ICU services
-
త్వరలో 900కు పైగా ఐసీయూ పడకలు
గచ్చిబౌలి: రాష్ట్రంలో 900కు పైగా ఐసీయూ పడకలు త్వరలో అందుబాటులోకి వస్తాయని, ఇందుకోసం రూ.154 కోట్లు ఖర్చు చేయనున్నామని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో 27 వేల పడకలు సిద్ధంగా ఉన్నాయన్నారు. కరోనా సమయంలో హైదరాబాద్‌లో 1,300 పడకలను వివిధ సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సర్కారు ఆస్పత్రుల్లో ఏర్పాటు చేశాయని గుర్తు చేశారు. పిల్లల కోసం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 6 వేల పడకలతో పీడియాట్రిక్ విభాగాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రహేజా మైండ్ స్పేస్ ఆధ్వర్యంలో కొండాపూర్‌లోని జిల్లా ఆస్పత్రిలో 120 బెడ్లతో ఏర్పాటు చేసిన కొత్త ఫ్లోర్‌ను విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో కలిసి మంత్రి హరీశ్‌రావు బుధవారం ప్రారంభించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. కొండాపూర్ ఆస్పత్రిలో డయాలిసిస్ యూనిట్ కేసీఆర్ కిట్ల పంపిణీని ప్రారంభించాక ప్రభుత్వాస్పత్రుల్లో డెలివరీల శాతం గణనీయంగా పెరిగిందని, ప్రస్తుతం 52 శాతం డెలివరీలు సర్కారు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా డయాలిసిస్ యూనిట్లు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. కొండాపూర్ జిల్లా ఆస్పత్రిలోనూ త్వరలో డయాలిసిస్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆస్పత్రిలో బెడ్ల ఏర్పాటుకు సహకరించిన మైండ్ స్పేస్ సీఈవోను అభినందించారు. ఆస్పత్రి మెయింటెనెన్స్‌ను కూడా మైండ్ స్పేస్ తీసుకోవాలని కోరారు. కరోనా సమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల డిమాండ్ ఉన్నప్పుడు రహేజా ముందుకొచ్చిందని గుర్తు చేశారు. 100% వ్యాక్సినేషన్‌కు సహకరించాలి రాష్ట్రంలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తికావాలంటే అందరూ భాగస్వాములు కావాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా నగరంలో కార్పొరేటర్లు తమ పరిధిలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ అందేలా చూడాలన్నారు. రెండు, మూడు సార్లు ఇళ్లకు వెళ్లి ఆరా తీయాలని సూచించారు. రాష్ట్రంలో రోజూ సుమారు 3.5 లక్షల నుంచి 4 లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణీదేవి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఆసుపత్రిలో ఐసీయూ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కుటుంబాల చికిత్స కోసం ఉన్న తార్నాకలోని ఆసుపత్రిలో ఎట్టకేలకు ఐసీయూ సిద్ధమైంది. ఈ ఆసుపత్రిని నిర్మించి మూడు దశాబ్దాలు అవుతుండగా ఇన్నేళ్ల తర్వాత అతిముఖ్యమైన విభాగం అందుబాటులోకి వచ్చింది. ఇక మరో కీలక డయాలసిస్ విభాగం కూడా ఏర్పాటైంది. దీంతో ఇటు డయాలసిస్ చేసుకోవాల్సిన ఆర్టీసీ సిబ్బంది, అత్యవసర చికిత్సలకు వచ్చేవారికి ఇక్కడే సేవలు అందనున్నాయి. ఇంతకాలం రిఫరల్ పేరుతో వారిని ఇతర ప్రైవేటు ఆసుపత్రులకు పంపేవారు. ఆ రెఫరల్ బిల్లులు ఏడాదికి రూ.35 కోట్ల వరకు అవుతుండటంతో ఆర్టీసీకి అది గుదిబండగా మారింది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నెల రోజుల్లోనే ఆసుపత్రిని సమూలంగా మార్చే చర్యలు ప్రారంభించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద దాతల సాయంతో ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని సజ్జనార్ నిర్ణయించి ఏర్పాట్లు ప్రారంభించారు. ఇందుకు ఓ ప్రైవేటు ఆసుపత్రిని కన్సల్టెన్సీ సేవలకు వినియోగించుకున్నారు. అలా కొందరు ప్రైవేటు వ్యక్తులు ముందుకు రావడంతో దాదాపు రూ. 2 కోట్ల వ్యయంతో ఐసీయూను సిద్ధం చేయించారు. దానికి కావాల్సిన వెంటిలేటర్లు, ఆక్సిజన్ వసతి, బెడ్లు, ఇతర యంత్ర పరికరాలను సమకూరుస్తున్నారు. పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నెల 27న ఈ సేవలు ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. డయాలసిస్‌లు ఇక్కడే.. డయాలసిస్ చేయించుకోవాల్సిన ఆర్టీసీ ఉద్యోగులకు ఇప్పటివరకు ప్రైవేటు ఆసుపత్రులే దిక్కుగా ఉండేవి. డయాలసిస్ కోసం ప్రతిసారీ దాదాపు రూ. 2,500 ఖర్చయ్యేది. ఆర్టీసీ ఆసుపత్రి ద్వారా రెఫర్ చేయించుకుని రోగులు వెళ్తుండగా సకాలంలో బిల్లులు రానందున కొన్ని ఆసుపత్రుల్లో ఆ సేవలను నిలిపివేశారు. దీంతో కొందరు రోగులు సొంతంగా ప్రైవేటులో ఆ సేవలు పొందుతున్నారు. ఇప్పుడు ఆర్టీసీ ఆసుపత్రిలో తొలుత నాలుగు డయాలసిస్ యంత్రాలతో డయాలసిస్ సెంటర్ సిద్ధం కావడంతో ఇప్పుడు కేవలం ఉద్యోగులే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా ఇక్కడే డయాలసిస్ చేసే విధానాన్ని ప్రారంభిస్తున్నారు. దసరా ముందురోజు డయాలసిస్ యంత్రాలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్, అధికారుల సమక్షంలో పూజలు నిర్వహించారు. ఈ నెల 27 నుంచి సేవలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక నిరంతరం మందులు.. ఆర్టీసీ రెగ్యులర్ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు వైద్య సేవలతోపాటు అవసరమైన మందులు పొందేందుకు వెసులుబాటు ఉంది. కానీ నిధుల సమస్యతో కొన్ని మందులకు కొరత నెలకొంటోంది. ఇప్పుడు ఆ సమస్య లేకుండా ప్రభుత్వ మందుల సరఫరా విభాగంతో అధికారులు చర్చించి సమస్య పరిష్కరించారు. 24 గంటలూ మందులు పొందేలా మార్పుచేర్పులు చేశారు. ఇంతకాలం ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే ఫార్మసీ అందుబాటులో ఉండేది. కాగా, 2డీ ఎకో లాంటి పరీక్షలను కూడా ఆసుపత్రిలోనే నిర్వహించేలా కావాల్సిన పరికరాలు సమకూరుస్తున్నారు. -
కోవిడ్ చికిత్స... ఖర్చు చూస్తే గుడ్లు తేలేయాల్సిందే!
యాంటీ జెన్, ఆర్టీ పీసీఆర్, ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు.. ఇంకా మరెన్నో నిన్నా మొన్నటి దాకా చెవుల్లో మార్మోగిపోయిన పేర్లు. ఇప్పుడు కోవిడ్ కొంత శాంతించినా.. దాని బారిన పడ్డవారు తమ ప్రాణాలు నిలుపుకోవడానికి చేసిన ప్రయత్నంలో ఆర్థికంగా కుదేలైపోయారు. సాక్షి, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి దెబ్బకు దేశ ప్రజల ఆర్థిక పరిస్థితి తారుమారు అయ్యింది. కోవిడ్ చికిత్స కోసం భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. దీంతో అనేక కుటుంబాలు ఏడాదిలో సంపాదించే సొమ్ములో సగానికి పైగా ఆస్పత్రి ఖర్చులకే సరిపోయాయి. కోవిడ్ చికిత్స కోసం దేశ ప్రజలు పెట్టిన ఖర్చు వివరాలపై ఇటీవల చేపట్టిన సర్వేలో అనేక విషయాలు వెల్లడయ్యాయి. రూ. 64,000 కోట్లు కరోనా టెస్టింగ్, ట్రీట్మెంట్కు ప్రజలు చేసిన ఖర్చుపై పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఇండియాతో పాటు అమెరికాకు చెందిన డ్యూక్ గ్లోబల్ హెల్త్ ఇన్సిస్టిట్యూట్ సంస్థలు సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. ఈ సర్వే వివరాల ప్రకారం... కోవిడ్ పరీక్షలు, చికిత్సల కోసం దేశ ప్రజలు ఏకంగా రూ. 64,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తేలింది. దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం వేసిన అంచనా వ్యయం రూ.35,000 కోట్ల కంటే దాదాపు రెట్టింపు ఖర్చు చికిత్సకు అయ్యింది. ఇంకా ఎక్కువే కరోనా చికిత్సకు వివిధ రాష్ట్రాలు విధించిన పరిమితులను పరిగణలోకి తీసుకుని తాము ఈ నివేదిక సిద్ధం చేసినట్టు ఈ సర్వేలో కీలకంగా వ్యవహరించిన శక్తివేల్ సెల్వరాజ్ పేర్కొన్నారు. అంతేకాదు తాము కేవలం ఆస్పత్రి ఖర్చులనే పరిగణలోకి తీసుకున్నామని, ఆస్పత్రికి రానుపోను రవాణా, మరణాలు సంభవిస్తే అంత్యక్రియులు తదితర ఖర్చులు లెక్కించ లేదని తెలిపారు. వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటే మొత్తం వ్యయం మరింతగా పెరుగుతుందన్నారు. ఐసీయూలో చికిత్సకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో కరోనా చికిత్స పొందిన వారి కుటుంబాల బడ్జెట్ అయితే చిన్నాభిన్నమైంది. ఒక ఏడాది మొత్తం సంపాదనలో వివిధ కేటగిరిల వారీగా కరోనా చికిత్సకు అయిన ఖర్చు వివరాలు ఇలా ఉన్నాయి. - క్యాజువల్స్ వర్కర్స్‌లో తమ వార్షిక ఆదాయంలో 86 శాతాన్ని కరోనా చికిత్సకే వెచ్చించారు. - శాలరీడ్ ఎంప్లాయిస్‌లో తమ ఆదాయంలో 50 శాతాన్ని ఐసీయూ చికిత్స కోసం ఖర్చు చేశారు. - సెల్ఫ్ ఎంప్లాయిడ్ వ్యక్తుల సంవత్సర ఆదాయంలో 66 శాతం కోవిడ్ చికిత్స ఖర్చులకే సరిపోయింది హోం ఐసోలేషన్‌లో ఉన్నా.. కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఆస్పత్రికి పోకుండా హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందినా ఆర్థిక సమస్యలు తప్పలేదు. హోం ఐసోలేషన్‌లో ఉన్నప్పటికీ క్యాజువల్ వర్కర్స్ తమ ఆదాయంలో 43 శాతం నష్టపోగా స్వయం ఉపాధి పొందే వారు తమ ఆదాయంలో నాలుగో వంతు కోల్పోయారని సర్వేలో తేలింది. శాలరీ ఎంప్లాయిస్ విషయంలో ఇది 15 శాతంగా నమోదు అయ్యింది. పరీక్షలు కూడా భారమే దేశవ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో RT-PCR పరీక్షలకు సగటున రూ. 2200 వసూలు చేశారు. సాధారణంగా ఓ క్యాజువల్ లేబర్ వారం సంపాదన కూడా ఇంతే ఉంటుంది. ఒక్కరికిలో ఈ కరోనా లక్షణాలు కనిపించినా.. ఆ ఫ్యామిలీ మొత్తానికి పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పరీక్షలకు కూడా ప్రజలు భారీగానే ఖర్చు పెట్టారని సర్వే పేర్కొంది. -
మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఈ యువకుడు
బ్యాంకాక్: మనిషి జీవితంలో ఆస్తులు సంపాదించడం ఎంత కష్టమో.. ఒక్కసారి అనారోగ్యం పాలైతే అన్నేళ్లు సంపాదించుకున్న ఆస్తులన్ని హరించుకుపోవడమే కాక.. కొత్తగా అప్పుల పాలవ్వడం కూడా అంతే సహజం. ఏం చేస్తాం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు ఉండరు.. సదుపాయాలుండవు.. చేతిలో రూపాయి లేకపోతే ప్రైవేట్ ఆస్పత్రులు దరిదాపులకు కూడా రానివ్వవు. మనుషులమయ్యిండు సాటివారి పట్ల ఏమాత్రం మానవత్వం చూపించని రోజలు ఇవి. అలాంటిది ఇక మూగజీవులను పట్టించుకుంటామా.. అయితే అందరు ఇలానే ఉంటారా అంటే కాదు.. అక్కడక్కడ మానవత్వం మెండుగా ఉన్న వారు.. తోటి వారి గురించి ఆలోచించే వారు ఉంటారు. ఈ కోవకు చెందిన వాడే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి. ఇతగాడు గాయపడిన బొద్దింక ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అతడి మంచి మనసు చూసి కదిలిపోయిన డాక్టర్ ఆ బొద్దింకను ఐసీయూలో పెట్టి చికిత్స అందిస్తున్నారు. గాయాలతో చావుబతుకులతో పోరాడుతున్న దాన్ని బతికించేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నారు. అయితే, అది మనుషుల హాస్పిటల్ కాదులెండి.. పశువుల ఆస్పత్రి. ఆ వివరాలు.. థాయ్‌లాండ్‌లోని క్రతుమ్ బ్యాన్ ప్రాంతానికి చెందిన దను లింపపట్టనవానిచ్ అనే యువకుడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా.. అతడికి ఓ బొద్దింక కనిపించింది. ఎవరో దాన్ని పొరపాటున తొక్కేశారు. తీవ్రంగా గాయపడిన ఆ బొద్దింక అక్కడి నుంచి కదల్లేక విలవిల్లాడుతోంది. దాని పరిస్థితి చూసి దను మనసు కరిగిపోయింది. దాన్ని ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఆ బొద్దింకను తన అరచేతిలో పెట్టుకుని సాయి రాక్ యానిమల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. అదేంటీ ఇతడు బొద్దింకను తీసుకొచ్చారని.. అక్కడ ఎవరూ ఎగతాళి చేయలేదు. ఆ హాస్పిటల్‌లోని డాక్టర్ లింపపట్టనవానిచ్ కూడా ఆ బొద్దింకను ఎమర్జెన్సీ పేషెంట్‌గానే భావించాడు. దానికి ఉచితంగా వైద్యం చేస్తానని దనుకు మాటిచ్చాడు. ఈ అరుదైన ఘటన గురించి ఆ డాక్టరే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఆ బొద్దింక బతికేందుకు 50-50 చాన్సులు మాత్రమే ఉన్నాయని డాక్టర్ తెలిపాడు. ‘‘ఇది జోక్ కాదు. ఇది ప్రతి జీవి పట్ల కరుణ, జాలిని సూచిస్తుంది. ప్రతి జీవి ప్రాణం విలువైనదే. ప్రపంచంలో ఇలాంటి వ్యక్తులు మరింత మంది ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ప్రపంచానికి దయ కలిగిన మనుషులు ఎంతో ముఖ్యం’’ అని పేర్కొన్నాడు. ‘‘ఇప్పటివరకు బొద్దింకను రక్షించమని ఎవరూ రాలేదు. ఇలా జరగడం నా సర్వీసులో ఇదే మొదటి సారి. ముఖ్యంగా.. ఇలాంటి చిన్న జీవికి ఎప్పుడూ ట్రీట్మెంట్ ఇవ్వలేదు. దాన్ని బతికించడం నాకు ఛాలెంజ్ అనిపించింది. ఎందుకంటే.. అంత చిన్న జీవికి ఆక్సిజన్ అందించడం అంత సులభం కాదు. అందుకే దాన్ని ఆక్సిజన్ కంటైనర్‌లో పెట్టాం. దానివల్ల కనీసం అది ఊపిరి పీల్చుకుని బతికే అవకాశాలు ఉంటాయని భావించాం. ఆ బొద్దింక ప్రాణాలతో బయటపడిన తర్వాత.. నువ్వే బాగోగులు చూసుకోవాలని అతడికి చెప్పాను. ఇందుకు అతడు అంగీకరించాడు’’ అని డాక్టర్ తెలిపాడు. అయితే, ఆ బొద్దింక బతికిందా.. లేదా చనిపోయిందా అనేది మాత్రం ఆయన తెలపలేదు. ఈ సంఘటన పట్ల నెటిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంత చిన్న జీవి పట్ల ఎంతో గొప్ప ఉదారత చూపావు.. నీ మంచి మనసుకు హ్యాట్సాఫ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: బొద్దింక దెబ్బకు హడలెత్తిన కొత్త జంట -
జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో.. ‘పది పడకల ఐసీయూ’లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పనకు సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. పలు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘పది పడకల ఐసీయూ’ కార్యక్రమాన్ని శనివారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. వర్చువల్ విధానంలో నారాయణపేట ఆస్పత్రి వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. గడిచిన ఏడేండ్లలో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలతోపాటు 1,600 ఐసీయూ పడకలను ఏర్పాటు చేసిందని ఆయన చెప్పారు. మరో ఏడు ప్రభుత్వ కాలేజీల ఏర్పాటుకు సన్నాహలు జరుగుతున్నాయని వివరించారు. పది పడకల ఐసీయూ కార్యక్రమం గ్రామీణ ప్రాం తాల్లో కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు దోహదం చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం 600 ఐసీయూ పడకలతో గాంధీ ఆస్పత్రి దేశంలోనే అతిపెద్ద ఆస్పత్రిగా పేరుపొందిందని వివరించారు. కొత్తగా చేపట్టిన ‘పది పడకల ఐసీయూ’కార్యక్రమం రాష్ట్రంలోని 33 జిల్లా, ఏరియా ఆస్పత్రులకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించాలని కేటీఆర్ ఆకాంక్షించారు. కరోనా మూడో వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఏర్పాట్లపై దృష్టి సారించిందని పేర్కొన్నారు. దేశంలో వంద జిల్లా ఆస్పత్రులకు విస్తరిస్తాం తెలంగాణలో పది పడకల ఐసీయూ కార్యక్రమానికి చేయూత అందిస్తున్నామని.. దేశంలో వంద జిల్లా ఆస్పత్రులకు దీనిని విస్తరించే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఖోస్లా వెంచర్స్ సంస్థ వ్యవస్థాపకుడు వినోద్ ఖోస్లా తెలిపారు. గ్రామీణ ప్రాంత ఆస్పత్రుల్లో వసతుల కోసం సామాజిక, సాంకేతిక వేదికలు ముందుకు రావాలని కోరారు. -
2 గంటల్లో మినీ ఆస్పత్రి
సాక్షి, హైదరాబాద్ : అసలే ఇది కరోనా కాలం.. చాలా ఆస్ప త్రుల్లో ఐసీయూ పడకల కొరత! కొత్త ఆస్పత్రుల నిర్మాణానికి, ఐసీయూ పడకల ఏర్పాటుకు చాలా సమయం పడుతుంది. ఈ చిక్కు సమస్యకు తెలివైన పరిష్కారాన్ని ఆవిష్కరించింది ఐఐటీ మద్రాస్ లోని స్టార్టప్ కంపెనీ మోడ్యులస్ హౌసింగ్. కొన్ని గంటల్లోనే మినీ ఆసుపత్రిని ఏర్పాటు చేసుకునే కొత్త టెక్నాలజీని ఆవిష్కరించింది. మెడిక్యాబ్ అని పిలుస్తున్న ఈ కొత్త టెక్నాలజీ సాయంతో పది హేను పడకలతోపాటు ఒక ఐసీయూ, వైద్యుడి కోసం ప్రత్యేక గదిని నలుగురు వ్యక్తులు కలిసి రెండు గంటల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. కరోనా రోగులను గుర్తించడం మొదలు, ఐసోలేషన్‌లో ఉంచే వరకు అన్ని ప్రక్రియలను ఒక్కచోటే నిర్వ హించవచ్చన్నమాట. దేశవ్యాప్తంగా మినీ ఆస్ప త్రుల ఏర్పాటుకు ఇది మేలైన మార్గమని అంటు న్నారు. మెడిక్యాబ్‌లో వైద్యుడి గది, ఐసోలేషన్ గది, చికిత్స అందించే వార్డు, రెండు పడకలున్న ఐసీయూలతో అచ్చం పెద్దాస్పత్రుల్లో మాదిరిగానే రుణాత్మక పీడనం ఉంటుంది. కేరళలో నమూనా మెడిక్యాబ్! కేరళలోని వైనాడ్ జిల్లాలో మెడిక్యాబ్ మినీ ఆసుపత్రి ఏర్పాటుకు శ్రీ చిత్ర తిరుణాళ్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ సాయం అందించింది. 2018లో ఇద్దరు ఐఐటీ పట్టభద్రులు మోడ్యులస్ హౌసింగ్ కంపెనీని స్థాపించారు. ముందుగానే నిర్మించిన గోడలు, కిటికీల్లాంటి భాగాలతో గృహ నిర్మాణాన్ని చౌకగా మార్చడం అప్పట్లో ఈ కంపెనీ ఉద్దేశం. కానీ దీన్ని తాము కరోనా పరిస్థితులకు అనుగుణంగా మార్చి మెడిక్యాబ్‌ను సిద్ధం చేశామని కంపెనీ సీఈవో శ్రీరామ్ రవిచంద్రన్ తెలిపారు. కేరళలో ఏర్పాటైన నమూనా మినీ ఆసుపత్రి మెడిక్యాబ్ ప్రాముఖ్యత, అవసరాన్ని ప్రపంచానికి చాటేందుకు ఉపయోగపడుతుందన్నారు. ‘గంటల్లో ఏర్పాటు చేసుకోగల ఈ ఆసుపత్రిని ఐదు రెట్లు తక్కువ సైజుకు మడిచేసి ఎక్కడికైనా రవాణా చేసుకోవచ్చు. ఒక లారీలో దాదాపు ఆరు మెడిక్యాబ్‌ల సామగ్రిని మోసుకెళ్లవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోనూ అత్యాధునిక వైద్యసేవలు అందించేందుకు మెడిక్యాబ్‌లు ఉపయోగపడతాయి. మినీ ఆసుపత్రులతోపాటు ఐసొలేషన్ వార్డులను కూడా మేం సిద్ధం చేశాం. చెన్నైలోని చెంగల్‌పేట్‌లో ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేశాం. దేశంలో ప్రతి వెయ్యిమందికి ఒకటి కంటే తక్కువ ఆసుపత్రి పడక అందుబాటులో ఉంది. మెడిక్యాబ్ వంటి సృజనాత్మక ఆలోచనలతోనే ఈ కొరతను అధిగమించడం సాధ్యమని అంచనా’ అని ఆయన వివరించారు. కరోనాపై పోరుకు ఐఐటీ మద్రాస్ తనదైన తోడ్పాటు అందిస్తోందని, ఎన్95 మాస్కుల తయారీ మొదలుకొని, చౌకైన వెంటిలేటర్ల తయారీ వరకు అనేక ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చిందని ఐఐటీ మద్రాస్ ఇన్క్యుబేషన్ సెల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ తమస్వతి ఘోష్ తెలిపారు. -
కరోనాపై పోరుకు కొత్త అస్త్రం!
సాక్షి, హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ కట్టడికి హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న రీవాక్స్ ఫార్మా ఓ వినూత్నమైన పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆస్పత్రుల్లోని ఐసీయూ వార్డుల్లో ఉండే పడకలను కరోనా వైరస్ రహితంగా మార్చేందుకు ఓ రోబోటిక్ శుద్ధి యంత్రాన్ని సిద్ధం చేసింది. 5 నిమిషాల్లోనే ఓ పడకను తనంతట తానే అన్ని వైపుల నుంచి శుద్ధి చేయడం ఈ యంత్రం విశేషం. యూవీ–బీఆర్ అని పిలుస్తున్న ఈ యంత్రంలో బ్యాక్టీరియా/వైరస్‌లోని డీఎన్ఏను నాశనం చేయగల స్థాయిలో అతినీలలోహిత కిరణాలను ప్రసారం చేస్తుంది. ఐసీయూ పడకలను శుద్ధి చేసేందుకు ప్రస్తుతం రసాయనాలను వాడుతున్నారని యూవీ–బీఆర్ మాత్రం వాటితో పనిలేకుండా కరోనా వైరస్ మాత్రమే కాకుండా దాదాపు 11 రకాల వైరస్‌లను, 14 రకాల బ్యాక్టీరియాను 99.99 శాతం చంపేయగలవని రీవాక్స్ ఫార్మా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ జి.ప్రణయ్‌రెడ్డి తెలిపారు. అతినీలలోహిత కిరణాలతో వైరస్‌లను నాశనం చేసే పరికరాలు కొన్ని ఇప్పటికే మార్కెట్లో ఉన్నా.. యూవీ–బీఆర్ వాటికంటే శక్తిమంతమైందని, 254 నానోమీటర్ల తరంగ దైర్ఘ్యపు కిరణాలను విడుదల చేస్తుందని వివరించారు. యూవీ–ఎస్టీ పేరుతో ఇంకో యంత్రాన్ని కూడా తయారు చేశామని, దీన్ని ఫార్మా కంపెనీలు, ఆహార పరిశ్రమల్లో వాడొచ్చని కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఏడిద జగన్ తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆస్పత్రుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా చూసేందుకు యూవీ–బీఆర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఈ యంత్రంపై తాము ప్రత్యేక పేటెంట్ కూడా సంపాదించామని చెప్పారు. విజయవంతంగా పూర్తయిన పరీక్షలు.. యూవీ–బీఆర్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టే ముందు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో జరిపిన పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయని, మెడికవర్, విరించి ఆస్పత్రులు కూడా ఈ యంత్రాలను కొనుగోలు చేశాయని ప్రణయ్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ ఆస్పత్రులతో సంప్రదింపులు జరుగుతున్నాయని అన్నారు. యంత్రం ఖరీదు వివరాలు త్వరలోనే చెబుతామని, వీలైనంత తక్కువ ధరలోనే అందరికీ ఈ యంత్రాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. -
‘కరోనా’ ప్యాకేజీ 15 వేల కోట్లు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థను పూర్తిస్థాయిలో బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ‘భారత్ కోవిడ్–19 అత్యవసర ప్రతిస్పందన, ఆరోగ్య వ్యవస్థ సన్నద్ధత’ ప్యాకేజీకి గురువారం ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు దశల వారీగా మొత్తం రూ.15,000 కోట్లు అందజేయనుంది. వచ్చే నాలుగేళ్లలో మూడు దశల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లకు లేఖ రాసింది. మొదటి దశ కింద రూ.7,774 కోట్లు 2020 జనవరి నుంచి జూన్ వరకు మొదటి దశ, 2021 జూలై నుంచి మార్చి వరకు రెండో దశ, 2021 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు మూడో దశ అమలవుతుంది. మొదటి దశ అమలు కోసం కేంద్రం అతి త్వరలో అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.7,774 కోట్లు విడుదల చేయనుంది. తొలి దశ కింద ఇచ్చే నిధులను కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ఖర్చు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ప్రత్యేక ఆసుపత్రులు, ఐసోలేషన్ యూనిట్లు ఏర్పాటు చేయాలి. వెంటిలేటర్లతో కూడిన ఐసీయూలు నెలకొల్పాలి. ల్యాబ్‌ల్లో అదనపు సౌకర్యాలు కల్పించాలి. అదనంగా ఉద్యోగులను నియమించుకోవాలి. ఔషధాలు, వ్యక్తిగత రక్షణ పరికరాలు(పీపీఈ), ఎన్–95 మాస్కులు, వెంటిలేటర్ల కొనుగోలుకు ఈ నిధులను ఉపయోగించుకోవచ్చు. ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజోపయోగ స్థలాలు, అంబులెన్స్‌లను శుద్ధి చేయడానికి కూడా వెచ్చించవచ్చు. కరోనా కేసుల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం, బాధితులకు వైద్య సేవలందించడం రాష్ట్ర ప్రభుత్వాలకు తలకు మించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో కరోనాపై పోరాటానికి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరడంతో కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ‘భారత్ కోవిడ్–19 అత్యవసర ప్రతిస్పందన, ఆరోగ్య వ్యవస్థ సన్నద్ధత’ ప్యాకేజీకి తాజాగా ఆమోదం తెలిపింది. మరో 20 మరణాలు ఒక్క రోజులో 591 పాజిటివ్‌లు న్యూఢిల్లీ: కరోనా వైరస్ పంజా విసురుతూనే ఉంది. దేశవ్యాప్తంగా బుధవారం నుంచి గురువారం వరకు.. ఒక్కరోజులో 591 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో 8 మంది, గుజరాత్లో ముగ్గురు, మధ్యప్రదేశ్‌లో ముగ్గురు, జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు, పంజాబ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున కన్నుమూశారు. దీంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 169కు చేరిందని, ఇప్పటిదాకా 5,865 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం మీడియా సమవేశంలో ప్రకటించారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా ఇప్పటిదాకా 1,30,000 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాల గణాంకాల ప్రకారం కరోనాతో దేశవ్యాప్తంగా 196 మంది మృతి చెందగా, పాజిటివ్ కేసులు 6,500కు చేరాయి. కరోనా వ్యాప్తి నానాటికీ పెరుగుతుండడంతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. నిఘాను తీవ్రతరం చేశాయి. పీపీఈల లభ్యతపై ఆందోళన వద్దు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వ్యక్తిగత రక్షణ పరికరాల(పీపీఈ) లభ్యతపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు. ఈ విషయంలో వదంతులను నమ్మొద్దని కోరారు. ప్రస్తుతం సరిపడా పరికరాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని అవసరం మేరకు పొదుపుగా వాడుకోవాలని సూచించారు. దేశంలో 20 సంస్థలు పీపీఈలను తయారు చేస్తున్నాయని, 1.7 కోట్ల పరికరాలు సరఫరా చేయాలంటూ ఆయా సంస్థలకు ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. 49,000 వెంటిలేటర్లు త్వరలో అందనున్నాయని చెప్పారు. కరోనా బాధితుల కోసం 10 వైద్య బృందాలను 9 రాష్ట్రాలకు పంపించామని పేర్కొన్నారు. రైల్వే శాఖ 3,250 కోచ్‌లను ఐసోలేషన్ యూనిట్లుగా మార్చిందన్నారు. రైల్వే శాఖ 6 లక్షల ఫేస్ మాస్కులను ఉత్పత్తి చేసిందని, వీటిని మళ్లీ మళ్లీ ఉపయోగించుకోవచ్చని, అలాగే 4,000 లీటర్ల శానిటైజర్‌ను తయారు చేసిందని తెలిపారు. ‘ఆరోగ్య సేతు’ను డౌన్లోడ్ చేసుకోండి: మోదీ న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరులో ఎంతో ఉపయుక్తంగా ఉండే ఆరోగ్యసేతు యాప్‌ను మొబైల్‌లలో డౌన్లోడ్ చేసుకోవాలని ప్రధాని మోదీ ప్రజలను కోరారు. ‘కోవిడ్‌ను చూసి భయపడితే ఎలాంటి లాభం ఉండదు. జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఈ దిశగా కీలకమైన మొదటి అడుగు ఆరోగ్య సేతు. ఇది మీ చుట్టూ కోవిడ్ వైరస్ బాధితులెవరైనా ఉంటే కనిపెడుతుంది. అన్ని రాష్ట్రాల్లోని హెల్ప్‌డెస్క్‌ల ఫోన్ నంబర్లు ఇందులో ఉన్నాయి’అని ట్విట్టర్లో తెలిపారు. -
కరోనా.. కొత్త టెక్నాలజీలు!
సాక్షి, హైదరాబాద్: నిరాశావాది ప్రతి అవకాశంలోనూ కష్టాలే చూస్తే..ఆశావాది ప్రతి కష్టంలోనూ అవకాశాన్ని చూస్తాడని అప్పుడెప్పుడో విన్స్టన్ చర్చిల్ చెప్పాడట..కరోనాతో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుంటే.. కొంతమంది ఇందులోనూ మానవాళికి మరింత మేలు చేసే కొత్త ఆవిష్కరణలకు అవకాశాలు వెతుకుతున్నారు. ఇప్పుడు కాకపోయినా..రాబోయే రోజుల్లో ఇలాంటి మహమ్మారి మానవాళిని కబళించే ప్రయత్నం చేస్తే ఎదుర్కొనేందుకు ఉపయోగపడతాయి ఈ ఆవిష్కరణలు. షిప్పింగ్ కంటెయినర్లలో ఐసీయూలు! కరోనా వ్యాప్తి మొదలైన వెంటనే వారం రోజుల్లో చైనా వెయ్యి పడకలతో కూడిన ఆసుపత్రిని హుటాహుటినా కట్టేసింది. అన్నిచోట్ల చైనా మాదిరి పరిస్థితులుండవు కదా.. అందుకే కనెక్టెడ్ యూనిట్స్ ఫర్ రెస్పిరేటరీ ఎయిల్‌మెం (కూరా) షిప్పింగ్ కంటెయినర్లనే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లుగా మార్చేసేంది. ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు తరలించేందుకు వీలైన ఈ ఐసీయూలు విపత్కర పరిస్థితుల్లో బోలెడన్ని ప్రాణాలు కాపాడతాయనడంలో సందేహం లేదు. కార్లో రాట్టీ అసోసియాటీ, ఇటాలో రోటా, స్టూడియో ఎఫ్ఎం మిలానో, హ్యుమానిటాస్ రీసెర్చ్ హాస్పిటల్, జాకబ్స్, స్క్వింట్ ఓపెరా తదితర సంస్థలన్నీ కలిసి ఈ వినూత్న ఐసీయూలను డిజైన్ చేసి తయారు చేస్తున్నాయి. నౌకల్లో సరుకుల రవాణాకు ఉపయోగించే 20 అడుగుల పొడవైన కంటెయినర్లను బాగా శుభ్రం చేసి.. కిటికీలు, తలుపులు ఏర్పా టు చేస్తారు. వీటిని ఒకదానితో ఒకటి కలిపేందుకు బుడగల్లాంటి నిర్మాణాలను ఉపయోగిస్తారు. అవసరాన్ని బట్టి ఎక్కడికక్కడ గరిష్టంగా 40 పడకలతో కూడిన ఐసీయూ ఆసుపత్రిని సిద్ధం చేసుకోవచ్చన్నమాట. ఇవన్నీ ఎలా చేసుకోవాలన్నది అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి అవసరమైన వారెవరైనా ప్రపంచవ్యాప్తంగా వీటిని తయారు చేసుకోవచ్చు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఈ కంటెయినర్లను నెగిటివ్ ప్రెషర్ తో కూడా రూపొందించవచ్చు. ఆçస్పత్రులకు అనుబంధంగా ఇలాంటి యూనిట్లను ఏర్పాటు చేసుకుంటే ఐసీయూల సా మర్థ్యాన్ని తక్కువ సమయంలో పెంచుకోవచ్చని అంచనా. క్షేత్రస్థాయి, తాత్కాలిక ఆçస్పత్రుల ఏర్పాటుకూ ఇవి ఉపయోగపడతాయి. ప్రస్తు తం కూరా తొలి నమూనా ఐసీయూను మిలాన్‌లోని ఓ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేస్తోంది. డ్రోన్లతో కరోనా బాధితుల గుర్తింపు భవిష్యత్తులో రోడ్లపై ఏదైనా ఓ డ్రోన్ కనిపించిందనుకోండి.. అదేదో ఫొటో లు తీసేందుకు వచ్చిందని అనుకోకండి. మీలో కరోనా లాంటి వైరస్ ఉందేమో గుర్తించేందుకు ఎగురుతూ ఉండొచ్చు. ఆశ్చర్యంగా ఉందా? సౌత్ ఆస్ట్రేలియా యూనివర్సిటీ, కెనడాలోని డ్రాగన్‌ఫ్లై డ్రోన్ కంపెనీ సంయుక్తంగా ఈ వినూత్నమైన డ్రోన్లను రూపొందిస్తున్నాయి. కరోనా వంటి మహమ్మారిని అడ్డుకునేందుకు వీలైనన్ని ఎక్కువ పరీక్షలు చేయాలన్నది తెలిసిందే. అయితే ఇందుకు బోలెడన్ని సమస్యలున్నాయి. ఇలా కాకుండా.. డ్రోన్ల ద్వారా సామూహికంగా ప్రజలందరినీ పరీక్షించగలిగితే వ్యాధి కట్టడి చాలా సులువవుతుంది. ప్రత్యేకమైన సెన్సార్లు, కంప్యూటర్ చూపులు కలిగి ఉండే ఈ డ్రోన్లు గాల్లో ఎగురుతూనే వ్యాధితో బాధపడుతున్న వారిని గుర్తిస్తాయి. నిజానికి ఈ టెక్నాలజీని మూడేళ్ల క్రితమే ప్రొఫెసర్ జవాన్ చహల్ సిద్ధంచేశారు. భూమికి 33 అడుగుల ఎత్తులో ఎగురుతూ కూడా డ్రోన్ వీడియోల ద్వారా దగ్గు, తుమ్ములను గుర్తించగలవు. అంతేకాకుండా గుండె కొట్టుకునే వేగం, ఉష్ణోగ్రత, ఊపిరి తీసుకునే వేగం వంటి వాటివన్నింటినీ గుర్తించగలదు. 50 మీటర్ల ప్రాంతంలోని ప్రజలపై నిఘా పెట్టగలదు. ప్రస్తుతానికి ఈ డ్రోన్ల కచ్చితత్వం కొంచెం తక్కువేనని, కాకపోతే ప్రాథమిక పరిశీలనలకు ఎంతో ఉపయోగపడుతుందని చహల్ అంటున్నారు. -
ఇంట్లోనే...ఐ'సీ'యూ
సాక్షి,హైదరాబాద్: ఇప్పటివరకూ ఫిజియో థెరపీ, మందుల హోమ్ డెలీవరీ, రక్త, మూత్ర పరీక్షలు వంటి సేవలు మాత్రమే అందుతుండగా, తాజాగా కేర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్స్ యాజమాన్యం ‘కేర్ ఎట్ హోమ్’పేరుతో రోగి ఇంట్లోకే ఐసీయూ సర్వీసులను తీసుకొచ్చింది. సర్జరీ తర్వాత ఎక్కువ రోజులు ఐసీయూలో ఉండాల్సి వచ్చిన రోగులతో పాటు దీర్ఘకాలిక జబ్బులతో బాధ పడుతూ రోజుల తరబడి ఐసీయూలో ఉండాల్సి వచ్చే కేన్సర్, పక్షవాతం, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్, న్యుమోనియా, ఆస్తమా సంబంధిత రోగులకు వారి బంధువుల సమక్షంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో మెరుగైన వైద్యసేవలు అందించనుంది. దీంతో ఆస్పత్రి ఖర్చులు తగ్గడంతో పాటు రోగి త్వరగా కోలుకునే అవకాశమూ ఉంది. ఖర్చు తక్కువ..ఫలితమెక్కువ కేన్సర్, పక్షవాతం సహా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వంటి రోగాల బారిన పడ్డవారికి ఐసీయూలో వెంటిలేటర్ సహాయంతో వైద్యసేవలు అందించాల్సి వస్తుంది. కార్పొరేట్ ఆస్పత్రిలో రోజు సగటు ఐసీయూ చార్జీ రూ.50 వేలకుపైనే. అదే హోమ్ ఐసీయూ సర్వీసులో రూ.10 వేలకు మించదు. పోస్ట్ ఆపరేటివ్ ఖర్చులు రోజుకు రూ.30 వేల వరకు అయితే ఇంట్లో రూ.5 వేలలోపే. అదే బెడ్‌సైడ్ సర్వీసులకైతే రూ.2 వేలకు మించదని కేర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్స్ ప్రకటించింది. రోగిని రోజుల తరబడి ఐసీయూలో ఉంచాల్సి వస్తుండటం, ఈ వైద్య ఖర్చులు బంధువులకు భారంగా మారు తున్నాయి. ఇదే సమయంలో ఆస్పత్రి ఐసీయూ పడకలు ఖాళీగా లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన రోగులకు బెడ్స్ సమకూర్చలేని పరిస్థితి తలెత్తుతుంది. పది నుంచి పదిహేను పడకలతో నెలకొల్పిన ఐసీయూలో రకరకాల బాధితులకు చికిత్సలు అందించాల్సి వస్తుండటం, ఒక్కో సారి ఎవరైనా చనిపోతే, బంధువుల ఆర్తనాదాలు విని పక్కనే ఉన్న వారు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు. ఐసీయూలో రకరకాల బాధితులు ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఒక రోగి ఇన్ఫెక్షన్ మరో రోగికి సోకుతుండటం వల్ల దాన్ని నియంత్రించడానికి అనివార్యంగానే యాంటి బయాటిక్ మందుల్ని ఎక్కువ మోతాదులో వాడాల్సి వస్తుంది. దీంతో రోగి కోలుకోక పోగా ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది. అదే సర్జరీ తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి, ఇంట్లోని బంధువుల సమక్షంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వైద్యసేవలు అందించడం వల్ల రోగి త్వరగా కోలుకునే అవకాశం ఉంది. అంతేకాదు ఆపదలో వచ్చిన వారికి సత్వరమే ఐసీయూ సేవలు అందించవచ్చు. ఎలాంటి సేవలు అందిస్తారు? రోజుల తరబడి ఐసీయూ చికిత్సలు అవసరమైన రోగులకు హోమ్ ఐసీయూ సర్వీసులను అందిస్తున్నారు. రోగి డిశ్చార్జ్‌కి ముందే ఆస్పత్రి బయోమెడికల్ ఇంజనీర్ రోగి ఇంటిని పరిశీలిస్తారు. ఇంట్లో ఆస్పత్రి ఐసీయూకు కావాల్సిన వాతావరణం ఉన్నట్లు నిర్ధారించుకుని గాలి, వెలుతురు ఉన్న ప్రదేశాన్ని ఇందుకు ఎంపిక చేస్తారు. రోగి అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని హోమ్ ఐసీయూకు కావాల్సిన వెంటిలేటర్, ఆక్సిజన్, సీపీఏపీఎస్, బైలెవల్ ప్యాప్, సక్షన్ అండ్ ఎయిర్ ఫర్ ఫియర్, మల్టీపారా మానిటర్, బ్యాక్‌రెస్ట్ కాట్, ఐసీయూ బెడ్–3,5 ఫంక్షన్ మోటరైజ్డ్, తదితర మెడికల్ ఎక్విప్మెంట్స్ను రోజువారీ అద్దె ప్రాతిపాదికన సరఫరా చేస్తారు. ఎప్పటికప్పుడు రోగి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు ఒక వైద్యుడితో పాటు సీనియర్ నర్సు, ఫిజియో థెరపిస్ట్, అటెండర్‌ను ఇంటికి పంపుతారు. అవసరమైతే స్పెషాలిటీ వైద్యుడు సైతం ఇంటికి వస్తాడు. మందులతో పాటు సాధారణ వైద్య పరీక్షలు సైతం ఇంటి నుంచే అందిస్తారు. ఒక వేళ రోగి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లయితే రోగికి అమర్చిన మల్టీపారామానిటర్ కేర్ ఎట్ హోమ్ కాల్ సెంటర్‌కు ఇండికేషన్స్ ఇస్తుంది. వెంటనే వైద్యులు అప్రమత్తం అవుతారు. హోమ్ కేర్‌తో సత్ఫలితాలు ప్రస్తుతం నగరంలో పలు రకాల హోమ్ సర్వీసులు ఉన్నప్పటికీ.. డిశ్చార్జ్ తర్వాత రోగి ఇంటికి కన్సల్టెంట్‌ను పంపిన దాఖలాలు లేవు. చాలా మందికి సర్జరీ తర్వాత అనివార్యమైతే తప్ప ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం ఉండదు. చిన్నచిన్న వాటి కోసం రోజుల తరబడి ఆస్పత్రిలో ఉండాల్సి రావడం వల్ల రోగులు హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్కు గురవుతుంటారు. నాలుగు రోజుల్లో కోలు కోవాల్సిన రోగి పది రోజులైనా ఆరోగ్యం మెరుగుపడదు. ఆస్పత్రి ఖర్చులు కూడా తడిసి మోపెడవుతుంటాయి. సర్జరీ తర్వాత కేవలం ఇంజక్షన్లు, డ్రెస్సింగ్, ఫిజియో థెరపీ కోసం రోజుల తరబడి ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చే రోగులకు హోమ్ కేర్ సర్వీసులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ప్రస్తుతం కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందిన రోగులకు మాత్రమే ఈ సేవలు అందిస్తున్నాం. భవిష్యత్తులో ఇతర రోగులకు ఈ సేవలను విస్తరింపజేస్తాం. – డాక్టర్ బి.సుధాకర్‌బాబు, క్లినిక్ సర్వీస్ అండ్ పాపులేషన్ హెల్త్ హెడ్ -
బయటకొచ్చారు సరే.. అసలు లోపలికెందుకెళ్లినట్టు?
మే సాయ్ : 13 మంది కోసం.. 18 రోజుల నిరిక్షణ, థాయ్‌లాండ్ నౌకాదళ సిబ్బందితో పాటు వివిధ దేశాల నిపుణులు సాయంతో 3 రోజుల పాటు ఏకధాటిగా చేపట్టిన సహాయక చర్యలు.. వెరసి ఎట్టకేలకు థాయ్‌లాండ్‌లోని థామ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న వారు క్షేమంగా బయటపడ్డారు. దాంతో గుహలో చిక్కుకున్న 13 మంది తల్లిదండ్రులే కాక మొత్తం ప్రపంచం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. ప్రస్తుతం వీరందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అందరిని తొలిచివేస్తొన్న ప్రశ్న ఒక్కటే. అందేంటంటే థామ్ లువాంగ్ గుహలు చాలా ప్రమాదాకరమైనవని థాయ్‌లాండ్ వాసులకు తెలుసు. వర్షాకాలంలో ఈ గుహల్లోకి ప్రవేశించాలని ఎవరూ అనుకోరు. అలాంటిది ఈ విషయాలన్ని తెలిసి కూడా వీరంతా గుహలోకి ఎందుకు ప్రవేశించారు? సరే, పిల్లల కంటే తెలియదు.. మరి కోచ్ ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? ఆయన పిల్లలను గుహ లోపలికి వెళ్లకుండా వారించక పోవడమే కాక స్వయంగా కోచ్ కూడా గుహలోకి ఎందుకు వెళ్లాడు? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం గుహ నుంచి బయటపడిన వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా కోలుకున్న తర్వాత అసలు వీరు గుహలోకి ప్రవేశించడానికి గల కారణాలు తెలియ వస్తాయి. ప్రస్తుతం వీరందరిని ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఇన్నాళ్లు వీరంతా అపరిశుభ్ర వాతావరణంలో ఉన్నారు. అందువల్ల ఎటువంటి అంటు వ్యాధులు ప్రబలే అవకాశం లేకుండా వీరందరిని ప్రత్యేకంగా ఉంచారు . కాగా గుహ నుంచి బయటపడిన వారంతా దాదాపు రెండు కేజీల బరువు తగ్గినట్టుగా డాక్టర్లు నిర్ధారించారు. ఈ విషయం గురించి వైద్యులు ‘గుహలో ఉన్న వారి గురించి బయట ప్రపంచానికి తెలిసిన తర్వాతనే వీరికి ఆహారం అందించే ఏర్పాట్లు చేయగలిగాము. కానీ అంతకు ముందు వారు కేవలం గుహలో ఉన్న మురికి నీటినే తాగి ఆకలి తీర్చుకున్నారు. అందువల్లే బరువు తగ్గారు. ఇప్పుడు కూడా వీరికి కేవలం పాలను మాత్రమే ఇస్తున్నాము. అందులోనూ ఎక్కువ ప్రోటీన్లు ఉండేలా చూస్తున్నాం’ అన్నారు. అంతేకాక ‘వీరిలో కొందరు కండరాల నొప్పులతో మరికొందరు జలుబు, దగ్గు,జ్వరం లాంటి వ్యాధులతో బాధపడుతున్నారు. ఎంత లేదన్నా వీరందరిని ఓ వారం రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచాలి. కాబట్టి అంత వరకూ తల్లిదండ్రులను వీరిని చూడటానికి అనుమతించం’ అని తెలిపారు. ప్రస్తుతం తల్లిదండ్రులు పిల్లలకు దూరంగా నిల్చుని అద్దాలలోంచి చూడటానికి మాత్రమే అనుమతినిచ్చినట్లు తెలిపారు. దాదాపు 20 మంది ఆస్ట్రేలియన్ సహాయక సిబ్బంది ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. వీరిలో రిచర్డ్ హారిస్ ధైర్యసాహసాలు అందరిని ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో సహకరించిన వారందరిని థాయ్ ప్రభుత్వ ప్రత్యేకంగా సత్కరించింది. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న సిబ్బందికి థాయ్ ప్రజలు మాత్రమే కాక మొత్తం ప్రపంచం అంతా ధన్యవాదాలు తెలుపుతోంది. -
ఫ్లయింగ్ ఐసీయూ
కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మనిషిని అత్యవసరంగా కాపాడేది అంబులెన్స్. పట్టణాల్లో, పల్లెల్లో ప్రమాదాల్లో చిక్కుకున్న ఎందరి జీవితాలనో కాపాడే ఆపద్బంధు అంబులెన్స్! అయితే.. అదే ప్రమాదం అడవుల్లోనో, కొండల్లోనో జరిగితే..? వెంటిలేటర్ మీదున్న రోగిని అత్యవసరంగా అత్యాధునిక వైద్యం కోసం దూరతీరాలకు తీసుకెళ్లాల్సి వస్తే.. అలాంటి సందర్భాల్లోమేమున్నామంటున్నాయి ఎయిర్ అంబులెన్స్‌లు. మహానగరాల్లో వీటికి ట్రాఫికర్ సమస్య ఉండదు. గంటలకు గంటలు ప్రయాణ సమయం ఉండదు. కొడిగడుతున్న దీపాన్ని కొండెక్కకుండా ఎత్తుకెళ్లి అవసరమైన వెద్యం అందే చోట దించుతుంది. ఈ లోపు ఆ మనిషి ప్రాణాలు గాల్లో కలసిపోకుండా.. గగనతలంలోనే ఐసీయూ సేవలు అందిస్తుంది. ఇప్పటి వరకు బెంగళూరు, ఢిల్లీ, ముంబై, గువాహటి, కోల్‌కతా నగరాలకు పరిమితమైన ఎయిర్ అంబులెన్స్ ఏవియేషన్ సేవలు ఇటీవల మన హైదరాబాద్‌లోనూ ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎయిర్ అంబులెన్స్ ఏవియేషన్ మిషన్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా బినీష్ పాల్ ‘సిటీప్లస్’తో ప్రత్యేకంగా మాట్లాడారు. అత్యవసరంగా వైద్యం అందాల్సిన వారిని ఆస్పత్రికి తరలించే అంబులెన్స్‌కు ప్రతిక్షణం ఉత్కంఠమే. హైదరాబాద్‌లో అడుగడుగునా అడ్డగించే ట్రాఫిక్ జామ్‌లు, అస్తవ్యస్తమైన రోడ్లు ఒక ప్రాణానికి పరీక్ష పెడుతుంటాయి. ఇవేకాక అంబులెన్స్‌లో అత్యాధునిక సౌకర్యాల లేమితో ఎందరో అవసరమైన వైద్యాన్ని పొందలేక‘పోతున్నారు’. వీటన్నింటికీ పరిష్కారం చూపుతోంది ‘ఎయిర్ అంబులెన్స్’. ప్రాణాన్ని కాపాడేందుకు అందుబాటులో ఉన్న అన్ని సేవ లను ఉపయోగించుకోవడమే తమ లక్ష్యం అంటోంది ఎయిర్ అంబులెన్స్ ఏవియేషన్. పదేళ్ల శ్రమ తార్వాత 2007లో ఆకాశవీధిలో అంబులెన్స్ సేవలను ప్రారంభించామని చెబుతున్నారు బినీష్ పాల్. కొండలు, గుట్టలు, పర్వత ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలు, అడవుల్లో ప్రమాదాలు జరిగితే క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడంలో ఎయిర్ అంబులెన్స్ సేవలు కీలకంగా మారుతున్నాయి. 12 విమానాలు..ఓ చాపర్.. ప్రస్తుతం ఎయిర్ అంబులెన్స్ ఏవియేషన్ దగ్గర 12 విమానాలు, ఓ చాపర్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో 7 ప్లాటస్ పీసీ-12, 3 కింగ్ ఎయిర్ బీ- 200, 2 సింటేషన్ ఎక్స్ఎల్ విమానాలున్నాయి. ప్లాటస్, కింగ్ విమానాలను డొమెస్టిక్ పరిధిలో, చాపర్, సింటేషన్ విమానాలను ఇంటర్నేషనల్ పరిధిలో వినియోగిస్తున్నారు. ఇక సిబ్బంది విషయానికొస్తే.. 50 మంది పెలైట్లు, 25 మంది వైద్యులు, ఎయిర్ పోర్ట్‌కు నలుగురు చొప్పున ఇతర స్టాఫ్ అందుబాటులో ఉన్నారు. రైలు, రోడ్డు, అగ్ని ప్రమాదాల్లోని క్షతగాత్రులను, హార్ట్ ఎటాక్‌తో పాటు ప్రాణాల మీదికి వచ్చినప్పుడు రెక్కలు కట్టుకుని వాలిపోతాయి. ప్రథమ చికిత్సతో పాటు అవసరమైన వైద్యసేవలు అందిస్తూ.. సురక్షితంగా, తక్కువ సమయంలో ఆస్పత్రికి తరలిస్తుంది. చార్జి రూ.45 వేలు.. ఎయిర్ అంబులెన్స్ సేవల చార్జీలు ప్రయాణ దూరం, విమానాన్ని బట్టి చార్జి ఉంటుంది. చాపర్, హెలికాప్టర్ (సింగిల్ ఇంజన్) ప్రారంభ ధర రూ.45 వేలు, డబుల్ ఇంజన్ హెలికాప్టర్ అయితే రూ.75 వేలు, అలాగే జెట్ విమానం అయితే రూ.1.80 లక్షలు స్టార్టింగ్ ప్రైస్‌గా నిర్ణయించారు. అంబులెన్స్‌లో సేవల చార్జీలు సమయాన్ని బట్టి లెక్కిస్తారు. ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురైన నిర్భయను మెరుగైన వైద్యం కోసం ఎయిర్ అంబులెన్స్‌లోనే సింగపూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి శ్రీనివాస్‌రెడ్డి ఎయిర్ అంబులెన్స్‌లోనే బాగల్పూర్ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. మలయాళ నటుడు జగతి శ్రీకుమార్‌తో పాటు చాలా మంది రాజకీయ ప్రముఖులు ఎయిర్ అంబులెన్స్ సేవలు పొందిన వారిలో ఉన్నారు. అన్ని అనుమతులూ ఉన్నాయి.. ‘ఎక్కడైనా, ఏ సమయంలోనైనా దే శ, విదేశాల్లోని అన్ని విమానాశ్రయాలకు వెళ్లేందుకు వీలుగా అవసరమైన అనుమతిని కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖలతో పాటు ఇతర ఏజెన్సీల నుంచి అనుమతి తీసుకున్నాం. అలాగే దేశ, విదేశాల్లోని ఆసుపత్రులకు వెళ్లేందుకు వీలుగా కేంద్ర ఆరోగ్య, పట్టణాభివృద్ధి శాఖ అనుమతి కూడా తీసుకున్నాం. అలాగే అందుబాటులో ఉన్న విమానాలను ఎప్పటికప్పుడు మరమ్మతులను చేసేందుకు ప్రత్యేకమైన విభాగం కూడా ఉందని’ చెబుతున్నారు బినీష్ పాల్. మరిన్ని వివరాలు airambulance@ airambulanc-eaviation.com, www.airambulance-aviation.com వెబ్సైట్లలో చూడొచ్చు. -ఆడెపు శ్రీనాథ్ అంబులెన్స్ ప్రత్యేకతలు.. - ఎయిర్ అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న పేషెంట్లు/ క్షతగాత్రుల ప్రాణాలకు ఎటువంటి ముప్పులేకుండా అత్యవసరంగా అందించాల్సిన వైద్య సేవలన్నీ ఉంటాయి - నైపుణ్యం కలిగిన వైద్యుడితో పాటు, ప్రత్యేక శిక్షణ పొందిన పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారు - కృత్రిమ శ్వాస వ్యవస్థతో పాటు, పేషంట్ గుండె ఆగిపోతే.. తిరిగి పనిచేసేలా షాక్ ఇచ్చే డిఫిబ్రిలేటర్ ఉంటుంది - రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని తెలుసుకునే పల్స్ ఆక్స్ మీటర్ కూడా అందుబాటులో ఉంటుంది - కార్డియో పల్మనరీ రెసిస్టేషన్ (సీపీఆర్), ఎలక్ట్రోకార్డియోగ్రఫి (ఈసీజీ), వెంటిలేటర్, టెలీ మెడిసిన్, ఇంక్యుబేషన్ వంటి అత్యాధునిక వసతులు ఎయిర్ అంబులెన్స్‌లో సిద్ధంగా ఉంటాయి.