గర్భిణితో ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ ఆసుపత్రిలో అందుతున్న వైద్యసేవలను తెలుసుకుంటున్న హరీశ్‌రావు
దూద్‌బౌలి(హైదరాబాద్): దేశంలో ఎక్కడాలేని విధంగా పేదలకు ఉచిత వైద్యసేవలను అందించేందుకు ప్రభుత్వాసుపత్రులను సీఎం కేసీఆర్ అభివృద్ధి పరుస్తున్నారని హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు. శనివారం ఇక్కడి పేట్లబురుజు ప్రభుత్వ ఆధునిక ప్రసూతి ఆసుపత్రిలో మూడు టిఫా స్కానింగ్ మెషీన్లను హెల్త్ కమిషనర్ శ్వేత మహంతితో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవలను అందిస్తుండటంతో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే గర్భిణులు 35 శాతం నుంచి ప్రస్తుతం 66 శాతానికి పెరిగారని చెప్పారు. ఆన్‌లైన్‌లో సభనుద్దేశించి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మాట్లాడుతూ గర్భిణులకు నాణ్యమైన వైద్యసేవలను అందించడంలో భాగంగా రూ.10 కోట్లతో 44 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56 టిఫా స్కానింగ్ మెషీన్లను ప్రారంభించినట్లు చెప్పారు.
గతంలో పేట్లబురుజు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించినప్పుడు స్కానింగ్ మెషీన్ల సమస్య ఉందని తెలపడంతో ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా, రెండునెలల్లోనే పరిష్కరించారని పేర్కొన్నారు. ఇప్పటివరకు 12 లక్షల 66 వేల మందికి కేసీఆర్ కిట్లను అందజేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఆరు జీహెచ్‌ఎంసీ ఆసుపత్రులుండగా, ఇప్పుడు 26కు పెంచినట్లు హరీశ్ చెప్పారు. వైద్యసేవలను అందించడంలో దేశంలోనే మూడో స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచిందని, డబుల్ ఇంజన్ సర్కార్‌గా చెప్పుకుంటున్న ఉత్తర్‌ప్రదేశ్ చివరిస్థానంలో ఉందన్నారు. ఆన్‌లైన్‌లోనే మంత్రి హరీశ్‌రావు రాజ్యలక్ష్మి అనే గర్భిణితో మాట్లాడుతూ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు.
పని చేసే మంచి మంత్రి..
హరీశ్‌రావుతో ఆసుపత్రి సూపరింటెండెంట్ మాలతి ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావు ఆసుపత్రికి వస్తున్నారని తమ పనిమనిషికి చెప్పడంతో పనిచేసే మంచి మంత్రి హరీశ్‌రావు అని కితాబు ఇచ్చారని, అలాగే తనకు సంబంధించిన 20 గుంటల వ్యవసాయభూమి రిజిస్ట్రేషన్ కావడం లేదని మంత్రికి తెలపాలని కోరారని ఆయన దృష్టికి తెచ్చారు. ఈ విషయమై వెంటనే స్పందించిన మంత్రి సంబంధిత పత్రాలు, పనిమనిషి ఫోన్ నంబర్ హెల్త్ కమిషనర్‌కు ఇవ్వాలని, దానిని వెంటనే పరిష్కరిస్తానని హమీ ఇచ్చారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో వెంకటేశం, డీఎంఈ రమేశ్ రెడ్డి, శ్రీవాత్సవ్, ఆర్‌ఎంవో జైన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment