డయాలసిస్ విభాగాన్ని పరిశీలిస్తున్న సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కుటుంబాల చికిత్స కోసం ఉన్న తార్నాకలోని ఆసుపత్రిలో ఎట్టకేలకు ఐసీయూ సిద్ధమైంది. ఈ ఆసుపత్రిని నిర్మించి మూడు దశాబ్దాలు అవుతుండగా ఇన్నేళ్ల తర్వాత అతిముఖ్యమైన విభాగం అందుబాటులోకి వచ్చింది. ఇక మరో కీలక డయాలసిస్ విభాగం కూడా ఏర్పాటైంది. దీంతో ఇటు డయాలసిస్ చేసుకోవాల్సిన ఆర్టీసీ సిబ్బంది, అత్యవసర చికిత్సలకు వచ్చేవారికి ఇక్కడే సేవలు అందనున్నాయి.
ఇంతకాలం రిఫరల్ పేరుతో వారిని ఇతర ప్రైవేటు ఆసుపత్రులకు పంపేవారు. ఆ రెఫరల్ బిల్లులు ఏడాదికి రూ.35 కోట్ల వరకు అవుతుండటంతో ఆర్టీసీకి అది గుదిబండగా మారింది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నెల రోజుల్లోనే ఆసుపత్రిని సమూలంగా మార్చే చర్యలు ప్రారంభించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద దాతల సాయంతో ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని సజ్జనార్ నిర్ణయించి ఏర్పాట్లు ప్రారంభించారు.
ఇందుకు ఓ ప్రైవేటు ఆసుపత్రిని కన్సల్టెన్సీ సేవలకు వినియోగించుకున్నారు. అలా కొందరు ప్రైవేటు వ్యక్తులు ముందుకు రావడంతో దాదాపు రూ. 2 కోట్ల వ్యయంతో ఐసీయూను సిద్ధం చేయించారు. దానికి కావాల్సిన వెంటిలేటర్లు, ఆక్సిజన్ వసతి, బెడ్లు, ఇతర యంత్ర పరికరాలను సమకూరుస్తున్నారు. పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నెల 27న ఈ సేవలు ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
డయాలసిస్‌లు ఇక్కడే..
డయాలసిస్ చేయించుకోవాల్సిన ఆర్టీసీ ఉద్యోగులకు ఇప్పటివరకు ప్రైవేటు ఆసుపత్రులే దిక్కుగా ఉండేవి. డయాలసిస్ కోసం ప్రతిసారీ దాదాపు రూ. 2,500 ఖర్చయ్యేది. ఆర్టీసీ ఆసుపత్రి ద్వారా రెఫర్ చేయించుకుని రోగులు వెళ్తుండగా సకాలంలో బిల్లులు రానందున కొన్ని ఆసుపత్రుల్లో ఆ సేవలను నిలిపివేశారు. దీంతో కొందరు రోగులు సొంతంగా ప్రైవేటులో ఆ సేవలు పొందుతున్నారు.
ఇప్పుడు ఆర్టీసీ ఆసుపత్రిలో తొలుత నాలుగు డయాలసిస్ యంత్రాలతో డయాలసిస్ సెంటర్ సిద్ధం కావడంతో ఇప్పుడు కేవలం ఉద్యోగులే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా ఇక్కడే డయాలసిస్ చేసే విధానాన్ని ప్రారంభిస్తున్నారు. దసరా ముందురోజు డయాలసిస్ యంత్రాలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్, అధికారుల సమక్షంలో పూజలు నిర్వహించారు. ఈ నెల 27 నుంచి సేవలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక నిరంతరం మందులు..
ఆర్టీసీ రెగ్యులర్ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు వైద్య సేవలతోపాటు అవసరమైన మందులు పొందేందుకు వెసులుబాటు ఉంది. కానీ నిధుల సమస్యతో కొన్ని మందులకు కొరత నెలకొంటోంది. ఇప్పుడు ఆ సమస్య లేకుండా ప్రభుత్వ మందుల సరఫరా విభాగంతో అధికారులు చర్చించి సమస్య పరిష్కరించారు. 24 గంటలూ మందులు పొందేలా మార్పుచేర్పులు చేశారు. ఇంతకాలం ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే ఫార్మసీ అందుబాటులో ఉండేది. కాగా, 2డీ ఎకో లాంటి పరీక్షలను కూడా ఆసుపత్రిలోనే నిర్వహించేలా కావాల్సిన పరికరాలు సమకూరుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment