సాక్షి, హైదరాబాద్: భారత్‌లో ముఖ్యంగా హైదరాబాద్‌లో తక్కువ ఖర్చుతో నాణ్యమైన అంతర్జాతీయస్థాయి వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయని కెన్యా సెనెటర్ ఒబురో ఒగింగా ప్రశంసించారు. తన సోదరుడు గతంలో కెన్యా ప్రధానిగా ఉన్నారని, తాను గత 27 ఏళ్లుగా ఆ దేశంలో రాజకీయవేత్తగా కొనసాగుతున్నానని చెప్పారు. భారత్–కెన్యాల మధ్య మరింత దృఢమైన ఆర్థిక, వ్యాపార సంబంధాలను తాము కోరుకుంటున్నట్టు చెప్పారు.
భారత్‌కు చెందిన అపోలో, యశోద వంటి పెద్ద పెద్ద ఆసుపత్రులు తమ బ్రాంచీలను ఏర్పాటుచేసి వివిధ వైద్యాంశాల్లో స్థానిక డాక్టర్లకు శిక్షణ ఇవ్వాలని కోరారు. శుక్రవారం ఒబురో ఒగింగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను గత కొన్నేళ్లుగా తీవ్రమైన మోకాళ్ల నొప్పులను అనుభవించానని, ఆ సమస్యకు ఇటీవల హైదరాబాద్‌లో శస్త్రచికిత్స చేయించుకుని పూర్తి స్వస్థతతో స్వదేశానికి తిరిగి వెళుతున్నట్టు వెల్లడించారు.
కెన్యా కంటే మూడింతల తక్కువ ఖర్చుతో..
కెన్యాలో కంటే మూడింతల తక్కువ ఖర్చుతో (అదీ కూడా విమాన చార్జీలు, హోటల్ ఖర్చులన్నీ కలుపుకుని), యశోద ఆసుపత్రిలో చీఫ్‌సర్జన్ డా.దశరథ రామారెడ్డి ఆధ్వర్యంలో మంచి ట్రీట్‌మెంట్ పొందినట్టు తెలిపారు.
ప్రతి కాలి నొప్పికీ ఆపరేషన్ అవసరం లేదు..
తమను వీడియో కాల్ ద్వారా కెన్యా సెనెటర్ ఒబురో సంప్రదిస్తే, అన్ని పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ చేయించుకోవాలని సూచించామని యశోద చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ డా. దశరథరామారెడ్డి తెలిపారు. ప్రతి కాలి నొప్పికీ ఆపరేషన్లు అవసరం లేదన్నారు. సమస్య తీవ్రతను బట్టి అత్యవసరమైన వారికే ఆపరేషన్ నిర్వహించాల్సి ఉంటుందన్నారు.
మోకాలి మార్పిడి ఆపరేషన్ల నొప్పి తట్టుకోలేరని 2,3 వారాలు నడవలేరని, 3నెలలు ఫిజియోథెరపీ చేయాలంటూ చాలా అపోహలు ప్రచారంలో ఉన్నాయన్నారు. ఇలాంటి అపోహలను దూరంపెట్టి మోకాళ్ల సమస్యలపై దగ్గరలోని ఆర్థోపెడిక్ వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలన్నారు. ‘మోకీలు ఆపరేషన్ చేసిన 72 గంటల్లోనే డిశ్చార్జి చేసి రెండువారాల్లో రెండుసార్లు డ్రెస్సింగ్ చేస్తాం. తగిన జాగ్రత్తలతో నెలరోజుల్లో మామూలుగా నడిచే అవకాశాలున్నాయి’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment