మే సాయ్ : 13 మంది కోసం.. 18 రోజుల నిరిక్షణ, థాయ్‌లాండ్ నౌకాదళ సిబ్బందితో పాటు వివిధ దేశాల నిపుణులు సాయంతో 3 రోజుల పాటు ఏకధాటిగా చేపట్టిన సహాయక చర్యలు.. వెరసి ఎట్టకేలకు థాయ్‌లాండ్‌లోని థామ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న వారు క్షేమంగా బయటపడ్డారు. దాంతో గుహలో చిక్కుకున్న 13 మంది తల్లిదండ్రులే కాక మొత్తం ప్రపంచం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. ప్రస్తుతం వీరందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు అందరిని తొలిచివేస్తొన్న ప్రశ్న ఒక్కటే. అందేంటంటే థామ్ లువాంగ్ గుహలు చాలా ప్రమాదాకరమైనవని థాయ్‌లాండ్ వాసులకు తెలుసు. వర్షాకాలంలో ఈ గుహల్లోకి ప్రవేశించాలని ఎవరూ అనుకోరు. అలాంటిది ఈ విషయాలన్ని తెలిసి కూడా వీరంతా గుహలోకి ఎందుకు ప్రవేశించారు? సరే, పిల్లల కంటే తెలియదు.. మరి కోచ్ ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? ఆయన పిల్లలను గుహ లోపలికి వెళ్లకుండా వారించక పోవడమే కాక స్వయంగా కోచ్ కూడా గుహలోకి ఎందుకు వెళ్లాడు? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం తెలియాల్సి ఉంది.
అయితే ప్రస్తుతం గుహ నుంచి బయటపడిన వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా కోలుకున్న తర్వాత అసలు వీరు గుహలోకి ప్రవేశించడానికి గల కారణాలు తెలియ వస్తాయి. ప్రస్తుతం వీరందరిని ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఇన్నాళ్లు వీరంతా అపరిశుభ్ర వాతావరణంలో ఉన్నారు. అందువల్ల ఎటువంటి అంటు వ్యాధులు ప్రబలే అవకాశం లేకుండా వీరందరిని ప్రత్యేకంగా ఉంచారు . కాగా గుహ నుంచి బయటపడిన వారంతా దాదాపు రెండు కేజీల బరువు తగ్గినట్టుగా డాక్టర్లు నిర్ధారించారు.
ఈ విషయం గురించి వైద్యులు ‘గుహలో ఉన్న వారి గురించి బయట ప్రపంచానికి తెలిసిన తర్వాతనే వీరికి ఆహారం అందించే ఏర్పాట్లు చేయగలిగాము. కానీ అంతకు ముందు వారు కేవలం గుహలో ఉన్న మురికి నీటినే తాగి ఆకలి తీర్చుకున్నారు. అందువల్లే బరువు తగ్గారు. ఇప్పుడు కూడా వీరికి కేవలం పాలను మాత్రమే ఇస్తున్నాము. అందులోనూ ఎక్కువ ప్రోటీన్‌లు ఉండేలా చూస్తున్నాం’ అన్నారు.
అంతేకాక ‘వీరిలో కొందరు కండరాల నొప్పులతో మరికొందరు జలుబు, దగ్గు,జ్వరం లాంటి వ్యాధులతో బాధపడుతున్నారు. ఎంత లేదన్నా వీరందరిని ఓ వారం రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచాలి. కాబట్టి అంత వరకూ తల్లిదండ్రులను వీరిని చూడటానికి అనుమతించం’ అని తెలిపారు. ప్రస్తుతం తల్లిదండ్రులు పిల్లలకు దూరంగా నిల్చుని అద్దాలలోంచి చూడటానికి మాత్రమే అనుమతినిచ్చినట్లు తెలిపారు.
దాదాపు 20 మంది ఆస్ట్రేలియన్ సహాయక సిబ్బంది ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. వీరిలో రిచర్డ్ హారిస్ ధైర్యసాహసాలు అందరిని ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో సహకరించిన వారందరిని థాయ్ ప్రభుత్వ ప్రత్యేకంగా సత్కరించింది. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న సిబ్బందికి థాయ్ ప్రజలు మాత్రమే కాక మొత్తం ప్రపంచం అంతా ధన్యవాదాలు తెలుపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment