ఆపరేషన్‌ ‘థాయ్‌’ సక్సెస్‌ | Four boys rescued from Thai cave but rest must wait as air tanks are replenished | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ ‘థాయ్‌’ సక్సెస్‌

Published Mon, Jul 9 2018 2:01 AM | Last Updated on Fri, Nov 9 2018 4:51 PM

Four boys rescued from Thai cave but rest must wait as air tanks are replenished - Sakshi

మే సాయ్‌: థాయ్‌లాండ్‌లోని తామ్‌ లువాంగ్‌ గుహలో చిక్కుకున్న 13 మందిని రక్షించేందుకు తొలిరోజు చేపట్టిన ఆపరేషన్‌ విజయవంతమైంది. ఆదివారం 12 గంటలపాటు కొనసాగిన ఈ ఆపరేషన్‌లో నలుగురు విద్యార్థుల్ని బయటకు తీసుకొచ్చారు. కోచ్‌తో పాటు మిగిలిన 8 మంది విద్యార్థుల్ని రక్షించేందుకు సోమవారం ఆపరేషన్‌ ప్రారంభిస్తామని విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. గుహ నుంచి బయటకు వచ్చిన వీరిని సైనిక హెలికాప్టర్‌ ద్వారా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాము కాలం, నీటితో పోటీపడి సహాయక చర్యల్ని చేపడుతున్నట్లు ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్న చియాంగ్‌ రాయ్‌ ప్రావిన్సు గవర్నర్‌ నరోంగ్‌సక్‌ అన్నారు.

వాతావరణశాఖ హెచ్చరికలతో..
రాబోయే 3–4 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో తొలుత బాలుర కుటుంబాలకు సమాచారమిచ్చిన అధికారులు ఆపరేషన్‌ను ప్రారంభించారు. ఒక్కో బాలుడ్ని ఇద్దరు డైవర్లు 4 కి.మీ మేర సురక్షితంగా తీసుకొచ్చేలా ప్రణాళికలు వేశారు. వీరు దారితప్పకుండా మార్గంపొడవునా తాళ్లను అమర్చారు. తర్వాత 15 మంది అంతర్జాతీయ డైవింగ్‌ నిపుణులతో పాటు ఐదుగురు థాయ్‌ నేవీ సీల్స్‌ రంగంలోకి దిగారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ చేపట్టిన ఆపరేషన్‌లో నలుగురు పిల్లల్ని గుహ నుంచి బయటకు తీసుకురాగలిగారు.

ఈ సందర్భంగా గుహలోని ఆక్సిజన్‌ స్థాయి తగ్గిపోకుండా కిలోమీటర్‌ మేర ప్రత్యేకమైన పైపుల్ని అమర్చారు. నీటిని నిరంతరాయంగా తోడేస్తుండటంతో గుహలోని నీటి మట్టం కాస్త తగ్గడం సహాయక చర్యలకు సాయపడింది. గుహలోని ఇరుకు మార్గాలు, బురద నీటితో దారి కన్పించకపోవడం, ఈ పిల్లలకు ఈత రాకపోవడం సహాయక చర్యలకు ప్రధాన అవరోధాలుగా మారాయి. ఈ విద్యార్థుల్ని బయటకు తీసుకొచ్చేందుకు గుహ పైభాగంలో దాదాపు 400 మీటర్ల మేర 100 రంధ్రాలను తవ్వినప్పటికీ ఫలితం లేకపోయింది.  

వెంటనే ఆస్పత్రికి తరలింపు
గుహ నుంచి బయటకు తీసుకొచ్చిన నలుగురు చిన్నారుల్ని అధికారులు వెంటనే హెలికాప్టర్‌లో చియాంగ్‌ రాయ్‌ ప్రచనుక్రోహ్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరికి 35 మంది వైద్యులు చికిత్సచేస్తున్నారు. కాపాడిన నలుగురు పిల్లల్లో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆస్పత్రి వైద్యుడొకరు తెలిపారు. దక్షిణ థాయ్‌లాండ్‌లోని ఓ స్కూల్‌కు చెందిన వైల్డ్‌ బోర్స్‌ అనే సాకర్‌ జట్టు కోచ్‌తో పాటు 12 మంది విద్యార్థులు తామ్‌ లువాంగ్‌ గుహను జూన్‌ 23న సందర్శించారు. వీరు గుహలోకి వెళ్లగానే భారీ వర్షాలతో వరద పోటెత్తి ప్రవేశమార్గం మూసుకుపోయింది.

ముందుకొచ్చిన ఎలన్‌ మస్క్‌..
చిన్నారుల్ని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి స్పేస్‌ఎక్స్, బోరింగ్‌ కంపెనీ నిపుణుల్ని ఘటనాస్థలానికి పంపినట్లు ప్రముఖ పారిశ్రామికవేత్త, స్పేస్‌ఎక్స్‌ అంతరిక్ష సంస్థ వ్యవస్థాపకుడు ఎలన్‌ మస్క్‌ తెలిపారు. పిల్లల్ని బయటకు తీసుకొచ్చేందుకు ప్రత్యేకమైన చిన్న సబ్‌మెరైన్‌ను పంపామన్నారు. చిన్నారుల్ని బయటకు తెచ్చేందుకు థాయ్‌లాండ్‌ ప్రభుత్వంతో కలసి పనిచేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పారు.

జూన్‌ 23 నుంచి..
జూన్‌ 23: సహాయక కోచ్‌ ఎకపాల్‌(25)తో కలసి 12 మంది విద్యార్థులు తామ్‌ లువాంగ్‌ గుహలోకి ప్రవేశించారు. ప్రవేశద్వారం వరదనీటితో మునిగిపోవడంతో వీరంతా లోపల ఇరుక్కున్నారు.
జూన్‌ 24: గుహ ప్రవేశద్వారం వద్ద విద్యార్థుల సైకిళ్లు, కాలి గుర్తుల్ని అధికారులు కనుగొన్నారు.
జూన్‌ 26: వరదతో గుహాలోని పట్టాయ బీచ్‌ ప్రాంతం ఇరుకుగా మారడంతో లోపలకు వెళ్లిన నేవీ సీల్‌ డైవర్లు వెనక్కువచ్చారు.
జూన్‌ 27: దాదాపు 30 మంది అమెరికా పసిఫిక్‌ కమాండ్‌ సైనిక నిపుణులు, ముగ్గురు బ్రిటిష్‌ డైవర్లతో కలసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కానీ వరద ప్రవాహం కారణంగా ఎలాంటి పురోగతి కన్పించలేదు.
జూన్‌ 28: గుహలోని నీటిని తోడేసేందుకు పంపుల్ని ఏర్పాటుచేశారు. విద్యార్థుల్ని రక్షించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించేందుకు డ్రోన్లను రంగంలోకి దించారు.
జూలై 2: 12 మంది విద్యార్థులతో పాటు కోచ్‌ ఎకపాల్‌ సజీవంగా ఉన్నట్లు బ్రిటిష్‌ డైవర్లు గుర్తించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వీరికి ఆహారం, మందుల్ని అందించారు.
జూలై 6: రక్షించేందుకు వెళ్లిన సమన్‌ కునన్‌ అనే నేవీ సీల్‌ కమాండర్‌ ట్యాంక్‌లో ఆక్సిజన్‌ అయిపోవడంతో చనిపోయారు.
జూలై 8: సహాయక ఆపరేషన్‌ను ముమ్మరం చేసిన అధికారులు నలుగురు విద్యార్థుల్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.  

విలన్‌ కాదు.. హీరో
ఎకపాల్‌ చాన్‌తవాంగ్‌(25)..  12 మంది చిన్నారులు ప్రమాదంలో చిక్కుకోవడానికి ఇతనే కారణమని పలువురు మొదట్లో విమర్శించారు. కానీ గుహలో చిన్నారులు అనారోగ్యానికి గురికాకుండా ఎకపాల్‌ జాగ్రత్తలు తీసుకున్నాడని లోపలకు వెళ్లిన డైవర్లు తెలిపారు. గతంలో బౌద్ధ సన్యాసిగా ఉన్న ఆయన విద్యార్థులు మానసికంగా కుంగిపోకుండా ధ్యానం, ఇతర అంశాలపై దృష్టి సారించేలా చేశాడని వెల్లడించారు. పదేళ్లకే తల్లిందండ్రులను కోల్పోయిన ఎకపాల్‌ ఓ బౌద్ధాశ్రమంలో సన్యాసిగా చేరారు. మూడేళ్ల క్రితం సన్యాస దీక్షను వదిలిపెట్టిన ఎకపాల్‌ తన అమ్మమ్మను చూసుకునేందుకు మే సాయ్‌కు వచ్చేశారు.

అక్కడే ఉన్న ఓ స్కూల్‌లో ఉన్న వైల్డ్‌ బోర్స్‌ అనే సాకర్‌ జట్టుకు సహాయక కోచ్‌గా చేరారు. గుహలో 15 రోజుల పాటు చిక్కుకున్నా చిన్నారులు మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా ఎకపాల్‌ జాగ్రత్తలు తీసుకున్నారు. చివరికి తన ఆహారం, నీటిని సైతం ఆకలితో ఉన్న చిన్నారులకు ఇచ్చేశారు. దీంతో ఆయన ప్రస్తుతం గుహలో నీరసంతో బలహీనంగా తయారయ్యారు. సాకర్‌తో విద్యార్థుల్ని చదువుపై దృష్టి సారించేలా చేయొచ్చని నమ్మిన ఎకపాల్‌.. పాఠశాలలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు సాకర్‌ దుస్తులు, షూలు ఇచ్చేలా ప్రధాన కోచ్‌ నొప్పరట్‌ను ఒప్పించారు. కాగా, ఎకపాల్‌ కారణంగానే తమ చిన్నారులు ఇంకా ప్రాణాలతో ఉన్నారని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వ్యాఖ్యానించడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement