ఐఎన్ఎస్ సింధురక్షక్ ప్రమాదంలో చిక్కుకుపోయి, ఇప్పటివరకు తెలియకుండా పోయిన 18 మంది సిబ్బంది, అధికారుల ఆచూకీ తెలుసుకోవడం నేవీ డైవర్లకు తలకు మించిన భారం అవుతోంది. జలాంతర్గామిలోకి నీరు ప్రవేశించడం, అది దాదాపు పూర్తిగా మునిగిపోవడం, లోపలంతా అంధకారం ఉండటంతో ఇప్పటివరకు ఒక్కరిని కూడా కాపాడటం గానీ, మృతదేహాలను వెలికి తీయడం గానీ సాధ్యపడలేదు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఎవరైనా బతికి బయటపడతారన్న ఆశలు పూర్తిగా సన్నగిల్లాయి. దీంతో ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా జరిగిన సంఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పేలుడు సమయంలో పుట్టిన వేడి వల్ల జలాంతర్గామి లోపలి భాగాలు చాలావరకు కరిగిపోయాయి. దాంతో నౌకాదళ డైవర్లకు అసలు దానిలోని కంపార్టుమెంట్లలోకి ప్రవేశించడం సాధ్యం కావట్లేదు. జలాంతర్గామిలో ఉన్న నీరు మొత్తాన్ని తోడి పారేసేందుకు భారీ పంపుసెట్లను ఉపయోగిస్తున్నారు.
బుధవారం జరిగిన ప్రమాదంలో ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిని కోల్పోవడం పట్ల చాలా ఆవేదన చెందినట్లు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇటీవలే మన నౌకాదళం రెండు అసమాన విజయాలు సాధించిందని, వాటిలో ఒకటి తొలి అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ కాగా, మరొకటి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ అని ఆయన చెప్పారు.
రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ డీకే జోషి బుధవారమే ప్రమాదం సంభవించిన నావల్ డాక్ యార్డుకు వెళ్లి సంఘటన స్థలాన్ని సందర్శించారు. పేలుడులో కుట్రకోణం కూడా లేకపోలేదని ఆంటోనీ అనుమానం వ్యక్తం చేశారు. 1997లో 400 కోట్ల రూపాయలతో సమకూర్చుకున్న ఈ జలాంతర్గామికి ఇటీవలే రష్యాలో 450 కోట్ల రూపాయలతో భారీ ఆధునికీకరణ పనులు చేపట్టారు.
ఐఎన్ఎస్ సింధురక్షక్ ప్రమాదం: తెలియని సిబ్బంది ఆచూకీ
Published Thu, Aug 15 2013 6:49 PM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM
Advertisement