విధులకు రాకున్నా టంచన్‌గా జీతం!
♦ ఆర్టీసీలో వెలుగుచూసిన బోగస్ వైద్య బిల్లుల బాగోతం
♦ సొంత పనుల్లో ఉండి.. చికిత్స చేయించుకున్నట్టు సర్టిఫికెట్లు
♦ భాగ్యనగరంలో వెలుగుచూసిన వ్యవహారం
♦ ఓ డిపో మేనేజర్ అనుమానంతో గుట్టురట్టు
♦ అన్ని డిపోల్లో దర్యాప్తునకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీలో అతనో ఉద్యోగి. ఇంటి దగ్గర వస్త్రవ్యాపారం చేస్తున్నాడు. నెల పాటు వ్యాపారం వద్ద ఉండాల్సి రావటంతో విధులకు డుమ్మా కొట్టేశాడు. అయినా నెల తిరిగేసరికి టంచన్‌గా జీతం వచ్చి చేతిలో పడింది.
ఓ డిపోలో అతను ఉద్యోగం చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా సైడ్ బిజినెస్ చేస్తున్నాడు. 20 రోజుల పాటు విధులకు దూరంగా ఉండి రియల్ ఎస్టేట్ పార్టీలతో తిరిగాడు. జీతం మాత్రం యథాప్రకారం పొందాడు.
విధులకు హాజరు కాకున్నా వీరికి జీతాలెలా వస్తున్నాయో తెలుసా? తీవ్ర అనారోగ్యానికి గురయ్యామని, తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్సపొందామని ఆస్పత్రి ‘జారీ చేసిన’ పత్రాలు దాఖలు చేశారు. దీంతో ఆర్టీసీ వారికి జీతం చెల్లించేసింది. ఇందులో ప్రత్యేకత ఏముందనుకుంటున్నారా..??? అసలు ఆ పత్రాలను తార్నాక ఆర్టీసీ ఆస్పత్రి జారీ చేయనేలేదు..!!!
ఆర్టీసీలో నకిలీ వైద్య బిల్లుల బాగోతానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ‘సొంత వ్యవహారాలు’ చక్కబెట్టుకునే క్రమంలో కొందరు సిబ్బంది విధులకు ఎగనామం పెట్టి, తార్నకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నట్టుగా నకిలీ బిల్లులు దాఖలు చేసి జీతం డబ్బులు స్వాహా చేశారు. ఆ మొత్తం రూ. కోట్లలో ఉన్నట్టు సమాచారం. ఓ డిపో మేనేజర్‌కు వచ్చిన అనుమానంతో కూపీలాగగా ఈ గుట్టురట్టయింది. దీంతో మరికొందరు డిపో మేనేజర్లు విచారణ జరపగా వారివారి డిపో పరిధిలో కూడా ఈ తంతు వెలుగు చూసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో దీనిపై విచారణకు ఆర్టీసీ యాజమాన్యం ఆదేశించింది. హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన ఈ బాగోతంలో ఇప్పటి వరకు 80 మంది సిబ్బంది పాలుపంచుకున్నట్టు తేలింది. విచారణ కొనసాగుతున్నందున ఈ సంఖ్య వందల్లో ఉండొచ్చని సమాచారం.
వెలుగు చూసిందిలా..
గత నెలకు సంబంధించి నగరంలోని మియాపూర్ డిపోలో మెడికల్ బిల్లులు దాఖలయ్యాయి. వాటి సంఖ్య ఎక్కువగా ఉండటంతో డిపో మేనేజర్‌కు అనుమానం వచ్చి.. వాటిని తార్నాకలోని ఆస్పత్రి పరిశీలనకు పంపారు. అసలు ఆ పేరుగల సిబ్బంది ఆస్పత్రికే రాలేదని, ఆ బిల్లులు తాము జారీ చేసినవి కావని అక్కడి అధికారులు తేల్చారు. దీంతో సిబ్బంది నకిలీ బిల్లులు జమ చేసినట్టు అనుమానించి తొలుత నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. మరికొన్ని బిల్లుల సంగతి తేల్చాల్చి ఉంది.
ఈ విషయం తెలిసి కూకట్‌పల్లి, మేడ్చల్, బీహెచ్‌ఈఎల్ డీఎంలు కూడా తమ డిపోల్లో దాఖలైన బిల్లులను ఆస్పత్రికి పంపారు. వాటిలో సగానికిపైగా బోగ స్ అని తేలింది. నెల రోజుల బిల్లుల్లో 80 నకిలీవి అని తేలాయి, మరికొన్ని వందల బిల్లుల పరిశీలన జరుగుతోంది. ఈ తంతు చాలాకాలంగా నడుస్తోందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా రూ. కోట్ల నిధులు ఇలా నకిలీ బిల్లులతో స్వాహా చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నందున గత ఏడాదికాలంలో దాఖలు చేసిన అన్ని బిల్లులను పరిశీలించాలనే ఆలోచనలో అధికారులున్నారు. దీన్ని విజిలెన్స్ విభాగం ద్వారా తనిఖీ చేయించనున్నట్టు సమాచారం.
బిల్లులు ఎవరిస్తున్నారు..
చికిత్స పొందిన ఉద్యోగులకు ఆర్టీసీ ఆస్పత్రి ముద్రతో బిల్లు జారీ అవుతుంది. ఆస్పత్రి జారీ చేసే బిల్లు అచ్చుగుద్దినట్టుగా నకిలీ పత్రాలు ఇప్పుడు వెలుగుచూశాయి. ఆర్టీసీలో పనిచేసే కొందరు ఉద్యోగులు దీని వెనక ఉన్నట్టు తెలుస్తోంది. వారు నకిలీ స్టాంపులు రూపొందించి సిబ్బందికి గుట్టుచప్పుడు కాకుండా బిల్లులు జారీ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్టు సమాచారం. వీరి వెనక ఆస్పత్రి సిబ్బంది హస్తం ఉందేమోనన్న కోణంలోనూ దర్యాప్తు చేయనున్నట్టు తెలిసింది.