ఆర్టీసీ ఆస్పత్రి పనులు షురూ! | RTC Hospital works starts! | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఆస్పత్రి పనులు షురూ!

Published Wed, Mar 9 2016 3:20 AM | Last Updated on Sun, Sep 3 2017 7:16 PM

ఆర్టీసీ ఆస్పత్రి పనులు షురూ!

ఆర్టీసీ ఆస్పత్రి పనులు షురూ!

ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల ఆర్టీసీ ఉద్యోగ, కార్మికుల కోసం ఒక ఆస్పత్రి నిర్మించాలన్న యూనియన్ల ప్రతిపాదన కార్యరూపం దాల్చనుంది. ఐదు ఎకరాల ఖాళీ స్థలం ఉంటే సుమారు ఎకరన్నర స్థలంలోనే ఆస్పత్రి నిర్మించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తుండడంతో కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వసతుల వివరాలు గోప్యంగా ఉంచడంపై అయోమయూనికి గురవుతున్నారు.
 
విజయవాడ (భవానీపురం) : విద్యాధరపురం ఆర్టీసీ వర్క్‌షాప్ తదితర విభాగాలలో పనిచేసే అధికారుల కోసం ప్రత్యేకంగా ఐదు, కార్మికుల కోసం 48  క్వార్టర్స్‌ను సంస్థ 1962లో నిర్మించింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు క్వార్టర్స్ ఉద్యోగ, కార్మిక కుటుంబాలతో కళకళలాడేవి. అయితే చాలా మంది అధికారులు రిటైర్ కావడం, వర్క్‌షాప్‌లో  కార్మికులు తగ్గిపోవడంతో క్వార్టర్స్‌లో సౌకర్యాల గురించి పట్టించుకున్నవారు కరువయ్యారు. వర్షం పడితే క్వార్టర్స్ జలదిగ్బంధంలో చిక్కుకుపోయేవి.

ఐదు దశాబ్దాల కిందట నిర్మించినవి కావడంతో లోతట్టులో ఉండే క్వార్టర్స్‌లోకి వర్షపు నీరు వచ్చేసేవి. ఈ బాధలు పడలేక క్వార్టర్స్‌లోని వారందరూ ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఎనిమిది సంవత్సరాల నుంచి క్వార్టర్స్ నిరుపయోగంగా ఉండి శిథిలమైపోయాయి. వాటిని తొలగించే పనులు చురుగ్గా జరుగుతున్నాయి.
 
ఏ నిధులతో ఆస్పత్రి నిర్మిస్తారో..?

ఆర్టీసీ వర్క్‌షాప్ వెనుక భాగంలో ఉన్న జోనల్ వెహికల్ స్క్రాప్ యార్డులో ఆస్పత్రి నిర్మాణాన్ని యాజమాన్యం చేపట్టింది. అయితే ఈ నిర్మాణానికి అయ్యే ఖర్చు కార్మిక వర్గాల నుంచి వసూలు చేస్తున్న మొత్తంతో నిర్మిస్తున్నారా, లేదంటే సంస్థ సొమ్ముతో నిర్మిస్తున్నారా అన్నది అధికారులు ధ్రువీకరించాల్సింది. ఆస్పత్రి నిర్మాణం కోసం కార్మికుల వేతనాల నుంచి వసూలు చేసిన సొమ్మును వారికి తిరిగి ఇప్పించేస్తామని, కార్పొరేషన్ సొమ్ముతోనే హాస్పటల్ నిర్మించేలా చేస్తామని ఇటీవల జరిగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలలో నేషనల్ మజ్దూర్ యూనియన్ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టింది. ఆ ఎన్నికల్లో ఎన్‌ఎంయూ గెలిచింది. మ్యానిఫెస్టోలో పెట్టిన హామీని నెరవేర్చుకుంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.  
 
 ఒప్పందానికి విరుద్ధంగా నిర్మిస్తున్నారు
ఏపీలోని 13 జిల్లాల ఆర్టీసీ ఉద్యోగ, కార్మికుల ఆరోగ్య భద్రత కోసం విద్యాధరపురంలో సంస్థకు చెందిన ఖాళీ స్థలంలో 100 పడకల ఆస్పత్రి నిర్మించాలని తాము గతంలో చేసిన ప్రతిపాదనలకు యాజమాన్యం అంగీకరించింది. యాజమాన్యంతో చేసుకున్న ఒప్పందం మేరకు 2015 జూన్ నుంచి ఒక్కొక్క కార్మికుడి వేతనం నుంచి ప్రతినెలా రూ.100 వసూలు చేస్తోంది. ఈ విధంగా వసూలు చేసిన మొత్తం ఇప్పటి వరకు నెలకు సుమారు రూ.64 లక్షల చొప్పున రూ.7 కోట్లు ఉంటుంది.

అయితే తమ ఒప్పందంలో ఐదు ఎకరాల ఖాళీ స్థలంలో ఆస్పత్రి నిర్మించాలన్న అంశానికి విరుద్ధంగా కేవలం రెండు ఎకరాల స్థలంలోని జోనల్ వెహికల్ స్క్రాప్‌యార్డ్‌లో నిర్మించడాన్ని వ్యతిరేకిస్తున్నాం. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పడగొట్టిన పాత క్వార్టర్స్ స్థలంలో హాస్పటల్ నిర్మించాలి.    
- షేక్ సుభాని, ఎంప్లాయూస్ యూనియన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement