సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఆస్పత్రిలో సాధారణ ప్రజలకూ వైద్యం అందించాలని నిర్ణయించిన ఆ సంస్థ యాజమాన్యం.. ఆయా చికిత్సలకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని నిమ్స్ ఆస్పత్రిలో ఉన్న తరహాలో చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించింది. శస్త్రచికిత్సల నుంచి ల్యాబ్ పరీక్షల దాకా అన్నిరకాల సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. తక్కువ ధరకే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నందున.. వాటిని సాధారణ ప్రజలు కూడా వినియోగించుకునేలా ప్రచారం చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.
మందులపై భారీ డిస్కౌంట్
ఇంతకాలం ఆర్టీసీ ఆస్పత్రిలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేవి కాదు. ఇప్పుడు అవసరమైన అన్ని మందులను ఆన్‌లైన్ ద్వారాగానీ, వేరే పెద్ద మెడికల్ షాపుల నుంచి తెప్పించిగానీ అందించాలని నిర్ణయించారు. ప్రైవేటు మెడికల్ షాపుల తరహాలో హైదరాబాద్ వ్యాప్తంగా ఆర్టీసీ ఆస్పత్రికి అనుబంధంగా ఫార్మసీలు తెరవనున్నారు. ఇప్పటికే కాచిగూడ రైల్వేస్టేషన్ ఎదురుగా, ఎంజీబీఎస్ బయట గౌలీగూడ సీబీఎస్ వద్ద, తార్నాక ఆస్పత్రిలో రిటైల్ ఫార్మసీలను ప్రారంభించారు. దశలవారీగా మిగతా చోట్ల ఏర్పాటు చేయనున్నారు. ఈ ఫార్మసీలలో బ్రాండెడ్ మందులపై 15 శాతం, జనరిక్ మందులపై 50 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించారు.
అన్నీ తక్కువ ధరకే..
అన్ని రకాల హెల్త్ చెకప్‌లపై 40 శాతం రాయితీ ఇవ్వాలని కూడా ఆర్టీసీ నిర్ణయించింది. మొత్తంగా చికిత్సలు, పరీక్షలు, మందులు తక్కువ ధరతో అందుబాటులోకి వస్తుండటం.. పేదలు, అల్పాదాయ వర్గాలకు ఉపయుక్తంగా ఉంటుందని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ఇలా సాధారణ ప్రజలకు చికిత్సలతో వచ్చే నిధులను ఆస్పత్రి అభివృద్ధికే వినియోగిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ వైద్య సేవలు పొందిన సాధారణ ప్రజలు.. ఆర్టీసీ సిటీ బస్సుల్లో (రెండు గంటల పాటు) ఉచితంగా ఇంటికి వెళ్లే వెసులుబాటు కల్పించారు.
త్వరలో నాలుగు ఆపరేషన్ థియేటర్లు: సజ్జనార్
ఆర్టీసీ ఆస్పత్రిలో వైద్య సేవలను విస్తరించేందుకు త్వరలో నాలుగు ఆపరేషన్ థియేటర్లను అందుబాటులోకి తెస్తున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. బుధవారం ఆయన ఆస్పత్రిని తనిఖీ చేసి.. వైద్యులు, అధికారులతో సమీక్షించారు. ఆస్పత్రికి అనుబంధంగా ఏర్పాటవుతున్న ఫార్మసీల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూస్తున్నామని ఎండీకి అధికారులు వివరించారు. ఆస్పత్రిలో రోజూ సగటున 10 శస్త్రచికిత్సలు చేస్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment