navy divers
-
గడ్డకట్టే నీటిలో అన్వేషణ.. ఎందుకంటే?
ఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని తపోవన్ సరస్సు లోతును కనుగొనడాన్ని ‘నేవీ డైవర్స్’ సవాల్‌గా తీసుకున్నారు. వరదలు ముంచెత్తినపుడు రిషిగంగ నదీ ప్రవాహమార్గంలో ఏర్పడిన అత్యంత ప్రమాదకరమైన భారీ కృత్రిమ సరస్సు సముద్రమట్టానికి 14 కిలో మీటర్లు పైకి ఎగిసి అల్లకల్లోలం సృష్టిస్తోందని తెలిపారు. ఈ విపత్తులో చాలా మంది ప్రాణాలు కోల్పోగా మరికొంత మంది జాడ తెలియటంలేదని పేర్కొన్నారు. తపోవన్ సరస్సు అత్యధికంగా గడ్డకట్టే పరిస్థితులను కలిగి ఉందని, అందుకే నేవీ అధికారులు సరస్సు లోతును కనుగొనడానికి ఎకోసౌండర్ పరికరాన్ని ఉపయోగిస్తున్నారని తెలిపారు. డామ్‌పై నీటి ఒత్తిడిని హై రిజల్యూషన్ ఉపగ్రహంతో అధ్యయనం చేస్తున్నారు. నీరు అధిక బరువును కలిగి ఉందని భవిష్యత్తులో ఎప్పుడైనా డ్యామ్‌ను ఢీకొట్టి మరో వరదకు కారణమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఘర్వాల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వైపీ సండ్రియల్ వరద సంభవించిన ప్రదేశంలో పర్యటించి వరదకు గల కారణాలను అధ్యయనం చేశారు. ఏ క్షణంలో అయినా వరదలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడానికి వైమానిక దళానికి చెందిన అత్యాధునిక లైట్ హెలికాప్టర్‌ను ఉపయోగిస్తామని తెలిపారు. చదవండి: ఉత్తరాఖండ్ ముంగిట మరో ముప్పు -
గనిలోకి గజ ఈతగాళ్లు
షిల్లాంగ్: మేఘాలయలోని గనిలో చిక్కుకున్న కార్మికుల కోసం సహాయక కార్యక్రమాలు ఊపందుకున్నాయి. విశాఖలోని నేవీ బేస్ నుంచి బయలుదేరిన 15 మంది గజ ఈతగాళ్ల బృందం శనివారం పశ్చిమ జైంతియా జిల్లా లుంథారి గ్రామ సమీపంలోని గని వద్దకు చేరుకుంది. వీరి వద్ద నీటి అడుగున శోధించే రిమోట్ వాహనాలు తదితర అత్యాధునిక పరికరాలు ఉన్నాయి. ఈ బృందానికి జాతీయ విపత్తు నిర్వహణ దళం(ఎన్డీఆర్ఎఫ్) అధికారులు పరిస్థితి వివరించారు. అలాగే, భువనేశ్వర్ నుంచి బయలుదేరిన ఈతగాళ్ల బృందంతోపాటు 10 శక్తివంతమైన కిర్లోస్కర్ మోటార్లు కూడా గని వద్దకు చేరుకున్నాయని జిల్లా ఎస్పీ సిల్వెస్టర్ నోంగ్టింగర్ తెలిపారు. వీరంతా కలిసి 370 అడుగుల లోతున్న గనిలో గల్లంతైన కార్మికుల జాడ కనుక్కునే పనిలో నిమగ్నమై ఉన్నారన్నారు. లిటీన్ నది మధ్యలో ఉన్న చిన్న గుట్టపై ఓ ప్రైవేట్ కంపెనీ అక్రమంగా బొగ్గు గని నడుపుతోంది. ఈ నెల 13వ తేదీన నది వరద అకస్మాత్తుగా గనిలోకి ప్రవేశించడంతో బొగ్గు తవ్వుతున్న కార్మికులు 15 మంది అందులో చిక్కుకుపోయారు. గనిలోతు 370 అడుగుల లోతు ఉండగా నీరు 170 అడుగుల వరకు ఉంటుందని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ ప్రాంతంలో భూమికి 200 నుంచి 500 అడుగుల లోతులో బొగ్గు తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం. బతికి ఉండేందుకు అవకాశమే లేదు గనిలోని కార్మికులు తప్పించుకుని వచ్చేందుకు మార్గం లేదని ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడిన సాహిబ్ అలీ అనే కార్మికుడు తెలిపాడు. ఇతనిది అస్సాంలోని చిరంగ్ జిల్లా. ఆ రోజు ప్రమాదం నుంచి ప్రాణాలు దక్కించుకున్న మిగతా నలుగురూ పశ్చిమ గారో జిల్లాలోని తమ సొంతూళ్లకు వెళ్లిపోయారని అలీ తెలిపాడు. ‘ప్రమాదం జరిగిన రోజు 22 మంది వరకు పనిలో ఉన్నాం. కేవలం ఒకే మనిషి కూర్చునేందుకు వీలుండే లోతైన గుంతల్లో చాలామంది బొగ్గు తవ్వుతున్నారు. ఉదయం 5 గంటలకే పని మొదలుపెట్టాం అయితే, 7 గంటల సమయంలో ఎన్నడూ లేనిది గనిలోకి కొత్త రకమైన గాలి వీచింది. కొద్దిసేపటికే పెద్ద శబ్దం చేస్తూ వరద నీరు గనిలోకి వెల్లువలా వచ్చింది. అతికష్టంమీద బయటకు రాగలిగా. ఆ రోజు ప్రమాదం నుంచి ప్రాణాలు దక్కించుకున్న నలుగురూ ఇనుప పెట్టెల్లో బొగ్గును నింపేవారే. గనిలో చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడేందుకు దారి లేదు. నీటి అడుగున శ్వాస పీల్చకుండా ఎవరైనా ఎంతకాలం ఉండగలరు?. నాకు తెలిసినంత వరకు గనిలో 17 మంది వరకు చిక్కుకున్నారు. సంప్రదాయం ప్రకారం అంతిమ క్రియలు జరిపేందుకు వారి మృతదేహాలైనా దొరుకుతాయని నా ఆశ’ అని అలీ అన్నాడు. ర్యాట్‌హోల్‌లో రెక్కీ నేవీతోపాటు ఎన్డీఆర్ఎఫ్నకు చెందిన గజ ఈతగాళ్లు ప్రమాదం జరిగిన ర్యాట్ హోల్గా పిలిచే ఆ ఇరుకైన గని లోపలికి దిగి, నీటి మట్టం, కార్మికుల ఆచూకీ ఎలా కనుగొనాలనే విషయమై ఒక అంచనాకు వచ్చారు. ఆదివారం వేకువజాము నుంచే ఈ బృందాలు తమ పనిని ప్రారంభిస్తాయని ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు. ధన్‌బాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్‌కు చెందిన నిపుణులు కూడా సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. వీరితోపాటు పంజాబ్‌కు చెందిన గని ప్రమాదాల నిపుణుడు జస్వంత్ సింగ్ గిల్ కూడా సాయంగా అక్కడికి వచ్చారు. శక్తివంతమైన కిర్లోస్కర్ మోటార్లతో నీటిని తోడే ప్రక్రియ ఆదివారం ప్రారంభం కానుందని అధికారులు అంటున్నారు. కూలీల బతుకులు కూల్చింది సాహిబ్ అలీతోపాటు గని తవ్వకాల్లో పాల్గొంటున్న వారంతా నిరుపేదలు.. రిక్షా తొక్కుతూ, బరువులు మోస్తూ జీవనం సాగించేవారు. ఈ పనుల్లో సంపాదన కుటుంబపోషణకు సరిపోక కూలీ ఆశతో ప్రమాదకరమైన గని పనిలో చేరారు. అత్యంత ఇరుకైన, లోతైన గనిలో రోజంతా పనిచేస్తే రూ.2వేల వరకు చేతికందుతాయి. వేరే ప్రాంతాలకు చెందిన కార్మికులు రెండు మూడు వారాలపాటు ఈ పనిని కొనసాగించి, తిరిగి సొంతూళ్లకు వెళ్లిపోతారు. గనిలో గల్లంతైన వారిలో ఎక్కువ మంది పశ్చిమ గారో హిల్స్ జిల్లాకు చెందిన వారే. ఈ నెల 13వ తేదీన ప్రమాదం జరగ్గా గనిలో చిక్కుకున్న 15 మంది కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం 22వ తేదీన రూ.లక్ష చొప్పున తాత్కాలిక సాయం ప్రకటించింది. -
గని కార్మికుల గాలింపునకు విశాఖ నేవీ ఈతగాళ్లు
షిల్లాంగ్: మేఘాలయలోని ఓ అక్రమ బొగ్గు గనిలో గల్లంతైన 15 మంది కార్మికుల జాడ కనుక్కునేందుకు నేవీ గజ ఈతగాళ్లు రంగంలోకి దిగనున్నారు. పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లాలోని లుంథారి గ్రామం సమీపంలోని గనిలోకి ఈ నెల 13వ తేదీన నది వరద ప్రవేశించడంతో కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు వీరి జాడ కనిపెట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో విశాఖలోని నేవీ విభాగానికి చెందిన 15 మంది గజ ఈతగాళ్ల బృందం శనివారం ఆ ప్రాంతానికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు. వీరి వద్ద అత్యాధునిక పరికరాలు ఉన్నాయని, సహాయ చర్యలపై నేవీ అధికారులు సమీక్ష జరిపారని వివరించారు. ఇదిలా ఉండగా, 37 అడుగుల లోతైన గని నుంచి నీటిని తోడి వేసేందుకు కిర్లోస్కర్ కంపెనీకి చెందిన 18 అతి శక్తివంతమైన మోటార్లను అక్కడికి పంపే ఏర్పాట్లుచేస్తున్నారు. దీంతోపాటు ఒడిశా అగ్ని మాపక శాఖకు చెందిన 20 మంది సభ్యులతో కూడిన రక్షక బృందం అత్యాధునిక పరికరాలతో ప్రయత్నిస్తోంది. -
'ఆపరేషన్ థాయ్' విజయవంతం
మే సాయ్: థాయ్‌లాండ్‌లో గుహలో చిక్కుకున్న చివరి ఐదుగురిని సహాయక బృందాలు మంగళవారం క్షేమంగా బయటకు తీసుకొచ్చాయి. దీంతో మూడు రోజులుగా థాయ్‌లాండ్ నౌకాదళ సిబ్బందితో కలసి వివిధ దేశాల నిపుణులు చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. 18 రోజుల నరక యాతన తర్వాత మొత్తం 13 మంది గుహ నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఓ ఫుట్‌బాల్ జట్టుకు చెందిన 12 మంది బాలురు, వారి కోచ్ జూన్ 23న థాయ్‌లాండ్‌లోని థామ్ లువాంగ్ గుహలోకి వెళ్లి, భారీ వర్షాల కారణంగా బయటకు వచ్చే దారి మొత్తం పూర్తిగా నిండిపోవడంతో, గుహ ప్రవేశ ద్వారం నుంచి లోపలికి రెండున్నర మైళ్ల దూరంలో చిక్కుకుపోయారు. మొత్తం 13 మందిలో ఆదివారం నలుగురిని, సోమవారం మరో నలుగురిని సహాయక బృందాలు గుహ నుంచి బయటకు తీసుకుకొచ్చారు. మిగిలిన నలుగురు పిల్లలతోపాటు వారి కోచ్‌ను మంగళవారం రక్షించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కోచ్, పిల్లలంతా క్షేమంగా∙ఉన్నారని అధికారులు చెప్పారు. వివిధ దేశాలకు చెందిన నిపుణులు వచ్చి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, సాంకేతిక రంగ నిపుణుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎలన్ మస్క్ తదితర ప్రముఖులు పిల్లలను రక్షించేందుకు అవసరమైన సాయం చేస్తామని ప్రకటించారు. కేవలం పిల్లలను కాపాడేందుకే ఎలన్ మస్క్ ఏకంగా ఓ చిన్నపాటి జలాంతర్గామిని తయారు చేయించి పంపారు. ట్రంప్ సహా ఎంతోమంది ప్రముఖులు సహాయక బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. గుహ నుంచి బయటపడతారో లేదో కూడా తెలియకపోయినా మనోధైర్యం కోల్పోకుండా ఇన్నాళ్లూ గుహలోనే కాలం గడిపిన బాలురను పలువురు ప్రశంసిస్తున్నారు. మరోవైపు బాలురను కాపాడేందుకు గుహలోకి వెళ్లిన వైద్యుడు, డైవర్లంతా క్షేమంగా బయటపడినట్లు థాయ్‌లాండ్ ప్రభుత్వం ప్రకటించింది. సాధ్యమవుతుందని కూడా ఎవరూ ఊహించని దానిని తాము చేసి చూపించామని ఈ ఆపరేషన్‌కు నేతృత్వం వహించిన చియాంగ్ రాయ్ గవర్నర్ నరోంగ్‌సక్ ఒసటనకోర్న్ అన్నారు. పకడ్బందీ వ్యూహంతో విజయం చిన్నారులను కాపాడేందుకు థాయ్ ప్రభుత్వం పకడ్బందీ వ్యూహాన్ని రచించింది. తొలుత ఈ ఆపరేషన్‌ను వర్షాలు తగ్గాకే చేపట్టాలని భావించారు. గుహలోని నీటిని పెద్దపెద్ద మోటార్ల ద్వారా బయటకు తోడేందుకు ప్రయత్నించినా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. గుహలో ఆక్సిజన్ సిలిండర్లు అమర్చడానికి వెళ్లిన డైవర్ సమన్ గుణన్ శుక్రవారం మృతి చెందడం ప్రమాద తీవ్రతను తెలియజేసింది. అనేక మార్గాలను అన్వేషించిన అనంతరం చివరకు నీటిలోనే పిల్లలను బయటకు తీసుకురావాలని ప్రభుత్వం తీర్మానించింది. పక్కా ప్రణాళికను సిద్ధం చేసి గజ ఈతగాళ్లను రంగంలోకి దించింది. ఆదివారం నుంచి డైవర్లు పిల్లలను బయటకు తీసుకురావడం ప్రారంభించారు. క్షణక్షణం ఉత్కంఠను రేపుతూ మొత్తం మూడు రోజుల పాటు ఈ మిషన్ కొనసాగింది. అమెరికా, బ్రిటన్, డెన్మార్క్ వంటి వివిధ దేశాలకు చెందిన మొత్తం 13 మంది సుశిక్షితులైన డైవర్లు ఈ మిషన్‌లో పాల్గొన్నారు. వారికి రక్షణగా మరో అయిదుగు థాయ్ నేవీ సీల్స్ (నౌకాదళ సిబ్బంది) ఉన్నారు. నీటిలో భయపడకుండా మందులు నీటిలోనూ పిల్లలను బయటకు తీసుకొస్తున్న సమయంలో పిల్లలెవరూ భయపడకుండా ఉండేందుకు డైవరు ఏర్పాట్లు చేశారు. ఇరుకు దారుల్లో ఈదేటపుడు ఆందోళన చెందకుండా ప్రత్యేక మందులిచ్చామని, అవి మత్తుమందులు కావని అధికారులు తెలిపారు. డైవర్లు ప్రతీ బాలుడి ముఖానికి మాస్క్ తొడిగారు. ఈదేటపుడు వెట్ సూట్ వేశారు. బూట్లు వేసి, హెల్మెట్ పెట్టారు. ఒక్కో బాలుడి వెంట ఇద్దరు డైవర్లు ఉన్నారు. ఒక డైవర్ ఆక్సిజన్ ట్యాంక్‌ని పట్టుకుంటే అతని వెనుక భాగాన బాలుడిని కట్టారు. మరో డైవర్ బాలుడి వెనకాల ఇంకో ఆక్సిజన్ ట్యాంక్ పట్టుకుని పిల్లాడు ఎలా ఉన్నాడో జాగ్రత్తగా గమనించారు. పిల్లలు చిక్కుకున్న ప్రదేశం నుంచి గుహ వెలుపలి వరకు 8 మిల్లీ మీటర్ల మందమున్న తాడు కట్టారు. డైవర్లు ఆ తాడు వెంబడి ఈదుతూ పిల్లలను బయటకు తీసుకొచ్చారు. చీకట్లో వర్షపు నీరు, బురద, రాళ్ల మధ్య ఇరుకైన దారుల్లో ఈదుకుంటూ పిల్లల్ని తీసుకొచ్చారు. ఇరుకుప్రాంతాల్లో డైవర్లు తమ ఆక్సిజన్ ట్యాంక్‌ని బయటకు తీసి పిల్లల్ని సన్నటి దారిగుండా లాగి తీసుకొచ్చారు. కొన్ని చోట్ల పిల్లలు దాదాపు పావుగంటపాటు నీటిలోనే ఉండాల్సి వచ్చింది. ఒక్కో బాలుడిని బయటకు తేవడానికి డైవర్లకు అయిదుగంటల సమయం పట్టింది. బాలురను రక్షించేందుకు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎలన్ మస్క్ తయారు చేయించిన చిన్నపాటి జలాంతర్గామి సాంకేతికత పరంగా బాగున్నప్పటికీ ఆచరణలో అది పనికి రాదని, రక్షించేందుకు దాన్ని వాడలేమని సహాయక పర్యవేక్షక నిపుణులు స్పష్టంచేశారు. 18 రోజుల్లో ఏం జరిగింది? (గుహలో చిక్కుకున్న వైల్డ్‌బోర్స్ ఫుట్‌బాల్ జట్టు సభ్యులు, కోచ్(ఎడమ) (ఫైల్)) ♦ జూన్ 23: ఉదయంపూట కోచ్‌తో కలిసి గుహలోకి విహారయాత్రకు వెళ్లారు. లోపలికెళ్లగానే అప్పుడే భారీ వర్షం మొదలై గుహద్వారం మొత్తం నీటితో నిండిపోవడంతో గుహలోనే చిక్కుకున్నారు. చీకటి పడినా పిల్లలెవ్వరూ ఇళ్లకు రాకపోవడం, ఎక్కడున్నారో తెలీకపోవడంతో వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుహ ప్రవేశ ద్వారం వద్ద వారి సైకిళ్లు కనిపించడంతో అర్ధరాత్రి నుంచే గాలింపు చేపట్టారు. ♦జూన్ 25: పిల్లల పాదముద్రలు, చేతిముద్రలను గుర్తించిన సహాయక బృందం. ♦ జూన్ 26: గుహలోకి ప్రవేశించిన దాదాపు 12 మంది థాయ్ నౌకాదళ సిబ్బంది. బురదనీటితో గుహ దారి నిండిపోవడం వల్ల వాళ్లు లోపలికి వెళ్లడం కష్టంగా ఉందన్న హోం మంత్రి. ♦ జూన్ 27: భారీ వర్షంతో గాలింపు చర్యలకు అంతరాయం. గుహ దారుల్లో పెరిగిన నీటి ప్రవాహం. థాయ్ సహాయక బృందానికి జతకలిసిన అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాల సిబ్బంది. ♦ జూన్ 28: నీటిని బయటకు తోడడం, గుహలోకి చేరుకునేందుకు ఇతర మార్గాల కోసం అన్వేషణ ప్రారంభం. ♦ జూన్ 30: వర్షాలు తగ్గడంతో మళ్లీ ఊపందుకున్న గాలింపు చర్యలు. పిల్లలను బయటకు తెచ్చేందుకు సాయమందించడం కోసం ఆస్ట్రేలియా, చైనాల నుంచి కూడా వచ్చిన పలువురు నిపుణులు. ♦ జూలై 2: బాలురు, వారి కోచ్ ఉన్న ప్రదేశాన్ని గుర్తించి, పిల్లలతో మాట్లాడి వీడియో రికార్డ్ చేసుకొచ్చిన ఇద్దరు బ్రిటిష్ డైవర్లు. తాము ఆరోగ్యంగానే ఉన్నామన్న పిల్లలు. ♦ జూలై 4: ఆహారం, ఔషధాలతో బాలుర వద్దకు చేరుకున్న ఏడుగురు నౌకాదళ సిబ్బంది, ఓ వైద్యుడు. వారిని బయటకు తెచ్చేందుకు అనువైన పరిస్థితులపై చర్చ. ♦ జూలై 5: నీటిని బయటకు తోడే ప్రక్రియ విస్తృతం. డైవింగ్ ఎలా చేయాలో పిల్లలకు శిక్షణనిచ్చిన సహాయక సిబ్బంది. ♦ జూలై 6: గుహలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతుండటంపై ఆందోళన. ఆక్సిజన్ అందక సహాయక బృందంలోని ఓ డైవర్ మృతి. మళ్లీ భారీ వర్షాలు మొదలైతే పిల్లలు మరిన్ని రోజులు గుహలోనే ఉండాల్సి వస్తుందనీ, వారిని త్వరగా బయటకు తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామన్న అధికారులు. ♦ జూలై 8: ఎట్టకేలకు పిల్లలను బయటకు తెచ్చే ప్రక్రియ మొదలు. వరద నీటితో నిండిన ఇరుకైన దారుల గుండా నలుగురు పిల్లలను సురక్షితంగా గుహ నుంచి బయటకు తెచ్చిన డైవర్లు. ♦ జూలై 9: మరో నలుగురు బాలురను బయటకు తెచ్చిన సహాయక బృందం ♦ జూలై 10: మిగిలిన నలుగురు బాలురు, కోచ్‌ను కూడా రక్షించిన సిబ్బంది. 18 రోజుల యాతన నుంచి వారికి విముక్తి. (పిల్లలను రక్షించిన తరువాత స్థానిక మీడియా కేంద్రంలో స్థానికుల సందడి ) -
మరో నలుగురు బయటకు
మే సాయ్: థాయ్‌లాండ్‌లోని తామ్ లువాంగ్ గుహలో చిక్కుకున్నవారిలో మరో నలుగురు విద్యార్థుల్ని సహాయక బృందాలు సోమవారం రక్షించాయి. ఆదివారం నలుగురు విద్యార్థుల్ని కాపాడిన 10 గంటల తర్వాత మిగిలినవారిని బయటకు తీసుకొచ్చేందుకు సోమవారం సహాయక చర్యల్ని ప్రారంభించారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ సాగిన ఈ ఆపరేషన్‌లో మరో నలుగురు విద్యార్థుల్ని డైవర్లు గుహ నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం వీరందరిని థాయ్ రాయల్ పోలీస్ హెలికాప్టర్ ద్వారా 56 కి.మీ దూరంలో ఉన్న చియాంగ్‌రాయ్ ప్రచనుక్రోహ్ ఆస్పత్రికి తరలించారు. దీంతో ఈ ఘటనలో ప్రమాదం నుంచి బయటపడ్డ విద్యార్థుల సంఖ్య 8కి చేరుకుంది. ప్రస్తుతం సహాయక కోచ్ ఎకపాల్(25)తో పాటు నలుగురు విద్యార్థులు ఇంకా గుహలోనే ఉన్నారు. జూన్ 23న తామ్ లూవాంగ్ గుహలోకి వెళ్లి చిక్కుకున్న 12 మంది విద్యార్థులతో పాటు కోచ్‌ను రక్షించేందుకు థాయ్‌లాండ్ అధికారులు ఆదివారం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, సోమవారం చీకటిపడటంతో ఆపరేషన్‌ను నిలిపివేసిన అధికారులు.. మంగళవారం సహాయక చర్యల్ని పునరుద్ధరించనున్నారు. వాతావరణం అనుకూలం.. ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్న చియాంగ్ రాయ్ ప్రావిన్సు గవర్నర్ నరోంగ్ సక్ మీడియాతో మాట్లాడుతూ.. తొలిరోజు లాగే సోమవారం కూడా సహాయక చర్యలకు వాతావరణం అనుకూలంగా ఉందని తెలిపారు. గుహలోని పరిస్థితులపై అవగాహన ఉండటంతో ఆదివారం సహాయక చర్యల్లో పాల్గొన్న డైవింగ్ నిపుణుల్నే సోమవారం రంగంలోకి దించామన్నారు. ఆపరేషన్‌కు ముందు గుహలోని మార్గంలో ఆక్సిజన్ సిలిండర్లను చేరవేశామన్నారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో తొలి బాలుడ్ని తీసుకురాగలమని అంచనా వేసినప్పటికీ.. సాయంత్రం 5.40 గంటలకే బయటకు తీసుకొచ్చామని నరోంగ్‌సక్ తెలిపారు.మిగిలిన ముగ్గురిని కూడా దాదాపు 3 గంటల వ్యవధిలోనే బయటకు తీసుకొచ్చామన్నారు. శారీరకంగా దృఢంగా ఉన్న విద్యార్థులనే తొలుత బయటకు తెచ్చేందుకు ప్రాధాన్యమిచ్చామని అన్నారు. వీరిని స్ట్రెచర్ల సాయంతో హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించామన్నారు. విద్యార్థులతో పాటు కోచ్‌ను కాపాడేందుకు 50 మంది థాయ్‌లాండ్ డైవర్లు, 40 మంది అంతర్జాతీయ డైవింగ్ నిపుణులు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇక్కడి వాతావరణం పొడిగానే ఉన్నప్పటికీ.. ఎగువ ప్రాంతాల్లో కొన్నిచోట్ల ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు గుహలో నీటి ప్రవాహం పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. తామ్ లువాంగ్ గుహలోని నీటిని భారీ మోటార్ల సాయంతో తోడేస్తున్నట్లు పేర్కొన్నారు. అనుకున్నదాని కంటే తొందరగానే విద్యార్థుల్ని గుహ నుంచి బయటకు తీసుకొస్తున్నామని నరోంగ్‌సక్ తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో ఆపరేషన్ ముగిసే అవకాశముందన్నారు. కాగా, సోమవారం గుహ నుంచి బయటకొచ్చిన నలుగురు విద్యార్థుల వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. విద్యార్థులంతా క్షేమమే కానీ.. చియాంగ్ రాయ్ ఆస్పత్రి ప్రస్తుతం చికిత్స పొందుతున్న 8 మంది విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సీనియర్ వైద్యుడొకరు తెలిపారు. తమకు ఆహారం అందించాల్సిందిగా విద్యార్థులు కోరారన్నారు. అయితే వీరికి ఇన్ఫె క్షన్ సోకి ఉండొచ్చన్న అనుమానంతో ప్రస్తు తం వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు వెల్లడించారు. ఇలా గుహల్లో చిక్కుకున్న సందర్భాల్లో వ్యక్తులకు హైపోథెర్మియా(శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోవడం), పక్షులు, గబ్బిలాల విసర్జితాల కారణంగా శ్వాససంబంధ వ్యాధు లు వచ్చే అవకాశముందన్నారు. విద్యార్థులను 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఎలాంటి సమస్య లేదని నిర్ధారించుకున్నాక తల్లిదండ్రులకు అప్పగిస్తామన్నారు. అరుదైన ఆహ్వానం తామ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న వైల్డ్ బోర్స్ జట్టుకు అరుదైన ఆహ్వా నం లభించింది. నిర్ణీత సమయంలోగా అందరూ బయటకు రాగలిగితే రష్యా రాజధాని మాస్కోలో ఆదివారం జరిగే సాకర్ ప్రపంచకప్ ఫైనల్‌కు రావాలని ఈ జట్టు సభ్యుల్ని ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాన్టీనో ఆహ్వానించారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న తమ విద్యార్థులు తిరిగివచ్చాక వారికోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని మే సాయ్ ప్రసిత్సర్త్ పాఠశాల యాజమాన్యం తెలిపింది. -
ఆపరేషన్ థాయ్; మరో నలుగురు క్షేమం
మే సాయ్ : థాయ్‌లాండ్‌లోని తామ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న 13 మందిని రక్షించేందుకు చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. ఆదివారం 12 గంటలపాటు కొనసాగిన ఈ ఆపరేషన్‌లో నలుగురు విద్యార్థుల్ని బయటకు తీసుకు రాగా, సోమవారం నాడు మరో నలుగురిని కాపాడినట్లు తెలిసింది. గుహ నుంచి బయటకు వచ్చిన వీరిని సైనిక హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా గుహ నుంచి క్షేమంగా బయటపడిన విద్యార్థుల పేర్లను మాత్రం అధికారులు వెల్లడించడం లేదు. దాంతో గుహ నుంచి బయటపడినవారిలో తమ పిల్లలు ఉన్నారా? లేదా? అనే విషయం తల్లిదండ్రులకు ఇంతవరకూ తెలియలేదు. ఈ విషయం గురించి తల్లిదండ్రులు ‘మా పిల్లలు అందరూ క్షేమంగా ఉన్నారనుకుంటున్నాం. అందుకే మిగతా వారిని కూడా క్షేమంగా బయటకు తీసుకువచ్చే వరకూ ఇక్కడే ఉంటాం’ అని తెలిపారు. అయితే విద్యార్ధులను తల్లిదండ్రుల వద్దకు పంపించకుండా ఉండటానికి కారణం ఉందంటున్నారు డాక్టర్లు. ఈ విషయం గురించి థాయ్‌లాండ్ ఆరోగ్య కార్యదర్శి డాక్టర్ జెస్సడ చోకేడమాంగ్సూక్ ‘విద్యార్ధులను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి ముందు కొన్ని రోజుల పాటు వారిని ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచడం మంచిది. ఎందుకంటే ఇన్నిరోజులు వారు గుహలో అసాధారణ పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే ఒకటి, రెండు రోజులు పరీక్షించి, వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని నిర్ధారించుకున్న తర్వాత పిల్లల్ని తిరిగి వారి కుటుంబాల చెంతకు చేరుస్తాం’ అన్నారు. ఈ విషయం గురించి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటి సైకాలజిస్ట్ డాక్టర్ జెన్నిఫర్ వైల్డ్ ‘గుహ నుంచి క్షేమంగా బయటపడిన వారు మిగతా వారి గురించి ఆలోచించడం అవసరం. ఎందుకంటే వారి మిత్రులు ఇంకా గుహలోనే ఉన్నారు. కనుక వారంతా బయటకొచ్చిన తర్వాత అందరిని ఒకే సారి వారి కుటుంబాల చెంతకు చేర్చడం మంచిది అన్నారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలను దూరంగా ఉంచడం బాధకరమైన విషయమే. కానీ ఇది వారు ఒకరికోసం ఒకరు ఆలోచించాల్సిన సమయం. అందరూ క్షేమంగా బయటపడిన తర్వాత వారు కలసికట్టుగా ముందుకు సాగడం గురించి ఆలోచించాలి’ అన్నారు. అంతేకాక ‘ఇన్ని రోజులు గుహలో ఉండి బయటపడిన తర్వాత వారికి కొన్ని ఆందోళనలు కలిగే అవకాశం ఉంది. కొందరు ఆ భయం నుంచి ఇంకా తేరుకోలేక పోవచ్చు. ఒత్తిడి వల్ల తలనొప్పి, కడుపునొప్పి వంటి అనారోగ్యాలు కలగవచ్చు. అందుకే పిల్లలను కొన్నాళ్ల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచడం అవసరం’ అని తెలిపారు. -
ఫుట్‌బాల్ టీమ్ అందరూ మృత్యుంజయులే
-
ఆపరేషన్ ‘థాయ్’ సక్సెస్
మే సాయ్: థాయ్‌లాండ్‌లోని తామ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న 13 మందిని రక్షించేందుకు తొలిరోజు చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. ఆదివారం 12 గంటలపాటు కొనసాగిన ఈ ఆపరేషన్‌లో నలుగురు విద్యార్థుల్ని బయటకు తీసుకొచ్చారు. కోచ్‌తో పాటు మిగిలిన 8 మంది విద్యార్థుల్ని రక్షించేందుకు సోమవారం ఆపరేషన్ ప్రారంభిస్తామని విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. గుహ నుంచి బయటకు వచ్చిన వీరిని సైనిక హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాము కాలం, నీటితో పోటీపడి సహాయక చర్యల్ని చేపడుతున్నట్లు ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్న చియాంగ్ రాయ్ ప్రావిన్సు గవర్నర్ నరోంగ్‌సక్ అన్నారు. వాతావరణశాఖ హెచ్చరికలతో.. రాబోయే 3–4 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో తొలుత బాలుర కుటుంబాలకు సమాచారమిచ్చిన అధికారులు ఆపరేషన్‌ను ప్రారంభించారు. ఒక్కో బాలుడ్ని ఇద్దరు డైవర్లు 4 కి.మీ మేర సురక్షితంగా తీసుకొచ్చేలా ప్రణాళికలు వేశారు. వీరు దారితప్పకుండా మార్గంపొడవునా తాళ్లను అమర్చారు. తర్వాత 15 మంది అంతర్జాతీయ డైవింగ్ నిపుణులతో పాటు ఐదుగురు థాయ్ నేవీ సీల్స్ రంగంలోకి దిగారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ చేపట్టిన ఆపరేషన్‌లో నలుగురు పిల్లల్ని గుహ నుంచి బయటకు తీసుకురాగలిగారు. ఈ సందర్భంగా గుహలోని ఆక్సిజన్ స్థాయి తగ్గిపోకుండా కిలోమీటర్ మేర ప్రత్యేకమైన పైపుల్ని అమర్చారు. నీటిని నిరంతరాయంగా తోడేస్తుండటంతో గుహలోని నీటి మట్టం కాస్త తగ్గడం సహాయక చర్యలకు సాయపడింది. గుహలోని ఇరుకు మార్గాలు, బురద నీటితో దారి కన్పించకపోవడం, ఈ పిల్లలకు ఈత రాకపోవడం సహాయక చర్యలకు ప్రధాన అవరోధాలుగా మారాయి. ఈ విద్యార్థుల్ని బయటకు తీసుకొచ్చేందుకు గుహ పైభాగంలో దాదాపు 400 మీటర్ల మేర 100 రంధ్రాలను తవ్వినప్పటికీ ఫలితం లేకపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలింపు గుహ నుంచి బయటకు తీసుకొచ్చిన నలుగురు చిన్నారుల్ని అధికారులు వెంటనే హెలికాప్టర్లో చియాంగ్ రాయ్ ప్రచనుక్రోహ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరికి 35 మంది వైద్యులు చికిత్సచేస్తున్నారు. కాపాడిన నలుగురు పిల్లల్లో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆస్పత్రి వైద్యుడొకరు తెలిపారు. దక్షిణ థాయ్‌లాండ్‌లోని ఓ స్కూల్‌కు చెందిన వైల్డ్ బోర్స్ అనే సాకర్ జట్టు కోచ్‌తో పాటు 12 మంది విద్యార్థులు తామ్ లువాంగ్ గుహను జూన్ 23న సందర్శించారు. వీరు గుహలోకి వెళ్లగానే భారీ వర్షాలతో వరద పోటెత్తి ప్రవేశమార్గం మూసుకుపోయింది. ముందుకొచ్చిన ఎలన్ మస్క్.. చిన్నారుల్ని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి స్పేస్ఎక్స్, బోరింగ్ కంపెనీ నిపుణుల్ని ఘటనాస్థలానికి పంపినట్లు ప్రముఖ పారిశ్రామికవేత్త, స్పేస్ఎక్స్ అంతరిక్ష సంస్థ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ తెలిపారు. పిల్లల్ని బయటకు తీసుకొచ్చేందుకు ప్రత్యేకమైన చిన్న సబ్‌మెరైన్‌ను పంపామన్నారు. చిన్నారుల్ని బయటకు తెచ్చేందుకు థాయ్‌లాండ్ ప్రభుత్వంతో కలసి పనిచేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. జూన్ 23 నుంచి.. జూన్ 23: సహాయక కోచ్ ఎకపాల్(25)తో కలసి 12 మంది విద్యార్థులు తామ్ లువాంగ్ గుహలోకి ప్రవేశించారు. ప్రవేశద్వారం వరదనీటితో మునిగిపోవడంతో వీరంతా లోపల ఇరుక్కున్నారు. జూన్ 24: గుహ ప్రవేశద్వారం వద్ద విద్యార్థుల సైకిళ్లు, కాలి గుర్తుల్ని అధికారులు కనుగొన్నారు. జూన్ 26: వరదతో గుహాలోని పట్టాయ బీచ్ ప్రాంతం ఇరుకుగా మారడంతో లోపలకు వెళ్లిన నేవీ సీల్ డైవర్లు వెనక్కువచ్చారు. జూన్ 27: దాదాపు 30 మంది అమెరికా పసిఫిక్ కమాండ్ సైనిక నిపుణులు, ముగ్గురు బ్రిటిష్ డైవర్లతో కలసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కానీ వరద ప్రవాహం కారణంగా ఎలాంటి పురోగతి కన్పించలేదు. జూన్ 28: గుహలోని నీటిని తోడేసేందుకు పంపుల్ని ఏర్పాటుచేశారు. విద్యార్థుల్ని రక్షించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించేందుకు డ్రోన్లను రంగంలోకి దించారు. జూలై 2: 12 మంది విద్యార్థులతో పాటు కోచ్ ఎకపాల్ సజీవంగా ఉన్నట్లు బ్రిటిష్ డైవర్లు గుర్తించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వీరికి ఆహారం, మందుల్ని అందించారు. జూలై 6: రక్షించేందుకు వెళ్లిన సమన్ కునన్ అనే నేవీ సీల్ కమాండర్ ట్యాంక్‌లో ఆక్సిజన్ అయిపోవడంతో చనిపోయారు. జూలై 8: సహాయక ఆపరేషన్‌ను ముమ్మరం చేసిన అధికారులు నలుగురు విద్యార్థుల్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. విలన్ కాదు.. హీరో ఎకపాల్ చాన్తవాంగ్(25).. 12 మంది చిన్నారులు ప్రమాదంలో చిక్కుకోవడానికి ఇతనే కారణమని పలువురు మొదట్లో విమర్శించారు. కానీ గుహలో చిన్నారులు అనారోగ్యానికి గురికాకుండా ఎకపాల్ జాగ్రత్తలు తీసుకున్నాడని లోపలకు వెళ్లిన డైవర్లు తెలిపారు. గతంలో బౌద్ధ సన్యాసిగా ఉన్న ఆయన విద్యార్థులు మానసికంగా కుంగిపోకుండా ధ్యానం, ఇతర అంశాలపై దృష్టి సారించేలా చేశాడని వెల్లడించారు. పదేళ్లకే తల్లిందండ్రులను కోల్పోయిన ఎకపాల్ ఓ బౌద్ధాశ్రమంలో సన్యాసిగా చేరారు. మూడేళ్ల క్రితం సన్యాస దీక్షను వదిలిపెట్టిన ఎకపాల్ తన అమ్మమ్మను చూసుకునేందుకు మే సాయ్కు వచ్చేశారు. అక్కడే ఉన్న ఓ స్కూల్లో ఉన్న వైల్డ్ బోర్స్ అనే సాకర్ జట్టుకు సహాయక కోచ్‌గా చేరారు. గుహలో 15 రోజుల పాటు చిక్కుకున్నా చిన్నారులు మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా ఎకపాల్ జాగ్రత్తలు తీసుకున్నారు. చివరికి తన ఆహారం, నీటిని సైతం ఆకలితో ఉన్న చిన్నారులకు ఇచ్చేశారు. దీంతో ఆయన ప్రస్తుతం గుహలో నీరసంతో బలహీనంగా తయారయ్యారు. సాకర్‌తో విద్యార్థుల్ని చదువుపై దృష్టి సారించేలా చేయొచ్చని నమ్మిన ఎకపాల్.. పాఠశాలలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు సాకర్ దుస్తులు, షూలు ఇచ్చేలా ప్రధాన కోచ్ నొప్పరట్ను ఒప్పించారు. కాగా, ఎకపాల్ కారణంగానే తమ చిన్నారులు ఇంకా ప్రాణాలతో ఉన్నారని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వ్యాఖ్యానించడం గమనార్హం. -
ఐఎన్ఎస్ సింధురక్షక్ ప్రమాదం: తెలియని సిబ్బంది ఆచూకీ
ఐఎన్ఎస్ సింధురక్షక్ ప్రమాదంలో చిక్కుకుపోయి, ఇప్పటివరకు తెలియకుండా పోయిన 18 మంది సిబ్బంది, అధికారుల ఆచూకీ తెలుసుకోవడం నేవీ డైవర్లకు తలకు మించిన భారం అవుతోంది. జలాంతర్గామిలోకి నీరు ప్రవేశించడం, అది దాదాపు పూర్తిగా మునిగిపోవడం, లోపలంతా అంధకారం ఉండటంతో ఇప్పటివరకు ఒక్కరిని కూడా కాపాడటం గానీ, మృతదేహాలను వెలికి తీయడం గానీ సాధ్యపడలేదు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఎవరైనా బతికి బయటపడతారన్న ఆశలు పూర్తిగా సన్నగిల్లాయి. దీంతో ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా జరిగిన సంఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేలుడు సమయంలో పుట్టిన వేడి వల్ల జలాంతర్గామి లోపలి భాగాలు చాలావరకు కరిగిపోయాయి. దాంతో నౌకాదళ డైవర్లకు అసలు దానిలోని కంపార్టుమెంట్లలోకి ప్రవేశించడం సాధ్యం కావట్లేదు. జలాంతర్గామిలో ఉన్న నీరు మొత్తాన్ని తోడి పారేసేందుకు భారీ పంపుసెట్లను ఉపయోగిస్తున్నారు. బుధవారం జరిగిన ప్రమాదంలో ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిని కోల్పోవడం పట్ల చాలా ఆవేదన చెందినట్లు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇటీవలే మన నౌకాదళం రెండు అసమాన విజయాలు సాధించిందని, వాటిలో ఒకటి తొలి అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ కాగా, మరొకటి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ అని ఆయన చెప్పారు. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ డీకే జోషి బుధవారమే ప్రమాదం సంభవించిన నావల్ డాక్ యార్డుకు వెళ్లి సంఘటన స్థలాన్ని సందర్శించారు. పేలుడులో కుట్రకోణం కూడా లేకపోలేదని ఆంటోనీ అనుమానం వ్యక్తం చేశారు. 1997లో 400 కోట్ల రూపాయలతో సమకూర్చుకున్న ఈ జలాంతర్గామికి ఇటీవలే రష్యాలో 450 కోట్ల రూపాయలతో భారీ ఆధునికీకరణ పనులు చేపట్టారు.