లక్డీకాపూల్ (హైదరాబాద్)/సాక్షి, వరంగల్: పీజీ వైద్యవిద్యార్థిని ️ప్రీతిని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నామని నిమ్స్ వైద్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమెకు ప్రొటోకాల్ ప్రకారం వైద్య చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రీతి ఆరోగ్యంపై శనివారం యాజమాన్యం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా నిమ్స్ వైద్య బృందం సభ్యులు మాట్లాడుతూ.. ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందన్నారు.
ప్రస్తుతం ఆమెకు ఎక్మో సపోర్ట్‌తో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామన్నారు. కాగా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ పరిస్థితిలో ఉన్న ప్రీతిని నిమ్స్‌కు తీసుకువచ్చారని వైద్యులు తెలిపారు. తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌లు నిమ్స్‌కు వచ్చి ప్రీతి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ప్రీతి ర్యాగింగ్ ఘటనకు మతం రంగు పులిమి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రగతిభవన్‌లో కూడా పేదవర్గాలపై కనబడకుండా ర్యాగింగ్ జరుగుతోందని తెలిపారు.ప్రీతి విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నిష్పాక్షికంగా విచారణ: మంత్రి హరీశ్‌రావు
ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు భరోసా కల్పించారు. నిష్పాక్షికంగా పూర్తి విచారణ జరుగుతుందని, దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రీతి ఆరోగ్యంపై మంత్రి సమీక్షించారు. ఆమెకు అందిస్తున్న వైద్యం గురించి, చికిత్స చేస్తున్న ప్రత్యేక వైద్య బృందాన్ని ఆరా తీశారు. డాక్టర్ ప్రీతికి అత్యుత్తమ చికిత్స అందించాలని వైద్యులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.
సైఫ్ విషయంలో ఏం చేద్దాం?: పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో అరెస్టయిన సీనియర్ విద్యార్థి సైఫ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ) అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే ర్యాగింగ్, వేధింపుల కేసులో అరెస్టయి జైలుకెళ్లిన సైఫ్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కాళోజీ హెల్త్‌వర్సిటీకి.. కేఎంసీ ప్రిన్సిపల్ మోహనదాస్ శనివారం లేఖ రాశారు. సోమవారంలోగా నిర్ణయం రావొచ్చని, అక్కడి నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా సైఫ్‌పై చర్యలు ఉంటాయని ప్రిన్సిపల్ శనివారం ‘సాక్షి’కి తెలిపారు.
అలాగే, కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా కేఎంసీలో సోమవారం ర్యాగింగ్ నియంత్రణ కమిటీ సమావేశమై నివేదికను రూపొందించి పంపుతుందన్నారు. ప్రీతి కేసులో సైఫ్‌పై ఆరోపణలు రుజువైతే అతడి పీజీ అడ్మిషన్‌ను రద్దు చేసే అవకాశం ఉందని చెపుతున్నారు. ఒకవేళ ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించేలా సైఫ్ వ్యవహార శైలి ఉందని రుజువైతే ఎంబీబీఎస్ పట్టా కూడా రద్దు కావచ్చంటున్నారు. ఏమైనా.. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు లోబడి చర్యలుంటాయని మోహన్‌దాస్ తెలిపారు.
‘సర్’పై సర్వత్రా చర్చ: కేఎంసీ కాలేజీలో సీనియర్లను.. జూనియర్లు ‘సర్’అని పిలుస్తున్నారని, దీనిపై దృష్టి సారించాల్సి ఉందని వరంగల్ పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఇలా పిలిపించుకోవడం ర్యాగింగ్ కిందికే వస్తుందని వరంగల్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అభిప్రాయపడింది. సీనియర్లు, జూనియర్ల మధ్య ‘సర్’అనే పదం చాలా గ్యాప్ తీసుకొస్తుందని నిపుణులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment