్టిన బాణసంచా కాగా, ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనంలో ప్రమాదవశాత్తు సిలిండర్ పేలిన విషయం తెలిసిందే. కారేపల్లి మండలం చీమలపాడులో ఈఘటన చోటుచేసుకుంది. బాణసంచాతో గుడిసెకు నిప్పు అంటుకోవడతో సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురికి కాళ్లు తెగిపోగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా.. మరికొందరికి నిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. ఘటన తర్వాత కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నిమ్స్‌లో నర్సుల మెరుపు సమ్మె.. యాజమాన్యం ఏం చెబుతోందంటే?
సాక్షి, హైదరాబాద్: నిమ్స్ అసుపత్రిలో నర్సులు విధులు బహిష్కరించి మెరుపు సమ్మెకు దిగారు. ఇంచార్జ్ డైరెక్టర్ అదనపు డ్యూటీలు వేస్తూ ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆరోపిస్తూ నర్సులు ఆసుపత్రి ప్రాంగణంలో నిరసన చేపట్టారు. దీంతో ఆదివారం రాత్రి నుంచి నిమ్స్‌లో వైద్య సేవలు నిలిచిపోయాయి. నర్సుల ఆందోళనతో ఆపరేషన్లకు అంతరాయం ఏర్పడింది. నర్సుల ధర్నాపై యాజమాన్యం స్పందంచింది. ఉదయం ఎనిమిది గంటల నుంచి నర్సులు స్ట్రైక్ చేయడం దురదృష్టకరమని కమిటీ మెంబర్ శ్రీ భూషణ్ తెలిపారు. ఎవరికీ చెప్పకుండా ఆందోళన చేస్తున్నారని, కనీసం కారణం కూడా చెప్పడం లేదన్నారు. ఉదయం నుంచి ఆసుపత్రిలోనే ఉన్నప్పటికీ తనతో మాట్లాడటానికి ఎవరూ రావడం లేదని తెలిపారు. హెచ్‌వోడీ, డైరెకర్టర్ను దుర్భాషలాడుతున్నారని ఆరోపించారు. ‘నర్సుల ధర్నాతో ఆసుపత్రిలో సేవలు ఆగిపోయాయి. ఒకరికి ఇద్దరికీ ఉన్న సమస్య లను అందరికీ ఆపాదిస్తున్నారు. సమ్మె ఎందుకు చేస్తున్నారనే కారణం వారికి కూడా తెలియదు. పాత కారణాలు ఇప్పుడు చెప్తున్నారు. బాధ్యతయుతమైన హోదాలో ఉండి పద్దతి లేకుండా విధులు బహిష్కరణ చేశారు. నర్సుల ఆందోళనతో ఆపరేషన్ థియేటర్స్ లో పిల్లలు ఆపరేషన్ కోసం ఫాస్టింగ్‌తో ఉన్నారు. ఇప్పుడు వారి తల్లదండ్రులకు ఏం చెప్పాలి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 1400 మంది రోగులు ఉన్నారని, ఎంతో మంది పేషెంట్లకు వారి అవసరం ఉందని ఇంచార్జి డైరెక్టర్ బీరప్ప తెలిపారు. ఒక స్ట్రైక్ చేయాలంటే పద్దతి ఉంటుందని.. ఒకరిద్దరికీ మెమో ఇస్తే అందరూ సమ్మె చేయడం ఏంటని మండిపడ్డారు. తాను అందరికీ అందుబాటులో ఉన్నానని. రోజూ ప్రతి ఒక్కరినీ కలుస్తున్నానని తెలిపారు. తాను ఉన్నంత వరకు ఇక్కడ ఎటువంటి ఫేవరేటిజం ఉండదని స్పష్టం చేశారు. నర్సుల సమస్యల వినడానికి ఉదయం 9:30 నుంచి ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. నిరసనలో కూర్చున్న చాలా మందికి ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారో కూడా తెలియదు. ఇవాళ స్ట్రైక్ చేయాలి అని చెప్తే చేస్తున్నారు. ముగ్గురుకి ఇచ్చిన మెమోల కారణంగా అందరినీ ఇలా చేయటం కరెక్ట్ కాదు. ఒక నర్సు ఏడాదిలో 143 రోజులు ఆలస్యంగా వచ్చారు. అది రిజిష్టర్‌లో రికార్డు కాలేదు. అందుకే మెమో ఇచ్చాం. మరో నర్సు 19 రోజులు రాలేదు. కానీ సీఎల్ లీవులు వాడలేదు. అందుకే మెమోలు ఇచ్చాం’ అని తెలిపారు. -
నిమ్స్ బిల్లింగ్ విభాగానికి మోక్షం
లక్డీకాపూల్ : నిమ్స్ ఆస్పత్రిలో అతి కీలకమైన బిల్లింగ్ విభాగానికి యాజమాన్యం సరికొత్త హంగులను సమకూర్చింది. ఆస్పత్రిలో మూడు దశాబ్దాల తర్వాత ఈ విభాగానికి మోక్షం లభించింది. మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చే అవుట్ పేషెంట్లు, ఇన్పేషేంట్లకు సంబంధించిన బిల్లులు చెల్లింపులను ఈ విభాగం నిర్వహిస్తోంది. నిన్న మొన్నటి వరకు ఈ విభాగం పాత బిల్డింగ్‌లో ఓ మూలకు ఉన్నట్టుగా ఉండేది. ఆస్పత్రిలో చికిత్స పొంది తిరిగి ఇంటికి వెళ్లే రోగులు డిశ్చార్జి సమయంలో తీవ్ర జాప్యం ఎదురయ్యేది. బిల్లింగ్ విభాగంలో సిబ్బంది కొరత కారణంగా డిశ్చార్జి ప్రక్రియ ఆలస్యమవుతుందన్న విమర్శలు కూడా ఉన్నాయి. వాస్తవానికి ఈ విభాగం ఆరంభంలో రోజుకి కేవలం 400 మంది రోగులు మాత్రమే ఓపీ సేవలు పొందేవాళ్లు. ప్రస్తుతం దాదాపుగా మూడు వేల మంది వరకు అవుట్ పేషెంట్ విభాగంలో వైద్యసేవలు పొందుతున్నారు. ఆస్పత్రి పడకల సామర్ధ్యం కూడా గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం 1500 పడకల వరకు రోగులకు చికిత్స అందిస్తున్న పరిస్థితులు. అయినా బిల్లింగ్ విభాగం మాత్రం నానాటికి సిబ్బంది కొరతను ఎదుర్కొంటుంది. గతంలో 18 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఈ విభాగంలో విధులు నిర్వహించే పరిస్థితి. వాళ్లలో 11 మంది పదవీ విరమణ చెందారు. ఆ స్థానంలో ఎలాంటి భర్తీలు చేపట్టకపోవడంతో ఉన్న కొద్ది పాటి సిబ్బందిపై విపరీతమైన పనిభారం పడింది. అది కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులపై ఈ విభాగం ఆధారపడి పని చేస్తుందన్న వ్యాఖ్యలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఓ మూలకు ఉండే బిల్లింగ్ విభాగానికి సర్వ హంగులు కల్పిస్తూ.. సరికొత్త విభాగాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌రావు చొరవతో తెలంగాణ వైద్య సేవలు, మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్ధ నిర్మించిన ఈ విభాగాన్ని సోమవారం ఉదయం ఇంచార్జి డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప ప్రారంభించనున్నారు. పేషెంట్ కేర్‌ను దృష్టిలో పెట్టుకుని బిల్లింగ్ విభాగాన్ని ఆధునీకరించిన విధంగా ఆ విభాగం సిబ్బందిని కూడా బలపేతం చేయాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. రిటైర్డ్ అయిన ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బంది నియామకం చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని. ఆ దిశగా యాజమాన్యం సానుకూలంగా స్పందించాలని కోరుతున్నారు. అప్పుడు రోగులకు సకాలంలో మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ విభాగం దోహదపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
గుండెలు పగిలేలా రోదిస్తున్న ప్రీతి తల్లిదండ్రులు
జనగామ: నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసిన మెడికో విద్యార్థి ప్రీతి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బరువెక్కిన హృదయాలతో బోరున విలపిస్తున్నారు. మరొకవైపు ప్రీతికి కడసారి వీడ్కోలు పలికేందుకు స్థానికులు తరలివస్తున్నారు. కొడకండ్ల మండలం గిర్ని తండాలో ప్రీతి భౌతికకాయానికి నేడు అంత్యక్రయలు జరుగనున్నాయి. తమతో పాటు తిరిగే కూతురు ఇలా విగత జీవిలా పడి ఉండటం చూసి తల్లిదండ్రులకు దుఃఖం ఆగడం లేదు. ఈ క్రమంలోనే ప్రీతి తండ్రి నరేందర్ శోకతప్ప హృదయంతో తమ కూతుర్ని హత్యే చేశారంటూ విలపిస్తున్నారు. ప్రీతిది ఆత్మహత్య కాదని, హత్యేనని తండ్రి నరేందర్ గుండెలు పగిలేలా రోదిస్తున్నాడు. ప్రీతి మృతదేహాన్ని బలవంతంగా గిర్ని తండాకు తరలించారని, బోడుప్పల్‌లోని ఇంటికి తీసుకెళ్తామన్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఆమె ఏం తీసుకుందో ఇప్పటి వరకు నిర్థారణ కాలేదు. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు చేపట్టాలి. మరొకరు ప్రీతిలా మారకుండా ఉండాలంటే వేధింపులకు పాల్పడిన సైఫ్ పై ఉరితీయాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేఎంసీ ప్రిన్సిపల్, హెచ్ఓడిను సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. బంధుమిత్రులు వచ్చాక మద్యాహ్నం అంతిమయాత్ర చేపడుతాం.’ అని తండ్రి నరేందర్ తెలిపారు. మరొకవైపు ప్రీతి మృతి చెందడానికి సైఫ్ ఒక్కడే కాదు ఇంకా కొందరి ప్రేమయం ఉందని ఆమె సోదరి ఆరోపించింది. తనకు తానుగా మత్తు ఇంజక్షన్ తీసుకోలేదు.. కొందరు పట్టుకుంటే, సైఫ్ ఇంజక్షన్ చేశాడు. నలుగుర్ని ఎదురించే బలం కూడా ప్రీతికి లేదు. అంటూ ప్రీతి సోదరి పేర్కొన్నారు. -
పీజీ వైద్య విద్యార్ధిని ప్రీతి మృతి
-
ప్రీతిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం
లక్డీకాపూల్ (హైదరాబాద్)/సాక్షి, వరంగల్: పీజీ వైద్యవిద్యార్థిని ️ప్రీతిని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నామని నిమ్స్ వైద్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమెకు ప్రొటోకాల్ ప్రకారం వైద్య చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రీతి ఆరోగ్యంపై శనివారం యాజమాన్యం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా నిమ్స్ వైద్య బృందం సభ్యులు మాట్లాడుతూ.. ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందన్నారు. ప్రస్తుతం ఆమెకు ఎక్మో సపోర్ట్‌తో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామన్నారు. కాగా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ పరిస్థితిలో ఉన్న ప్రీతిని నిమ్స్‌కు తీసుకువచ్చారని వైద్యులు తెలిపారు. తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌లు నిమ్స్‌కు వచ్చి ప్రీతి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ప్రీతి ర్యాగింగ్ ఘటనకు మతం రంగు పులిమి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రగతిభవన్‌లో కూడా పేదవర్గాలపై కనబడకుండా ర్యాగింగ్ జరుగుతోందని తెలిపారు.ప్రీతి విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిష్పాక్షికంగా విచారణ: మంత్రి హరీశ్‌రావు ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు భరోసా కల్పించారు. నిష్పాక్షికంగా పూర్తి విచారణ జరుగుతుందని, దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రీతి ఆరోగ్యంపై మంత్రి సమీక్షించారు. ఆమెకు అందిస్తున్న వైద్యం గురించి, చికిత్స చేస్తున్న ప్రత్యేక వైద్య బృందాన్ని ఆరా తీశారు. డాక్టర్ ప్రీతికి అత్యుత్తమ చికిత్స అందించాలని వైద్యులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. సైఫ్ విషయంలో ఏం చేద్దాం?: పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో అరెస్టయిన సీనియర్ విద్యార్థి సైఫ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ) అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే ర్యాగింగ్, వేధింపుల కేసులో అరెస్టయి జైలుకెళ్లిన సైఫ్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కాళోజీ హెల్త్‌వర్సిటీకి.. కేఎంసీ ప్రిన్సిపల్ మోహనదాస్ శనివారం లేఖ రాశారు. సోమవారంలోగా నిర్ణయం రావొచ్చని, అక్కడి నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా సైఫ్‌పై చర్యలు ఉంటాయని ప్రిన్సిపల్ శనివారం ‘సాక్షి’కి తెలిపారు. అలాగే, కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా కేఎంసీలో సోమవారం ర్యాగింగ్ నియంత్రణ కమిటీ సమావేశమై నివేదికను రూపొందించి పంపుతుందన్నారు. ప్రీతి కేసులో సైఫ్‌పై ఆరోపణలు రుజువైతే అతడి పీజీ అడ్మిషన్‌ను రద్దు చేసే అవకాశం ఉందని చెపుతున్నారు. ఒకవేళ ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించేలా సైఫ్ వ్యవహార శైలి ఉందని రుజువైతే ఎంబీబీఎస్ పట్టా కూడా రద్దు కావచ్చంటున్నారు. ఏమైనా.. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు లోబడి చర్యలుంటాయని మోహన్‌దాస్ తెలిపారు. ‘సర్’పై సర్వత్రా చర్చ: కేఎంసీ కాలేజీలో సీనియర్లను.. జూనియర్లు ‘సర్’అని పిలుస్తున్నారని, దీనిపై దృష్టి సారించాల్సి ఉందని వరంగల్ పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఇలా పిలిపించుకోవడం ర్యాగింగ్ కిందికే వస్తుందని వరంగల్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అభిప్రాయపడింది. సీనియర్లు, జూనియర్ల మధ్య ‘సర్’అనే పదం చాలా గ్యాప్ తీసుకొస్తుందని నిపుణులు అంటున్నారు. -
అత్యంత విషమంగా మెడికో ప్రీతి ఆరోగ్యం.. హెల్త్ బులెటిన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని వైద్యులు ప్రకటించారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రీతి కిడ్నీ, గుండె పనితీరు కొంచెం మెరుగవుతుందని, నిపుణులైన వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందని తెలిపారు. ఆమెను కాపాడేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోన్నామని బులిటెన్‌లో పేర్కొన్నారు. మరోవైపు మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై విచారణ కొనసాగుతోంది. వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ విద్యార్థి సైఫ్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. ఫోన్ చాటింగ్‌తోపాటు పలు కీలక ఆధారాలు సేకరించారు. సైఫ్‌పై ఎస్సీ,ఎస్టీ, అట్రాసిటీ, ర్యాగింగ్ కేసులు నమోదు చేశారు. అసలేం జరిగిందంటే.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న పీజీ వైద్యవిద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది. జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన ప్రీతి కేఎంసీలో పీజీ (అనస్థీషియా) మొదటి సంవత్సరం చదువుతోంది. శిక్షణలో భాగంగా ఎంజీఎంలో విధులు నిర్వహిస్తోంది. జనవరి 22న పాయిజన్ ఇంజిక్షన్ తీసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. అపస్మారక స్తితిలోకి వెళ్లి యువతి ఒక్కసారిగా కుప్పకూలంతో సహచర విద్యార్థులు, డాక్టర్లు ఆమెను వెంటనే ఎమర్జెన్సీ వార్డులోకి తరలించి, అత్యవసర వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హూటాహుటిన హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రీతి ప్రాణాల కోసం పోరాడుతోంది. ప్రీతిని కాపాడేందుకు నిమ్స్ వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే కాలేజీలో సీనియర్ వేధింపులతోక ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సీనియర్ విద్యార్థి సైఫ్‌పై కాలేజీ యజమాన్యానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆమె తండ్రి నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన యువతి అంటూ అవమానపరుస్తూ వేధింపులకు గురిచేశారని ఆరోపించారు.సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
డాక్టర్‌గా ప్రీతి హెల్త్ కండీషన్ నాకు తెలుసు: తమిళిసై కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌కు చెందిన పీజీ వైద్య విద్యార్థి ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. కాగా, ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. ప్రీతికి ఎక్మో సపోర్ట్‌తో చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ప్రీతి ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఈ సందర్భంగా తమిళిసై.. నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం, ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఒక డాక్టర్‌గా నేను ప్రీతి కండీషన్ అర్థం చేసుకోగలను. ఆమె ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉంది.. ఆరోగ్యపరంగా తనకు ఎటువంటి సహాయం అందజేయాలో నిమ్స్ వైద్యులు అందిస్తున్నారు. ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేము. ప్రీతి ఆరోగ్యంతో బయటకు రావాలని అందరం ప్రార్థిద్దాము. ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సీనియర్ ర్యాగింగ్ అని పేరెంట్స్ చెబుతున్నప్పటికీ ఇప్పుడే ఒక కంక్లూషన్కి రాలేము. ఆమె యూపీఎస్సీ ఇంటర్వ్యూలో పాల్గొన్నట్టు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఒక బెస్ట్ స్టూడెంట్ ఇలా అవ్వడం బాధాకరం. డాక్టర్లు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని కోరుతున్నాను అంటూ కామెంట్స్ చేశారు. -
ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించిన గవర్నర్ తమిళిసై
-
ప్రీతి కేసు: పోలీస్ కస్టడీలో సీనియర్ మెడికో సైఫ్!
వరంగల్: వరంగల్ మెడికల్ కాలేజీ పీజీ స్టూడెంట్ ప్రీతి కేసుకు సంబంధించి సీనియర్ పీజీ వైద్య విద్యార్థి సైఫ్ ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ప్రీతి కేసులో కీలకంగా పరిగణిస్తున్న సైప్ను కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య విద్యార్థిని వేధించిన కేసులో సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు వేధింపుల కేసు నమోదు చేశారు మట్టేవాడ పోలీసులు. ఈ క్రమంలోనే ఎంజీఎం ఆసుపత్రిలోని అనస్తీషియా విభాగంలోని సీనియర్ వైద్యులను పోలీసులు విచారించారు. ఇదిలాఉంచితే, ప్రీతికి ఎక్మో సపోర్ట్‌తో చికిత్స అందిస్తున్నట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు. సీఆర్ఆర్పీ ద్వారా కిడ్నీ ఫంక్షన్ చేయిస్తున్నామని, ప్రీతి మల్టీ ఆర్గాన్స్ పూర్తిగా ఫెయిల్ అయ్యాయన్నారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తాజా హెల్త్ బులెటన్లో వైద్యులు వెల్లడించారు. -
ప్రాణాలతో పోరాడుతున్న ప్రీతి.. అత్యంత విషమంగా పీజీ వైద్య విద్యార్థిని పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: వరంగల్ మెడికల్ కాలేజీ పీజీ స్టూడెంట్ ప్రీతి ప్రాణాలతో పోరాడుతోంది. ప్రస్తుతం నిమ్స్‌లోని ఏఆర్సీయూలో వెంటిలేటర్‌పైనే ఆమెకు చికిత్స కొనసాగుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు. అవయవాలు దెబ్బతినడంతో పాటు బ్రెయిన్ డ్యామేజ్ అయినట్లు వైద్యులు చెబుతున్నారు. మత్తు ఇంజక్షన్ వల్లే ప్రీతి అపస్మారక స్థితిలోకి వెళ్లిందని వెల్లడించారు. ఆమెను కాపాడేందుకు డాక్టర్ పద్మజా నేతృత్వంలోని అయిదుగురు వైద్యుల బృందం తీవ్రంగా శ్రమిస్తుంది. అనస్తేషియా, కార్డియాలజీ, న్యూరాలజీ, జనరల్ ఫిజిషియన్ డాక్టర్లు ప్రీతికి వైద్య చికిత్స అందిస్తున్నారు. చికిత్సకు ప్రీతి శరీరం సహకరించడం లేదని, బీపీ, పల్స్ రేట్ నమోదు కానీ పరిస్థితి వచ్చిందన్నారు. వరంగల్ నుంచి నిమ్స్‌కు తీసుకువచ్చే సమయంలో రెండుసార్లు గుండె ఆగిపోయిందని.. వైద్యులు సీపీఆర్ చేసి మళ్లీ గుండె కొట్టుకునేలా చేశారని తెలిపారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడే ఏమి చెప్పలేమని నిమ్స్ వైద్యులు చెబుతున్నారు. కాగా వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్‌లో సీనియర్ వేధింపులతోక వైద్య విద్యార్థిని ప్రీతి బుధవారం మత్తు ఇంజక్షన్ వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. వెంటనే అప్రమత్తమైన సహా విద్యార్థులు, వైద్య సిబ్బంది వరంగల్‌లోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం ఎంజీఎంకు మార్చారు. బాధితురాలి ఆరోగ్యం విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హూటాహుటిన వరంగల్ నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం నిమ్స్‌లో ప్రీతికి చికిత్స అందిస్తున్నారు. సైఫ్ వేధింపుల వల్లే.. కాలేజీలో సీనియర్ ర్యాగింగ్ వల్లే తన కుమార్తె ఆత్మహత్యాయత్నం చేసిందని బాధితురాలి తల్లిదండ్రులు చెబుతున్నారు. నవంబర్‌లో ప్రీతి కేఎంసీలో చేరిందని, డిసెంబర్ నుంచి ఆమెకు వేధింపులు ప్రారంభమయ్యాయని తెలిపారు. దీనిపై కాలేజీ యజమాన్యానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆమె తండ్రి నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన యువతి అంటూ అవమానపరుస్తూ వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. ‘జనవరి 20వ తేదీనకాలేజీ దగ్గరికి వెళ్లానని, ఉన్నతాధికారులకు వేధింపుల గురించి తెలియజేశాను. కానీ ఎవరూ పట్టించుకోలేదు. సీనియర్లు కదా మామూలుగా ర్యాగింగ్ ఉంటుంది అనుకున్నాం. వేధింపులకు పాల్పడుతున్న సైఫ్‌తో మాట్లాడుతానని ప్రీతికి చెప్పా. వద్దు, మళ్ళీ ఇబ్బందులు ఉంటాయి. మార్కులు తక్కువ వేస్తారు అని భయపడింది. ఎంతో ధైర్యంగా ఉండేది. కరోనాలో కూడా విధులు నిర్వర్తించింది. అలాంటి ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిందంటే సైఫ్ ఎంతగా వేధించాడో. కాలేజీకి చెడ్డ పేరు ఎక్కడో వస్తుందోనని నిమ్స్‌కు తీసుకువచ్చారు. వరంగల్‌లో గొడవ అవుతుందని కావాలని హైదరాబాద్ తరలించారు. మాకు న్యాయం చేయాలి. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపుల వల్ల నా బిడ్డ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రీతికి మెరుగైన వైద్యం అందించాలి. మా బిడ్డ ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. వాడికి శిక్ష పడాలి. చాలా దారుణంగా వేధించాడు. మా బిడ్డ పూర్తిగా ఆరోగ్యంగా ఉంది. ప్రీతికి ఎటువంటి ఆనారోగ్యం లేదు. చదువుల్లో నంబర్ వన్. పోలీసు ఫిర్యాదు తర్వాత సైఫ్ వేధింపులు తీవ్రతరమయ్యాయి. సైఫ్‌ను కఠినంగా శిక్షించాలి’ అని డిమాండ్ చేశారు. తప్పుడు ఆరోపణలు సరికావు: జూనియర్ డాక్టర్లు ఆధారాలు లేకుండా సీనియర్ విద్యార్థిపై ఆరోపణలు చేయడం సరికాదని జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు. ఘటనపై ప్రస్తుతం అధికారుల విచారణ జరుగుతోందని, విచారణపూర్తయ్యే వరకు తప్పుడు ఆరోపణలు చేయవద్దని పేర్కొన్నారు. అయితే ర్యాంగింగ్ లాంటిదేమి జరగలేదని కేఎంసీ ప్రిన్సిపాల్ వెల్లడించారు. ఇదిలా ఉండగా ప్రీతి ర్యాగింగ్ కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ప్రీతిని వేధించిన సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సైఫ్‌ను పోలీసులు విచారించనున్నారు. సైఫ్ స్వస్థలం హనుమకొండ జిల్లా కాజీపేట. -
చేయని ఆపరేషన్‌కు కుట్లు తీయాలన్న వైద్యులు..షాకైన పేషెంట్
సాక్షి, హైదరాబాద్: క్లిష్టమైన రోగమైనా ఇక్కడ ఇట్టే నయమవుతుందనే నమ్మకం. కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.లక్షలు ఖర్చు చేసినా దొరకని స్పెషాలిటీ వైద్య సేవలు ఇక్కడ తక్కువ ధరకే లభిస్తాయనే భావన. అరుదైన చికిత్సలు..పరిశోధనలతో ఉత్తమ గుర్తింపు పొందిన నిమ్స్ నేడు కొంత మంది వైద్యుల తీరుతో అబాసు పాలవుతోంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి తోడు అక్రమార్జనకు అలవాటు పడిన కొంత మంది వైద్యులు రోగులను మభ్యపెట్టి ఆస్పత్రికి చెడ్డపేరు తీసు కొస్తున్నారు. ఫలితంగా తక్కువ ధరకే నాణ్యమైన వైద్యసేవలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటోంది. తాజాగా ఓ వైద్యుడు రోగికి ఎలాంటి సర్జరీ చేయకుండానే చేసినట్లు డిశ్చార్జ్ సమ్మరీలో చూపించడమే కాకుండా ఆయన వద్ద నుంచి భారీగా నగదు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఇప్పటి వరకు 15 మంది రోగుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందడంతో ఆస్పత్రి యాజమాన్యం సీరియస్ అయింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి ఛార్జీ మెమో జారీ చేయడంతో పాటు సమగ్ర విచారణ కోసం ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. సర్జరీ చేయకుండానే...చేసినట్లు రికార్డులు.. ఎల్లారెడ్డిగూడకు చెందిన వెంకటేశ్వర్రావు(47) వాంతులు, కళ్లు తిరిగే సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స కోసం2 2021 ఏప్రిల్4న నిమ్స్‌కు చేరుకున్నాడు. న్యూరాలజీ విభాగంలో వైద్య పరీక్షలు చేసిన వైద్యులు సమస్య ఉంది..ఆపరేషన్ చేయాలని చెప్పారు. తనకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందని, అం దులోనే సర్జరీ చేయాలని సదరు బాధితుడు వైద్యులకు మొర పెట్టుకున్నాడు. ఆరోగ్యశ్రీ జాబితాలో ఈ చికిత్స లేదని, డబ్బులు కట్టి సర్జరీ చేయించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. వైద్య ఖర్చులకు డబ్బు లేకపోవడంతో వెంకటేశ్వరరావు శస్త్రచికిత్స చేసుకోకుండానే ఇంటి ముఖం పట్టారు. అయితే, డాక్టర్లు ఇక్కడే తప్పులో కాలేశారు. డిశ్చార్జీ సమ్మరీలో వెంకటేశ్వరరావుకు సర్జరీ చేసినట్లు నమోదు చేయడమేగాకుండా.. కుట్లు తీయించుకునేందుకు ఫలానా తేదీనాడు రావాలని సూచించారు. ఆ తర్వాత కోవిడ్ మహమ్మారి చుట్టుముట్టడం..లాక్డౌన్ కారణంగా ఆయన ఆస్పత్రికి రాలేకపోయారు. ఇటీవల ఆనారోగ్య సమస్య తీవ్రం కావడంతో గతేడాది డిసెంబర్ 28న ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి వైద్యుల సమాధానం విని బిత్తెరపోయారు. నిమ్స్ వైద్యులు రాసిన డిశ్చార్జీ సమ్మరీ చూసి వైద్యులు ఆశ్చర్య పోయారు. ఆపరేషన్ చేయక పోయినా...చేసినట్లు సమ్మరిలో పేర్కొనడంతో వారు చికిత్సకు నిరాకరించి.. మళ్లీ నిమ్స్‌కు వెళ్లమని తిప్పిపంపారు. దీంతో ఆయన గురువారం నిమ్స్ న్యూరాలజీ ఓపీకి వచ్చాడు. ఇంతకు ముందు నిన్నెవరు చూశారో వాళ్ల దగ్గరికి వెళ్లమని సలహా ఇచ్చారు. గతంలో చూసిన వైద్యుడెవరో తెలియని వెంకటేశ్వరరావు..ఏం చేయాలో అర్థంగాక తలపట్టుకున్నారు. ఇప్పటికే చికిత్స కోసం శక్తికి మించి ఖర్చు చేసుకున్న తనకు సర్జరీ కోసం మళ్లీడబ్బులు సర్దుబాటు చేయడం తలకు మించిన భారమని వాపోయారు. ఏసీబీకి ఫిర్యాదు చేసిన మరో బాధితుడు అదే విధంగా బడంగ్‌పేటకు చెందిన అరుణ కుమార్ మెదడులో ఏర్పడిన కణితి సమస్యతో బాధపడుతూ నిమ్స్‌ను ఆశ్రయించాడు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసిన తర్వాత ఆపరేషన్ చేయాల్సి వస్తుంది.. డబ్బులు కట్టుకోవాల్సి వస్తుందన్నారు. ఆస్పత్రిలోని ఓ అధికారి సిఫార్సుతో వచి్చన ఆ రోగికి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రూ.50 వేలు కట్టించి పరీక్ష చేయించారు. అంతే కాకుండా ఓ అధికారి కూడా అతని వద్ద నుంచి ఆపరేషన్ చేయించేందుకు గానూ రూ. 20వేలు వసూలు చేశాడు. చివరికి ఆపరేషన్ చేయకుండానే డిశ్చార్జి చేశారు. సదరు బాధితుడు ఇటీవల ఏసీబీకి, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని ఆస్పత్రి యాజమాన్యం తీవ్రంగా పరిగణించింది. సదరు అధికారికి ఛార్జీ మెమో జారీ చేయడంతో పాటు డాక్టర్ రామ్మూర్తి, డాక్టర్ సాయిబాబాలతో విచారణ కమిటీ వేసింది. (చదవండి: వడ్డీలేని రుణాల పేరిట కేసీఆర్ మోసం ) -
ఏం ఇంట్లో చూసినా మందు గోళీలే! పారేస్తే పాతరేసినట్టే! మరేం చేయాలి?
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్‌కు ముందేమో గాని, తర్వాత ప్రతీ ఇల్లూ చిన్నపాటి క్లినిక్‌లా మారింది. వాడినా, వాడకున్నా రకరకాల మాత్రలు ఇంట్లో పేరుకుంటున్నాయి. అయితే వాడని వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయడం సరైన పనికాదంటున్నారు వైద్యులు. దానికి బదులుగా వాటిని పడేసేందుకు తొలిసారిగా డ్రాప్ బాక్స్‌లు నగరంలో అందుబాటులోకి వచ్చాయి. జలుబో, జ్వరమో మరొకటో.. చిన్నా చితకా వ్యాధులకు కూడా డాక్టర్ల నుంచి చాంతాడంత మందుల చిట్టీలు తప్పడం లేదు. ఎందుకైనా మంచిదని మనం వాటిని కొనకా తప్పడం లేదు. అయితే సాధారణంగా ఒకటి రెండు రోజులకే స్వస్థత చేకూరిన పరిస్థితిలో మందులు ఆపేసేవారే ఎక్కువ. అలాంటి వాటిలో యాంటీ బయాటిక్స్ ఎక్కువగా ఉండడం సాధారణమే. వీటిని సరైన పద్ధతిలో నిర్మూలించాలి లేదా గడువు ముగియకపోతే అవసరార్థులకు అందించాలే తప్ప ఎలా పడితే అలా పడేయవద్దని సూచిస్తున్నారు వైద్యులు. పారేస్తే.. పాతరేసినట్టే.. బెల్జియం లాంటి దేశాల్లో ముఖ్యంగా యాంటీబయాటిక్స్ విషయంలో కఠినమైన డ్రగ్ పాలసీ ఉంది. అక్కడ వీటిని హానికారక వ్యర్థాల కోవలో లెక్కిస్తారు. అవసరం ఉన్నా లేకున్నా యాంటీబయాటిక్స్ అధిక వినియోగం వల్ల ఆరోగ్యపరమైన నష్టాలొస్తాయి. ఉపయోగించనవి, అదనంగా ఉన్నవి నిర్లక్ష్యంగా పారవేయడంతో అవి నీటిలోకి చేరి కెనాల్స్ ద్వారా పంట పొలాల వరకూ చేరుతున్నాయి. దీంతో ఇది అంతిమంగా యాంటీమైక్రోబయాల్ నిరోధకత/యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎమ్ఆర్)కు దారి తీస్తుందని వైద్యులు అంటున్నారు. డ్రాప్ బాక్స్‌ల ఏర్పాటు.. ఈ సమస్యను పరిష్కరించే క్రమంలో నిమ్స్‌కు చెందిన క్లినికల్ ఫార్మకాలజీ అండ్ థెరప్యూటిక్స్ (సీపీటీ) విభాగం ఆస్పత్రి ఆవరణలో రెండు డ్రాప్ బాక్స్‌లను అమర్చింది. అవుట్ పేషెంట్స్ బ్లాక్‌లో, స్పెషాలిటీ బ్లాక్‌లో మరొకటి చొప్పున వీటిని ఏర్పాటు చేశారు. వీటిని చోరుల నుంచి కాపాడే క్రమంలో బాక్స్‌లకు తాళాలు వేశారు. ఆస్పత్రి సిబ్బంది మొదలుకుని, రోగులు, సంబంధీకులు ఎవరైనా సరే ఇంట్లో అనవసరంగా కొనుగోలు చేసిన, ఉపయోగించని లేదా గడువు ముగిసిన యాంటీబయాటిక్స్ ఉన్నట్లయితే ఈ డ్రాప్ బాక్స్‌లో వేయవచ్చని తద్వారా ఈ బాక్స్‌లకు వచ్చే స్పందనను అనుసరించి భవిష్యత్తులో మరిన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. భస్మం.. క్షేమం.. ‘తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇదే మొదటిది. వీటి ద్వారా హానికారక రసాయనాలు కాలుష్యానికి కారణం కాకుండా నిరోధించవచ్చు’ అని చెప్పారు నిమ్స్ డీన్ ఇన్చార్జి డైరెక్టర్ ఎన్.బీరప్ప. ‘డ్రాప్ బాక్స్‌ల ద్వారా పోగుపడిన మందులను సేకరించి వాటిని 1200 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్లో భస్మం చేయిస్తాం’ అని నిమ్స్ లెర్నింగ్ సెంటర్ ప్రొఫెసర్ సీపీటీ విభాగాధిపతి పి.ఉషారాణి చెప్పారు. -
నిమ్స్ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: నిమ్స్ ఆస్పత్రిలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల జీతాలు పెంచి, సీనియారిటీ ప్రకారం వారిని రెగ్యులరైజ్ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. నిమ్స్ హాస్పిటల్లో 1,350 మంది కార్మికులు కాంట్రాక్టు పద్ధతిలో 25 ఏళ్లుగా పని చేస్తున్నా.. కనీస వేతనం నెలకు రూ.14,700 మాత్రమే వస్తోందని తెలిపారు. లేబర్ కమిషన్ ముసాయిదా ప్రకారం వీరికి రూ.20 వేల వరకు జీతం పెరిగే అవకాశమున్నా, రాష్ట్ర ప్రభుత్వం నేటికీ గెజిట్ జారీ చేయలేదని తమ్మినేని వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత నిమ్స్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. సీనియారిటీ ప్రకారం జూనియర్లకు రు.20 వేలకు తగ్గకుండా, సీనియర్లకి వారి సీనియారిటీని బట్టి జీతం పెంచేలా చూడాలని ఆ లేఖలో కోరారు.