సాక్షి,హైదరాబాద్: ‘104’మొబైల్ వైద్య సేవలకు ఉపయోగిస్తున్న వాహనాలను వేలం వేయాలని సర్కారు నిర్ణయించింది. వాటిని వేలం ద్వారా అమ్మేయాలని కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. వాటికి వేలం వేసేందుకు చైర్మన్‌గా కలెక్టర్, కన్వీనర్‌గా అదనపు కలెక్టర్, జిల్లా రవాణాధికారి, ఎస్పీ సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 198 వాహనాలు వేలం వేస్తారు. కాగా, వాటిల్లో అనేక వాహనాలను పాడైపోయాయని చెబుతున్నారు. కండీషన్‌లో ఉన్న వాటిని ఇతరత్రా వైద్య అవసరాలకు ఉపయోగించుకుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రోగులకు మందుల సరఫరాకు బ్రేక్
గ్రామాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు వారి ఊళ్లలోనే నెలనెలా వైద్య పరీక్షలు నిర్వహించి, నెలకు సరిపడా ఔషధాలను ఒకేసారి ఇచ్చే పథకమే..‘104’వాహన సేవలు. ప్రతి నెలా మొదటి తేదీ నుంచి 20వ తేదీ వరకూ నిర్దేశించిన గ్రామాలకు ఈ వాహనాలు వెళ్లేవి. సంచార వైద్య వాహనంలో ఒక వైద్యుడు, ఏఎన్‌ఎం, ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్, సహాయకుడు ఉంటారు.
ఈ పథకాన్ని నిలిపివేయాలని వైద్య ఆరోగ్యశాఖ తాజాగా నిర్ణయించడంతో ఆయా సేవలకు బ్రేక్ పడిపోనుంది. ఇందులో పనిచేస్తున్న సుమారు 1,250 మంది ఉద్యోగులను వైద్య ఆరోగ్య శాఖలోనే ఇతర పథకాల పరిధిలో వాడుకోవాలని నిర్ణయించినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఇప్పటికే జీవనశైలి వ్యాధుల నివారణ పథకం అమల్లో ఉండగా... దీని ద్వారా ఇంటింటికి ఔషధాలను సరఫరా చేస్తున్నారు. మరోవైపు త్వరలో పల్లె దవాఖానాలను ప్రారంభించనుండడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment