విద్యార్థిని అంబులెన్సులో నుంచి హెలికాప్టర్‌లోకి ఎక్కిస్తు్తన్న సహాయక సిబ్బంది
మే సాయ్: థాయ్‌లాండ్‌లోని తామ్ లువాంగ్ గుహలో చిక్కుకున్నవారిలో మరో నలుగురు విద్యార్థుల్ని సహాయక బృందాలు సోమవారం రక్షించాయి. ఆదివారం నలుగురు విద్యార్థుల్ని కాపాడిన 10 గంటల తర్వాత మిగిలినవారిని బయటకు తీసుకొచ్చేందుకు సోమవారం సహాయక చర్యల్ని ప్రారంభించారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ సాగిన ఈ ఆపరేషన్‌లో మరో నలుగురు విద్యార్థుల్ని డైవర్లు గుహ నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
అనంతరం వీరందరిని థాయ్ రాయల్ పోలీస్ హెలికాప్టర్ ద్వారా 56 కి.మీ దూరంలో ఉన్న చియాంగ్‌రాయ్ ప్రచనుక్రోహ్ ఆస్పత్రికి తరలించారు. దీంతో ఈ ఘటనలో ప్రమాదం నుంచి బయటపడ్డ విద్యార్థుల సంఖ్య 8కి చేరుకుంది. ప్రస్తుతం సహాయక కోచ్ ఎకపాల్(25)తో పాటు నలుగురు విద్యార్థులు ఇంకా గుహలోనే ఉన్నారు. జూన్ 23న తామ్ లూవాంగ్ గుహలోకి వెళ్లి చిక్కుకున్న 12 మంది విద్యార్థులతో పాటు కోచ్‌ను రక్షించేందుకు థాయ్‌లాండ్ అధికారులు ఆదివారం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, సోమవారం చీకటిపడటంతో ఆపరేషన్‌ను నిలిపివేసిన అధికారులు.. మంగళవారం సహాయక చర్యల్ని పునరుద్ధరించనున్నారు.
వాతావరణం అనుకూలం..
ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్న చియాంగ్ రాయ్ ప్రావిన్సు గవర్నర్ నరోంగ్ సక్ మీడియాతో మాట్లాడుతూ.. తొలిరోజు లాగే సోమవారం కూడా సహాయక చర్యలకు వాతావరణం అనుకూలంగా ఉందని తెలిపారు. గుహలోని పరిస్థితులపై అవగాహన ఉండటంతో ఆదివారం సహాయక చర్యల్లో పాల్గొన్న డైవింగ్ నిపుణుల్నే సోమవారం రంగంలోకి దించామన్నారు. ఆపరేషన్‌కు ముందు గుహలోని మార్గంలో ఆక్సిజన్ సిలిండర్లను చేరవేశామన్నారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో తొలి బాలుడ్ని తీసుకురాగలమని అంచనా వేసినప్పటికీ.. సాయంత్రం 5.40 గంటలకే బయటకు తీసుకొచ్చామని నరోంగ్‌సక్ తెలిపారు.మిగిలిన ముగ్గురిని కూడా దాదాపు 3 గంటల వ్యవధిలోనే బయటకు తీసుకొచ్చామన్నారు. శారీరకంగా దృఢంగా ఉన్న విద్యార్థులనే తొలుత బయటకు తెచ్చేందుకు ప్రాధాన్యమిచ్చామని అన్నారు.
వీరిని స్ట్రెచర్ల సాయంతో హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించామన్నారు. విద్యార్థులతో పాటు కోచ్‌ను కాపాడేందుకు 50 మంది థాయ్‌లాండ్ డైవర్లు, 40 మంది అంతర్జాతీయ డైవింగ్ నిపుణులు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇక్కడి వాతావరణం పొడిగానే ఉన్నప్పటికీ.. ఎగువ ప్రాంతాల్లో కొన్నిచోట్ల ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు గుహలో నీటి ప్రవాహం పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. తామ్ లువాంగ్ గుహలోని నీటిని భారీ మోటార్ల సాయంతో తోడేస్తున్నట్లు పేర్కొన్నారు. అనుకున్నదాని కంటే తొందరగానే విద్యార్థుల్ని గుహ నుంచి బయటకు తీసుకొస్తున్నామని నరోంగ్‌సక్ తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో ఆపరేషన్ ముగిసే అవకాశముందన్నారు. కాగా, సోమవారం గుహ నుంచి బయటకొచ్చిన నలుగురు విద్యార్థుల వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.
విద్యార్థులంతా క్షేమమే కానీ..
చియాంగ్ రాయ్ ఆస్పత్రి ప్రస్తుతం చికిత్స పొందుతున్న 8 మంది విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సీనియర్ వైద్యుడొకరు తెలిపారు. తమకు ఆహారం అందించాల్సిందిగా విద్యార్థులు కోరారన్నారు. అయితే వీరికి ఇన్ఫె క్షన్ సోకి ఉండొచ్చన్న అనుమానంతో ప్రస్తు తం వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు వెల్లడించారు. ఇలా గుహల్లో చిక్కుకున్న సందర్భాల్లో వ్యక్తులకు హైపోథెర్మియా(శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోవడం), పక్షులు, గబ్బిలాల విసర్జితాల కారణంగా శ్వాససంబంధ వ్యాధు లు వచ్చే అవకాశముందన్నారు. విద్యార్థులను 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఎలాంటి సమస్య లేదని నిర్ధారించుకున్నాక తల్లిదండ్రులకు అప్పగిస్తామన్నారు.
అరుదైన ఆహ్వానం
తామ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న వైల్డ్ బోర్స్ జట్టుకు అరుదైన ఆహ్వా నం లభించింది. నిర్ణీత సమయంలోగా అందరూ బయటకు రాగలిగితే రష్యా రాజధాని మాస్కోలో ఆదివారం జరిగే సాకర్ ప్రపంచకప్ ఫైనల్‌కు రావాలని ఈ జట్టు సభ్యుల్ని ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాన్టీనో ఆహ్వానించారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న తమ విద్యార్థులు తిరిగివచ్చాక వారికోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని మే సాయ్ ప్రసిత్‌సర్త్ పాఠశాల యాజమాన్యం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment