తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రి
సాక్షి,సిటీబ్యూరో: వేలాది మంది ఆర్టీసీ కార్మికు లకు వైద్యసేవలు అందించే ఆస్పత్రిని మందుల కొరత వెంటాడుతోంది. అధికారులు, వైద్యులు ఏ నెలకానెల అతి కష్టంగా నెట్టుకొస్తున్నారు. మందుల కొనుగోళ్లకు అవసరమైన నిధులు లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. జ్వరం, జలుబు, ఫ్లూ వంటి సాధారణ జబ్బులకు అందజేసే మందులకు సైతం ఇబ్బందిగానే ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ ఆస్పత్రికి పెద్ద మొత్తంలో మందులను సరఫరా చేసే మెడ్‌ప్లస్ సంస్థకు ఈ ఏడాది జూలై నుంచి రూ.4 కోట్ల మేర బకాయిలు చెల్లించలేదు. దీంతో ఆ సంస్థ మందులు సరఫరా చేసేందుకు వెనుకాడుతోంది. రెండు రోజుల క్రితం ఇదే అంశంపై ఆస్పత్రి అధికారులు, వైద్యులు మెడ్‌ప్లస్ యాజమాన్యాన్ని సంప్రదించి మరోనెల రోజుల వరకైనా మందులు సరఫరా చేయాలని కోరడంతో ఆ సంస్థ అయిష్టంగానే అంగీకరించినట్టు తెలిసింది. కానీ ఈ నెల గడిస్తే వచ్చే నెల పరిస్థితి ఏంటని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ‘ఈ నెల వరకు అతి కష్టంగా మెడ్‌ప్లస్‌ను ఒప్పించగలిగాం. డిసెంబర్ నాటికి – మిగతా 6లోu
uమొదటిపేజీ తరువాయి
బకాయిలు చెల్లిస్తే తప్ప మందులను సరఫరా చేయలేమని తేల్చిచెప్పారు. అప్పటి వరకు నిధులు అందితే వైద్య సేవలు కొనసాగుతాయి. లేకపోతే నిలిచేపోతాయి’ అని ఓ అధికారి చెప్పారు. వేలాది మంది కార్మికులకు వైద్య సేవలను అందిస్తున్న ప్రతిష్టాత్మకమైన తార్నాక ఆర్టీసీ ఆస్పత్రి దుస్థితి ఇది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి రోజు సుమారు 3 వేల మందికి పైగా బయటి రోగులు ఇక్కడికి వచ్చి చికిత్సలు పొందేవారు. ప్రస్తుతం 1500 మంది బయటి రోగులు ఉండగా, మరో 150 మంది వరకు ఇన్‌పేషెంట్లుగా సేవలను పొందుతున్నారు. ముఖ్యమైన వైద్య పరీక్షలు చేసేందుకు అవసరమైన లాబొరేటరీతో పాటు 15 డిపార్ట్‌మెంట్లు ఇందులో ఉన్నాయి. ప్రత్యేక వైద్య సదుపాయం కోసం మాత్రం రోగులను కార్పొరేట్ ఆస్పత్రులకు తరలిస్తారు.
రెండేళ్ల క్రితమె మెడ్‌ప్లస్‌కు అప్పగింత
గతంలో ఆర్టీసీ యాజమాన్యమే సొంతంగా మందులను కొనులో చేసేది. ఇందుకోసం ఏటా రూ.8 నుంచి రూ.9 కోట్ల వరకు ఖర్చయ్యేది. కానీ కొన్నిసార్లు మందుల సరఫరాకు ఆటంకం ఏర్పడడం వల్ల, సకాలంలో మందులు ఆస్పత్రికి చేరకపోవడం, సరఫరా చేసే సంస్థల మధ్య నెలకొన్న పోటీ, తదితర కారణాల వల్ల రెండేళ్ల క్రితం మందుల సరఫరాను పూర్తిగా మెడ్‌ప్లస్‌కే అప్పగించారు. గతంలో ఏ సంస్థ తక్కువ మొత్తానికి మందులు సప్లై చేసే దానికే ఆర్డర్ ఇచ్చేవారు. దీంతో మందుల కొనుగోళ్లపై భారం తక్కువగా ఉండేది. కానీ మెడ్‌ప్లస్‌కు అప్పగించిన తర్వాత మందుల సరఫరాలో ఎలాంటి ఆటంకం లేకపోయినప్పటికీ ఖర్చు మాత్రం రూ.14 కోట్లకు చేరుకున్నట్లు అంచనా. మందుల సరఫరా బాగానే ఉన్నప్పటికీ ఆర్టీసీ పైన ఒక్కసారిగా భారం రెట్టింపైంది. మెడ్‌ప్లసకు చెల్లించవలసిన బాకీ రూ.4 కోట్ల వరకు ఉండవచ్చని చెబుతన్నా.. ఇంకా ఎక్కువే ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు.
ఎన్నికల ‘కోడ్’ ప్రతిబంధకం
పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందితే తప్ప గట్టెక్కే పరిస్థితి లేదు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రూ.273 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపుల్లోనూ జాప్యం నెలకొంది. ప్రభుత్వం నుంచి సాయం అందే అవకాశం లేదు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రభుత్వ సాయానికి బ్రేకులు పడ్డాయి. మరోవైపు మొదటి నుంచి ఆర్టీసీ స్వతంత్రంగా నిలదొక్కుకోవాలని చెబుతున్న ప్రభుత్వం పెద్దగా ఆదుకోకపోవడంతో ఏటేటా నష్టాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.
కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆర్థిక సాయం అందజేస్తే తప్ప ఈ కష్టాల నుంచి గట్టెక్కే పరిస్థితి లేదు. బకాయిలు చెల్లించకపోతే మందుల సరఫరాను నిలిపివేయనున్నట్లు ఇప్పటికే మెడ్‌ప్లస్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల ఆరోగ్య పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment