తార్నాక ఆసుపత్రిలో బయట నుంచి తెచ్చిన భోజనాన్ని తింటున్న దృశ్యం
సాక్షి, హైదరాబాద్: ఐసీయూ, ఆక్సిజన్ ప్లాంటు, నిరంతరం నడిచే ల్యాబ్ తదితర సౌకర్యాలతో ఇటీవలే మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి స్థాయికి ఎదిగిన తార్నాకలోని 200 పడకల ఆర్టీసీ ఆసుపత్రిలో ఒక సమస్య మాత్రం రోగులు, వారి సహాయకులను వేధిస్తోంది. ఇన్‌పేషెంట్లు, వారి కుటుంబ సభ్యులకు ఆసుపత్రిలో భోజన సదుపాయం లేక హోటళ్ల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
సాధారణంగా ఏ ఆసుపత్రిలోనైనా వైద్యుల సూచనల ప్రకారం రోగులకు ఆసుపత్రుల్లోనే భోజనం తయారు చేసి అందించాల్సి ఉంటుంది. సొంత కిచెన్ వసతి లేని చోట, కాంట్రాక్టు పద్ధతిలో భోజనం తయారు చేయించి అందిస్తారు. తినకూడని పదార్థాలు తింటే వారి అనా రోగ్యం పెరిగే ప్రమాదం కూడా ఉంటుందనే ఉద్దేశంతో రోగులకు వైద్యుల సూచన మేరకే భోజనం అందుతుంది.
కానీ ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉండటం, ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో తార్నాక ఆసుపత్రిపై సరైన పర్యవేక్షణ లేదు. దీంతో నిధుల్లేక రోగులకు భోజనాన్ని అందించలేమని ఆసుపత్రి చేతులెత్తేసింది. నిత్యం 200 పడకల్లోనూ రోగులు ఉన్నా వారి భోజన ఖర్చు ఏడాదికి రూ. కోటిన్నర మించదు. కానీ ఈ మాత్రం సొమ్ము కూడా ఆర్టీసీ వద్ద లేకపోవడం అందరినీ విస్మయ పరుస్తోంది. ఈ ఆసుపత్రిలో రోగులకు ప్రస్తుతం ఒక గ్లాసు పాలు, ఒక బ్రెడ్, ఒక అరటి పండు అందిస్తున్నారు.
హరేరామ హరేకృష్ణ సెంటర్ తెరవాలి...
రోగులకు మందులతోపాటు సరైన డైట్ అవసరమని... అందుకు వీలుగా ఆసుపత్రిలో హరేరామ హరేకృష్ణ సెంటర్ అందించే రూ. 5 భోజన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు సూచించారు. మరోవైపు రోగులకు డైట్‌ను ఆసుపత్రిలోనే తయారు చేసి అందించాలని.. ఈ విషయంలో ఎండీ సజ్జనార్ మానవతాదృక్ఫథంతో వ్యవహరించాలని నేషనల్ మజ్దూర్ యూనియన్‌కు చెందిన కమాల్‌రెడ్డి, నరేందర్ కోరారు.
రోగులకు హోటళ్ల భోజనం అందించడం ప్రమాదకరమని డాక్టర్ సునీల్ పేర్కొన్నారు. రోగుల సహాయకులు ఇంటి నుంచి భోజనం తెచ్చినా ఉప్పు, కారం, మసాలాలు, శరీరానికి పడని పదార్థాలు రోగికి చేటు చేస్తాయన్నారు. అందువల్ల వైద్యుల సూచన ప్రకారమే రోగులకు భోజనం అందాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment