RTC Hospital
-
సూపర్ స్పెషాలిటీగా ఆర్టీసీ ఆస్పత్రి
సాక్షి, హైదరాబాద్: ఇంతకాలం సంస్థ ఉద్యోగులకే పరిమితమైన తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రి సాధారణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అవతరించింది. ఇటీవలే సాధారణ ప్రజల(ఆర్టీసీ ఉద్యోగులు కానివారు)కు ఔట్ పేషెంట్లుగా చికిత్స ప్రారంభించిన ఆర్టీసీ.. ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ సేవలతో ముందుకొచ్చింది. ఇందుకోసం 16 పడకలతో కూడిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ను సిద్ధం చేసింది. నాలుగు ఆపరేషన్ థియేటర్లను కూడా కొత్తగా ఏర్పాటు చేసుకుంది. వీటిని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మంగళవారం ఉదయం ప్రారంభించనున్నారు. ఏడు ఆపరేషన్ థియేటర్లు.. గతంలో అత్యవసర వైద్య సేవలు అందించే పరిస్థితి లేకపోవటంతో ఇక్కడికి వచ్చే రోగులను ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేసేవారు. ఆ స్థితి నుంచి క్రమంగా కీలక చికిత్సలు, అత్యవసర ఆపరేషన్లు చేసే స్థాయికి తార్నాక ఆసుపత్రిని అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుతం మూడు ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. కొత్తగా మరో నాలుగు ఆపరేషన్ థియేటర్లను సిద్ధం చేశారు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ భవనంపై కొత్తగా ఐసీయూ బ్లాక్‌ను నిర్మించారు. ఇందులో 16 బెడ్లు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులే కాకుండా సాధారణ ప్రజలకూ ఇందులో చికిత్స అందిస్తారు. నిమ్స్ తరహాలో తక్కువ చార్జీలు వసూలు చేయనున్నారు. రోజుకు రూ.3 వేలు, అంతకంటే తక్కువే వసూలు చేయనున్నట్టు సమాచారం. త్వరలో సర్జికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్.. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆధునిక వసతులతో ఉండే సర్జికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ను కూడా ఆర్టీసీ ఆసుపత్రిలో సిద్ధం చేశారు. త్వరలో దీన్ని వినియోగంలోకి తేనున్నారు. ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ ప్రారంభించిన తర్వాత, ఎస్ఐసీయూ బ్లాక్‌లో ఫ్యూమిగేషన్ చేసి, బ్యాక్టీరియా కల్చర్ పరీక్షలు నిర్వహించి నెగెటివ్ రిపోర్టు వస్తే వెంటనే దాన్ని అందుబాటులోకి తెస్తారని సమాచారం. సూపర్‌స్పెషాలిటీ వైద్యం అందిన వారు, కీలక ఆపరేషన్లు చేయించుకున్న రోగులు.. కొంతకాలం ఐసీయూలో ఉండాల్సి వస్తే ఇందులో ఉంచుతారు. వార్డులో ఓవైపు దీన్ని కొత్తగా ఏర్పాటు చేశారు. ఇక ప్రతి డిపోలో హెల్త్ వాలంటీర్లు.. ఇటీవలే ఆర్టీసీ ఉద్యోగులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి వారి హెల్త్ హిస్టరీతో కూడిన రికార్డులను సిద్ధం చేశారు. గుండె సమస్యలు, ఇతర తీవ్ర ఆరోగ్య ఇబ్బందులతో బాధపడుతున్నట్లు గుర్తించిన ఉద్యోగులకు ప్రత్యేకంగా వైద్య సేవలు అందిస్తూ, వారు క్రమపద్ధతిలో మందులు వాడేలా చూస్తున్నారు. గుండె సంబంధిత సమస్యలున్నాయని తేలిన 278 మంది ఉద్యోగుల్లో ఇద్దరు మందుల వాడకంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కొద్ది రోజుల్లోనే వారు మృతి చెందారు. ఇలాంటి పరిస్థితి మిగతావారికి రావద్దనే ఉద్దేశంతో ప్రతి డిపోలో సుశిక్షితులైన ఇద్దరు హెల్త్ వర్కర్లను నియమించాలని ఆర్టీసీ నిర్ణయించింది. వీరు ఉద్యోగులకు ఆరోగ్యంపట్ల అవగాహన కల్పించడంతోపాటు వారి హెల్త్ హిస్టరీ ఆధారంగా మందులు వాడేలా చూస్తారు. అలాగే వీరి వద్ద డిజిటల్ బీపీ చెకింగ్ యంత్రాలుంటాయి. వాటి ద్వారా బీపీని మానిటర్ చేస్తూంటారు. ఉద్యోగులకు సీపీఆర్‌పై శిక్షణ ఇస్తారు. ఇప్పుడు ఈ హెల్త్ వర్కర్లకు శిక్షణ ప్రారంభించనున్నారు. -
ఆర్టీసీ ఆస్పత్రిలో నిమ్స్ చార్జీలతో వైద్యం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఆస్పత్రిలో సాధారణ ప్రజలకూ వైద్యం అందించాలని నిర్ణయించిన ఆ సంస్థ యాజమాన్యం.. ఆయా చికిత్సలకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని నిమ్స్ ఆస్పత్రిలో ఉన్న తరహాలో చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించింది. శస్త్రచికిత్సల నుంచి ల్యాబ్ పరీక్షల దాకా అన్నిరకాల సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. తక్కువ ధరకే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నందున.. వాటిని సాధారణ ప్రజలు కూడా వినియోగించుకునేలా ప్రచారం చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. మందులపై భారీ డిస్కౌంట్ ఇంతకాలం ఆర్టీసీ ఆస్పత్రిలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేవి కాదు. ఇప్పుడు అవసరమైన అన్ని మందులను ఆన్లైన్ ద్వారాగానీ, వేరే పెద్ద మెడికల్ షాపుల నుంచి తెప్పించిగానీ అందించాలని నిర్ణయించారు. ప్రైవేటు మెడికల్ షాపుల తరహాలో హైదరాబాద్ వ్యాప్తంగా ఆర్టీసీ ఆస్పత్రికి అనుబంధంగా ఫార్మసీలు తెరవనున్నారు. ఇప్పటికే కాచిగూడ రైల్వేస్టేషన్ ఎదురుగా, ఎంజీబీఎస్ బయట గౌలీగూడ సీబీఎస్ వద్ద, తార్నాక ఆస్పత్రిలో రిటైల్ ఫార్మసీలను ప్రారంభించారు. దశలవారీగా మిగతా చోట్ల ఏర్పాటు చేయనున్నారు. ఈ ఫార్మసీలలో బ్రాండెడ్ మందులపై 15 శాతం, జనరిక్ మందులపై 50 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించారు. అన్నీ తక్కువ ధరకే.. అన్ని రకాల హెల్త్ చెకప్‌లపై 40 శాతం రాయితీ ఇవ్వాలని కూడా ఆర్టీసీ నిర్ణయించింది. మొత్తంగా చికిత్సలు, పరీక్షలు, మందులు తక్కువ ధరతో అందుబాటులోకి వస్తుండటం.. పేదలు, అల్పాదాయ వర్గాలకు ఉపయుక్తంగా ఉంటుందని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ఇలా సాధారణ ప్రజలకు చికిత్సలతో వచ్చే నిధులను ఆస్పత్రి అభివృద్ధికే వినియోగిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ వైద్య సేవలు పొందిన సాధారణ ప్రజలు.. ఆర్టీసీ సిటీ బస్సుల్లో (రెండు గంటల పాటు) ఉచితంగా ఇంటికి వెళ్లే వెసులుబాటు కల్పించారు. త్వరలో నాలుగు ఆపరేషన్ థియేటర్లు: సజ్జనార్ ఆర్టీసీ ఆస్పత్రిలో వైద్య సేవలను విస్తరించేందుకు త్వరలో నాలుగు ఆపరేషన్ థియేటర్లను అందుబాటులోకి తెస్తున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. బుధవారం ఆయన ఆస్పత్రిని తనిఖీ చేసి.. వైద్యులు, అధికారులతో సమీక్షించారు. ఆస్పత్రికి అనుబంధంగా ఏర్పాటవుతున్న ఫార్మసీల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూస్తున్నామని ఎండీకి అధికారులు వివరించారు. ఆస్పత్రిలో రోజూ సగటున 10 శస్త్రచికిత్సలు చేస్తున్నట్టు తెలిపారు. -
‘ఆర్టీసీ’ రోగులకు హోటల్ తిండి!
సాక్షి, హైదరాబాద్: ఐసీయూ, ఆక్సిజన్ ప్లాంటు, నిరంతరం నడిచే ల్యాబ్ తదితర సౌకర్యాలతో ఇటీవలే మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి స్థాయికి ఎదిగిన తార్నాకలోని 200 పడకల ఆర్టీసీ ఆసుపత్రిలో ఒక సమస్య మాత్రం రోగులు, వారి సహాయకులను వేధిస్తోంది. ఇన్‌పేషెంట్లు, వారి కుటుంబ సభ్యులకు ఆసుపత్రిలో భోజన సదుపాయం లేక హోటళ్ల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సాధారణంగా ఏ ఆసుపత్రిలోనైనా వైద్యుల సూచనల ప్రకారం రోగులకు ఆసుపత్రుల్లోనే భోజనం తయారు చేసి అందించాల్సి ఉంటుంది. సొంత కిచెన్ వసతి లేని చోట, కాంట్రాక్టు పద్ధతిలో భోజనం తయారు చేయించి అందిస్తారు. తినకూడని పదార్థాలు తింటే వారి అనా రోగ్యం పెరిగే ప్రమాదం కూడా ఉంటుందనే ఉద్దేశంతో రోగులకు వైద్యుల సూచన మేరకే భోజనం అందుతుంది. కానీ ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉండటం, ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో తార్నాక ఆసుపత్రిపై సరైన పర్యవేక్షణ లేదు. దీంతో నిధుల్లేక రోగులకు భోజనాన్ని అందించలేమని ఆసుపత్రి చేతులెత్తేసింది. నిత్యం 200 పడకల్లోనూ రోగులు ఉన్నా వారి భోజన ఖర్చు ఏడాదికి రూ. కోటిన్నర మించదు. కానీ ఈ మాత్రం సొమ్ము కూడా ఆర్టీసీ వద్ద లేకపోవడం అందరినీ విస్మయ పరుస్తోంది. ఈ ఆసుపత్రిలో రోగులకు ప్రస్తుతం ఒక గ్లాసు పాలు, ఒక బ్రెడ్, ఒక అరటి పండు అందిస్తున్నారు. హరేరామ హరేకృష్ణ సెంటర్ తెరవాలి... రోగులకు మందులతోపాటు సరైన డైట్ అవసరమని... అందుకు వీలుగా ఆసుపత్రిలో హరేరామ హరేకృష్ణ సెంటర్ అందించే రూ. 5 భోజన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు సూచించారు. మరోవైపు రోగులకు డైట్‌ను ఆసుపత్రిలోనే తయారు చేసి అందించాలని.. ఈ విషయంలో ఎండీ సజ్జనార్ మానవతాదృక్ఫథంతో వ్యవహరించాలని నేషనల్ మజ్దూర్ యూనియన్‌కు చెందిన కమాల్‌రెడ్డి, నరేందర్ కోరారు. రోగులకు హోటళ్ల భోజనం అందించడం ప్రమాదకరమని డాక్టర్ సునీల్ పేర్కొన్నారు. రోగుల సహాయకులు ఇంటి నుంచి భోజనం తెచ్చినా ఉప్పు, కారం, మసాలాలు, శరీరానికి పడని పదార్థాలు రోగికి చేటు చేస్తాయన్నారు. అందువల్ల వైద్యుల సూచన ప్రకారమే రోగులకు భోజనం అందాలని పేర్కొన్నారు. -
డాక్టర్ వైఎస్సార్ ప్రాంతీయ వైద్యశాల సేవలకు ఏడాది పూర్తి
సాక్షి ప్రతినిధి, కడప : కడప కేంద్రంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆర్టీసీ ప్రాంతీయ వైద్యశాల ఏర్పాటై నేటితో ఏడాది పూర్తయింది. ఏడాదిగా రాయలసీమ జిల్లాల ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబాలకు ఇక్కడే ఆధునిక వైద్య సేవలు అందుతున్నాయి. గతంలో వీరు ఆయా జిల్లాల పరిధిలోని డిస్పెన్సరీలలో వైద్య సేవలు పొందాల్సి వచ్చేది. మెరుగైన వైద్య సేవల కోసం విజయవాడ, హైదరాబాదు వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కడపలో కోట్లాది రూపాయల వ్యయంతో ప్రాంతీయ ఆస్పత్రిని నిర్మించారు. ఏడాదిలో 49,812 మందికి వైద్య సేవలు గడిచిన ఏడాదిలో వైఎస్సార్ జిల్లాతోపాటు ఇతర జిల్లాలకు చెందిన 49,812 మందికి ఈ ఆస్పత్రిలో వైద్య సేవలు అందించారు. 120 మందిని ఇన్‌పేషంట్లుగా చేర్చుకుని వైద్యం చేయగా, 100 మందికి వివిధ రకాల ఆపరేషన్లు చేశారు. 63 శాతం మంది ఉద్యోగులు, కార్మికులకు, 16.3 శాతం మంది కుటుంబ సభ్యులకు, 20.7 శాతం మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఆస్పత్రిలో వైద్యం అందించారు. 2500 మందికి ఎక్స్‌రేలు తీశారు. వేలాది మందికి ల్యాబ్‌లలో వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. 170 రకాల ట్యాబెట్లు, 30 రకాల ఇంజెక్షన్లు ఈ ప్రాంతీయ వైద్య శాలలో బీపీ, షుగర్, గుండె జబ్బులకు యాంటీ బయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, చర్మ వ్యాధులు, సీజనల్ వ్యాధులతోపాటు పలురకాల జబ్బులకు సంబంధించి ఇక్కడ ఉన్న ఫార్మసీ ద్వారా 170 రకాల ట్యాబెట్లు ఉచితంగా అందిస్తున్నారు. వీటితోపాటు వ్యాధులను బట్టి 20–30 రకాల ఇంజెక్షన్లను సైతం ఇస్తున్నారు. ఈ ఆస్పత్రికి 60 శాతం మందులు సెంట్రల్ స్టోర్స్ ద్వారా వస్తుండగా, మరో 40 శాతం మందులు అపోలో వారి నుంచి సరఫరా అవుతున్నాయి. మూడు షిఫ్ట్‌ల ద్వారా వైద్య సేవలు ఆస్పత్రిలో మూడు షిఫ్ట్‌ల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు, రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు షిఫ్ట్‌ల పద్దతిలో వైద్య సేవలు అందిస్తున్నారు. ఏడుగురు వైద్యులు, ఇద్దరు కన్సల్టెన్సీ డాక్టర్లు, రెగ్యులర్ ఔట్సోర్సింగ్ కలిపి 13 మంది సాఫ్ట్ నర్సులు, ఐదుగురు వార్డు బాయ్స్ ఈ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఇక్కడున్న ల్యాబ్‌లో 90 రకాల టెస్టులను చేస్తున్నారు. -
టైర్ రీట్రెడింగా.. ఆర్టీసీ వర్క్‌షాపు ఉందిగా
టైర్ రీట్రెడింగ్.. టైర్ల జీవిత కాలాన్ని పెంచే ప్రక్రియ. కొత్త టైరును కొనేబదులు మరికొంతకాలం పాతదాన్నే వినియోగించేలా దాని జీవిత కాలాన్ని పెంచే ప్రక్రియ. భారీ వాహనాలున్న వారికి ఇది సుపరిచితమే. ఇప్పుడు ఆర్టీసీ వర్క్‌షాపులో ప్రైవేటు వాహనాల టైర్లనూ రీట్రెడింగ్ చేసేలా కసరత్తు జరుగుతోంది. తార్నాకలో 200 పడకల ఆర్టీసీ ఆసుపత్రి.. నిత్యం ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు అనారోగ్య సమస్యలపై ఇక్కడికి వస్తుంటారు. ఇన్‌పేషెంట్‌గా కొందరు, ఔట్ పేషెంట్‌గా మరికొందరు వైద్యం పొందుతుంటారు. పెద్ద ల్యాబ్, 24 గంటలూ సేవలందించే ఫార్మసీ ఇక్కడ ఉన్నాయి. త్వరలో సాధారణ వ్యక్తులూ ఇక్కడ వైద్య సేవలు, పరీక్షలు పొందే అవకాశం ఉంది. సాక్షి, హైదరాబాద్: నష్టాల ఊబి నుంచి గట్టేందుకు ప్రత్యామ్నాయ ఆదాయం కోసం ఆర్టీసీ కొత్త దారులు వెదుకుతోంది. తనకున్న వనరులనే పెట్టుబడిగా పెట్టి ప్రైవేటు వ్యక్తులకు సేవలు అందించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులోభాగంగా ఉప్పల్‌లో ఉన్న వర్క్‌షాపు, తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిని వినియోగించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. దీనిపై మరింత కసరత్తు చేసిన తర్వాత అధికారికంగా వివరాలు వెల్లడికానున్నాయి. ఇప్పటికే పలుమార్లు తార్నాక ఆసుపత్రిని సందర్శించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. దాని స్థాయిని పెంచి సాధారణ వ్యక్తులకూ వైద్యాన్ని అందించడం ద్వారా ఫీజుల రూపంలో ఆదాయాన్ని పొందాలని నిర్ణయించారు. వీలైతే మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న 200 పడకలను 300కు పెంచాలనీ యోచిస్తున్నారు. ముందుగా ల్యాబ్‌లో పరీక్షలతో శ్ర్రీకారం చుట్టాలని నిర్ణయించారు. దీనికోసం ఇప్పటికే ల్యాబ్‌ను కొంత విస్తరించారు. అలాగే ఫార్మసీలో కూడా బయటి వ్యక్తులకు 24 గంటలూ మందులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఆ తర్వాత దశలవారీగా వైద్యాన్ని కూడా అందిస్తారు. ఇందుకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు సమకూర్చుకుంటారు. ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు కన్సల్టెన్సీ సేవలను అందిస్తున్నారు. వర్క్‌షాప్.. బస్‌బాడీ యూనిట్ ఆర్టీసీకి హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో భారీ వర్క్‌షాప్ ఉంది. ఇక్కడ బస్సులకు రంగులు వేయటం, ప్యాచ్ వర్క్‌తోపాటు కీలకమైన టైర్ రీట్రెడింగ్ నిర్వహిస్తున్నారు. మియాపూర్‌లో బస్బాడీలను రూపొందించే వర్క్‌షాప్ ఉంది. అక్కడి భూములకు మంచి డిమాండ్ ఉన్నందున దాన్ని వాణిజ్యపరంగా అభివృద్ధి చేసి బస్‌బాడీ యూనిట్‌ను ఉప్పల్ వర్క్‌షాపులోకి తరలించాలనే యోచన ఉంది. దీంతో భారీ వాహనాలకు సంబంధించిన సమస్త సర్వీసులు ఇక్కడ అందే అవకాశం ఉంటుంది. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసుకుని దీన్ని పటిష్టపరిచి ప్రైవేటు వాహనాలకు సేవలు అందించడం ద్వారా భారీగా ఆదాయాన్ని పొందాలని భావిస్తోంది. ఇటీవలే ఆ వర్క్‌షాపును పరిశీలించిన సజ్జనార్ .. దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక.. ప్రస్తుతం ఆర్టీసీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమత మవుతోంది. మూడు నాలుగు నెలలుగా టికెట్ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. అయినా సంస్థ ఖర్చులను మించిన ఆదాయం పెద్దగా ఉండటం లేదు. దీనికితోడు కరోనా ఉధృతి వల్ల 20 రోజులుగా టికెట్ ఆదాయం బాగా తగ్గుముఖం పట్టింది. ఈనేపథ్యంలో ప్రత్యామ్నాయ ఆదాయం సమకూర్చుకోవడం అనివార్యమైంది. -
అందరికీ ‘ఆర్టీసీ’ వైద్యం!
సాక్షి, హైదరాబాద్: తార్నాకలో ఉన్న ఆర్టీసీ ఆసుపత్రిలో సాధారణ ప్రజలకూ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు ఇది కేవలం ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే వైద్యం అందిస్తోంది. తాజాగా దీనిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌గా మార్చాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు వసతులు మెరుగుపరచాలని, ఇతరులకు కూడా వైద్యం అందించేలా రూపొందించాలని భావిస్తోంది. విశాలమైన ప్రాం గణం, పెద్ద భవనాలు అందుబాటులో ఉన్నందున, వాటిని సరైన విధంగా ఉపయోగించుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ భావిస్తున్నారు. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిగా మారిస్తే.. అందరికీ మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుందని, అదే సమ యంలో ఆర్టీసీకి ఆదాయం కూడా సమకూరుతుందనేది ఆలోచన. కాగా ఈ ప్రక్రియను క్రమంగా పట్టాలెక్కించేందుకు కసరత్తు ప్రారంభించారు. సరిపడ నిధులు, పర్యవేక్షణ లేక పడక ఉమ్మడి రాష్ట్రంలో లక్ష మంది ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు వైద్యాన్ని అందించిన ఈ ఆసుపత్రి ఆ తర్వాత పర్యవేక్షణ లేక పడకేసింది. చాలినన్ని నిధులు లేక వసతులు కూడా మృగ్యమయ్యాయి. క్రమంగా వైద్యుల కొరత ఏర్పడింది. కావాల్సిన మందుల సరఫరా లేక బయట కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మెరుగైన వైద్యం అందక రోగులను ప్రైవేటు ఆసుపత్రులకు రెఫర్ చేయాల్సి వచ్చింది. ఇలా సంవత్సరానికి దాదాపు రూ.30 కోట్ల మేర రెఫరల్ బిల్లులు చెల్లించాల్సి వచ్చింది. ఒక్క సంవత్సరంలో చెల్లించే రెఫరల్ బిల్లులను ఆసుపత్రిపై వెచ్చిస్తే అది మెరుగ్గా మారుతుందన్న ఆలోచన లేకుండా వ్యవహరించారు. ప్రభుత్వంపై ఆధార పడకుండా.. తాజాగా దీనావస్థలో ఉన్న ఆసుపత్రికి పూర్వ వైభవం తేవాలని నిర్ణయించారు. భవనాన్ని విస్తరించి అదనంగా బెడ్లను పెంచి ల్యాబ్‌ను విస్తరించటం ద్వారా వైద్య సేవలను కార్పొరేట్ స్థాయికి తేవాలని నిర్ణయించారు. దీనికి భారీగా నిధులు అవసరం కానున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి నిధులు ఆశించకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) విధానం ద్వారా నిధులు సమకూర్చు కోవాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆక్సిజన్ ప్లాంట్ సిద్ధమైంది. ల్యాబ్‌లో పరీక్షలు 24 గంటలూ నిర్వహించటం, మందుల కౌంటర్‌ను నిర్విరామంగా తెరిచి ఉంచటం లాంటి వాటిని ప్రారంభించారు. ఇటీవలే డయాలసిస్ కేంద్రాన్ని మొదలుపెట్టారు. త్వరలో సహాయ సిబ్బంది నియామకం ఆస్పత్రిలో 28 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, 16 మందే సేవలందిస్తున్నారు. దీంతో నలుగురిని కొత్తగా నియమించుకుని, మరో ఐదుగురు ప్రైవేటు వైద్యుల సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఇక 60 మంది సహాయ సిబ్బందిని తాత్కాలిక పద్ధతిలో నియమించుకోబోతున్నారు. ఇందులో నర్సులు, డయాలిసిస్ టెక్నీషియన్లు, మల్టీ పర్పస్ వర్కర్ల పోస్టులు ఉన్నాయి. సంస్థ ఎండీ సజ్జనార్ బుధవా రం వరకు సెలవులో ఉన్నారు. గురువారం ఆయన అనుమతితో నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు సమాచారం. ఇక ఆధునిక వైద్య పరికరాలు, బెడ్లకు కావాల్సిన నిధుల సమీకరణ జరుగుతోంది. కోవిడ్ సెంటర్‌ను సైతం సిద్ధం చేస్తున్నారు. విశ్రాంత సర్జన్ ఆధ్వర్యంలో.. గతంలో గాంధీ ఆసుపత్రిలో కీలక పోస్టులో కొన సాగి పదవీ విరమణ పొందిన ఓ సర్జన్‌కు తార్నాక ఆసుపత్రి విస్తరణ ప్రక్రియలో భాగస్వామ్యం కల్పించారు. ఆయన కొద్ది రోజులుగా దగ్గరుండి దీనిని నిర్వహిస్తున్నారు. కన్సల్టెన్సీ తరహాలో ఓ ప్రైవేటు ఆసుపత్రి సూచనలు అందిస్తోంది. -
ఆర్టీసీ ఆసుపత్రిలో ఐసీయూ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కుటుంబాల చికిత్స కోసం ఉన్న తార్నాకలోని ఆసుపత్రిలో ఎట్టకేలకు ఐసీయూ సిద్ధమైంది. ఈ ఆసుపత్రిని నిర్మించి మూడు దశాబ్దాలు అవుతుండగా ఇన్నేళ్ల తర్వాత అతిముఖ్యమైన విభాగం అందుబాటులోకి వచ్చింది. ఇక మరో కీలక డయాలసిస్ విభాగం కూడా ఏర్పాటైంది. దీంతో ఇటు డయాలసిస్ చేసుకోవాల్సిన ఆర్టీసీ సిబ్బంది, అత్యవసర చికిత్సలకు వచ్చేవారికి ఇక్కడే సేవలు అందనున్నాయి. ఇంతకాలం రిఫరల్ పేరుతో వారిని ఇతర ప్రైవేటు ఆసుపత్రులకు పంపేవారు. ఆ రెఫరల్ బిల్లులు ఏడాదికి రూ.35 కోట్ల వరకు అవుతుండటంతో ఆర్టీసీకి అది గుదిబండగా మారింది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నెల రోజుల్లోనే ఆసుపత్రిని సమూలంగా మార్చే చర్యలు ప్రారంభించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద దాతల సాయంతో ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని సజ్జనార్ నిర్ణయించి ఏర్పాట్లు ప్రారంభించారు. ఇందుకు ఓ ప్రైవేటు ఆసుపత్రిని కన్సల్టెన్సీ సేవలకు వినియోగించుకున్నారు. అలా కొందరు ప్రైవేటు వ్యక్తులు ముందుకు రావడంతో దాదాపు రూ. 2 కోట్ల వ్యయంతో ఐసీయూను సిద్ధం చేయించారు. దానికి కావాల్సిన వెంటిలేటర్లు, ఆక్సిజన్ వసతి, బెడ్లు, ఇతర యంత్ర పరికరాలను సమకూరుస్తున్నారు. పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నెల 27న ఈ సేవలు ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. డయాలసిస్‌లు ఇక్కడే.. డయాలసిస్ చేయించుకోవాల్సిన ఆర్టీసీ ఉద్యోగులకు ఇప్పటివరకు ప్రైవేటు ఆసుపత్రులే దిక్కుగా ఉండేవి. డయాలసిస్ కోసం ప్రతిసారీ దాదాపు రూ. 2,500 ఖర్చయ్యేది. ఆర్టీసీ ఆసుపత్రి ద్వారా రెఫర్ చేయించుకుని రోగులు వెళ్తుండగా సకాలంలో బిల్లులు రానందున కొన్ని ఆసుపత్రుల్లో ఆ సేవలను నిలిపివేశారు. దీంతో కొందరు రోగులు సొంతంగా ప్రైవేటులో ఆ సేవలు పొందుతున్నారు. ఇప్పుడు ఆర్టీసీ ఆసుపత్రిలో తొలుత నాలుగు డయాలసిస్ యంత్రాలతో డయాలసిస్ సెంటర్ సిద్ధం కావడంతో ఇప్పుడు కేవలం ఉద్యోగులే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా ఇక్కడే డయాలసిస్ చేసే విధానాన్ని ప్రారంభిస్తున్నారు. దసరా ముందురోజు డయాలసిస్ యంత్రాలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్, అధికారుల సమక్షంలో పూజలు నిర్వహించారు. ఈ నెల 27 నుంచి సేవలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక నిరంతరం మందులు.. ఆర్టీసీ రెగ్యులర్ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు వైద్య సేవలతోపాటు అవసరమైన మందులు పొందేందుకు వెసులుబాటు ఉంది. కానీ నిధుల సమస్యతో కొన్ని మందులకు కొరత నెలకొంటోంది. ఇప్పుడు ఆ సమస్య లేకుండా ప్రభుత్వ మందుల సరఫరా విభాగంతో అధికారులు చర్చించి సమస్య పరిష్కరించారు. 24 గంటలూ మందులు పొందేలా మార్పుచేర్పులు చేశారు. ఇంతకాలం ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే ఫార్మసీ అందుబాటులో ఉండేది. కాగా, 2డీ ఎకో లాంటి పరీక్షలను కూడా ఆసుపత్రిలోనే నిర్వహించేలా కావాల్సిన పరికరాలు సమకూరుస్తున్నారు. -
‘ఆర్టీసీ’ రెఫరల్ బిల్లులు తడిసిమోపెడు
సాక్షి, హైదరాబాద్: తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో కోవిడ్ సెంటర్ ఏర్పాటుకు రూ.2 కోట్లు ఖర్చవుతాయని అధికారులు ఇటీవల అంచనా వేశారు. ఆక్సిజన్ పైపులైన్ ఏర్పాటు చేసి, ఆ తర్వాత చేతులెత్తేశారు. నిధుల సమస్యతో ఆ పని అప్పట్లో ఆగిపోయింది. ఈ ఆస్పత్రిలో వసతులు లేక ముఖ్య చికిత్సలను ఇతర ప్రైవేట్ ఆస్పత్రిలో చేయిస్తున్నారు. దీనికి రెఫరల్ బిల్లులు సగటున నెలకు రూ.2.5 కోట్ల వరకు చెల్లించాల్సి వస్తోంది. అంటే.. ఒక నెల రెఫరల్ బిల్లుతో కోవిడ్ సెంటర్ ఏర్పాటు పనులు పూర్తయి ఉండేవి. ఈ రెఫరల్ బిల్లులే ఆర్టీసీని ఆస్పత్రిని నిలువునా ముంచుతున్నాయి. సగటున సాలీనా రూ.30 కోట్ల వరకు చెల్లించాల్సి వస్తుండటంతో ఆస్పత్రి అభివృద్ధికి విఘాతం ఏర్పడుతోంది. ఒక సంవత్సరం చెల్లించే రెఫరల్ బిల్లులతో ఆస్పత్రిని పూర్తిగా ఆధునికీకరించి అన్ని వసతులు సమకూర్చే అవకాశం ఉంది. వసతులు మెరుగుపరిచాక ఇక ప్రైవేటు ఆస్పత్రులకు రోగులను పంపాల్సిన అవసరం ఉండదు (అత్యవసరమైతే తప్ప). కొత్త ఎండీ సజ్జనార్ ఇటీవల ఆస్పత్రి పరిస్థితిని సమీక్షించినప్పుడు ఈ అనవసర భారం ఆయన దృష్టికొచ్చింది. వెంటనే రెఫరల్ ఖర్చుల పీడ వదిలించాలని నిర్ణయించారు. అది జరిగాక మిగిలే మొత్తాన్ని, ఆర్టీసీ ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా ఈ ఆసుపత్రిలో చికిత్సలు చేయించే వెసులుబాటు కలిగించాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. ఇదీ సంగతి.. ఆర్టీసీలో పనిచేసే 49 వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు తార్నాకలో ఉన్న ఆర్టీసీ ఆస్పత్రే ఏకైక దిక్కు. జిల్లాల్లో డిస్పెన్సరీలున్నా.. వాటిల్లో పెద్దపెద్ద చికిత్సలకు వీలులేదు. ఆర్టీసీ ఉద్యోగులకు ఆరోగ్య సమస్య వస్తే తార్నాకలోని ఆస్పత్రికి రావాల్సిందే. దీన్ని గతంలో అన్ని వసతులు ఉండేలా నిర్మించారు. ఇక్కడ మంచి చికిత్స అందుతుందన్న పేరు కూడా ఉంది. కానీ, కొన్నేళ్లుగా దీనిపై దృష్టి సారించకపోవడం, అవసరమైన మార్పులు చేయకపోవడం, చాలినన్ని నిధులు కేటాయించకపోవటంతో అది క్రమంగా కొరగాకుండా పోతూ వచ్చింది. చివరకు మందుల కొనుగోలుకు కూడా కొరత ఏర్పడే దుస్థితిలోకి చేరింది. ఇక ఆస్పత్రి నిర్వహణ సాధ్యం కాదని ఆర్టీసీ చేతులెత్తేసి దాన్ని వదిలించుకునే ఆలోచనకు రావాల్సి వచ్చింది. ఇక్కడ గుండె సంబంధిత వ్యాధులకు చికిత్స చేసే వీలు లేకుండా పోయింది. సంబంధిత వైద్యులు లేరు. దంత, కంటి, ఆర్థో, జనరల్ ఫిజీషియన్, సర్జరీ విభాగాల్లో కూడా వైద్యులు చాలినంత మంది లేరు. దీంతో రోగులను ఇతర ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయించాల్సి వస్తోంది. ఈ మేరకు గతంలో 20 ప్రైవేటు ఆస్పత్రులతో ఆర్టీసీ అవగాహన కుదుర్చుకుంది. ఇలా చూస్తుండగానే ఏడాదికి రూ.30 కోట్ల మేర రెఫరల్ బిల్లులు చెల్లించాల్సి రావటంతో అది ఆర్టీసీ సంస్థకు పెద్ద భారంగా మారి సకాలంలో చెల్లించకుండా బకాయి పెడుతూ వస్తోంది. ఇప్పటికీ దాదాపు రూ.50 కోట్ల వరకు బకాయిలున్నాయి. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి చూసి కొన్ని ఆస్పత్రులు ఈ ఒప్పందం నుంచి తప్పుకున్నాయి. చివరకు ఇక్కడ కొన్ని రకాల వైద్య పరీక్షలకు కూడా వసతులు లేక ప్రముఖ ల్యాబ్‌లతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. బిల్లు బకాయిలతో ఇటీవలే ఓ ప్రముఖ ల్యాబ్ తప్పుకుంది. ఉద్యోగుల తల్లిదండ్రులకూ... ఈ మొత్తం వ్యవహారంపై కొత్త ఎండీ సజ్జనార్ ఇటీవల వివరాలు తెప్పించుకుని అధికారులతో చర్చించారు. ఆస్పత్రిలో వసతులు మెరుగుపరిచేందుకు ఆయన తొలినుంచి దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఎండీగా బాధ్యతలు స్వీకరించిన రెండో రోజే ఆయన ఆస్పత్రిని సందర్శించారు. ఆ తర్వాత పది రోజుల్లో మూడు పర్యాయాలు ఆస్పత్రికి వెళ్లారు. ఇప్పుడు రెఫరల్ బిల్లు బెడద వదిలించుకునే దిశలో చర్యలు ప్రారంభించారు. ఆస్పత్రిలో వసతులు మెరుగుపరిస్తే వీటి అవసరం ఉండదని నిర్ధారణకు వచ్చి ఆయన అందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నారు. నిధులు సమకూర్చే విషయంలో ఇంకా స్పష్టత రానప్పటికీ, త్వరలో కొలిక్కి రావటం ఖాయంగా కనిపిస్తోంది. రెఫరల్ బిల్లుల చెల్లింపు అవసరం లేకుంటే సాలీనా రూ.30 కోట్ల వరకు ఆదా అవుతుంది. అప్పుడు ఆ మొత్తంతో ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా ఆస్పత్రి సేవలు అందించేలా చేయాలని ఆయన యోచిస్తున్నారు. అది చికిత్సల వరకు ఉంటుందా, వైద్య పరీక్షలకు పరిమితమవుతుందా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. -
‘సామాజిక బాధ్యత’తో కార్పొరేట్ లుక్
సాక్షి, హైదరాబాద్: ‘ఎంత సేపు ప్రభుత్వంపై ఆధారపడటమేనా.. ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలేవీ చేయరా’పలు సందర్బాల్లో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆర్టీసీ అధికారులను ఉద్దేశించి అన్న మాటలివి. ప్రతినెలా జీతాలు మొదలు ఇతర అవసరాలకు ఆర్టీసీ కొంతకాలంగా ప్రభుత్వంపైనే ఆధారపడుతుండటమే దీనికి కారణం. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాలని ఆర్టీసీ కొత్త ఎండీ నిర్ణయించారు. తాను బాధ్యతలు స్వీకరించిన రోజే ఈ మేరకు ప్రకటన చేసిన ఆయన రెండో రోజు దాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నం ప్రారంభిం చారు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని ఆర్టీసీ దివాలా దశకు చేరడంతో.. దాని అనుబంధ విభాగాలు కూడా అదే బాట పట్టాయి. ఇందులో ఆర్టీసీ ఆసుపత్రి కూడా ఉండటం విశేషం. 49 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల వైద్యానికి పెద్దదిక్కయిన ఈ ఆసుపత్రి కొన్ని రోజులుగా కునారిల్లుతూ వస్తోంది. కరోనా రెండు దశలో ఈ ఆసుపత్రిని కోవిడ్ సెంటర్‌గా మార్చాలన్న డిమాం డ్ వచ్చింది. తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించినా.. ఆక్సిజన్ పైప్‌లైన్ వరకు నిర్మించి గాలికొదిలేశారు. ఇప్పుడు దీన్ని అభివృద్ధి చేయాలని ఎండీ సజ్జనార్ నిర్ణయించారు. సామాజిక బాధ్యతతో.. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిని శనివారం ఉదయం సజ్జనార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెండు గంటలపాటు ఆసుపత్రి అంతా కలియదిరిగి అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిని కార్పొరేట్ తరహాలో అభివృద్ధి చేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తొలుత తమ స్థాయిలో ఎంత అభివృద్ధి చేయగలమో చూసి.. తర్వాతే అవసరమైతే ప్రభుత్వ సాయం తీసుకోవాలని నిర్ణయించారు. దీనికోసం ఆయన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్)æని అనుసరించాలని భావిస్తున్నారు. త్వరలో ఈ పద్ధతిలో రెండు అంబులెన్సులు సమకూర్చేందుకు ఆయన ఏర్పాటు చేశారు. తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి, కోవిడ్ సెంటర్ పనులు పూర్తి చేయాలని కోరారు. వెంటనే పనులు పూర్తి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఆసుపత్రిలో అత్యాధునిక వసతులతో కూడిన ఇన్సెంటివ్ కేర్ యూనిట్ ఏర్పాటుకు నిర్ణయించారు. దీనికి కావాల్సిన పరికరాల జాబితా ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మందుల విభాగాన్ని పరిశీలించి, కొరత లేకుండా ప్రత్యేక ఏర్పాటు అవసరమని తేల్చారు. దీన్ని కూడా కార్పొరేట్ సామాజిక బాధ్యతతో అనుసంధానించాలని ఆయన నిర్ణయించారు. అలాగే ల్యాబ్ ఖాళీగా ఉండే సమయంలో ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో బయటి వ్యక్తుల నమూనాల పరీక్షలు చేయించి ఆదాయ సేకరణకు అనువుగా మార్చే అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఇలా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా వీలైనంత తొందరలో ఆసుపత్రి ముఖచిత్రం మార్చి రోగులను రిఫరల్ ఆసుపత్రులకు పంపాల్సిన అవసరం లేకుండా చూడాలని ఆయన నిర్ణయించారు. సిబ్బంది అందరికి కోవిడ్ టీకాలు ఇప్పించాలని పేర్కొన్న ఆయన, రెండో డోస్ వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. కావాల్సినంత మంది వైద్యుల నియామకం వెంటనే చేపట్టనున్నట్లు వెల్లడించారు.అనంతరం ఆసుపత్రి ఆవరణలో మొక్క నాటారు. ఆయన వెంట ఈడీలు పురుషోత్తం, వినోద్, వెంకటేశ్వర్లు, మునిశేఖర్, యా దగిరి, సూపరింటెండెంట్ వెంకటరమణ ఉన్నారు. -
ఆక్సిజన్ పైపులేశారు.. వదిలేశారు..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ప్రధాన ఆసుపత్రిలో కోవిడ్ సెంటర్ ఏర్పాటు పనులను గాలికొదిలేశారు. కోవిడ్ రెండో వేవ్ సమయంలో ఆర్టీసీ ఉద్యోగులు దాదాపు 4 వేల మంది వ్యాధి బారినపడి, 120 మంది వరకు చనిపోయారు. ఈ నేపథ్యంలో 200 పడకల సామర్థ్యంతో కరోనా సెంటర్‌ను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వైద్య, ఆరోగ్య శాఖలోని మౌలిక వసతుల కల్పన సంస్థ హడావుడిగా ఆక్సిజన్ పైప్‌లైన్ ఏర్పాటు పనులను కొంతమేర పూర్తి చేసింది. ఈలోపు కోవిడ్ కేసులు తగ్గడంతో ఆసుపత్రి వైపు కన్నెత్తి చూడలేదు. త్వరలో మూడో వేవ్ వచ్చే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఆర్టీసీ సిబ్బందిలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మూడో వేవ్ వరకైనా కోవిడ్ సెంటర్ సిద్ధమవుతుందని భావించారు. మొదటి రెండు దశల్లో పడకలు దొరక్క ఆర్టీసీ ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలోనే ఉద్యోగులు తమ ఆసుపత్రిలో కోవిడ్ సెంటర్ కోసం గళమెత్తారు. అయితే కోవిడ్ కేంద్రం పనులు చేసినట్లే చేసి మధ్యలోనే గాలికొదిలేశారు. ఆశలు వదులుకుని సొంతంగా.. రూ.2 కోట్లు నిధులు కేటాయిస్తే తామే పనులు చేసుకుంటామని ఆర్టీసీ ఆస్పత్రి అధికారులు వైద్య, ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ చుట్టూ తిరిగినా ప్రయో జనం లేకుండా పోయింది. దీంతో సొంతంగా విరాళాలు సేకరించటం, స్వచ్ఛంద సంస్థలను కోరి కొన్ని పనులు పూర్తి చేయించుకునేలా నడుం బిగించారు. హైదరాబాద్ రీజియన్‌కు చెం దిన డీవీఎంలు, డిపో మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్ స్థాయి అధికారులు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు విరాళాలిచ్చారు. వాటితో 50బెడ్ల ఏర్పాటుకు పనులు ప్రారంభించారు. నిర్మాణ్ అనే సంస్థ 10 లీటర్ల సామర్థ్యమున్న 25 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఇచ్చింది. సెర్చ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ తరఫున ఓ ప్రతినిధి 40 సాధారణ పడకలు, 10 ఫౌలర్ బెడ్లు, సైడ్ టేబుల్స్, ఐవీ ఫ్లూయిడ్ స్టాండ్లు, స్టెతస్కోపులు అందజేశారు. రాజ్‌భవన్ రోడ్డులో ఉన్న మరో సంస్థను కూడా సంప్రదించి పెద్ద ఆక్సిజన్ సిలిండర్ల కోసం చర్చిస్తున్నారు. వంద ఇస్తే చాలు.. ఆర్టీసీలో 45 వేల మంది ఉద్యోగులున్నారు. వీరంతా నెలకు రూ.100 చొప్పున చెల్లిస్తే ప్రతినెలా రూ.45 లక్షలు సమకూరుతాయి. అలా 4 నెలలు ఇస్తే కోవిడ్ సెంటర్ ఏర్పాటుకు ఇతరులపై ఆధారపడాల్సిన పని ఉండదు. ప్రతినెలా వసూలయ్యే మొత్తంతో అప్పటికప్పుడు కావాల్సిన ఏర్పాట్లు చేసుకునేందుకు వీలు పడుతుంది. తొలుత 50 బెడ్ల సామర్థ్యంతో ప్రారంభించి క్రమంగా పెంచు కుంటూ పోవాలని అధికారులు భావిస్తున్నారు. గతంలో హన్మకొండలో ఆర్టీసీ డిస్పెన్సరీని ఇలాగే ఉద్యోగుల విరాళంతో ఏర్పాటు చేశారు. తక్కువ విరాళంతో ప్రతినెలా ఓ బస్సు చొప్పున కొని నడిపిన ఉదంతాలున్నాయి. కావాల్సినవి ఇవి.. ►పూర్తయిన ఆక్సిజన్ పైపులైన్‌కు ఆక్సిజన్ సిలిండర్లు అమర్చాలి. ►200 పడకలకు 45 లీటర్ల సామర్థ్యం ఉన్న 600 సిలిండర్లు. ►ఒక్కో సిలిండర్ ధర రూ.22 వేల వరకు ఉందని అధికారులు తేల్చారు. అంటే వీటికే రూ.1.32 కోట్లు అవసరం. ►ఐసీయూకు సంబంధించిన పరికరాలు కావాలి. ►7 వెంటిలేటర్లు. అంబులెన్సు, మందులు. -
ఆర్టీసీ ఆస్పత్రిలో కార్మికులకు వైద్యం నిలిపివేత
సాక్షి, హైదరాబాద్ : తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో.. కార్మికులకు వైద్య సేవలు నిలిపివేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటించడంతో ఆస్పత్రి యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఆస్పత్రిలో వైద్య సేవలు నిలిపివేయడంపై కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ విషయంలో ప్రభుత్వ తీరును అఖిలపక్షం, ఆర్టీసీ జేఏసీ తీవ్రంగా ఖండించింది. ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి మట్లాడుతూ.. తార్నక ఆస్పత్రిలో ఆర్టీసీ కార్మికులకు చికిత్సలు నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ సమ్మెకు ఉద్యోగ సంఘాలు కూడా మద్దతు ఇవ్వాలని కోరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాలు ఎంతగానో పోరాటం చేశాయని.. ఆ స్ఫూర్తితలోనే తాము ఇప్పుడు ఆర్టీసీని కాపాడుకునేందుకు సమ్మె చేస్తున్నామని చెప్పారు. ఉద్యోగ సంఘాలను ఈ మాటలు నొప్పించి ఉంటే క్షమించాలని అన్నారు. -
ఆర్టీసీ ఆస్పత్రిలో మందుల కొరత
సాక్షి,సిటీబ్యూరో: వేలాది మంది ఆర్టీసీ కార్మికు లకు వైద్యసేవలు అందించే ఆస్పత్రిని మందుల కొరత వెంటాడుతోంది. అధికారులు, వైద్యులు ఏ నెలకానెల అతి కష్టంగా నెట్టుకొస్తున్నారు. మందుల కొనుగోళ్లకు అవసరమైన నిధులు లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. జ్వరం, జలుబు, ఫ్లూ వంటి సాధారణ జబ్బులకు అందజేసే మందులకు సైతం ఇబ్బందిగానే ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ ఆస్పత్రికి పెద్ద మొత్తంలో మందులను సరఫరా చేసే మెడ్‌ప్లస్ సంస్థకు ఈ ఏడాది జూలై నుంచి రూ.4 కోట్ల మేర బకాయిలు చెల్లించలేదు. దీంతో ఆ సంస్థ మందులు సరఫరా చేసేందుకు వెనుకాడుతోంది. రెండు రోజుల క్రితం ఇదే అంశంపై ఆస్పత్రి అధికారులు, వైద్యులు మెడ్‌ప్లస్ యాజమాన్యాన్ని సంప్రదించి మరోనెల రోజుల వరకైనా మందులు సరఫరా చేయాలని కోరడంతో ఆ సంస్థ అయిష్టంగానే అంగీకరించినట్టు తెలిసింది. కానీ ఈ నెల గడిస్తే వచ్చే నెల పరిస్థితి ఏంటని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ‘ఈ నెల వరకు అతి కష్టంగా మెడ్‌ప్లస్‌ను ఒప్పించగలిగాం. డిసెంబర్ నాటికి – మిగతా 6లోu uమొదటిపేజీ తరువాయి బకాయిలు చెల్లిస్తే తప్ప మందులను సరఫరా చేయలేమని తేల్చిచెప్పారు. అప్పటి వరకు నిధులు అందితే వైద్య సేవలు కొనసాగుతాయి. లేకపోతే నిలిచేపోతాయి’ అని ఓ అధికారి చెప్పారు. వేలాది మంది కార్మికులకు వైద్య సేవలను అందిస్తున్న ప్రతిష్టాత్మకమైన తార్నాక ఆర్టీసీ ఆస్పత్రి దుస్థితి ఇది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి రోజు సుమారు 3 వేల మందికి పైగా బయటి రోగులు ఇక్కడికి వచ్చి చికిత్సలు పొందేవారు. ప్రస్తుతం 1500 మంది బయటి రోగులు ఉండగా, మరో 150 మంది వరకు ఇన్పేషెంట్లుగా సేవలను పొందుతున్నారు. ముఖ్యమైన వైద్య పరీక్షలు చేసేందుకు అవసరమైన లాబొరేటరీతో పాటు 15 డిపార్ట్మెంట్లు ఇందులో ఉన్నాయి. ప్రత్యేక వైద్య సదుపాయం కోసం మాత్రం రోగులను కార్పొరేట్ ఆస్పత్రులకు తరలిస్తారు. రెండేళ్ల క్రితమె మెడ్‌ప్లస్‌కు అప్పగింత గతంలో ఆర్టీసీ యాజమాన్యమే సొంతంగా మందులను కొనులో చేసేది. ఇందుకోసం ఏటా రూ.8 నుంచి రూ.9 కోట్ల వరకు ఖర్చయ్యేది. కానీ కొన్నిసార్లు మందుల సరఫరాకు ఆటంకం ఏర్పడడం వల్ల, సకాలంలో మందులు ఆస్పత్రికి చేరకపోవడం, సరఫరా చేసే సంస్థల మధ్య నెలకొన్న పోటీ, తదితర కారణాల వల్ల రెండేళ్ల క్రితం మందుల సరఫరాను పూర్తిగా మెడ్‌ప్లస్‌కే అప్పగించారు. గతంలో ఏ సంస్థ తక్కువ మొత్తానికి మందులు సప్లై చేసే దానికే ఆర్డర్ ఇచ్చేవారు. దీంతో మందుల కొనుగోళ్లపై భారం తక్కువగా ఉండేది. కానీ మెడ్‌ప్లస్‌కు అప్పగించిన తర్వాత మందుల సరఫరాలో ఎలాంటి ఆటంకం లేకపోయినప్పటికీ ఖర్చు మాత్రం రూ.14 కోట్లకు చేరుకున్నట్లు అంచనా. మందుల సరఫరా బాగానే ఉన్నప్పటికీ ఆర్టీసీ పైన ఒక్కసారిగా భారం రెట్టింపైంది. మెడ్‌ప్లసకు చెల్లించవలసిన బాకీ రూ.4 కోట్ల వరకు ఉండవచ్చని చెబుతన్నా.. ఇంకా ఎక్కువే ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఎన్నికల ‘కోడ్’ ప్రతిబంధకం పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందితే తప్ప గట్టెక్కే పరిస్థితి లేదు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రూ.273 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపుల్లోనూ జాప్యం నెలకొంది. ప్రభుత్వం నుంచి సాయం అందే అవకాశం లేదు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రభుత్వ సాయానికి బ్రేకులు పడ్డాయి. మరోవైపు మొదటి నుంచి ఆర్టీసీ స్వతంత్రంగా నిలదొక్కుకోవాలని చెబుతున్న ప్రభుత్వం పెద్దగా ఆదుకోకపోవడంతో ఏటేటా నష్టాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆర్థిక సాయం అందజేస్తే తప్ప ఈ కష్టాల నుంచి గట్టెక్కే పరిస్థితి లేదు. బకాయిలు చెల్లించకపోతే మందుల సరఫరాను నిలిపివేయనున్నట్లు ఇప్పటికే మెడ్‌ప్లస్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల ఆరోగ్య పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. -
ప్రింటింగ్ ప్రెస్‌కు ఆర్టీసీ బైబై
సాక్షి, హైదరాబాద్: అది 50 ఏళ్ల చరిత్ర గల ఆర్టీసీ అనుబంధ సంస్థ.. ప్రస్తుతం నలుగురే దాన్ని మోస్తున్నారు.. మరో 4 నెలల్లో వారూ పదవీవిరమణ చేయనున్నారు.. వారి రిటైర్మెంట్తో పాటు ఆ సంస్థ కూడా శాశ్వతంగా సెలవు తీసుకోబోతోంది.. అలుపెరగకుండా సేవలందించిన ఆ సంస్థే ఆర్టీసీ ముద్రణాలయం.. ఉత్పత్తి పూర్తిగా నిలిపేసి చిన్నాచితకా పనులకే పరిమితమైన ప్రింటింగ్ ప్రెస్‌ను మూసేందుకు రంగం సిద్ధమైంది. యాభై ఏళ్లుగా రవాణా సంస్థతో కలసి సాగుతున్న ఆ ప్రెస్‌తో శాశ్వతంగా బంధాన్ని తెంచుకునేందుకు ఆర్టీసీ నిర్ణయించింది. దాన్ని మోయలేని భారంగా భావి స్తున్న ఆర్టీసీ వదిలించుకుంటోంది. మున్ముందు అవసరమైన ముద్రణ పనులకు ప్రైవేటుపై ఆధారపడేందుకు ఆసక్తి చూపుతోంది. అందులో పని చేసే ఉద్యోగుల జీత భత్యాలు, సంస్థ నిర్వహణ ఖర్చులను సమస్యగా భావిస్తుండటంతో ప్రభుత్వమూ ఆ విషయంలో జోక్యం చేసుకోనంటోంది. 50 ఏళ్ల క్రితం.. రోడ్డు రవాణా సంస్థకు అనుబంధంగా 50 ఏళ్ల క్రితం ముద్రణాలయం ఏర్పడింది. ఆర్టీసీకి అవసరమైన టికెట్లు, పుస్తకాలు, ఎస్ఆర్ జాబితాలు సహా సంస్థ అవసరాలకు సంబంధించిన అన్ని ప్రతులను ముద్రించేందుకు ప్రెస్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్‌భవన్ ఉన్న ప్రాంతంలో ఈ యూనిట్ ఉండేది. అప్పట్లో బస్‌బాడీ యూనిట్ కూడా ఇక్కడే ఉండేది. 1985లో ప్రస్తుతం ఉన్న చోట్లకు వాటిని తరలించారు. బస్‌బాడీ యూనిట్ ను మియాపూర్‌లో ఏర్పాటు చేయటంతో అక్కడే ప్రింటింగ్ ప్రెస్ నెలకొల్పారు. దానికి 200 మంది కార్మికులను కేటాయించారు. కంప్యూటరీకరణ పెరగడంతో పుస్తకాల ముద్రణ ఆపి సిబ్బంది సంఖ్యను 130కి పరిమితం చేశారు. కొంతకాలంగా ఆర్టీసీ టిమ్స్‌లో వినియోగించే టికెట్ రోల్స్‌పై ఆర్టీసీ లోగో ముద్రించే పనే అందులో నిర్వహిస్తున్నారు. పనిలేదన్న కారణంతో సిబ్బందిని ఇతర విభాగా లకు తరలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న నలుగురు పదవీ విరమణ పొందేవరకు ప్రెస్‌ను కొనసాగించి తర్వాత మూసేయాలని అధికారులు నిర్ణయించారు. ఇక ఆర్టీసీకి ముద్రణ అవసరం ఉంటే ప్రైవేటు కంపెనీల్లో చేయించాల్సిందే. మూతబడుతున్న యూనిట్లు.. తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రి సహా జిల్లాల్లోని డిస్పెన్సరీలకు సంబంధించిన ఫార్మసీలను ఇప్పటికే ఆర్టీసీ ప్రైవేటుకు అప్పగించింది. దీని వెనక ఓ రాజకీయ నేత హస్తం ఉందన్న ఆరోపణలు కార్మికుల్లో గుప్పుమంటున్నాయి. తన బంధువుల సంస్థకు ఫార్మసీ బాధ్యతలు అప్పగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలొస్తున్నాయి. కార్మికులకు మెరుగైన సేవలందించేందుకు ఫార్మసీ ని ప్రైవేటీకరించినట్లు అధికారులు చెబుతున్నారు. వరంగల్‌లో ఉన్న ఆర్టీసీ టైర్ రీ ట్రేడింగ్ యూనిట్‌నూ ఇప్పటికే మూసేశారు. అరిగిపోయిన టైర్లు మరికొంత కాలం మన్నేలా రబ్బర్‌ను ఏర్పాటు చేసి వాటిని తిరిగి సిద్ధం చేయటం ఈ యూనిట్ విధి. ఇలాంటి మూడు సంస్థలో ఓ దాన్ని మూసేశారు. మూసే జాబితాలో ఇప్పుడు ప్రింటింగ్ ప్రెస్ చేరింది. -
ఆర్టీసీ ఆస్పత్రి ఫార్మసీ ప్రైవేటుపరం!
⇒ మందుల కొరత ఉందంటూ బడా సంస్థకు ధారాదత్తం ⇒ సమస్య పరిష్కరించకుండా తప్పించుకోజూస్తున్న ఆర్టీసీ ⇒ రెండు, మూడు రోజుల్లో ప్రైవేటు సంస్థతో ఒప్పందం సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని ఆర్టీసీ ఆస్పత్రిలో మందులకు కరువొచ్చింది! పారాసిటమాల్ లాంటి సాధారణ జ్వరం మాత్రల కోసం కూడా రోగులు రోజుల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది!! ఈ సమస్యను పరిష్కరించి సకాలంలో మందులు సరఫరా అయ్యేలా చూడాల్సిన ఆర్టీసీ యాజమాన్యం మాత్రం చేతులెత్తేసింది. ఏకంగా ఆస్పత్రి మందుల నిర్వహణ బాధ్యత నుంచే తప్పుకోవాలని నిర్ణయించింది. ఆస్పత్రి ఫార్మసీని గొలుసు దుకాణాల వ్యవస్థ ఉన్న ఓ బడా ప్రైవేటు సంస్థకు అప్పగించ నుంది. ఈ మేరకు మరో రెండు, మూడు రోజుల్లో దానితో ఒప్పందం చేసుకోనుంది. తీవ్ర నష్టాలు, ఆర్థిక ఇబ్బందులతో సతమవుతూ ఒక్కో అనుబంధ సంస్థను వదిలించుకుంటున్న ఆర్టీసీ తాజాగా ఫార్మసీని కూడా ఆ జాబితాలోకి నెట్టేస్తోంది. అసలు సమస్యను గాలికొదిలేసి... ఆర్టీసీకి తార్నాకలో సొంతంగా పెద్ద ఆస్పత్రి ఉంది. దీనికి ఆర్టీసీ సెంట్రల్ స్టోర్సే మందులను సరఫరా చేస్తుంది. బస్సులకు టైర్లు మొదలు ఆర్టీసీ ఆస్పత్రికి మందుల వరకు సమకూర్చే బాధ్యత దీనిదే. ఎలాంటి మందుల అవసరం ఉంటుందో ముందుగానే జాబితా రూపొందించి టెండర్లు పిలిచి తక్కువ మొత్తం కోట్ చేసిన సంస్థ నుంచి వాటిని కొనుగోలు చేస్తుంది. ఇక్కడే సమస్య ఎదురవుతోంది. ప్రస్తుతం 329 రకాల మందులను టెండర్ల ద్వారా సమకూర్చుకుంటున్నా ఆయా సంస్థలు కొన్ని రకాల మందులనే సకాలంలో సరఫరా చేసి మిగతా వాటిని నెల, అంతకంటే ఎక్కువ జాప్యం చేస్తూ సరఫరా చేస్తున్నాయి. దీంతో ప్రస్తుతం 100 రకాల మందులకు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ సమస్య కొన్ని నెలలుగా ఉన్నా దాన్ని పరిష్కరించటంలో ఆర్టీసీ విఫలమవుతోంది. ఈలోగా మందులను అత్యవసరంగా సమకూర్చుకోవాల్సి వస్తే లోకల్ పర్చేస్ విధానంలో అప్పటికప్పుడు వేరే సంస్థల నుంచి కొనాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకు కూడా తొలుత సంస్థలో ప్రత్యేకంగా ఉండే కమిటీ సమావేశమై అనుమతి ఇవ్వాల్సి ఉంది. కమిటీ నుంచి అనుమతి లభించి మందులను ఆస్పత్రి తిరిగి సమకూర్చుకునేందుకు కనీసం వారం పడుతోంది. దీనివల్ల రోగుల బంధువులే బయటి దుకాణాల్లో మందులు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వెరసి సకాలంలో మందులు దొరకని దుస్థితి నెలకొని ఇబ్బందులు తలెత్తుతున్నా దాన్ని చక్కదిద్దటంలో ఆర్టీసీ విఫలమైంది. అదనపు భారం రూ.2 కోట్లకు పైమాటే... ప్రస్తుతం ఆర్టీసీ ఆస్పత్రికి మందుల సరఫరా కోసం సాలీనా రూ.9 కోట్ల వరకు ఖర్చవుతోంది. ఇప్పుడు ఆస్పత్రి ఫార్మసీ బాధ్యతను ప్రైవేటు సంస్థకు అప్పగించటం వల్ల ఆ సంస్థకు దాదాపు రూ. 11 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. అసలే నష్టాలతో సతమతమవుతున్న సంస్థ తాజా నిర్ణయంతో మరింత భారం మోపుకొంటోంది. అయితే తాజా నిర్ణయం వల్ల సంస్థపై కొంత ఆర్థిక భారం పడినా నాణ్యమైన మందులకు కొరత ఉండదని...ఇది కార్మికులకే మంచిదని అధికారులు పేర్కొంటున్నారు. కానీ కార్మిక సంఘాలు మాత్రం ఈ చర్యను వ్యతిరేకిస్తున్నాయి. ఆస్పత్రి విస్తరణకు ఎంతో పాటుపడ్డామని, ఇప్పుడు అందులోని ప్రధాన ఫార్మసీ విభాగాన్ని ప్రైవేటీకరించడమంటే యాజమాన్యం బాధ్యతల నుంచి తప్పించుకోవడమేనని విమర్శిస్తున్నాయి. -
ఆర్టీసీ ఆస్పత్రి పనులు షురూ!
ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల ఆర్టీసీ ఉద్యోగ, కార్మికుల కోసం ఒక ఆస్పత్రి నిర్మించాలన్న యూనియన్ల ప్రతిపాదన కార్యరూపం దాల్చనుంది. ఐదు ఎకరాల ఖాళీ స్థలం ఉంటే సుమారు ఎకరన్నర స్థలంలోనే ఆస్పత్రి నిర్మించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తుండడంతో కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వసతుల వివరాలు గోప్యంగా ఉంచడంపై అయోమయూనికి గురవుతున్నారు. విజయవాడ (భవానీపురం) : విద్యాధరపురం ఆర్టీసీ వర్క్‌షాప్ తదితర విభాగాలలో పనిచేసే అధికారుల కోసం ప్రత్యేకంగా ఐదు, కార్మికుల కోసం 48 క్వార్టర్స్‌ను సంస్థ 1962లో నిర్మించింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు క్వార్టర్స్ ఉద్యోగ, కార్మిక కుటుంబాలతో కళకళలాడేవి. అయితే చాలా మంది అధికారులు రిటైర్ కావడం, వర్క్‌షాప్‌లో కార్మికులు తగ్గిపోవడంతో క్వార్టర్స్‌లో సౌకర్యాల గురించి పట్టించుకున్నవారు కరువయ్యారు. వర్షం పడితే క్వార్టర్స్ జలదిగ్బంధంలో చిక్కుకుపోయేవి. ఐదు దశాబ్దాల కిందట నిర్మించినవి కావడంతో లోతట్టులో ఉండే క్వార్టర్స్‌లోకి వర్షపు నీరు వచ్చేసేవి. ఈ బాధలు పడలేక క్వార్టర్స్‌లోని వారందరూ ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఎనిమిది సంవత్సరాల నుంచి క్వార్టర్స్ నిరుపయోగంగా ఉండి శిథిలమైపోయాయి. వాటిని తొలగించే పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఏ నిధులతో ఆస్పత్రి నిర్మిస్తారో..? ఆర్టీసీ వర్క్‌షాప్ వెనుక భాగంలో ఉన్న జోనల్ వెహికల్ స్క్రాప్ యార్డులో ఆస్పత్రి నిర్మాణాన్ని యాజమాన్యం చేపట్టింది. అయితే ఈ నిర్మాణానికి అయ్యే ఖర్చు కార్మిక వర్గాల నుంచి వసూలు చేస్తున్న మొత్తంతో నిర్మిస్తున్నారా, లేదంటే సంస్థ సొమ్ముతో నిర్మిస్తున్నారా అన్నది అధికారులు ధ్రువీకరించాల్సింది. ఆస్పత్రి నిర్మాణం కోసం కార్మికుల వేతనాల నుంచి వసూలు చేసిన సొమ్మును వారికి తిరిగి ఇప్పించేస్తామని, కార్పొరేషన్ సొమ్ముతోనే హాస్పటల్ నిర్మించేలా చేస్తామని ఇటీవల జరిగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలలో నేషనల్ మజ్దూర్ యూనియన్ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టింది. ఆ ఎన్నికల్లో ఎన్ఎంయూ గెలిచింది. మ్యానిఫెస్టోలో పెట్టిన హామీని నెరవేర్చుకుంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఒప్పందానికి విరుద్ధంగా నిర్మిస్తున్నారు ఏపీలోని 13 జిల్లాల ఆర్టీసీ ఉద్యోగ, కార్మికుల ఆరోగ్య భద్రత కోసం విద్యాధరపురంలో సంస్థకు చెందిన ఖాళీ స్థలంలో 100 పడకల ఆస్పత్రి నిర్మించాలని తాము గతంలో చేసిన ప్రతిపాదనలకు యాజమాన్యం అంగీకరించింది. యాజమాన్యంతో చేసుకున్న ఒప్పందం మేరకు 2015 జూన్ నుంచి ఒక్కొక్క కార్మికుడి వేతనం నుంచి ప్రతినెలా రూ.100 వసూలు చేస్తోంది. ఈ విధంగా వసూలు చేసిన మొత్తం ఇప్పటి వరకు నెలకు సుమారు రూ.64 లక్షల చొప్పున రూ.7 కోట్లు ఉంటుంది. అయితే తమ ఒప్పందంలో ఐదు ఎకరాల ఖాళీ స్థలంలో ఆస్పత్రి నిర్మించాలన్న అంశానికి విరుద్ధంగా కేవలం రెండు ఎకరాల స్థలంలోని జోనల్ వెహికల్ స్క్రాప్‌యార్డ్‌లో నిర్మించడాన్ని వ్యతిరేకిస్తున్నాం. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పడగొట్టిన పాత క్వార్టర్స్ స్థలంలో హాస్పటల్ నిర్మించాలి. - షేక్ సుభాని, ఎంప్లాయూస్ యూనియన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి -
విధులకు రాకున్నా టంచన్‌గా జీతం!
♦ ఆర్టీసీలో వెలుగుచూసిన బోగస్ వైద్య బిల్లుల బాగోతం ♦ సొంత పనుల్లో ఉండి.. చికిత్స చేయించుకున్నట్టు సర్టిఫికెట్లు ♦ భాగ్యనగరంలో వెలుగుచూసిన వ్యవహారం ♦ ఓ డిపో మేనేజర్ అనుమానంతో గుట్టురట్టు ♦ అన్ని డిపోల్లో దర్యాప్తునకు రంగం సిద్ధం సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీలో అతనో ఉద్యోగి. ఇంటి దగ్గర వస్త్రవ్యాపారం చేస్తున్నాడు. నెల పాటు వ్యాపారం వద్ద ఉండాల్సి రావటంతో విధులకు డుమ్మా కొట్టేశాడు. అయినా నెల తిరిగేసరికి టంచన్‌గా జీతం వచ్చి చేతిలో పడింది. ఓ డిపోలో అతను ఉద్యోగం చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా సైడ్ బిజినెస్ చేస్తున్నాడు. 20 రోజుల పాటు విధులకు దూరంగా ఉండి రియల్ ఎస్టేట్ పార్టీలతో తిరిగాడు. జీతం మాత్రం యథాప్రకారం పొందాడు. విధులకు హాజరు కాకున్నా వీరికి జీతాలెలా వస్తున్నాయో తెలుసా? తీవ్ర అనారోగ్యానికి గురయ్యామని, తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్సపొందామని ఆస్పత్రి ‘జారీ చేసిన’ పత్రాలు దాఖలు చేశారు. దీంతో ఆర్టీసీ వారికి జీతం చెల్లించేసింది. ఇందులో ప్రత్యేకత ఏముందనుకుంటున్నారా..??? అసలు ఆ పత్రాలను తార్నాక ఆర్టీసీ ఆస్పత్రి జారీ చేయనేలేదు..!!! ఆర్టీసీలో నకిలీ వైద్య బిల్లుల బాగోతానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ‘సొంత వ్యవహారాలు’ చక్కబెట్టుకునే క్రమంలో కొందరు సిబ్బంది విధులకు ఎగనామం పెట్టి, తార్నకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నట్టుగా నకిలీ బిల్లులు దాఖలు చేసి జీతం డబ్బులు స్వాహా చేశారు. ఆ మొత్తం రూ. కోట్లలో ఉన్నట్టు సమాచారం. ఓ డిపో మేనేజర్‌కు వచ్చిన అనుమానంతో కూపీలాగగా ఈ గుట్టురట్టయింది. దీంతో మరికొందరు డిపో మేనేజర్లు విచారణ జరపగా వారివారి డిపో పరిధిలో కూడా ఈ తంతు వెలుగు చూసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో దీనిపై విచారణకు ఆర్టీసీ యాజమాన్యం ఆదేశించింది. హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన ఈ బాగోతంలో ఇప్పటి వరకు 80 మంది సిబ్బంది పాలుపంచుకున్నట్టు తేలింది. విచారణ కొనసాగుతున్నందున ఈ సంఖ్య వందల్లో ఉండొచ్చని సమాచారం. వెలుగు చూసిందిలా.. గత నెలకు సంబంధించి నగరంలోని మియాపూర్ డిపోలో మెడికల్ బిల్లులు దాఖలయ్యాయి. వాటి సంఖ్య ఎక్కువగా ఉండటంతో డిపో మేనేజర్‌కు అనుమానం వచ్చి.. వాటిని తార్నాకలోని ఆస్పత్రి పరిశీలనకు పంపారు. అసలు ఆ పేరుగల సిబ్బంది ఆస్పత్రికే రాలేదని, ఆ బిల్లులు తాము జారీ చేసినవి కావని అక్కడి అధికారులు తేల్చారు. దీంతో సిబ్బంది నకిలీ బిల్లులు జమ చేసినట్టు అనుమానించి తొలుత నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. మరికొన్ని బిల్లుల సంగతి తేల్చాల్చి ఉంది. ఈ విషయం తెలిసి కూకట్పల్లి, మేడ్చల్, బీహెచ్ఈఎల్ డీఎంలు కూడా తమ డిపోల్లో దాఖలైన బిల్లులను ఆస్పత్రికి పంపారు. వాటిలో సగానికిపైగా బోగ స్ అని తేలింది. నెల రోజుల బిల్లుల్లో 80 నకిలీవి అని తేలాయి, మరికొన్ని వందల బిల్లుల పరిశీలన జరుగుతోంది. ఈ తంతు చాలాకాలంగా నడుస్తోందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా రూ. కోట్ల నిధులు ఇలా నకిలీ బిల్లులతో స్వాహా చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నందున గత ఏడాదికాలంలో దాఖలు చేసిన అన్ని బిల్లులను పరిశీలించాలనే ఆలోచనలో అధికారులున్నారు. దీన్ని విజిలెన్స్ విభాగం ద్వారా తనిఖీ చేయించనున్నట్టు సమాచారం. బిల్లులు ఎవరిస్తున్నారు.. చికిత్స పొందిన ఉద్యోగులకు ఆర్టీసీ ఆస్పత్రి ముద్రతో బిల్లు జారీ అవుతుంది. ఆస్పత్రి జారీ చేసే బిల్లు అచ్చుగుద్దినట్టుగా నకిలీ పత్రాలు ఇప్పుడు వెలుగుచూశాయి. ఆర్టీసీలో పనిచేసే కొందరు ఉద్యోగులు దీని వెనక ఉన్నట్టు తెలుస్తోంది. వారు నకిలీ స్టాంపులు రూపొందించి సిబ్బందికి గుట్టుచప్పుడు కాకుండా బిల్లులు జారీ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్టు సమాచారం. వీరి వెనక ఆస్పత్రి సిబ్బంది హస్తం ఉందేమోనన్న కోణంలోనూ దర్యాప్తు చేయనున్నట్టు తెలిసింది.