టైర్ రీట్రెడింగ్.. టైర్ల జీవిత కాలాన్ని పెంచే ప్రక్రియ. కొత్త టైరును కొనేబదులు మరికొంతకాలం పాతదాన్నే వినియోగించేలా దాని జీవిత కాలాన్ని పెంచే ప్రక్రియ. భారీ వాహనాలున్న వారికి ఇది సుపరిచితమే. ఇప్పుడు ఆర్టీసీ వర్క్‌షాపులో ప్రైవేటు వాహనాల టైర్లనూ రీట్రెడింగ్ చేసేలా కసరత్తు జరుగుతోంది.
తార్నాకలో 200 పడకల ఆర్టీసీ ఆసుపత్రి.. నిత్యం ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు అనారోగ్య సమస్యలపై ఇక్కడికి వస్తుంటారు. ఇన్‌పేషెంట్‌గా కొందరు, ఔట్ పేషెంట్‌గా మరికొందరు వైద్యం పొందుతుంటారు. పెద్ద ల్యాబ్, 24 గంటలూ సేవలందించే ఫార్మసీ ఇక్కడ ఉన్నాయి. త్వరలో సాధారణ వ్యక్తులూ ఇక్కడ వైద్య సేవలు, పరీక్షలు పొందే అవకాశం ఉంది.
సాక్షి, హైదరాబాద్: నష్టాల ఊబి నుంచి గట్టేందుకు ప్రత్యామ్నాయ ఆదాయం కోసం ఆర్టీసీ కొత్త దారులు వెదుకుతోంది. తనకున్న వనరులనే పెట్టుబడిగా పెట్టి ప్రైవేటు వ్యక్తులకు సేవలు అందించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులోభాగంగా ఉప్పల్‌లో ఉన్న వర్క్‌షాపు, తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిని వినియోగించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. దీనిపై మరింత కసరత్తు చేసిన తర్వాత అధికారికంగా వివరాలు వెల్లడికానున్నాయి. ఇప్పటికే పలుమార్లు తార్నాక ఆసుపత్రిని సందర్శించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. దాని స్థాయిని పెంచి సాధారణ వ్యక్తులకూ వైద్యాన్ని అందించడం ద్వారా ఫీజుల రూపంలో ఆదాయాన్ని పొందాలని నిర్ణయించారు.
వీలైతే మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న 200 పడకలను 300కు పెంచాలనీ యోచిస్తున్నారు. ముందుగా ల్యాబ్‌లో పరీక్షలతో శ్ర్రీకారం చుట్టాలని నిర్ణయించారు. దీనికోసం ఇప్పటికే ల్యాబ్‌ను కొంత విస్తరించారు. అలాగే ఫార్మసీలో కూడా బయటి వ్యక్తులకు 24 గంటలూ మందులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఆ తర్వాత దశలవారీగా వైద్యాన్ని కూడా అందిస్తారు. ఇందుకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు సమకూర్చుకుంటారు. ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు కన్సల్టెన్సీ సేవలను అందిస్తున్నారు.
వర్క్‌షాప్.. బస్‌బాడీ యూనిట్
ఆర్టీసీకి హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో భారీ వర్క్‌షాప్ ఉంది. ఇక్కడ బస్సులకు రంగులు వేయటం, ప్యాచ్ వర్క్‌తోపాటు కీలకమైన టైర్ రీట్రెడింగ్ నిర్వహిస్తున్నారు. మియాపూర్‌లో బస్‌బాడీలను రూపొందించే వర్క్‌షాప్ ఉంది. అక్కడి భూములకు మంచి డిమాండ్ ఉన్నందున దాన్ని వాణిజ్యపరంగా అభివృద్ధి చేసి బస్‌బాడీ యూనిట్‌ను ఉప్పల్ వర్క్‌షాపులోకి తరలించాలనే యోచన ఉంది.
దీంతో భారీ వాహనాలకు సంబంధించిన సమస్త సర్వీసులు ఇక్కడ అందే అవకాశం ఉంటుంది. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసుకుని దీన్ని పటిష్టపరిచి ప్రైవేటు వాహనాలకు సేవలు అందించడం ద్వారా భారీగా ఆదాయాన్ని పొందాలని భావిస్తోంది. ఇటీవలే ఆ వర్క్‌షాపును పరిశీలించిన సజ్జనార్ .. దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ఆర్థిక ఇబ్బందులు తాళలేక..
ప్రస్తుతం ఆర్టీసీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమత మవుతోంది. మూడు నాలుగు నెలలుగా టికెట్ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. అయినా సంస్థ ఖర్చులను మించిన ఆదాయం పెద్దగా ఉండటం లేదు. దీనికితోడు కరోనా ఉధృతి వల్ల 20 రోజులుగా టికెట్ ఆదాయం బాగా తగ్గుముఖం పట్టింది. ఈనేపథ్యంలో ప్రత్యామ్నాయ ఆదాయం సమకూర్చుకోవడం అనివార్యమైంది.
Comments
Please login to add a commentAdd a comment